సాక్షి,హైదరాబాద్ : సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్‌ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు నగర కమిషనర్ సీవీ ఆనంద్. అనంతరం బాలుడి ఆరోగ్య వివరాలను ఆయన మీడియాకు తెలియజేశారు. శ్రీతేజ్ కోలుకునేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన విచారం వ్యక్తం చేశారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన రెండు వారాల నుంచి శ్రీతేజ కిమ్స్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సీపీ సీవీ ఆనంద్,హెల్త్ సెక్రటరీ క్రిస్టినాలు కిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం, సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ప్రభుత్వం తరఫున శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాం. తొక్కిసలాటలో శ్రీ తేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. రికవరీ కావడానికి చాలా సమయం పడుతుంది. ట్రీట్మెంట్ మరింత కాలం పట్టే అవకాశం ఉంది. త్వరలోనే బాలుడి ఆరోగ్యంపై వైద్యులు బులిటెన్ విడుదల చేస్తారు’ అని వెల్లడించారు.
‘పుష్ప-2’ ప్రీమియర్ షోలో తొక్కిసలాట
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప-2’ ప్రీమియర్ షోలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ వద్దకు చేరుకోగానే అభిమానులు ఒక్కసారిగా పెద్దఎత్తున లోనికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి కట్టడి చేసేందుకు అభిమానులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో సినిమా చూసేందుకు భర్త, పిల్లలతోపాటు థియేటర్‌కు వచ్చిన రేవతి అనే మహిళ, ఆమె కుమారుడు శ్రీతేజ్ తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు వీరిని ఆస్పత్రికి తరలించగా మహిళ మృతిచెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment