మాట నిలుపుకున్న ఎమ్మెల్యే తాటి
కుక్కునూరు: 2004వ సంవత్సరం. బూర్గంపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాటి వెంకటేశ్వర్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సమస్యలను తెలుసుకునేందుకు కుక్కునూరు మండలంలో పర్యటిస్తూ వింజరం గ్రామానికి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన వికలాంగురాలు గామాలపాటి లావణ్య తన సమస్యను ఎమ్మెల్యే వద్దకు తీసుకొచ్చింది. ‘‘మాది పేద కుటుంబం. తల్లిదండ్రులు కూలికి వెళితేనే పూట గడుస్తుంది.. నేను (వైకల్యం) ఎదుగుదల లోపంతో బాధపడుతున్నాను. ఫించన్ కూడా రావడం లేదు. 8వ తరగతి చదువుకున్నాను.
ఏదైనా చిన్నపాటి ఉద్యోగం ఇప్పించండి’’ అని కోరింది. ఆ చిన్నారిని వేదన విన్న ఎమ్మెల్యే తాటి చలించారు తక్షణ సహాయాన్ని అందించారు. ఆ బాలికకకు శాశ్వత ఉపాధి కల్పించాలని అనుకున్నారు. ‘‘నీకు మంచి ఉద్యోగం రావాలంటే... కనీసం డిగ్రీ వరకు చదువుకో.. తప్పక ఉపాధినో, ఉద్యోగమో ఇప్పిస్తాను’’ అని మాటిచ్చారు. ఎమ్మెల్యే చెప్పినట్టుగానే ఆమె డిగ్రీ పూర్తిచేసింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 500 రూపాయల ఫించన్ పొందింది. ఆ తర్వాత ఫించన్‌దారులను తగ్గించేందుకు భద్రాచలంలో నిర్వహించిన ‘సదరన్ క్యాంప్’తో ఫించన్‌కు దూరమైంది. అప్పటి నుంచి తల్లిదండ్రులతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళుతోంది.
మాటిచ్చిన సారే.. మళ్లీ ఎమ్మెల్యే
ఉపాధి పనులకు వెళ్తున్నప్పటికీ ఇంట్లో ఇబ్బందులు ఉండటంతో ఉద్యోగం సాధించుకోవాలని లావణ్య ఆలోచించింది. మాటిచ్చిన అప్పటి సారే.. మళ్లీ అశ్వారావుపేట ఎమ్మెల్యే అయ్యారు. ఆయనను కలవాలనుకుంది. అనుకున్నదే తడవుగా తండ్రి సత్యనారాయణతోపాటు మంగళవారం సారపాకకు వెళ్లి ఎమ్మెల్యేను కలిసింది. ఆనాడు తనకిచ్చిన మాటను గుర్తు చేసింది.
‘‘మీరే ఏదైనా దారి చూపాలి’’ అని కోరింది. స్పందించిన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు.. ఆ ఇద్దరినీ తన కారులో ఎక్కించుకుని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ వద్దకు తీసుకెళ్లారు. ఆ ఆమ్మాయి సమస్యను కలెక్టర్‌కు వివరించారు. విద్యార్హతనుబట్టి ఉద్యోగం ఇప్పించాలని కోరారు. స్పందించిన కలెక్టర్... ‘ఉపాధి హామీ’ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా తనకు ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు ఆమె ధన్యవాదాలు చెప్పింది.