
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారులను అనుసంధానిస్తూ కొత్తగా ఆరు బైపాస్ రహదారులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలను అనుసంధానిస్తూనే బైపాస్ రహదారులు ఉండేవి. కొన్నేళ్లుగా పట్టణ ప్రాంతాలు విస్తరిస్తుండటం, సమీప గ్రామాల నుంచి ప్రజలు వచ్చి స్థిరపడటంతో జనాభా పెరుగుదల తదితర కారణాలతో ఆ ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరుగుతోంది. సమీపంలోని జాతీయ రహదారిని అనుసంధానిస్తూ పట్టణాలగుండా చాలా ఏళ్ల క్రితం నిర్మించిన రోడ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. దాంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి.
ఈ సమస్యలకు పరిష్కారంగా మొదటి దశలో ఆరు పట్టణాల్లో బైపాస్ రహదారులు నిర్మించాలని నిర్ణయించింది. జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఇటీవల ఖరారు చేసిన 2022–23 వార్షిక ప్రణాళికలో ఆ ఆరు బైపాస్‌లకు చోటు కల్పించారు. మొత్తం 64.20 కిలోమీటర్ల మేర రూ.930 కోట్లతో వీటిని నిర్మించనున్నారు. ఆర్ అండ్ బీ శాఖ త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఖరారు చేసి అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. డబుల్ లేన్ విత్ పావ్డ్ షోల్డర్స్‌గా 12 మీటర్ల వెడల్పుతో బైపాస్ రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.