హైదరాబాద్‌లో జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్‌కు రాతపూర్వకంగా స్పష్టీకరణ
జేపీసీ చైర్మన్‌కు లేఖ ఇచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
ముస్లిం సమాజం ఇబ్బంది పడకూడదన్నదే మాజీ సీఎం జగన్ ఉద్దేశం
వక్ఫ్ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోంది
ఆ పార్టీ నాటకాలను ముస్లిం సమాజం గమనించాలి
వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్/కర్నూలు(టౌన్): ముస్లిం సమాజానికి నష్టం తెచ్చే వక్ఫ్ సవరణ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వైఎస్సార్‌సీపీ తాజాగా మరోసారి స్పష్టమైన వైఖరిని చాటింది. వక్ఫ్ సవరణ బిల్లుపై అభిప్రాయ సేకరణ కోసం హైదరాబాద్‌కు వచ్చిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చైర్మన్ జగదాంబికా పాల్‌కు పార్టీ తరఫున జేపీసీ మెంబర్, ఎంపీ వి.విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ శనివారం రాతపూర్వకంగా లేఖ అందజేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని లేఖలో స్పష్టం చేశారు. అనంతరం హఫీజ్‌ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సమాజం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ సవరణ బిల్లును వ్యతిరేకించాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారన్నారు.
జేపీసీ సమావేశంలో ఈ బిల్లును తమ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోందో లిఖితపూర్వకంగా తెలియజేశామని పేర్కొన్నారు. ఈ సవరణ బిల్లుకు వైఎస్సార్‌సీపీ పూర్తిగా వ్యతిరేకమన్నారు. ఈ బిల్లు వల్ల ముస్లిం సమాజానికి జరిగే నష్టాన్ని జేపీసీకి వివరించామన్నారు. వక్ఫ్ భూములకు సంబంధించి కలెక్టర్‌కు అథారిటీ ఇవ్వాలనుకోవడం సరికాదన్నారు. వక్ఫ్ భూములకు ప్రత్యేకంగా ఉన్న వక్ఫ్ ట్రిబ్యునల్‌ను బలహీనపరిచేలా సవరణ బిల్లు ఉందన్నారు.
ఈ బిల్లు వస్తే ముస్లిం సమాజం తీవ్రంగా ఇబ్బందులు పడుతుందన్నారు. ఇప్పటికే లోక్‌సభలో మిథున్‌రెడ్డి, రాజ్యసభలో విజయసాయిరెడ్డి సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా, తాము ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందో చెప్పారన్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తూ జేపీసీ మెంబర్ విజయసాయిరెడ్డి సైతం బిల్లుకు వ్యతిరేకంగా లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చారని పేర్కొన్నారు.
టీడీపీది డబుల్ గేమ్
టీడీపీ పార్లమెంట్‌లో ద్వంద్వవైఖరి అవలంబించడంతోపాటు సవరణ బిల్లు విషయాన్ని గందరగోళంలో పడేస్తోందని హఫీజ్‌ఖాన్ మండిపడ్డారు. ఇప్పుడు కూడా టీడీపీ రెండు కళ్ల ధోరణి అనుసరిస్తోందన్నారు. పార్లమెంట్‌లోనే టీడీపీ వ్యతిరేకించి ఉంటే జేపీసీ వరకు వచ్చేది కాదన్నారు. పార్లమెంట్‌లో సవరణ బిల్లుకు మద్దతు పలికిన టీడీపీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీతోపాటు వివిధ ముస్లిం సంఘాలు వక్ఫ్ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకించినా టీడీపీ మాత్రం డబుల్ గేమ్ ఆడుతూ ముస్లింలకు మరోసారి ద్రోహం చేస్తోందని విమర్శించారు. టీడీపీ నాటకాలను ముస్లిం సమాజం గమనించాలని హఫీజ్‌ఖాన్ కోరారు.
‘వక్ఫ్ బిల్లు’పై జేపీసీకి పలు సూచనలు చేశాం: మంత్రి ఫరూక్
కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకున్న వక్ఫ్ సవరణ బిల్లు–2024పై ముస్లిం సమాజం నుంచి ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో. అభిప్రాయ సేకరణకు వచి్చన జేపీసీకి ఏపీ తరఫున పలు సూచనలు చేసినట్టు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన జేపీసీ అభిప్రాయ సేకరణ సమావేశానికి సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏపీ నుంచి 15 మంది కమిటీని పంపినట్లు మంత్రి పేర్కొన్నారు. జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్‌కు రాతపూర్వకంగా వినతిపత్రాలు సమరి్పంచినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment