
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జిల్లా, మండల ప్రధాన రహదారుల నిర్మాణం వేగం పుంజుకోనుంది. దాదాపు రూ.6,400 కోట్లతో ఆమోదించిన 2,512 కి.మీ. మేర రోడ్ల నిర్మాణానికి బాలారిష్టాలు తొలగిపోయాయి. ఇప్పటికే మొదటి దశ పనులు మొదలు పెట్టిన ఆర్‌అండ్‌బీశాఖ ఇక రెండో దశ టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు ఉద్యుక్తమవుతోంది.
కాంట్రాక్టర్లకు తక్షణం బిల్లుల చెల్లింపు..
జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ నిధులను పూర్తిగా రోడ్ల నిర్మాణానికే వెచ్చించేందుకు కేంద్రం సూచించిన విధంగా ప్రత్యేక ఫండ్ అకౌంట్ ఏర్పాటు చేసింది. అందుకోసం కేంద్ర ఆర్థిక శాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (డీఈఏ) నుంచి అనుమతి పొంది ప్రత్యేక ఖాతాను తెరిచింది. దాంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు మరింత వేగవంతం కానుంది.
పనులు పూర్తి చేసి బిల్లులు అప్‌లోడ్ చేయగానే ఆ ప్రత్యేక ఖాతాల నుంచి నేరుగా కాంట్రాక్టర్లకు బిల్లులు మొత్తం చెల్లిస్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణానికి తీసుకొచ్చిన రూ.3 వేల కోట్లను ఇతర అవసరాలకు మళ్లించారు. దాంతో రోడ్ల నిర్వహణ అధ్వానంగా తయారైంది. దీనికి పరిష్కారంగా ప్రత్యేక ఖాతాల్లో నిధులు జమ చేసి.. నేరుగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పారదర్శక విధానాన్ని అవలంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.6,400 కోట్లతో రెండు దశల్లో 2,512 కి.మీ. మేర జిల్లా, మండల ప్రధాన రహదారులను నిర్మించనున్నారు.
మొదటి దశలో రూ.3,014 కోట్లతో 1,244 కి.మీ. రోడ్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే 60 కి.మీ. పనులు పూర్తి చేశారు. ఇక రెండో దశలో రూ.3,386 కోట్లతో 1,268 కి.మీ. మేర రహదారులను ఏప్రిల్‌నాటికి నిర్మిస్తారు. అందుకోసం ఆర్‌అండ్‌బీ శాఖ త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment