రికవరీ @79%
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సొత్తు సంబంధ నేరాలు తగ్గాయి. దోపిడీకి గురైన సొత్తులో అత్యధికంగా 79 శాతం రికవరీ అయింది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. సొత్తు స్వాధీనంలో హైదరాబాద్ వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది నమోదైన నేరాల్లో అత్యధికంగా 62 శాతం బాడ్లీ క్రైమ్ (అత్యాచారాలు, భౌతిక దాడులు, హత్యలు..) చోటుచేసుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో 16 శాతంతో సొత్తు సంబంధ నేరాలు, 12 శాతం రోడ్డు ప్రమాదాలు, 8 శాతం మహిళలపై నేరాలు, రెండు శాతం భూకేసులు నమోదయ్యాయి. ఈమేరకు సైబరాబాద్ క్రైమ్ వార్షిక నివేదికను కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం వెల్లడించారు.
- సాక్షి, హైదరాబాద్
* ‘సొత్తు’ స్వాధీనంలో సైబరాబాద్ హ్యాట్రిక్
* రికవరీలో రాష్ర్టంలోనే నెంబర్ వన్
* ప్రాపర్టీ ఆఫెండర్స్ల నుంచి 79 శాతం వసూలు
* మహిళలపై పెరిగిన నేరాలు, రోడ్డు ప్రమాదాల్లో సైతం పెరుగుదల
* కబ్జాదారులపై పీడీ యాక్ట్
* వార్షిక సమావేశంలో సీపీ సీవీ ఆనంద్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘ఎఫెక్టివ్ పోలీసింగ్‌తో గత మూడేళ్లలో ఏటికేడు సొత్తు సంబంధ నేరాలు తగ్గాయి. 2013లో 6,218, 2014లో 5,404, 2015లో 4,980 ప్రాపర్టీ క్రైమ్స్ జరిగాయి.
ఆయా కేసుల్లో నిందితులను పట్టుకోవడంతో పాటు సొత్తు భారీ స్థాయిలోనే స్వాధీనం చేసుకున్నాం. 2013లో 76 శాతం, 2014లో 75 శాతం రికవరీ చేసిన మేం ఈసారి 79 శాతం సాధించాం. మొత్తంగా 28.80 కోట్లు నష్టపోతే రూ.22.61 కోట్లు స్వాధీనం చేసుకున్నాం. రాష్ట్రంలోనే ఇదే అత్యధిక రికవరీ. అంతకుముందు రెండేళ్లలో తొలి వరుసలోనే ఉన్న మేం ఈసారి కూడా ఆ స్థానాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ సాధించడం ఆనందంగా ఉంద’ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
2015కు సంబంధించి వార్షిక వివరాలు వెల్లడించేందుకు మంగళవారం ఆయన గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నేరాల నమోదు తీరుతెన్నుల నివేదికలను విడుదల చేశారు. సీవీ ఆనంద్ మాట్లాడుతూ...ఈ ఏడాది కస్టోడియల్ డెత్‌లు, ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని, పోలీసుల పనితీరుపై ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా తగ్గాయన్నారు.
‘ఈ ఏడాది నమోదైన నేరాల్లో అత్యధికంగా 62 శాతం బాడ్లీ క్రైమ్ చోటుచేసుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో 16 శాతంతో సొత్తు సంబంధ నేరాలు, 12 శాతం రోడ్డు ప్రమాదాలు, ఎనిమిది శాతంతో మహిళలపై నేరాలు, రెండు శాతం భూకేసులు నమోదయ్యా’యని తెలిపారు.
లెక్కకు మించి కేసులు...
అయితే ఈ ఏడాది సైబరాబాద్‌లో అత్యధికంగా 30,527 కేసులు నమోదుచేశామన్న ఆయన...ఎల్బీనగర్ జోన్లో అత్యధికంగా 8670 ఉన్నాయన్నారు. ఎల్బీనగర్ పోలీసు స్టేషన్లో అత్యధికంగా 1,590 కేసులు నమోదుకాగా, తక్కువగా కందుకూర్ పోలీస్‌స్టేషన్‌లో 269 నమోదయ్యాయని తెలిపారు.
విస్తీర్ణంలో రెండో అతి పెద్ద కమిషనరేట్ అయిన సైబరాబాద్‌లో పోలీసు సిబ్బంది సంఖ్య పెంచాల్సిన అవసరముందని తెలిపారు. ప్రస్తుతం సిబ్బంది తక్కువగానే ఉన్నా నేరాలు నియంత్రించడంలో సైబరాబాద్ పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు.
చైన్‌స్నాచింగ్‌లు తగ్గాయి...
శివ ఎన్కౌంటర్ తర్వాత సైబరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. అయితే అప్పుడప్పుడు ఇరానీ గ్యాంగ్ ముఠాలు రెచ్చిపోయి..మహిళల మెడలో నుంచి గొలుసు లాగే ప్రయత్నంలో కిందకు నెట్టేస్తున్నారు. దీంతో వారు గాయపడి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తోంది. అం దుకే హింస తీవ్రత పెరగడంతో నవంబర్ నుంచి చైన్స్నాచర్లపై దోపిడీ కేసు నమోదుచేస్తున్నాం.
నవంబర్, డిసెంబర్లలో ఇప్పటివరకు 16 కేసులు రాబరీ కింద నమోదు చేశాం. గతేడాది 793 చైన్ స్నాచింగ్‌లు జరిగితే ఈసారి 372 జరిగాయి. దాదాపు 53 శాతం తగ్గిన ఈ చైన్ స్నాచింగ్ కేసుల్లో దాదాపు 290 కేసుల్లో నిందితులను అరెస్టు చేశారు. ఇరానీ గ్యాంగ్ ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి భారీ సంఖ్యలో సొత్తు కూడా స్వాధీనం చేసుకున్నామని సీవీ ఆనంద్ తెలిపారు. షీటీమ్స్ ద్వారా 660 కేసులు నమోదు చేశామని, 825 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చామని చెప్పారు. 658 భూ తగాదా కేసుల్లో ఇప్పటివరకు 60 మందిపై పీడీ యాక్ట్ పెట్టామని వివరించారు.
సైబర్‌పై ప్రత్యేక దృష్టి...
ఈసారి సైబర్ నేరాలు తగ్గాయి. జీడీఎస్ రూపంలో ఎంట్రీ చేసి, ఇప్పటివరకు 800 కేసుల్లో బాధితులకు న్యాయం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేషన్ బియ్యం కుంభకోణంతో పాటు నకిలీ క్రెడిట్ కార్డు, పాన్‌కార్డు, ఓటరు ఐడీ కార్డు కేసుల్లో ఎస్వోటీ బృందం సమర్థంగా పనిచేసింది. 2192 కేసుల్లో రూ.23కోట్ల 34 లక్షల 87వేల 260ల సొత్తును స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ఈ చలాన్ సిస్టమ్ వల్ల జంట పోలీసు కమిషనరేట్లలో ట్రాఫిక్ ఉల్లంఘనులు ఇట్టే దొరికిపోతున్నారని, దీనివల్ల దాదాపు 5.4 లక్షల కేసులు పెరిగాయన్నారు.
ఠాణాల ఆధునీకరణపై దృష్టి
ఇప్పటికే సైబరాబాద్ పరిధిలోని ఠాణాల ఆధునీకరణపై దృష్టి పెట్టామని, బాధితులకు సాంత్వన చేకూర్చడంతో పాటు పోలీసుల పనితీరును గమనించేందుకు పోలీసు స్టేషన్లలోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు కమ్యూనిటీల్లో ప్రజల సహకారంతో 2000 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు.
హైవేస్పైనే అధికం...
సైబరాబాద్ పరిధిలో రోడ్డు ప్రమాదాల్లో 18 శాతం పెరుగుదల కనిపించిందని, గతేడాది 3293 జరిగితే ఈసారి 3896 చోటుచేసుకున్నట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఏడాది ప్రమాదాల్లో 1156 మంది మృతి చెందగా 3,499 మంది గాయపడ్డారు. అయితే ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు పది హైవేల్లో జరిగిన ప్రమాదాల్లోనే దాదాపు 536 మంది మృతి చెందారు. అంటే అంతర్గత రహదారుల్లో 620 మంది చనిపోయారు.
వచ్చే ఏడాదిలో ఈప్రమాదాలు తగ్గముఖం పడతాయని ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ మహంతి అన్నారు. ‘ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరిస్తే వారి ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. ఇప్పటికే 75 వేల మందికి హెల్మెట్ జరిమానా విధించామ’ని ఆయన తెలిపారు. ఈ వార్షిక సమావేశంలో క్రైమ్స్ ఓఎస్డీ నవీన్‌కుమార్, ఐదు జోన్ల డీసీపీలు, ఏసీపీలు, ట్రాఫిక్ ఏసీపీలు పాల్గొన్నారు.