సాక్షి, హైదరాబాద్: సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై (Madhavi Latha అనంతపురం జిల్లా టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ( J. C. Prabhakar Reddy) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వివాదం కొనసాగుతోంది. తాజాగా, జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాధవీలత సైబరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. తనపై జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం సైబరాబాద్ సీపీని కలిసిన మాధవీలత రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ..‘జేసీ మాటలతో నేను, నా కుటుంబం ఇబ్బంది పడ్డాం. క్షమాపణ చెప్పానంటే సరిపోతుందా? నాయకులు ఇలాంటి భాష మాట్లాడితే ఎలా’ అంటూ మాధవీలత ప్రశ్నలు కురిపించారు. జేసీ ప్రభాకర్ మాటలతో చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులు ఇలాంటి భాష మాట్లాడితే ఎలా? అని మాధవీలత నిలదీశారు. అంతకుముందు ఆమె ఫిలింఛాంబర్‌లోనూ ఫిర్యాదు చేశారు.
ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌లో నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. మా ట్రెజరర్ శివ బాలాజికి(Siva Balaji) పిర్యాదు పత్రాన్ని ఆమె అందజేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తానని తన సోషల్‌మీడియాలో ఆమె పేర్కొన్నారు.
లేఖలో మాధవీలత ఏమన్నారంటే?
'జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు మానవ హక్కుల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాను. జేసీ ప్రభాకర్ రెడ్డి నా మీద చాలా దారుణంగా మాట్లాడారు. నా మీద వచ్చిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ కూడా ఖండించలేదు. అందుకే 'మా'కు ఫిర్యాదు చేశాను. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారు. నా ఫిర్యాదును మా అధ్యక్షులు మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నేను ఎంత కఠినంగా మాట్లాడిన నిజాలు మాట్లాడుతాను. సినిమా వాళ్లను అందరూ అవమానిస్తారు. కానీ, రాజకీయాల్లోకి వెళ్లి సినిమా వాళ్ల సత్తా చాటుతున్నాం. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.' అని ఆమె అన్నారు.
అసలు వివాదం ఏంటి?
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఆయనతో పాటు టీడీపీకే చెందిన మున్సిపల్ కౌన్సిలర్ మల్లికార్జున కూడా పరుష పదజాలంతో మాట్లాడారు. మాధవీలతకు సంబంధించిన చిత్రాలను చూపిస్తూ అశ్లీలంగా నటించిందంటూ వ్యాఖ్యానించారు.
మీరు థర్డ్ జెండర్ కంటే అధ్వానం..
జేసీ ప్రభాకర్‌రెడ్డి బీజేపీని, దాని అనుబంధ సంస్థలనూ వదల్లేదు. ‘మాధవీలత బతుకుదెరువు కోసం ఏదో పాట్లు పడుతోంది, పడనివ్వండి. ఆమె మాకు నీతులు చెప్పకూ డదు. భజరంగదళ్, ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్.. ఇలాంటి వాళ్లా నన్ను బెదిరించేది? వాళ్లకంటే థర్డ్‌జెండర్ (ట్రాన్స్‌జెండర్)లు మేలు’ అని వ్యాఖ్యానించారు.
బీజేపీ వాళ్లు నా వెంట్రుక కూడా పీక్కోలేరు.. సిగ్గులేని నా కొ...కల్లారా అంటూ ఫైర్ అయ్యారు. తన బస్సును కాల్చిన తర్వాత ఆ వేడికి కరెంటు వైర్లు పడ్డాయని.. కానీ, షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నారని, అలాగే రాసుకోండని జేసీ అన్నారు. తన వర్గం మహిళలతో మాధవీలత పైనే తాడిపత్రి పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించారు.
కేసులకు భయపడను: మాధవీలత
జేసీ పరుష వ్యాఖ్యల నేపథ్యంలో సినీనటి మాధవీలత కూడా సోషల్‌మీడియాలో ఘాటుగానే స్పందించారు. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడటం తప్పయితే తనపై వెయ్యి కేసులు పెట్టినా భయపడబోనన్నారు. తెరమీద కనిపించే వాళ్లందరూ వ్యభిచారులేనని అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ఇలాగైతే తాడిపత్రి నుంచి తెర మీదకు ఎవరూ రాకూడదన్నట్లు ఉందన్నారు.
తండ్రి అలా మాట్లాడినా యువ ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్‌రెడ్డి ఖండించలేని స్థితిలో ఉన్నారన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రేమించే సైకోలెవరికీ తాను భయపడబోనన్నారు. తనను కిడ్నాప్ చేయాలనుకున్నా, మర్డర్ చేయాలనుకున్నా తాను బెదిరేది లేదన్నారు. ఈ వయసులో ఇలా మాట్లాడ్డానికి ఆయన సిగ్గుపడాలని, ఈ భాషను భరిస్తున్న ఆయన భార్యాపిల్లలకు ధన్యవాదాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment