Rewind 2020: Political Highlights 2020 | Indian Political News 2020 | రంగుమారిన రాజకీయం - Sakshi
Sakshi News home page

రౌండప్‌ 2020: రంగుమారిన రాజకీయం

Published Wed, Dec 30 2020 1:50 PM | Last Updated on Wed, Dec 30 2020 4:58 PM

Political Year Roundup For 2020 - Sakshi

నేతల మధ్య  విమర్శలు, వివాదాలు. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు. ప్రత్యర్థిని మట్టికరిపించేందుకు ఎత్తుకు పై ఎత్తులు. రాజకీయ చదరంగంలో చాణిక్యుడిని మించేలా ఒకరికిమించి మరొకరి వ్యూహరచనలు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి, అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి అహ్మదాబాద్‌ వరకు అధికార విపక్షాల మధ్య పేలిన మాటాల తూటాలు.  ఓవైపు దేశంలో కరోనా వైరస్‌ విజృంభణకు దేశ ప్రజలకు చిగురుటాకులా వణికినా.. నేతల పుట్టించిన రాజకీయ వేడి మాత్రం అంతాఇంతా కాదు. సవాళ్లుకు ప్రతి సవాలు విసురుతూ.. ఏడాది ఆసాంతం రాజకీయాన్ని రక్తికట్టించారు. 2020 ఏడాది దేశ రాజకీయ రంగంలో సంచలన మార్పులకు కేంద్రబిందువైంది. ఉత్తరాన వికసించిన కమళం.. దక్షిణాదికి పాకేందుకు బాటలు వేసింది. ఆరేళ్లుగా ఓటమి ఎరుగని కారు పార్టీకి కాషాయదళం ముచ్చెమటలు పట్టించింది.

దుబ్బాక దంగల్‌.. కారు జోరుకు బ్రేకులు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికార టీఆర్‌ఎస్‌ తొలి ఎదురుదెబ్బ తగిలింది. స్వరాష్ట్రంలో రెండుసార్లు అధికారం చేజిక్కించుకన్న టీఆర్‌ఎస్‌కు.. దుబ్బాక దంగల్‌లో ఊహించని పరాజయం ఎదురైంది. గులాబీ కోటలో కమలం వికసించింది. ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డి తలపడ్డ దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. క్షణక్షణానికి ఆధిక్యం మారుతూ.. విజయం బీజేపీ, టీఆర్‌ఎస్‌లతో ఆఖరి వరకు దోబూచులాడింది. తీవ్ర ఉత్కంఠను రేపిన పోరులో చివరకు కాషాయదళ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు 1,079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి గులాబీ దళానికి కంచుకోటగా ఉన్న దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.  బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 63,352 ఓట్లు , టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు 62,273 ఓట్లు , కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డికి 22,196 ఓట్లు వచ్చాయి. 

గ్రేటర్‌లో వికసించిన కమళం..
ఈ  ఏడాది డిసెంబర్‌ తొలివారంలో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ఫలితాలు సంచలనం సృష్టించాయి.  ఈ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ భారీ ఎదురుదెబ్బ  తగలగా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు.  టీఆర్‌ఎస్‌-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్‌-2 స్థానాల్లో విజయం సాధించాయి. ఏ పార్టీ మేజిక్‌ ఫిగర్‌ సాధించకపోవడంతో హంగ్‌ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక 47 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ముఖ్యంగా ఎవరి ఊహలకు అందని విధంగా బీజేపీ 47 స్థానాల్లో జెండా పాతింది. టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి తామే ప్రత్నామ్నాయమని సవాలు విసిరింది. ఈ ఎన్నికల ఫలితాలు రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాతబస్తీపై మరోసారి పతంగి ఎగిరింది. 2016లో గెలిచిన 44 సీట్లను తిరిగి దక్కించుకొని మేయర్‌ పీఠం సాధనలో కీలకంగా మారింది. అసద్‌ వ్యూహరచన.. అక్బర్‌ వాడి వేడి ప్రసంగాలతో మైనార్టీ ఓటు బ్యాంకును తమవైపే నిలుపుకొన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్‌ మట్టికరిచింది. ఆ పార్టీ కేవలం రెండింటితో సరిపెట్టుకుంది. టీఆర్‌ఎస్, మజ్లిస్, బీజేపీ పోరులో పోటీపడలేక చతికిలపడింది.

టీడీపీని వెంటాడుతున్న కష్టాలు...
గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలైన టీడీపీకి ఈ ఏడాది (2020) కూడా చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఆ పార్టీకి చెందిన చాలామంది సీనియర్‌ నేతలు చంద్రబాబు నాయుడుకు దూరం అయ్యారు. బాబు నాయకత్వంపై బహిరంగ విమర్శలు చేస్తూ పలువురు సీనియర్‌ నేతలు అధికార వైఎస్సార్‌సీపీలో చేరారు. మరికొంత మంది మాత్రం ఏ పార్టీలోనూ చేరకుండా టీడీపీకి దూరంగా ఉన్నారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కి మూలిగి తెచ్చుకున్న 23 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చంద్రబాబుకు తలకు మించిన భారంగా మారింది. ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు పలువురు ప్రతిపక్ష ఎమ్మెల్యే సైతం ఆకర్శితులై ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎమ్మెల్సీలు సైతం చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపించి... అధికారపక్షం వైపు నిలుచున్నారు. అంతేకాకుండా కరోనా సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కనీసం పట్టించుకోకుండా పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమైన టీడీపీ నేతకు ఆ పార్టీ కార్యకర్తలు సైతం మిగలకుండా పోయారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీలో చేరారు. మొత్తానికి 2020లో టీడీపీ పెద్ద నష్టాన్నే చేకూర్చింది.  


రంగుమారిన పవన్‌ రాజకీయం..
రాజకీయాల్లో మార్పు అనే నినాదంతో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్‌ టాప్‌ హీరో పవన్‌ కళ్యాణ్‌.. బొక్క బోర్లా పడ్డారు. ఇప్పటికే అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్న పవన్‌ ఈ ఏడాది కొత్త భాగస్వామ్య పక్షాన్ని ఎంచుకున్నారు. జనసేన ఆవిర్భావం సమయంలో ప్రకటించిన సిద్దాంతాలకు విరుద్ధంగా బీజేపీతో జట్టుకడుతున్నట్లు ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. రానున్న అన్ని ఎన్నిల్లోనూ ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని బీజేపీ-జనసేన నేతలు ఉమ్మడి సమావేశం ద్వారా వెల్లడించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించిన పవన్‌ ఆ తరువాత కొంత కాలానికే చంద్రబాబు నాయుడుతో విభేదించారు. అనంతరం 2019 ఎన్నికల్లో వామపక్షాలతో జట్టుకట్టారు. ఈ ఎన్నికల్లో పవన్‌ రెండు చోట్ల ఘోర ఓటమి చవిచూడటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒకే ఒక్కస్థానంలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే రూటుమార్చక తప్పదని భావించిన పవన్‌ కాషాయ పార్టీతో జట్టుకట్టారు. ఈ పరిణామం సొంత పార్టీ కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొత్తానికి 2020లో బీజేపీతో కలిసి తన రాజకీయ భవిష్యత్‌కు మార్పుకు పవన్‌ శ్రీకారం చుట్టారు.

భాగ్యనగర్‌లో బీజేపీ విస్తరణ.. కీలక నేతలు చేరిక    
ఉత్తరాన వికసించిన కమళం.. దక్షిణాదిపై కన్నేసింది. హస్తిన నుంచి బయలుదేరి కర్ణాటకలో పాగా వేసిన కమళనాథులు హైదరాబాద్‌పై గురిపెట్టారు. గత పార్లమెంట్‌ ఎన్నికలు నింపిన జోష్‌ను కొనసాగిస్తూ దుబ్బాక మీదుగా హైదరాబాద్‌ గడ్డపై కాలుమోపారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిచిన బీజేపీ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది.అంతేకాకుండా కేవలం 15 రోజుల వ్యవధిలోనే జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నిక​ల్లో అధికార టీఆర్‌ఎస్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీకి.. ఈ ఏడాది అన్నీ అనుకుల పరిణామాలే ఎదురైయ్యాయి. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ బాధ్యతలు చేప్టటిన అనంతరం దూకుడుగా వ్యహరిస్తూ అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్నారు.

నితీష్‌ విజయం.. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా తేజస్వీ
సూపర్‌ ఓవర్‌ వరకు సాగిన ఉత్కంఠభరిత టీ 20 మ్యాచ్‌ లాంటి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరులో చివరకు అధికార ఎన్డీయే విన్నింగ్‌ షాట్‌ కొట్టింది. చివరి ఓవర్‌ వరకు గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్‌ 122 కాగా, 124 సీట్లతో బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రానుంది. అయితే, అత్యధిక స్థానాలు గెలుచుకుని ‘పార్టీ ఆఫ్‌ ది మ్యాచ్‌’ గా ఆర్జేడీ నిలిచింది. ఆ పార్టీ అత్యధికంగా 76 స్థానాలు గెలుచుకుంది. రెండో స్థానంలో 73 సీట్లతో బీజేపీ నిలిచింది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పార్టీ జేడీయూ ఈ సారి 43 స్థానాలకే పరిమితమైంది. విపక్ష మహా కూటమిలో ఆర్జేడీ 76, కాంగ్రెస్‌ 19, లెఫ్ట్‌ పార్టీలు 16 సీట్లలో విజయం సాధించాయి. మొత్తంగా మహా కూటమికి 111 స్థానాలు వచ్చాయి. ఎంఐఎం 5, ఇండిపెండెంట్‌ 1, ఎల్జేపీ 1, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి. విజయం మహా కూటమిదేనని, కాబోయే ముఖ్యమంత్రి తేజస్వీ యాదవేనని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. కానీ వాటి అంచనాను తలక్రిందులు చేస్తూ ఎన్డీయే విజయం సాధించింది. ఎన్డీయే తరుఫున నితీష్‌ కుమార్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 

సింధియా కలకలం.. కుప్పకూలిన కమల్‌ సర్కార్‌
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జోతిరాధిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరడం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆయనతో పాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడటంతో కమల్‌నాథ్‌ సర్కార్‌ పడిపోయింది. అనంతరం శాసనసభలో సంఖ్యాబలం పూర్తిగా తగ్గిపోవడంతో బీజేపీ సీనియర్‌ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన సీఎం బాధ్యతలు స్వీకరించడం  ఇది నాలుగో సారి. మొత్తం 230 మంది సభ్యులు ఉన్న మధ్యప్రదేశ్‌లో బీజేపీకి తొలుత 107 మంది సభ్యుల బలం ఉండగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా అనంతరం ఆ పార్టీకి కేవలం 92 మంది సభ్యుల బలం మాత్రమే  మిగిలింది. దీంతో సభ బలం 206కు తగ్గగా, మెజారిటీ 104కు పడిపోయింది. దీంతో బీజేపీకి ఎవరి అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల బలం వచ్చింది. సింధియా రాజీనామా అనంతరం జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో కమల్‌నాథ్‌ సీఎం పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ సీఎం పీఠాన్ని చేరడానికి మార్గం సుగమమైంది. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిక్యాన్ని సాధించి ప్రభుత్వాన్ని సురక్షితంగా నిలబెట్టుకుంది.

రాజస్తాన్‌ సంక్షోభం.. సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు
ఎడారి రాష్ట్రం రాజస్తాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం దేశ వ్యాప్తంగా ఈ ఏడాది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ కీలక నేత సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌తో విభేదించి.. ఏకంగా 18  ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఈ వ్యవహారం.. కోర్టుల వరకు చేరింది. చివరికి సుదీర్ఘ చర్చల అనంతరం రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు  బుజ్జగించడంతో సచిన్‌ వెనక్కి వచ్చారు. ఓ సమయంలో మధ్యప్రదేశ్‌లో మాదిరీగానే రాజస్తాన్‌లో కాంగ్రస్‌ ప్రభుత్వం పడిపోతుందని పెద్ద ఎత్తున వార్తలు వాచ్చాయి. కానీ సీనియర్‌ నేతలు రంగంలోకి దిగి.. తిరుగుబాటు నేతల్ని వెనక్కి తీసుకురావడంతో గహ్లోత్‌ ఊపిరిపీల్చుకున్నారు.
దేవుడు శాసించాడు అరుణాచల్‌ పాటించాడు..
తమిళనాట మార్పుకు సమయం ఆసన్నమైందని ప్రకటించిన సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఈ ఏడాది అభిమాలను తీవ్ర నిరాశకు గురిచేశారు. దేవుడు శాసిస్తాడు ఈ అరుణాచల్‌ పాటిస్తాడు అంటూ ఇకపై తాను రాజకీయ రంగ ప్రవేశం చేయలేనంటూ సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్‌ 31న పార్టీ ప్రకటన చేస్తానని తొలుత ప్రకటించిన రజనీకాంత్‌ ఆ తరువాత అనారోగ్య సమస్యలకు గురికావడంతో వెనకడుగు వేశారు. మరోవైపు రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో స్టార్‌ నటుడు కమల్‌ హాసన్‌ సిద్ధమయ్యారు. రజనీతో కలిసి పనిచేయాలని భావించిన అతనికి తలైవా ప్రకటనతో ఏడాది చివరన నిరాశే మిగిలింది. 

కేరళ ‘స్థానికం’లో ఎల్డీఎఫ్‌ జయకేతనం
కేరళలో సీపీఎం నేతృత్వంలోని అధికార లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్డీఎఫ్‌) స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేసింది. గ్రామ పంచాయతీ, బ్లాక్‌ పంచాయతీల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మంచి విజయం సొంతం చేసుకుంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్ ‌(యూడీఫ్‌) మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో సానుకూల ఫలితాలు సాధించింది. రాష్ట్రంలో 941 గ్రామ పంచాయతీలు, 152 బ్లాక్‌ పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు, 86 మున్సిపాల్టీలు, 6 కార్పొరేషన్లకు డిసెంబర్‌ 8, 10, 14వ తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి

కశ్మీర్‌లో వికసించిన కమళం
జమ్మూకశ్మీర్​కు స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత మొదటిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి. జమ్మూ కశ్మీర్ డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల ఫలితాలు  ఎన్నికల కమిషన్ డిసెంబర్ 23న వెల్లడించింది. మొత్తం 20 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 14 చొప్పున 280 సీట్లకు 8 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పీఏజీడీ(గుప్కార్ కూటమి) 110 స్థానాల్లో గెలుపొంది అగ్రస్థానంలో నిలిచింది. 75 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచిన సింగిల్ పార్టీగా అవతరించింది. ఫలితాలపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఆర్టికల్‌ 370 రద్దుకు కశ్మీర్‌ ప్రజలు మద్దతు తెలిపారని కేంద్ర హోంశాఖ మం‍త్రి అమిత్‌  షా వ్యాఖ్యానించారు.

ట్రంప్‌ ఓటమి.. కొత్త అధ్యక్షుడిగా బైడెన్‌
ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ప్రభావం చూపిన అంశం అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఉత్కంఠ బరితంగా సాగిన అధ్యక్ష పోరులో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయం సాధించారు.538 మంది  సభ్యుల ఎలక్టోరల్‌ కాలేజీలో 306  ఓట్లతో బైడెన్‌ ముందంజలో నిలబడగా, ట్రంప్‌కి 232 ఓట్లు వచ్చాయి. అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారతీయ మూలాలున్న కమలా హ్యారీస్‌ విజయం సాధించారు. ఫలితాలపై కోర్టును ఆశ్రయించిన ట్రంప్‌ అక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడంతో ఓటమిని అంగీకరించక తప్పలేదు. జనవరి 20న అమెరికాలో కొత్త ప్రభుత్వం కోలువుదీరనుంది. అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో జరిగిన ఈ ఎన్నికలు చరిత్రలో ఎన్నడూలేనంతగా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్శించాయి.

రెండోసారి ప్రధానిగా జెసిండా అర్డెర్న్‌
న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో అధికార లిబరల్‌ లేబర్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. లెక్కించిన ఓట్లలో లేబర్‌ పార్టీకి దాదాపు 49 శాతం ఓట్లు లభించగా, ప్రధాన ప్రతిపక్షం నేషనల్‌ పార్టీకి 27 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ప్రస్తుత ప్రధాని జెసిండా అర్డెర్న్‌ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. న్యూజిలాండ్‌ ఎన్నికల్లో ఒక పార్టీకి ఇంతలా ఘనవిజయం దక్కడం దాదాపు ఐదు దశాబ్దాల్లో ఇదే తొలిసారని జెసిండా వ్యాఖ్యానించారు.  ఆ దేశంలో ప్రపోర్షనల్‌ ఓటింగ్‌ విధానం ఉంది. ఈ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఒక పార్టీకే పూర్తి మెజార్టీ రావడం ఇదే తొలిసారి.న్యూజిలాండ్‌లో ఎన్నికల ప్రచారం ఆరంభమైన్పటినుంచే జెసిండా హవా పూర్తిగా కొనసాగుతూ వచ్చింది. ఆమె ఎక్కడ ప్రచారానికి వెళ్లినా జననీరాజనాలు కనిపించాయి. ముఖ్యంగా దేశాన్ని కరోనా రహితంగా మార్చడంలో ఆమె కృషికి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. 2017లో సంకీర్ణ ప్రభుత్వానికి సారధిగా జెసిండా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో గతేడాది జరిగిన మసీదులపై దాడుల వేళ ఆమె సమర్ధవంతంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement