సినీనటి, బీజేపీ నేత మాధవీలతపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
భజరంగదళ్, ఆరెస్సెస్, వీహెచ్‌పీ.. ఇలాంటి వాళ్లా నన్ను బెదిరించేది?
వీళ్లకంటే థర్డ్‌జెండర్‌లు మేలు
జేసీ వీడియో వైరల్
సాక్షి ప్రతినిధి, అనంతపురం/అనంతపురం టవర్ క్లాక్ : టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సి పల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా.. ఆయన సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె పెద్ద వ్యభి చారి అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులతోనా తమకు నీతులు చెప్పించేది అంటూ ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
న్యూ ఇయర్ వేడుకలకు వెళ్లొద్దన్నందుకు..
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు.
ఆయనతో పాటు టీడీపీకే చెందిన మున్సిపల్ కౌన్సిలర్ మల్లికార్జున కూడా పరుష పదజాలంతో మాట్లాడారు. మాధవీలతకు సంబంధించిన చిత్రాలను చూపిస్తూ అశ్లీలంగా నటించిందంటూ వ్యాఖ్యానించారు.
మీరు థర్డ్ జెండర్ కంటే అధ్వానం..
జేసీ ప్రభాకర్‌రెడ్డి బీజేపీని, దాని అనుబంధ సంస్థలనూ వదల్లేదు. ‘మాధవీలత బతుకుదెరువు కోసం ఏదో పాట్లు పడుతోంది, పడనివ్వండి. ఆమె మాకు నీతులు చెప్పకూ డదు. భజరంగదళ్, ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్.. ఇలాంటి వాళ్లా నన్ను బెదిరించేది? వాళ్లకంటే థర్డ్‌జెండర్ (ట్రాన్స్‌జెండర్)లు మేలు’ అని వ్యాఖ్యానించారు.
బీజేపీ వాళ్లు నా వెంట్రుక కూడా పీక్కోలేరు.. సిగ్గులేని నా కొ...కల్లారా అంటూ ఫైర్ అయ్యారు. తన బస్సును కాల్చిన తర్వాత ఆ వేడికి కరెంటు వైర్లు పడ్డాయని.. కానీ, షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నారని, అలాగే రాసుకోండని జేసీ అన్నారు. తన వర్గం మహిళలతో మాధవీలత పైనే తాడిపత్రి పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించారు.
జేసీకి మతిపోయిందేమో..
ఇక జేసీ ప్రభాకర్‌రెడ్డికి వయసు రీత్యా మతి ఏమైనా పోయిందేమోనని, ఒకసారి చూపించుకోవాలని బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు సూచించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డి బీజేపీ మహిళా నేతలపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కూటమిలో ఉండి కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఇది సరైంది కాదని హితవు పలికారు.
కేసులకు భయపడను : మాధవీలత
జేసీ పరుష వ్యాఖ్యల నేపథ్యంలో సినీనటి మాధవీలత కూడా సోషల్‌మీడియాలో ఘాటుగానే స్పందించారు. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడటం తప్పయితే తనపై వెయ్యి కేసులు పెట్టినా భయపడబోనన్నారు. తెరమీద కనిపించే వాళ్లందరూ వ్యభిచారులేనని అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ఇలాగైతే తాడిపత్రి నుంచి తెర మీదకు ఎవరూ రాకూడదన్నట్లు ఉందన్నారు.
తండ్రి అలా మాట్లాడినా యువ ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్‌రెడ్డి ఖండించలేని స్థితిలో ఉన్నారన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రేమించే సైకోలెవరికీ తాను భయపడబోనన్నారు. తనను కిడ్నాప్ చేయాలనుకున్నా, మర్డర్ చేయాలనుకున్నా తాను బెదిరేది లేదన్నారు. ఈ వయసులో ఇలా మాట్లాడ్డానికి ఆయన సిగ్గుపడాలని, ఈ భాషను భరిస్తున్న ఆయన భార్యాపిల్లలకు ధన్యవాదాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment