ఎమ్మెల్యేలు, ఎంపీలకు బంగ్లాలు
నియోజకవర్గ కేంద్రాల్లో అధునాతన సదుపాయాలతో నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం.. కొత్త అసెంబ్లీ.. కొత్త శాసన మండలి భవనం.. అధునాతనంగా సీఎం క్యాంపు కార్యాలయం... ఇదే వరుసలో ఇప్పుడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల అధికార నివాసాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2016-17 బడ్జెట్‌లోనే వీటికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చేనెలలోనే వీటికి శంకుస్థాపన చేయాలని, ఏడాది వ్యవధిలో నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్దేశించారు. సీఎం ఆదేశాలతో ఆర్‌అండ్‌బీ విభాగం సంబంధిత పనులను వేగవంతం చేసింది.
వెంటనే నిర్మాణాలకు సరిపడే స్థలాలను గుర్తించి, సైట్ వివరాలతో పాటు సమగ్ర అంచనాలను పంపించాలని అన్ని జిల్లాల ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీ నియోజకవర్గాలన్నింటా భవనాలను నిర్మిస్తారు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులకు ప్రత్యేకంగా నియోజకవర్గాలు లేనందున ఈ సదుపాయాన్ని వర్తింపజేయటం లేదు.
ఒక్కో బంగ్లా నిర్మాణానికి దాదాపు రూ.కోటి ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రానున్న బడ్జెట్‌లో వీటి నిర్మాణానికి రూ.120 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం సూచనప్రాయంగా అధికారులకు వెల్లడించారు. మిగిలిన నిధులు పనుల పురోగతికి అనుగుణంగా విడతల వారీగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
గత ఏడాదిలోనే ఆలోచన
పార్టీలకు అతీతంగా ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి ఒక అధికార నివాసం నిర్మించాలని సీఎం గత ఏడాదే తన ఆలోచనను వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కుటుంబంతో సహా నివాసం ఉండటంతో పాటు తమ వద్దకు వచ్చే ప్రజలను కలిసేందుకు వీలుగా కార్యాలయం కూడా అందులోనే ఉండాలని సూచించారు. సీఎం సూచనల ప్రకారం ఆర్ అండ్‌బీ ఇంజనీరింగ్ విభాగం డిజైన్లను సిద్ధం చేసింది. ఇటీవలే వీటిని పరిశీలించిన సీఎం రెండతస్తులుండే బంగ్లా నమూనాకు ఓకే చేశారు. ఇటీవల ఆర్‌అండ్‌బీ శాఖతో నిర్వహించిన బడ్జెట్ ప్రతిపాదనల సమీక్షలో భవనాల నిర్మాణాలకు ఎంత ఖర్చవుతుందని ఆరా తీసిన సీఎం.. పక్కాగా లెక్కలను అడిగి తెలుసుకున్నారు.
మూడు నాలుగు భవనాలకు కలిపి టెండర్!
ఒక్కో భవనాన్ని టెండర్ ద్వారా ఒక్కో కాంట్రాక్టరుకు అప్పగించాలా లేదా మూడు నాలుగు భవనాలకు కలిపి ఒకే టెండర్ పిలిచి కాంట్రాక్టర్లకు ఇవ్వాలా అనే అంశంపై కూడా సీఎం సమక్షంలో చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో పద్ధతికే మొగ్గు చూపారని, దీంతో కాంట్రాక్టర్ల సంఖ్య తగ్గడంతో పాటు పనుల్లో వేగం పెరుగుతుందని, ప్రభుత్వానికి పని భారం తగ్గుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేసినట్టు సమాచారం.
వాస్తు ప్రకారం నిర్మాణాలు
ఆర్‌అండ్‌బీ విభాగం రూపొందించిన రెండంతస్తుల నమూనాలో నిర్మాణాలకు సీఎం ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం బంగ్లాలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్యాలయం, మొదటి అంతస్తులో కుటుంబంతో పాటు ఎమ్మెల్యే నివాసం ఉంటుంది. వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తరం దిశలకు అభిముఖంగా వీటిని నిర్మిస్తారు. 2,070 చదరపు అడుగుల విస్తీర్ణంలో కింది ఫ్లోర్, అంతే విస్తీర్ణంలో రెండో ఫ్లోర్.. మొత్తంగా 4,140 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం ఉంటుంది.
ఒక్కో చదరపు అడుగుకు రూ.2,415 చొప్పున ఖర్చు అవుతుందని ఆర్‌అండ్‌బీ విభాగం అంచనా వేసింది. బంగ్లా నిర్మాణానికి రూ.70.85 లక్షలు, సదుపాయాల కల్పనకు రూ.21.21 లక్షలు ఖర్చు కానున్నాయి. భవన నిర్మాణ అనుమతులు, నీటి సౌకర్యం, పారిశుధ్యం, విద్యుత్ సదుపాయం, కార్ షెడ్, కాంపౌండ్ వాల్‌లకు అయ్యే ఖర్చులు ఇందులో చేర్చారు. వీటికి తోడుగా వ్యాట్, సీనరేజ్ చార్జీలు, ఎన్‌ఏసీ, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపితే రూ. కోటి అవుతుందని
అంచనా వేశారు.