వైఎస్సార్‌సీఎల్పీ నేతగా తాటి వెంకటేశ్వర్లు | Tati Venkateswarlu elected as YSRCPLP leader | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీఎల్పీ నేతగా తాటి వెంకటేశ్వర్లు

Published Sun, Jun 1 2014 1:45 AM | Last Updated on Tue, May 29 2018 3:36 PM

వైఎస్సార్‌సీఎల్పీ నేతగా తాటి వెంకటేశ్వర్లు - Sakshi

వైఎస్సార్‌సీఎల్పీ నేతగా తాటి వెంకటేశ్వర్లు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శాఖను ప్రకటించింది. తొమ్మిది మందితో కూడిన అడ్‌హాక్ కమిటీని ఏర్పాటు చేస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అడ్‌హాక్ కమిటీలో సభ్యులుగా.. ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గట్టు రామచంద్రరావు, బి.జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్, హెచ్.ఎ.రెహ్మాన్, టి.వెంకట్రావు (భద్రాచలం), కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పి.విజయారెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభా పక్షనేతగా ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఉపనేతగా పాయం వెంకటేశ్వర్లు, విప్‌గా బానోతు మదన్‌లాల్ నాయక్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
 
 రాష్ట్ర నిర్మాణంలో సమష్టి పోరాటం...
 
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శనివారమిక్కడ తెలంగాణ శాసనసభాపక్షం సమావేశమైంది. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీఎల్పీ నేతకు సంబంధించి ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్టీ అధినేత జగన్‌కు అప్పగించారు. సమావేశం అనంతరం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలతో పాటు రాష్ట్ర నిర్మాణంలో సమిష్టిగా అసెంబ్లీ లోపల, బయట తమ వంతు పాత్ర పోషిస్తామని పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పార్టీ స్థాపించినప్పట్నుంచీ తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారని, అదే స్ఫూర్తితో తెలంగాణలో తాము కూడా పోరాడుతామన్నారు. తెలంగాణలో వైఎస్సార్‌సీపీ తరఫున ప్రజావాణి వినిపిస్తూ, పార్టీని నిర్మాణపరంగా మరింత బలోపేతం చేస్తామన్నారు.
 
 పోలవరం ముంపు బాధితులను ఆదుకోవాలి
 
 పోలవరం ప్రాజెక్టు వల్ల ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడాలనేది తమ ప్రధాన డిమాండ్ అని పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్నవారికి భూమికి భూమి, మెరుగైన ప్యాకేజీ అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు తమ వంతు కృషి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్డినెన్స్‌లో కొన్ని లోపాలున్నాయని, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ గ్రామాలను సీమాంధ్రలో కలపడాన్ని ఒప్పుకునేది లేదన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement