ఓ వైజ్ఞానిక విశేషం... కాదు... అంతకంటే అబ్బురమే. జపాన్ శాస్త్రవేత్తల్లో వెల్లివిరిసిన సంభ్రమాశ్చర్యాలు, ఆనందోత్సాహాలు... గత నెలలో చంద్రుడిపై దిగిన జపాన్ ల్యాండర్ ‘మూన్ స్నైపర్’ అనూహ్యంగా నిద్ర లేచింది. జాబిలిపై సుదీర్ఘంగా 14 రోజులపాటు కొనసాగిన రాత్రివేళలో గడ్డకట్టించే మైనస్ 130 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్ని దీటుగా తట్టుకుని మరీ బతికింది! నిజానికి అంతటి కఠోర శీతల ఉష్ణోగ్రతలను తట్టుకునేలా జపాన్ దానిని తయారుచేయలేదు. కానీ అది మృత్యువును జయించి పునర్జన్మ పొందింది. ఈ ల్యాండర్ అసలు పేరు ‘స్లిమ్’ (స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్).
ఆదివారం రాత్రి ‘మూన్ స్నైపర్’తో సమాచార సంబంధాల్ని పునరుద్ధరించి ఓ ఆదేశం పంపామని, ల్యాండర్ నుంచి ప్రతిస్పందన వచ్చిందని ‘ఎక్స్’ వేదికగా జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (జాక్సా) వెల్లడించింది. చంద్రుడిపై మధ్యాహ్నం కావడంతో కమ్యూనికేషన్స్ సాధనాలు బాగా వేడెక్కినందున కొద్ది సేపటి తర్వాత ల్యాండరుతో సమాచార సంబంధాలు నిలిపివేశామని తెలిపింది. పరికరాల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాక కమ్యూనికేషన్స్ పునరుద్ధరిస్తామని ‘జాక్సా’ ప్రకటించింది.
‘మూన్ స్నైపర్’ గత నెల 19న చంద్రమధ్యరేఖకు దక్షిణంగా షియోలీ బిలం వాలులో దిగడమే తలకిందులుగా దిగింది. శీర్షాసనం భంగిమలో నిలిచిన దానిపై తొలుత జాక్సా ఆశలు వదిలేసుకుంది. సూర్యుడికి వ్యతిరేక దిశలో సౌరఫలకాలు ఉండిపోవటంతో ముందుజాగ్రత్తగా ల్యాండరును కొద్దిరోజులు నిద్రాణస్థితిలోకి పంపారు. అనంతరం సూర్యుడి దిశ మారి ఎండ అందుబాటులోకి రావటంతో సౌరశక్తిని సమకూర్చుకున్న ల్యాండర్ తిరిగి పని చేయడం ప్రారంభించింది.
అనంతరం చంద్రుడిపై రాత్రి సమయం సమీపించడంతో దాన్ని మరోసారి నిద్రావస్థలోకి పంపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ గత ఏడాది విజయవంతంగా నిర్వహించిన చంద్రయాన్-3 మిషన్లోని ‘విక్రమ్’ ల్యాండర్ మాదిరిగానే... చంద్రుడిపై 14 రోజులపాటు నిర్విరామంగా కొనసాగే రాత్రి వేళ అతి శీతల ఉష్ణోగ్రతలను భరించగలిగేలా ‘మూన్ స్నైపర్’ ల్యాండరును ‘జాక్సా’ డిజైన్ చేయలేదు. భూమ్మీద రెండు వారాల కాలానికి సమానమయ్యే అతి శీతల చంద్ర రాత్రిలో మనుగడ సాగించలేక ‘విక్రమ్’ ల్యాండర్ మూగబోయింది. కానీ ‘మూన్ స్నైపర్’ మాత్రం అదృష్టవశాత్తు జీవించగలిగింది.
:::జమ్ముల శ్రీకాంత్
Comments
Please login to add a commentAdd a comment