Rewind 2020
-
ఆకాశమే హద్దుగా..
కరోనా వైరస్ దెబ్బతో 2020లో ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా కుదేలైన దేశీ మార్కెట్లు.. ఆ తర్వాత నుంచి ఆకాశమే హద్దుగా ఎగిశాయి. ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకునేందుకు ఆపసోపాలు పడుతున్నా.. స్టాక్స్ మొదలుకుని బంగారం దాకా అన్నీ కొంగొత్త మైలురాళ్లను అధిగమిస్తున్నాయి. కొత్త సంవత్సరంలోనూ అదే జోరు కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2021లో మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలతో పాటు ఆకర్షణీయమైన స్టాక్‌లు, పసిడి పరుగులపై నెలకొన్న అంచనాలపై కథనం... కరెక్షన్లు ఉన్నా.. మార్కెట్లు ముందుకే.. కొత్త సంవత్సరంలోనూ బుల్ పరుగు కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మధ్యమధ్యలో కొంత కరెక్షన్ వచ్చినా.. మొత్తం మీద మార్కెట్లు మరింతగా పెరగడం ఖాయమని మోర్గాన్ స్టాన్లీ సంస్థ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే 2021 డిసెంబర్ నాటికి నిఫ్టీ 15,000 మార్కును దాటగలదని జేపీ మోర్గాన్ వర్గాలు తెలిపాయి. ఇక వేల్యుయేషన్లు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరమని నొమురా అభిప్రాయపడింది. మార్కెట్లు బుల్ రన్‌లోనే ఉన్నాయని, మూడేళ్ల కన్సాలిడేషన్ బ్రేకవుట్‌ను బట్టి చూస్తే 2021లో 16,200 టార్గెట్ సాధించవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ తెలిపింది. పడితే కొనుగోళ్లకు అవకాశం.. సాధారణంగా బుల్ పరుగులో 15–20 శాతం కరెక్షన్కు అవకాశాలు లేకపోలేదని, అయితే దీన్ని ప్రతికూలాంశంగా భావించాల్సిన పని లేదని ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంది. 11,400 కీలక మద్దతుగా .. ఈ కరెక్షన్లను కొనుగోళ్లకు అవకాశాలుగా మల్చుకోవచ్చని తెలిపింది. గడిచిన నాలుగు దశాబ్దాలుగా చూస్తే.. అమెరికా ఎన్నికలు జరిగిన మరుసటి సంవత్సరం అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు సానుకూల రాబడులే అందిస్తూ వస్తున్నాయని ఐసీఐసీఐ డైరెక్ట్ తన నివేదికలో వివరించింది. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, రంగాలవారీగా చూస్తే ఫైనాన్షియల్స్, టెలికం రంగాలపై దృష్టి పెట్టొచ్చని సిటీ రీసెర్చ్ సూచిస్తోంది. ఇక ఆర్డర్లు భారీగా ఉండటం, ప్రాజెక్టుల అమలు మెరుగుపడుతుండటం తదితర అంశాల కారణంగా నూతన సంవత్సరంలో ఇన్ఫ్రా రంగం ఆశావహంగా ఉండగలదని యస్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. కాస్త రిస్కులు ఉన్నప్పటికీ ఫైనాన్షియల్స్, టెలికం రంగాలవైపు చూడొచ్చని సిటీ రీసెర్చ్ సూచిస్తోంది. గణనీయంగా పడిపోయిన ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ), విద్యుత్, రియల్ ఎస్టేట్‌తో పాటు ఎఫ్ఎంసీజీ రంగ సంస్థల షేర్లను పరిశీలించవచ్చన్నది శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ సూచన. అనిశ్చితిలో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటోంది. తాజాగా కరోనా వైరస్ సంక్షోభ కాలంలోనూ అది రుజువైంది. 2020 తొలినాళ్లలో దేశీయంగా పుత్తడి గ్రాముల రేటు రూ. 39,100 దగ్గర, అంతర్జాతీయంగా ఔన్సుకు (31.1 గ్రాములు) 1,517 డాలర్ల దగ్గర ప్రారంభమైంది. కరోనా వైరస్ పరిణామాలతో ప్రారంభంలో రూ. 38,400 రేటుకు పడిపోయినా ఆ తర్వాత ఒక్కసారిగా ఎగిసింది. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీ (ఎంసీఎక్స్)లో ధర రూ. 56,191 స్థాయిని, అంతర్జాతీయంగా ఔన్సు రేటు (31.1 గ్రాములు) 2,075 డాలర్ల రికార్డు స్థాయిలను తాకింది. కొత్త సంవత్సరంలోనూ పసిడి జోరు కొనసాగే అవకాశాలే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. అంతర్జాతీయంగా రికవరీ మందకొడిగా సాగుతున్నందున కొత్త సంవత్సరంలో ఎంసీఎక్స్‌లో పసిడి ధర రూ. 57,000 నుంచి రూ. 63,000 దాకా చేరొచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ తెలిపారు. ప్యాకేజీ, డాలర్ బలహీనత ఊతం.. అమెరికా ఆర్థిక ప్యాకేజీ, డాలర్ బలహీనతల ఊతంతో బంగారం రేట్లు మరోసారి పెరగవచ్చని కామ్‌ట్రెండ్జ్ రిస్క్ మేనేజ్మెంట్ సరీ్వసెస్ సీఈవో జ్ఞానశేఖర్ త్యాగరాజన్ తెలిపారు. ‘‘భారత్, చైనాలో పసిడికి డిమాండ్ బాగా పెరగవచ్చు. రూపాయి మారకం విలువ కూడా స్థిరంగా ఉంటే 2021లో పుత్తడి రేటు దేశీయంగా రూ. 60,000, అంతర్జాతీయంగా 2,200 డాలర్లు తాకొచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతమున్న పసిడి రేట్లకు కొనుగోలుదారులు అలవాటుపడుతుండటం, పేరుకుపోయిన డిమాండ్, తక్కువ వడ్డీ రేట్లు, అసాధారణ స్థాయిలో నిధుల ప్రవాహం మొదలైన అంశాలన్నీ బంగారం రేట్లు పెరగడానికి దోహదపడగలవని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత విభాగం ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు గతంలో ఎన్నడూ చూడని అసాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. పరిశ్రమవర్గాలతో సమాలోచనల సందర్భంగా ఔషధాలు, బయోటెక్నాలజీ, వైద్య రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై ప్రస్తుతం భారీగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందంటూ ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ రంగాలకు ప్రాధాన్యం లభించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు నెలకొన్నాయి. మరోవైపు, 2021 బడ్జెట్.. ఇన్వెస్టర్లకు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం నిధుల కోసం నానా తంటాలు పడుతోందని.. గతేడాది కార్పొరేట్ ట్యాక్స్‌లు తగ్గించినప్పటికీ..కొత్తగా కోవిడ్–19 సర్‌చార్జీలు ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. టీకాల నుంచి ద్రవ్యోల్బణం దాకా... కొత్త సంవత్సరంలో మార్కెట్లకు దిశా నిర్దేశం చేసే అంశాలు కార్పొరేట్ల ఫలితాలు కంపెనీల ఆదాయాలు ఏడాది వ్యవధిలోనే దాదాపు కరోనా పూర్వ స్థాయికి చేరగలవని ఈక్విటీల నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత, తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో కార్పొరేట్ల ఆదాయాల అంచనాల వృద్ధి 6, 8 శాతం పైగా ఉండొచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. మెటల్స్, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇప్పటికే మెరుగైన రాబడులు అందిస్తుండగా.. రిటైల్, ఆటో మొదలైనవి కూడా అదే బాటలో ఉన్నాయని పేర్కొంది. ఆర్థిక రికవరీ కరోనా దెబ్బతో ఎకానమీ ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా క్షీణించింది. అయితే లాక్డౌన్ ఆంక్షల ఎత్తివేతతో క్రమంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జీఎస్టీ వసూళ్లు మళ్లీ రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటుతున్నాయి. ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం భారత ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10.3 శాతం క్షీణించే అవకాశమున్నా, వచ్చే ఆర్థిక సంవత్సరం 8.8 శాతం స్థాయిలో వృద్ధి సాధించవచ్చు. కోవిడ్–19 వ్యాప్తి ట్రెండ్, టీకాలు కరోనా వైరస్ టీకాల సమర్థత, వ్యాక్సినేషన్ ప్రోగ్రాం నూతన సంవత్సరంలో అన్నింటికన్నా కీలకంగా ఉండనున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో టీకాలు వేస్తుండగా.. భారత్‌లోనూ జనవరిలో దీన్ని చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫైజర్–బయోఎన్‌టెక్, ఆక్స్ఫర్డ్–ఆ్రస్టాజెనెకా, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాక్సిన్ టీకాలపై అందరి దృష్టి ఉంది. ఇక సెకండ్ వేవ్ కట్టడీ కీలక అంశమే కావడం గమనార్హం. ఆర్బీఐ పాలసీ రేట్లు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ నొమురా అంచనాల ప్రకారం భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉంది. ఇది ఇప్పుడప్పుడే దిగి వచ్చేలా కనిపించడం లేదు. కాబట్టి 2021 మొత్తం మీద రిజర్వ్ బ్యాంక్ .. వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉండకపోవచ్చు. అంతే కాకుండా మధ్యకాలికంగా చూస్తే ద్రవ్యోల్బణం ఎగియవచ్చని, 2022లో ఆర్బీఐ మళ్లీ వడ్డీ రేట్లను పెంచడం మొదలుపెట్టాల్సి రావొచ్చని నొమురా భావిస్తోంది. ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం కాస్త దిగి వచ్చినా .. కమోడిటీల రేట్లకు రెక్కలు రావడం, అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం తదితర అంశాల కారణంగా ఇతరత్రా ఉత్పత్తుల ధరలు అధిక స్థాయిలోనే కొనసాగవచ్చని అంచనా. ఇవే కాకుండా అమెరికాలో కరోనా వైరస్‌పరమైన ఆర్థిక ప్యాకేజీ, బ్రెగ్జిట్, అమెరికా–చైనా మధ్య సంబంధాలు, ఇతరత్రా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు మొదలైనవి మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. -
లాభాల పొద్దు.. ఆకాశమే హద్దు
సాక్షి, ఒంగోలు సబర్బన్: ఆశల విత్తనాన్ని బతుకు పంటలో వెదజల్లుతూ బువ్వ కంకులను సమాజానికి అందించే రైతులు ఈ ఏడాది సంతోషంగా ఉన్నారు. వరుణుడు కరుణించి సకాలంలో వర్షాలు కురవడంతో వాగూవంకలు పొంగిపొర్లాయి. జలాశయాలు నిండు కుండలా తొణికిసలాడాయి. గత ఏడాది మాదిరిగానే ఈఏడాదీ హలధారులు సిరులు పండించారు. పచ్చని పైర్లతో గ్రామ సీమలు విలసిల్లుతున్నాయి. ధాన్యపు రాశులతో రైతు లోగిళ్లు కళకళలాడాయి. ‘విత్తు విత్తిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులకు అండగా ఉంటాం’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న దశలోనూ రైతులకు సర్కారు దన్నుగా నిలిచింది. నివర్ తుఫాన్ కాస్త ఇబ్బంది పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవడంతో అన్నదాతల మోముల్లో ఆ బాధ ఛాయలు కనుమరుగయ్యాయి. మొత్తం మీద 2020వ సంవత్సరం కర్షక మహారాజులకు మేలు చేకూర్చింది. వర్షపాతం జిల్లాలో వర్షపాతం ఈ ఏడాది ఇప్పటి వరకు సాధారణం కంటే అధికంగా నమోదైంది. సాధారణంగా ఈ ఏడాది 757.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 905.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఈ ఏడాది సాధారణ వర్షం కంటే 148.50 మిల్లీమీటర్లు అధికంగా కురిసింది. పంటల సాగు ఈ ఏడాది పంటల సాగు గత ఏడాదికంటే అధిక మొత్తంలో సాగు చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు పాలనలో వరుసగా ఐదేళ్లు కరువు సంభవించి జిల్లా రైతులు అల్లాడిపోయారు. గత ఏడాది వ్యవసాయ సీజన్, ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్లో విస్తారంగా పంటలు సాగు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 2,18,248 హెక్టార్లు కాగా అందులో 2,02,749 హెక్టార్లలో పంటలు వేశారు. రబీ 2020–21 సీజన్లో జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2,42,997 హెక్టార్లు కాగా ఇప్పటికే 1,80,210 హెక్టార్లు పంటలతో కళకళలాడుతున్నాయి. రైతు భరోసా కేంద్రాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయాన్ని పండగలా మార్చింది. రైతులకు వ్యవసాయ సేవలు అందుబాటులో ఉంచేందుకు విప్లవాత్మకంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లాలోని ప్రతి గ్రామ సచివాలయానికి అనుబంధంగా మొత్తం 879 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధకం, మార్కెటింగ్ శాఖలకు సంబంధించిన సేవలన్నీ గ్రామ స్థాయిలో ఒకేచోట అందిస్తున్నాయి. 3,692 టన్నుల విత్తనాలు, ఎరువులు పంపిణీ రైతు భరోసా కేంద్రాల ద్వారా జిల్లా వ్యాప్తంగా 3,692 టన్నుల విత్తనాలు ఎరువులు, పురుగు మందులను రైతులకు సరఫరా చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులను నిత్యం రైతులకు అందుబాటులో ఉంచేందుకు 870 ఎరువుల నిల్వ గోడౌన్లు కూడా ఏర్పాటు చేశారు. వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ, విజ్ఞాన ప్రదర్శనలు, వ్యవసాయ లైబ్రరీ, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల తయారీ, వివిధ పథకాల్లో లబ్ధిదారులను గుర్తించడం, పంటల నమోదు తదితర సేవలు రైతులకు నిరాటంకంగా అందుతున్నాయి. 12 వ్యవసాయ ప్రయోగశాలలు జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 12 వ్యవసాయ ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. వీటికి వైఎస్సార్ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలుగా నామకరణం చేశారు. వీటి ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే వీటి సొంత భవనాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 56,000 క్వింటాళ్ల పంట ఉత్పత్తుల కొనుగోలు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పంట ఉత్పత్తులు దాదాపు 56 వేల క్వింటాళ్లను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసింది. ధాన్యంతోపాటు సజ్జ, మొక్కజొన్నలను కూడా కొనుగోలు చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు రైతుల గ్రామాల్లోనే సేకరించే విధంగా ఏర్పాట్లు చేసింది. ఖరీఫ్ సీజన్లో సజ్జ కొనుగోలుకు 69 కేంద్రాలు, మొక్కజొన్నకు 37, కొర్ర 46, వరి 115, పత్తి కొనుగోలుకు 3 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వేగంగా వెలిగొండ ప్రాజెక్టు పనులు జిల్లాతోపాటు కడప, నెల్లూరు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీశైలం డ్యామ్ నుంచి నీరు సరఫరా చేసే రెండు సొరంగాల్లో ఒక టన్నెల్ తవ్వకం ఇటీవల పూర్తయింది. ఒకటవ టన్నెల్ పొడవు 18.787 కిలోమీటర్లు కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే నాటికి 15.600 కి.మీ తవ్వారు. మిగతా 3.187 కి.మీ సొరంగాన్ని 18 నెలల్లోనే తవ్వేసి రెండో టన్నెల్ నిర్మాణం వైపు దృష్టి సారించారు. ఆర్అండ్ఆర్ పనులను వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా గుండ్లకమ్మ ప్రాజెక్టు ఆయకట్టు అభివృద్ధికి ప్రభుత్వం రూ.102 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఆ పనులు టెండర్ల దశలో ఉన్నాయి. వీటితో పాటు కొరిశపాడు ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి కూడా పనులు సాగుతున్నాయి. పాలేరుపై నిర్మించ తలపెట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టు పాత టెండర్లు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. రైతు భరోసా.. రూ.542.83 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం జిల్లా రైతులను ఆదుకుంటోంది. ఈ ఏడాది మూడు విడతలుగా రైతు భరోసా పథకం నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ ఏడాది మొదటి విడత మే నెల 15న 3,90,019 మంది రైతులకు రూ.292.51 కోట్లు, రెండో విడత అక్టోబర్ 27న 3,93,840 మంది రైతులకు రూ.162.15 కోట్లు, డిసెంబర్ 29న 4,06,568 మంది రైతులకు రూ.88.17 కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశారు. సున్నా వడ్డీ చెల్లింపు.. రూ.10.01 కోట్లు జిల్లా ఖరీఫ్–2019 పంట కాలానికిగాను రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీ రూ.10.01 కోట్లను ప్రభుత్వం వైఎస్సార్ వడ్డీ లేని పంట రుణాల కింద బ్యాంకులకు చెల్లించింది. జిల్లాలో మొత్తం 3,55,252 మంది రైతులు రూ.4,067 కోట్ల పంట రుణాలు తీసుకోగా అందులో 44,591 మంది సున్నా వడ్డీకి అర్హులుగా ఎంపికయ్యారు. రూ.లక్ష రుణం పొంది ఏడాదిలోగా చెల్లించిన వారికి ప్రభుత్వం పూర్తిగా వడ్డీ చెల్లించింది. విత్తన రాయితీ.. రూ.9.34 కోట్లు ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు మొత్తం రూ.9.34 కోట్ల మేర విత్తన రాయితీని ప్రభుత్వం కల్పించింది. 42,927 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు రైతులకు సరఫరా చేశారు. వాటిలో పచ్చిరొట్ట విత్తనాలు, కంది, మినుము, శనగ మొదలైనవి ఉన్నాయి. పంట నష్ట పరిహారం.. రూ.112.58 కోట్లు జిల్లాలో ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.112.58 కోట్ల పరిహారం చెల్లించింది. నవంబర్‌లో నివర్ తుఫాను కారణంగా దాదాపు 20 రకాల పంటలు 88,742.02 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. మొత్తం 1,30,086 మంది రైతులు నష్టపోయారు. అందుకుగాను ప్రభుత్వం రూ.103.49 కోట్లు రైతులకు అందించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రూ.8.95 కోట్లు చెల్లించింది. అక్టోబర్‌లో కురిసిన అధిక వర్షాలకు 2,885 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా 4,955 మంది రైతులకు రూ.4.14 కోట్లు అందజేసింది. నష్టపోయిన రైతులకు నెలలోపే పరిహారం ఇచ్చిన ఘనత వైఎస్సార్ సీపీ సర్కారుకే దక్కింది. పంటల బీమా.. రూ.426.22 కోట్లు జిల్లాలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఈ ఏడాది రూ.426.22 కోట్లు అందించారు. 2018–19కి సంబంధించి 1,44,219 మంది రైతులకు ఇవ్వాల్సిన రూ.186.30 కోట్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చెల్లించింది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ప«థకాన్ని ఖరీఫ్ 2019 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఖరీఫ్ 2019లో 2.88 లక్షల మంది రైతుల బీమా ప్రీమియంను మే నెలలో ప్రభుత్వం చెల్లించింది. ఖరీఫ్‌లో పంట కోల్పోయిన 1,30,106 మంది రైతులకు రూ.239.92 కోట్ల బీమా సొమ్మును నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేసింది. రబీ 2019–20లో 2,74 లక్షల మంది రైతుల వివరాలు పంటల బీమా పథకంలో నమోదు చేశారు. నిండు కుండల్లా ప్రాజెక్టులు జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులు ఈ ఏడాది ప్రారంభం నుంచి నిండుకుండలను తలపించాయి. సాగునీటి చెరువులు మొత్తం 956 ఉండగా అందులో 700కు పైగా చెరువులు నిండాయి. మిగిలిన చెరువులకు 70 నుంచి 90 శాతం మేర నీరు చేరింది. -
కరోనా కాలాన చీకటి వెలుగులు
సాకక్షి, అమలాపురం: 2020 ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. జీవితాంతం వెంటాడే ‘కరోనా’ బాధను కలిగించింది. కంటికి కనిపించని ఒక ప్రాణి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. సామాన్యులు, పేదలు, మధ్య తరగతి, ఉన్నత వర్గాల వారినందరినీ బాధించింది. లాక్డౌన్ పేరుతో ప్రజా జీవితాన్ని స్తంభింపజేసింది. వరదలు, వర్షాలు, ప్రమాదాలు జిల్లా వాసులను ఏడాది పొడవునా వెంటాడాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఏడాది చివరిలో కరోనా వ్యాప్తి తగ్గడం, వ్యాక్సిన్ కోసం చేసిన ప్రయోగాలు విజయవంతం కావడం ప్రజలకు ఊరటనిచ్చే అంశం. ఇదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేద, మధ్య తరగతికి చెందిన వేలమంది లబ్ధిపొందడం, ఏడాది చివరిలో రికార్డు స్థాయిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం శుభపరిణామం. అతలాకుతలం కరోనా మన జిల్లాపై పెను ప్రభావాన్ని చూపించింది. వేల మందిని సోకింది. వందల మందిని ఆస్పత్రుల పాల్జేసింది. ఒకానొక సమయంలో జిల్లాలో రోజుకు 1,500కు పైబడి పాజిటివ్ కేసులు వచ్చాయి. జూలై, ఆగస్టు నెలల్లో కరోనా కేసులు ప్రమాదకరస్థాయికి చేరాయి. జిల్లాలో తొలి కరోనా కేసు మార్చి 21న నమోదైంది. మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించగా, ఆ తర్వాత నుంచి ఆంక్షలతో కూడిన లాక్డౌన్ మొదలైంది. ఇంత వరకు జిల్లాలో 1,23,604 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 403 యాక్టివ్ కాగా, 1,22,565 మంది కోలుకున్నారు. 636 మంది మృత్యువాత పడ్డారు. ఇతర ప్రాంతాలలో ఉన్న స్థానికులు పెద్ద ఎత్తున తిరిగి వచ్చేశారు. ఇక్కడ ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వేలాది కూలీలు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అన్నవరం సత్యదేవుని వంటి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు రోజుల తరబడి మూతపడ్డాయి. ప్రభుత్వ పటిష్ట చర్యలు ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న విలయాన్ని చూసిన రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మేల్కొంది. కోవిడ్ నియంత్రణకు పటిష్ట ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో ఆధునిక వైద్యసేవలు అందించడంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో వేలాదిమందికి ఆరోగ్యకరమైన సదుపాయాలు కల్పించింది. పౌష్టికాహారం అందించింది. నిరంతర వైద్యసేవల కారణంగా మరణాల శాతం చాలా తగ్గింది. జిల్లాలో వేలాది మంది కరోనా బారిన పడినా, రికవరీ శాతం 99.1 ఉండడం విశేషం. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు పేదలను ఆదుకునేందుకు నిర్వహించిన సేవా కార్యక్రమాలు కూడా ప్రశంసలందుకున్నాయి. ఏడాది ఆరంభంలో మొదలైన కరోనా బెడద ఆఖరి రోజుల్లో కూడా వీడలేదు. ఇప్పుడు కరోనా కేసులు చాలా వరకు తగ్గడం ఊరటనిచ్చే అంశం కాగా, వాక్సిన్ అందుబాటులోకి వస్తుండడం జిల్లా వాసుల్లో ధైర్యాన్ని నింపింది. అడుగడుగునా వ్యవసాయం జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయం పలు రకాల సంక్షోభాలను, సవాళ్లను ఎదుర్కొంది. కరోనా, వరదలు, భారీ వర్షాలు ఇలా వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. కరోనా లాక్డౌన్ సమయంలో ఆక్వా, ఫౌల్ట్రీ రైతులు భారీ నష్టాలను చవిచూశారు. ఎగుమతులు నిలిచిపోవడంతో ఆందోళన చెందారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభం చేయడంతో వారం, పది రోజుల వ్యవధిలో గాడిన పడ్డారు. వరి, కూరగాయల రైతులు, ఉద్యాన రైతులను వరదలు, వర్షాలు బెంబెలెత్తించాయి. కొబ్బరి ధర తగ్గిన సమయంలో నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల కొబ్బరి ధర పెరిగేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించాయి. అయితే ప్రభుత్వం నుంచి అందిన సహాయంతో రైతులు కోలుకున్నారు. 4,55,022 మంది వరకు రైతు భరోసా, ఎంపీ కిసాన్ సహాయ నిధి నుంచి మూడు విడతలుగా రూ.1,334.96 కోట్ల మేర లబ్ధి పొందారు. పంట నష్ట పరిహారం కోసం గతంలో ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ ఈ ఏడాది వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రెండు నెలలకే పరిహారం అందజేస్తుండడంతో రైతులు సాంతన పొందుతున్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన సుమారు 23,171 మంది రైతులకు అక్టోబరు 27న రూ.16.59 కోట్లు, తాజాగా నివర్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు డిసెంబరు 29న రూ.46.25 కోట్ల పరిహారం అందజేశారు. ఈ ఏడాదిలోనే రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడం వాటి ద్వారా విత్తనాలు, ఎరువుల అమ్మకాలు, ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేయడం రైతులకు మేలు చేసింది. కాకినాడ రూరల్ మండలంలో మంపుబారిన పడిన కాలనీలు (ఫైల్) భారీ వర్షాలు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. జూన్ ఒకటి నుంచి నవంబర్ 30 వరకూ ఆరు నెలల్లో 104 రోజుల పాటు జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో వర్షం పడడం విశేషం. జిల్లాలో సగటు వర్షపాతం 1,063.2 మి.మీటర్లు కాగా, 1,479.1 మి.మీటర్లు కురిసింది. ఇది సగటు కన్నా 38.7 శాతం అధికం. 53 మండలాల్లో అత్యధికంగా, 11 మండలాల్లో సాధారణ వర్షం పడింది. మారేడుమిల్లి మండలంలో సగటు 731.7 మి.మీటర్లు కాగా, ఏకంగా 2,254.6 మి.మీటర్లు, అమలాపురంలో సగటు 1,066 మి.మీటర్లు కాగా, 1,812.2 మి.మీటర్ల రికార్డుస్థాయి వర్షం కురిసింది. అక్టోబరులో 11 నుంచి 13 వరకు వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ రూరల్ మండలాన్ని నిండా ముంచాయి. నవంబరు 26న తమిళనాడులో తీరం దాటిన తుపాను జిల్లాపై పెను ప్రభావం చూపింది. కోతల మీద ఉన్న ఖరీఫ్ పంటను ముంచేసింది. వరితో పాటు అన్ని రకాల పంటలు కలిపి 78,625 ఎకరాల్లో నీట మునిగాయి. భారీ వర్షాలతో మెట్ట, కోనసీమలో వరి, కూరగాయ పంటలు, ఉద్యాన పంటల రైతులు నష్టపోయారు. అయితే మెట్ట, ఏజెన్సీలో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. చెరువులు, పంపా, ఏలేరు, భూపతిపాలెం, సుద్దగడ్డ, చంద్రబాబు సాగర్ వంటి ప్రాజెక్టులు నీటితో కళకళలాడాయి. ఈ ప్రాంతంలో రెండో పంట సాగుకు సైతం రైతులు చేపట్టారు. 2016లో మెట్టలో 3.56 మీటర్ల లోతున ఉన్న భూగర్భ జలాలు గత నవంబరులో 2.26 మీటర్లకు చేరాయి. ఏజెన్సీలో 5.68 మీటర్ల లోతున ఉన్న జలాలు 4.16కు వచ్చాయి. కొబ్బరి పీచు పరిశ్రమలకు తీవ్ర నష్టం కరోనా సమయంలో చిన్నతరహా పరిశ్రమలు బాగా నష్టపోయాయి. లాక్డౌన్ సమయంలో మేము చేసిన ఉత్పత్తి రవాణా కాలేదు. ఆ తర్వాత రవాణా ఆంక్షలు వీడినా ఉత్పత్తి చేసే కార్మికులు రాలేదు. ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు వెళ్లిపోవడంతో స్థానికంగా కార్మికులు లేకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. కరోనా వల్ల కొబ్బరి పీచు చిన్న పరిశ్రమలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం మరిన్ని రాయితీలు ఇవ్వాలి. – మురళీ, క్వాయర్ పరిశ్రమ యజమాని, ఆలమూరు వ్యవసాయం ఆదుకుంది కరోనా వల్ల అన్ని రంగాలు ఇబ్బంది పడ్డాయి. వ్యవసాయమే త్వరగా కోలుకుంది. రైతులు, కూలీలు, వ్యవసాయ అనుబంధ వ్యాపార రంగాలు నిరంతరాయంగా కొనసాగాయి. ఆ సమయంలో వ్యవసాయమే ఒక విధంగా ఆదుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా రైతులకు మేలు చేశాయి. పంట నష్టపోయిన రెండు నెలల్లోనే పరిహారం ఇవ్వడం అభినందనీయం. – ఉద్దరాజు ప్రసాదరాజు, రైతు, కొత్తపేట అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ఏ మంచి పనిచేసినా తూర్పు సెంటిమెంట్‌కు పెద్ద పీట వేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది ప్రారంభించిన రెండు కార్యక్రమాలకు జిల్లాలోనే శ్రీకారం చుట్టారు. దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా రాష్ట్రంలో సుమారు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన జగన్ ఆ కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని కొమరగిరిలో లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోనే తొలిసారి దిశ చట్టాన్ని చేసిన ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకున్న సీఎం జగన్ రాష్ట్రంలో మొదటిసారిగా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన దిశ పోలీసు స్టేషన్‌ను ప్రారంభించడం ద్వారా తూర్పుపై తనకున్న ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు. పోటెత్తిన గోదావరి.. ముంచేసిన ఏలేరు ఇటు గోదావరి.. అటు ఏలేరు. ఈ రెండూ వరదలతో ముంచెత్తాయి. ఏడేళ్ల తరువాత గోదావరికి రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ఆగస్టు 10న ఆరంభమైన వరద నీటి రాకతో 13వ తేదీ నాటికి 5.78 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. 14 నాటికి ఇది 7.88 లక్షలు, 15వ తేదీకి 12.14 లక్షలు, 16వ తేదీకి 15.52 లక్షలు, 17వ తేదీకి 19.69 లక్షలు, 18వ తేదీకి 22.58 లక్షల క్యూసెక్కుల వరద నీరు ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చింది. ఎగువున దేవీపట్నం నుంచి దిగువున సఖినేటిపల్లి, కాట్రేనికోన, అల్లవరం మండలాల వరకు పదుల సంఖ్యలో లంక గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. రెండు రోజులు పాటు తగ్గినట్టే తగ్గిన వరద 21వ తేదీన మరోసారి పెరిగి 18.59 లక్షల క్యూసెక్కులకు చేరింది. భారీ వరదల వల్ల 2,237 ఎకరాల్లో ఉద్యాన, ఇతర పంటలు దెబ్బతినడంతో లంక రైతులు నష్టపోయారు. సుమారు 14,600 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. 