tati venkateswarlu
-
కాంగ్రెస్‌లోకి చేరికల తుపాన్ రాబోతోంది: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పోడు భూములకు పట్టాలిస్తానని ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక పోడు భూముల రైతుల్ని మర్చిపోయాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కర్కంగూడెం జడ్పీటీసీ సభ్యుడు కాంతారావు శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 'పోడు భూమి రైతులకు పట్టాలిచ్చి వారిని యజమానులను చేసింది కాంగ్రెస్ పార్టీ. వందల మంది ఆదివాసీల పైన కేసులు పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలను చిన్న చూపు చూస్తుంది. హరితహారం పేరు మీద దాడులు చేస్తున్నారు. గిరిజన భూములు లాక్కుని లే అవుట్లు వేస్తున్నారు. 11నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి. పేదల ప్రభుత్వం రావాలి. తొందరలోనే అశ్వారావు పేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. కాంగ్రెస్‌లోకి చేరికల తుపాన్ రాబోతోందని' టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చేరిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 'రుణమాఫీ హామీ ని గాలికొదిలేసారు. ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు నిర్మిస్తే అయిపోద్దా.. ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరణి వల్ల ప్రతి రైతు ఇబ్బంది పడుతున్నాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి భధ్రాచలం వచ్చి పోడు భూమి రైతులకు పట్టాలిచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే.. గిరిజనులకు న్యాయం జరుగుతుంది' అని తాటి వెంకటేశ్వర్లు అన్నారు. చదవండి: (Hyderabad: అరోరా కాలేజీలో జరగాల్సిన జేఈఈ పరీక్ష వాయిదా) -
మేమేం తక్కువ?.. అధికార టీఆర్ఎస్లో తారాస్థాయికి విభేదాలు
సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ జిల్లాకు వచ్చినప్పుడు అంతర్గత విభేదాలను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని హితబోధ చేశారు. అయినా పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని కొందరు నేతలు రగిలిపోతున్నారు. ఇప్పటి వరకు పలువురు నేతలు పరోక్ష విమర్శలకే పరిమితం కాగా.. తాజాగా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అధిష్టానంపైనే తిరుగుబావుటా ఎగుర వేశారు. తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే పార్టీ మారుతానని అల్టిమేటం జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన బాటలోనే మరికొందరు అసంతృప్తి వెల్లగక్కేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. చదవండి: కేటీఆర్ కంటే నేనే సీనియర్: తాటి ఆది నుంచీ అదే తీరు ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో ఆది నుంచీ ఇదే పరిస్థితి నెలకొంది. మొదటి నుంచీ ఉన్న ఉద్యమ నాయకులు.. ఆ తర్వాత చేరిన నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరగా.. అప్పటికే పార్టీలో ఉన్న నేతల నడుమ అంతరం పెరగడంతో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహారం కొనసాగుతోంది. 2014, 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్కు ఆశించిన ఫలితాలు రాలేదు. రెండు ఎన్నికల్లోనూ ఒక్కో అసెంబ్లీ స్థానం మాత్రమే గెలుచుకోగలిగింది. 2018 తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ మంచి విజయాలనే నమోదు చేసింది. అయినా నేతల నడుమ విభేదాలు అలాగే ఉండిపోయాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ నేతల నడుమ పొరపొచ్చాలు ఉండగా.. పాలేరు, వైరా, అశ్వారావుపేట, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో వర్గ పోరు తీవ్రమవుతుండడం గమనార్హం. కేటీఆర్ హితబోధ చేసినా.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాపై టీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఈనెల 11న ఖమ్మం వచ్చిన మంత్రి కేటీఆర్.. నాయకులతో మాట్లాడారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఈసారి మంచి ఫలితాలు సాధించేలా సమష్టిగా కృషిచేయాలని నచ్చజెప్పా రు. ఈ అంతర్గత సమావేశం తర్వాత కూడా కొందరు నేతల నడుమ సమన్వయం కుదరకపోగా, టీఆర్ఎస్లో తమ రాజకీయ భవిష్యత్ ఏమిటనే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గళం విప్పుతున్న నేతలు సుదీర్ఘకాలంగా పార్టీలో పని చేస్తున్నా సరైన అవకాశాలు రావడం లేదనే భావనలో పలు వురు టీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోందని, కనీస గౌరవం కూడా దక్కడం లేదని కొందరు నేతలు తమ అనుచరుల వద్ద వాపోతున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ఖమ్మం వచ్చిన సమయాన పీకే సర్వే నివేదికలు, పనితీరు ప్రామాణికంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. దీంతో తమను నమ్ముకున్న అనుచరులు, కార్యకర్తలకు న్యాయం చేయడమెలా అని కొందరు చర్చలు చేస్తుండగా.. పార్టీలో గుర్తింపు లేకపోతే తమ పరిస్థితి ఏమిటనే ఉద్దేశంతో నేరుగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. తాడో పేడో తేల్చుకునే క్రమంలో పార్టీ మారేందుకు కూడా వెనుకాడేది లేదని ఆయన హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతుండగా.. అదే బాటలో ఇంకొందరు అసంతృప్త నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. -
ఎమ్మెల్యే కారు ఢీకొని ఒకరికి గాయూలు
పెనుబల్లి: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పెనుబల్లి మండల కేంద్రంలోని వియంబంజర్ జిల్లా పరిషత్తు హైస్కూల్ వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. అశ్వారావుపేట నుంచి పెనుబల్లిలో జరిగే బహిరంగ సభ కు వెళ్తున్న ఎమ్మెల్యే కారు రోడ్డు దాటుతున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన రథం బ్రహ్మచారికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో ఖమ్మం తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. -
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
గండుగులపల్లి (దమ్మపేట): అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అశ్వారావుపేట నియోజకవర్గ అధికారులను రాష్ట్ర రోడ్లు-భవనాలు, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆయన శనివారం గండుగులపల్లిలోని స్వగృహంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో కలిసి నియోజకవర్గంలోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే... ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలవడం లేదు. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్ల బాగోగులు చూడటంలో అధికారులు విఫలమయ్యూరు ( (అధికారులపై అసహనం). గండుగులపల్లిలోని రోడ్డుకు ఆరేళ్ల క్రితం వర్షాలతో గండి పడితే ఇప్పటివరకు మరమ్మతు చేయలేదు. ఇక్కడ అధికార యంత్రాంగం పనిచేస్తోందా..(ఆగ్రహం)? మీ పనితీరులో నేటి నుంచే మార్పు రావాలి. బాధ్యతగా పనిచేయాలి. స్థానికంగా నివాసముండాలి. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించండి. ప్రభుత్వ కార్యాలయాలను దేవాలయాలతో సమానంగా చూడండి.అశ్వారావుపేట నియోజకవర్గాన్ని రాష్ట్రానికే మోడల్‌గా తీర్చిదిద్దాలి. జనవరి 1 నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దాలి. కార్యాలయ ఆవరణలో గార్డెన్ పెంచాలి. జనవరి మొదటి వారం నుంచి సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం సరఫరా అవుతుంది. దీనిని ఎంపీడీఓలు పర్యవేక్షించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధిని వేగవంతం చేయాలి. మీరు (అధికారులు) పనులను సక్రమంగా చేస్తే.. ఆ కీర్తి మీకే దక్కుతుంది. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు ప్రస్తుతం మంచి స్థానాల్లో ఉన్నారంటే.. వారి పని విధానమే కారణం. మీరు కూడా వారిలాగా పేరు తెచ్చుకోవాలి. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో పైరవీలకు ప్రాధాన్యమిస్తే సహించను (హెచ్చరిక). ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, పాల్వంచ ఆర్డీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సత్తుపల్లి: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయూలని, సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో ఆయన శనివారం స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే... తల్లిదండ్రులు, ఈ సమాజం దయతో మనందరికీ మంచి అవకాశాలు వచ్చారుు. సమాజంపట్ల అంకితభావంతో పనిచేయాలి. సత్తుపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే మార్గదర్శకం(రోల్ మోడల్)గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రాజకీయ నాయకులు వస్తారు.. పోతారు. మాకన్నా మీ పైనే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా, ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి. మిమ్మల్ని మంత్రిగా ఆదేశించటం లేదు.. ప్రాధేయపడుతున్నా. ప్రజల కోసం మనందరం కలిసి సత్సంకల్పంతో పనిచేద్దాం. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వంగా వ్యవహరించినా ఉపేక్షించేది లేదు (హెచ్చరిక). పెన్షన్లు, ఆహార భద్రత కార్డుల విచారణను ఇప్పటివరకు పూర్తిచేయలేకపోయారు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది..? గ్రామాలలో ఎవరు లబ్ధిదారులో.. ఎవరు కాదో తేల్చడానికి వీఆర్వోలు, వీఆర్ఏలకు ఎందుకింత సమయం పడుతోంది? ఏ ఆధారం లేని వారికి తినటానికి బియ్యం ఇద్దామన్నా మీ కారణంగా ఆలస్యమవుతోంది. పేదల విషయంలో తప్పు చేయవద్దు. అర్హులకు అన్యాయం జరగకూడదు. ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ఈసారి పర్యటనప్పుడు.. ‘పెన్షన్ రాలేదు.. కార్డులు రాలేదు.. సంక్షేమ పథకాలు అందలేదు’ అనే ఫిర్యాదులు రాకూడదు. మీకు పై అధికారుల నుంచి పరిపాలనాపరంగా ఇబ్బందులేమైనా వస్తే నేరుగా నా దృష్టికి తీసుకురండి. వాటిని తొలగించాల్సిన బాధ్యతను నేను తీసుకుంటా. నిధుల కొరత లేదు. అభివృద్ధిని పరుగులు పెట్టించండి. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, ఖమ్మం ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేనున్నా..
అశ్వారావుపేట నియోజకవర్గం కుక్కునూరు మండలం తొండిపాక పంచాయతీ బంజరగూడెం భవిత అంధకారంగా మారింది. పోలవరం ముంపులో లేనప్పటికీ ఈ గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. అంతే ఇక్కడి పరిహారం, పునరావాసం అంతా అయోమయంగా మారింది..స్కాలర్షిప్, ఉన్నత విద్య అందని ద్రాక్షే అయ్యాయి. కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగ భద్రత గాలిలో దీపంలా దర్శనమిస్తోంది.. ఆరుగాలం కష్టం, అప్పుచేసి సాగు చేసిన పంట అంతా ఊడ్చిపెట్టుకుపోగా.. రుణమాఫీ వర్తించకపోతుందా..? అనే నమ్మకం వమ్మైయింది. అప్పుచేసి కట్టుకున్న ఇంటికి బిల్లురాలేదు..కొత్త ఇల్లు కట్టిస్తామని ఉన్న ఇల్లు పీకించిన అధికారులు పత్తా లేకుండా పోయారు. రేషన్‌కార్డుతో పాటు బియ్యమూ పోయాయి. వైకల్యం ఉన్నా పింఛన్ రావట్లేదు..తాటాకుల గుడిసెలో ఉంటున్నా ఇల్లు మంజూరుకావట్లేదు.. అటువంటి ఈ గ్రామాన్ని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆదివారం సాయంత్రం సందర్శించారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా గ్రామస్తులను పలుకరించారు. ‘మీ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం’ అని భరోసా ఇచ్చారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన మీ కోసం.. నాతోటి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలైనా ఇస్తా. మీకు సేవ చేస్తానని, అభివృద్ధిపథంలో తీసుకెళ్తానని నమ్మి ఓట్లేశారు. ముంపు సాకుతో మిమ్మల్ని ఆంధ్రలో కలిపారు. ఆంధ్ర అసెంబ్లీలో అవకాశం కల్పిస్తే తప్పక మీకు న్యాయం చేస్తా. - తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు: ఓ సర్పంచ్ అక్కా..ఎట్టాగుంది మనూరు? సమస్యలేమైనా ఉన్నాయా? పర్సిక సీతమ్మ (సర్పంచ్): ఊళ్లో నీళ్లు లేవు. మంచినీరు, విద్యుత్ సమస్యలున్నాయి. అభివృద్ధి చేద్దామన్నా నిధులు రావట్లేదు. మీరు తెలంగాణ ఎమ్మెల్యే అయిపోయారు..మమ్మల్ని ఆంధ్రలో కలిపిండ్రు. ఇప్పుడేంది పరిస్థితి. తాటి: పెద్దాయనా బాగున్నారా? ఏమి సమస్యలున్నాయి..? నరుకుళ్ల కొర్రయ్య: రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ రజాకార్ల నాటి పరిస్థితి వచ్చింది. ఏ సమస్య ఎవరికి చెప్పుకోవాలో..ఎవర్ని అడగాలో తెలవట్లేదు. ఎవరూ పట్టించుకోవట్లేదు. తాటి: పెద్దమ్మ ఇదేనా నీ ఇల్లు.. దీంట్లో ఎట్లుంటున్నవ్? హసీనా బేగం: నాకున్న ఆస్తి ఈ ఇల్లేనయ్యా. ఇల్లు కాలిపోయిన తర్వాత నాలుగు కర్రలు అడ్డంపెట్టుకొని బతుకుతున్నా. నా గురించి పట్టించుకునేటోళ్లు లేరయ్యా. ఆంధ్ర అధికారులు ఒక్కళ్లు కూడా రాలేదు..మా గతేమవుతుందో నాయనా.. తాటి: అక్కా చెప్పు నీ సమస్య ఏమిటి..? ఎలాగున్నారు..? కీసర బుల్లెమ్మ: అయ్యా ఇల్లు క ట్టుకున్నాక బిల్లు ఇస్తమన్నరు. దొరికిన చోటల్లా అప్పుజేసి మధ్యవర్తులకిచ్చి ఇల్లు కట్టుకున్న. తీరా బిల్లు ఇయ్యట్లేదు. మా ఇళ్ల బిల్లులు తెలంగాణ అధికారులిస్తరో..ఆంధ్ర అధికారులిస్తరో తెలవట్లే. అప్పులిచ్చినోళ్లు ఒకటే అడుగుతున్నరు. తాటి: బాబూ నీకు పింఛన్ ఇస్తున్నారా? ఎండీ సాదిక్‌అలీ: నాకు పింఛన్ ఎవరిచ్చారు సారు. అన్ని సర్టిఫికెట్లూ ఉన్నాయి. పింఛన్ మాత్రం రావట్లేదు. తాటి: రైతులుగా మీ సమస్యలేంటో చెప్పండి? యడవల్లి సతీష్ : సార్, నా వ్యవసాయ ఖాతా సారపాక బ్యాంకులో ఉంది. నా పొలం కుక్కునూరు మండలంలో ఉంది. నాపొలం, ఇల్లూ అన్నీ ఆంధ్రప్రదేశ్‌లో కలిపేశారు. బ్యాంకు ఖాతా తెలంగాణలో ఉంది. బ్యాంకుకు వెళ్లి రుణమాఫీ వచ్చిందా అని అడిగితే.. వచ్చిందీ, రానిదీ చెప్పకుండా ‘మీ తహశీల్దార్‌కు జాబితా పంపించాం చూసుకోండంటున్నారు.’ ఇక్కడికొస్తే తెలంగాణ బ్యాంకులతో మాకు సంబంధం లేదంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు సారు. తాటి: ఏం తాతా నీ సమస్యేమిటి.. ఆరోగ్యం బాగుంటుందా..? సడియం వెంకయ్య: పింఛన్ రావట్లేదు. చాలాసార్లు దరఖాస్తు చేశాను. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అన్ని చాలా సార్లు ఇచ్చాను. అయినా పింఛన్ ఇయ్యట్లే. తాటి: ఏమ్మా.. పిల్లను తీసుకొచ్చావు.. ఏంటి సమస్య? వేదమ్మ: అయ్యా ఈ బిడ్డ నామనుమరాలు. పేరు భద్రమ్మ.. మాటలురావు. తన పనులు తను చేసుకోలేదు. అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి. ఈ పిల్లకు పింఛన్ రావట్లేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇయ్యట్లేదు. మీరే ఇప్పించాలయ్యా. తాటి: ఏం తల్లీ నీ సమస్యేంటి? వంకా సూరమ్మ: నాకు బియ్యం కార్డు ఇచ్చి 9 నెలలయింది. కానీ ఒక్క నెలయినా బియ్యం ఇయ్యలేదు. ఆధార్ కార్డు ఇవ్వమంటే ఇచ్చాను. అయినా బియ్యం రాట్లేదు. తాటి: ఓ అవ్వా.. నువ్వు కూడా ఇంతమందిలో నిల్చున్నావ్..నీకేమి సమస్య? నాగమ్మ : నాకు రెండు కళ్లు కానరావయ్యా.. నాభర్త చనిపోయి 11 ఏళ్లయింది. నాకు పింఛన్ ఇచ్చినోళ్లు లేరు. ఏమేమో కాయితాలు కావలంటున్నరు. నాకు పింఛన్ ఇస్తరో..ఇవ్వరో..ఎట్ల బతికేదయ్యా. తాటి: సుశీల..నీ సమస్యేమిటో చెప్పమ్మ? వంకా సుశీల: మరుగుదొడ్లు లేని ఇళ్లు సర్వే చేసుకున్నోళ్లు మళ్లీ ఇంటింటికీ వచ్చిండ్రు. మరుగుదొడ్డి కట్టుకున్నాక బిల్లు ఇస్తమన్నరు. తీరా అప్పులు చేసుకుని కట్టుకున్నాక అధికారులు మొహం చాటేసిండ్రు. అప్పులిచ్చినోళ్లు కట్టమంటుండ్రు. తాటి: బాబు చదువుకున్నవాడిలా ఉన్నావ్? నీ ప్రాబ్లమేంటి? వెలకం బాలకృష్ణ: సారూ నేను డిగ్రీ చేశా. ముల్కలపల్లి మండలంలో ఫారెస్టు బేస్‌క్యాంపు లో పనిచేస్తున్నా. మా ఊరు ఆంధ్రలో పోయిం ది. నేను ఉద్యోగం చేసే ప్రాంతం తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తే నేను అర్హున్నా.. కాదా? తెలియడం లేదు. తాటి: తమ్ముడూ నువ్వు చెప్పు సమస్యేంటి? మెద్దినేని శ్రీనివాసులు: సార్ నేను భద్రాచలంలో చదువుతున్నాను. మా ఊరు ఆంధ్రలో ఉంది.. కాలేజీ తెలంగాణలో ఉంది. మా కాలేజీలో చదువుకునే ముంపు మండలాల విద్యార్థులందరికీ ఒకటే సమస్య. తెలంగాణలో చదివే ముంపు మండలాల విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ వస్తుందా? రాదా?. తాటి: ఏమ్మా వార్డు మెంబర్..నీకేంటి ప్రాబ్లమ్? మడకం చిట్టెమ్మ: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. కానీ ఏ ప్రభుత్వం చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన మాటలు మాకు వర్తిస్తయో... లేదో తెలవట్లేదు. తాటి: నీ సమస్యేమిటమ్మా? వంకా లక్ష్మి: మరుగుదొడ్లు కట్టకపోతే రేషన్‌బియ్యం ఆపుతమన్నరు. భయంతో కట్టినం. ఇప్పుడు బిల్లులురాలేదు. అప్పులపాలైనం. -
గిరిజన సమస్యలపై స్పందించాలి
శాసనసభలో వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు అశ్వారావుపేట: గిరిజన సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని శుక్రవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తాను మాట్లాడిన అంశాలను ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆయన ఏమన్నారంటే... ‘‘ప్రజాసమస్యలను శుక్రవారం అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశాను. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించాను. రైతాంగానికి పగటి వేళ ఏడు గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశాను. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూములు అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తారంగా ఉన్నాయని చెప్పాను. గిరిజన యూనివర్సిటీని సత్వరమే మంజూరు చేయూలని కోరాను. నియోజకవర్గంలోని పెదవాగు, అబ్బుగూడెం, మూకమామిడి ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి మరమ్మతులు చేయించి ఆయకట్టును పటిష్టపరచాలని కోరాను. నియోజకవర్గంలోని రహదారులను మెరుగుపరచాలని, రైతులకు డ్రిప్ పరికరాలు సరఫరా చేయాలని, గతంలో జరిగిన కుంభకోణాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాను. ఎన్నికలకు ముందు నిర్మించుకున్న కాలనీ ఇళ్లకు బిల్లులు నిలిచిపోయాయని చెప్పాను. వాటిని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశాను. పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, సహాయక సిబ్బందికి గౌరవ వేతనాలు పెంచాలని కోరాను’’ అని చెప్పారు. -
ప్రభుత్వాన్ని నిలదీస్తాం: పొంగులేటి
హైదరాబాద్: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, విద్యుత్ సంక్షోభంపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ, ప్రజా సమస్యలపై తమ గళం విన్పిస్తుందని తెలంగాణ శాసనసభ పక్ష నేత తాటి వెంకటేశ్వర్లు, ఉప నాయకుడు పాయం వెంకటేశ్వర్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
జన్మభూమి కాదు కర్మభూమి
కుక్కునూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం ముంపు మండలాల ప్రజల పాలిట కర్మభూమిగా మారిందని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు విమర్శించారు. కుక్కునూరు ప్రాథమిక పాఠశాలలో సోమవారం తహసీల్దార్ సుమతి అధ్యక్షతన ‘జన్మభూమి- మాఊరు’ కార్యకమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలవరం నిర్మాణం పేరుతో ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుకున్న పాలకులు ఇక్కడి ప్రజల బాగోగులను పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. ఏపీలో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండ లాల్లో ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు ఏమీ లేవన్నారు. వరదలతో నష్టపోయిన పంటలను వ్యవసాయాధికారులు ఇంతవరకు ఎందుకు సర్వే చేయలేదని ప్రశ్నించారు. వర్షాల కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రబీ పంటల సాగుకు ఉచితంగా విత్తనాలు, ఎరువులను పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పింఛన్లు ఎప్పుడు ఇస్తారు... ? వృద్ధులు, వికలాంగులకు పెంచిన పింఛన్లను ఎప్పుడు ఇస్తారని ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు ప్రత్యేకాధికారిని ప్రశ్నిం చారు. విభజన కారణంగా ముంపు మండలాలకు చెందిన లబ్ధిదారుల వివరాలను తీసుకోవడంలో ఆలస్యం జరిగిందని రెం డు రోజుల్లో పింఛన్ డబ్బులను చెల్లిస్తామని ప్రత్యేకాధికారి సమాధానమిచ్చా రు. కార్యక్రమంలో సర్పంచ్ మడకం సుజాత, ఉపసర్పంచ్ దండు నారాయణరాజు, సీపీఎం మండల కార్యదర్శి కొన్నె లక్ష్మయ్య, సీపీఐ(ఎంఎల్)నాయకులు ఎస్కె.గౌస్, బాసినేని సత్యనారాయణ. వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పగిళ్ల అల్లేశ్, మండల అధ్యక్షుడు కుచ్చర్లపాటి నరసింహరాజు, నాయకులు మన్యం సత్యనారాయణ, మాదిరాజు వెంకన్నబాబు, రావు వినోద్, రాయి రవీందర్, నకిరకంటి నరసింహారావు పాల్గొన్నారు. వంద రోజుల పాలనలో ఏమి సాధించారు..? దమ్మపేట: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు తమ వంద రోజు ల పాలనలో ఏమి సాధించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ పక్షనేత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. మం దలపల్లి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. రెండు రాష్టాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్ప డి వంద రోజులు గ డిచినా ప్రజలకు చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న బాధితులకు పరి హారం చెల్లించే విషయంపై ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌లు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. తన నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం కనీసం ఆహ్వానం ఇవ్వలేదని, ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు టీడీపీ నాయకులు తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రాలో తెలుగుదేశం ఎంపీ, ఎమ్మెల్యేలు నకిలీ నక్సలైట్లను వెంట బెట్టుకుని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ర్టంలో వ్యవసాయానికి ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సోయం వీరభద్రం, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు దారా యుగంధర్, పట్టణ అధ్యక్షుడు పగడాల రాంబాబు, పాకనాటి శ్రీనివాస్, వాల్మీకి రాంబాబు పాల్గొన్నారు. -
గిరిజన ఎమ్మెల్యేపై దాడి అమానుషం..
బూర్గంపాడు : తెలంగాణవాదం వినిపించినందుకు ఓ గిరిజన ఎమ్మెల్యేపై దాడికి పాల్పడటం అమానుషమని జిల్లాకు చెందిన భద్రాచలం, ఇల్లెందు, వైరా ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, కోరం కనకయ్య, బానోతు మదన్‌లాల్‌లు అన్నారు. మండలంలోని సారపాకలో ఉన్న అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును శుక్రవారం వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలీనం ప్రక్రియ పూర్తికాకుండానే ఆంధ్రాప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు భౌతికదాడులకు దిగటం శోచనీయమన్నారు. ఈ దాడి కేవలం ఓ గిరిజన ఎమ్మెల్యేపై జరిగింది కాదని తెలంగాణ ఆత్మగౌరవంపై జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన జిల్లాలోని ఏడు ముంపు మండలాలకు చెందిన ఓటర్లు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు ఓట్లు వేసి గెలిపించారనే విషయం ఆంధ్రా పాలకులు గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధికారుల పాలనలోనే ముంపు మండలాలు ఉన్న విషయం ఆంధ్రా పాలకులు గుర్తుంచుకోవాలన్నారు. గిరిజనుల్లో భయాందోళనలను కలిగించేందుకే ఎమ్మెల్యే తాటిపై దాడికి పాల్పడ్డారన్నారు. ముంపు మండలాల్లో గిరిజనుల మనోభావాలను దెబ్బతిసే విధంగా గిరిజన ఎమ్మెల్యేపై భౌతిక దాడికి దిగిన టీడీపీకి ప్రజలు తగిన విధంగా బుద్ధిచెబుతారని అన్నారు. ముంపు మండలాల ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలుగా వారి బాగోగులను చూసుకునేవిధంగా ఆశ్వారావుపేట, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలకు అవకాశాలు కల్పించేందుకు రెండురాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే తాటిపై జరిగిన భౌతికదాడిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన 13మంది గిరిజన ఎమ్మెల్యేలం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, గవర్నర్ నరసింహన్‌కు, స్పీకర్ మధుసూధనచారికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తాటిని పరామర్శించిన వారిలో జిల్లా నాయకులు మచ్చా శ్రీనివాసరావు, మాజీ డీసీసీబీ చైర్మన్ యలమంచిలి రవికుమార్ తదితరులున్నారు. -
ఆదివాసీ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తా
వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు సారపాక(బూర్గంపాడు): ఆదివాసీల సమస్యలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని వైఎస్సార్సీపీ శాసనసభ పక్షనేత, ఆశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్టీ వర్గీకరణ కోరుతూ గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సారపాకలోని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంటి ఎదుట ఆదివాసీలు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డ కాబట్టే తాను ఎమ్మెల్యేను కాగలిగానని అన్నారు. ఆదివాసీల న్యాయపోరాటానికి అండగా ఉంటానన్నారు. పాలకులకు ఆదివాసీల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. ఆదివాసీ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఏజెన్సీలో నిజమైన ఆదివాసీలకు న్యాయం జరిగేంత వరకూ పోరాటాలు కొనసాగించాలన్నారు. వాటికి తన మద్దతు ఉంటుందన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు సొందె వీరయ్య మాట్లాడుతూ ఎస్టీ వర్గీకరణ డిమాండ్‌తో రాష్ట్రంలోని ఆదివాసీ ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామన్నారు. 1956 నుంచి 1970 వరకు ఆదివాసీలకు అమలు చేసిన నాలుగు శాతం రిజర్వేషన్లను ఇప్పుడు కూడా వర్తింపజేయాలన్నారు. 1970 తర్వాత పెంచిన 2 శాతం రిజర్వేషన్లు యరుకల, యానాది, లంబాడీలకు అమలు చేయాలన్నారు. ఉమ్మడిగా రిజర్వేషన్ల అమలుతో ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందనే ఆవేదన్య వ్యక్తం చేశారు. ఆదివాసీల భూములు బంజారాలు కొనకుండా కోనేరు రంగారావు కమిటీ చేసిన సిఫార్సులను అమలుచేయాలన్నారు. కార్యక్రమంలో మానవహక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి దాగం ఆదినారాయణ, పాయం సత్యనారాయణ, ముర్రం వీరయ్య, సొడె చలపతి, గొంది లీలాప్రసాద్, ఇర్పా ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
మాట నిలుపుకున్న ఎమ్మెల్యే తాటి
కుక్కునూరు: 2004వ సంవత్సరం. బూర్గంపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాటి వెంకటేశ్వర్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సమస్యలను తెలుసుకునేందుకు కుక్కునూరు మండలంలో పర్యటిస్తూ వింజరం గ్రామానికి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన వికలాంగురాలు గామాలపాటి లావణ్య తన సమస్యను ఎమ్మెల్యే వద్దకు తీసుకొచ్చింది. ‘‘మాది పేద కుటుంబం. తల్లిదండ్రులు కూలికి వెళితేనే పూట గడుస్తుంది.. నేను (వైకల్యం) ఎదుగుదల లోపంతో బాధపడుతున్నాను. ఫించన్ కూడా రావడం లేదు. 8వ తరగతి చదువుకున్నాను. ఏదైనా చిన్నపాటి ఉద్యోగం ఇప్పించండి’’ అని కోరింది. ఆ చిన్నారిని వేదన విన్న ఎమ్మెల్యే తాటి చలించారు తక్షణ సహాయాన్ని అందించారు. ఆ బాలికకకు శాశ్వత ఉపాధి కల్పించాలని అనుకున్నారు. ‘‘నీకు మంచి ఉద్యోగం రావాలంటే... కనీసం డిగ్రీ వరకు చదువుకో.. తప్పక ఉపాధినో, ఉద్యోగమో ఇప్పిస్తాను’’ అని మాటిచ్చారు. ఎమ్మెల్యే చెప్పినట్టుగానే ఆమె డిగ్రీ పూర్తిచేసింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 500 రూపాయల ఫించన్ పొందింది. ఆ తర్వాత ఫించన్‌దారులను తగ్గించేందుకు భద్రాచలంలో నిర్వహించిన ‘సదరన్ క్యాంప్’తో ఫించన్‌కు దూరమైంది. అప్పటి నుంచి తల్లిదండ్రులతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళుతోంది. మాటిచ్చిన సారే.. మళ్లీ ఎమ్మెల్యే ఉపాధి పనులకు వెళ్తున్నప్పటికీ ఇంట్లో ఇబ్బందులు ఉండటంతో ఉద్యోగం సాధించుకోవాలని లావణ్య ఆలోచించింది. మాటిచ్చిన అప్పటి సారే.. మళ్లీ అశ్వారావుపేట ఎమ్మెల్యే అయ్యారు. ఆయనను కలవాలనుకుంది. అనుకున్నదే తడవుగా తండ్రి సత్యనారాయణతోపాటు మంగళవారం సారపాకకు వెళ్లి ఎమ్మెల్యేను కలిసింది. ఆనాడు తనకిచ్చిన మాటను గుర్తు చేసింది. ‘‘మీరే ఏదైనా దారి చూపాలి’’ అని కోరింది. స్పందించిన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు.. ఆ ఇద్దరినీ తన కారులో ఎక్కించుకుని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ వద్దకు తీసుకెళ్లారు. ఆ ఆమ్మాయి సమస్యను కలెక్టర్‌కు వివరించారు. విద్యార్హతనుబట్టి ఉద్యోగం ఇప్పించాలని కోరారు. స్పందించిన కలెక్టర్... ‘ఉపాధి హామీ’ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా తనకు ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు ఆమె ధన్యవాదాలు చెప్పింది. -
కూలీల శ్రమను దోచుకుంటారా..
దమ్మపేట: ‘‘ఉపాధి కూలీల శ్రమను దోచుకుంటారా...? రెక్కలు ముక్కలయ్యేలా నెలల తరబడి పనులు చేయించుకుని వేతనాలు ఇవ్వకుండా దిగమింగుతారా..? మీరు (అధికారులు) తిన్న సొమ్మంతా కక్కాల్సిందే. అప్పటివరకు కూలీలకు అండగా ఉంటా. వారి తరఫున ఏ పోరాటానికైనా వెనుకాడేది లేదు. కూలీల వేతన బకాయిల చెల్లింపు సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఇక్కడి నుంచి (ఈజీఎస్ కార్యాలయం) కదిలేది లేదు’’ అంటూ, ఉపాధి హామీ పథకం అధికారులపై వైఎస్ఆర్ సీపీ శాసన సభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహోదగ్రులయ్యా రు. ఉపాధి కూలీలతో కలిసి దమ్మపేటలోని ఉపాధి హామీ పథకం(ఈజీఎస్) కార్యాలయం వద్ద భైఠాయించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు: దమ్మపేట మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు చేసిన తమకు రావాల్సిన వేతన బకాయిలను చెల్లించాలన్న డిమాండుతో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (సీపీఎం) ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ ఈజీఎస్ కార్యాలయం వద్ద ఉపాధి కూలీలు ధర్నాకు దిగారు. అదే సమయంలో, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అటుగా వె ళుతూ అక్కడ ఆగారు. ఆయనకు సీపీఎం నాయకులు, ఉపాధి కూలీలు కలిసి సమస్యను వివరించారు. దీనిపై ఆయన తీవ్రం గా స్పందించారు. కూలీలతో కలిసి ఈజీఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నిరుపేద కూలీలను కూడా వదలరా...?! ఉపాధి కూలీలనుద్దేశించి తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ‘‘ఉపాధి పనులతో పొట్ట పోసుకుంటున్న నిరుపేద కూలీలను కూడా అధికారులు వదలరా..? వారి వేతనాలను బొక్కేస్తారా..? మీకు రావాల్సిన వేతన బకాయిలన్నీ ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదు’’ అని అన్నారు. కూలీలతోపాటు ఎమ్మెల్యే కూడా ధర్నాకు దిగడంతో ఈజీఎస్ స్థానిక అధికారులు కలవరపడ్డారు. వారు తమ పైఅధికారులకు సమాచారమిచ్చారు. ఈజీఎస్ పీడీ వెంకటనర్సయ్య, ఏపీడీ వెంకటరాజు ఫోన్ ద్వారా ఎమ్మెల్యేను శాంతింపచేసేందుకు ప్రయత్నిం చారు. ఎమ్మెల్యే మాత్రం.. ‘‘మీరు ఇక్కడికి వచ్చి, నా సమక్షంలో ఇక్కడి కూలీలకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమిం చేది లేదు. అవసరమైతే ఈ (ఈజీఎస్) కార్యాలయానికి తాళాలు వేస్తాం’’ అని హెచ్చరిం చారు. చివరికి, కచ్చితంగా 15 రోజుల్లో కూలీల వేతన బకాయిలను చెల్లిస్తామని ఆ అధికారులు విస్పష్టంగా చెప్పడంతో ఎమ్మెల్యే శాంతిం చారు. ‘‘అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చా రు. ఇప్పడు ఈ ఆందోళనను తాత్కాలికంగా విరమిద్దాం. వారు చెప్పిన గడువు నాటికి వేతనాలు చెల్లించకపోతే మళ్లీ ఆందోళన తప్పదు’’ అని హెచ్చరించారు. కూలీలతో కలిసి దాదాపు రెండు గంటలపాటు ఎమ్మెల్యే బైఠాయించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి దొడ్డా లక్ష్మీనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పిల్లి నాయుడు, నాయకుడు రావి విశ్వనాధం, ముష్టిబండ సర్పంచ్ బుద్దా రాజు, వైఎస్ఆర్ సీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు దారా యుగంధర్, పట్టణ అధ్యక్షుడు పగడాల రాంబాబు, నాయకుడు పాకనాటి శ్రీను పాల్గొన్నారు. -
బయ్యారంలోనే స్టీల్ ప్లాంట్!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం ఎక్కడనేది దాదాపు తేలిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా మెలిక పెడితే తప్ప బయ్యారం మండలంలోనే ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విపక్షాల సభ్యులు మాట్లాడిన అనంతరం.. కేసీఆర్ సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ప్లాంట్‌ను బయ్యారంలోనే ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన సందర్భంగా బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని పలు రాజకీయ పార్టీలు ప్రతిపాదించాయి. వైఎస్సార్సీపీ పక్షాన ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు గురించి గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదని, జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ద్వారా జిల్లాలో నిరుద్యోగ గిరిజన యువకులకు ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న సభ్యుల విజ్ఞప్తికి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందన్నారు. బయ్యారంలో ఏర్పాటు చేస్తేనే వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఉన్న ఇతర ఖనిజ సంపదను కూడా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఇటీవల ప్రధాన మంత్రి మోడీని కలిసిన సందర్భంగా ఇచ్చిన వినతిపత్రంలో కూడా బయ్యారంలోనే పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరినట్టు వెల్లడించారు. దీంతో జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కేంద్ర సాధికార కమిటీకి జిల్లా యంత్రాంగం ప్రతిపాదించిన ఇతర ప్రాంతాలను ఇక పరిశీలించే అవకాశం లేద ని తెలుస్తోంది. బయ్యారంలోనే ఎందుకు..? జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కేంద్ర సాధికార కమిటీ గత నెల 21, 22 తేదీల్లో జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) నుంచి నిపుణుల బృందం జిల్లా అధికారులు ప్రతిపాదించిన బయ్యారం మండలం ధర్మాపురం, కొత్తగూడెం మండలం కూనారం గ్రామాలకు ఉన్న అనుకూల, ప్రతికూలతలపై అధ్యయనం చేసింది. ఈ కమిటీ సమర్పించే నివేదిక మేరకు సెయిల్ తీసుకునే నిర్ణయానికి కేంద్ర ఆమోదం లభిస్తే జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి అంకురార్పణ జరగనుంది. అయితే, అధికారులు ప్రతిపాదించిన రెండు ప్రాంతాల్లో బయ్యారం మండలమే అనుకూలమనే వాదన వినిపిస్తోంది. బయ్యారంలో ఓవైపు ముడి ఇనుప ఖనిజం తీసినా.. మరోవైపు సేఫ్ జోన్‌గా ఫ్యాక్టరీ నిర్మాణానికి అనువైన భూమి ఉండడంతో పాటు, రఘునాథపాలెం పవర్ గ్రిడ్ నుంచి విద్యుత్, పెద్ద చెరువు లేదా మున్నేరు నుంచి నీరు వినియోగించుకునే సౌకర్యం ఉన్నాయి. బయ్యారం నుంచి ఇటు సికింద్రాబాద్, అటు విజయవాడ వెళ్లేందుకు 14 కిలోమీటర్ల దూరంలో రైలుమార్గం ఉంది. సింగరేణి కాలరీస్ పరిధిలో జిల్లాలోని ఇల్లెందు, కోయగూడెం, కొత్తగూడెం, మణుగూరు, వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఓపెన్‌కాస్టు, అండర్‌గ్రౌండ్ మైన్స్ నుంచి బొగ్గు వచ్చే అవకాశం ఉంది. అలాగే బయ్యారానికి 30 కిలోమీటర్ల దూరంలో రఘునాథపాలెం మండలం బూడిదంపాడు గ్రామంలో ఉన్న ఎన్పీడీసీఎల్ పరిధిలోకి వస్తున్న 220 కేవీఏ/400 కేవీ గ్రిడ్ అందుబాటులో ఉంది. కాగా, కొత్తగూడెంలో బొగ్గు, కిన్నెరసాని నీటి వనరులున్నా అక్కడ అంతా అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు ఉండడం ఇక్కడ ప్రతికూలంగా ఉంది. దీనిపై జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. భారీ ప్రాజెక్టు నిర్మించిన చోట యూజీ మైనింగ్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే అసలుకే మోసం వస్తుందనే భావన జీఎస్ఐ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బయ్యారం అయితేనే మంచిదనే ఆలోచనలో అటు సెయిల్, జీఎస్ఐ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. -
ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే కొనసాగించాలి
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: అశ్వారావుపేట ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా.. తొలి అసెంబ్లీ సమావేశాల్లో పోలవరం ముంపు మండలాలను తెలంగాణ భూభాగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేయనున్నట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం అశ్వారావుపేటలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఆదివాసీలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం అన్యాయమన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యే, ఎంపీలను తెలంగాణ ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నాక, ఆంధ్రాలో కలిపితే వారి సమస్యలను ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. ఐదేళ్లపాటు ముంపు ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలిపారు. గోదావరి తల్లిని నమ్ముకుని బతికే ఆదివాసీల హక్కులను కాపాడాలని అసెంబ్లీలో ప్రశ్నించనున్నట్లు తెలిపారు. రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలని, అశ్వారావుపేట ప్రాంతంలో మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరనున్నట్లు తెలిపారు. అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమలో కార్మికుల ఈపీఎఫ్లను బొక్కేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని కార్మికులకు, రైతులకు న్యాయం చేయాలని ప్రశ్నించనున్నట్లు తెలిపారు. అశ్వారావుపేటలో డ్రెయినేజీ, సెంటర్‌లైటింగ్ ఏర్పాటు, పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరనున్నట్లు తెలిపారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ పుచ్చకాయల రాజశేఖరరెడ్డి, ఎంపీటీసీ కొల్లు వెంకటరమణ, బండారు శ్రీనివాసరావు, బుచ్చిబాబు పాల్గొన్నారు. -
రైతులందరి రుణాలు రద్దు చేయాలి
ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అశ్వారావుపేట, న్యూస్‌లైన్: బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులందరి అప్పులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం అశ్వారావుపేటలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అందరి రుణాలు రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు హామీనిచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కొత్తగా నిబంధనలు పెట్టడం సరికాదని అన్నారు. తమ రుణాలన్నీ మాఫీ అవుతాయని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని, కేసీఆర్ రుణమాఫీకి కొర్రీలు పెట్టడం పద్ధతి కాదని విమర్శించారు. అర్హులందరి రుణాలు రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పోరాడుతామని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని అన్నార. సమావేశంలో వైఎస్ఆర్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఎంపీటీసీ కొల్లు వెంకటరమణ, నాయకులు అల్లాడి వెంకటరామారావు, రాయి రవీందర్ ఉన్నారు. -
వైఎస్సార్సీఎల్పీ నేతగా తాటి వెంకటేశ్వర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శాఖను ప్రకటించింది. తొమ్మిది మందితో కూడిన అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అడ్హాక్ కమిటీలో సభ్యులుగా.. ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గట్టు రామచంద్రరావు, బి.జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్, హెచ్.ఎ.రెహ్మాన్, టి.వెంకట్రావు (భద్రాచలం), కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పి.విజయారెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభా పక్షనేతగా ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఉపనేతగా పాయం వెంకటేశ్వర్లు, విప్‌గా బానోతు మదన్‌లాల్ నాయక్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రాష్ట్ర నిర్మాణంలో సమష్టి పోరాటం... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శనివారమిక్కడ తెలంగాణ శాసనసభాపక్షం సమావేశమైంది. ఈ సమావేశంలో వైఎస్సార్సీఎల్పీ నేతకు సంబంధించి ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్టీ అధినేత జగన్‌కు అప్పగించారు. సమావేశం అనంతరం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలతో పాటు రాష్ట్ర నిర్మాణంలో సమిష్టిగా అసెంబ్లీ లోపల, బయట తమ వంతు పాత్ర పోషిస్తామని పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పార్టీ స్థాపించినప్పట్నుంచీ తమ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారని, అదే స్ఫూర్తితో తెలంగాణలో తాము కూడా పోరాడుతామన్నారు. తెలంగాణలో వైఎస్సార్సీపీ తరఫున ప్రజావాణి వినిపిస్తూ, పార్టీని నిర్మాణపరంగా మరింత బలోపేతం చేస్తామన్నారు. పోలవరం ముంపు బాధితులను ఆదుకోవాలి పోలవరం ప్రాజెక్టు వల్ల ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడాలనేది తమ ప్రధాన డిమాండ్ అని పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్నవారికి భూమికి భూమి, మెరుగైన ప్యాకేజీ అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు తమ వంతు కృషి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్డినెన్స్‌లో కొన్ని లోపాలున్నాయని, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ గ్రామాలను సీమాంధ్రలో కలపడాన్ని ఒప్పుకునేది లేదన్నారు. -
వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ పార్టీ నేతగా మేకపాటి
హైదరాబాద్: వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ పార్టీ నేతగా మేకపాటి రాజమోహన రెడ్డి ఎన్నికయ్యారు. పార్లమెంటరీ పార్టీ ఉపనేతగా కొత్తపల్లి గీత, సెక్రటరీగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ట్రెజరర్‌గా బుట్టా రేణుక ఎంపికయ్యారు. పార్లమెంటరీ పార్టీ విప్‌గా వైవీ సుబ్బారెడ్డి, కో ఆర్డినేటర్‌గా మిథున్ రెడ్డిని ఎంపిక చేశారు. పార్లమెంటరీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా వరప్రసాద్, అవినాష్ రెడ్డి, మిథున్‌రెడ్డిలను నియమించారు. వైఎస్ఆర్ సీపీ తెలంగాణ శాసనసభాపక్ష నేతగా అశ్వారావుపేట శాసనసభ్యుడు తాటి వెంకటేశ్వర్లు, శాసనసభాపక్ష ఉపనేతగా పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, విప్‌గా వైరా శాసనసభ్యుడు బానోత్ మదన్‌లాల్ ఎంపికయ్యారు. -
ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే..
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: తాము ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే కొనసాగుతామని, జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తామని పినపాక ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట, వైరా ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, బాణోత్ మదన్‌లాల్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైఎస్సార్సీపీకి జిల్లాలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని కొన్ని శక్తులు, పత్రికలు కావాలనే ఊహాజనిత కథనాలతో గందరగోళం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. జిల్లాలో అత్యధికంగా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుని పెద్ద పార్టీగా నిలవడంతో జీర్ణించుకోలేని శక్తులు ఇలాంటి కథనాలు ప్రచురిస్తున్నారని, తాము టీఆర్ఎస్లోకి వెళ్తున్నామంటూ ప్రచురించిన అసత్య కథనాలను ఖండిస్తున్నామని తెలిపారు. తమకు పార్టీ మారే ఆలోచన ఏమాత్రం లేదన్నారు. తాము విజయం సాధించిన తరువాత నియోజకవర్గ ప్రజలను కలువకముందే, కొన్ని గంటల్లోనే ఇలాంటి దుష్ర్పచారం చేయడం దిగజారుడుతనమన్నారు. గిరిజన ప్రజాప్రతినిధులమైన తమను కించపరిచేలా, కనీస మర్యాద లేకుండా అగౌరవంగా వ్యవహరించడం సరికాదన్నారు. మైండ్‌గేమ్ ఆడే ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచరించే సంస్కృతిని మానుకోవాలన్నారు. కష్టకాలంలో జగన్‌తో ఉన్న తాము ఎప్పటికీ జగన్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో జిల్లాలో, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు. జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు నవ తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకుంటామన్నారు. సమావేశంలో ఖమ్మం, ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు కూరాకుల నాగభూషణం, రవిబాబు నాయక్, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ముస్తఫా, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు తోట రామారావు, ఆకుల మూర్తి, వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు కొండల్రావు, దుర్గాప్రసాద్, ఎస్.వెంకటేశ్వర్లు, మార్కం లింగయ్యగౌడ్, ఎంఏ.సమద్ పాల్గొన్నారు.