సీఎం యోగి స్పీడ్.. పాలనలో కొత్త ఒరవడి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన, కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకెళ్తున్నారు. ఇక నుంచి ప్రతీవారం ఎమ్మెల్యేలతో పాటు యూపీకి చెందిన ఎంపీలతో సమావేశం కావాలని యోగి నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాల సమస్యలను ఆయన తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తారు.
ప్రతీ శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సచివాలయంలో యోగి ఎంపీలతో సమావేశమవుతారని ఓ అధికారిక ప్రకటనలో తెలియజేశారు. అలాగే ప్రతి సోమ, గురువారాల్లో ఇదే సమయంలో ఎమ్మెల్యేలు ఆయనతో సమావేశం కావచ్చు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి సీఎంతో మాట్లాడవచ్చు. కాగా ప్రజాప్రతినిధులు సమావేశానికి ఇతరులను తీసుకురాకూడదని యోగి సూచించారు.