నదిలో చిక్కుకున్న గొర్రెల కాపరిని హెలికాప్టర్ సాయంతో ఒడ్డుకు చేర్చిన నేవీ సిబ్బంది
దొండపర్తి (విశాఖ దక్షిణ)/వంగర/విజయనగరం/సీతానగరం/మునగపాక: గులాబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలతో ముంపు గ్రామాలు పూర్తిగా తేరుకున్నాయి. రెండు రోజులుగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారు ఇళ్లకు చేరుతున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో సరఫరాను 98 శాతం వరకు పునరుద్ధరించారు. విశాఖ విమానాశ్రయంలోకి చేరిన వరద నీటిని మళ్లించడంతో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలోని 30 మండలాల్లో 244 గ్రామాలు జలమయం కాగా.. మంగళవారం నాటికి 95 శాతం గ్రామాలు ముంపు నుంచి పూర్తిగా తేరుకున్నాయి.
లోతట్టు ప్రాంత ప్రజల కోసం 28 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 10,512 మందిని తరలించగా.. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో 8,352 మంది తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 2,160 మంది మాత్రం పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. జిల్లాలో 12 సబ్‌స్టేషన్లు దెబ్బతినగా వాటిని పునరుద్ధరించారు. 198 వీధి దీపాలు ధ్వంసం కాగా.. మరమ్మతులు పూర్తిచేశారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడగా.. 74 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పునరుద్ధరించారు. పాడేరు ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు, నేలకొరిగిన భారీ వృక్షాలను తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. పరవాడ మండలం లంకెలపాలెంలో వరద ప్రవాహానికి ఏలేరు కాలువ వంతెన వద్ద రోడ్డు కోతకు గురైంది. అధికారులు అక్కడకు చేరుకుని తాత్కాలిక మరమ్మతులు చేయించి లంకెలపాలెం, పరవాడ గ్రామాల మధ్య ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
విశాఖలో జాతీయ రహదారి పక్కన మురుగు కాలువల్లో పూడిక తొలగిస్తున్న సిబ్బంది
శ్రీకాకుళంలో ముమ్మరంగా సహాయక చర్యలు
శ్రీకాకుళం జిల్లాలో తుపాను ప్రభావానికి గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సేవలందిస్తున్నాయి. వంగర మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములు నాయుడు ప్రాజెక్టును వరద ముంచెత్తింది. ఫలితంగా సోమవారం అర్ధరాత్రి కొప్పర, కొండచాకరాపల్లి, గీతనాపల్లి గ్రామాలు నీటమునిగాయి. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ ప్రాజెక్టును పరిశీలించారు. ఎస్పీ అమిత్ బర్దార్ డ్రోన్ కెమెరాల సాయంతో వరద గ్రామాల్లో పరిస్థితిని సమీక్షించారు. నాగావళి ఉగ్రరూపంతో అంపిలి, అన్నవరం, గోపాలపురం, చిన్నమంగళాపురం గ్రామాల్లో వరద నీరు చేరింది. అధికారులు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. బాధిత కుటుంబాలకు ఆహార పొట్లాలను అందజేశారు.
కోలుకుంటున్న విజయనగరం
తుపాను దెబ్బ నుంచి విజయనగరం జిల్లా ప్రజలు కోలుకుంటున్నారు. మంగళవారం సాయంత్రానికి చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఇవ్వగలిగారు. మరోవైపు తుపాను బాధితులకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 24 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1,205 మందికి వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. రోడ్లకు అడ్డంగా పడిన చెట్లను పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, స్థానికులు కలిసి తొలగిస్తున్నారు. వరద ఉధృతి తగ్గుతుండటంతో పంట నష్టాల గణన వేగవంతమైంది. కలెక్టర్ ఎ.సూర్యకుమారి, జేసీలు కిశోర్‌కుమార్, మహేష్‌కుమార్‌లు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మరోవైపు ఎంపీ బెల్లాన చంద్రశేఖరరావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావు, శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య తదితరులు రైతులు, ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు.
గొర్రెల కాపరి సురక్షితం
విజయనగరం జిల్లా సీతానగరం మండల పరిధిలోని కొత్తవలస ఆనకట్ట దిగువన గల మెట్టపైకి గొర్రెలను తోలుకెళ్లిన దుక్క సింహాచలం సువర్ణముఖి నది ప్రవాహం మధ్య సోమవారం చిక్కుకుపోయిన విషయం విదితమే. అతడిని అర్ధరాత్రి దాటాక విశాఖపట్నం నేవీ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో ఒడ్డుకు చేర్చారు.
గోడకూలి వృద్ధురాలి దుర్మరణం
విశాఖ జిల్లా మునగపాక మండలం పల్లపు ఆనందపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు కర్రి జోగులమ్మ (65) అనే వృద్ధురాలిపై మంగళవారం ఉదయం పక్కింటి గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రెండు రోజులపాటు భారీ వర్షాలకు గోడ తడిసిపోవడంతో ఈ ఘటన జరిగింది.
గోదావరి పరవళ్లు
కొవ్వూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 4,43,330 క్యూసెక్కులను దిగువకు విడిచిపెడుతున్నారు. బుధవారం సాయంత్రానికి 8 లక్షల క్యూసెక్కులకు వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతంలో నీటిమట్టాలు పెరుగుతుండంతో ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి అధికమైంది. అక్టోబర్ నెలాఖరున గోదావరికి ఈ స్థాయి వరద రావడం ఇదే ప్రథమం. 2005 అక్టోబర్ 21 తర్వాత ఇప్పుడే ఈ సమయంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది.
Comments
Please login to add a commentAdd a comment