Andhra Pradesh: అగ్రవర్ణ పేదలకు దన్ను | Perni Nani revealed Andhra Pradesh cabinet decisions | Sakshi
Sakshi News home page

AP Cabinet: అగ్రవర్ణ పేదలకు దన్ను

Published Fri, Oct 29 2021 2:40 AM | Last Updated on Fri, Oct 29 2021 1:41 PM

Perni Nani revealed Andhra Pradesh cabinet decisions  - Sakshi

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం పలు ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్‌ల నిర్మాణం కోసం పర్యాటక శాఖకు భూముల అప్పగింతకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణ, సంస్కృత, వేద పాఠశాలల ఏర్పాటు కోసం శారదా పీఠం, దత్త పీఠం, ఇస్కాన్‌ చారిటీస్‌లకు భూములను కేటాయించింది.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను ఆదుకోవడం కోసం ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) సంక్షేమం పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బ్రాహ్మణ, కాపు, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య తదితర వర్గాల్లో నిరుపేదలను ఆదుకోవడం కోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ శాఖ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది.

జైన్‌లు, సిక్కుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా జైన్‌ కార్పొరేషన్, సిక్కు  కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనుంది. పద్మ, ఆది వెలమ సామాజిక వర్గాల్లోని నిరుపేదలను ఆదుకోవడం కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి వీలుగా ప్రతిపాదనను మంత్రివర్గం ముందు పెట్టాలని అధికారులను ఆదేశించింది. గురువారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 
(చదవండి: 'గంజాయి'పై కదిలిన గ్రామ చైతన్యం)

కొలువుల జాతర
► వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 1285, వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లలో 560 ఫార్మసిస్టులు, వైద్య విద్య శాఖలో బోధన, నర్సింగ్, పారామెడికల్‌ విభాగాల్లో 2,190 వెరసి 4,035 ఉద్యోగాలను కొత్తగా సృష్టించి.. నియామకాలు చేపట్టడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
► వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 41,308 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2019 జూన్‌ నుంచి ఇప్పటిదాకా 26,917 మంది ఉద్యోగులను నియమించింది. మిగతా 14,391 ఉద్యోగుల నియామకాల్లో భాగంగా∙ఈ నిర్ణయం తీసుకుంది. 

బీసీ జన గణన 
► 2021 జనాభా లెక్కల ఆధారంగా బీసీ జన గణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టే అధికారాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రికి అప్పగిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. 
► దేశానికి స్వాతంత్య్రం రాక ముందు 1931లో మాత్రమే కులాల ప్రాతిపదికన జన గణన చేశారు. అందు వల్ల ఆ వర్గాల జనాభా ఎంతన్నది తేల్చలేకపోతున్నారు. ఈ దృష్ట్యా బీసీ జన గణన చేపట్టడం ద్వారా శాస్త్రీయంగా వర్గాల జనాభాను తేల్చి.. ఆ మేరకు ఆ వర్గాల ప్రజల అభ్యున్నతికి నిధులు కేటాయించవచ్చన్నది మంత్రివర్గం భావన.

అమ్మ ఒడికి 75 శాతం హాజరు 
► అమ్మ ఒడి పథకం కింద 2022 జూన్‌లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2021 నవంబర్‌ 8 నుంచి 2022 ఏప్రిల్‌ 30 వరకు పాఠశాలల్లో 130 పని దినాల్లో 75 శాతం హాజరు ఉంటేనే ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. 
► 2019–20, 2020–21 విద్యా సంవత్సరాల్లో కరోనా ప్రభావం వల్ల హాజరు శాతం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ పథకం స్ఫూర్తిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు 
► వృద్ధాప్య పెన్షన్, ఇంటి స్థలం, వైఎస్సార్‌ ఆసరా, చేయూత.. తదితర ఏ సంక్షేమ పథకం కిందైనా అర్హత ఉండి.. లబ్ధి చేకూరని వారితో జనవరి నుంచి మే వరకు దరఖాస్తు తీసుకుంటారు. వాటిని పరిశీలించి.. అర్హత ఉన్నట్లు తేలితే జూన్‌లో ప్రయోజనం చేకూర్చుతారు. 
► ఇదే రీతిలో జూలై నుంచి నవంబర్‌ వరకు దరఖాస్తులు స్వీకరించి.. అర్హత ఉన్న వారికి డిసెంబర్‌లో లబ్ధి కల్పిస్తారు. 

పర్యాటక రంగ అభివృద్ధి దిశగా.. 
► రాష్ట్రంలో పర్యాటక రంగ విస్తరణకు మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా పేరూరు, విశాఖ జిల్లా అన్నవరం, వైఎస్సార్‌ జిల్లా గండికోట, చిత్తూరు జిల్లా హార్స్‌లీ హిల్స్, తూర్పుగోదావరి జిల్లా పిచ్చుకలంకలో.. మొత్తంగా ఈ 5 ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్‌ల నిర్మాణానికి పర్యాటక శాఖకు భూమి అప్పగింతకు మంత్రివర్గం ఆమోదం. ఈ ఐదు చోట్ల రూ.1,350 కోట్లతో ఓబెరాయ్‌ విలాస్‌ పేరుతో ఒబెరాయ్‌ సంస్థ 7 స్టార్‌ సదుపాయాలతో లగ్జరీ రిసార్టులను నిర్మించనుంది. తద్వారా 10,900 మందికి ఉద్యోగాలు వస్తాయి.  
► భీమిలిలో రూ.350 కోట్లతో మరో టూరిజం ప్రాజెక్ట్‌. 7 స్టార్‌ సదుపాయాలతో రిసార్ట్‌ నిర్మాణం. 5500 మందికి ఉద్యోగాల కల్పన.
► తిరుపతిలో రూ.250 కోట్లతో టూరిజం ప్రాజెక్ట్‌. తద్వారా 1500 మందికి ఉద్యోగాలు. 
► చిత్తూరు జిల్లా కొత్తకోటలో రూ.250 కోట్లతో మరో ప్రాజెక్టుకు, తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలో రూ.250 కోట్లతో మరో టూరిజం ప్రాజెక్టుకు ఆమోదం.    విశాఖ జిల్లా శిల్పారామం బీచ్‌ వద్ద, తాజ్‌ వరుణ్‌ బీచ్‌ వద్ద టూరిజం ప్రాజెక్టులకు ఆమోదం. విజయవాడలో పార్క్‌ హయత్‌ ప్రాజెక్టుకు ఆమోదం. వీటికి పర్యాటక విధానం కింద రాయితీలకు అంగీకారం. 
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఆన్‌లైన్‌లో సినిమా టికెటింగ్‌ 
ఆంధ్రప్రదేశ్‌ సినిమాల రెగ్యులేషన్‌ చట్టం–1955 సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇండియన్‌ రైల్వే ఆన్‌లైన్‌ టికెట్‌ వ్యవస్థ తరహాలో సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేయడానికి పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్, టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి చేసి, ఈ సంస్థే నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1094 థియేటర్లు  ఉన్నాయి. వాటిలో ఫోన్‌కాల్, ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకునే సౌకర్యం ప్రేక్షకులకు కల్పించనుంది. థియేటర్ల వద్ద ట్రాఫిక్‌ అవాంతరాలను తొలగించడానికి, ప్రేక్షకులకు సమయం ఆదా చేయడానికి, పన్నులు ఎగ్గొట్టడాన్ని నివారించడానికి ఈ విధానం దోహదపడుతుంది.
(చదవండి: ఆ.. నకిలీ సిగరెట్లు ఎవరివో? )

మరిన్ని కీలక నిర్ణయాలు ఇలా..
► రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైన నవంబర్‌ 1న వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానం. 
► పాల సేకరణలో వినియోగిస్తున్న పరికరాలు, వస్తువుల తనిఖీ బాధ్యతలు, విధులు తూనికలు కొలతల శాఖ నుంచి పశుసంవర్ధక శాఖకు బదిలీ. వాటిని తనిఖీ చేసే అధికారం పశు వైద్యులకు అప్పగింత.
► సీఎం వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు. ఇందులో కొత్తగా 19 మంది ఉద్యోగుల నియామకానికి అనుమతి. 
► వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటలు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఏటా 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్‌ రూ.2.49కే కొనుగోలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందానికి ఆమోదం. 25 ఏళ్ల పాటు ఈ సంస్థ విద్యుత్‌ను సరఫరా చేయనుంది. తద్వారా ఏటా రూ.2 వేల కోట్లు ఆదా.
► విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలసలో విశాఖ శారదా పీఠానికి 15 ఎకరాలు కేటాయింపు. సంస్కృత పాఠశాల, వేద విద్య పాఠశాల సహా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణకు ఈ భూమిని శారదాపీఠం వినియోగించనుంది. మార్కెట్‌ విలువ ప్రకారం ఎకరా రూ.1.5 కోట్ల చొప్పున కేటాయించింది.
► అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మపర్తి గ్రామంలో గుండ్లూరు జయలక్ష్మి నరసింహ శాస్త్రి ట్రస్టు(దత్తపీఠం) కు 17.49 ఎకరాలు కేటాయింపు. ఈ ట్రస్టు ఇక్కడ వేద పాఠశాల, సంస్కృత పాఠశాల ఏర్పాటు చేయనుంది.
► అనంతపురం జిల్లా పెనుకొండలో ఇస్కాన్‌ ఛారిటీస్‌ ఆధ్వర్యంలో జ్ఞానగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పాదప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకు లీజు ప్రాతిపదికన 75 ఎకరాల భూమి కేటాయింపు.
► చిత్తూరు జిల్లా నగరిలో ఏరియా ఆసుపత్రి కోసం ప్రభుత్వ భూమి మార్పిడికి ఆమోదం.
► విజయనగరం ఇంజనీరింగ్‌ కళాశాల స్థానంలో గురజాడ జేఎన్‌టీయూ.. ప్రకాశం జిల్లాలో ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆర్డినెన్స్‌ జారీకి గ్రీన్‌ సిగ్నల్‌.  
► కర్నూలు జిల్లాలో సిల్వర్‌ జూబ్లీ కళాశాల నేతృత్వంలో క్లస్టర్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు దిన్నెదేవరపాడు వద్ద 50 ఎకరాల కేటాయింపు.
► కృష్ణా జిల్లా నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 7 ఎకరాల కేటాయింపు.
► వాసవి కన్యకాపరమేశ్వరి చౌల్ట్రీలు, అన్నదాన సత్రాల నిర్వహణ దేవదాయ శాఖ నుంచి తప్పించి, ఆర్యవైశ్యులకే అప్పగింత. (పాదయాత్రలో హామీ మేరకు)
► విశాఖపట్నం జిల్లా మధురవాడలో 200 మెగావాట్ల డేటా సెంటర్‌ పార్క్, బిజినెస్‌ పార్క్, స్కిల్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు అదానీ ఎంటర్‌ప్రైజస్‌కు 130 ఎకరాల భూమి కేటాయింపు. ఇందులో ఆ సంస్థ రూ.14,634 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా 24,990 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.
► వైఎస్సార్‌ కడప జిల్లాలో రూ.227.1 కోట్ల వ్యయంతో ఐదు ఎత్తిపోతల ద్వారా హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల నుంచి చెరువులను నింపేందుకు ఆమోదం.  
► మూడు కొత్త ఆక్వాకల్చర్‌ ప్రాజెక్టుల కోసం 6 రెగ్యులర్‌ పోస్టులు డిప్యూటేషన్‌ పద్ధతిలో, 67 పోస్టులు అవుట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీకి అనుమతి.
► మండలి, శాసనసభల్లో కొత్త విప్‌లు వెన్నపూస గోపాల్‌రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డిలకు కొత్త పేషీల ఏర్పాటు, సిబ్బంది నియామకానికి ఆమోదం.  
► మావోయిస్టులతోసహా నిషేధిత సంస్థలపై నిషేధం మరో ఏడాది పొడిగింపు.
► వాడరేవు వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటుకు ఆమోదం.

రూ.2205 కోట్లతో రోడ్లకు మరమ్మతులు 
రాష్ట్రంలో ఆర్‌ అండ్‌ బీ పరిధిలోని రహదారుల మరమ్మతులను మంత్రివర్గం సమీక్షించింది. గతంలో ఏడాదికి స్టేట్‌ హైవేల మరమ్మతుకు రూ.300 కోట్లు, ఎండీఆర్‌ రోడ్ల మరమ్మతులకు రూ.వంద కోట్లు వెరసి రూ.400 కోట్లు ఖర్చు చేసేవారని అధికారులు వివరించారు. ఆర్‌ అండ్‌ బీ శాఖ పరిధిలోని 46 వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లలో 8 వేల కిలోమీటర్ల మేర రోడ్లకు మరమ్మతులు చేయాలన్నారు. ఇందుకు రూ.2,205 కోట్లతో 1,176 పనులు చేపట్టామని చెప్పారు. ఇప్పటికే 40% పనులకు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లకు అప్పగించామని, రాయలసీమలో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.. మిగిలిన 60 శాతం పనులకు నవంబర్‌లోగా టెండర్లు పూర్తి చేసి.. డిసెంబర్‌లో పనులు ప్రారంభించి.. వచ్చే మే లోగా పనులు పూర్తి చేయాలని మంత్రివర్గం అధికారులకు దిశానిర్దేశం చేసింది.   
(చదవండి: పర్యావరణహితంగా ‘వైఎస్సార్‌ స్టీల్‌’)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement