
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 7,969 కి.మీ. మేర రహదారులకు ప్రత్యేక మరమ్మతు పనులు చేపట్టేందుకు వారంలోగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించింది. నెలలోగా టెండర్ల ప్రక్రియ మొత్తం పూర్తిచేసి కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలతో అగ్రిమెంట్లు కుదుర్చుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రూ.2,205 కోట్లతో రాష్ట్రంలో 7,969 కి.మీ. మేర రహదారులకు ప్రత్యేక మరమ్మతులు చేపట్టేందుకు ఇటీవలే పరిపాలన అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఆర్థికఏడాదిలో కురిసిన భారీ వర్షాలు, తుపాన్లకు రహదారులు బాగా దెబ్బతిన్నాయి. గతేడాది రూ.1,000 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టడంతో రహదారులు ప్రయాణానికి అనుకూలంగా మారాయి. అయితే మళ్లీ ఈ మరమ్మతులు లేకుండా రెన్యువల్ లేయర్ వేసేందుకు రూ.2,205 కోట్ల నిధులు కేటాయించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా 13 జిల్లాల పరిధిలోని 2,726 కి.మీ. రాష్ట్ర రహదారులకు రూ.923 కోట్లు, 5,243 కి.మీ. జిల్లా ప్రధాన రహదారులకు రూ.1,282 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేయాలని నిర్ణయించారు.
రూ.2 కోట్ల లోపు పనులకు జిల్లా పరిధిలోనే టెండర్లు
రూ.2 కోట్ల లోపు విలువైన పనులకు జిల్లా పరిధిలోనే సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహిస్తారు. రూ.2 కోట్ల కంటే ఎక్కువ విలువైన మరమ్మతు పనులకు రాష్ట్ర స్థాయిలో చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో టెండర్లు జరుగుతాయి. అయితే జిల్లా, రాష్ట్ర స్థాయి పనులకు రివర్స్ టెండర్లు జరుగుతాయి. ఏప్రిల్ నెలలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, మే నెలలోగా మరమ్మతు పనులు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్‌డీసీ) ఎండీ శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment