తేలిన లెక్క
భద్రాచలం: ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన నేపథ్యంలో విభజన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకూ ముంపు మండలాల్లో పాలన వ్యవహారాలన్నీ ఇక్కడి నుంచే కొనసాగించాలని జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ముంపు మండలాలను అప్పగించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం దీన్ని అంగీకరిస్తూ ఆ ఏడు మండలాలను ఇచ్చేయాలని ఏ క్షణానైనా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని భావిస్తున్న అధికార యంత్రాంగం.. ఇందుకు సంబంధించిన నివేదికలను సిద్ధం చే స్తోంది.
ఈ నేపథ్యంలోనే ఏడు మండలాల్లో ఉన్న విద్యాసంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించేందుకు గిరిజన సంక్షేమ విద్యాశాఖ లెక్క తేల్చింది. ఐటీడీఏ అధికారుల నివేదిక మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌చార్జి కమిషనర్ బెన్‌హర్ మహేష్ దత్ ఎక్కా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ నెల 22న లేఖ రాశారు. దీని ప్రకారం ఏడు మండలాల నుంచి గిరిజన సంక్షేమ విద్యాశాఖ పరిధిలో 141 విద్యా సంస్థ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించనున్నారు. వీటిలో 11,124 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న 575 మంది బోధన, 148 మంది బోధనేతర సిబ్బంది ఖమ్మం జిల్లా నుంచి వేరుచేయబడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుస్తారు.
ఏ మండలంలో ఎన్ని...
ఏడు మండలాల్లో గిరిజన సంక్షేమ విద్యాశాఖ పరిధిలో ఒక ఏటీడబ్ల్యూవో కార్యాలయం, ఒక రెసిడె న్షియల్ కళాశాల, 2 రెసిడెన్షియల్ పాఠశాలలు, 25 ఆశ్రమ పాఠశాలలు, 4 వసతి గృహాలు, 3 కేజీబీవీ లు, ఒక మినీ గురుకులం, 98 ప్రాధమిక పాఠశాలలు, 6 స్వయం పాలిత వసతి గృహాలు ఉన్నాయి. మండలాల వారీగా చూస్తే.. భద్రాచలంలో 21, బూర్గంపాడులో 3, చింతూరులో 46, కూనవరంలో 18, కుక్కునూరులో 14, వేలేరుపాడులో 12, వీఆర్‌పురంలో మండలంలో 27 విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించనున్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు.
ఎటపాకలోని విద్యాసంస్థలకు మినహాయింపు...
భద్రాచలం మండలంలోని ఎటపాక సమీపంలో పలు విద్యాసంస్థ లు ఉన్నాయి. ప్రతిభా పాఠశాల, కేజీబీవీ, పాలిటెక్నిక్ కళాశాల, నవోదయ విద్యాలయంలతో పాటు ఒకేషనల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్, ఇటీవలే నెలకొల్పిన యువ శిక్షణ కేంద్రం ఉన్నాయి. రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పది జిల్లాల విద్యార్థులు చేరుతారు. ప్రతిభ పాఠశాలలోనూ ఇదే రీతిన అడ్మిషన్‌లు కల్పిస్తారు. నవోదయ విద్యాలయంలో జిల్లాలోని 14 మండలాలకు చెందిన విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంది.
భద్రాచలం పట్టణంలోని కస్తూర్బా విద్యాలయాన్ని ఇటీవలే ఎటపాకలో గల నూతన భవనంలోకి మార్చారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలో గల గిరిజన నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మరికొన్ని భవనాలు నిర్మిస్తున్నారు. ఈ విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు తెలంగాణలోని పదిజిల్లాలకు చెందిన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయి. అంతే కాకుండా మిగిలిన భద్రాచలం డివిజన్‌లోని నాలుగు మండలాలు, జిల్లాలోని మిగతా గిరిజన ప్రాంతాల వారికి ఈ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించాల్సిన అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో ఎటపాకలో ఉన్న ఈ విద్యాసంస్థలను తెలంగాణలోనే ఉంచాల్సిన ఆవశ్యకతను ఐటీడీఏ పీవోదివ్య జిల్లా కలెక్టర్‌కు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు నివేదించారు. దీంతో కమిషనర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించేందుకు సిద్ధం చేసిన విద్యాసంస్థల జాబితాలో కూడా వీటి కి మినహాయింపు ఇచ్చిన అధికారులు, ఇందుకు గల కారణాలను కమిషనర్ తన లేఖలో వివరంగా ప్రభుత్వానికి తెలియజేశారు.
ఆ 17 గ్రామాలు ఇటే ఉంచండి..
భద్రాచలం మండలాన్ని ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించగా, ఒక్క భద్రాచలం రెవెన్యూ గ్రామాన్ని మాత్రం తెలంగాణలోనే ఉంచారు. అయితే తెలంగాణలోనే ఉన్న దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లాలంటే భద్రాచలం మండలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో గల కొన్ని గ్రామాలను దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. దీంతో అనేక ఇబ్బందులు వస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
భద్రాచలం రామాలయం భూములు ఉన్న పురుషోత్తపట్నం కూడా ఆంధ్రకే వెళ్లిపోవటం వల్ల భవిష్యత్‌లో సమస్యలు ఉత్పన్నమవుతాయని ఇక్కడి అధికారుల సూచన మేరకు ఈ విషయాన్ని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శికి కమిషనర్ రాసిన లేఖలో వివరించారు. భద్రాచలం మండలంలోని లక్ష్మీదేవిపేట, ఎటపాక, చంద్రంపాలెం, కొలనగూడెం, చింతలగూడెం, సీతంపేట, కన్నాయిగూడెం, తాళ్లగూడెం, మ దిమేరు, మిడిపర్ పేట, గట్టుగూడెం, పిచుకుల పాడు, తునికిచెరువు, శ్రీ నివాసపురం, పెర్గూసన్‌పేట, పురుషోత్తపట్నం, సీతారాంపురం రెవెన్యూ గ్రామాలను తెలంగాణలోనే ఉంచేలా చూడాలని కమిషనర్ కోరారు.