జాబిలిపైకి ల్యాండర్ల పరంపర కొనసాగుతోంది. జపాన్ ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ తర్వాత తాజాగా అమెరికా వంతు వచ్చింది. అర్ధ శతాబ్దం తర్వాత చంద్రుడిపై మరోమారు అగ్రరాజ్యం జెండా రెపరెపలాడింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు సంస్థ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ రూపొందించిన ‘ఒడిస్సియస్’ (నోవా-సీ శ్రేణి) ల్యాండర్ జాబిలి ఉపరితలంపై దక్షిణ ధ్రువం చేరువలోని ‘మాలాపెర్ట్ ఎ’ బిలంలో దిగ్విజయంగా దిగింది. తొలుత ల్యాండర్ నేవిగేషన్ వ్యవస్థలోని లేజర్ రేంజిఫైండర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మిషన్ కంట్రోల్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు ఆందోళన చెందారు. దీంతో ల్యాండర్ దిగాల్సిన నిర్దేశిత సమయంలో కొంత జాప్యం సంభవించినప్పటికీ భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 4:53 గంటలకు అది క్షేమంగా చంద్రుడిపై దిగి భూమికి సంకేతం పంపింది.
‘మాలాపెర్ట్ ఎ’ అనేది చంద్రుడి దక్షిణ ధృవానికి 300 కిలోమీటర్ల దూరంలో 85 డిగ్రీల దక్షిణ అక్షాంశ ప్రాంతంలో నెలకొన్న ఓ చిన్న బిలం. బెల్జియంకు చెందిన 17వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్త చార్లెస్ మాలాపెర్ట్ పేరును దానికి పెట్టారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి అతి సమీపంలో దిగిన వ్యోమనౌకగా చరిత్ర సృష్టించిన ‘ఒడిస్సియస్’… ఆ విషయంలో గత ఏడాది మన చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండర్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టడం విశేషం.
‘ఒడిస్సియస్’ ల్యాండరుకు ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ సంస్థ ఉద్యోగులు పెట్టుకున్న ముద్దు పేరు ‘ఒడీ’. ఈ మానవరహిత చంద్రయాత్రకు మిషన్ ‘ఐఎం-1’గా నామకరణం చేశారు. జీవితకాలం ఏడు రోజులే! పూర్తిగా ఓ ప్రైవేటు కంపెనీ తయారీ-నిర్వహణలో ల్యాండర్ ఒకటి చంద్రుడి ఉపరితలంపై సజావుగా దిగడం ఇదే తొలిసారి. సాంకేతిక అవాంతరాలు ఎదుర్కొన్నప్పటికీ జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్ మాదిరిగా తలకిందులుగా కాకుండా ‘ఒడిస్సియస్’ నిటారుగానే దిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. షడ్భుజి ఆకృతితో, సిలిండర్ ఆకారంలో టెలిఫోన్ బూత్ కంటే కాస్త పెద్ద పరిమాణంలో ఉన్న ఈ ల్యాండరులో 100 కిలోల బరువైన ఐదు ‘నాసా’ పరికరాలు, ఇతర వాణిజ్య సంస్థలకు చెందిన ఆరు శాస్త్రీయ పరికరాలు (పేలోడ్స్) ఉన్నాయి. అవి చంద్రుడిపై పరిశోధనలు నిర్వహిస్తాయి.
వీటిలో లేజర్ రెట్రో రిఫ్లెక్టర్, ఐఎల్ఓ-ఎక్స్ అబ్జర్వేటరీ (టెలిస్కోప్) ఉన్నాయి. జాబిలిపై ‘ఒడిస్సియస్’ జీవితకాలం కేవలం ఏడు రోజులు. మరో వారం రోజుల్లో అది దిగిన ప్రదేశంలో సూర్యాస్తమయం అవుతుంది. కనుక ల్యాండర్ పనిచేయడానికి సౌరశక్తి లభించదు. చంద్రుడి ఉపరితలంతో అంతరిక్ష వాతావరణం చర్యనొందే విధానం, రేడియో ఆస్ట్రానమీ, చంద్రావరణానికి సంబంధించిన డేటాను ‘నాసా’ పేలోడ్స్ సేకరించనున్నాయి. అమెరికా చివరిసారిగా 1972లో చేపట్టిన ‘అపోలో-17’ మానవసహిత యాత్రలో వ్యోమగాములు జీన్ సెర్నాన్, హారిసన్ ష్మిట్ చంద్రుడి నేలపై నడయాడారు. ఆ తర్వాత అమెరికా వ్యోమనౌక ఒకటి నియంత్రిత విధానంలో చంద్రుడిపై దిగడం ఇదే మొదటిసారి. చైనా కంటే ముందుగా తమ ‘ఆర్టెమిస్’ యాత్రతో త్వరలో జాబిలిపైకి తమ వ్యోమగాములను పంపాలని అమెరికా భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ‘ఒడిస్సియస్’ సేకరించే సమాచారం కీలకం కానుంది. చంద్రుడిపైకి ప్రైవేటు ల్యాండర్లను ప్రయోగించడానికి ఉద్దేశించిన తన కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రాజెక్టులో భాగంగా ‘నాసా’ వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఈ మిషన్ కాంట్రాక్టును ‘ఇంట్యూటివ్ మెషీన్స్’కు కట్టబెట్టింది. చంద్రుడి సూక్ష్మ శిల్పానికి గాంధీ పేరు! ఆరు కాళ్లపై నిలబడే ‘ఒడిస్సియస్’ ల్యాండర్ ఎత్తు 4 మీటర్లు కాగా, వెడల్పు సుమారు 2 మీటర్లు. ప్రయోగ సమయంలో ల్యాండర్ బరువు 1,908 కిలోలు. ఈ నెల 15న ఫ్లోరిడాలోని కేప్ కెనెవరాల్ నుంచి కెన్నెడీ అంతరిక్ష కేంద్రం వేదికగా ఇలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్-ఎక్స్’కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో దాన్ని ప్రయోగించారు. భూమి నుంచి చూస్తే చంద్రుడిలో కనిపించే 62 దశలు, అంతరిక్షంలోని ఇతర ప్రాంతాల నుంచి చూస్తే చంద్రుడిలో అగుపించే మరో 62 దశలు, ఒక చంద్రగ్రహణం... మొత్తం కలిపి చంద్రుడి 125 దశలను ప్రతిబింబించే సూక్ష్మ శిల్పాలను ఓ పెట్టెలో పెట్టి ల్యాండరులో అమర్చడం విశేషం.
వీటిని అమెరికన్ కళాకారుడు జెఫ్ కూన్స్ రూపొందించారు. ఒక్కో బుల్లి శిల్పం వ్యాసం అంగుళం. ఈ శిల్పాలకు మానవ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమున్న అరిస్టాటిల్, లియోనార్డో డా విన్సీ, గాంధీ, డేవిడ్ బౌయీ, బిల్లీ హాలిడే తదితరుల పేర్లు పెట్టారు. భూమికి ‘ఒడిస్సియస్’ ల్యాండర్ పంపిన సంకేతం బలహీనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితంగా ల్యాండర్ భవితపై అనిశ్చితి నెలకొంది. దీంతో మిషన్ కంట్రోల్ కేంద్రంలో హర్షధ్వానాలు, విజయోత్సవాలను రద్దు చేశారు. ల్యాండర్ సంకేతాలను మెరుగుపరచేందుకు ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.
::: జమ్ముల శ్రీకాంత్
Comments
Please login to add a commentAdd a comment