అవి జగన్‌ సొంత సంస్థలు | YV Subbareddy and Perni Nani in the press conference | Sakshi
Sakshi News home page

అవి జగన్‌ సొంత సంస్థలు

Published Sat, Oct 26 2024 5:08 AM | Last Updated on Sat, Oct 26 2024 7:18 AM

YV Subbareddy and Perni Nani in the press conference

వాటిలో షర్మిల వాటాదారు కాదు 

చెల్లిపై ప్రేమ, ఆప్యాయతతో 4 సంస్థల్లో 40% వాటా రాసిచ్చారు 

ఈడీ, కోర్టు అనుమతి ఇచ్చాక వాటాను పూర్తి స్థాయిలో బదలాయిస్తానని జగన్‌ స్పష్టంగా రాసిచ్చారు 

వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దుకు కుట్ర.. ఆ కుట్రలో పావుగా మారి ఈడీ జప్తు చేసిన సరస్వతీ పవర్‌ షేర్లను బదలాయించిన షర్మిల 

ఆ కుట్రను చిత్తు చేయడానికే ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన జగన్‌.. 

అంతేగానీ ఆస్తుల్లో వాటా వెనక్కి తీసుకోవాలని కాదు 

షర్మిల నిజంగా షేర్‌హోల్డర్‌ అయితే ఆమెపై కేసులు ఎందుకు నమోదు కాలేదు?.. కేవలం జగన్‌పైనే కేసులు  పెట్టి జైలుకు ఎందుకు పంపారు? 

జగన్‌ పదేళ్లలో ఇచ్చిన రూ.200 కోట్లు కంపెనీ డివిడెండ్‌ కాదు.. అసలు కంపెనీ షేర్‌ హోల్డరే కానప్పుడు.. డివిడెండ్‌ ఇస్తారా? 

చెల్లెలిపై అభిమానం, ప్రేమతోనే జగన్‌ ఆ డబ్బులిచ్చారు.. చంద్రబాబుతో కలిసి రాజకీయాలు చేయడం వైఎస్సార్‌ అభిమతమా షర్మిలా? 

ఇలాగేనా మీ తండ్రి వైఎస్సార్‌ ఆశయాల కొనసాగింపు?.. వైఎస్సార్‌సీపీ ఎదుగుదలలో జగన్, కార్యకర్తలదే పాత్ర 

విలేకరుల సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని స్పష్టీకరణ 

సాక్షి, అమరావతి: భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్‌ సంస్థలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత సంస్థలని.. వాటిల్లో షర్మిల వాటాదారు కాదని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తేల్చిచెప్పారు. సోదరి షర్మిలపై ప్రేమ, ఆప్యాయతతో తన స్వార్జితమైన నాలుగు సంస్థల్లో 40 శాతం వాటాను ఇస్తూ జగన్‌ ఒప్పందం రాసిచ్చారని.. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌), కోర్టు అనుమతి ఇచ్చాక వాటిని పూర్తి స్థాయిలో బదలాయిస్తానని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. 

అయితే ఈడీ జప్తు చేసిన సరస్వతీ పవర్‌ షేర్లను బదిలీ చేయించి జగన్‌ బెయిల్‌ను రద్దు చేయించాలన్న కుట్రలో షర్మిల పావుగా మారారని.. ఆ కుట్రను చిత్తు చేయడానికే ఎన్‌సీఎల్‌టీలో జగన్‌ పిటిషన్‌ వేశారేగానీ ఆస్తులు వెనక్కి తీసుకోవాలని కాదని స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు.  

అవన్నీ జగన్‌ స్వార్జితం: వైవీ సుబ్బారెడ్డి షర్మిల బహిరంగ లేఖ చూశాక కుటుంబపరమైన కొన్ని విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నా. సరస్వతీ పవర్‌ షేర్ల అంశం హైకోర్టులో ఉంది. ఈడీ జప్తు చేసిన ఆ సంస్థ ఆస్తులపై హైకోర్టు స్టేటస్‌ కో విధించింది. జగన్‌పై కాంగ్రెస్‌ పార్టీ అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించడంతో ఆయన సంస్థల ఆస్తుల అటాచ్‌మెంట్‌ జరిగింది. ఈడీ అటాచ్‌మెంట్లో ఉన్న షేర్లను బదిలీ చేయించుకున్నారు కాబట్టే దాన్ని ఆపాలని జగన్‌ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ ఇచ్చారు. అంతేగానీ ఆస్తులు వెనక్కు తీసుకోవాలని కాదు.  

» జగన్‌ తన స్వార్జిత ఆస్తిలో షర్మిలకు వాటా ఇస్తూ 2019 ఆగస్టులో ఒప్పందం రాసిచ్చారు. ఆ ఒప్పందంలో జగన్‌ స్వార్జిత ఆస్తులు అని చాలా స్పష్టంగా ఉంది. అది చూశాకే షర్మిలమ్మ, విజయమ్మ ఇద్దరూ సంతకం పెట్టారు. తన చెల్లిపై ప్రేమ, అభిమానంతో ఆస్తులు ఇస్తున్నట్లు జగన్‌ ఆ ఒప్పందంలో రాశారు. ఇవన్నీ వాస్తవాలు. వాటిని కప్పి పుచ్చి దుష్ప్రచారం చేస్తున్నారు.  

» దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడే ఆయన ఆస్తులను పంచారు. షర్మిల ఈ ఆస్తులు కావాలని అని నిజంగా అనుకుంటే.. అవి ఇస్తానని జగన్‌ చెప్పినా.. ఆమె ఇప్పుడేం మాట్లాడుతున్నారో చూస్తుంటే.. ఆమె ఆస్తుల కోసం పోరాడుతున్నారా? లేక జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? అని అనిపిస్తోంది. 

» నాకు తెలిసినంతవరకు జగన్‌ స్వార్జిత ఆస్తిలో ఎక్కడా షర్మిలమ్మ ప్రమేయం లేదు. నిజంగా ఆ ఆస్తుల్లో షర్మిలమ్మకు వాటా ఉండి ఉంటే.. ఆమెపై ఆనాడు కేసులు ఎందుకు  నమోదు కాలేదు? కేవలం జగన్‌ మాత్రమే ఎందుకు జైలుకు వెళ్లారు? జగన్‌ కంపెనీలో షేర్‌ హోల్డర్‌ కాబట్టే ఆయనకు డివిడెండ్‌ వచ్చింది. దాన్నుంచే ఆయన తన చెల్లికి ఈ పదేళ్లలో రూ.200 కోట్లు ఇచ్చారు. షర్మిల అందులో షేర్‌ హోల్డర్‌ కాదు. అవి జగన్‌ సొంత కంపెనీలు. అందుకే వాటికి భారతి సిమెంట్స్‌.. తన పేరు, భార్య పేరు కలిసొచ్చేలా జగతి పబ్లికేషన్స్‌ (సాక్షి గ్రూప్‌) అని పేరు పెట్టారు.     



» నలుగురు పిల్లలూ తనకు సమానం అని వైఎస్సార్‌ అన్నారని షర్మిల లేఖలో రాశారు. అది నిజమే. ప్రేమను పంచడంలో వైఎస్సార్‌ నలుగురు పిల్లలనూ సమానంగా చూశారు. అయితే వైఎస్సార్‌ బతికున్నప్పుడే జగన్‌ స్థాపించిన కంపెనీల్లో ఎక్కడా షర్మిల గానీ, అనిల్‌ గానీ షేర్‌హోల్డర్‌గా లేరు. అది వైఎస్సార్‌ కోరుకోలేదు. ఒకవేళ ఆయన కోరుకుంటే వారిని ఆ కంపెనీల్లో షేర్‌ హోల్డర్లుగా పెట్టి ఉండేవారు కదా? తండ్రి మరణం తర్వాత, ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి ఓదార్పు యాత్ర చేశారు. ఎన్నో పోరాటాలు చేశారు. 2014లోగానీ మొన్న 2024లోగానీ అబద్ధాలు చెప్పి ఉంటే అధికారంలోకి వచ్చేవారు. అలాంటి మనిషే అయితే చెల్లి విషయంలో మాట తప్పరు కదా? 

బాబుతో కలసి రాజకీయం చేయడం వైఎస్‌ అభిమతమా?: పేర్ని నాని 
»   గత మూడు నాలుగు రోజుల నుంచి టీడీపీ నానా హంగామా చేసి చెప్పిన బ్రేకింగ్‌ న్యూస్‌ ఏమిటంటే.. షర్మిలమ్మ తన ఆస్తుల పంపకం గురించి అన్నకు రాసిన ఉత్తరం. అది రాష్ట్రానికి, ప్రజలకు అంత ముఖ్యమా? షర్మిలమ్మ పీసీసీ అధ్యక్షురాలు. ఆమె అన్నకు రాసిన ఉత్తరం ఎన్‌డీఏ అఫీషియల్‌ వెబ్‌సైట్‌లో రావడం అంటే చంద్రబాబు ఎంత అనైతికంగా వ్యవహరిస్తున్నారు? ఎక్కడికక్కడ ఎవరెవరితో కలిసి పని చేస్తున్నారు? అనేది ఆలోచించండి. ఢిల్లీలో కాంగ్రెస్‌తో కుస్తీ.. ఇక్కడ మాత్రం దోస్తీ! ఏ స్థాయిలో దిగజారి రాజకీయాలు చేస్తున్నాడో చూడండి. లేఖ రాసింది రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలైతే  టీడీపీ వెబ్‌సైట్‌లో ప్రచారం చేయడం ఏమిటి?  

» వైఎస్సార్‌ జీవించి ఉన్నప్పుడు మొదలుపెట్టిన కంపెనీల్లో కుటుంబ సభ్యులంతా వాటాదారులైతే.. భారతి సిమెంట్స్‌లో షర్మిల పేరు ఎందుకు పెట్టలేదు? షేర్‌ హోల్డర్లుగా ఎందుకు ప్రకటించలేదు? జగన్‌ ఆ కంపెనీలకు కేవలం కాపలాదారే అయితే వైఎస్సార్‌ మిమ్మల్ని కంపెనీల్లో డైరెక్టర్లుగా పెట్టేవారు కదా? అప్పట్లో మీరు విదేశాల్లో కూడా లేరు కదా? 

» వైఎస్సార్‌ అభిమతం, ఆశయాలను కొనసాగించాలన్న అంకితభావం ఉంటే.. చంద్రబాబుతో కలిసి ప్రయాణించడం, రాజకీయం చేయడాన్ని ఎవరైనా ఊహిస్తారా?  వైఎస్సార్‌ అదే ఆశించారా? ఆయన్ను అణగదొక్కడానికి చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేశారో తెలుసు కదా? రాజకీయాల్లో ఇద్దరూ బద్ధ శతృవులు. అలాంటి చంద్రబాబుతో కలిసి పని చేస్తారా? ఏబీఎన్‌ రాధాకృష్ణతో కూడా కలసి పోతారా? వైఎస్సార్‌ అభిమానుల్లో ఎవరైనా చంద్రబాబుతో కలిసి పని చేస్తున్నారా? కానీ ఆ పని మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు కాంగ్రెస్‌లో ఉంటూ ఎన్డీఏ కూటమితో కలసి ఎలా పని చేస్తున్నారు? అదేనా వైఎస్సార్‌ అభిమతం? ఆశయం? 

» వైఎస్సార్‌ మరణించాక.. జగన్‌ 10 ఏళ్లు కష్టాలు పడితే.. తాను పార్టీ కోసం పాటుపడ్డాడని, కష్టపడి పని చేశానని షర్మిలమ్మ అంటున్నారు. జగన్‌ ఎప్పుడు సమస్యలు ఎదుర్కొన్నారో తెలియదా? ఆయన సోనియాను ఎదిరించి బయటకు వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెట్టారు. జైల్లో పెట్టారు. అప్పుడు 230 రోజులు షర్మిలమ్మ పాదయాత్ర చేశారు. అది కూడా 2014 ఎన్నికల ముందు మాత్రమే. 2014 తర్వాత ఆమె ఏనాడూ రాలేదు. పార్టీ జెండా మోయలేదు.  



» వైఎస్సార్‌సీపీకి 2012 నుంచి ఈరోజు వరకు కర్త, కర్మ, క్రియ, కష్టం నష్టం.. గెలుపు.. అన్నింటిలో పూర్తి భాగస్వామ్య హక్కు జగన్‌ది మాత్రమే. కేవలం ఆయన వల్లనే పార్టీ ఎదిగింది... నిల్చింది... గెల్చింది. ఆ ఘనత పార్టీది, కార్యకర్తలది. అంటే జగన్, పార్టీ కార్యకర్తలకే ఆ ఘనత దక్కుతుంది. ఇంకా చెప్పాలంటే మాలాంటి వారు చాలా మంది పని చేశారు. పదవులు వదులుకుని వచ్చాం. టీడీపీ నుంచి కూడా పదవులు వీడి వచ్చిన వారు ఉన్నారు. అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి వచ్చారు. కానీ ప్రధానంగా పని చేసింది లక్షలాది మంది కార్యకర్తలు, జగన్‌ మాత్రమే. వారి వల్లనే పార్టీ ఎదిగింది. నిలబడింది. ఇది వాస్తవం. దీన్ని షర్మిలమ్మ గుర్తించాలి. 

» ఇది చెప్పాలో వద్దో తెలియదు. షర్మిలమ్మ పాదయాత్ర సమయంలో జగన్‌ జైల్లో ఉంటే నేను స్వయంగా కలిశా. చెల్లితో పాదయాత్ర చేయించడం ఎంత వరకు కరెక్ట్‌? భవిష్యత్తులో సమస్యలు వస్తాయని చెబి­తే అలాంటి అవకాశం అసలు ఉండదని నాడు జగన్‌ అన్నారు. చెల్లిపై ఆయనకు అంత నమ్మకం. కానీ ఈ రోజు నేను అన్నదే జరుగుతోంది. 

» షర్మిలను పార్టీ కోసం వాడుకుని వదిలేశారని చంద్రబాబు అంటున్నారు. మరి నువ్వు జూనియర్‌ ఎన్టీఆర్‌ను పార్టీ కోసం ఎంతగా వాడుకున్నావ్‌ చంద్రబాబూ..? మీరు కనీసం సభ్య­త్వం కూడా ఇవ్వలేదు. అందుకే ఆయన పార్టీని వీడారు కదా? మీరు మీ లాభం కోసం మనుషులను ఎలా వాడుకుంటారో.. స్వయంగా మీ తోడల్లుడు ఏకంగా పుస్తకమే రాశారు కదా! వాడుకోవడం, వదిలేయడం.. అదీ మీ నైజం! అలాంటి మీరు నీతులు చెబుతున్నారు. ఆస్తులు ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. మరి మీ హెరిటేజ్‌లో మీ తోబుట్టువులకు ఎంత వాటా ఇచ్చారు? ఏమైనా రాసిచ్చారా? మీకు నిజా­యితీ ఉంటే వెంటనే ఆ పని చేసి చూపండి. ఈ వయసులో ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి చంద్రబాబూ!! 

40% వాటా కోసం మాట తప్పుతారా?  
» అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్‌ కేవలం గార్డియన్‌ మాత్రమేనని, ఆస్తులను నలుగురికి (మనవళ్లు, మనవరాళ్లు) సమానంగా పంచడం, అది జగన్‌ బాధ్యత అని.. అది వైఎస్సార్‌ ఉద్దేశమని.. అది ఆయన సన్నిహితులైన కేవీపీ, సాయిరెడ్డి, సుబ్బారెడ్డికి కూడా తెలుసని షర్మిలమ్మ ఆ లేఖలో రాశారు. ఒకవేళ నిజంగా వైఎస్సార్‌ ఉద్దేశం అదే అయితే.. ఇంత మందికి ఆయన చెప్పి ఉంటే, జగన్‌కు కూడా చెప్పి ఉండాలి కదా? ఇద్దరు తల్లిదండ్రులను కూడా కంపెనీ డైరెక్టర్లుగా పెట్టి ఉండాలి కదా? ఇలాంటి మనస్తత్వమా షర్మిలది? 

»తండ్రి మరణం తర్వాత జగన్‌ ఓదార్పుయాత్ర చేస్తానంటే.. కాంగ్రెస్‌ వద్దనడంతో పార్టీని వీడారు. పదవులు ఇస్తామన్నా ఆశ పడలేదు. కేవలం మాట కోసం బయటకు వచ్చారు. రాజీ పడకుండా పోరాడారు. తండ్రి ఆశయం, జనం కోసం, నమ్మిన సిద్దాంతం కోసం ఎంతో పోరాడారు. 16 నెలలు అన్యాయంగా జైలు శిక్ష అనుభవించారు. ఎంతో జీవితాన్ని పోగొట్టుకున్నారు. కానీ ఆశయాన్ని మాత్రం వీడలేదు. జగన్‌పై ఎన్ని కేసులు పెట్టారు? ఇప్పటికీ వాటిని మోస్తూనే ఉన్నారు. పదవులు ఇస్తామన్నా కేవలం ఇచ్చిన మాట కోసం వదులుకున్నారు.  

»  అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఏదో నాలుగు ఆస్తుల్లో 40 పైసల వాటా కోసం మాట తప్పుతారా? ఇచ్చిన మాట నిలబెట్టుకోరా? తనే స్వయంగా రాశారని మీరే చెబుతున్నారు కదా! నమ్మిన సిద్ధాంతం, ఆశయాల కోసం రాజీ పడకుండా అన్ని కష్టాలు అనుభవించిన వ్యక్తి 40 పైసల వాటా కోసం మాట తప్పుతారా? మరి ప్రజలు దీన్ని నమ్ముతారా?  

»గత పదేళ్లలో మీకు రూ.200 కోట్లు నగదు బదిలీ చేస్తే అది కంపెనీ డివిడెండ్‌ అని అంటారా? మీరు కంపెనీలో షేర్‌హోల్డర్‌ కానప్పుడు మీకు లాభం ఎలా పంచుతారు? అది వచ్చింది మీ అన్న, వదిన నుంచి కాదా? ఇంత దారుణంగా మాట్లాడడం, వ్యవహరించడం ఎంత వరకు సబబు? తండ్రి, అన్న శతృవుతో కలిసి పని చేయడం, ఆస్తుల కోసం జగన్‌ కోర్టుకు ఎక్కాడని టీడీపీ మీడియాతో కలసి దు్రష్పచారం చేయడాన్ని మీ విజ్ఞత, విచక్షణకే వదిలేస్తున్నాం.

రెట్టింపు డబ్బులిస్తాం.. ఫిలిం సిటీ భూములు వదిలేస్తారా?
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు 
ఒంగోలు సిటీ: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరస్వతి పవర్‌ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి చట్ట ప్రకారం భూములు కొన్నారని, రామోజీరావు అండ్‌కో లా హైదరాబాద్‌లో ఫిలిం సిటీ కోసం పేదలను భయపెట్టి భూములు చవగ్గా కొల్లగొట్టలేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు చెప్పారు. రామోజీ అండ్‌ కో ఫిలింసిటీ కోసం ఎంతో మంది పేదలను భయపెట్టి భూములు లాక్కొన్నారని, ఆరోజు కొన్న రేటుకు రెట్టింపు డబ్బులిస్తాం ఫిలిం సిటీ భూములను వదిలేస్తారా అని ప్రశ్నించారు. 

జూపూడి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ చట్టప్రకారం కొన్న భూములపైనా ఎల్లోమీడియా వక్రీకరించడం సమంజసం కాదని అన్నారు. చంద్రబాబుకు సిగ్గు ఉందో లేదో తెలియదు కానీ, రాష్ట్రం మొత్తం చంద్రబాబును చూసి సిగ్గుపడే అంశాలు చాలా ఉన్నాయని విమర్శించారు. జగన్‌ ఇంట్లో ఆస్తుల తగదాలతో ఆయనకేమిటి సంబంధం అని ప్రశ్నించారు. సంబంధం లేకపోతే షర్మిల లేఖ చంద్రబాబు దగ్గరకు ఎలా వచ్చిందని నిలదీశారు. ఆనాడు సోనియాగాంధీతో కుమ్మక్కైన చంద్రబాబు వైఎస్‌ జగన్‌పై తప్పుడు కేసులు బనాయించారని, ఫలితంగా జగన్‌ ఆస్తులు సీబీఐ, ఈడీ అటాచ్‌లో ఉన్నాయన్నారు. 

న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండటం కోసమే జగన్‌ ఎన్‌సీఎల్‌టీకి అర్జీ పెట్టుకున్నారని వివరించారు.  అసలు చంద్రబాబు ఏనాడైనా తన ఆస్తులను తమ్ముళ్లు, చెల్లెమ్మలకు రాసిచ్చారా అని నిలదీశారు. చంద్రబాబు తన ఉనికి కోసం సొంత తమ్ముడు రామ్మూర్తినాయుడిని ఎదగకుండా చేశాడని విమర్శించారు.  చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డైవర్షన్‌ పాలి­టిక్స్, ప్రత్యర్థి పార్టీ నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని, శాంతిభద్రతలను పూర్తిగా వదిలేశారని ధ్వజమెత్తారు.

అనుబంధాల గురించి షర్మిల మాట్లాడటమా?
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు: శత్రువులతో చేతులు కలిపిన షర్మిలమ్మ కుటుంబ అనుబంధాలు, ప్రేమల గురించి మాట్లాడ­టం విడ్డూరమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతి­నిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ఆమె ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుమ్మక్కై ఆస్తి కోసం సొంత అన్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని బజారుకీడుస్తున్నారని ధ్వజమెత్తారు. శివప్రసాదరెడ్డి శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో మీడి­యాతో మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మర­ణం తర్వాత షర్మిలమ్మపై ప్రేమతో జగన్‌ స్వార్జితంలో సుమారు రూ.200 కోట్లు నగదు చెల్లించారని చెప్పారు.

ఇందుకు భారతమ్మ కూడా పూర్తి సహకా­రం అందించి గొప్పతనాన్ని చాటుకున్నారని తెలి­పారు. సరస్వతి పవర్‌ ఇండస్ట్రీస్, మిగతా ఆస్తులలో షర్మిలమ్మకు భాగం ఇవ్వాలనే ఎంఓయూ కుదుర్చు­కున్నారన్నారు. అయితే ఆస్తులు ఈడీ అటా­చ్‌మెంట్‌లో ఉండటతో బదలాయించలేదన్నారు. కేసులు పరిష్కారమయ్యే వరకు, న్యాయ సంబంధమైన సమ­­స్యలు రాకుండా ఉండేందుకు ఎంవోయూ ఇచ్చా­రన్నారు. షర్మిలకు చెందని ఆస్తి  కోసం చంద్రబాబు అండ్‌ కో తో  చేతులు కలిపి వైఎస్‌ జగన్‌ను మరో మారు జైలుకు పంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వైఎస్‌ జగన్‌కు రాష్ట్రంలో కోటి కుటుంబాలు అండగా ఉన్నాయన్న విషయం తెలుసుకోవాలన్నారు. 

షర్మిలమ్మ అత్యాశతో అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అసలు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియదని అన్నారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడుకు ఆస్తిలో వాటా ఇవ్వకపోవ­డంవల్లే మతి స్థిమితం కోల్పోయారని చెప్పారు. జూనియర్‌ ఎన్టీఆర్, నందమూరి వారసులకు ఆస్తి తగాదాలు లేవా అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, ఆయన సతీమణులకు భాగ పరిష్కారాల సమస్య లేదా అని ప్రశ్నించారు. 

వైఎస్సార్‌ వ్యతిరేకుల చేతుల్లో షర్మిల కీలుబొమ్మ
వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి 
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై షర్మిల చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం లాజిక్‌లేదని, ఆమె వైఎస్సార్‌ కుటుంబ వ్యతిరేకుల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయారని వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు వై. ఈశ్వర ప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. 

అటాచ్‌మెంట్‌లపై హైకోర్టు ఆంక్షలు భూమికి మాత్రమే వర్తిస్తాయని, వాటాల బదిలీకి కాదని ఆమె చెప్పారని.. నిజానికి, మెజారిటీ షేర్ల బదిలీ అంటే భూమితో సహా అన్ని ఆస్తులను బదిలీ చేయడంతో సమానమని.. ఇది హైకోర్టు అటాచ్‌మెంట్‌ ఉత్తర్వులకు విరుద్ధమని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విషయంలో షర్మిల, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన విధానాలను అనుసరించకుండా మెజారిటీ షేర్లను బదిలీ చేశారన్నారు. వాటా బదిలీ ఫారంలలో బదిలీదారుల సంతకాలు తీసుకోలేదని.. బదిలీ కోసం షేర్‌ సర్టిఫికెట్లు అందించలేదని ఆయన పేర్కొన్నారు. 

జగన్‌ బెయిల్‌ రద్దు చేయించాలనే..
ఇక జగన్‌ బెయిల్‌ రద్దు కావాలంటే ఎలా అని ఆలోచించి.. చివరకు పల్నాడు­లోని సరస్వతి పవర్‌ ప్రాజెక్టు ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిన అంశాన్ని పట్టుకు­న్నారన్నారు. తద్వారా.. దాని షేర్లు బదిలీ చేశారని చూపుతూ జగన్‌ బెయిల్‌ రద్దు చేయించాలని కుట్ర పన్నినట్లు ఈశ్వర్‌ప్రసాద్‌ తెలిపారు. 

తన బెయిల్‌ రద్దుచేసి, తిరిగి జైలుకు పంపించే కుట్ర చేస్తుండడంతో జగన్‌ న్యాయబద్ధంగా నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కు అప్పీల్‌ చేశారని వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని.. షర్మిల ఇప్పటికైనా ఈ దుష్టశక్తుల కుట్రల నుంచి బయటపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement