సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 875 రోడ్లను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గంలో కీలకమైన ఐదురోడ్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. ఈ 875 రోడ్లలో ఆర్ అండ్ బి శాఖ పరిధిలో 442, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 300, మున్సిపల్ శాఖ పరిధిలో 133 ఉన్నాయి. రోడ్లను ఎంపికచేసి ప్రతిపాదనలు పంపాలని ఆర్ అండ్ బి, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ రోడ్ల పనులను మార్చిలో ప్రారంభించి జూన్ నాటికి పూర్తిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రోడ్ల పునరుద్ధరణ నిధులను కూడా 2019 ఎన్నికల ముందు పసుపు–కుంకుమ వంటి పథకాలకు మళ్లించింది. దీంతో రాష్ట్రంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి ఏడాది భారీవర్షాలతో రోడ్ల పనులు చేపట్టడం సాధ్యం కాలేదు.
అనంతరం రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులను పెద్ద ఎత్తున చేపట్టింది. మొదటిదశ కింద రూ.2,205 కోట్లతో 6,150 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బి రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఆ పనులు 95 శాతం పూర్తయ్యాయి. రెండోదశ కింద రూ.1,700 కోట్లతో 6,150 కిలోమీటర్ల మేర రహదారుల పునరుద్ధరణ ప్రణాళికను ఖరారు చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మొత్తం 953 రోడ్లను రెండోదశలో పునరుద్ధరించాలని నిర్ణయించింది.
వాటిలో రాష్ట్ర ప్రధాన రహదారులు 292, జిల్లా ప్రధాన రహదారులు 661 ఉన్నాయి. ఈ పనులను ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతలో యుద్ధప్రాతిపదికన నియోజకవర్గానికి ఐదు రోడ్ల చొప్పున పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విధానంలో 875 రోడ్ల పునరుద్ధరణ పనులు మొదట పూర్తిచేయనున్నారు. అనంతరం రెండోదశ రోడ్ల పునరుద్ధరణ పనులను చేపట్టి డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని ప్రణాళిక రూపొందించారు.
కృష్ణా, గోదావరి జిల్లాల్లో రోడ్ల కోతకు చెక్
నదీపరివాహక ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న రోడ్ల కోతకు రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలకనుంది. అందుకోసం ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్‌డీఆర్) టెక్నాలజీతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎఫ్‌డీఆర్ టెక్నాలజీతో వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఆదేశించారు.
మెత్తటి నేలల్లో రోడ్లు నిర్మిస్తున్నా.. వర్షాలు పడినా, వరదలు వచ్చినా నదీతీర ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురవుతున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దశాబ్దాలుగా ఈ సమస్య వేధిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఎఫ్‌డీఆర్ సాంకేతికతతో రోడ్లు నిర్మించనుంది. ఆర్ అండ్ బి శాఖకు చెందిన 500 కిలోమీటర్ల రోడ్లు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన 500 కిలోమీటర్ల రోడ్లను ఈ సాంకేతికతతో నిర్మిస్తారు.
పైలట్ ప్రాజెక్టుగా తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో గజ్జరం నుంచి హుకుంపేట వరకు 7.50 కిలోమీటర్ల మేర ఎఫ్‌డీఆర్ టెక్నాలజీతో రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డును పరిశీలించిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ (సీఐఆర్) నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మెత్తటి నేలలున్న ప్రాంతాల్లో అదే టెక్నాలజీతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు.
AP: మరో 875 రోడ్ల పునరుద్ధరణ
Published Sun, Feb 19 2023 4:50 AM | Last Updated on Sun, Feb 19 2023 4:49 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment