Sniper
-
Suman Kumari: స్నైపర్ గురి
800 మీటర్ల దూరం.. అంటే ముప్పావు కిలోమీటరు నుంచి కూడా గురి తప్పకుండా కాల్చే రైఫిళ్లు స్నైపర్లు. వీటిని ఉపయోగించే వారిని కూడా స్నైపర్లు అనే అంటారు. ఇంతకాలం మగవాళ్లే స్నైపర్లుగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమారి అత్యంత కఠినమైన శిక్షణ పొంది మన దేశ తొలి మహిళా స్నైపర్‌గా అర్హతను పొందింది. 1984 ‘ఆపరేషన్ బ్లూస్టార్’ తర్వాత రాజీవ్ గాంధీ హయాంలో 1988లో ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’ పేరుతో స్వర్ణదేవాలయంలో మిగిలి ఉన్న సిక్కు వేర్పాటువాదులను ఏరివేసే మిలటరీ చర్య జరిగింది. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ సమయంలో ఇరువర్గాల్లోనూ ప్రాణనష్టం ఎక్కువ. కాని ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’లో మిలటరీ సిబ్బంది ప్రాణనష్టం జరక్కుండా సిక్కు వేర్పాటువాదులను అణిచివేయగలిగారు. దీనికి కారణం స్వర్ణ దేవాలయాన్ని మారణాయుధాలతో పై నుంచి కాపలాకాస్తున్న ఐదుగురు వేర్పాటువాదులను చాలా దూరం నుంచి కాల్చి చంపడం. మొదటిసారి ‘స్నైపర్స్’ ఉపయోగం వల్ల కలిగిన ప్రయోజనం అది. స్నైపర్ అంటే శత్రునిర్మూలన ఏదో సినిమాలో ‘నన్ను చూడాలంటే నీ జీవితం సగం తగలడిపోయి ఉండాలి’ అని బ్రహ్మానందం అంటాడు. స్నైపర్ రంగంలో దిగాడంటే శత్రువు జీవితం ముగింపు దశలో ఉందని అర్థం. స్నైపర్లు శత్రువును బంధించడానికి కాదు. నిర్మూలించడానికి. మనదేశంలో ముందు నుంచి కూడా అత్యాధునిక ఆయుధాల పట్ల కాకుండా సంప్రదాయ ఆయుధాల పట్ల మొగ్గు ఉండటం వల్ల స్నైపర్లను ఆదరించింది లేదు. కిలోమీటరు నుంచి ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకూ కూడా శత్రువును కాల్చి చంపగల స్నైపర్ రైఫిల్స్‌ను ఎలా ఉపయోగించాలో తెలియడానికి ఆ కాలంలో మన మిటలరీ యోధులు ఇజ్రాయిల్, ఫ్రాన్స్ వెళ్లాల్సి వచ్చేది. 1980లలోనే కొద్దిగా స్నైపర్స్ ఉపయోగం తెలిసింది. ఇటీవల సరిహద్దుల వెంబడి వివిధ దేశాల దాడులను ప్రతిఘటించడానికి స్నైపర్లు సమర్థంగా ఉపయోగపడుతున్నాయని వాటిని ఉపయోగించే నిపుణులను తయారు చేస్తున్నారు. మధ్యప్రదేశ్– మహౌలోని ‘ఇన్ఫాంట్రీ స్కూల్’లో, ‘ఇండోర్‌లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్’ కేంద్రంలో స్నైపర్స్ శిక్షణ ఇస్తున్నారు. ఇంతవరకూ మగవాళ్లకే సాగిన ఈ శిక్షణ సుమన్ కుమారి వల్ల స్త్రీలకు కూడా ఇవ్వడం మొదలైంది. పంజాబ్‌లో చూసి హిమాచల్ ప్రదేశ్‌లో మండి జిల్లాకు చెందిన సుమన్ కుమారి 2021లో బి.ఎస్.ఎఫ్.లో ఇన్స్పెక్టర్ హోదాలో చేరింది. పంజాబ్‌లో ఆమెకు విధులు కేటాయించారు. అక్కడ ఉండగా సరిహద్దు దేశాల నుంచి శత్రువులు స్నైపర్లతో మనవారి మీద దాడులు చేయడం సుమన్ గమనించింది. మన వద్ద తగినంత మంది స్నైపర్లు లేరని కూడా అవగాహన చేసుకుంది. అంతే. తనకు తానే స్నైపర్‌గా శిక్షణ తీసుకునేందుకు అనుమతి అడిగింది. ‘సాధారణంగా స్నైపర్‌గా తీసుకునే శిక్షణ కఠినమైనది. మగవారే వెనకాడుతారు. శిక్షణలో సగం మంది వెనుతిరుగుతారు. కాని సుమన్ 8 వారాల పాటు శిక్షణను సమర్థంగా పూర్తి చేసింది. 56 మంది ఉన్న బ్యాచ్‌లో ఆమె మాత్రమే మహిళ. శిక్షణ బాగా పూర్తి చేసిన వారిని ‘ఆల్ఫా’ అని, ‘బ్రేవో’ అని నైపుణ్యాన్ని బట్టి విభజిస్తాం. కాని సుమన్ ప్రతిభ అంతకు మించింది. అందుకే ఆమెకు ఇన్స్ట్రక్టర్ హోదా ఇచ్చాం. దాని అర్థం ఆమె స్నైపర్ మాత్రమే కాదు స్నైపర్ శిక్షకురాలు కూడా’ అని ఒక మిలటరీ అధికారి తెలియచేశారు. ఎప్పుడెప్పుడు హైజాక్‌లు, కిడ్నాప్‌లు, టెర్రరిస్ట్ అటాక్‌లు, ముఖ్య నేతలను బందీలుగా పట్టుకోవడం, సరిహద్దులు దాటి శత్రువులు రావడం వంటి సందర్భాలలో స్నైపర్లు రంగంలో దిగుతారు. పరిసరాలకు తగినట్టుగా పై తొడుగులు (కామూఫ్లాజ్) ధరించి శత్రువుకు వీలైనంత దగ్గరగా వెళ్లి తూటాతో సమాధానం చెప్పడమే వీరు చేసేపని. సుమన్ సేవలు ఇకపై దేశానికి రక్షణ ఇస్తాయి. ‘నేను స్నైపర్ కావడం స్త్రీలకు స్ఫూర్తినిస్తుందనే అనుకుంటున్నాను. మిలటరీలోకి మరింతమంది మహిళలు రావాలని కోరుకుంటున్నాను’ అందామె. -
బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్
షిమ్లా: సుదూరంగా మాటువేసి గురిచూసి షూట్‌చేసే ‘స్నైపర్’ విధుల్లో చేరి పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ సుమన్‌కుమారి చరిత్ర సృష్టించనున్నారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)లో తొలి స్నైపర్‌గా కుమారి పేరు రికార్డులకెక్కనుంది. ఇండోర్‌లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్(సీఎస్‌డబ్ల్యూటీ)లో ఎనిమిది వారాల కఠోర శిక్షణను కుమారి విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. దీంతో శిక్షణలో ఆమె ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ సాధించారు. బీఎస్ఎఫ్లో స్నైపర్ బాధ్యతలు అప్పజెప్పనున్నారు. కుమారి 2021లో బీఎస్ఎఫ్లో చేరారు. నిరాయుధంగా శత్రువుతో పోరాడే ‘నిరాయుధ దళం’కు గతంలోనే ఆమె ఎంపికయ్యారు. పాకిస్తాన్ సరిహద్దుల వెంట మాటువేసి అదనుచూసి చొరబాట్లకు తెగబడే ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో స్నైపర్లది కీలక పాత్ర. -
చంద్రుడి ఒడిలో ‘ఒడిస్సియస్’!