8 మెట్టను ఏలేరు ముంచెత్తింది. రెండుసార్లు రికార్డుస్థాయిలో వరదలు వచ్చాయి. సెప్టెంబరు 14 నుంచి 20 వరకు తొలిసారి వరద రాగా, రెండోసారి అక్టోబరులో వరద తాకింది. సుమారు 30 వేల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. అప్పటికే ఎకరాకు సుమారు 34 వేల వరకు పెట్టుబడి పెట్టడంతో రైతులు నష్టాలను ఎక్కువగా చూశారు. పెళ్లింట విషాదం గోకవరం మండలంలోని తంటికొండపైగల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఘాట్‌రోడ్డుపై అక్టోబరు 30న జరిగిన రోడ్డు ప్రమాదం జిల్లాలో పెను విషాదాన్ని నింపింది. పెళ్లి బృందం ఉన్న వ్యాన్ బోల్తా పడిన ఘటనలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. తొమ్మిది మంది గాయపడ్డారు. పెళ్లి జరిగిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో పెళ్లి వారి ఇంటనే కాదు.. జిల్లా వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఆ వ్యాన్‌లో పెళ్లి కుమారుడి తరఫు వారు సుమారు 17 మంది వరకు తిరుగు ప్రయాణమయ్యారు. హ్యాండ్ బ్రేకు తీసిన వెంటనే ఆ ప్రదేశం పల్లంగా ఉండటంతో వాహనం వేగంగా కిందకు పడిపోయింది. జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలు కరోనా కారణంగా ఈ ఏడాది మెగా క్రీడా టోర్నీలన్నీ రద్దయిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత క్రీడాపరంగాను, క్రీడా పోటీల నిర్వహణలో తూర్పు పెద్ద దిక్కుగా మారింది. కరోనా కారణంగా రాష్ట్రస్థాయి డిగ్రీ, ఇంటర్మీడియట్, పాఠశాల స్థాయి పోటీలతో పాటు పలు క్రీడా అసోసియేషన్లు నిర్వహించే పోటీలు, ప్రైవేట్ టోర్నీలు నిలిచిపోయాయి. కరోనాకు ముందు అమలాపురంలో నిర్వహించిన జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు మాత్రమే చెప్పుకోదగినవి. మొత్తం 15 అంశాలలో జరిగిన ఈ పోటీల్లో జూనియర్స్ విభాగంలో 250 మంది, మాస్టర్స్, దివ్యాంగ విభాగంలో 85 మంది, మహిళా విభాగంలో 30 మంది పాల్గొన్నారు. రాష్ట్రంలో జాతీయ మహిళల విభాగంలో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం ఇక్కడే తొలిసారి కావడం గమనార్హం. ఇండియన్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, పద్మశ్రీ ప్రేమ్‌చంద్ డగ్రా ఈ పోటీలకు రావడం హైలెట్‌గా నిలిచింది. అమలాపురం వంటి ప్రాంతంలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించడాన్ని పలువురు అంతర్జాతీయ క్రీడాకారులు అభినందించారు. గ్యాస్ లీకేజీ కాట్రేనికోన మండలం ఉప్పూడిలో ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 4.30 గంటల మొదలైన గ్యాస్ లీకేజీ స్థానికులు భయభ్రాంతులకు గురిచేసింది. ఓఎన్జీసీ సంస్థకు చెందిన బావిని లీజుకు తీసుకున్న పీఎఫ్‌హెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 48 గంటల పాటు స్థానికులతో పాటు జిల్లా అధికార యంత్రాంగాన్ని, ఓఎన్జీసీ అధికారులను ఆందోళనకు గురి చేసింది. భీకర హోరుతో నేలపొరల నుంచి తన్నుకు వచ్చిన సహజ వాయువు (గ్యాస్) కమ్మివేయడంతో స్థానికులు గజగజలాడారు. సుమారు 1,600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద చర్యలకు దిగింది. ఎక్కడా నిప్పు రాజుకోకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంది. ప్రమాదం జరిగిన 48 గంటల తరువాత ఓఎన్జీసీ రెస్క్యూ బృందం గ్యాస్ లీకేజీని అరికట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బీసీలకు పదవుల పండగ రాజకీయ చైతన్యం కలిగిన తూర్పులో ఈ ఏడాది పలువురికి ఉన్నత పదవులు వచ్చాయి. బీసీ సామాజిక వర్గానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సముచిత స్థానం లభించింది. మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ జూన్‌లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ జూలైలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బీసీ కులాలకు ప్రకటించిన కార్పొరేషన్లలో జిల్లాకు ప్రాధాన్యం లభించింది. గాండ్ల, తెలికుల కార్పొరేషన్ చైర్మన్‌గా రాజమహేంద్రవరానికి చెందిన సంకిస భవానీ ప్రియ, అయ్యరక కార్పొరేషన్ చైర్మన్‌గా సామర్లకోటకు చెందిన అవాల రాజేశ్వరి, పెరికి కార్పొరేషన్ చైర్మన్‌గా తుని మండలం పి.తిమ్మాపురానికి చెందిన పురుషోత్తం గంగాభవాని, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్‌గా కాకినాడకు చెందిన బందన హరి ఎంపికయ్యారు. వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్సీగా మాజీ అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఎన్నికయ్యారు. రాజకీయంగా ఈ ఏడాది మిగిలిన పార్టీలలో కొత్త నియామకాలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ, మన జిల్లాకు చెందిన సోము వీర్రాజు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్, అమలాపురానికి రెడ్డి అనంతకుమారి, రాజమహేంద్రవరానికి కొత్తపల్లి జవహర్ నియమితులయ్యారు. ఈ ఏడాది మార్చిలో మున్సిపాలిటీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. కరోనా పేరుతో ఎన్నికల కమిషన్ వాయిదా వేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. తగ్గిన నేరాలు తీవ్ర నేరాల నమోదు సంఖ్య గతేడాదితో పోలిస్తే 2020లో తగ్గింది. 2019లో 120 కేసులు నమోదైతే 2020లో 104 కేసులు నమోదయ్యాయి. లోక్ అదాలత్‌లో 1,663 కేసులు పరిష్కరించారు. గతేడాది దిశ చట్టాన్ని అనుసరించి 758 జీరో ఎఫ్ఐఆర్లు నమోదైతే, ఈ ఏడాది ఆ సంఖ్య 999కి పెరిగింది. గిరిజనుల ఉన్నతికి కృషి చేసినందుకు, చేపట్టిన చర్యలకు ఎస్పీ అద్నాన్ నయిం అస్మీకి బెస్ట్ కెపాసిటీ బిల్డింగ్ అవార్డు అందింది. కోవిడ్ మహమ్మారి 11 మంది పోలీసులను పొట్టనబెట్టుకుంది. చంటి పిల్లలపై నేరాలు పెరిగాయి. ఈ ఏడాది వీటి సంఖ్య 154కు చేరింది. ఏడు నెలలుగా ఉపాధి లేదు ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసేవాడిని. వ్యవసాయ కూలీ అయిన నాన్నతో పాటు అమ్మ, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు ఒకే ఇంటిలో జీవనం సాగిస్తున్నాం. జూన్‌లో నూతన విద్యా సంవత్సరం ఆరంభం కావాల్సి ఉండగా కోవిడ్–19 వైరస్ వ్యాప్తి కారణంగా జరగలేదు. ఉపాధి లేకపోవడంతో జూన్ నుంచి కొద్ది నెలలు పాటు కూరగాయలను విక్రయించాను. కరోనావ్యాప్తి తీవ్రం కావడంతో దాన్ని వదులుకున్నాను. ప్రస్తుతం ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. – సంగుల శ్రీనివాస్, అంగర, కపిలేశ్వరపురం మండలం విద్యార్థుల సంఖ్య పెరిగింది కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. వ్యవస్థ తారుమారైంది. మన ప్రాంతంలో కరోనా తగ్గినా విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను పంపేందుకు ఇబ్బంది పడుతున్నారు. దశలవారీగా తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థుల సంఖ్య పెరిగింది. విద్యావ్యవస్థ గాడిలో పడటానికి ఇంకొంత సమయం పట్టవచ్చు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విద్యార్థులకు ఊరట లభించింది. – మోకా ప్రకాష్. హెచ్ఎం, తొండవరం, అంబాజీపేట మండలం -
కారును ఆపి.. కాక రేపి..!
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు 2020 సంవత్సరం నేర్పిన పాఠమిది. తిరుగులేదనుకున్న టీఆర్ఎస్కు ఏడాది చివర్లో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. దుబ్బాక మింగుడుపడని చేదు అనుభవాన్ని మిగల్చగా... ‘గ్రేటర్’షాకిచ్చింది. మరోవైపు బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగగలుగుతామనే ఆత్మవిశ్వాసాన్ని మెండుగా ఇచ్చింది. దుబ్బాకలో అనూహ్య విజయం, గ్రేటర్లో మంచి ప్రదర్శన బీజేపీ శ్రేణుల్లో నయా జోష్ నింపాయి. మాటల తూటాలు, మహామహుల ప్రచారంతో ఏడాది చివర్లో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఈ ఏడాదిలో వరుస ఓటములు, వలసలతో మరింత డీలా పడిపోయింది. మరోవైపు కాంగ్రెస్ ‘మార్కు’అంతర్గత కుమ్ములాటలు... వెరసి ఎటుపోతోందో తెలియని స్థితిలో ఉంది. - సాక్షి, హైదరాబాద్ టీఆర్ఎస్ దూకుడుకు దుబ్బాక బ్రేక్ టీఆర్ఎస్కు 2020 సంవత్సరం మిశ్రమ అనుభూతులను మిగిల్చింది. మున్సిపల్ ఎన్నికలు టీఆర్ఎస్ బలాన్ని చాటగా... ఏడాది చివరిలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు అందని రీతిలో టీఆర్ఎస్ ఏకపక్ష విజయాలు సాధించింది. 122 మున్సిపాలిటీలతో పాటు పది మున్సిపల్ కార్పొరేషన్లలో టీఆర్ఎస్ పాగా వేసింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో జరిగిన సహకార ఎన్నికల్లో రాష్ట్రంలోని 9 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు అన్నీ టీఆర్ఎస్ ఖాతాలోనే చేరాయి. ఇక టీఆర్ఎస్ శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఈ ఏడాది నవంబర్‌లో దుబ్బాక ఉపఎన్నిక జరిగింది. రామలింగారెడ్డి భార్య సుజాత టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు వేయికి పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇది నాలుగో అసెంబ్లీ ఉప ఎన్నిక కాగా, టీఆర్ఎస్ తొలిసారిగా ఓటమి పాలైంది. ఈ ఏడాది చివరలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ మిశ్రమ ఫలితాన్ని సాధించింది. 150 డివిజన్లకు గాను 56 చోట్ల మాత్రమే గెలుపొందింది. గట్టి ఎదురుదెబ్బ తగిలినా.. అతిపెద్ద పార్టీగా అవతరించడం కాస్తలోకాస్త ఊరట. (చదవండి: రివైండ్ 2020: పరిశోధన ఆగలేదు!) నిజామాబాద్ నుంచి మండలికి కవిత లాక్డౌన్ కారణంగా వాయిదాపడ్డ నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరిగాయి. మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మొత్తం 824 ఓట్లకు గాను... 728 ఓట్లు సాధించి భారీ మెజారిటీతో మండలిలో అడుగుపెట్టారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న గరికపాటి మోహన్‌రావు, కేవీపీ రామచంద్రరావుల పదవీ కాలం ముగియడంతో ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర కోటాలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టీఆర్ఎస్ తరపున పార్టీ సెక్రటరీ జనరల్ డాక్టర్ కె.కేశవరావు వరుసగా రెండో పర్యాయం, ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన కేఆర్ సురేశ్‌రెడ్డి ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. శాసనమండలికి గవర్నర్ కోటాలో ముగ్గురిని నామినేట్ చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఈ ఏడాది నవంబర్‌లో తీర్మానం చేసింది. ప్రజా కవి గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, బోగారపు దయానంద్ గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా నియమితులయ్యారు. నవంబర్ 28న ఎల్బీ స్టేడియంలో జరిగిన గ్రేటర్ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్... డిసెంబర్ 10న సిద్దిపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించి ఆందోళనల్లో పాల్గొంది. ఇవి మినహా 2020లో కరోనా కారణంగా పార్టీపరంగా పెద్దగా కార్యక్రమాలేవీ లేవు. కమలంలో కొత్త ‘జోష్’ ఈ ఏడాది రాజకీయంగా రాష్ట్ర బీజేపీకి బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా ఏడాది చివర్లో జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయాలు ఆ పార్టీకి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. ఈ ఏడాదిలోనే రాష్ట్ర పార్టీలో సంస్థాగత మార్పులు కూడా జరగడం, వెంటనే మంచి విజయాలు రావడంతో కమలనాథుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన బండి సంజయ్ పార్టీలో ఊపు తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన మాజీ మంత్రి డి.కె.అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి హోదా దక్కగా, గత అధ్యక్షుడు డాక్టర్. కె.లక్ష్మణ్‌కు ఓబీసీ సెల్ జాతీయ చైర్మన్ పదవి దక్కింది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న కమలం పార్టీ నేతలు 2020 ఇచ్చిన ఉత్సాహంతో 2021కి సిద్ధమవుతూ... 2023లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామనే ధీమాతో ఉన్నారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత తెలంగాణపైనే బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టిందనే చర్చ కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లపై కమలదళం గురిపెట్టి పనిచేస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ అనుకూల ఫలితాలే రావడం.... తెలంగాణలో కూడా సానుకూల ఫలితాలు వస్తుండటంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో పెద్ద రాజకీయ శక్తిగా అవతరిస్తామనే ధీమా రాష్ట్ర బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్: వరుస ఓటములు, వలసలు కాంగ్రెస్ పార్టీకి 2020 సంవత్సరం కూడా చేదు అనుభవాలనే మిగిల్చింది. గత ఆరేళ్లుగా చెప్పుకోదగ్గ విజయాలు లేక అల్లాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాదిలో మరింత నష్టాన్ని చవిచూసింది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా పోగొట్టుకోగా, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమనే పేరును కూడా కోల్పోయే స్థాయిలో 2020లో కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. పార్టీ నుంచి వలసలు కూడా ఆగకుండా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలతో పాటు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న విజయశాంతి కూడా బీజేపీలో చేరారు. గంపెడాశలు పెట్టుకుని రాష్ట్ర బలగమంతా పనిచేసిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో వచ్చిన ఫలితం ఓ రకంగా కాంగ్రెస్‌ను కుదేలు చేసింది. అక్కడ ద్వితీయ స్థానం పోయింది... డిపాజిట్ కూడా రాలేదు. అధికార టీఆర్ఎస్ను ఓడించి మరీ బీజేపీ గెలవడం రాజకీయ సమీకరణాలను బాగా ప్రభావితం చేసేదే. ఈ ఎన్నిక అయిపోగానే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కనీసం 20 స్థానాల్లో అయినా గెలుపొందుతామని ఆశించినా కేవలం రెండు స్థానాలకే పరిమితం కావడం, మరోవైపు బీజేపీ ఏకంగా 48 చోట్ల విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. ఇక, టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామక వ్యవహారం ఈ ఏడాది కూడా తేలకపోగా, ఈ పదవి పేరుతో జరుగుతున్న అంతర్గత కలహాలు, పరిణామాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతల్లో అసంతృప్తి లేకుండా ఉండేందుకు గాను కమిటీల పేరుతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ పరిస్థితుల్లో కొత్త ఏడాదిలో జరిగే వరుస ఎన్నికలపైనా కాంగ్రెస్ శ్రేణులకు బెంగ పట్టుకుంది. జూమ్ వేదికగా ‘లెఫ్ట్’.. కమ్యూనిస్టుపార్టీలు అనగానే ప్రజా సమస్యలపై ఆందోళనలు, నిరసనలు నిర్వహించే రాజకీయపక్షాలుగా ఎన్నో ఏళ్లుగా గుర్తింపు పొందాయి. అయితే ఈ ఏడాది కరోనా మూలంగా లెఫ్ట్ పార్టీలు సీపీఎం, సీపీఐ సైతం ఆన్లైన్ బాటపట్టాయి. క్షేత్రస్థాయిలో పోరాడుతూనే... జూమ్‌లో గళం వినిపించాయి. సీపీఎం ఆధ్వర్యంలోనూ వివిధ సమస్యలపై ఆందోళనలు, నిరసనలతో పాటు జూమ్ యాప్ ద్వారా కార్యక్రమాలు, పార్టీపరంగా సమావేశాలు నిర్వహించింది. ఆన్లైన్ సమావేశాలు, జూమ్ కాన్ఫరెన్స్‌లు, మీడియా సమావేశాలు మొదలు అగ్రనేతల స్మారకోపన్యాసాలు, నిరసన సభలు, రౌండ్‌టేబుల్ సమావేశాలు వంటివి ఈ రెండుపార్టీలు నిర్వహించాయి. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయచట్టాలు, విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో రైతుసంఘాలు చేపట్టిన ఉద్యమానికి సంఘీభావంగా ఇక్కడా రాష్ట్రంలోనూ ఈ రెండుపార్టీలు నెలరోజులకు పైగా వివిధ రూపాల్లో నిరసన, ఆందోళనా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి ముందే సీపీఐ రాష్ట్రపార్టీ నిర్మాణ మహాసభలను పూర్తిచేసుకుంది. పార్టీ కేంద్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో వివిధ నిరసనలతో పాటు రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా 29 డివిజన్లలో పోటీచేసినా అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయి నిరాశాజనకమైన ఫలితాలను సాధించాయి. -
ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌లు!
2020 సంవత్సరానికి నేటితో తెరపడనుంది.. కరోనా.. క్వారంటైన్.. భౌతిక దూరం.. మాస్క్.. వ్యాక్సిన్.. ఈ మాటలతోనే ఏడాది మొత్తం గడచిపోయింది.. మహమ్మారి కారణంగా ప్రపంచం స్తంభించిపోయిన మాట నిజమే అయినప్పటికీ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ప్రగతి మాత్రం ఆగలేదు.. 2020లో మన శాస్త్రవేత్తలు సాధించిందేమిటో ఒక్కసారి చూద్దామా.. – సాక్షి, హైదరాబాద్ 1 రికార్డు సమయంలోవ్యాక్సిన్! మానవ చరిత్రలో అత్యంత వేగంగా ఓ వ్యాధికి టీకాను అభివృద్ధి చేయడం ఈ సంవత్సరమే నమోదైంది. కరోనా వ్యాధి నివారణకు ప్రపంచం నలుమూలల్లోని శాస్త్రవేత్తల బృందాలు టీకా తయారీని ప్రారంభించాయి. టీకా అభివృద్ధిలో కీలకమైన మూడు దశల మానవ ప్రయోగాలను పూర్తి చేసుకుని అత్యవసర వినియోగానికైనా వ్యాక్సిన్ సిద్ధమవడం ఈ ఏటి మేటి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విజయంగా చెప్పుకోవచ్చు. 2 ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌లు! దశాబ్దాలుగా మనం ప్రకృతిలో పోగేసిన ప్లాస్టిక్ కాలుష్యాన్ని వెదజల్లుతూనే ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఈ ఏడాది యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్మౌత్, ఇతర వర్సిటీల శాస్త్రవేత్తలు కలసికట్టుగా ఓ సూపర్ ఎంజైమ్‌ను అభివృద్ధి చేశారు. జపాన్‌లో కొన్నేళ్ల క్రితం ప్లాస్టిక్‌ను తినేసే బ్యాక్టీరియా ఒకదాన్ని గుర్తించగా దాని ఎంజైమ్‌కు మరోదాన్ని కలపడం ద్వారా సూపర్ ఎంజైమ్ తయారైంది. ప్లాస్టిక్ బాటిళ్లను ఈ ఎంజైమ్ కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రాథమిక రసాయనాలుగా విడదీయగలదు. వీటితో మళ్లీ మనకు అవసరమైన ప్లాస్టిక్ బాటిళ్లను తయారు చేసుకునే వీలుంది. (చదవండి: 2020.. కలలు కల్లలు) 3 అందరి చూపు.. మళ్లీ జాబిల్లి వైపు.. చంద్రుడిపై నీరున్న విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ మరోసారి నిరూపించింది. చంద్రయాన్ ద్వారా నీటి ఉనికి గతంలోనే స్పష్టమైనప్పటికీ ఉపరితలంపై కూడా నీరుందని ప్రకటించడం తాజా విశేషం.. అయితే ఇక్కడున్న నీరు అతి తక్కువ. నాసా ప్రయోగించిన సోఫియా అనే అంతరిక్ష శోధక వ్యవస్థ చంద్రుడి దక్షిణార్థ గోళంలోని అతిపెద్ద లోయ ‘క్లావియస్ క్రేటర్’ఉపరితలంలోని మట్టిలో నీటి అణువులు నిక్షిప్తమై ఉన్నట్లు గుర్తించింది. ఈ క్లావియస్ క్రేటర్‌ను భూమ్మీద నుంచి కూడా చూడవచ్చు.. 4 అంతరిక్షంలో ముల్లంగి పంట.. నాసా తొలిసారి విజయవంతంగా అంతరిక్షంలో వ్యవసాయాన్ని చేపట్టి పూర్తి చేసింది. కేట్ రూబిల్స్ అనే వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని అడ్వాన్స్డ్ ప్లాంట్ హాబిటాట్‌లో 20 ముల్లంగి మొక్కలను పెంచగలిగారు. వచ్చే ఏడాది భూమ్మీదకు రానున్న కేట్ రూబిన్స్ ద్వారా ఈ అపురూపమైన అంతరిక్ష ముల్లంగిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 5 వైఫై, సిగ్నళ్లు లేని చోటా ఇంటర్నెట్! ఎంతటి కఠిన పరిస్థితులున్నా ప్రపంచంలోని ప్రతి మూలకూ ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చేందుకు టెస్లా కార్ల కంపెనీ యజమాని ఈలాన్ మస్క్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది మొదలుపెట్టి రానున్న కొన్ని దశాబ్దాల్లో అంతరిక్షంలోకి సుమారు 42 వేల ఉపగ్రహాలను పంపేందుకు ఉద్దేశించిన స్టార్ లింక్ ప్రాజెక్టు కొన్ని నెలల క్రితమే మొదలైంది. వైఫై లేని చోట, సిగ్నళ్లు అందని చోట కూడా ఈ ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ అందుతుంది. (చదవండి: ఒక వైరస్... ఒక 36...) 6 కృత్రిమ మేధ పదునెక్కుతోంది! కృత్రిమ మేధతో సాధ్యమయ్యే అద్భుతాల్లో కొన్ని ఈ ఏడాది ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ‘కృత్రిమ మేధతో మానవాళికి ప్రమాదం’అన్న వ్యాఖ్యను తిప్పికొడుతూ 500 పదాల వ్యాసం రాయమని జీపీటీ–3 అనే పేరున్న న్యూరల్ నెట్వర్క్కి పురమాయిస్తే.. అది ఏకంగా 12 వ్యాసాలు రాసేసింది. కృత్రిమ మేధ మానవ వికాసానికి ఎలా ఉపయోగపడుతుందో వేర్వేరు ఉపమానాలు, ఉదాహరణలతో అది వర్ణించడం విశేషం.. అలాగే ఈ ఏడాది వ్యాధుల చికిత్స అవసరమైన కొత్త రసాయన మూలకాలను గుర్తించడంలోనూ కృత్రిమ మేధ అక్కరకొస్తోంది. 7 క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ముందుకు.. ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ 2020లో ఇంకో అడుగు దగ్గరైంది. సైకమోర్ క్వాంటమ్ ప్రాసెసర్ ద్వారా తాము సాధారణ కంప్యూటర్ కంటే ఎంతో మెరుగ్గా పనిచేసే క్వాంటమ్ కంప్యూటర్ ఇప్పటికే సిద్ధం చేశామని గూగుల్ ప్రకటించింది. సాధారణ కంప్యూటర్లు పది వేల సంవత్సరాల్లో పూర్తి చేయగల పనిని ఈ కంప్యూటర్ కేవలం మూడు నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేయడం విశేషం. 8 వయసు తగ్గించే వైద్యం! నిత్య యవ్వనమన్న మనిషి ఆశ ఇప్పట్లో నెరవేరే అవకాశం దాదాపుగా లేకపోయినప్పటికీ 2020లో వృద్ధాప్య సమస్యలను తగ్గించగలిగే కొత్త మందులు మాత్రం ఆవిష్కృతమయ్యాయి. రక్తపోటుకు ఉపయోగించే ఓ మందు కణాల శక్తి కేంద్రాలైన మైటోకాండ్రియా పనితీరును నియంత్రించి వయసు పెరగకుండా చేస్తూంటే.. వయసుతో పాటు వచ్చే మెదడు సంబంధిత సమస్యలను చక్కదిద్దేందుకు ఇంకో మందును కంపెనీలు సిద్ధం చేశాయి. -
2020: విశాఖ రౌండప్
సాక్షి, దొండపర్తి (విశాఖ దక్షిణ): కాలచక్రం గిర్రున తిరిగింది. పాత స్మృతులను చెరిపేసింది. సుఖదుఃఖాలు.. జయాపజయాలు.. కరోనా కష్టకాలాన్ని.. అన్నింటినీ చరిత్రగతిలో కలిపేసింది. కాంతి రేఖల దిశగా కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. ప్రభుత్వం చేపడుతున్న దీర్ఘకాల ప్రణాళికలతో విజయ తీరాల దిశగా విశాఖ నగరం తనదైన ముద్రను లిఖించేందుకు సన్నద్ధమౌతోంది. జనవరి 1- ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడంతో సంస్థ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. 9 - అమ్మ ఒడి పథకంలో భాగంగా జిల్లాలో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ.15 వేలు చొప్పున వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. 10 - జీవీఎంసీ పరిధిలో 98 వార్డులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 20 - విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా నిర్ణయిస్తూ రూపొందించిన బిల్లును శాసన సభలో ఆమోదించడంతో.. జిల్లా అంతటా సంబరాలు జరిగాయి. 29 - బంగ్లాదేశ్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి అక్కడి దళాలకు చిక్కిన ఎనిమిది మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చొరవతో విడుదలయ్యారు. ఫిబ్రవరి 1 - వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పింఛన్లు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 15 - పాత రేషన్‌కార్డుల స్థానంలో జిల్లాలో 11,10,932 మంది లబ్ధిదారులకు బియ్యం కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 - జిల్లాలో 1.76 లక్షల మంది వృద్ధులకు ఉచితంగా నేత్ర పరీక్షలు చేసేందుకు వైఎస్సార్ కంటి వెలుగు లో భాగంగా మూడో దశ స్క్రీనింగ్ నిర్వహించారు. 20 - 15 ఏళ్ల తర్వాత సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 24 - ఇంటర్ ఆపై ఉన్న విద్యనభ్యసిస్తున్న వారి కోసం ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 1,05,709 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. 26 - నగరంలో ట్రామ్ రైలు కారిడార్ ఏర్పాటుకు డీపీఆర్ తయారు చేసే సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించడానికి అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ♦ కార్గో విమాన సర్వీసులను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు. 29 - గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అరకు ఉత్సవాలను ప్రారంభించారు. మార్చి 7 - పుష్కరం తర్వాత జీవీఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 19 - జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. మక్కా నుంచి వచ్చిన అల్లిపురం ప్రాంతానికి చెందిన వ్యక్తికి కరోనా సోకింది. 20 - లైట్‌మెట్రో డీపీఆర్ తయారు చేసే బాధ్యతను యూ ఎంటీసీ దక్కించుకుంది. రూ.5.34 కోట్లకు టెండర్ దాఖలు చేయడంతో ప్రభుత్వం ఆ సంస్థను ఖరారు చేసింది. 23 - కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో లాక్డౌన్ విధించింది. ఏప్రిల్ 2 - జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి జిల్లాలో 2,00,087 మంది విద్యార్థుల కోసం పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద రూ.145.28 కోట్లు మంజూరు చేసింది. 4 - కరోనా వైరస్ నియంత్రణకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలో 11.05,640 మందికి ఒక్కొక్కరికీ రూ.వెయ్యి చొప్పున అందించింది. 6 - కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.50 లక్షలు విలువ చేసే నిత్యావసరాలను రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అందజేశారు. 24 - కరోనా కష్టకాలంలో కూడా మహిళా సాధికారత కోసం ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో 7.18 లక్షల మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.64.16 కోట్లు జమ చేశారు. 26 - సింహాచలం వరాహ నృసింహస్వామి చందనోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 28 - ఆర్థిక ఇబ్బందులు కారణంగా పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ‘జగనన్న విద్యా దీవెన’ పేరుతో తలపెట్టిన పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. మే 7 - ఎల్జీ పాలీమర్స్ కంపెనీలో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. 585 మంది అస్వస్థతకు గురయ్యారు. 8 - ఎల్జీ పాలీమర్స్ ప్రమాదంలో అస్వస్థతకు గురైన బాధితులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేజీహెచ్‌లో పరామర్శించారు. మృతులతో పాటు బాధితులకు భారీగా నష్ట పరిహారాన్ని ప్రకటించారు. 22 - కరోనా కారణంగా కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీని అందించింది. జిల్లాలో ఉన్న సుమారు 10 వేల ఎంఎస్ఎంఈలు లబ్ధిపొందాయి. 26 - కరోనా కష్టకాలంలో పేద అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లకు ప్రభుత్వం రూ.5 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసింది. 30 - వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించారు. జూన్ 8 - లాక్డౌన్ కారణంగా 80 రోజుల పాటు మూతపడిన షాపింగ్ మాల్స్ ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో తిరిగి కార్యకలాపాలను ప్రారంభించాయి. 10 - కులవృత్తిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రవేశపెట్టిన ‘జగనన్న చేదోడు’ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో 22,755 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. 25 - స్వచ్ఛ సర్వేక్షణ్–2020కు సంబంధించి చెత్త రహిత నగర ర్యాంకింగ్స్‌లో విశాఖ త్రీ స్టార్‌ను సొంతం చేసుకుంది. జూలై 2 - అత్యవసర వేళల్లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు జిల్లాకు కేటాయించిన 72 కొత్త 108, 104 అంబులెన్సులను రాష్ట్ర పర్యా టక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. 16 - వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తించేలా రూపొందించిన పథకాన్ని జిల్లాలో ప్రారంభించారు. 26 - కార్గిల్ విజయ్ దివాస్‌ను పురస్కరించుకుని బీచ్‌రోడ్డులో విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద వీరుల త్యాగాలను స్మరిస్తూ నేవీ అధికారులు నివాళులు అర్పించారు. 29 - సింహాచలం దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్’ స్కీమ్‌లో చోటు కల్పిస్తూ రూ.53 కోట్లు నిధులు మంజూరుకు అంగీకారం తెలిపింది. ఆగస్టు 1 - హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో జరిగిన క్రేన్ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 12 - వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా జిల్లాలో 1,94,714 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.18,750 నగదును జమ చేశారు. 17 - నగర పోలీస్ కమిషనర్‌గా మనీష్‌కుమార్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. 19 - సీలేరు విద్యుత్తు కాంప్లెక్స్‌లో రూ.510 కోట్ల వ్యయంతో మరో 2 యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 20 - స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖకు 9వ ర్యాంకును కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. ♦ పవన్‌కల్యాణ్ విరాభిమాని నూతన్ నాయుడు ఇంట్లో పనిచేసే దళిత యువకుడికి శిరోముండనం చేయడంతో పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూతన్ నాయుడు భార్యతో పాటు వారి అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 7 - గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందజేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. 11 - మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో 63,476 స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 6,61,317 మహిళా లబ్ధిదారులకు తొలి దఫాగా రూ.459.43 కోట్లు జమ చేశారు. 19 - దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్‌కు నైతిక మద్దతు ప్రకటించారు. అతని కుమారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 20 - కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో మూతపడిన పాఠశాలలు సుదీర్ఘ విరామం తరువాత తెరుచుకున్నాయి. అక్టోబర్ 2 - గిరిజన రైతులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేశారు. పాడేరులో రూ.500 కోట్లతో 30 ఎకరాల్లో డాక్టర్ వైఎస్సార్ గిరిజన బోధనాస్పత్రికి శంకుస్థాపన చేశారు. 8 - ‘జగనన్న విద్యా కానుక’ పథకం ద్వారా జిల్లాలో 3,17,202 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగ్‌లు, యూనిఫారాలు, బూట్లు, సాక్సులు, బెల్టులు ఉచితంగా పంపిణీ చేశారు. 9 - చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలలో భాగంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమల్లో జీవీఎంసీ నెంబర్ వన్‌గా నిలిచింది. ♦ ప్రపంచంలో మేటైన జూ పార్కుగా రూపుదిద్దుకునేందుకు విశాఖ జంతు ప్రదర్శన శాల ఎంపికైంది. 11 - రుషికొండ బీచ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో అంతర్జాతీయ తీరంగా మారి ‘బ్లూఫ్లాగ్’ సర్టిఫికేషన్‌ను సొంతం చేసుకుంది. 13 - తీవ్ర వాయుగుండంతో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు వేగంతో వీచిన గాలులకు బంగ్లాదేశ్‌కు చెందిన కార్గోషిప్ తెన్నేటి పార్కు ప్రాంతంలో ఒడ్డుకు కొట్టుకువచ్చింది. 16 - బీచ్ రోడ్డులో ‘సీ హారియర్’ యుద్ద విమాన మ్యూజియం ఏర్పాటుకు వీఎంఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. 18 - వెనుకబడిన ప్రతి సామాజిక వర్గానికీ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఇందులో గవర, మత్స్యకార, నగరాలు, యాత, నాగవంశం కార్పొరేషన్లకు సంబంధించి విశాఖకు చెందిన ఐదుగురికి చైర్పర్సన్ పదవులు వరించాయి. 21 - ఆపదల వల్ల కష్టాలపాలైన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ బీమా’ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో 9,65,223 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 24 - గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూములను కబ్జా చేసి చేసిన నిర్మాణాలను అధికారులు తొలగించి 40.51 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. 29 - విశాఖ బీచ్ రోడ్డు అభివృద్ధి కోసం తొలి విడతలో కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ ప్రపంచ బ్యాంకు నిధులు రూ.116.71 కోట్లు కేటాయించింది. 30 - విశాఖ పోర్టు ట్రస్ట్ ఎంట్రన్స్ చానల్, కంటైనర్ టెర్మినల్ మధ్యలోని జనరల్ బెర్త్ పక్కనే రూ.77 కోట్లతో స్వదేశీయులకు విదేశీ విహారం కల్పించే అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం పట్టాలెక్కింది. నవంబర్ 10 - అచ్యుతాపురంలో 80.10 ఎకరాల్లో జపాన్‌కు చెందిన యూకొహామా గ్రూప్‌లో భాగమైన అలయన్స్ టైర్ గ్రూప్(ఏటీజీ) రూ.1750 కోట్ల పెట్టుబడులతో కంపెనీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిసింది. 13 - స్వచ్ఛ విశాఖపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జీవీఎంసీ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో ‘వుయ్ సపోర్ట్ వైజాగ్ వాక్‌థాన్’ను నిర్వహించారు. 17 - కోవిడ్ నియంత్రణలో జిల్లాకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐసీఎంఆర్ సాయంతో బీఎంజే గ్లోబల్ హెల్త్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో విశాఖకు ఈ గుర్తింపు వచ్చింది. 23 - మహిళలు, బాలికలకు మరింత భద్రత కోసం అభయం ఐవోటీ పరికరాలను ఆటోలకు అమర్చారు. పైలెట్ ప్రాజెక్టుగా విశాఖలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ♦ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థకు ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, ఐటీ, బిజినెస్ పార్క్‌లు, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం మధురవాడలో 130 ఎకరాలను కేటాయించింది. సంస్థకు విద్యుత్ ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 24 - దేశంలోని స్మార్ట్ నగరాల అభివృద్ధి జాబితాలో ఒక స్థానం మెరుగుపర్చుకుని టాప్–7లోకి దూసుకువచ్చింది. స్మార్ట్ సిటీల్లో విశాఖ బెస్ట్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. 25 - చిరు వ్యాపారులకు చేదుడుగా ఉండాలనే ఉద్దేశంతో తలపెట్టిన ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఉన్న 87,527 చిరువ్యాపారులకు రూ.10 వేలు చొప్పున వడ్డీలేని రుణాలు అందించారు. డిసెంబర్ 4 - బీచ్ రోడ్డులో విక్టరీ ఎట్ సీ వద్ద నేవీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. 11 - టీటీడీ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో కార్తీక సహస్ర దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 12 - వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న జీవ క్రాంతి పథకాన్ని జిల్లాలో ప్రారంభించారు. 19 - పర్యాటక రంగంలో పెట్టు్టబడులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దిన టూరిజం పాలసీని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విడుదల చేశారు. 21 - యువతను ఉత్తేజపరిచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా నగరంలో వైఎస్సార్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ప్రారంభించారు. విజేతలకు రూ.50 లక్షలు విలువ చేసే బహుమతలు అందజేయనున్న ఈ టోర్నమెంట్లో 422 టీమ్‌లు పాల్గొంటున్నాయి. 22 - ప్రజల భూమికి శాశ్వత హక్కు, రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష’ సర్వే కార్యక్రమాన్ని జిల్లాలో రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ప్రారంభించారు. 25 - పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చడానికి సంకల్పించిన ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 1,15,933 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. -
2020 క్రీడలు: ఒక వైరస్... ఒక 36...
ప్రతీ ఏటా క్రీడల క్యాలెండర్... ఫలితాలు, రికార్డులు, అవార్డులు, పురస్కారాలతో కనిపించేది. చాంపియన్ల విజయగర్జనతో, దిగ్గజాల మైలురాళ్లతో, ఆటకే వన్నెతెచ్చిన ఆణిముత్యాల నిష్క్రమణలతో ముగిసేది. కానీ ఈ ఏడాది మాత్రం కంటికి కనిపించని వైరస్ క్రీడల క్యాలెండర్‌ను కలవరపెట్టింది. కరోనా కాలం క్రీడలకు కష్టకాలాన్నే మిగిల్చింది. టోక్యో ఒలింపిక్స్, యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలాంటి మెగా ఈవెంట్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ను ఆపేసింది. మరెన్నో క్రీడలను రద్దు చేసింది. ప్రేక్షకుల్ని మైదానానికి రాకుండా చేసింది. కొత్తగా ‘బయో బబుల్’ను పరిచయం చేసింది. ఒకవైపు కరోనా కల్లోలం కొనసాగుతుండగా... మరోవైపు ఫార్ములావన్‌లో హామిల్టన్ రయ్‌మంటూ దూసుకెళ్లాడు. 15 ఏళ్ల తర్వాత బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టాడు. ఎవ్వరూ ఊహించని విధంగా భారత క్రికెట్ జట్టు 36కే ఆలౌటై షాక్ ఇచ్చింది. మొత్తానికి 2020 కొందరికి తీపి గుర్తులు, మరికొందరికి చేదు గుళికల్ని పంచివెళ్లింది. అవేంటో చూద్దాం...! –సాక్షి క్రీడా విభాగం మహాబలుడు మళ్లీ వచ్చాడు! అమెరికా బాక్సింగ్ యోధుడు, ప్రపంచ హెవీవెయిట్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ మళ్లీ రింగ్‌లో దిగేందుకు ‘సై’ అన్నాడు. 15 ఏళ్ల తర్వాత పంచ్ విసిరేందుకు కసరత్తులు కూడా చేశాడు. 54 ఏళ్ల వయసులో ప్రత్యర్థి రాయ్ జోన్స్ జూనియర్‌తో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో తలపడ్డాడు. త్వరలో హోలీఫీల్డ్‌తో టైసన్ ఢీకొట్టేందుకు అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. దిగ్గజాలను తీసుకెళ్లింది... ఈ ఏడాది... క్రీడాభిమానులను దుఃఖసాగరంలో ముంచింది. ఆయా క్రీడలకు తమ ఆటతీరుతో, అలుపెరగని పోరాటంతో వన్నె తెచ్చిన దిగ్గజాలను తీసుకెళ్లింది. అమెరికాను ఊపేసే నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లో సూపర్ స్టార్ హోదా పొందిన కోబీ బ్రయాంట్ తన అభిమానులతో శాశ్వత సెలవు తీసుకున్నాడు. హెలికాప్టర్ ప్రమాదంలో బ్రయాంట్‌తోపాటు అతని 13 ఏళ్ల కుమార్తె దుర్మరణం పాలైంది. ఇది ఈ సంవత్సరం క్రీడాలోకంలో పెను విషాదంగా నిలిచింది. అలాగే ఫుట్‌బాల్ మాంత్రికుడు, అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా మరణం క్రీడాలోకాన్ని శోకంలో ముంచింది. గుండెపోటుతో అతను మృతి చెందాడు. భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్, అలనాటి ఫుట్‌బాల్ మేటి పీకే బెనర్జీ, చున్నీ గోస్వామి ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. క్రికెట్లో చేతన్ చౌహాన్, రాజిందర్ గోయెల్, ఆస్ట్రేలియన్ డీన్ జోన్స్‌లు అనారోగ్యంతో 2020లో తనువు చాలించారు. ‘రికార్డు’ల హామిల్టన్ మార్చి 15న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో మొదలవ్వాల్సిన ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌కు కరోనా అంతరాయం కలిగించింది. 22 రేసులున్న ఎఫ్1 సీజన్‌ను చివరకు 17 రేసులకు కుదించారు. ప్రేక్షకులకు ప్రవేశం లేకుండా రేసులను నిర్వహించారు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకొని ఏడోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మైకేల్ షుమాకర్ (జర్మనీ) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. అంతేకాకుండా ఎఫ్1లో అత్యధిక రేసుల్లో గెలిచిన డ్రైవర్‌గా షుమాకర్ (91) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ (95) తిరగరాశాడు. ఆన్లైన్లో ఎత్తులు... కరోనా మహమ్మారి పలు క్రీడా టోర్నమెంట్లపై ప్రభావం చూపినా మేధో క్రీడ చెస్ మాత్రం కొత్త ఎత్తులకు ఎదిగింది. ముఖాముఖి టోర్నీలకు బ్రేక్ పడినా ఆన్లైన్లో నిరాటంకంగా టోర్నీలు జరిగాయి. తొలిసారి ఆన్లైన్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు రష్యాతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. భారత్, రష్యా మధ్య ఫైనల్ కీలకదశలో ఉన్నపుడు సాంకేతిక సమస్య తలెత్తడంతో నిర్వాహకులు రెండు జట్లను విజేతగా ప్రకటించారు. చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో తెలుగు తేజాలు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక సభ్యులుగా ఉన్నారు. ఆన్లైన్లోనే జరిగిన ప్రపంచ యూత్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు నిహాల్ సరీన్, గుకేశ్, రక్షిత స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ అలరించింది ఈ ఏడాదిలో తొలి మూడు నెలలు క్రికెట్ సాగినా... ఆ తర్వాత కరోనా వైరస్‌తో బ్రేక్ వచ్చింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఐదోసారి విశ్వవిజేతగా నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలిసారి ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరోవైపు కరోనా వైరస్‌తో భారత్‌లో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ మధ్యలోనే ఆగిపోయింది. కరోనా తీవ్రరూపం దాల్చడంతో దాదాపు నాలుగు నెలలు క్రికెట్ ఆట సాగలేదు. జూలై చివరి వారంలో ఇంగ్లండ్–వెస్టిండీస్ జట్ల మధ్య ‘బయో బబుల్’ వాతావరణంలో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ మొదలైంది. ప్రతీ ఏటా వేసవిలో వినోదాన్ని పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీ కరోనా కారణంగా ఆలస్యమైంది. ఒకదశలో ఈ టోర్నీ జరుగుతుందా లేదా అనే అనుమానం కలిగినా... చివరకు ఐపీఎల్ భారత్ దాటింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ‘బయో బబుల్’ వాతావరణంలో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 13వ సీజన్ నిరాటంకంగా సాగింది. ముంబై ఇండియన్స్ జట్టు ఐదోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆగస్టు 15న ఎమ్మెస్ ధోని హఠాత్తుగా క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అదే రోజున సురేశ్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్ ముగిశాక భారత జట్టు దుబాయ్ నుంచి నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అడిలైడ్ వేదికగా జరిగిన డే–నైట్ తొలి టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే ఆలౌటై తమ టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరును నమోదు చేసి ఓటమి పాలైంది. అయితే మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకొని 2020 ఏడాదిని ఘనంగా ముగించింది. ఫెడరర్...నాదల్ 20–20 ఈ 2020 ఏడాది ఇద్దరు టెన్నిస్ సూపర్స్టార్ల టైటిళ్ల సంఖ్యను ట్వంటీ–ట్వంటీగా సమం చేసింది. స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియన్ ఓపెన్ (2018)తో 20వ టైటిల్ సాధించాడు. ఇతనికి సరైనోడు... సమఉజ్జీ అని టెన్నిస్ ప్రపంచం ప్రశంసలందుకున్న రాఫెల్ నాదల్ దీనికి న్యాయం చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్‌తో ఈ స్పానిష్ లెజెండ్ కూడా 20వ టైటిల్‌తో ఫెడరర్ సరసన నిలిచాడు. ఇలా ఈ ఆల్‌టైమ్ గ్రేట్ స్టార్స్ ఇపుడు 20–20 స్టార్స్ అయ్యారు. కరోనా కారణంగా ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు మాత్రమే జరిగాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ విజేతగా నిలువగా... కరోనా దెబ్బకు 1945 తర్వాత వింబుల్డన్ టోర్నమెంట్‌ను నిర్వాహకులు తొలిసారి రద్దు చేశారు. ప్రేక్షకులు లేకుండా యూఎస్ ఓపెన్‌ను నిర్వహించగా... ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ విజేతగా నిలిచి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. సెప్టెంబర్‌కు వాయిదా పడిన ఫ్రెంచ్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ తన ఆధిపత్యం చాటుకొని 13వసారి చాంపియన్‌గా నిలిచాడు. యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా తాను కొట్టిన బంతి లైన్ అంపైర్‌కు తగలడంతో సస్పెన్షన్‌కు గురైన సెర్బియా స్టార్ జొకోవిచ్ ఆరోసారి సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించాడు. పీట్ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. -
రివైండ్ 2020: ఢామ్.. జూమ్
2020... వస్తూవస్తూనే ‘కరోనా’ సునామీతో ప్రపంచానికి ‘మాస్క్‘ పడింది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజల జీవితాలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా చెల్లాచెదురైంది. వివిధ దేశాల ఎకానమీలు మైనస్లలోకి జారిపోయి చరిత్రలో ఎన్నడూచూడని పతనాన్ని చవిచూశాయి. భారత్ జీడీపీ ఏకంగా 23.9 శాతం (క్యూ1లో) క్షీణించింది. కరోనా కల్లోలంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయినప్పటికీ.. మళ్లీ అంతేవేగంగా కోలుకొని, ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. సెన్సెక్స్ మార్చిలో 25,638 పాయింట్ల కనిష్టానికి కుప్పకూలి... కొద్ది నెలల్లోనే కొత్త రికార్డులను బద్దలు కొట్టింది. మరోపక్క, ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో బంగారం భగ్గుమంది. భారత్‌లో తులం ధర రూ.55 వేల పైకి ఎగబాకింది. ముడి చమురు ధర చరిత్రలో తొలిసారిగా మైనస్‌లోకి జారిపోయింది. ఇక కరోనాతో దేశీయంగా పర్యాటకం, విమానయానం తదితర రంగాలు తీవ్రంగా దెబ్బతిని, భారీగా ఉద్యోగాల కోతకు దారితీసింది. అసలే మొండిబాకీలతో నెట్టుకొస్తున్న బ్యాంకింగ్ రంగం పరిస్థితి పెనంమీంచి పొయ్యిలో పడినట్లయింది. పీఎంసీ, లక్ష్మీ విలాస్ బ్యాంకులు కుప్పకూలాయి. లాక్డౌన్ల కారణంగా వాహన రంగంలో ఎన్నడూలేని విధంగా సున్నా అమ్మకాలు నమోదయ్యాయి. మోదీ సర్కారు ‘ఆత్మనిర్భర్’ రూపంలో దాదాపు రూ. 29 లక్షల కోట్లకు పైగా ప్యాకేజీని ప్రకటించి ఎకానమీకి దన్నుగా నిలిచింది. ఆర్బీఐ కూడా వడ్డీరేట్లను అట్టడుగుకు దించేసింది. ఇంత కల్లోలంలోనూ ముకేశ్ అంబానీ నిధుల స్వారీ చేశారు. ఫేస్బుక్, గూగుల్, ఇంటెల్ ఇలా ఒకటేమిటి ప్రపంచాన్ని శాసిస్తున్న అనేక దిగ్గజ కంపెనీలన్నీ రిలయన్స్ జియో, రిటైల్‌లలో కోట్లాది డాలర్లు కుమ్మరించేందుకు క్యూ కట్టడం విశేషం. కరోనా పుణ్యమా అని సామాన్యుల నుంచి కార్పొరేట్ల దాకా అంతా డిజిటల్ బాట పట్టారు. వర్చువల్, ఆన్లైన్ అనేవి జీవితంలో భాగమైపోయాయి. ఇలా ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగిన ఈ ‘కరోనా’నామ సంవత్సరంలో వ్యాపార రంగంలో చోటు చేసుకున్న పరిణామాలపై ‘సాక్షి బిజినెస్’ రివైండ్ ఇది... మార్కెట్ ఉద్దీపనల అండ! ఈ ఏడాది భారత స్టాక్ మార్కెట్ ప్రయాణం కరోనా విసిరిన సవాళ్లను అధిగమించి కొత్త శిఖరాల అధిరోహణ లక్ష్యంగా సాగింది. ఏడాది ప్రారంభంలో ఆర్థిక మందగమనం, కోవిడ్ భయాలతో సెన్సెక్స్, నిఫ్టీలు మార్చి 24న రెండేళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. ద్వితీయార్థంలో ఉద్దీపనల అండ, ఆర్థిక వ్యవస్థ రికవరీ, కోవిడ్–19 వ్యాక్సిన్ ఆశలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సహకారం అందడంతో రికార్డుల ర్యాలీ చేస్తున్నాయి. మరోవైపు కోవిడ్–19 వైరస్.... స్ట్రెయిన్ వైరస్‌గా రూపాంతరం చెంది ప్రపంచదేశాలను భయపెడుతుండటం ఈక్విటీ మార్కెట్లకు ఆందోళనను కలిగిస్తోంది. ఈ ఏడాది మొత్తం మీద సెన్సెక్స్ 6492 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 1814 పాయింట్లను ఆర్జించింది. లాక్డౌన్ విధింపు ప్రకటనతో మార్చి 23న సెన్సెక్స్, నిఫ్టీలు తమ జీవితకాలంలోనే అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో ఇరు సూచీలు 10 శాతం పతనమవడంతో సర్క్యూట్ నిబంధల ప్రకారం ట్రేడింగ్‌ను 45 నిమిషాలు నిలిపేశారు. తర్వాత ట్రేడింగ్ ప్రారంభమైనా అమ్మకాలు ఆగకపోవడంతో సెన్సెక్స్ 3,935 పాయింట్లు, నిఫ్టీ 1,135 పాయింట్ల నష్టంతో ముగిశాయి. ఇక ఏప్రిల్ 7న సూచీలు ఒక్కరోజులో రికార్డు లాభాల్ని ఆర్జించాయి. ఈ ఒక్కరోజే సెన్సెక్స్ 2,476 పాయింట్లు, నిఫ్టీ 1,135 పాయింట్లను ఆర్జించాయి. సూచీ ఏడాది కనిష్టస్థాయి ఏడాది గరిష్టస్థాయి సెన్సెక్స్ 25,638 (మార్చి 24న) 47,807(డిసెంబర్ 30) నిఫ్టీ 7511 (మార్చి 24న) 13,997(డిసెంబర్ 30) ఎకానమీ మాంద్యం కోరలు... భారత ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ గట్టి దెబ్బ కొట్టడంతో దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం కోరల్లోకి వెళ్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఏకంగా మైనస్ 23.9 శాతానికి పడిపోయింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు సడలింపుసహా ఎకానమీ కోలుకునేందుకు కేంద్రం, ఆర్బీఐలు తీసుకున్న ఉద్దీపన చర్యలతో రెండో త్రైమాసికానికి వ్యవస్థ కాస్త రికవరీని సాధించింది. క్షీణత మైనస్ 7.5 శాతానికి పరిమితమైంది. కేంద్రం అండ ఆత్మ నిర్భర్ అభియాన్ కరోనా కుదేలైన ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలకు భరోసానిస్తూ కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం ద్వారా అభయమిచ్చింది. కోవిడ్ సంక్షోభం నాటి నుంచి ఈ ఏడాదిలో కేంద్రం, ఆర్బీఐలు సంయుక్తంగా మొత్తం రూ.29.87 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించాయి. జీడీపీలో 10 శాతం ఉంటుందని అంచనా. ల్యాండ్, లేబర్æ, లిక్విడిటీ, లా వీటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సూక్ష్మ, స్థూల, మధ్య తరగతి పరిశ్రమకు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయడంలాంటి ఎన్నో బృహత్కర కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. బ్యాంకింగ్ కుదుపులు యస్ బ్యాంక్, లక్ష్మీవిలాస్ బ్యాంకు, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్(పీఎంసీ) ఉదంతాలతో ఈ ఏడాది భారత బ్యాంకింగ్ రంగం భారీగా కుదుపులకు లోనైంది. లక్ష్మీవిలాస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడంతో సింగపూర్‌కు చెందిన డీబీఎస్ బ్యాంకులో విలీనమైంది. హెచ్‌డీఐఎల్‌కు రుణాలను జారీ చేయడంలో అక్రమాలకు తెరతీయడంతో మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ ఆర్బీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. అలాగే నిరర్థక ఆస్తులు పెరిగిపోయి నష్టాల ఊబిలో కూరుకుపోయిన యస్ బ్యాంక్‌ను రక్షించేందుకు ఆర్బీఐ ఆ బ్యాంక్‌లోని 49 శాతం షేర్లను ‘ఎస్బీఐ’ చేత కొనుగోలు చేయించింది. ఇక బ్యాంకింగ్‌లో మొండి బకాయిల తీవ్రత కొనసాగుతోంది. ఆర్బీఐ పాలసీ భరోసా కరోనాతో కష్టాలపాలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఈ ఏడాదిలో ఆర్బీఐ ద్రవ్యపాలసీ కమిటీ వడ్డీరేట్లను గణనీయంగా తగ్గించింది. రెపోరేటును 115 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.15 శాతం నుంచి 4 శాతానికి పరిమితం చేసింది. అలాగే రివర్స్ రెపోరేటు 155 పాయింట్లను తగ్గించి 4.9 శాతం నుంచి 3.35 శాతానికి తీసుకొచ్చింది. ప్రతి ద్రవ్యపాలసీ సమీక్షలో సులభతరమైన విధానానికి కట్టుబడి ఉంటామని, ద్రవ్యోల్బణం దిగివస్తే, వడ్డీరేట్లపై మరింత కోత విధించేందుకు వెనకాడబోమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలు ఆర్థిక వ్యవస్థ రికవరీకి దన్నుగా నిలుస్తున్నాయి. విమానయానం కుదేలు కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో దేశీయ విమానయాన రంగం పూర్తిగా డీలాపడింది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్రం మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. మార్చి 25 నుంచి దేశీయ విమానాలపై ఆంక్షలను విధించింది. సర్వీసులన్నీ ఒక్కసారి స్తంభించిపోవడంతో విమానయాన కంపెనీలకు పైసా ఆదాయం లేకుండా పోయింది. పైపెచ్చు ఆకస్మిక నిర్ణయంతో విమానయాన సంస్థలు ప్రయాణికులు బుక్ చేసుకున్న ముందస్తు టికెట్ల సొమ్మును తిరిగి చెల్లించాల్సి వచ్చింది. దీంతో దేశీయ విమాన కంపెనీలు దివాలా దిశగా ప్రయాణించాయి. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా దేశీయ విమాన సర్వీసుల పునరుద్ధరణకు మే 25న అనుమతులు లభించాయి. అలాగే జూలై నుంచి ఆయా దేశాలతో పరస్పర ఒప్పందంతో కొన్ని దేశాలకు విమానాలు నడుస్తున్నాయి. అయితే విమానయాన కంపెనీలకు అధిక ఆదాయాలను ఇచ్చే అంతర్జాతీయ సర్వీసులపైన ఆంక్షల పర్వం కొనసాగుతోంది. కోవిడ్–19 వ్యాక్సిన్ రాకతో అన్ని సర్వీసులు పునరుద్ధరణ జరిగి విమానయాన రంగం తిరిగి గాడిలో పడుతుందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆటోమొబైల్ కరోనా బ్రేకులు ఈ 2020 ఏడాదిలో ఆటో మొబైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. చరిత్రలోనే తొలిసారి ఒక నెల ఆటో అమ్మకాలు సున్నాగా నమోదయ్యాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఉత్పత్తి పూర్తిగా స్తంభించడం, విక్రయాలకు బ్రేక్‌పడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఉద్దీపన ప్యాకేజీలో ఆటో పరిశ్రమకు పెద్దపీట వేయడం, భారత్‌లో ఉత్పాదక సామర్థ్యాలను, ఎగుమతులను పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకంలో ఎక్కువగా దెబ్బతిన్న ఆటోమొబైల్ పరిశ్రమకు గరిష్టంగా రూ.57,042 కోట్ల ప్రోత్సాహకాలు లభించనుండటంతో చివరి రెండు క్వార్టర్ల నుంచి ఆటోపరిశ్రమ వీ–ఆకారపు రికవరీని సాధిస్తోంది. రికవరీ స్పీడ్‌పై ఈ రంగం ఆధారపడి ఉంది. ఫోన్లు స్మార్ట్...స్మార్ట్ స్మార్ట్ఫోన్ల కంపెనీలకు ఈ 2020 ఏడాది కలిసొచ్చింది. ఏడాది ప్రథమార్ధంలో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఆశించినస్థాయిలో నమోదుకాలేదు. అయితే చివరి రెండు క్వార్టర్ల నుంచి విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాదిలో మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 15 కోట్లను దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సరిహద్దు వివాదాలు, కరోనా వైరస్ సృష్టికి కారణమైందనే వాదనల నేపథ్యంలో చైనా ఫోన్లపై బ్యాన్ నినాదంతో దేశంలో మొదటిసారి చైనా ఫోన్ల అమ్మకాలు రెండోస్థానానికి దిగివచ్చాయి. దీంతో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ అమ్మకాల్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. రిలయన్స్ అప్పు లేదు కరోనాతో ఎకానమీ కకావికలమైన తరుణంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం ఈ ఏడాదిలో వరుస పెట్టుబడులతో కలకలలాడింది. గూగుల్, ఫేస్బుక్, సిల్వర్‌లేక్ వంటి దిగ్గజ కంపెనీలకు జియో ప్లాట్ఫామ్లో 33 శాతం వాటాను విక్రయించి రూ.1.52 లక్షల కోట్లను చేకూర్చుకుంది. అలాగే రైట్స్ ఇష్యూ చేపట్టి అదనంగా రూ.53 వేల కోట్లను సమీకరించింది. తన మరో అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌నూ 10 శాతం వాటాను విక్రయించి రూ.47 వేల కోట్లను సమకూర్చుకుంది. వాటా విక్రయాలు, ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులతో ఆర్ఐఎల్ రుణ రహిత కంపెనీగా అవతరించింది. కంపెనీలోకి వెల్లువలా పెట్టుబడులు రావడంతో కంపెనీ షేరు సైతం ఈ 2020లో 35 శాతం ర్యాలీ చేసింది. ఈ ఏడాదిలో సెప్టెంబర్ 16న రూ.2,369 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. రూపాయి ఒడిదుడుకులు భారత ఈక్విటీల్లోకి విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో వెల్లువెత్తినా ఈ ఏడాది డాలర్ మారకంలో రూపాయి బలపడలేకపోయింది. స్టాక్ మార్కెట్ పతనం వేళలో ఆర్బీఐ స్పాట్ మార్కెట్ నుంచి అధిక మొత్తంలో డాలర్లను కొనుగోలు చేయడంతో రూపాయి విలువ బలహీనపడిందని అంచనా. అలాగే కరోనాతో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ ఏడాది డాలర్ మారకంలో రూపాయి విలువ గరిష్ట స్థాయి 70.73 గానూ, కనిష్ట స్థాయి 76.92 గానూ నమోదైంది. వెరసి ఈ ఏడాదిలో రూపాయి విలువ 6 రూపాయల రేంజ్లో కదలాడింది. క్రూడాయిల్ మైనస్‌లోకి ఈ ఏడాది క్రూడాయిల్ ధరలు ఏకంగా మైనస్‌ల్లోకి వెళ్లిన సంఘటన జరిగింది. ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంతో క్రూడాయిల్‌కు డిమాండ్ అంతంతగానే ఉంది. మరోవైపు చమురు ధరలపై ఆధిపత్యం కోసం సౌదీ– రష్యా దేశాలు ఒప్పంద పరిమితికి మించి క్రూడాయిల్ ఉత్పత్తి చేయడంతో నిల్వలు భారీగా పెరిగాయి. ఈ తరుణంలో కరోనా ప్రేరేపిత లాక్డౌన్ విధింపు క్రూడాయిల్ ధరలపై విరుచుకుపడింది. ఫలితంగా ఏప్రిల్ 21న నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడ్ మే నెల ఫ్యూచర్ కాంట్రాక్ట్ బ్యారెల్ ధర తొలిసారి మైనస్‌లోకి వెళ్లిపోయింది. ఒక దశలో మైనస్ 40.32 డాలర్లకు చేరుకుంది. చివరికి 208 డాలర్లు నష్టపోయి మైనస్ 37.63 డాలర్ల వద్ద ముగిసింది. బంగారం @ రూ. 56,190 కరోనా వైరస్‌తో స్టాక్ మార్కెట్లు కుదేలవడం ఈ ఏడాది పసిడి ర్యాలీకి కలిసొచ్చింది. కోవిడ్–19 సంక్షోభ వేళ ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనమైన బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపారు. అలాగే ఆర్థికంగా చిన్నాభిన్నమైన వ్యవస్థను సరిదిద్దేందుకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు సులభతర వడ్డీరేట్ల విధానానికి తెరతీయడం కూడా బంగారం ర్యాలీకి కలిసొచ్చింది. ప్రపంచమార్కెట్లో ఆగస్ట్ 7న ఔన్స్ పసిడి ధర అత్యధికంగా 2,089 డాలర్ల స్థాయిని అందుకుంది. ఇదే ఆగస్ట్ 8న దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.56,190 చేరుకుంది. మొత్తంగా పసిడి ధరలు ఏడాదిలో 20 శాతం పెరిగాయి. అయితే కోవిడ్ వ్యాక్సిన్ రాక, ఆర్థిక వ్యవస్థ పురోగతి నేపథ్యంలో బంగారం ధరలు ఏడాది ముగింపు సమయానికి కొంత దిగివచ్చాయి. వచ్చే ఏడాదిలో పసిడి నుంచి పెద్ద ర్యాలీ ఆశించకపోవడం మంచిదని బులియన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
పాఠాలు నేర్పిన స్త్రీ పాత్రలు
‘చెంపదెబ్బే’ కదా అని అన్ని పాత్రలు అంటాయి. ‘చెంప దెబ్బ అయినా సరే’ అని ‘థప్పడ్’ సినిమాలో తన గౌరవ మర్యాదలకు భంగం కలిగించే భర్త నుంచి విడాకులు తీసుకుంటుంది స్త్రీ పాత్ర. భర్త పండు ముసలివాడైపోయినా సరే అతని కుత్సిత బుద్ధిని క్షమించలేక అతి వృద్ధురాలైన అతని భార్య మరొకరితో వివాహాన్ని కోరుకుంటుంది ‘గులాబో సితాబో’లో. ‘నా మేధను నేను కొనసాగిస్తాను కుటుంబ అడ్డంకులను తొలగించుకునైనా సరే’ అని ‘శకుంతలా దేవి’ పాత్ర మనకు చెబుతుంది. ‘యాసిడ్ దాడి నా భవిష్యత్తుకు ముగింపు కాదు’ అని ఆశను ఇస్తుంది ‘చపాక్’లోని ఒక పాత్ర. బాలీవుడ్ పైకి చూడటానికి నాలుగు డబ్బులు సంపాదించే రంగంగా కనిపించొచ్చు. కాని అది తయారు చేసి వదులుతున్నస్త్రీ పాత్రలు చాలా గట్టి పాఠాలు చెప్పేలా ఉంటున్నాయి. తప్పులు సరిచేసుకోమని పురుషులకు బోధ చేస్తున్నాయి. నేర్చుకోవాలనుకునే మగవారు తక్కువగా ఉన్నా నేర్పే ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి వారికి స్త్రీల గురించి. సమాజం కొన్ని పాఠాలు చెబుతుంది. సాహిత్యం కొన్ని పాఠాలు చెబుతుంది. సినిమా కూడా కొన్ని పాఠాలు చెబుతుంది. స్త్రీని గౌరవించడం, స్త్రీ అభిప్రాయాలకు సమాన భూమికను ఏర్పరచడం, స్త్రీ మనోభావాలను గమనించడం పురుష ఆధిపత్యం ఉండే ఈ సమాజంలో ఎప్పటికప్పటి పాఠాల ద్వారానే సాధ్యమవుతుంది. గత నాలుగైదేళ్లుగా స్త్రీల స్వావలంబనను, స్వేచ్ఛను, స్వతంత్రాన్ని, మూసకు తలవొంచని పట్టుదలను, లైంగిక మర్యాదలను వ్యక్తం చేసే స్త్రీ పాత్రలు బాలీవుడ్లో అనేకం వస్తున్నాయి. స్త్రీలను మరింతగా అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాయి. 2020 కూడా అందుకు మినహాయింపు కాదు. లాక్డౌన్ వల్ల నేరుగా సినిమాలు విడుదల కాకపోయినా ఓటిటిల ద్వారా విడుదలైన సినిమాలు స్త్రీలకు సంబంధించి గట్టి స్టేట్మెంట్లు ఇచ్చాయి. చెంపదెబ్బపై చూపుడువేలు 2020 విడుదలైన సినిమాలలో గట్టి చర్చ లేవదీసిన సినిమా ‘థప్పడ్’. ఇళ్లల్లో అతి సాధారణంగా స్త్రీలు తినే చెంపదెబ్బను వేలెత్తి చూపిన సినిమా ఇది. ఈ సినిమాలో భార్యను భర్త చెంపదెబ్బ కొడతాడు. భర్త మంచివాడే. అత్తామామలు మంచివారే. ఇల్లూ మంచిదే. కాని చెంపదెబ్బ కొట్టడం మాత్రం మంచిది కాదు అనుకుంటుంది ఆ భార్య. విడాకులు కోరుతుంది. ‘చెంపదెబ్బే కదా’ అంటారు అందరూ. ఏ కొడుకూ తన తండ్రిని తల్లిని చెంపదెబ్బ కొట్టడు. భార్యను మాత్రం కొట్టొచ్చు అనుకుంటాడు. తండ్రిని కొట్టి ‘చెంపదెబ్బే కదా’ అనలేనప్పుడు అంతే సమాన గౌరవం ఇవ్వాల్సిన భార్యను మాత్రం ఎందుకు కొట్టాలి. గృహహింస అంటే రాచి రంపాన పెట్టడం కాదని, స్త్రీ తన ఆత్మగౌరవానికి భంగం కలిగిందని భావించే చెంపదెబ్బ కూడా చాలునని ఈ సినిమా చెప్పింది. తాప్సీ పన్ను ఈ పాత్ర పోషించింది. ఎగరడానికి రెక్కలు ‘ఇది పురుషుల స్థలం. ఇక్కడ స్త్రీలకు చోటు లేదు’ అంటాడు ఎయిర్‌ఫోర్స్‌లో ఒక పురుష ఆఫీసర్ గుంజన్ సక్సేనాతో. ఉమన్ పైలెట్ కావాలని ఎయిర్ ఫోర్స్‌లో చేరిన గుంజన్ సక్సేనాకు అక్కడ అంతా పురుష ప్రపంచమే కనిపించడం సవాలుగా మారుతుంది. అసలు ఆ స్థలాన్ని డిజైన్ చేయడమే పురుషుల కోసం చేసి ఉంటారు. స్త్రీల రూములు, బాత్రూములు, యూనిఫామ్ చేంజ్ రూమ్‌లు ఏవీ ఉండవు. స్త్రీలకు ఎగిరే పాఠాలు చెప్పడం నామోషీగా భావిస్తారు మరికొంత మంది ఆఫీసర్లు. అయినప్పటికీ గుంజన్ తాను ఎగరడానికి రెక్కలు మొలిపించుకుంది. ఎయిర్ ఫోర్స్‌లో ఉత్తమ పైలెట్‌గా నిలిచి కార్గిల్ వార్ సమయంలో సేవలు అందించి చరిత్ర లిఖించింది. గుంజన్ సక్సేనా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని చేసిన బయోపిక్ ‘గుంజన్’ భిన్న రంగాల్లో పని చేయాలనుకునే స్త్రీలకు ఒక ధైర్యం ఇచ్చింది. పురుషులను సెన్సిటైజ్ చేసింది. పొగల నుంచి పునరుత్థానం అత్యంత దుర్బలుడైన పురుషుడెవడంటే స్త్రీని దొంగదెబ్బ తీయాలనుకునేవాడే. అత్యంత శిక్షార్హమైన వ్యక్తి కూడా. యాసిడ్ దాడులు స్త్రీకి ‘గుణపాఠం’ అని భావించేవారికి గుణపాఠం చెప్పిన విజేతలు ఉన్నారు. ‘కుళ్లి కుళ్లి చావాలి’ అని యాసిడ్ జల్లినవాడే కుళ్లి కుళ్లి చచ్చేలా ఆ యాసిడ్ విజేతలు తమను తాము కూడదీసుకున్నారు. గౌరవాన్ని తిరిగి పొందారు. జీవికను కూడా పొందారు. ‘ముఖం మాత్రమే దెబ్బతింది. ఆత్మవిశ్వాసం కాదు.. పోరాట పటిమా కాదు’ అని చెప్పారు వీరు. అలా చెప్పిన వారిని వార్తల్లో చదవడం కంటే తెర మీద చూసి స్ఫూర్తి పొందే వీలు కల్పించింది ‘చపాక్’ సినిమా. లక్ష్మీ అగర్వాల్ అనే యాసిడ్ విజేత బయోపిక్‌గా వచ్చిన ఈ సినిమాలో ముఖ్యపాత్రను దీపికా పడుకోన్ పోషించి స్త్రీ చైతన్యంలో తన వంతు భాగస్వామ్యాన్ని కలిపింది. మరోమహిళ మేఘనా గుల్జార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిందని గుర్తు పెట్టుకోవాలి. లెక్క తప్ప కూడదు ‘నువ్వెంత జీనియస్వి అయినా ఒక భర్తకు భార్యవే... ఒక బిడ్డకు తల్లివే’ అని చెబుతుంది సమాజం. అదే భర్త జీనియస్ అయితే ‘ఆయన మానాన ఆయన్ని వదిలిపెట్టి ఇంటి సంగతి నువ్వు చూసుకోమ్మా’ అని స్త్రీకి సుద్దులు చెబుతుంది. తన మేధను చాటడానికి భూభ్రమణం చేసే హక్కు పురుషునికే ఉంది. ‘నాకూ ఉంది’ అని మేథమేటిక్స్ జీనియస్ శకుంతలా దేవి చెప్పింది. భర్తనూ కుటుంబాన్ని ఆమె గౌరవించినా తన మేధను చాటడంలో అవి అడ్డంకిగా మారుతాయని తెలిసినప్పుడు ఆమె ఒక భర్త బంధాన్ని వొదులుకుని కూతురి బంధం కోసం పెనుగులాడుతుంది. ఇలాంటి స్త్రీలను మూస చట్రం వ్యతిరేకంగా చూసేలా చేస్తుంది. ఇలాంటి స్త్రీలను అసలు అర్థం చేయించే ప్రయత్నం కూడా చేయదు. కాని ‘శకుంతలా దేవి’ బయోపిక్ చేసింది. శకుంతలా దేవిగా విద్యాబాలన్ ఈ సంవత్సరం గుర్తుండిపోయింది. బెత్తం ఎత్తాలి కొన్ని ఇండ్లలో పండు ముసలివారై పోయినా ఆ భర్త ఆ భార్య మీద అరవడమూ, కసరడమూ చేస్తూ ఉంటాడు. ఆమె వాటిని సహిస్తూ ఉంటుంది. ఇన్నాళ్లు పడుతున్నది ఇంకొన్నాళ్లు పడితే సరిపోతుంది అనే భావజాలం ఆమెను అలా చేసి ఉంటుంది. కాని ‘గులాబో సితాబో’లోని స్త్రీ పూర్తి భిన్నం. అందులో ఆమెకు 90 దాటి ఉంటాయి. ఆమె జమీందారు. భర్తకు కూడా 90 దాటి ఉంటాయి. కాని అతడు ఆ భార్య ఎప్పుడు చస్తుందా ఆమె పేరున ఉన్న ఆస్తి తనకెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆమె పట్ల ప్రేమ, పక్కన కూచుని కబురు, మంచి చెడ్డలు ఏవీ పట్టవు అతనికి. దురాశ తప్ప. ఆ వయసులో ఏం బావుకుంటాడో కూడా తెలియదు. ఇలాంటి మగవారిని ఏం చేయాలి? ఆమె అస్సలు క్షమించదు. అతనికి విడాకులు ఇచ్చి తన జమిందారీలోని పూచిక పుల్ల ఇవ్వకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. సగటు భారతీయ సమాజంలో అందరూ గుండెలు బాదుకునే విషయమే ఇది. కాని స్త్రీలు తమకు ప్రేమ, గౌరవం దొరకని చోట తాము ఉండరు అని చెప్పదలుచుకున్నది ఈ పాత్ర. నటి ఫరూక్ జాఫర్ ఈ పాత్ర పోషించింది. భర్తగా అమితాబ్ బచ్చన్. లాక్డౌన్ వల్లగాని మరికొన్ని గట్టి పాఠాలు చెప్పే స్త్రీల పాత్రలు కూడా ఈ సంవత్సరం వచ్చేవి. సరే లేండి. వచ్చే సంవత్సరం ఎలాగూ వస్తోందిగా. – సాక్షి ఫ్యామిలీ -
