బూర్గంపాడు : తెలంగాణవాదం వినిపించినందుకు ఓ గిరిజన ఎమ్మెల్యేపై దాడికి పాల్పడటం అమానుషమని జిల్లాకు చెందిన భద్రాచలం, ఇల్లెందు, వైరా ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, కోరం కనకయ్య, బానోతు మదన్‌లాల్‌లు అన్నారు. మండలంలోని సారపాకలో ఉన్న అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును శుక్రవారం వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలీనం ప్రక్రియ పూర్తికాకుండానే ఆంధ్రాప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు భౌతికదాడులకు దిగటం శోచనీయమన్నారు. ఈ దాడి కేవలం ఓ గిరిజన ఎమ్మెల్యేపై జరిగింది కాదని తెలంగాణ ఆత్మగౌరవంపై జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన జిల్లాలోని ఏడు ముంపు మండలాలకు చెందిన ఓటర్లు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు ఓట్లు వేసి గెలిపించారనే విషయం ఆంధ్రా పాలకులు గుర్తుంచుకోవాలన్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధికారుల పాలనలోనే ముంపు మండలాలు ఉన్న విషయం ఆంధ్రా పాలకులు గుర్తుంచుకోవాలన్నారు. గిరిజనుల్లో భయాందోళనలను కలిగించేందుకే ఎమ్మెల్యే తాటిపై దాడికి పాల్పడ్డారన్నారు. ముంపు మండలాల్లో గిరిజనుల మనోభావాలను దెబ్బతిసే విధంగా గిరిజన ఎమ్మెల్యేపై భౌతిక దాడికి దిగిన టీడీపీకి ప్రజలు తగిన విధంగా బుద్ధిచెబుతారని అన్నారు. ముంపు మండలాల ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలుగా వారి బాగోగులను చూసుకునేవిధంగా ఆశ్వారావుపేట, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలకు అవకాశాలు కల్పించేందుకు రెండురాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే తాటిపై జరిగిన భౌతికదాడిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన 13మంది గిరిజన ఎమ్మెల్యేలం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, గవర్నర్ నరసింహన్‌కు, స్పీకర్ మధుసూధనచారికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తాటిని పరామర్శించిన వారిలో జిల్లా నాయకులు మచ్చా శ్రీనివాసరావు, మాజీ డీసీసీబీ చైర్మన్ యలమంచిలి రవికుమార్ తదితరులున్నారు.
గిరిజన ఎమ్మెల్యేపై దాడి అమానుషం..
Published Sat, Sep 20 2014 4:09 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement