యూపీ బీజేపీలో ఇంటి పోరు!
యోగి వర్సెస్ డిప్యూటీ సీఎం మౌర్య
సొంత ప్రభుత్వంపైనే మౌర్య వాగ్బాణాలు
కార్యకర్తలకు గౌరవం లేదంటూ విమర్శలు
వీటి వెనక అధిష్టానం ఉందంటూ వార్తలు
త్వరలో కేబినెట్‌లో మార్పులు, పారీ్టలో ప్రక్షాళన
‘పెద్ద’ మార్పు తప్పదంటున్న మౌర్య వర్గం
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో పేలవ ఫలితాల దెబ్బకు రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా తెరపైకి వస్తున్నాయి. 2019తో పోలిస్తే యూపీలో బీజేపీ అనూహ్యంగా సగానికి సగం స్థానాలు కోల్పోవడం తెలిసిందే. పార్టీ కేంద్రంలో వరుసగా మూడోసారి సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమవడానికి ఇదే ప్రధాన కారణంగా నిలిచింది. దీన్ని కమలనాథులు సీరియస్‌గా తీసుకున్నారు.
రాష్ట్ర పారీ్టలోనూ, యోగి కేబినెట్లోనూ త్వరలో భారీ మార్పుచేర్పులకు రంగం సిద్ధమవుతోంది. దీంతోపాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ దూకుడుకు పగ్గాలు వేసేందుకు అధిష్టానమే ప్రయతి్నస్తున్నట్టు చెబుతున్నారు. యోగి ప్రభుత్వంపై సాక్షాత్తూ సొంత పారీ్టకే చెందిన ఉప ముఖ్యమంత్రి మౌర్య బాహాటంగా విమర్శలు... రాష్ట్ర పార్టీ చీఫ్‌తో కలిసి ఆయన హస్తిన యాత్రలు... మోదీ, నడ్డా తదితర పెద్దలతో భేటీ... ఇవన్నీ అందులో భాగమేనని రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతోంది...!
ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ భూపేంద్రసింగ్ చౌదరి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్యతో కలిసి ఆయన మంగళవారమే హస్తిన చేరుకున్నారు. అదే రాత్రి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మౌర్య గంటకు పైగా సమావేశమయ్యారు. అనంతరం చౌదరి కూడా నడ్డాతో విడిగా భేటీ అయ్యారు. నిజానికి యోగి, మౌర్య మధ్య మొదటినుంచీ సత్సంబంధాలు లేవు. యోగి అభీష్టానికి వ్యతిరేకంగా మౌర్యకు అధిష్టానం డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది.
ఈ నేపథ్యంలో మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ హస్తిన యాత్ర రాష్ట్రంలో రాజకీయ కలకలం రేపుతోంది. మౌర్య నెల రోజులుగా కేబినెట్ సమావేశాలకు వరుసగా డుమ్మా కొడుతూ వస్తున్నారు. యూపీలో త్వరలో 10 అసెంబ్లీ స్థానాలకు కీలక ఉప ఎన్నికలు జరగనున్నాయి. వాటి సన్నద్ధత కోసం మంత్రులతో యోగి ఏర్పాటు చేసిన భేటీకి కూడా మౌర్య వెళ్లలేదు. పైగా నెల రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి సీనియర్ కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలను వరుస పెట్టి కలుస్తూ వస్తున్నారు. జూలై 14న కూడా నడ్డాతో చాలాసేపు మంతనాలు జరిపారు.
ఆ భేటీతో...
ఆదివారం లఖ్‌నవూలో జరిగిన బీజేపీ రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశం యూపీలో రాజకీయ వేడిని ఒక్కసారిగా పెంచేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, బీజేపీ నేతలు, ప్రతినిధులు కలిపి 3,500 మందికి పైగా పాల్గొన్న ఆ భేటీలో వేదిక మీదే యోగి, మౌర్య మధ్య పరోక్షంగా మాటల యుద్ధం సాగింది.
మౌర్య ప్రసంగిస్తూ, ‘ప్రభుత్వం కంటే పారీ్టయే మిన్న. కనుక పారీ్టదే పై చేయిగా వ్యవహారాలు సాగాలి’’ అంటూ బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. దాంతో అంతా విస్తుపోయారు. ప్రభుత్వ వ్యవహారాల్లో బీజేపీ నేతల మాట పెద్దగా చెల్లడం లేదని పారీ్టలో యోగి వ్యతిరేకులు చాలాకాలంగా వాపోతున్నారు. అధికారులకు యోగి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు.
అందుకే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు దూకుడుగా పని చేయలేదని, రాష్ట్రంలో దారుణ ఫలితాలకు ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటన్నది వారి వాదన. ఎస్పీ, బీఎస్పీ సానుభూతిపరులైన అధికారులకు కీలక పదవులు కట్టబెట్టారంటూ వారంతా యోగిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సీఎం సమక్షంలోనే మౌర్య మాటల తూటాలు పేల్చారు.
‘‘కార్యకర్తలే కీలకం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ వారిని గౌరవించాల్సిందే. నేనైనా ముందు బీజేపీ కార్యకర్తను. తర్వాతే డిప్యూటీ సీఎంను’’ అన్నారు. ‘‘కార్యకర్తల బాధే నా బాధ. ప్రతి కార్యకర్తకూ నా ఇంటి తలుపులు నిత్యం తెరిచే ఉంటాయి’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలూ చేశారు.
యోగి సమక్షంలోనే ప్రభుత్వ పనితీరును తప్పుబట్టేలా మౌర్య ఇలా మాట్లాడటం వెనక అధిష్టానం ఆశీస్సులున్నట్టు చెబుతున్నారు. అయితే మౌర్య అనంతరం మాట్లాడిన యోగి కూడా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ప్రభుత్వ పనితీరు ఏమాత్రం మారబోదని అదే వేదిక నుంచి కుండబద్దలు కొట్టారు. ఆ వెంటనే మౌర్య, చౌదరి హస్తిన వెళ్లడం, మోదీ, నడ్డా తదితరులతో భేటీ కావడం చకచకా జరిగిపోయాయి.
అనంతరం తాజాగా బుధవారం ఎక్స్ పోస్టులో కూడా ‘ప్రభుత్వం కంటే పారీ్టయే పెద్ద’దన్న వ్యాఖ్యలను మౌర్య పునరుద్ఘాటించారు. వీటన్నింటినీ బేరీజు వేసి చూస్తే యూపీకి సంబంధించి బీజేపీ అధిష్టానం త్వరలో ‘పెద్ద’ నిర్ణయం తీసుకోవచ్చంటూ యోగి వ్యతిరేక వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత యోగిని సీఎం పదవి నుంచి తప్పించడం ఖాయమని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం పదేపదే చెబుతూ వస్తుండటం తెలిసిందే.
యోగి సంచలన వ్యాఖ్యలు
అధిష్టానం మనోగతాన్ని పసిగట్టిన యోగి ముందుగానే వ్యూహాత్మకంగా పై ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. అతి విశ్వాసమే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కొంప ముంచిందని మూడు రోజుల క్రితం ఆయన ఏకంగా బహిరంగ సభలోనే వ్యాఖ్యలు చేయడం ఉద్దేశపూర్వకమేనని భావిస్తున్నారు. ఇవి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. బీజేపీ అధిష్టానం ఇప్పటికిప్పుడు యోగిని మార్చడం వంటి భారీ నిర్ణయాలకు వెళ్లకపోయినా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సత్ఫలితాలు రాబట్టలేకపోతే ఆయనకు ఇబ్బందులు తప్పేలా లేవు.
మరోవైపు బీజేపీ ఇంటి పోరుపై విపక్షాలన్నీ చెణుకులు విసురుతున్నాయి. యూపీకి ముగ్గురు సీఎంలున్నారంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ సహా ఎద్దేవా చేస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటల్లో మునిగి తేలుతూ పాలనను గాలికొదిలారంటూ దుయ్యబడుతున్నాయి. మౌర్య, మరో డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్ కూడా సీఎంలుగానే వ్యవహరిస్తున్నారన్నది వాటి విమర్శల ఆంతర్యం. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను నెగ్గడం యోగికి అత్యవసరం. రాష్ట్ర పార్టీ కీలక నేతల సహాయ నిరాకరణ నేపథ్యంలో ఈ కఠిన పరీక్షలో ఆయన ఏ మేరకు నెగ్గుకొస్తారన్నది ఆసక్తికరం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment