ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: గులాబ్ తుపాను రాష్ట్రంలో రోడ్లను దెబ్బకొట్టింది. తుపాను తీవ్రతకు రాష్ట్రంలో 5 జిల్లాల్లో దాదాపు 1,200 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టు రహదారులు, భవనాలశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ శాఖ అధికారుల బృందాలు తుపానుకు దెబ్బతిన్న రోడ్లను రెండు రోజులుగా పరిశీలిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 306 కిలోమీటర్లు, విజయనగరం జిల్లాలో 122, విశాఖపట్నం జిల్లాలో 355, పశ్చిమ గోదావరి జిల్లాలో 280, కృష్ణాజిల్లాలో 130 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతోపాటు ఈ జిల్లాల్లో 100 వరకు కల్వర్టులు, మోరీలు దెబ్బతిన్నాయి.
ఆర్ అండ్ బీ శాఖ అధికారులు రెవెన్యూ, పోలీసు శాఖలతో కలిసి ప్రస్తుతానికి రోడ్లపై రాకపోకలను పునరుద్ధరించారు. రోడ్ల తక్షణ మరమ్మతుల కోసం రూ.50 కోట్లు అవసరమని, పూర్తిస్థాయిలో మరమ్మతులకు మరో రూ.300 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు.
అధికారుల బృందాలు రెండు రోజుల్లో తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే రోడ్లకు తక్షణ మరమ్మతులు చేపడతారు. అనంతరం పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టనున్నారు.
వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు తక్షణం మరమ్మత్తులు: మంత్రి పెద్దిరెడ్డి
వర్షాల కారణంగా దెబ్బతిన్న గ్రామీణ రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం సచివాలయంలో పంచాయతీరాజ్ రహదారులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే రహదారులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఇప్పటికే సీఎం జగన్ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన పనులపై నివేదికలను తక్షణం సిద్ధం చేయాలని సూచించారు.
మండలాల్లో అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాల్సిన రోడ్లను గుర్తించాలని, గతంలో ప్రారంభించి అసంపూర్తిగా ఉండిపోయిన రహదారులను పూర్తిచేయాలని సూచించారు. తాజాగా తుపాను ప్రభావిత జిల్లాల్లో రహదారులకు ఆర్థిక చేయూత కోరేందుకు కేంద్ర ప్రభుత్వానికి నష్టం తీవ్రతను తెలిపే నివేదికలను పంపాలని ఆదేశించారు. తాజాగా చేపట్టబోయే రహదారుల నిర్మాణం, మరమ్మతుల్లో నాణ్యత విషయంలో రాజీపడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఈఎన్‌సీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment