
20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
ప్రారంభించనున్న గవర్నర్
సీతారామ్‌బాగ్ నుంచి హనుమాన్ టేక్డీ వరకు కొనసాగనున్న శోభాయాత్ర
అబిడ్స్: శ్రీరామ నవమి శోభాయాత్రకు పలు శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా చారిత్రాత్మక సీతారామ్‌బాగ్ ఆలయం నుంచి శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. సీతారామ్‌బాగ్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర కోఠి హనుమాన్‌టేక్డీ వరకు కొనసాగుతుంది. సీతారామ్‌బాగ్ నుంచి భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేడుక నిర్వహించనున్నారు. ధూల్‌పేట మాగ్రా నుంచి ఆనంద్‌సింగ్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి పాల్కీ యాత్ర నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ధూల్‌పేట్ గంగా»ౌలి నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర కొనసాగుతుంది. మూడు ప్రాంతాల నుంచి కొనసాగే శోభాయాత్రలు మంగళ్‌హాట్ ప్రధాన రోడ్డులోని అనిత టవర్ వద్ద కలుస్తాయి.
పాల్కీ యాత్రకు ఎమ్మెల్సీ కవిత పూజలు
ధూల్‌పేట మాగ్రా నుంచి ప్రారంభమయ్యే శ్రీరామ నవమి పాల్కీ యాత్రను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తారు.మధ్యాహ్నం 12 గంటలకు పూజలు నిర్వహించి యాత్రలో పాల్గొంటారని నిర్వాహకులు ఆనంద్‌సింగ్, పప్పుమాత్రేలు తెలిపారు.
రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర
గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి శోభాయాత్ర ఆదివారం ఒంటిగంటకు ప్రారంభమవుతుంది. గంగా»ౌలి నుంచి రాజాసింగ్ ఈ శోభాయాత్రను ప్రారంభిస్తారు.
శోభాయాత్ర కొనసాగే రూట్..
శ్రీరామ నవమి శోభాయాత్ర, పాల్కీ శోభాయాత్ర, రాజాసింగ్ శోభాయాత్రలు మంగళ్‌హాట్‌లో కలుసుకొని పురానాపూల్, జుమ్మేరాత్‌బజార్, చుడీబజార్, భేగంబజార్ ఛత్రి, సిద్దిఅంబర్‌బజార్, గౌలిగూడ,పుత్లీబౌలి, కోఠి హనుమాన్ టేక్డీ వరకు కొనసాగుతాయి. ఊరేగింపులో శ్రీరాముడితో పాటు పలు దేవుళ్ల విగ్రహాలుంటాయి.
సీసీ కెమెరాలతో పోలీసుల నిరంతర పర్యవేక్షణ
నగర పోలీసులు 20 వేల మంది పోలీసులతో శోభాయాత్రకు భారీ ఎత్తున బందోబస్తు చేస్తున్నారు. సీతారామ్‌బాగ్ నుంచి యాత్ర కొనసాగే హనుమాన్ టేక్డీ వరకు వేలాది మంది పోలీసులతో బందోబస్తు చేపడుతారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, నగర జాయింట్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్‌లు బందోబస్తును స్వయంగా పర్యావేక్షిస్తారు. సౌత్‌వెస్ట్‌జోన్ డీసీపీ చంద్రమోహన్, ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి, సెంట్రల్‌జోన్ డీసీపీ శిల్పవల్లీలు శోభాయాత్రకు తమ తమ పోలీస్‌స్టేషన్ల సిబ్బంది, అదనపు బలగాలతో బందోబస్తు చేపడుతున్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా శోభాయాత్రను పర్యావేక్షిస్తారు.
పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు..
శ్రీరామ నవమి శోభాయాత్రకు పోలీస్ శాఖతో పాటు జీహెచ్‌ఎంసీ, ఆర్ అండ్‌బీ, విద్యుత్, వాటర్‌బోర్డు, ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మూడు లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు వాటర్‌బోర్డు జనరల్ మేనేజర్ జాన్ షరీఫ్ తెలిపారు.
వాహనాల దారి మళ్లింపు
శ్రీరామ నవమి శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో వాహనాలను ఇతర ప్రాంతాల మీదుగా పోలీసులు దారిమళ్లిస్తున్నారు. సీతారామ్‌బాగ్‌కు వచ్చే వాహనాలను మల్లేపల్లి, నాంపల్లి మీదుగా దారిమళ్లిస్తారు. బోయిగూడ కమాన్ నుంచి దారుసలాం ఆగాపూరా మీదుగా, పురానాపూల్ నుంచి వాహనాలను జియాగూడ కార్వాన్ వైపు, బేగంబజార్ నుంచి వచ్చే వాహనాలను గోషామహాల్, ఇతర ప్రాంతాలకు దారిమళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.