భద్రాచలం : ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన మండలాల్లో అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్ కార్యాలయాల నుంచి ఇప్పటికే ప్రాథమిక గెజిట్ రావటంతో అప్పగింతల కోసం ఇక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడో, రేపో ఫైనల్ గెజిట్ కూడా వస్తే విలీన మండలాలపై మన జిల్లా యంత్రాంగం అజమాయిషీ వదులుకోవాల్సి వస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి లేఖ రావటమే తరువాయి.. ముంపు మండలాలను ఏపీకి అప్పగించేందుకు జిల్లా అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ప్రభావం ముంపు మండలాల్లో అభివృద్ధి పనులపై పడింది. కొత్తగా పనులు చేపట్టే పరిస్థితి లేకపోగా, ఉమ్మడి రాష్ట్రంలో విడుదలైన నిధులతో జరుగుతున్న పనులు సైతం నిలిచిపోయాయి. ఇప్పటికే పూర్తయిన వాటికి మాత్రం బిల్లులు చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధానంగా ఐటీడీఏ, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల ఆధ్వర్యంలో రహదారులు, భవన నిర్మాణాలు, మౌలిక వసతుల పేరిటి వివిధ రకాల పనులు జరుగుతున్నాయి ఈ నెలాఖరు నాటికి ముంపు పనుల లెక్క తేల్చాలని వచ్చిన మౌఖిక ఆదేశాలతో ఆయా ఇంజనీరింగ్ శాఖల అధికారులు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నిధులు ఉన్నప్పటికీ, బిల్లుల మంజూరుకు ఎక్కడ ఇబ్బంది అవుతుందేమోనని ఆందోళనతో ఉన్న కాంట్రాక్టర్లు.. ఇప్పటివరకు చేపట్టిన పనులకు ఒక రూపాన్ని తీసుకొచ్చేందుకే ప్రాధాన్యత కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంపు మండలాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకం కింద ఎంపికై న ఖమ్మం జిల్లాలో రెండో దఫా నిధుల మంజూరుకు ఇక్కడి అధికారులు ప్రతిపాదనలు చేసినప్పటికీ, ముంపు మండలాలను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు.
అంతేకాకుండా ఆయా మండలాల్లో ఐఏపీ కింద మిగిలిపోయిన నిధులతో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు ఇప్పటికే టెండర్‌ల ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిసింది. దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి నుంచి అటవీప్రాంతం మీదగా చింతూరు మండలం దొంగల జగ్గారం వరకు, చింతూరు మండలం బొడ్డుగూడెం నుంచి బొడ్డుగూడెం కాలనీ వరకు రహదారుల నిర్మాణానికి 2012-13 సంవత్సర నిధుల నుంచి రూ.2.76 కోట్లు కేటాయించారు. ఈ పనులు వివిధ కారణాలతో ఆగిపోగా, ప్రస్తుతం వీటిని రద్దు చేశారు. అయితే మావోయిస్టుల హెచ్చరికలు, కాంట్రాక్టర్‌లు ముందుకు రాకపోవటం వంటి కారణాలతోనే ఆ ప్రాంతంలో రహదారులను పూర్తి చేయలేకపోయామని జిల్లా అధికారులు చెపుతున్నారు. ఇక ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించడంతో తిరిగి అక్కడ పనులు చేపట్టే పరిస్థితి లేదు. దీంతో ఈ నిధులను వెనక్కు తీసుకొచ్చి వేరే ప్రాంతంలో వినియోగిస్తున్నారని సమాచారం. కాగా, ఏపీలో విలీనమైన మండలాల్లో కొత్తగా అభివృద్ధి పనులను ఆ ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంటుంది.
‘ముంపు’లో పాలనకు సిద్ధమవుతున్న అధికారులు...
ఫైనల్ గెజిట్ విడుదలతో విలీన మండలాల్లో పాలనా పగ్గాలు చేపట్టేందుకు ఉభయ గోదావరి జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ముంపు మండలాల్లోని తహశీల్దార్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థానికులే కాగా, మిగతా కీలక శాఖల్లో కూడా ఏపీకి చెందిన అధికారులనే నియమించేందుకు ఉభయ గోదావరి జిల్లాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఉద్యోగుల బదిలీలు ఈ నెలాఖరు వరకూ జరుగనుండటంతో, ముంపు ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధపడే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా అక్కడి అధికారులు యోచిస్తున్నారు. ముంపులో ఉన్న ఉద్యోగులు ఎటువైపు ఉంటారనే దానిపై ఖమ్మం జిల్లా అధికారులు ఇప్పటికే వారి నుంచి ఆప్షన్‌లు తీసుకున్నారు. ఉద్యోగుల పంపకాల ప్రక్రియ ఈ నెలాఖరు నాటికి పూర్తి కావచ్చు. ఈలోగానే ముంపు మండలాల్లోని పోలీసులను వెనక్కు తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నెల్లిపాక కాదు.. ఎటపాక
ఏపీలో విలీనమైన భద్రాచలం రూరల్‌లోని గ్రామాలకు ఎటపాక మండల కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగించేందుకు తూర్పుగోదావరి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లిపాక మండల కేంద్రమని తొలుత ప్రకటించినప్పటికీ, అక్కడ మండల స్థాయి కార్యాలయాల నిర్వహణకు తగినన్ని భవనాలు అందుబాటులో లేవని, ఎటపాక అయితే ఇందుకు అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి వచ్చిన అధికారులు ఎటపాకలో ఉన్న భవనాలను పరిశీలించి వీడియో, ఫొటోలు తీసుకెళ్లారు.
పోలీస్ స్టేషన్‌ను కూడా ఎటపాక ప్రతిభా పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసే ఆలోచనలో భాగంగానే రెండు రోజుల క్రితం తూ.గో. జిల్లా పోలీసు శాఖ అధికారులు భవనాలు చూసి వెళ్లారు. నెల్లిపాక పేరుతోనే తాత్కాలికంగా ఎటపాకలో మండల కార్యాలయాలను నెలకొల్పి పరిపాలన సాగించే అవకాశాలు ఉన్నాయని ర ంపచోడవరంనకు చెందిన ఓ డివిజన్ స్థాయి అధికారి సాక్షికి తెలిపారు. ఎటపాకకు చెందిన కొంతమంది ఇటీవల ఏపీకి చెందిన మంత్రులను కలిసి మండల కార్యాలయాలను ఇక్కడే ఏర్పాటు చేయాలని విన్నవించటంతో పాటు, ఎటపాక సమీపంలో ఉన్న భవనాల ఫొటోలు, వీడియోలను వారికి చూపించారు.
అధునాతన భవనాలు అందుబాటులో ఉండటంతో ఎటపాకలోనే మండల కార్యాలయాలను ప్రారంభించాలని తూ.గో. జిల్లా అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. అయితే ఎటపాకతో పాటు ఈ దారిలో ఉన్న నాలుగు పంచాయతీలను తిరిగి తెలంగాణలోకి తీసుకురావాలని ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి.
అభివృద్ధికి బ్రేక్
Published Sun, Sep 14 2014 2:55 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
Advertisement
Advertisement