dormant
-
శాశ్వత నిద్రలోకి ‘మూన్ స్నైపర్’
చివరి ఫొటో పంపిన జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్. చంద్రుడిపై షియోలి బిలంలో రాత్రి కమ్ముకోబోతుండగా సాయం సంధ్యకు కాస్త ముందుగా ల్యాండర్ తన కెమెరాలో బంధించిన ఆఖరి ఛాయాచిత్రాన్ని విడుదల చేసిన ‘జాక్సా’. జాబిలిపై రాత్రి అంటే... రెండు వారాలపాటు చీకటి. కనీస ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీల ఫారన్‌హీట్ అంటే మైనస్ 123 డిగ్రీల సెల్సియస్ దాకా పడిపోతాయి. ప్రస్తుతం నిద్రాణ స్థితిలోకి వెళ్లిన ‘మూన్ స్నైపర్’. జాబిలిపై రాత్రివేళల్లో నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకుని మనుగడ సాగించేలా ల్యాండరును పొందించలేదు. చంద్రుడి ఉపరితలంపై తలకిందులుగా దిగడంతో చావు తప్పి కన్ను లొట్టపోయి, ఆఖరి క్షణంలో సుడి కుదిరి ఇప్పటికే ల్యాండర్ ఒకసారి చచ్చి బతికినంత పని అయిన సంగతి తెలిసిందే. చంద్రుడిపై 14-15 రోజుల అతి తీవ్ర చలి రాత్రిని ల్యాండర్ ఎలాగోలా తట్టుకుని లక్కీ ఛాన్సుతో మరోసారి బతికితే సూర్యుడు పుణ్యమాని సోలార్ ప్యానెళ్ల సౌరశక్తి సాయంతో ఈ నెల మధ్యం నాటికి ల్యాండరును మళ్లీ పని చేయిస్తామని ‘జాక్సా’ అంటోంది. కానీ... ఇది ‘పగటి కల’. చంద్రుడిపై రాత్రి వేళల మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల ధాటికి మన ‘ఇస్రో’ చంద్రయాన్-3‘ విక్రమ్’ ల్యాండర్ మూగబోయినట్టే జపాన్ ‘మూన్ స్నైపర్’ కూడా శాశ్వత నిద్రలోకి జారుకున్నట్టే భావించాలి. -
మన పాలపుంత ఆవల... నిద్రాణ కృష్ణబిలం
న్యూయార్క్: సూర్యుడి కంటే 9 రెట్లు పెద్దదైన భారీ కృష్ణబిలాన్ని(బ్లాక్ హోల్) బెల్జియం పరిశోధకులు గుర్తించారు. భూమికి కేవలం 1,60,000 కాంతి సంవత్సరాల దూరంలో మెగెలానిక్ క్లౌడ్ అనే నక్షత్ర మండలంలో ఇది నిద్రాణ స్థితిలో ఉన్నట్లు తేల్చారు. ఒక కాంతి సంవత్సరం అంటే 9,460,730,472,580.8 కిలోమీటర్లు. ‘బ్లాక్‌హోల్ పోలీసు’గా పిలిచే పరిశోధకుల బృందం దాదాపు 1,000 నక్షత్రాలను నిశితంగా పరిశోధించి, ఈ బ్లాక్‌హోల్‌ను కనిపెట్టింది. మన భూగోళం ఉన్న పాలపుంత, నక్షత్ర మండలం వెలుపల బయటపడిన తొలి నిద్రాణ కృష్ణబిలం ఇదేనని చెబుతున్నారు. భారీ నక్షత్రాల జీవితకాలం ముగిసి, సొంత గురుత్వాకర్షణ శక్తిలోనే కూలిపోయినప్పుడు ఇలాంటి కృష్ణబిలాలు ఏర్పడుతుంటాయని పేర్కొంటున్నారు. నిద్రాణ స్థితిలోని బ్లాక్‌హోల్స్ నిస్తేజంగా ఉంటాయి. అంటే కాంతిని గానీ, రేడియేషన్‌ను గానీ వెలువరించవు. పరిసరాలతో ఎలాంటి సంబంధాలు ఉండని నిద్రాణ బ్లాక్‌హోల్స్‌ను గుర్తించడం కష్టమే. -
భారీ మొత్తంలో స్విస్ ఖాతాలు బయటికి
జెనీవా: ఎలాంటి లావాదేవీలు జరపకుండా అరవై ఏళ్లుగా మూలుగుతున్న ఖాతాలు, ఖాతాదారుల వివరాలను స్విస్ బ్యాంకు బుధవారం వెల్లడించింది. ఖాతాలకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపకుండా ఉండిపోయిన 2,600 మంది ఖాతాదారులు, సంస్థల పేర్లను తమ అధికారిక వెబ్సైట్ www.dormantaccounts.ch లో ప్రచురించింది. ఆ ఖాతాదారుల వారసులు ముందుకు వచ్చి ఈ నిధులను సొంతం చేసుకోవాలని సూచించింది. ఈ ఖాతాల మొత్తం విలువ 44.5 మిలియన్ల అమెరికన్ డాలర్లు ఉంటుందని తెలిపింది. ఏడాదిలోగా ఖాతాదారుల వారసులు బ్యాంకు ముందుకు వచ్చి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సూచించింది.