సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేసేందుకు ఆర్ అండ్ బి శాఖ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు రూ.1,700 కోట్లతో 6,150 కి.మీ.మేర రహదారుల పునరుద్ధరణ ప్రణాళికను ఖరారు చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటి పునరుద్ధరణకు తీసుకున్న రూ.3వేల కోట్ల రుణాన్ని కూడా ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పథకానికి మళ్లించడంతో పరిస్థితి మరింత దిగజారింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్ల పునరుద్ధరణపై దృష్టిసారించింది. ఇందుకోసం తీసుకున్న రుణాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతా ద్వారా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తోంది. దీంతో నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా ప్రభుత్వం సరైన విధానాన్ని ఏర్పర్చింది. మొదటి దశ కింద రూ.2,205 కోట్లతో రాష్ట్రంలో 6,500 కి.మీ. మేర రోడ్ల పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తికావచ్చాయి.
ఇప్పటికే 85శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన 15శాతం పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తిచేయనుంది. దాంతో రెండో దశ కింద రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులపై ఆర్ అండ్ బి శాఖ జిల్లాల నుంచి ప్రతిపాదనలను తెప్పించుకుంది. ఆ ప్రతిపాదనలతో రెండో దశ ప్రణాళికను రూపొందించింది.
రూ.1,700 కోట్లతో ప్రణాళిక ఇలా..
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మొత్తం 953 రోడ్లను రెండో దశలో పునరుద్ధరించాలని నిర్ణయించింది. వాటిలో రాష్ట్ర ప్రధాన రహదారులు 292, జిల్లా ప్రధాన రహదారులు 661 ఉన్నాయి. తద్వారా మొత్తం 6,150 కి.మీ. మేర రోడ్లను పునరుద్ధరిస్తారు. ఇందుకోసం రూ.1,700 కోట్లతో ప్రణాళికను ఖరారుచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్ర ప్రధాన రహదారులకు రూ.673 కోట్లు, జిల్లా ప్రధాన రహదారులకు రూ.1,027 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. దీనికి ఆమోదముద్ర లభించిన తరువాత టెండర్ల ప్రక్రియ చేపడతారు. అనంతరం ఏడాదిలోగా పనులు పూర్తిచేయాలన్నది ఆర్ అండ్ బి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment