R&B Department
-
రోడ్ల పనులు కనిపించడం లేదా?
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం అసత్య ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న రామోజీరావు.. రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై నీరు నిల్వ ఉన్న ప్రదేశాల ఫొటోలు ప్రచురించి ఈనాడు పత్రిక దిగజారుడు పాత్రికేయాన్ని ప్రదర్శించింది. ‘సాఫీ ప్రయాణం సీఎంకేనా’ అంటూ ఓ అసత్య కథనంతో పాఠకులను మోసగించేందుకు ప్రయత్నించింది. ఈనాడు కథనాన్ని ఖండిస్తూ.. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతూ ఆర్అండ్బీ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అత్యంత ప్రాధాన్యతతో రోడ్ల నిర్మాణం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోడ్ల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఏటా షెడ్యూల్ ప్రకారం రోడ్ల పునరుద్ధరణ పనులు చేపడుతోంది. రెండేళ్లపాటు కోవిడ్ ప్రభావం ఉన్నాసరే రోడ్ల పనులను నిర్లక్ష్యం చేయలేదు. నాలుగేళ్లుగా భారీ వర్షాలు కురుస్తున్నా రోడ్ల పునరుద్ధరణ పనులు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే రూ. 2,400 కోట్లు ఖర్చు చేసి 7,500 కి.మీ. మేర రోడ్లను పునరుద్ధరించింది. కానీ ఈ వాస్తవాన్ని ఈనాడు ప్రస్తావించనే లేదు. రోడ్ల పనులు జరుగుతున్నాయి.. ఈనాడు కథనంలో 13 రోడ్లను పేర్కొంది. ఇందులో 9 రహదారులు ఆర్అండ్బీ విభాగానికి చెందినవి. అందులో 6 రోడ్ల మరమ్మతు పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మిగిలిన మూడు రోడ్ల పనులను కూడా త్వరలోనే చేపట్టేందుకు ఆర్అండ్బీ కార్యాచరణ వేగవంతం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మెరుగ్గా రోడ్ల నిర్మాణం టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్ల మరమ్మతు పనులకు రూ. 2,953.81 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఏడాదికి సగటున రూ. 591 కోట్లు వెచ్చించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రోడ్ల పునరుద్ధరణకు రూ. 4,148.59 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఏడాదికే సగటున రూ. 951 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల్లోనే రూ. 346 కోట్లు ఖర్చు చేసింది. ఇక పంచాయతీరాజ్ శాఖ మరో రూ. 283 కోట్లతో రోడ్లు నిర్మించింది. రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించి సకాలంలో పనులు పూర్తి చేస్తున్నా సరే తన మనిషి చంద్రబాబు సీఎంగా లేరన్న అక్కసుతో రామోజీరావు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నారు. -
ఎన్‌హెచ్ నిర్మాణాల్లో ఏపీ టాప్
జాతీయ రహదారుల నిర్మాణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరోసారి తన సత్తాను చాటింది. 2022–23లో జాతీయ రహదారుల నిర్మాణంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపింది. ఈ మేరకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) నివేదిక వెల్లడించింది. కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిధులతో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ చేపట్టే రహదారుల నిర్మాణంలోనూ దేశంలో ఏపీ రెండోస్థానంలో నిలిచింది. తద్వారా ఎన్హెచ్ఏఐ రహదారుల నిర్మాణంలో, కేంద్రం నిధులతో ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యాన రోడ్ల నిర్మాణంలోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రోడ్ల నిర్మాణాలకు గరిష్టంగా నిధులు రాబట్టడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధించిన విజయానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. - సాక్షి, అమరావతి ఆర్అండ్బీ ద్వారా నిర్మాణాల్లోనూ రెండోస్థానం కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే రహదారుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సమర్థతను నిరూపించుకుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి వరుసగా నాలుగో ఏడాది కూడా కేంద్రం నుంచి రికార్డు స్థాయిలో నిధులను సాధించింది. 2022–23 వార్షిక ప్రణాళికలో రాష్ట్రానికి రూ.12,130 కోట్లు రాబట్టింది. కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వార్షిక ప్రణాళిక కింద ఆమోదించిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రహదారుల ప్రాజెక్టులను పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి చెందితేనే ఆ మేరకు ఆర్థిక సంవత్సరం ఆఖరులో నిధులు మంజూరు చేస్తుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో పూర్తి సంతృప్తి చెందినందున రికార్డు స్థాయిలో వార్షిక ప్రణాళిక నిధులను కేంద్రం మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కే నిధులు మంజూరు చేయడం విశేషం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో 2014–19 వరకు భాగస్వామిగా ఉన్నప్పటికీ నాటి టీడీపీ ప్రభుత్వం పెద్దగా నిధులు రాబట్టలేకపోయింది. ఐదేళ్లలో టీడీపీ సర్కారు కేవలం రూ.10,661 కోట్లు మాత్రమే తీసుకువచ్చింది. కానీ, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కానప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ రహదారుల నిర్మాణానికి రికార్డుస్థాయిలో నిధులు తీసుకురావడం విశేషం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క 2022–23లోనే రూ.12,130 కోట్లు సాధించింది. మొత్తం నాలుగేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.23,471.92 కోట్లు సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2019 జూన్ నాటికి రాష్ట్రంలో 6,861.68 కి.మీ.మేర జాతీయ రహదారులు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 1,302.04 కి.మీ. మేర జాతీయ రహదారులను నిర్మించింది. దాంతో 2023 మార్చి నాటికి రాష్ట్రంలో 8,163.72 కి.మీ.మేర జాతీయ రహదారులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పారిశ్రామిక, తీర ప్రాంతాలు, ఎకనావిుక్ జోన్లు, పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తూ రహదారుల అభివృద్ధి జోరందుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా మిన్నగా... ఎన్హెచ్ఏఐ 2022–23లో దేశవ్యాప్తంగా 6,003 కి.మీ. మేర రహదారులను నిర్మించింది. అందులో అత్యధికంగా 845 కి.మీ.మేర జాతీయ రహదారుల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ (740 కి.మీ.), మూడో స్థానంలో మధ్యప్రదేశ్ (524 కి.మీ.), నాలుగో స్థానంలో జార్ఖండ్ (442 కి.మీ.), ఐదో స్థానంలో కర్ణాటక (419 కి.మీ.) నిలిచాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా జాతీయ రహదారులను నిర్మించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో కొత్త జాతీయ రహదారుల్లో 56శాతం హైబ్రీడ్ యాన్యుటీ విధానం (హెచ్ఏఎం)లో, ఈపీసీ విధానంలో 35శాతం, ఐటం రేట్ విధానంలో 8శాతం, బీవోటీ విధానంలో ఒక శాతం నిర్మించినట్లు ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. ఇక ప్రా జెక్టు నిర్మాణ విలువలో కూడా అత్యధికంగా 68 శాతంతో హెచ్ఏఎం విధానంలోనే నిర్మించారు. -
AP: మరో 875 రోడ్ల పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 875 రోడ్లను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గంలో కీలకమైన ఐదురోడ్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. ఈ 875 రోడ్లలో ఆర్ అండ్ బి శాఖ పరిధిలో 442, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 300, మున్సిపల్ శాఖ పరిధిలో 133 ఉన్నాయి. రోడ్లను ఎంపికచేసి ప్రతిపాదనలు పంపాలని ఆర్ అండ్ బి, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ రోడ్ల పనులను మార్చిలో ప్రారంభించి జూన్ నాటికి పూర్తిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రోడ్ల పునరుద్ధరణ నిధులను కూడా 2019 ఎన్నికల ముందు పసుపు–కుంకుమ వంటి పథకాలకు మళ్లించింది. దీంతో రాష్ట్రంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి ఏడాది భారీవర్షాలతో రోడ్ల పనులు చేపట్టడం సాధ్యం కాలేదు. అనంతరం రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులను పెద్ద ఎత్తున చేపట్టింది. మొదటిదశ కింద రూ.2,205 కోట్లతో 6,150 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బి రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఆ పనులు 95 శాతం పూర్తయ్యాయి. రెండోదశ కింద రూ.1,700 కోట్లతో 6,150 కిలోమీటర్ల మేర రహదారుల పునరుద్ధరణ ప్రణాళికను ఖరారు చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మొత్తం 953 రోడ్లను రెండోదశలో పునరుద్ధరించాలని నిర్ణయించింది. వాటిలో రాష్ట్ర ప్రధాన రహదారులు 292, జిల్లా ప్రధాన రహదారులు 661 ఉన్నాయి. ఈ పనులను ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతలో యుద్ధప్రాతిపదికన నియోజకవర్గానికి ఐదు రోడ్ల చొప్పున పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విధానంలో 875 రోడ్ల పునరుద్ధరణ పనులు మొదట పూర్తిచేయనున్నారు. అనంతరం రెండోదశ రోడ్ల పునరుద్ధరణ పనులను చేపట్టి డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని ప్రణాళిక రూపొందించారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో రోడ్ల కోతకు చెక్ నదీపరివాహక ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న రోడ్ల కోతకు రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలకనుంది. అందుకోసం ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్డీఆర్) టెక్నాలజీతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎఫ్డీఆర్ టెక్నాలజీతో వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఆదేశించారు. మెత్తటి నేలల్లో రోడ్లు నిర్మిస్తున్నా.. వర్షాలు పడినా, వరదలు వచ్చినా నదీతీర ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురవుతున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దశాబ్దాలుగా ఈ సమస్య వేధిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఎఫ్డీఆర్ సాంకేతికతతో రోడ్లు నిర్మించనుంది. ఆర్ అండ్ బి శాఖకు చెందిన 500 కిలోమీటర్ల రోడ్లు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన 500 కిలోమీటర్ల రోడ్లను ఈ సాంకేతికతతో నిర్మిస్తారు. పైలట్ ప్రాజెక్టుగా తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో గజ్జరం నుంచి హుకుంపేట వరకు 7.50 కిలోమీటర్ల మేర ఎఫ్డీఆర్ టెక్నాలజీతో రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డును పరిశీలించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ (సీఐఆర్) నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మెత్తటి నేలలున్న ప్రాంతాల్లో అదే టెక్నాలజీతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. -
5న విజయవాడకు రాష్ట్రపతి
సాక్షి, అమరావతి: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా డిసెంబర్ 5వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఆమె ఐదో తేదీ విజయవాడలో పర్యటిస్తారు. విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ రాష్ట్రంలో నిర్మించిన మూడు జాతీయ రహదారులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మరో జాతీయ రహదారి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి భవన్ సమాచారం ఇచ్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన పూర్తి షెడ్యూల్‌ను ఖారారు చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆర్ అండ్ బీ శాఖ రాష్ట్రపతి పర్యటన కోసం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రాయచోటి–అంగల్లు సెక్షన్ జాతీయ రహదారిని, జాతీయ రహదారి–205పై నాలుగు లేన్ల ఆర్వోబీ–అప్రోచ్ రోడ్లను, కర్నూలులోని ఐటీసీ జంక్షన్ వద్ద నిర్మించిన ఆరు లేన్ల గ్రేడ్ సెపరేటెడ్ నిర్మాణాలను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ముదిగుబ్బ–పుట్టపర్తి రహదారి విస్తరణ పనులకు భూమి పూజ చేస్తారు. -
AP: రూ.1,700 కోట్లు.. 6,150 కిలో మీటర్లు.. మరింత వేగవంతం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేసేందుకు ఆర్ అండ్ బి శాఖ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు రూ.1,700 కోట్లతో 6,150 కి.మీ.మేర రహదారుల పునరుద్ధరణ ప్రణాళికను ఖరారు చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటి పునరుద్ధరణకు తీసుకున్న రూ.3వేల కోట్ల రుణాన్ని కూడా ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పథకానికి మళ్లించడంతో పరిస్థితి మరింత దిగజారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్ల పునరుద్ధరణపై దృష్టిసారించింది. ఇందుకోసం తీసుకున్న రుణాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతా ద్వారా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తోంది. దీంతో నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా ప్రభుత్వం సరైన విధానాన్ని ఏర్పర్చింది. మొదటి దశ కింద రూ.2,205 కోట్లతో రాష్ట్రంలో 6,500 కి.మీ. మేర రోడ్ల పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇప్పటికే 85శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన 15శాతం పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తిచేయనుంది. దాంతో రెండో దశ కింద రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులపై ఆర్ అండ్ బి శాఖ జిల్లాల నుంచి ప్రతిపాదనలను తెప్పించుకుంది. ఆ ప్రతిపాదనలతో రెండో దశ ప్రణాళికను రూపొందించింది. రూ.1,700 కోట్లతో ప్రణాళిక ఇలా.. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మొత్తం 953 రోడ్లను రెండో దశలో పునరుద్ధరించాలని నిర్ణయించింది. వాటిలో రాష్ట్ర ప్రధాన రహదారులు 292, జిల్లా ప్రధాన రహదారులు 661 ఉన్నాయి. తద్వారా మొత్తం 6,150 కి.మీ. మేర రోడ్లను పునరుద్ధరిస్తారు. ఇందుకోసం రూ.1,700 కోట్లతో ప్రణాళికను ఖరారుచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ప్రధాన రహదారులకు రూ.673 కోట్లు, జిల్లా ప్రధాన రహదారులకు రూ.1,027 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. దీనికి ఆమోదముద్ర లభించిన తరువాత టెండర్ల ప్రక్రియ చేపడతారు. అనంతరం ఏడాదిలోగా పనులు పూర్తిచేయాలన్నది ఆర్ అండ్ బి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఆటంకాలున్నా.. అభివృద్ధి బాటే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, పునరుద్ధరణ, మరమ్మతుల పనులను సత్వరమే పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన వంతెనలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులను ప్రాధాన్యతగా చేపట్టి వేగంగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. జూలై 15వతేదీ కల్లా మునిసిపాలిటీల్లో రహదారులపై గుంతలు పూడ్చి ఆ వెంటనే జూలై 20 నాటికి అన్ని చోట్లా ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే రెండు లేన్ల రహదారుల పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గత సర్కారు హయాంలో రోడ్ల మరమ్మతుల కోసం ఐదేళ్లలో రూ.1,300 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు మూడేళ్లలోనే రూ.2,400 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగిపోవాలని ఏకైక అజెండాతో ప్రతిపక్షాలు పని చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ని ఆటంకాలు కల్పిస్తున్నా సడలని సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేలా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఆర్అండ్బీ.. పంచాయతీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో జరుగుతున్న రహదారుల పనులపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఆ వివరాలివీ... సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తేడా కచ్చితంగా కనిపించాలి రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మతుల పనులు చురుగ్గా సాగుతున్నాయి. నాడు – నేడు ద్వారా చేపట్టిన పనుల్లో మంచి పురోగతి కనిపిస్తోంది. గతంలో పనులు ప్రారంభమై ఆసంపూర్తిగా ఉన్న రోడ్లు, వంతెనలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లను పూర్తి చేసేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలి. వీటికి అత్యంత ప్రాధాన్యమిచ్చి ఎక్కడా పెండింగ్‌లో లేకుండా చూడాలి. వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఫలితాలు కచ్చితంగా కనిపించాలి. అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేయడమే కాకుండా గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలి. నివర్ తుపాను కారణంగా కొట్టుకుపోయిన ప్రాంతాల్లో కొత్త వంతెనల నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి. తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పనులు వెంటనే చేపట్టాలి. రూ.2,205 కోట్లతో మరమ్మతులు ఆర్ అండ్ బీ పరిధిలో రోడ్ల మరమ్మతులు, ప్రత్యేక పనుల కింద 7,804 కి.మీ. మేర 1,168 పనులు చేపట్టాం. వాటి కోసం ప్రభుత్వం రూ.2,205 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే 675 పనులు పూర్తి కాగా మరో 491 కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 62.09 శాతం పనులను రూ.1369 కోట్లతో ప్రభుత్వం పూర్తి చేసింది. మిగిలిన పనులు వీలైనంత త్వరగా పూర్తి కావాలి. నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (నిడా–1) కింద చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.2,479.61 కోట్లతో 233 పనులు చేపట్టాం. ఇప్పటికే రూ.1,321.08 కోట్ల విలువైనవి పూర్తి చేశాం. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలి. వ్యత్యాసాన్ని వెల్లడించేలా ఫొటో గ్యాలరీలు రోడ్ల నిర్మాణమే కాకుండా క్రమం తప్పకుండా నిర్వహణ, మరమ్మతులపై పంచాయతీరాజ్ శాఖ కార్యాచరణ సిద్ధం చేయాలి. 1,843 రోడ్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.1,072.92 కోట్లు ఖర్చు చేస్తోంది. తద్వారా 4,635 కి.మీ. మేర రహదారులు మెరుగుపడనున్నాయి. గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై దృష్టిపెట్టి ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలి. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో చురుగ్గా మరమ్మతులు చేపట్టాలి. మునిసిపాలిటీల్లో జూలై 15 కల్లా గుంతలు పూడ్చాలి. జూలై 20న నాడు – నేడు ద్వారా వ్యత్యాసాన్ని తెలియచేసేలా అన్ని చోట్లా ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలి. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) బూడి ముత్యాలనాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆర్ అండ్ బీ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌దండే, పురపాలక శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు రాష్ట్రంలో అభివృద్ధి పనులను ముందుకు సాగనివ్వకుండా కొందరు రకరకాల కుట్రలు పన్నుతున్నారు. కేసులు వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి పనులు ఆగిపోవాలనే ఏకైక అజెండాతో ప్రతిపక్షాలు పని చేస్తున్నాయి. అయినప్పటికీ సడలని సంకల్పంతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాం. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా నిధుల లోటు రాకుండా, చెల్లింపుల సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను పూర్తి చేస్తున్నాం. -
వేగంగా కొత్త వంతెనల నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నదులు, కాలువలు, వాగులు దాటడానికి పడవలు, బల్లకట్లు, పుట్టిలు వంటి ప్రమాదకర ప్రయాణాల నుంచి ప్రజలకు విముక్తి కలగనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వంతెనల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో రూ.2,205 కోట్లతో రహదారుల పునర్నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పుడు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రధాన, మైనర్ వంతెనల నిర్మాణాన్ని కూడా వేగంగా చేపడుతోంది. నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ (నిడా) రెండో దశ కింద రూ.262.36 కోట్లతో 25 వంతెనల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఒక్కోవంతెనతో కనీసం లక్ష మంది ప్రజలకు నదులు, వాగుల మీదుగా రాకపోకలు సులభంగా సాగించొచ్చు. రాష్ట్ర ప్రధాన రహదారుల్లో 16, జిల్లా ప్రధాన రహదారుల్లో 7, ఇతర రోడ్లపై రెండు వంతెనలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 8 వంతెనల నిర్మాణం వేగం పుంజుకుంది. మిగిలిన 17 వంతెనల పనుల కోసం ఆర్ అండ్ బి శాఖ త్వరలో టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభించనుంది. ► రాష్ట్ర ప్రధాన రహదారుల్లో రూ.87.22 కోట్లతో 16 వంతెనల నిర్మాణాన్ని ఆర్ అండ్ బి చేపట్టింది. వాటిలో ఆరు వంతెనల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటితోపాటు మిగతా 10 వంతెనల పనులను ఏడాదిలోగా పూర్తి చేయనున్నారు. ► జిల్లా ప్రధాన రహదారుల్లో రూ.162.95 కోట్లతో ఏడు వంతెనల నిర్మాణాన్ని చేపట్టింది. వాటిలో రెండు వంతెనల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మిగతా ఐదింటి పనులను ఆర్ అండ్ బి శాఖ త్వరలో ప్రారంభించనుంది. ► ఇతర రహదారుల్లో రూ.12.19 కోట్లతో రెండు వంతెనల నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. -
రూ.930 కోట్లతో ఆరు బైపాస్ రహదారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారులను అనుసంధానిస్తూ కొత్తగా ఆరు బైపాస్ రహదారులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలను అనుసంధానిస్తూనే బైపాస్ రహదారులు ఉండేవి. కొన్నేళ్లుగా పట్టణ ప్రాంతాలు విస్తరిస్తుండటం, సమీప గ్రామాల నుంచి ప్రజలు వచ్చి స్థిరపడటంతో జనాభా పెరుగుదల తదితర కారణాలతో ఆ ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరుగుతోంది. సమీపంలోని జాతీయ రహదారిని అనుసంధానిస్తూ పట్టణాలగుండా చాలా ఏళ్ల క్రితం నిర్మించిన రోడ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. దాంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా మొదటి దశలో ఆరు పట్టణాల్లో బైపాస్ రహదారులు నిర్మించాలని నిర్ణయించింది. జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఇటీవల ఖరారు చేసిన 2022–23 వార్షిక ప్రణాళికలో ఆ ఆరు బైపాస్‌లకు చోటు కల్పించారు. మొత్తం 64.20 కిలోమీటర్ల మేర రూ.930 కోట్లతో వీటిని నిర్మించనున్నారు. ఆర్ అండ్ బీ శాఖ త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఖరారు చేసి అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. డబుల్ లేన్ విత్ పావ్డ్ షోల్డర్స్‌గా 12 మీటర్ల వెడల్పుతో బైపాస్ రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. -
రోడ్ల పునరుద్ధరణ పనులు వేగవంతం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసిందని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) చెప్పారు. నాబార్డు నిధులతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా ఆయన సచివాలయంలో తన కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కృష్ణా జిల్లాలో ఏటిమొగ–ఎదురుమొండి ఐల్యాండ్‌ను అనుసంధానించే వంతెన, జగ్గయ్యపేట–సత్తెనపల్లి మధ్య మరో వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపే ఫైళ్లపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాబార్డు నిధులు రూ.1,158 కోట్లతో తొలి దశ పనులు చేపట్టామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతోనే రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు. 2019 ఎన్నికల ముందు రోడ్ల పునరుద్ధరణ కోసం కేంద్రం నుంచి తెచ్చిన రూ.3 వేల కోట్లను ఎన్నికల తాయిలాల కోసం టీడీపీ ప్రభుత్వం మళ్లించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్లకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతోందన్నారు. నిర్ణీత కాలంలో రోడ్ల పునరుద్ధరణ పనులను పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. -
రూ.2,205 కోట్లతో 8,268 కి.మీ. రోడ్ల పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా నిధులు కేటాయించి రోడ్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శంకర్‌నారాయణ చెప్పారు. రూ.2,205 కోట్లతో 8,268 కిలోమీటర్ల మేర రోడ్ల పునరుద్ధరణ కోసం 1,161 పనులు చేపట్టామని తెలిపారు. విజయవాడలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పనులను మే నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. 2010 నుంచి 2019 వరకు కాంగ్రెస్, చంద్రబాబు ప్రభుత్వాలు రోడ్ల నిర్వహణను గాలికొదిలేయడంతో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. గత రెండున్నరేళ్లలో భారీ వర్షాలతో రోడ్ల మరమ్మతుల్లో జాప్యం జరిగిందని చెప్పారు. దీంతో సీఎం జగన్ సమీక్షించి రోడ్ల పునరుద్ధరణ కోసం దిశానిర్దేశం చేశారని, ఆరు నెలలుగా పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు. ఇప్పటికే 118 పనులు పూర్తి రోడ్ల పునరుద్ధరణ పనుల్లో రూ.158 కోట్ల విలువైన 118 పనులు పూర్తికాగా రూ.697 కోట్ల విలువైన 343 పనులు దాదాపుగా పూర్తికావచ్చాయన్నారు. రూ.260 కోట్ల బిల్లులు చెల్లించామని, ప్లాన్ వర్క్స్ కోసం రూ.1,158.53 కోట్లను నాబార్డ్ నుంచి సమీకరించామని తెలిపారు. వాటిలో 182 పనులు పూర్తికాగా మిగిలిన 51 పనులను జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న వంతెనలకు ఎన్ఐడీఏ–2 పథకం కింద రూ.570.10 కోట్ల రుణం మంజూరుకు నాబార్డ్ సమ్మతించిందని తెలిపారు. రూ.486 కోట్ల నాబార్డు రుణంతో 14 రైల్, రోడ్ వంతెనల పనుల్ని పూర్తిచేస్తామన్నారు. వాటికి అదనంగా మరో 33 ఆర్వోబీలను నిర్మించాలని గుర్తించినట్లు తెలిపారు. వీటి నిర్మాణానికి రూ.1,980 కోట్లు కేంద్రం వెచ్చించనుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.440 కోట్ల భూసేకరణ వ్యయాన్ని భరిస్తుందని చెప్పారు. సీఆర్ఐఎఫ్ పథకం కింద రూ.2,049 కోట్లతో 1,670 కి.మీ. రోడ్ల రెండులేన్లుగా పేవ్డ్ షోల్డర్స్‌తో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రోడ్లకోసం తీసుకున్న రుణాన్ని టీడీపీ ప్రభుత్వం మళ్లించింది 2019 ఎన్నికల ముందు రోడ్ల పునరుద్ధరణ కోసం తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని టీడీపీ ప్రభుత్వం రాజకీయ ప్రచార పథకాల కోసం మళ్లించిందని మంత్రి విమర్శించారు. రోడ్ల నిర్వహణ, మరమ్మతుల కోసం ఏటా రూ.8 వేల కోట్లు వెచ్చించాల్సి ఉండగా టీడీపీ ప్రభుత్వం ఏటా కేవలం రూ.2 వేల కోట్లే కేటాయించిందన్నారు. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే రోడ్ల దుస్థితికి కారణమన్నారు. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణకు రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.10,360 కోట్లు వెచ్చించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఐదేళ్లలో కేంద్రం నుంచి రూ.10,660 కోట్లు తేగలిగితే.. సీఎం వైఎస్ జగన్ మూడేళ్లలోనే రూ.11,500 కోట్లను కేంద్రం నుంచి రాబట్టారని చెప్పారు. రాష్ట్రంలో రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ రోడ్ల పునరుద్ధరణ పనులను నాడు–నేడు విధానంలో డాక్యుమెంట్ చేసి రికార్డు చేస్తున్నామని చెప్పారు. -
AP: పనులన్నీ చకచకా.. ఉగాది నుంచే ప్రారంభం
సాక్షి, అమరావతి: నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2వతేదీ నుంచి కొత్త జిల్లాలు కేంద్రంగా పరిపాలన ప్రారంభించేందుకు చకచకా పనులు జరుగుతున్నాయి. తొలుత తాత్కాలిక కార్యాలయాల నుంచి పాలనా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన భవనాలు, ఖాళీ స్థలాలు, ప్రైవేట్ భవనాల కోసం ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని సబ్ కమిటీ ఇప్పటికే పూర్తి సమాచారాన్ని సేకరించింది. కొత్త జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోని స్థిరాస్తుల సమాచారంతో ఒక నివేదిక రూపొందించింది. ఈ వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపి పరిశీలించాలని సూచించింది. దీన్ని బట్టి కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, ఇతర జిల్లా కార్యాలయాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. చివరి ఆప్షన్‌గా ప్రైవేట్ భవనాలు.. నూతన జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన భవనాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. అవి లేని పక్షంలో చివరి ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ భవనాలను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. ఈ భవనాల్లో సివిల్, విద్యుత్ మరమ్మతులు, ఫర్నీచర్‌కు ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు తయారు చేయాలని పేర్కొంది. ఈ అంశాలన్నింటితో ఈ నెల 18వతేదీలోపు ప్రాథమిక ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లను ఆదేశించింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భవనాలను గుర్తించగా వాటిని పరిశీలించి ఏవి బాగుంటాయో నివేదికలో సూచించాలని స్పష్టం చేసింది. ఈ నెల 28వ తేదీకల్లా భవనాలకు సంబంధించిన నిర్మిత ప్రదేశం (ఎస్ఎఫ్టీ), ఇతర వివరాలను సమర్పించాలని నిర్దేశించింది. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు, జిల్లా పోలీసు కార్యాలయం, జిల్లా కోర్టుల నిర్మాణానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించాలని కలెక్టర్లకు సూచించింది. కడప, శ్రీకాకుళం జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లున్నాయి. వాటితోపాటు తెలంగాణలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్లను పరిశీలించారు. తెలంగాణలో 16 ఎకరాల్లో 1.56 లక్షల ఎస్ఎఫ్టీలో 18 కార్యాలయాలు పని చేసేలా కలెక్టరేట్లు నిర్మించారు. కడపలో 30 ఎకరాల్లో 4.71 ఎస్ఎఫ్టీలో 39 కార్యాలయాలు పనిచేసేలా కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. శ్రీకాకుళంలో 24 ఎకరాల్లో 3.34 ఎస్ఎఫ్టీలో 75 కార్యాలయాలు పనిచేసేలా కలెక్టరేట్ కాంప్లెక్స్ ఏర్పాటైంది. ఈ మూడింటిని పరిశీలించి ప్రతిపాదిత కొత్త జిల్లాల్లో 5 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో 30 కార్యాలయాలు పనిచేసేలా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఒక్కో కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.60 నుంచి రూ.70 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. వీటికి సంబంధించి మూడు రకాల ప్రాథమిక డిజైన్లను సబ్ కమిటీ రూపొందించింది. ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లు సిద్ధమయ్యేవరకు తాత్కాలిక కార్యాలయాల్లో కొత్త జిల్లాల కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. -
జిల్లా రహదారులకు మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జిల్లా, మండల ప్రధాన రహదారుల నిర్మాణం వేగం పుంజుకోనుంది. దాదాపు రూ.6,400 కోట్లతో ఆమోదించిన 2,512 కి.మీ. మేర రోడ్ల నిర్మాణానికి బాలారిష్టాలు తొలగిపోయాయి. ఇప్పటికే మొదటి దశ పనులు మొదలు పెట్టిన ఆర్‌అండ్‌బీశాఖ ఇక రెండో దశ టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు ఉద్యుక్తమవుతోంది. కాంట్రాక్టర్లకు తక్షణం బిల్లుల చెల్లింపు.. జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ నిధులను పూర్తిగా రోడ్ల నిర్మాణానికే వెచ్చించేందుకు కేంద్రం సూచించిన విధంగా ప్రత్యేక ఫండ్ అకౌంట్ ఏర్పాటు చేసింది. అందుకోసం కేంద్ర ఆర్థిక శాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (డీఈఏ) నుంచి అనుమతి పొంది ప్రత్యేక ఖాతాను తెరిచింది. దాంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు మరింత వేగవంతం కానుంది. పనులు పూర్తి చేసి బిల్లులు అప్లోడ్ చేయగానే ఆ ప్రత్యేక ఖాతాల నుంచి నేరుగా కాంట్రాక్టర్లకు బిల్లులు మొత్తం చెల్లిస్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణానికి తీసుకొచ్చిన రూ.3 వేల కోట్లను ఇతర అవసరాలకు మళ్లించారు. దాంతో రోడ్ల నిర్వహణ అధ్వానంగా తయారైంది. దీనికి పరిష్కారంగా ప్రత్యేక ఖాతాల్లో నిధులు జమ చేసి.. నేరుగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పారదర్శక విధానాన్ని అవలంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.6,400 కోట్లతో రెండు దశల్లో 2,512 కి.మీ. మేర జిల్లా, మండల ప్రధాన రహదారులను నిర్మించనున్నారు. మొదటి దశలో రూ.3,014 కోట్లతో 1,244 కి.మీ. రోడ్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే 60 కి.మీ. పనులు పూర్తి చేశారు. ఇక రెండో దశలో రూ.3,386 కోట్లతో 1,268 కి.మీ. మేర రహదారులను ఏప్రిల్‌నాటికి నిర్మిస్తారు. అందుకోసం ఆర్అండ్బీ శాఖ త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. -
ఇక రయ్.. రయ్..
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులు జోరందుకున్నాయి. వర్షాలు తగ్గగానే పనులు ప్రారంభిస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాట మేరకు ప్రస్తుతం ఎక్కడికక్కడ పనులు వేగంగా సాగుతున్నాయి. ఎక్కడా గతుకులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేలా ప్రభుత్వం రోడ్ల రూపురేఖలు మార్చేస్తోంది. రూ.2,205 కోట్లతో 1,147 రోడ్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రెండు దశల్లో కార్యాచరణను వేగవంతం చేసింది. విజయనగరం జిల్లాలో భీమసింగి–కొత్తవలస, విశాఖ జిల్లాలో పాడేరు ఏజెన్సీ రోడ్డు, సుజనకోట బీచ్ రోడ్డు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు– బేస్తవారిపేట రోడ్డు, చిత్తూరు జిల్లాలో దామలచెరువు– పులిచెర్ల రోడ్డు, వైఎస్సార్ జిల్లాలో కడప–రేణిగుంట రోడ్డు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పునరుద్ధరణ పనులు కొన్నిచోట్ల ఇప్పటికే పూర్తయ్యాయి. టీడీపీ ప్రభుత్వంలో నిర్వహణ నిధులను దారి మళ్లించడంతో తీవ్ర నిర్లక్ష్యానికి గురై దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ బాధ్యతను వైఎస్సార్సీపీ ప్రభుత్వం భుజానికెత్తుకుంది. గత రెండేళ్లలో భారీ వర్షాలతో రోడ్ల పునరుద్ధరణ పనుల్లో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రోడ్ల పునరుద్ధరణ పనులపై ఆర్ అండ్ బి శాఖకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. నేరుగా బ్యాంకుల నుంచే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు కోసం ప్రత్యేక అనుమతులు మంజూరు చేయడం ద్వారా సానుకూల వాతావరణం సృష్టించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పనులు ఊపందుకున్నాయి. మొదటి దశలో 328 రోడ్ల పునరుద్ధరణ రాష్ట్రంలో మొదటి దశలో రూ.603.68కోట్లతో రోడ్ల పునరుద్ధరణ కోసం 328 పనులకు ఆర్ అండ్ బి శాఖ టెండర్లు ఖరారు చేసింది. వర్షాకాలం ముగియడంతో నవంబరులో ఆ పనులు చేపట్టారు. వాటిలో ఇప్పటికే రూ.41.15 కోట్ల విలువైన రోడ్ల పునరుద్ధరణ పనులను పూర్తి చేశారు. వాటిలో 12 రాష్ట్ర రహదారులు, 15 జిల్లా ప్రధాన రహదారులు ఉన్నాయి. వాటికి సంబంధించిన బిల్లులను కూడా అప్లోడ్ చేశారు. దాంతో బ్యాంకులు నేరుగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనున్నాయి. మరో రూ.32.46 కోట్ల విలువైన రోడ్ల పునరుద్ధరణ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. వాటిలో 16 రాష్ట్ర రహదారులు, 19 జిల్లా ప్రధాన రహదారులు ఉన్నాయి. వెరసి రూ.73.61 కోట్ల పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. మిగిలిన రూ.530.07 కోట్ల పనులను ఈ వారంలో ప్రారంభించేందుకు కాంట్రాక్టర్లు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి దశలో మొత్తం రూ.603 కోట్ల పనులు ఫిబ్రవరి చివరికి పూర్తి చేయాలని ఆర్ అండ్ బి శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశ టెండర్లు త్వరలో ఖరారు రెండో దశ కింద 819 రోడ్ల పునరుద్ధరణకు ఆర్ అండ్ బి శాఖ సన్నాహాలు వేగవంతం చేసింది. అందుకోసం రూ.1,601.32 కోట్లతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టింది. ఆ టెండర్లను 2022 జనవరి రెండో వారంలోగా ఖరారు చేయనున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో పనులు ప్రారంభించి మే మొదటి వారానికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు కార్యాచరణను వేగవంతం చేశామని ఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ‘సాక్షి’కి తెలిపారు. పూర్తి నాణ్యతతో రోడ్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని త్వరలో రెండో దశ టెండర్లను కూడా ఖరారు చేసి వేసవి నాటికి పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ ఎండీ శ్రీనివాసరెడ్డి చెప్పారు. -
ఐదు రోడ్లు.. రెండు ఆర్వోబీలు.. ఓ వంతెన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే కార్యాచరణ ఊపందుకుంది. 2021–22 వార్షిక ప్రణాళికలో పనులను ఆర్అండ్బీ శాఖలోని జాతీయరహదారుల విభాగం వేగవంతం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు కేంద్రం గతంలో ఎన్నడూలేని రీతిలో ఆమోదించిన రూ.6,421కోట్ల వార్షిక ప్రణాళికలో పేర్కొన్న రోడ్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధమయ్యింది. అందులో భాగంగా రూ.1,048.50 కోట్లతో ఐదు రోడ్లు, రెండు ఆర్వోబీలు, పెన్నా నదిపై ఓ వంతెన నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖ టెండర్లు పిలిచింది. ఆ పనుల వివరాలిలా ఉన్నాయి. ► చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలో రెండు రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ)లు రూ.140కోట్లతో నిర్మిస్తారు. జాతీయ రహదారి–40 వద్ద, జాతీయ రహదారి–71 వద్ద ఒక్కోటి రూ.70కోట్లతో నిర్మిస్తారు. ► రూ.100 కోట్ల అంచనా వ్యయంతో నెల్లూరు సమీపంలోని జాతీయ రహదారి–67 మార్గంలో పెన్నా నదిపై కొత్త వంతెన నిర్మిస్తారు. ప్రస్తుతం పెన్నా నదిపై ఉన్న వంతెన 6.70మీటర్ల వెడల్పే ఉంది. దీంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పెన్నా నదిపై 2.68 కి.మీ. మేర కొత్త వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► తెలంగాణ సరిహద్దులోని ముదిరెడ్డిపల్లె నుంచి నెల్లూరు రహదారిలో భాగంగా 43 కి.మీ. మేర రెండు లేన్ల రోడ్డును పావ్డ్ సోల్డర్స్ (10 మీటర్ల వెడల్పు) అభివృద్ధి చేస్తారు. వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దు నుంచి నెల్లూరు జిల్లా సరిహద్దు వరకు రూ.300కోట్లతో రహదారి నిర్మిస్తారు. రోజుకు 4,500 వరకు పాసింజర్ కార్ యూనిట్ల ట్రాఫిక్ రద్దీ ఉన్న ఈ రహదారిని అభివృద్ధి చేయడంతో ప్రయాణం మరింత సౌలభ్యంగా మారుతుంది. ► రూ.318.50 కోట్ల అంచనా వ్యయంతో జాతీయ రహదారి 167బి మార్గంలో సీఎస్ పురం నుంచి మాలకొండ వరకు రెండు లేన్ల రోడ్డును పావ్డ్ సోల్డర్స్ (10 మీటర్ల వెడల్పు)తో అభివృద్ధి చేస్తారు. 44 కి.మీ.రహదారి నిర్మాణం వల్ల రోజుకు 6,900 పాసింజర్ కార్ యూనిట్ల ట్రాఫిక్ రద్దీ ఉండే ఈ మార్గంలో రాకపోకలు మరింత సౌలభ్యంగా మారతాయి. ► రూ.90కోట్ల అంచనా వ్యయంతో చిత్తూరు నగర పరిధిలో జాతీయ రహదారి–40, జాతీయ రహదారి–69ని అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి నిర్మించాలని నిర్ణయించారు. 6.80కి.మీ. మేర ఈ రహదారిపై రోజుకు12,500 పాసింజర్ కార్ యూనిట్ల ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. ఆ నాలుగు లేన్ల రహదారితో మన రాష్ట్రం నుంచి అటు చెన్నై ఇటు బెంగళూరుకు రాకపోకలకు సౌలభ్యంగా ఉంటుంది. ► చిత్తూరు జిల్లాలోని పుత్తూరు నుంచి ఉత్తుకొట్టై వరకు రహదారిని అభివృద్ధి చేస్తారు. 40 కి.మీ. మేర ఈ రహదారి పనుల కోసం రూ.50కోట్లు కేటాయించారు. ► రూ.50కోట్ల అంచనా వ్యయంతో చిలమత్తూరు–హిందూపూర్–పరిగి మార్గంలో 23.20 కి.మీ. మేర రెండు లేన్ల రోడ్డును పావ్డ్ సోల్డర్స్ (10 మీటర్ల వెడల్పు) విధానంలో అభివృద్ధి చేస్తారు. -
Andhra Pradesh: అగ్రవర్ణ పేదలకు దన్ను
రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం పలు ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్‌ల నిర్మాణం కోసం పర్యాటక శాఖకు భూముల అప్పగింతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణ, సంస్కృత, వేద పాఠశాలల ఏర్పాటు కోసం శారదా పీఠం, దత్త పీఠం, ఇస్కాన్ చారిటీస్లకు భూములను కేటాయించింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను ఆదుకోవడం కోసం ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) సంక్షేమం పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బ్రాహ్మణ, కాపు, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య తదితర వర్గాల్లో నిరుపేదలను ఆదుకోవడం కోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. జైన్లు, సిక్కుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. పద్మ, ఆది వెలమ సామాజిక వర్గాల్లోని నిరుపేదలను ఆదుకోవడం కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి వీలుగా ప్రతిపాదనను మంత్రివర్గం ముందు పెట్టాలని అధికారులను ఆదేశించింది. గురువారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: 'గంజాయి'పై కదిలిన గ్రామ చైతన్యం) కొలువుల జాతర ► వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 1285, వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లలో 560 ఫార్మసిస్టులు, వైద్య విద్య శాఖలో బోధన, నర్సింగ్, పారామెడికల్ విభాగాల్లో 2,190 వెరసి 4,035 ఉద్యోగాలను కొత్తగా సృష్టించి.. నియామకాలు చేపట్టడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ► వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 41,308 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2019 జూన్ నుంచి ఇప్పటిదాకా 26,917 మంది ఉద్యోగులను నియమించింది. మిగతా 14,391 ఉద్యోగుల నియామకాల్లో భాగంగా∙ఈ నిర్ణయం తీసుకుంది. బీసీ జన గణన ► 2021 జనాభా లెక్కల ఆధారంగా బీసీ జన గణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టే అధికారాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రికి అప్పగిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. ► దేశానికి స్వాతంత్య్రం రాక ముందు 1931లో మాత్రమే కులాల ప్రాతిపదికన జన గణన చేశారు. అందు వల్ల ఆ వర్గాల జనాభా ఎంతన్నది తేల్చలేకపోతున్నారు. ఈ దృష్ట్యా బీసీ జన గణన చేపట్టడం ద్వారా శాస్త్రీయంగా వర్గాల జనాభాను తేల్చి.. ఆ మేరకు ఆ వర్గాల ప్రజల అభ్యున్నతికి నిధులు కేటాయించవచ్చన్నది మంత్రివర్గం భావన. అమ్మ ఒడికి 75 శాతం హాజరు ► అమ్మ ఒడి పథకం కింద 2022 జూన్‌లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2021 నవంబర్ 8 నుంచి 2022 ఏప్రిల్ 30 వరకు పాఠశాలల్లో 130 పని దినాల్లో 75 శాతం హాజరు ఉంటేనే ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ► 2019–20, 2020–21 విద్యా సంవత్సరాల్లో కరోనా ప్రభావం వల్ల హాజరు శాతం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ పథకం స్ఫూర్తిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు ► వృద్ధాప్య పెన్షన్, ఇంటి స్థలం, వైఎస్సార్ ఆసరా, చేయూత.. తదితర ఏ సంక్షేమ పథకం కిందైనా అర్హత ఉండి.. లబ్ధి చేకూరని వారితో జనవరి నుంచి మే వరకు దరఖాస్తు తీసుకుంటారు. వాటిని పరిశీలించి.. అర్హత ఉన్నట్లు తేలితే జూన్‌లో ప్రయోజనం చేకూర్చుతారు. ► ఇదే రీతిలో జూలై నుంచి నవంబర్ వరకు దరఖాస్తులు స్వీకరించి.. అర్హత ఉన్న వారికి డిసెంబర్లో లబ్ధి కల్పిస్తారు. పర్యాటక రంగ అభివృద్ధి దిశగా.. ► రాష్ట్రంలో పర్యాటక రంగ విస్తరణకు మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా పేరూరు, విశాఖ జిల్లా అన్నవరం, వైఎస్సార్ జిల్లా గండికోట, చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్, తూర్పుగోదావరి జిల్లా పిచ్చుకలంకలో.. మొత్తంగా ఈ 5 ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్‌ల నిర్మాణానికి పర్యాటక శాఖకు భూమి అప్పగింతకు మంత్రివర్గం ఆమోదం. ఈ ఐదు చోట్ల రూ.1,350 కోట్లతో ఓబెరాయ్ విలాస్ పేరుతో ఒబెరాయ్ సంస్థ 7 స్టార్ సదుపాయాలతో లగ్జరీ రిసార్టులను నిర్మించనుంది. తద్వారా 10,900 మందికి ఉద్యోగాలు వస్తాయి. ► భీమిలిలో రూ.350 కోట్లతో మరో టూరిజం ప్రాజెక్ట్. 7 స్టార్ సదుపాయాలతో రిసార్ట్ నిర్మాణం. 5500 మందికి ఉద్యోగాల కల్పన. ► తిరుపతిలో రూ.250 కోట్లతో టూరిజం ప్రాజెక్ట్. తద్వారా 1500 మందికి ఉద్యోగాలు. ► చిత్తూరు జిల్లా కొత్తకోటలో రూ.250 కోట్లతో మరో ప్రాజెక్టుకు, తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలో రూ.250 కోట్లతో మరో టూరిజం ప్రాజెక్టుకు ఆమోదం. విశాఖ జిల్లా శిల్పారామం బీచ్ వద్ద, తాజ్ వరుణ్ బీచ్ వద్ద టూరిజం ప్రాజెక్టులకు ఆమోదం. విజయవాడలో పార్క్ హయత్ ప్రాజెక్టుకు ఆమోదం. వీటికి పర్యాటక విధానం కింద రాయితీలకు అంగీకారం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆన్లైన్లో సినిమా టికెటింగ్ ఆంధ్రప్రదేశ్ సినిమాల రెగ్యులేషన్ చట్టం–1955 సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇండియన్ రైల్వే ఆన్లైన్ టికెట్ వ్యవస్థ తరహాలో సినిమా టికెట్లను ఆన్లైన్లో జారీ చేయడానికి పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసి, ఈ సంస్థే నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1094 థియేటర్లు ఉన్నాయి. వాటిలో ఫోన్‌కాల్, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యం ప్రేక్షకులకు కల్పించనుంది. థియేటర్ల వద్ద ట్రాఫిక్ అవాంతరాలను తొలగించడానికి, ప్రేక్షకులకు సమయం ఆదా చేయడానికి, పన్నులు ఎగ్గొట్టడాన్ని నివారించడానికి ఈ విధానం దోహదపడుతుంది. (చదవండి: ఆ.. నకిలీ సిగరెట్లు ఎవరివో? ) మరిన్ని కీలక నిర్ణయాలు ఇలా.. ► రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైన నవంబర్ 1న వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుల ప్రదానం. ► పాల సేకరణలో వినియోగిస్తున్న పరికరాలు, వస్తువుల తనిఖీ బాధ్యతలు, విధులు తూనికలు కొలతల శాఖ నుంచి పశుసంవర్ధక శాఖకు బదిలీ. వాటిని తనిఖీ చేసే అధికారం పశు వైద్యులకు అప్పగింత. ► సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు. ఇందులో కొత్తగా 19 మంది ఉద్యోగుల నియామకానికి అనుమతి. ► వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటలు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఏటా 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్ రూ.2.49కే కొనుగోలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి ఆమోదం. 25 ఏళ్ల పాటు ఈ సంస్థ విద్యుత్‌ను సరఫరా చేయనుంది. తద్వారా ఏటా రూ.2 వేల కోట్లు ఆదా. ► విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలసలో విశాఖ శారదా పీఠానికి 15 ఎకరాలు కేటాయింపు. సంస్కృత పాఠశాల, వేద విద్య పాఠశాల సహా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణకు ఈ భూమిని శారదాపీఠం వినియోగించనుంది. మార్కెట్ విలువ ప్రకారం ఎకరా రూ.1.5 కోట్ల చొప్పున కేటాయించింది. ► అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మపర్తి గ్రామంలో గుండ్లూరు జయలక్ష్మి నరసింహ శాస్త్రి ట్రస్టు(దత్తపీఠం) కు 17.49 ఎకరాలు కేటాయింపు. ఈ ట్రస్టు ఇక్కడ వేద పాఠశాల, సంస్కృత పాఠశాల ఏర్పాటు చేయనుంది. ► అనంతపురం జిల్లా పెనుకొండలో ఇస్కాన్ ఛారిటీస్ ఆధ్వర్యంలో జ్ఞానగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పాదప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకు లీజు ప్రాతిపదికన 75 ఎకరాల భూమి కేటాయింపు. ► చిత్తూరు జిల్లా నగరిలో ఏరియా ఆసుపత్రి కోసం ప్రభుత్వ భూమి మార్పిడికి ఆమోదం. ► విజయనగరం ఇంజనీరింగ్ కళాశాల స్థానంలో గురజాడ జేఎన్టీయూ.. ప్రకాశం జిల్లాలో ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆర్డినెన్స్ జారీకి గ్రీన్ సిగ్నల్. ► కర్నూలు జిల్లాలో సిల్వర్ జూబ్లీ కళాశాల నేతృత్వంలో క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటుకు దిన్నెదేవరపాడు వద్ద 50 ఎకరాల కేటాయింపు. ► కృష్ణా జిల్లా నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 7 ఎకరాల కేటాయింపు. ► వాసవి కన్యకాపరమేశ్వరి చౌల్ట్రీలు, అన్నదాన సత్రాల నిర్వహణ దేవదాయ శాఖ నుంచి తప్పించి, ఆర్యవైశ్యులకే అప్పగింత. (పాదయాత్రలో హామీ మేరకు) ► విశాఖపట్నం జిల్లా మధురవాడలో 200 మెగావాట్ల డేటా సెంటర్ పార్క్, బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు అదానీ ఎంటర్‌ప్రైజస్‌కు 130 ఎకరాల భూమి కేటాయింపు. ఇందులో ఆ సంస్థ రూ.14,634 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా 24,990 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ► వైఎస్సార్ కడప జిల్లాలో రూ.227.1 కోట్ల వ్యయంతో ఐదు ఎత్తిపోతల ద్వారా హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల నుంచి చెరువులను నింపేందుకు ఆమోదం. ► మూడు కొత్త ఆక్వాకల్చర్ ప్రాజెక్టుల కోసం 6 రెగ్యులర్ పోస్టులు డిప్యూటేషన్ పద్ధతిలో, 67 పోస్టులు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీకి అనుమతి. ► మండలి, శాసనసభల్లో కొత్త విప్‌లు వెన్నపూస గోపాల్‌రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డిలకు కొత్త పేషీల ఏర్పాటు, సిబ్బంది నియామకానికి ఆమోదం. ► మావోయిస్టులతోసహా నిషేధిత సంస్థలపై నిషేధం మరో ఏడాది పొడిగింపు. ► వాడరేవు వద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు ఆమోదం. రూ.2205 కోట్లతో రోడ్లకు మరమ్మతులు రాష్ట్రంలో ఆర్ అండ్ బీ పరిధిలోని రహదారుల మరమ్మతులను మంత్రివర్గం సమీక్షించింది. గతంలో ఏడాదికి స్టేట్ హైవేల మరమ్మతుకు రూ.300 కోట్లు, ఎండీఆర్ రోడ్ల మరమ్మతులకు రూ.వంద కోట్లు వెరసి రూ.400 కోట్లు ఖర్చు చేసేవారని అధికారులు వివరించారు. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని 46 వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లలో 8 వేల కిలోమీటర్ల మేర రోడ్లకు మరమ్మతులు చేయాలన్నారు. ఇందుకు రూ.2,205 కోట్లతో 1,176 పనులు చేపట్టామని చెప్పారు. ఇప్పటికే 40% పనులకు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లకు అప్పగించామని, రాయలసీమలో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.. మిగిలిన 60 శాతం పనులకు నవంబర్‌లోగా టెండర్లు పూర్తి చేసి.. డిసెంబర్లో పనులు ప్రారంభించి.. వచ్చే మే లోగా పనులు పూర్తి చేయాలని మంత్రివర్గం అధికారులకు దిశానిర్దేశం చేసింది. (చదవండి: పర్యావరణహితంగా ‘వైఎస్సార్ స్టీల్’) -
AP: 1,200 కి.మీ. రోడ్లకు గులాబ్ దెబ్బ
సాక్షి, అమరావతి: గులాబ్ తుపాను రాష్ట్రంలో రోడ్లను దెబ్బకొట్టింది. తుపాను తీవ్రతకు రాష్ట్రంలో 5 జిల్లాల్లో దాదాపు 1,200 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టు రహదారులు, భవనాలశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ శాఖ అధికారుల బృందాలు తుపానుకు దెబ్బతిన్న రోడ్లను రెండు రోజులుగా పరిశీలిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 306 కిలోమీటర్లు, విజయనగరం జిల్లాలో 122, విశాఖపట్నం జిల్లాలో 355, పశ్చిమ గోదావరి జిల్లాలో 280, కృష్ణాజిల్లాలో 130 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతోపాటు ఈ జిల్లాల్లో 100 వరకు కల్వర్టులు, మోరీలు దెబ్బతిన్నాయి. ఆర్ అండ్ బీ శాఖ అధికారులు రెవెన్యూ, పోలీసు శాఖలతో కలిసి ప్రస్తుతానికి రోడ్లపై రాకపోకలను పునరుద్ధరించారు. రోడ్ల తక్షణ మరమ్మతుల కోసం రూ.50 కోట్లు అవసరమని, పూర్తిస్థాయిలో మరమ్మతులకు మరో రూ.300 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. అధికారుల బృందాలు రెండు రోజుల్లో తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే రోడ్లకు తక్షణ మరమ్మతులు చేపడతారు. అనంతరం పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టనున్నారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు తక్షణం మరమ్మత్తులు: మంత్రి పెద్దిరెడ్డి వర్షాల కారణంగా దెబ్బతిన్న గ్రామీణ రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం సచివాలయంలో పంచాయతీరాజ్ రహదారులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే రహదారులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఇప్పటికే సీఎం జగన్ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన పనులపై నివేదికలను తక్షణం సిద్ధం చేయాలని సూచించారు. మండలాల్లో అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాల్సిన రోడ్లను గుర్తించాలని, గతంలో ప్రారంభించి అసంపూర్తిగా ఉండిపోయిన రహదారులను పూర్తిచేయాలని సూచించారు. తాజాగా తుపాను ప్రభావిత జిల్లాల్లో రహదారులకు ఆర్థిక చేయూత కోరేందుకు కేంద్ర ప్రభుత్వానికి నష్టం తీవ్రతను తెలిపే నివేదికలను పంపాలని ఆదేశించారు. తాజాగా చేపట్టబోయే రహదారుల నిర్మాణం, మరమ్మతుల్లో నాణ్యత విషయంలో రాజీపడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఈఎన్సీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
సకాలంలో రహదారుల నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల మరమ్మతుల పనుల కోసం పిలిచిన టెండర్లను జూలై 15 నాటికి ఖరారు చేసి పనులు ప్రారంభించాలని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శంకర్ నారాయణ అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులతో విజయవాడలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్ అండ్ బీ శాఖలో వివిధ పథకాల కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఎన్టీబీ మొదటి దశ, రెండో దశ కింద చేపట్టాల్సిన పనులకు వెంటనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాడు–నేడు కింద ప్రాథమిక ఆసుపత్రులు, ఇతర ఆసుపత్రుల భవనాల మరమ్మతులు, ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం పనుల ఒప్పందాలను త్వరిత గతిన ఖరారు చేయాలన్నారు. రహదారుల పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఈఎన్సీలు వేణుగోపాల్‌రెడ్డి, ఇనయతుల్లా, పలువురు చీఫ్ ఇంజనీర్లు, అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు. -
యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 7,969 కి.మీ. మేర రహదారులకు ప్రత్యేక మరమ్మతు పనులు చేపట్టేందుకు వారంలోగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించింది. నెలలోగా టెండర్ల ప్రక్రియ మొత్తం పూర్తిచేసి కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలతో అగ్రిమెంట్లు కుదుర్చుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రూ.2,205 కోట్లతో రాష్ట్రంలో 7,969 కి.మీ. మేర రహదారులకు ప్రత్యేక మరమ్మతులు చేపట్టేందుకు ఇటీవలే పరిపాలన అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థికఏడాదిలో కురిసిన భారీ వర్షాలు, తుపాన్లకు రహదారులు బాగా దెబ్బతిన్నాయి. గతేడాది రూ.1,000 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టడంతో రహదారులు ప్రయాణానికి అనుకూలంగా మారాయి. అయితే మళ్లీ ఈ మరమ్మతులు లేకుండా రెన్యువల్ లేయర్ వేసేందుకు రూ.2,205 కోట్ల నిధులు కేటాయించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా 13 జిల్లాల పరిధిలోని 2,726 కి.మీ. రాష్ట్ర రహదారులకు రూ.923 కోట్లు, 5,243 కి.మీ. జిల్లా ప్రధాన రహదారులకు రూ.1,282 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేయాలని నిర్ణయించారు. రూ.2 కోట్ల లోపు పనులకు జిల్లా పరిధిలోనే టెండర్లు రూ.2 కోట్ల లోపు విలువైన పనులకు జిల్లా పరిధిలోనే సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహిస్తారు. రూ.2 కోట్ల కంటే ఎక్కువ విలువైన మరమ్మతు పనులకు రాష్ట్ర స్థాయిలో చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో టెండర్లు జరుగుతాయి. అయితే జిల్లా, రాష్ట్ర స్థాయి పనులకు రివర్స్ టెండర్లు జరుగుతాయి. ఏప్రిల్ నెలలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, మే నెలలోగా మరమ్మతు పనులు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డీసీ) ఎండీ శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
రహదారుల విస్తరణకు ఒప్పందాలు పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) సంయుక్త నిధులు రూ.1,860 కోట్లతో చేపట్టే రహదారుల అభివృద్ధి పనులకు ఒప్పందాలు పూర్తయ్యాయి. రెండేళ్లలో రహదారుల విస్తరణ పనులను పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం 12 కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇవి ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో 13 జిల్లాల్లో 1,200 కి.మీ. మేర రోడ్ల విస్తరణ చేపట్టనున్నాయి. 13 జిల్లాల్లో మూడు ప్యాకేజీల కింద ఎన్డీబీ టెండర్లను గతేడాది నవంబర్‌లో పూర్తి చేశారు. రివర్స్ టెండర్లు నిర్వహించగా.. రూ.81.58 కోట్లు ఆదా అయిన సంగతి తెలిసిందే. ఏటా 11.8 శాతం ట్రాఫిక్ వృద్ధి ఏపీలో ఏటా 11.8 శాతం ట్రాఫిక్ వృద్ధి చెందుతోందని ఎన్డీబీ సర్వేలో వెల్లడైంది. ఇందుకు తగ్గట్టుగా రోడ్ల విస్తరణ, వంతెనల పునర్నిర్మాణ పనులకు రుణ సాయం అందించేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. విడతలవారీగా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీబీ మొత్తం రూ.6,400 కోట్లను రహదారుల విస్తరణ పనులకు కేటాయించనున్నాయి. రాష్ట్రంలో ఏపీ మండల కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (ఏపీఎంసీఆర్‌సీఐపీ), ఏపీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టు (ఏపీఆర్‌బీఆర్‌పీ)లకు ఎన్డీబీ రుణ సాయం అందించనుంది. రెండో విడత రహదారి విస్తరణ పనుల కోసం త్వరలో టెండర్లను నిర్వహించనున్నారు. 145 ఎకరాల భూమి అవసరం 13 జిల్లాల్లో తొలి విడతలో చేపట్టే రహదారుల అభివృద్ధికి 145 ఎకరాల భూమి అవసరం. దీనికోసం ఇప్పటికే అన్ని జిల్లాల్లోని రెవెన్యూ యంత్రాంగానికి ఆర్అండ్బీ ఎస్ఈలు లేఖ రాశారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి అప్పగిస్తే ఏప్రిల్‌లో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు. కాగా, భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30.88 కోట్లను కేటాయించింది. రెండేళ్లలో పనులు పూర్తి చేయాల్సిందే.. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు నిబంధనల ప్రకారం రోడ్ల విస్తరణ పనులను 2023 కల్లా పూర్తి చేయాల్సిందే. ఏప్రిల్‌లో పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టు సంస్థలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందాలు పూర్తయ్యాయి. భూసేకరణకు రెవెన్యూ యంత్రాంగం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. – వేణుగోపాలరెడ్డి, ఆర్అండ్బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ -
సాగిపోదాం.. సాఫీగా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల రూపు మారుతోంది. వేలకోట్ల రూపాయలతో విస్తరణ, మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. ప్రస్తుతం రూ.5 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇందులో రూ.4,316 కోట్లతో రహదారుల విస్తరణ, రూ.684 కోట్లతో రోడ్ల నిర్వహణ, ప్రత్యేక మరమ్మతులు చేపట్టారు. ఇవికాకుండా రూ.2,168 కోట్లతో 7,116 కి.మీ. మేర రోడ్లు, వంతెనలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ఇటీవల ఆర్ అండ్ బీ శాఖ సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్లపై ఎక్కడా గుంతలు కనిపించకూడదని సూచించారు. ఇందుకు మూడువేల కిలోమీటర్ల రోడ్లకు రూ.303 కోట్లు అవసరమని ఆర్ అండ్ బీ శాఖ ఆర్థికశాఖకు ప్రతిపాదించింది. డిసెంబరు నాటికల్లా వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై గుంతల్ని పూడ్చేందుకు ఆర్ అండ్ బీ శాఖ ప్రణాళిక రూపొందించింది. రోడ్ల మరమ్మతుల పర్యవేక్షణకు ప్రభుత్వం సీఈలు, ఎస్ఈలను నియమించింది. గ్రామీణ రహదారుల కోసం రూ.1,089 కోట్ల మేర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ పథకం కింద సాయమందించాలని నాబార్డును కోరారు. మరోపక్క రూ.6,400 కోట్లతో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) రుణ సాయంతో రహదారుల ప్రాజెక్టులు చేపడుతున్న విషయం తెలిసిందే. జిల్లా ప్రధాన రహదారులకు ప్రాధాన్యం ► జిల్లా ప్రధాన రహదారులకు ప్రాధాన్యం దక్కనుంది. మొత్తం మరమ్మతులు చేసే మూడువేల కి.మీ.లలో 2,060 కి.మీ. మేర జిల్లా ప్రధాన రహదారులకు రూ.197 కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదించారు. 940 కి.మీ. రాష్ట్ర రహదారులకు రూ.106 కోట్లు కేటాయించనున్నారు. ► రాష్ట్ర రహదారులపై ప్యాసింజర్ కార్ యూనిట్లు (పీసీయూ) రోజుకు 6 వేలు దాటిన వాటిని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని రోడ్ల నిర్వహణ చేపట్టనున్నారు. ► గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో రోడ్లు విస్తరణ, మరమ్మతులకు రూ.4,150 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ► 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లలో గ్రామీణ రహదారుల కోసం రూ.2,748.21 కోట్ల బడ్జెట్ కేటాయించినా రూ.2,103.34 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ► ఆర్ అండ్ బీకి కేటాయించిన నిధుల్ని వేరే పథకాలకు మళ్లించారు. రోడ్ల మరమ్మతులకు రూ.122 కోట్లు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న గ్రామీణ రోడ్లకు రూ.122.15 కోట్లతో మరమ్మతులు చేయడానికి పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సెప్టెంబర్, అంతకు ముందు కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 207 రోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. 28 చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగే రీతిలో ఆ రోడ్లకు గండ్లు పడ్డాయి. అన్ని జిల్లాల ఎస్ఈలు దెబ్బతిన్న రోడ్ల వివరాలు పంపినట్టు ఈఎన్సీ సుబ్బారెడ్డి తెలిపారు. ► గండ్లు పూడ్చివేతతోపాటు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నచోట అత్యవసరంగా రూ.10.25 కోట్లతోను, ఆయా రోడ్లకు రూ.111.90 కోట్లతో పూర్తిస్థాయిలోను మరమ్మతులు చేయాలని ప్రతిపాదించారు. ► కర్నూలు జిల్లాలో ఏడుచోట్ల పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్ విభాగం పరిధిలోని భవనాలు, వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు పాఠశాలల ప్రహరీలు వర్షాలకు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు రూ.1.55 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విశాఖ జిల్లాలో పాడేరు నుంచి సుజనాకోట వరకు రూ.20 కోట్లతో రహదారి పనులు జరుగుతున్నాయి. పెదబయలు మండలం దూడకోట పంచాయతీ కేంద్రం నుంచి అత్యంత మారుమూల జాముగూడ వరకు రూ.13.21 కోట్లతో రోడ్డు నిర్మిస్తున్నారు. ఒడిశా సరిహద్దులో కెందుగూడ వరకు, ముంచంగిపుట్టు మండలం మారుమూల లబ్బూరు జంక్షన్ నుంచి మారుమూల గ్రామం బుంగాపుట్టు వరకు రూ.14 కోట్లతో రోడ్డు నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట–దోన్బాయి–వీరఘట్టం వరకు 25 కి.మీ. రోడ్డు నిర్మాణాన్ని రూ.24 కోట్లతో చేపట్టారు. డిసెంబర్‌కల్లా రాష్ట్రంలో గుంతల్లేని రహదారులు వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ప్రాధాన్యత క్రమంలో రోడ్లను నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందించాం. వాహనాల రద్దీ ఎక్కువ ఉండే రోడ్లు గుర్తించి వాటి మరమ్మతులు, నిర్వహణ చేపడుతున్నాం. డిసెంబర్ నాటికల్లా రోడ్ల నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. గ్రామీణ రహదారులను విస్తరించడం, నిర్వహణ కోసం నాబార్డుకు ప్రతిపాదనలు పంపించాం. రూ.1,089 కోట్ల ప్రతిపాదనల్లో రూ.440 కోట్లతో రోడ్ల నిర్వహణ చేపట్టే ప్రణాళికలున్నాయి. – వేణుగోపాల్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ -
రూ.15,591 కోట్ల ప్రాజెక్టులకు 16న శంకుస్థాపనలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.7,584.68 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శంకుస్థాపన, రూ.8,007.22 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కార్యక్రమాలను ఈ నెల 16న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి శంకర నారాయణ శనివారం తెలిపారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం వైఎస్ జగన్‌లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గత నెల 18వ తేదీన ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా, కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా సోకడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. ► ఏపీలో 878.4 కి.మీ. మేర కొత్తగా జాతీయ రహదారుల్ని రూ.7,584.68 కోట్లతో నిర్మించనున్నారు. రూ.8,007.22 కోట్లతో పూర్తయిన 532.696 కి.మీ. మేర రహదారుల నిర్మాణం, ఆర్వోబీలను జాతికి అంకితం చేయనున్నారు. అంటే మొత్తంగా ఈ ప్రాజెక్టుల విలువ రూ.15,591.9 కోట్లు. కాగా, మొత్తం రహదారులు 1,411.096 కిలోమీటర్లు. మొత్తం 16 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పది ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. ► శంకుస్థాపనలు జరిగే 16 ప్రాజెక్టుల్లో.. రూ.2,225 కోట్లతో చేపట్టనున్న రేణిగుంట– నాయుడుపేట ఆరులేన్ల రహదారి, రూ.1,225 కోట్లతో చేపట్టనున్న విజయవాడ బైపాస్, రూ.1,600 కోట్లతో నిర్మించనున్న గొల్లపూడి–చినకాకాని ఆరు లేన్ల రహదారితోపాటు కృష్ణా నదిపై మేజర్ బ్రిడ్జి ముఖ్యమైనవి. ► జాతికి అంకితం చేసే ప్రాజెక్టుల్లో.. రూ.2,075 కోట్లతో నిర్మించిన కడప–మైదుకూరు–కర్నూలు నాలుగు లేన్ల రహదారి (ఎన్‌హెచ్–40), రూ.1,470 కోట్లతో చేపట్టిన విజయవాడ–మచిలీపట్నం నాలుగు లేన్లు (బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్‌తో కలిపి), రూ.1,100 కోట్లతో చేపట్టిన నలగంపల్లి–ఏపీ/కర్ణాటక సరిహద్దు నాలుగు లేన్లు, రూ.1,470 కోట్లతో నిర్మించిన రణస్థలం–ఆనందపురం ఆరు లేన్ల రోడ్డు, రూ.501 కోట్లతో చేపట్టిన కనకదుర్గ గుడి ఆరు లేన్ల ఫ్లై ఓవర్ ముఖ్యమైనవి. -
నెలాఖర్లో ఎన్డీబీ రీ టెండర్లు
సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపడుతున్న రహదారుల నిర్మాణానికి సంబంధించిన రీటెండర్ల ప్రక్రియను ఆర్ అండ్ బీ శాఖ ఈ నెలాఖరున నిర్వహించనుంది. రద్దయిన టెండర్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మళ్లీ జారీచేయనున్నారు. ఈలోపు రీటెండర్లలో ఎక్కువ కాంట్రాక్టు సంస్థలు పాల్గొనేలా అధికారులు అర్హత ఉన్న కాంట్రాక్టర్లతో సంప్రదింపులు జరుపుతారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లతో వెబినార్, ఈ–మెయిళ్ల ద్వారా చర్చించాలని నిర్ణయించారు. ఎన్డీబీ సహకారంతో మొత్తం రూ.6,400 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణానికి సంబంధించి.. తొలిదశలో రూ.1,860 కోట్లతో 13 ప్యాకేజీలకు ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. ఒక వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా రాస్తున్న అసత్య కథనాలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ శనివారం ఆర్ అండ్ బీ ముఖ్య అధికారులతో టెండర్ల విషయమై సమీక్షించారు. టెండర్లలో పోటీతత్వం పెంచాలని.. పారదర్శకత ప్రతిబింబించాలని, ప్రజల్లో ఎక్కడా అనుమానాలకు ఆస్కారం ఇవ్వకూడదని ఆయన ఆదేశించడంతో టెండర్లు రద్దయిన సంగతి తెలిసిందే. కాగా, టెండర్లలో ఎక్కువ సంస్థలు పాల్గొని ఎక్కవ సంఖ్యలో బిడ్లు వేస్తే ఆ మొత్తంతోనే ఇంకొన్ని ఎక్కువ రహదారులు నిర్మించవచ్చు. రీటెండర్ల విధివిధానాలివే.. ► బ్యాంక్ గ్యారెంటీ కోసం కాంట్రాక్టు సంస్థలు హార్డ్ కాపీ ఇవ్వాలి. ► జ్యుడీషియల్ ప్రివ్యూ సూచనల మేరకు జాతీయ బ్యాంకుల నుంచి మాత్రమే బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వాలి. ► చిన్న కంపెనీలు కూడా టెండర్లలో పాల్గొనేందుకు వీలుగా జాయింట్ వెంచర్ కంపెనీలకు అవకాశం ఉంది. ► విదేశీ రుణంతో చేపట్టే ఏ ప్రాజెక్టు అయినా.. ప్రపంచ బ్యాంకు బిడ్డింగ్ విధానం అనుసరించాల్సిందే. ► ఏపీలో రాజమండ్రి–విజయనగరం హైవే ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ ప్రపంచ బ్యాంకు బిడ్డింగ్ విధానమే అనుసరిస్తోంది. నిజానికి టెండర్ల రద్దు అక్కర్లేదు ► ఇప్పటికే దాఖలైన బిడ్లతో ముందుకు వెళ్లొచ్చు. రద్దు చేయవలసిన అవసరంలేదు. ఎన్డీబీ కూడా ప్రస్తుత బిడ్లపై సంతృప్తి వ్యక్తంచేసింది. గతంలో కూడా ఎక్కువ విలువ ఉన్న పనుల్లో కొన్ని సంస్థలే పాల్గొన్నాయి. విజయవాడ బైపాస్ రోడ్డు పనుల్లో కూడా ఒకటి, రెండు సంస్థలే పాల్గొన్నాయి. కానీ, పారదర్శకత కోసమే ప్రభుత్వం రీటెండర్లకు ఆదేశించింది. -
రోడ్డు ప్రమాదాలకు.. డెమో కారిడార్లతో చెక్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కళ్లెం వేసేందుకు అన్ని జిల్లాల్లో డెమో కారిడార్లు ఏర్పాటుచేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. 2020 నాటికి ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలంటే ఈ కారిడార్ల నిర్మాణం ఒక్కటే మార్గమని అభిప్రాయపడింది. దీంతో రహదారులు, భవనాల శాఖ సహకారంతో వీటిని చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. మొత్తం 13 జిల్లాల్లో వెయ్యి కిలోమీటర్ల మేర వీటిని ఏర్పాటుచేసేందుకు అధ్యయనం చేయాలని ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానించింది. రెండు నెలల్లో ఇందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని రోడ్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సూచించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ కారిడార్లు ఏర్పాటుచేయాలనే అంశంపై రవాణా, ఆర్ అండ్ బీ శాఖలు సంయుక్తంగా నివేదిక రూపొందిస్తాయి. ఏ జిల్లాల్లో ఏ రహదారిపై అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో.. ఈ నివేదికలో పొందుపర్చాలని ఆయా జిల్లాల్లో రోడ్ సేఫ్టీ కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లను రవాణా శాఖ కోరింది. మరో నాలుగుచోట్ల కూడా.. కడప, అనంతపురం జిల్లాలకు మరో డెమో కారిడార్‌ను ప్రతిపాదించారు. దీనిని రాజంపేట–రాయచోటి–కదిరి మధ్య ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అలాగే, అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న గుంటూరు జిల్లా కొండమోడు–పేరేచర్ల.. కృష్ణా జిల్లా విజయవాడ–పునాదిపాడు, నూజివీడు–పశ్చిమగోదావరిలోని భీమవరం వరకు కూడా ప్రతిపాదించారు. వీటితోపాటు ఇతర ప్రమాదకర రహదార్లను గుర్తించి ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనలు పంపించాలని రవాణా శాఖ ఇప్పటికే కోరింది. డెమో కారిడార్ అంటే.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ఓ రహదారిని ఎంచుకుని ఆ రహదారిని మలుపులు లేకుండా నిర్మిస్తారు. ఈ రహదారిపై సైన్ బోర్డులు ఏర్పాటుచేస్తారు. బ్లాక్ స్పాట్లు, రహదారిలో గుంతలు ఎక్కడా లేకుండా చూస్తారు. ఈ రహదారిపై నిర్దేశించే బరువున్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఇందుకోసం ఆ మార్గంలో కాటా యంత్రాలను ఏర్పాటుచేస్తారు. ప్రమాదానికి గురైతే వెంటనే ఆస్పత్రికి చేర్చేలా అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతారు. రేణిగుంట– రాయలచెరువు కారిడార్‌తో సత్ఫలితాలు 2012లో రేణిగుంట–రాయలచెరువు మధ్య 139 కి.మీ.మేర డెమో కారిడార్ ఏర్పాటుచేసేందుకు ప్రపంచ బ్యాంకు రూ.36 కోట్లు అందించింది. 2013లో ఈ రహదారిలో రోడ్డు ప్రమాదాలు 250 నమోదయ్యాయి. కారిడార్ ఏర్పాటుతో 2015 నాటికి ఇవి సగానికి తగ్గాయి. 2017లో వంద వరకు నమోదు కాగా.. 2018 నాటికి పదుల సంఖ్యలోకి వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి కిలోమీటర్ల మేర వీటిని ఏర్పాటుచేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఒక్కో కారిడార్‌కు రూ.30 కోట్లకు పైగా వెచ్చించనుంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం రోడ్ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. 2020 నాటికి 15 శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తాం. అన్ని జిల్లాల్లో కలిపి వెయ్యి కిలోమీటర్ల వరకు డెమో కారిడార్ల నిర్మాణం చేపట్టాలని రోడ్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయించాం. ఆర్అండ్బీ శాఖ సహకారంతో డెమో కారిడార్లను నిర్మిస్తాం. –పీఎస్సార్ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్ -
ఆర్అండ్బీ శాఖలో బదిలీలు
* ములుగు డివిజన్ ఈఈగా సత్యనారాయణ * వరంగల్, ములుగు డీఈఈలుగా వెంకటేష్, రాజంనాయక్ వరంగల్: రహదారులు, భవనాల(ఆర్అండ్బీ) శాఖలో పలువురు అధికారుల బదిలీ అయ్యూరు. జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేసిన ఆర్అండ్బీ ములుగు డివిజన్ ఈఈగా సత్యనారాయణ నియమితులయ్యారు. ఈయన గతంలో ఏటూరునాగా రం ఎన్‌హెచ్ ఈఈగా పనిచేశారు. ఇప్పటిదాకా ములుగు డివిజన్ ఇన్చార్జి అధికారిగా ఎస్ఈ నర్సింహ వ్యవహరించారు. ఖమ్మం నుంచి వచ్చిన రాజం నా యక్ ములుగు డీఈఈగా నియమితుల య్యారు. వరంగల్ డీఈఈ రాజేశ్వర్‌రెడ్డి పదోన్నతిపై ఖమ్మం జిల్లా జాతీయ రహదారుల శాఖ ఈఈగా, ములుగు డీఈఈగా పనిచేస్తున్న వెంకటేష్ వరంగల్ డీఈఈగా నియూమకమయ్యూరు. ఈమేరకు బదిలీపై వచ్చిన అధికారులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎమ్మెల్యేలు, ఎంపీలకు బంగ్లాలు
నియోజకవర్గ కేంద్రాల్లో అధునాతన సదుపాయాలతో నిర్మాణం సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం.. కొత్త అసెంబ్లీ.. కొత్త శాసన మండలి భవనం.. అధునాతనంగా సీఎం క్యాంపు కార్యాలయం... ఇదే వరుసలో ఇప్పుడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల అధికార నివాసాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2016-17 బడ్జెట్లోనే వీటికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చేనెలలోనే వీటికి శంకుస్థాపన చేయాలని, ఏడాది వ్యవధిలో నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్దేశించారు. సీఎం ఆదేశాలతో ఆర్అండ్బీ విభాగం సంబంధిత పనులను వేగవంతం చేసింది. వెంటనే నిర్మాణాలకు సరిపడే స్థలాలను గుర్తించి, సైట్ వివరాలతో పాటు సమగ్ర అంచనాలను పంపించాలని అన్ని జిల్లాల ఆర్అండ్బీ ఎస్ఈలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీ నియోజకవర్గాలన్నింటా భవనాలను నిర్మిస్తారు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులకు ప్రత్యేకంగా నియోజకవర్గాలు లేనందున ఈ సదుపాయాన్ని వర్తింపజేయటం లేదు. ఒక్కో బంగ్లా నిర్మాణానికి దాదాపు రూ.కోటి ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రానున్న బడ్జెట్లో వీటి నిర్మాణానికి రూ.120 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం సూచనప్రాయంగా అధికారులకు వెల్లడించారు. మిగిలిన నిధులు పనుల పురోగతికి అనుగుణంగా విడతల వారీగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాదిలోనే ఆలోచన పార్టీలకు అతీతంగా ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి ఒక అధికార నివాసం నిర్మించాలని సీఎం గత ఏడాదే తన ఆలోచనను వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కుటుంబంతో సహా నివాసం ఉండటంతో పాటు తమ వద్దకు వచ్చే ప్రజలను కలిసేందుకు వీలుగా కార్యాలయం కూడా అందులోనే ఉండాలని సూచించారు. సీఎం సూచనల ప్రకారం ఆర్ అండ్‌బీ ఇంజనీరింగ్ విభాగం డిజైన్లను సిద్ధం చేసింది. ఇటీవలే వీటిని పరిశీలించిన సీఎం రెండతస్తులుండే బంగ్లా నమూనాకు ఓకే చేశారు. ఇటీవల ఆర్అండ్బీ శాఖతో నిర్వహించిన బడ్జెట్ ప్రతిపాదనల సమీక్షలో భవనాల నిర్మాణాలకు ఎంత ఖర్చవుతుందని ఆరా తీసిన సీఎం.. పక్కాగా లెక్కలను అడిగి తెలుసుకున్నారు. మూడు నాలుగు భవనాలకు కలిపి టెండర్! ఒక్కో భవనాన్ని టెండర్ ద్వారా ఒక్కో కాంట్రాక్టరుకు అప్పగించాలా లేదా మూడు నాలుగు భవనాలకు కలిపి ఒకే టెండర్ పిలిచి కాంట్రాక్టర్లకు ఇవ్వాలా అనే అంశంపై కూడా సీఎం సమక్షంలో చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో పద్ధతికే మొగ్గు చూపారని, దీంతో కాంట్రాక్టర్ల సంఖ్య తగ్గడంతో పాటు పనుల్లో వేగం పెరుగుతుందని, ప్రభుత్వానికి పని భారం తగ్గుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేసినట్టు సమాచారం. వాస్తు ప్రకారం నిర్మాణాలు ఆర్అండ్బీ విభాగం రూపొందించిన రెండంతస్తుల నమూనాలో నిర్మాణాలకు సీఎం ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం బంగ్లాలోని గ్రౌండ్ ఫ్లోర్లో కార్యాలయం, మొదటి అంతస్తులో కుటుంబంతో పాటు ఎమ్మెల్యే నివాసం ఉంటుంది. వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తరం దిశలకు అభిముఖంగా వీటిని నిర్మిస్తారు. 2,070 చదరపు అడుగుల విస్తీర్ణంలో కింది ఫ్లోర్, అంతే విస్తీర్ణంలో రెండో ఫ్లోర్.. మొత్తంగా 4,140 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం ఉంటుంది. ఒక్కో చదరపు అడుగుకు రూ.2,415 చొప్పున ఖర్చు అవుతుందని ఆర్అండ్బీ విభాగం అంచనా వేసింది. బంగ్లా నిర్మాణానికి రూ.70.85 లక్షలు, సదుపాయాల కల్పనకు రూ.21.21 లక్షలు ఖర్చు కానున్నాయి. భవన నిర్మాణ అనుమతులు, నీటి సౌకర్యం, పారిశుధ్యం, విద్యుత్ సదుపాయం, కార్ షెడ్, కాంపౌండ్ వాల్లకు అయ్యే ఖర్చులు ఇందులో చేర్చారు. వీటికి తోడుగా వ్యాట్, సీనరేజ్ చార్జీలు, ఎన్ఏసీ, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపితే రూ. కోటి అవుతుందని అంచనా వేశారు.