
కోల్‌కతా: నేడు (ఆదివారం ఏప్రిల్ 6) శ్రీరామ నవమి(Sri Rama Navami). ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శోభా యాత్రలను నిర్వహించేందుకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో గతంలో శ్రీరామ నవమి సందర్భంగా అల్లర్లు చోటుచేసుకున్న నేపధ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రమంతటా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. బెంగాల్‌తో పాటు, యూపీ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
పశ్చిమబెంగాల్(West Bengal)లోని కోల్‌కతాలో 50కి పైగా శ్రీరామనవమి శోభాయాత్రలు నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో వివిధ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఐదు వేల మంది అదనపు పోలీసులను మోహరించారు. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీలతో ఊరేగింపులను పర్యవేక్షించనున్నారు. మహారాష్ట్రంలోని ముంబైలో శ్రీరామనవమి సందర్భంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ శోభాయాత్రలు నిర్వహించనున్నాయి. ఈ నేపధ్యంలో ముంబైలో 13,500 మందికి పైగా పోలీసు సిబ్బందిని వివిధ ప్రాంతాల్లో మోహరించారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కూడా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. డ్రోన్లు, సీసీటీవీలను ఉపయోగించి ఊరేగింపులపై నిఘా సారించారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ పోలీసు అధికారులకు రాష్ట్రంలోని అన్ని మతపరమైన ప్రదేశాలలో పోలీసు బలగాలను మోహరించాలని సూచించారు. కాగా శ్రీరామ నవమి వేళ శాంతియుతంగా ఊరేగింపులు నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
బెంగాల్‌లో జరిగే శ్రీరామ నవమి ఊరేగింపులో అత్యధికంగా ప్రజలు పాల్గొనాలని బీజేపీ ఎమ్మెల్యే పవన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. కాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతి, సామరస్యాలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం హై అలర్ట్ జారీ చేసింది. బీహార్ రాజధాని పట్నాలో 53 శోభాయాత్రలు నిర్వహించనున్న దృష్ఠ్యా పోలీసులు(Police) గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉత్సవ సమయంలో డీజే ప్లే చేయడాన్ని నిషేధించారు. దీనిని ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: బీజేపీ బలోపేతానికి ‘పంబన్’ వారధి?