ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే కొనసాగించాలి
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: అశ్వారావుపేట ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా.. తొలి అసెంబ్లీ సమావేశాల్లో పోలవరం ముంపు మండలాలను తెలంగాణ భూభాగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేయనున్నట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం అశ్వారావుపేటలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఆదివాసీలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం అన్యాయమన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యే, ఎంపీలను తెలంగాణ ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నాక, ఆంధ్రాలో కలిపితే వారి సమస్యలను ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు.
ఐదేళ్లపాటు ముంపు ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలిపారు. గోదావరి తల్లిని నమ్ముకుని బతికే ఆదివాసీల హక్కులను కాపాడాలని అసెంబ్లీలో ప్రశ్నించనున్నట్లు తెలిపారు. రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలని, అశ్వారావుపేట ప్రాంతంలో మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరనున్నట్లు తెలిపారు.
అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమలో కార్మికుల ఈపీఎఫ్‌లను బొక్కేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని కార్మికులకు, రైతులకు న్యాయం చేయాలని ప్రశ్నించనున్నట్లు తెలిపారు. అశ్వారావుపేటలో డ్రెయినేజీ, సెంటర్‌లైటింగ్ ఏర్పాటు, పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరనున్నట్లు తెలిపారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ పుచ్చకాయల రాజశేఖరరెడ్డి, ఎంపీటీసీ కొల్లు వెంకటరమణ, బండారు శ్రీనివాసరావు, బుచ్చిబాబు పాల్గొన్నారు.