33 శాతం ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతిని మరో రెండు రోజుల్లో దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోబోతోంది. ఈ కాలేజీలో 33 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయంటే ఆశ్చర్యం వేస్తోంది. సోమవారం నాడు జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొననున్న 776 ఎంపీలు, 4,120 మంది ఎమ్మెల్యేలకుగాను 774 ఎంపీలు, 4,078 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లను ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ తనిఖీ చేసి ఓ నివేదికను రూపొందించింది.
రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో 451 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అంటే మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో మహిళల సంఖ్య 9 శాతం మాత్రమే. దేశ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కావాలని ఎప్పటి నుంచో మహిళలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇంత తక్కువగా ఉండడం మరింత ఆశ్చర్యం. మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో 71 శాతం కోటీశ్వరులున్నారని కూడా నివేదిక వెల్లడించింది.