![Police Case Filed TDP JC Prabhakar Reddy Over Madhavi Latha Issue](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/JC-Prabhakar-Reddy.jpg.webp?itok=IFcmrYJl)
సాక్షి, తాడిపత్రి/హైదరాబాద్: తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. సినీ నటి, బీజేపీ నేత మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జేసీ.. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు, ఆయన అనుచరులు తనను బెదిరిస్తున్నారని మాధవీలత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy)పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత మాధవీలత(Madhavi Latha) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, మాధవీలత మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు.
ఈ క్రమంలో మాధవీలత కామెంట్స్ తప్పుబడుతూ జేసీ అనుచితంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో తనను కించపరిచేలా జేసీ మాట్లాడారంటూ మాధవీలత ఫిర్యాదులో వెల్లడించారు. అలాగే, జేసీ అనుచరులు, అభిమానులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా జేసీ నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా చెప్పుకొచ్చారు.
క్షమాపణలు చెప్పిన జేసీ
తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. సినీ నటి మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో నోరు జారాను, టంగ్ స్లిప్ అయింది.. సారీ అంటూ వ్యాఖ్యానించారు. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మాధవి కన్నీళ్లు పెట్టుకుని ఒక వీడియో పంచుకుంది. ‘మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయింది. మామూలుగా ఉందామని చాలా ప్రయత్నించా.. కానీ నావల్ల కావడం లేదంటూ’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/20_11.jpg)
ఇదిలా ఉండగా.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాధవీలత ఫిల్మ్ ఛాంబర్‌లో కూడా ఫిర్యాదు చేశారు. మా ట్రెజరర్ శివ బాలాజికి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాధవీలత..‘జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు మానవ హక్కుల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాను. జేసీ ప్రభాకర్ రెడ్డి నా మీద చాలా దారుణంగా మాట్లాడారు. నా మీద వచ్చిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ కూడా ఖండించలేదు. అందుకే 'మా'కు ఫిర్యాదు చేశాను. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారు. నా ఫిర్యాదును మా అధ్యక్షులు మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నేను ఎంత కఠినంగా మాట్లాడిన నిజాలు మాట్లాడుతాను. సినిమా వాళ్లను అందరూ అవమానిస్తారు. కానీ, రాజకీయాల్లోకి వెళ్లి సినిమా వాళ్ల సత్తా చాటుతున్నాం. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment