నిద్ర లేస్తూనే చకచకా పని ఆరంభించిన జపాన్ ల్యాండర్. చంద్రుడిపై దిగిన తమ ‘స్లిమ్’ ల్యాండరుతో ఆదివారం సాయంత్రం సమాచార సంబంధాలను పునరుద్ధరించినట్టు సోమవారం ‘ఎక్స్’ (పాత పేరు ట్విట్టర్) వేదికగా ప్రకటించిన జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ‘జాక్సా’. ల్యాండరులోని మల్టీబ్యాండ్ స్పెక్ట్రోస్కోపిక్ కెమెరా (ఎంబీసీ)తో వెంటనే శాస్త్రీయ పరిశోధనలు ప్రారంభించినట్టు ఆ సంస్థ తెలిపింది. ల్యాండర్ దిగిన ప్రదేశంలో కుక్క బొమ్మ (టాయ్ పూడిల్)ను పోలివున్న ఓ చంద్రశిల ఛాయాచిత్రాన్ని రోవర్-2 (లూనార్ ఎక్స్కర్షన్ వెహికల్-2) ఫొటో తీసింది.
ల్యాండర్, దాని సమీపంలోని ఆ శిల ఛాయాచిత్రాన్ని ఎక్స్ వేదికగా ‘జాక్సా’ పోస్ట్ చేసింది. ‘మూన్ స్నైపర్’ ఈ నెల 19న చంద్రుడిపై షియోలి బిలంలోని వాలులో తలకిందులుగా దిగిన సంగతి తెలిసిందే. ఫలితంగా ‘మూన్ స్నైపర్’ సౌరఫలకాలు సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉండిపోవటంతో ల్యాండరులోని ఆన్బోర్డ్ బ్యాటరీని రెండున్నర గంటలు మాత్రమే వినియోగించి, 12% పవర్ ను ముందుజాగ్రత్తగా నిల్వ ఉంచి దాన్ని ‘జాక్సా’ స్విచ్ ఆఫ్ చేసింది.
ల్యాండరులోని సాంకేతిక సమస్యను అధిగమించామని, సూర్యుడి కోణం మారి ప్రస్తుతం ఎండ అందుబాటులోకి రావడంతో ల్యాండర్ సౌరఘటాలు పనిచేస్తున్నాయని ‘జాక్సా’ వివరించింది. చంద్రుడి బిలంలో ల్యాండర్ డొల్లిపోయి తలకిందులుగా దిగినా, దాని సోలార్ ప్యానెళ్లు పై భాగంలో కాకుండా కిందివైపు... అదీ వెనుకవైపున సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉన్నా... తాజాగా సూర్యరశ్మిని గ్రహించి అవి పనిచేయడం మొదలుపెట్టడం నిజంగా ఓ అద్భుతమనే చెప్పాలి. ల్యాండర్ తలకిందులైనా దాని జాతకం తిరగబడి అది తుది ఘట్టంలో కుదురుకోవడం ఆశ్చర్యకర పరిణామం.
ఈ విషయంలో జపాన్ అంతరిక్ష శాస్త్రవేత్తలు చాలా అదృష్టవంతులు. చంద్రశిలల నిర్మాణ కూర్పును ల్యాండర్ అధ్యయనం చేయనుంది. చంద్రుడిపై ల్యాండర్ ఎప్పటివరకు పనిచేస్తుందో ‘జాక్సా’ వెల్లడించలేదు. అయితే... జాబిలిపై రాత్రివేళల్లో నమోదయ్యే మైనస్ డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా దాన్ని డిజైన్ చేయలేదు. చంద్రుడిపై 15 రోజులపాటు పగలు, 15 రోజులపాటు రాత్రి ఉంటాయి. అలా చూస్తే... గరిష్ఠంగా మరో 3-4 రోజులు మాత్రమే బహుశా ల్యాండర్ పనిచేయవచ్చు.
:::: జమ్ముల శ్రీకాంత్
Comments
Please login to add a commentAdd a comment