జాబిలిపైకి ల్యాండర్ల పరంపర కొనసాగుతోంది. జపాన్ ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ తర్వాత తాజాగా అమెరికా వంతు వచ్చింది. అర్ధ శతాబ్దం తర్వాత చంద్రుడిపై మరోమారు అగ్రరాజ్యం జెండా రెపరెపలాడింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు సంస్థ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ రూపొందించిన ‘ఒడిస్సియస్’ (నోవా-సీ శ్రేణి) ల్యాండర్ జాబిలి ఉపరితలంపై దక్షిణ ధ్రువం చేరువలోని ‘మాలాపెర్ట్ ఎ’ బిలంలో దిగ్విజయంగా దిగింది. తొలుత ల్యాండర్ నేవిగేషన్ వ్యవస్థలోని లేజర్ రేంజిఫైండర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మిషన్ కంట్రోల్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు ఆందోళన చెందారు. దీంతో ల్యాండర్ దిగాల్సిన నిర్దేశిత సమయంలో కొంత జాప్యం సంభవించినప్పటికీ భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 4:53 గంటలకు అది క్షేమంగా చంద్రుడిపై దిగి భూమికి సంకేతం పంపింది. ‘మాలాపెర్ట్ ఎ’ అనేది చంద్రుడి దక్షిణ ధృవానికి 300 కిలోమీటర్ల దూరంలో 85 డిగ్రీల దక్షిణ అక్షాంశ ప్రాంతంలో నెలకొన్న ఓ చిన్న బిలం. బెల్జియంకు చెందిన 17వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్త చార్లెస్ మాలాపెర్ట్ పేరును దానికి పెట్టారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి అతి సమీపంలో దిగిన వ్యోమనౌకగా చరిత్ర సృష్టించిన ‘ఒడిస్సియస్’… ఆ విషయంలో గత ఏడాది మన చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండర్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టడం విశేషం. ‘ఒడిస్సియస్’ ల్యాండరుకు ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ సంస్థ ఉద్యోగులు పెట్టుకున్న ముద్దు పేరు ‘ఒడీ’. ఈ మానవరహిత చంద్రయాత్రకు మిషన్ ‘ఐఎం-1’గా నామకరణం చేశారు. జీవితకాలం ఏడు రోజులే! పూర్తిగా ఓ ప్రైవేటు కంపెనీ తయారీ-నిర్వహణలో ల్యాండర్ ఒకటి చంద్రుడి ఉపరితలంపై సజావుగా దిగడం ఇదే తొలిసారి. సాంకేతిక అవాంతరాలు ఎదుర్కొన్నప్పటికీ జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్ మాదిరిగా తలకిందులుగా కాకుండా ‘ఒడిస్సియస్’ నిటారుగానే దిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. షడ్భుజి ఆకృతితో, సిలిండర్ ఆకారంలో టెలిఫోన్ బూత్ కంటే కాస్త పెద్ద పరిమాణంలో ఉన్న ఈ ల్యాండరులో 100 కిలోల బరువైన ఐదు ‘నాసా’ పరికరాలు, ఇతర వాణిజ్య సంస్థలకు చెందిన ఆరు శాస్త్రీయ పరికరాలు (పేలోడ్స్) ఉన్నాయి. అవి చంద్రుడిపై పరిశోధనలు నిర్వహిస్తాయి. వీటిలో లేజర్ రెట్రో రిఫ్లెక్టర్, ఐఎల్ఓ-ఎక్స్ అబ్జర్వేటరీ (టెలిస్కోప్) ఉన్నాయి. జాబిలిపై ‘ఒడిస్సియస్’ జీవితకాలం కేవలం ఏడు రోజులు. మరో వారం రోజుల్లో అది దిగిన ప్రదేశంలో సూర్యాస్తమయం అవుతుంది. కనుక ల్యాండర్ పనిచేయడానికి సౌరశక్తి లభించదు. చంద్రుడి ఉపరితలంతో అంతరిక్ష వాతావరణం చర్యనొందే విధానం, రేడియో ఆస్ట్రానమీ, చంద్రావరణానికి సంబంధించిన డేటాను ‘నాసా’ పేలోడ్స్ సేకరించనున్నాయి. అమెరికా చివరిసారిగా 1972లో చేపట్టిన ‘అపోలో-17’ మానవసహిత యాత్రలో వ్యోమగాములు జీన్ సెర్నాన్, హారిసన్ ష్మిట్ చంద్రుడి నేలపై నడయాడారు. ఆ తర్వాత అమెరికా వ్యోమనౌక ఒకటి నియంత్రిత విధానంలో చంద్రుడిపై దిగడం ఇదే మొదటిసారి. చైనా కంటే ముందుగా తమ ‘ఆర్టెమిస్’ యాత్రతో త్వరలో జాబిలిపైకి తమ వ్యోమగాములను పంపాలని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఒడిస్సియస్’ సేకరించే సమాచారం కీలకం కానుంది. చంద్రుడిపైకి ప్రైవేటు ల్యాండర్లను ప్రయోగించడానికి ఉద్దేశించిన తన కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రాజెక్టులో భాగంగా ‘నాసా’ వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఈ మిషన్ కాంట్రాక్టును ‘ఇంట్యూటివ్ మెషీన్స్’కు కట్టబెట్టింది. చంద్రుడి సూక్ష్మ శిల్పానికి గాంధీ పేరు! ఆరు కాళ్లపై నిలబడే ‘ఒడిస్సియస్’ ల్యాండర్ ఎత్తు 4 మీటర్లు కాగా, వెడల్పు సుమారు 2 మీటర్లు. ప్రయోగ సమయంలో ల్యాండర్ బరువు 1,908 కిలోలు. ఈ నెల 15న ఫ్లోరిడాలోని కేప్ కెనెవరాల్ నుంచి కెన్నెడీ అంతరిక్ష కేంద్రం వేదికగా ఇలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్-ఎక్స్’కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో దాన్ని ప్రయోగించారు. భూమి నుంచి చూస్తే చంద్రుడిలో కనిపించే 62 దశలు, అంతరిక్షంలోని ఇతర ప్రాంతాల నుంచి చూస్తే చంద్రుడిలో అగుపించే మరో 62 దశలు, ఒక చంద్రగ్రహణం... మొత్తం కలిపి చంద్రుడి 125 దశలను ప్రతిబింబించే సూక్ష్మ శిల్పాలను ఓ పెట్టెలో పెట్టి ల్యాండరులో అమర్చడం విశేషం. వీటిని అమెరికన్ కళాకారుడు జెఫ్ కూన్స్ రూపొందించారు. ఒక్కో బుల్లి శిల్పం వ్యాసం అంగుళం. ఈ శిల్పాలకు మానవ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమున్న అరిస్టాటిల్, లియోనార్డో డా విన్సీ, గాంధీ, డేవిడ్ బౌయీ, బిల్లీ హాలిడే తదితరుల పేర్లు పెట్టారు. భూమికి ‘ఒడిస్సియస్’ ల్యాండర్ పంపిన సంకేతం బలహీనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితంగా ల్యాండర్ భవితపై అనిశ్చితి నెలకొంది. దీంతో మిషన్ కంట్రోల్ కేంద్రంలో హర్షధ్వానాలు, విజయోత్సవాలను రద్దు చేశారు. ల్యాండర్ సంకేతాలను మెరుగుపరచేందుకు ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ::: జమ్ముల శ్రీకాంత్ -
బతికించిన సూరీడు.. ‘మూన్ స్నైపర్’ ఈజ్ బ్యాక్!
నిద్ర లేస్తూనే చకచకా పని ఆరంభించిన జపాన్ ల్యాండర్. చంద్రుడిపై దిగిన తమ ‘స్లిమ్’ ల్యాండరుతో ఆదివారం సాయంత్రం సమాచార సంబంధాలను పునరుద్ధరించినట్టు సోమవారం ‘ఎక్స్’ (పాత పేరు ట్విట్టర్) వేదికగా ప్రకటించిన జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ ‘జాక్సా’. ల్యాండరులోని మల్టీబ్యాండ్ స్పెక్ట్రోస్కోపిక్ కెమెరా (ఎంబీసీ)తో వెంటనే శాస్త్రీయ పరిశోధనలు ప్రారంభించినట్టు ఆ సంస్థ తెలిపింది. ల్యాండర్ దిగిన ప్రదేశంలో కుక్క బొమ్మ (టాయ్ పూడిల్)ను పోలివున్న ఓ చంద్రశిల ఛాయాచిత్రాన్ని రోవర్-2 (లూనార్ ఎక్స్కర్షన్ వెహికల్-2) ఫొటో తీసింది. ల్యాండర్, దాని సమీపంలోని ఆ శిల ఛాయాచిత్రాన్ని ఎక్స్ వేదికగా ‘జాక్సా’ పోస్ట్ చేసింది. ‘మూన్ స్నైపర్’ ఈ నెల 19న చంద్రుడిపై షియోలి బిలంలోని వాలులో తలకిందులుగా దిగిన సంగతి తెలిసిందే. ఫలితంగా ‘మూన్ స్నైపర్’ సౌరఫలకాలు సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉండిపోవటంతో ల్యాండరులోని ఆన్‌బోర్డ్ బ్యాటరీని రెండున్నర గంటలు మాత్రమే వినియోగించి, 12% పవర్ ను ముందుజాగ్రత్తగా నిల్వ ఉంచి దాన్ని ‘జాక్సా’ స్విచ్ ఆఫ్ చేసింది. ల్యాండరులోని సాంకేతిక సమస్యను అధిగమించామని, సూర్యుడి కోణం మారి ప్రస్తుతం ఎండ అందుబాటులోకి రావడంతో ల్యాండర్ సౌరఘటాలు పనిచేస్తున్నాయని ‘జాక్సా’ వివరించింది. చంద్రుడి బిలంలో ల్యాండర్ డొల్లిపోయి తలకిందులుగా దిగినా, దాని సోలార్ ప్యానెళ్లు పై భాగంలో కాకుండా కిందివైపు... అదీ వెనుకవైపున సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉన్నా... తాజాగా సూర్యరశ్మిని గ్రహించి అవి పనిచేయడం మొదలుపెట్టడం నిజంగా ఓ అద్భుతమనే చెప్పాలి. ల్యాండర్ తలకిందులైనా దాని జాతకం తిరగబడి అది తుది ఘట్టంలో కుదురుకోవడం ఆశ్చర్యకర పరిణామం. ఈ విషయంలో జపాన్ అంతరిక్ష శాస్త్రవేత్తలు చాలా అదృష్టవంతులు. చంద్రశిలల నిర్మాణ కూర్పును ల్యాండర్ అధ్యయనం చేయనుంది. చంద్రుడిపై ల్యాండర్ ఎప్పటివరకు పనిచేస్తుందో ‘జాక్సా’ వెల్లడించలేదు. అయితే... జాబిలిపై రాత్రివేళల్లో నమోదయ్యే మైనస్ డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా దాన్ని డిజైన్ చేయలేదు. చంద్రుడిపై 15 రోజులపాటు పగలు, 15 రోజులపాటు రాత్రి ఉంటాయి. అలా చూస్తే... గరిష్ఠంగా మరో 3-4 రోజులు మాత్రమే బహుశా ల్యాండర్ పనిచేయవచ్చు. :::: జమ్ముల శ్రీకాంత్ -
Russia-Ukraine War: రష్యా బలగాల దాడిలో బ్రెజిల్ మోడల్ మృతి
కీవ్: రష్యా బలగాలు చేసిన క్షిపణి దాడిలో బ్రెజిల్ మాజీ మోడల్, స్నైపర్.. థాలిట డో వల్లె (39) ప్రాణాలు కోల్పోయింది. భీకర యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌లో ఉన్న ఆమె.. ఆ దేశం తరఫున స్నైపర్‌గా బరిలోకి దిగి రష్యా సేనలకు అడ్డుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది. ఖార్కివ్ నగరంపై రష్యా సైన్యం జూన్ 30న క్షిపణులతో విరుచుకుపడింది. మొదటి క్షిపణి దాడి జరిగినప్పుడు తన ట్రూప్‌లో థాలిట మాత్రమే ప్రాణాలతో మిగిలింది. కాని ఆ తర్వాత మరో క్షిపణి పడటంతో ఆమె మృతి చెందింది. బంకర్లో ఉన్న థాలిట కోసం వెళ్లిన బ్రెజిల్ మాజీ సైనికుడు డాగ్లస్ బురిగో (40) కూడా క్షిపణి దాడిలోనే మరణించాడు. థాలిటకు గతంలో యుద్ధంలో పాల్గొన్న అనుభవం ఉంది. ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా ఆమె పోరాడింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంటరీని తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేసింది. ఇరాక్‌లో పెష్‌మెర్గాస్ సాయుధ బలగాల తరఫున పోరాడే సమయంలోనే స్నైపర్ శిక్షణ తీసుకుంది. ఆమె అనుభవాలను పుస్తకం రూపంలో తీసుకొచ్చేందుకు ఓ రచయిత బ్రెజిల్ సైనికుడితో కలిసి పనిచేస్తున్నాడు. నటిగా.. థాలటి యుక్త వయసులో నటిగా, మోడల్‌గా పని చేసింది. లా చదివే సమయంలో ఆమె ఎన్జీఓలతో కలిసి జంతువులను కాపాడే కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమె సోదరుడు రొడ్రిగో వైరా.. ఆమె ఓ హీరో అని చెప్పాడు. ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు, మనవతా కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు ఆమె దేశాలు సంచరిస్తుంటుందని పేర్కొన్నాడు. ఆమె ఉక్రెయిన్‌కు వెళ్లి మూడు వారాలే అవుతోందని చెప్పాడు. అక్కడ సహాయక కార్యక్రమాల్లోనే పాల్గొంటూనే షార్ప్ షూటర్‌గా సేవలందిస్తోందని తెలిపాడు. అదే చివరిసారి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బలగాలు బాంబు దాడులు జరిపినప్పుడు థాలిట తృటిలో ప్రాణాలతో బయపడింది. ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నానని చెప్పింది. రష్యా బలగాలు డ్రోన్ల ద్వారా తన ఫోన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నందుకు ఎక్కువ మాట్లాడలేనని కుటుంబసభ్యులు వివరించింది. ఆ తర్వాత ఆమె గత సోమవారమే ఖార్కివ్‌కు వెళ్లింది. అప్పుడే చివరిసారిగా కుటుంబంతో మాట్లాడింది.