మ్యాజికల్ కాదు... ట్రాజికల్
2020.... మ్యాజికల్ నంబర్... కానీ మ్యాజిక్ జరగలేదు సినిమా రిలీజ్ నంబర్ తగ్గించేసింది. వసూళ్ల నంబర్ పడిపోయింది సినీ కార్మికులకు ఉపాధి లేకుండా చేసింది షూటింగులు లేక స్టూడియోలు వెలవెలబోయేలా చేసింది గాన గంధర్వుడిని, విలక్షణ నటులను తీసుకెళ్లిపోయింది మొత్తం మీద ‘మ్యాజికల్ ఇయర్’ కాదు.. ‘ట్రాజికల్ ఇయర్’గా మిగిలిపోయింది. పెద్ద పెద్ద విషాదాల్లో చిన్న చిన్న సంతోషాలూ ఉంటాయి. అలా కొన్ని ఆనందకరమైన సంఘటనలూ ఉన్నాయి. 2020.. 12 నెలలు... రౌండప్ వేద్దాం. జనవరి: ఈ నెలలో సుమారు 12 సినిమాల వరకూ రిలీజయ్యాయి. సంక్రాంతికి విడుదలైన మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ పెద్ద విజయాలు నమోదు చేసుకున్నాయి. ఇంకా విడుదలైన చిత్రాల్లో రవితేజ ‘డిస్కో రాజా’, కల్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’, నాగశౌర్య ‘అశ్వథ్థామ’ వంటివి ఉన్నాయి. ♦ నిర్మాత మండల్‌రెడ్డి కొండల్‌రెడ్డి 29న మృతి చెందారు. ఫిబ్రవరి: ఈ నెల 16 సినిమాలు రిలీజయ్యాయి. నితిన్ ‘భీష్మ’ సూపర్ హిట్ టాక్‌తో వసూళ్లను కొల్లగొట్టింది. శర్వానంద్ ‘జాను’, విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో పాటు విశ్వక్సేన్ ‘హిట్’ తదితర చిత్రాలు తెరకొచ్చాయి. ♦19న ‘ఇండియన్ 2’ సెట్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. మార్చి: ఈ నెల 15 నుంచి థియేటర్స్‌ను మూసేశారు. 15వ తేదీ వరకూ 7 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘పలాస 1978’ మంచి ప్రశంసలు అందుకుంది. ‘ఓ పిట్ట కథ’, ‘మద’ వంటి చిత్రాలు రిలీజయ్యాయి. ∙12న ‘పరుగు’ ఫేమ్ షీలా వివాహం వ్యాపారవేత్త సంతోష్ రెడ్డితో జరిగింది. ♦సినిమా చిత్రీకరణలన్నీ నిలిచిపోయిన నెల ఇది. ♦8న నిర్మాత సి. వెంకటరాజు కన్నుమూశారు. ఏప్రిల్: ∙జీ5లో ‘అమృతరామమ్’ విడుదలైంది. ఓటీటీలో విడుదలైన తొలి తెలుగు చిత్రమిది. ♦14న రచయిత సీయస్ రావ్ మృతి చెందారు. మే: ♦ ఈ నెల 10న ‘దిల్’ రాజు వివాహం వైఘాతో జరిగింది. ♦14న హీరో నిఖిల్ పెళ్లి పల్లవి వర్మతో జరిగింది. జూన్: కీర్తీ సురేశ్ నటించిన ‘పెంగ్విన్’ ప్రైమ్‌లో విడుదలైంది. సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఆహాలో, సత్యదేవ్ ‘47 డేస్’ జీ5లో విడుదలయ్యాయి. ♦కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో సినిమా చిత్రీకరణలు జరుపుకోవచ్చని ప్రభుత్వం అనుమతిచ్చింది. జూలై: ♦ ఈ నెల 26న నితిన్–షాలినీ వివాహం జరిగింది ♦ సత్యదేవ్ ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య’, నవీన్ చంద్ర ‘భానుమతి రామకష్ణ’ చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ♦ 5న ఈతరం ఫిలింస్ బ్యానర్ సమర్పకుడు, నిర్మాత పోకూరి బాబురావు సోదరుడు పోకూరి రామారావు, 26న నిర్మాత కందేపి సత్యనారాయణ, 28న నటుడు, రచయిత రావికొండలరావు కన్నుమూశారు. ఆగస్ట్: ♦ 8వ తేదీ రానా, మిహికా వివాహం జరిగింది ♦ దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి మరియు వారి కుటుంబ సభ్యులు, నటి జెనీలియా కోవిడ్ బారినపడ్డారు. ♦ ప్రముఖ గాయకుడు వంగపండు ప్రసాదరావు 4న తుది శ్వాస విడిచారు. సెప్టెంబర్: ∙నాని, సుధీర్‌బాబు ‘వి’ అమెజాన్ ద్వారా విడుదలైంది. ఓటీటీలో విడుదలైన తొలి పెద్ద తెలుగు సినిమా ఇదే. ♦ ఈ నెల తెలుగు సినిమాల చిత్రీకరణలు ప్రారంభం అయ్యాయి. ♦ ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, నటుడు నాగబాబు కరోనా బారిన పడ్డారు ♦ 8న ప్రముఖ నటులు జయప్రకాశ్ రెడ్డి మరణించారు. ♦ సీనియర్ నటి పొట్నూరి సీతాదేవి 21న కన్నుమూశారు. ♦ 23న నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి చెందారు. ♦ 25న గాన గాంధర్వుడు యస్పీ బాలసుబ్రహ్మణ్యం తిరిగి రాని లోకాలకు వెళ్లారు. అక్టోబర్: లాక్‌డౌన్‌కి ముందు విడుదల కావాల్సిన అనుష్క ‘నిశ్శబ్దం’ వాయిదా పడుతూ అక్టోబర్‌లో ఓటీటీలో విడుదలైంది. రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’, క్యారెక్టర్ నటుడు సుహాస్ లీడ్ రోల్ చేసిన ‘కలర్ ఫొటో’ చిత్రాలూ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ♦ 7న నిర్మాత బూరుగుపల్లి బప్పిరాజు కన్నుమూశారు. ♦ లాక్డౌన్ తర్వాత తెలుగు నుంచి విదేశాలు వెళ్లిన తొలి సినిమా ప్రభాస్ ‘రాధేశ్యామ్’. ఇటలీలో ఓ భారీ షెడ్యూల్ కోసం ఈ టీమ్ అక్కడికి వెళ్లింది ♦ కాజల్ అగర్వాల్ ఏడడుగులు నడిచిన తేదీ అక్టోబర్ 30. స్నేహితుడు గౌతమ్ కిచ్లుతో వెడ్లాక్లోకి ఎంటరయ్యారు ఈ బ్యూటీ ♦ ‘నేను పాజిటివ్’ అంటూ ఈ నెల మొదటి వారంలో తమన్నా చెప్పారు. కొన్ని రోజులకే కరోనా పాజిటివ్ నుంచి బయటపడి, నెగటివ్ అయ్యారు ♦ 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లు తెరవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. నవంబర్: ఈ నెల ఆరు ఓటీటీ రిలీజులను చూసింది. పెద్ద సినిమా సూర్య ‘ఆకాశం నీ హద్దు రా’ విడుదలై, మంచి సినిమాగా నిలిచింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ఆకట్టుకుంది. ‘మిస్ ఇండియా’గా కీర్తీ సురేశ్ వచ్చారు. ‘మా వింత గాథ వినుమా’, ‘అనగనగా ఓ అతిథి’ చిత్రాలు రిలీజయ్యాయి. విడుదలైన చిన్న సినిమాల్లో ‘గతం’ వచ్చే ఏడాది జనవరిలో గోవాలో జరగనున్న చిత్రోత్సవాల్లో ఇండియన్ పనోరమ విభాగంలో ప్రదర్శితం కానుంది. ఈ విభాగంలో ప్రదర్శితం కానున్న ఏకైక తెలుగు చిత్రం ‘గతం’. ♦ ఈ నెల 5న ఎడిటర్ కోలా భాస్కర్ చనిపోయారు. ♦ అక్టోబర్‌లో రాజశేఖర్, జీవిత, వారి పిల్లలు శివాని, శివాత్మిక కరోనా బారిన పడ్డారు. జీవిత, పిల్లలు కోలుకోగా రాజశేఖర్ కొన్నాళ్ల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. నవంబర్‌లో కోలుకుని రాజశేఖర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ♦ చిరంజీవికి ‘పాజిటివ్’ అనే వార్త ఈ నెలలో మెగాభిమానులను కలవరపెట్టింది. అయితే రిజల్ట్ తేడాగా వచ్చిందని, తనకు కరోనా లేదని ఆ తర్వాత చిరంజీవి ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డిసెంబర్: ♦ ఈ నెల 4న తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌ను ఓపెన్ చేశారు. హాలీవుడ్ మూవీ ‘టెనెట్’తో థియేటర్స్ తెర్చుకున్నాయి. ఆ తర్వాత ‘కరోనా వైరస్, మర్డర్’ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. థియేటర్స్‌లో విడుదలైన పెద్ద సినిమా సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ♦ డిసెంబర్ 9న నిహారిక వివాహం జరిగింది ♦ హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ చిత్రీకరణలో పాల్గొంటున్న రజనీకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి, కోలుకున్నాక చెన్నై వెళ్లారు ♦ రకుల్ ప్రీత్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్ కోవిడ్ బారినపడ్డారు ♦ 21న పంపిణీదారుడు అడుసుమిల్లి సాంబశివరావు, 25న దర్శకుడు ఓఎస్సార్ ఆంజనేయులు, 28న ఏఆర్ రెహమాన్ తల్లి కరీమా బేగమ్ మృతి చెందారు. 2020తో కలుపుకుని గడచిన పదేళ్లలో తక్కువ సినిమాలు చూపించిన సంవత్సరం ఇదే. ఈ ఏడాది విడుదలైన సినిమాలు మొత్తం 65. వాటిలో 50 స్ట్రయిట్ కాగా, 15 డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. స్ట్రయిట్ చిత్రాలు, అనువాద చిత్రాలు కలుపుకుని 2011లో 243, 2012లో 224, 2013లో 270, 2014లో 276, 2015లో 245, 2016లో 266, 2017లో 245, 2018లో 228, 2019లో 269, 2020లో 65 చిత్రాలు రిలీజయ్యాయి. -
కలల్ని భగ్నం చేసిన కాలం
అబ్దుల్ కలాం మన పిల్లలందరినీ కలలు కనమన్నారు. మనం కూడా మన పిల్లలకు అదే నేర్పించాం. కానీ మనం కలలు కంటూనే ఉన్నాం. కానీ మన ప్రభుత్వాలు మన దేశాన్ని కలకాలం కలల్లోనే ఉండేలా చేశాయి. మన పిల్లల స్వప్నాలు సత్యాలు కాలేదు. కానీ మనకు ఈ కరోనా ఒక మేల్కొలుపునిచ్చింది. ప్రభు త్వాల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది. అయితే కరోనా ఇచ్చిన అనుభవమే రేపటి సమాజ మార్పునకు ఒక హెచ్చరిక కావాలి. మనం వీడ్కోలు పలుకు తున్న 2020 సంవత్సరం తెచ్చిన ఉపద్రవం మనకు అత్యంత కఠినమైన అనుభవాలను మిగిల్చింది. 2020ని సంతోషంగా సాగనంపడమంటే, మన పాలకుల పట్ల మనకున్న భ్రమలను తొలగించి, వాస్తవాలను కళ్ళకు కట్టిన చేదు అనుభవాలు పునరావృతం కాకుండా మేల్కోగలగడమే. ఇదే మనకొక కనువిప్పు. ‘‘కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన 2020 ప్రపంచ ప్రజలందరినీ, ప్రత్యే కించి భారతదేశ వాసులందరినీ అభద్రతకు, అశాంతికి గురిచేసింది. అసమానతలను, అగాధాలను సృష్టించింది. ఇటీవల సంవత్సరాలలో వచ్చిన ఉపద్రవాలన్నింటికన్నా కరోనా కల్లోలం మానవాళిని అన్ని రంగాల్లో వెనక్కు నెట్టింది’’అని 2020 సంవత్సరాన్ని సమీక్షిస్తూ, ప్రపంచ బ్యాంకు ఆర్థిక వేత్తలు విశ్లేషించారు. కరోనా సృష్టించిన సంక్షోభం వల్ల కోట్లాది మంది పేదరికంలోకి దిగజారిపోనున్నారు. చాలా దశాబ్దాల తర్వాత పేదరికంపై జరుగు తున్న పోరాటాన్ని ఈ కరోనా వెనక్కు నెట్టివేసింది. గతం కన్నా అధికంగా ప్రజలు పేదరికంలోకి దిగజారిపోతున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలలోని ప్రజలు రోజుకు కేవలం 100 రూపాయలకు మించని ఆదాయంతో గడ్డుపరిస్థితుల నెదుర్కోబోతున్నారు. ఇది భవిష్యత్ చిత్రం. ప్రపంచబ్యాంకు నిపుణులు అనేక అంశాలపై సవివరమైన అధ్యయనాలను చేసి, ఎన్నో వివరాలను వెల్లడించారు. ప్రపంచంతో పాటు, భారతదేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు సృష్టించిన అసమానతలను కరోనా రెట్టింపు చేసింది. ఈ కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా అదనంగా మరో 8 కోట్ల 80 లక్షల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోతున్నారు, ఇందులో అత్యధికంగా భారతదేశంతో సహా దక్షిణాసియా దేశాల ప్రజలున్నట్టు అధ్య యనాలు వెల్లడించాయి. అసంఘటిత రంగం, ప్రత్యేకించి నిర్మాణ రంగం, ఉత్పత్తి రంగాల నుంచి ఎక్కువ మంది ఉపాధి కోల్పోను న్నారని ‘‘పావర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పరిటీ రిపోర్టు’’ వెల్లడించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇటువంటి సంక్షోభం తలెత్తలేదని, ఆరోగ్య రంగంలో బయటపడిన బలహీనతలు, మరణాలు ప్రపంచ వ్యాప్త ఆర్థిక సంక్షోభం విశ్వవ్యాప్తంగా ఉన్న మానవాళిని అతలా కుతలం చేశాయని, ‘‘గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్’’ నివేదిక తెలియజేసింది. కరోనా వల్ల సమాజంలో ఉన్న అసమానతలు, అభద్రత, అశాంతి ముసుగు తొలగించుకొని బయటకొచ్చాయి. మానవాళి ప్రాణ రక్షణకు మాస్క్‌లు అందించిన కరోనా, పాలకులు వేసుకున్న అభివృద్ధి ముసుగుని నిలువునా తొలగించివేసింది. ఇదే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక సర్వేలు రుజువు చేశాయి. ముఖ్యంగా ఈ సంక్షోభం వల్ల ప్రజలు ఉపాధినీ, ఉద్యోగాలనూ కోల్పోయి అభద్రతలోకి వెళ్ళిపోయారు. ప్రాణాలు ఉంటాయో పోతాయో అనే భయంతో అశాంతికి గురయ్యారు. ఆయా రంగాల్లో ఉన్న వ్యత్యాసాలు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తుని అగమ్యగోచరంలోకి నెట్టివేశాయి. ఆ పరిస్థితులను తట్టుకోలేక ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వలస కార్మికులు ఉపాధిని కోల్పోయారు. చాలా దేశాలు వలస కార్మికుల విదేశీ మారకద్రవ్యం మీద ఆధారపడి ఉన్నారు. కొన్ని కోట్ల కుటుంబాలు తమ వాళ్ళు పంపి స్తున్న డబ్బుతో జీవితాలను వెళ్లదీస్తున్నారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. 2021 చివరి వరకు విదేశాల నుంచి వచ్చే ఆదాయంలో దాదాపు 14 శాతం తగ్గిపోనున్నది. ఆధునిక చరిత్రలో ఇటువంటిది ఇదే మొదలు. స్వస్థలాలకు వెళ్ళిన వారు ఎక్కువ మంది తిరిగి తాము ప నిచేసే దేశాలకు వెళ్ళే స్థితి లేదని తెలుస్తున్నది. దీంతో పేదరికం మరింత పెరిగే ప్రమాదం ఉన్నది. దీనితో గతంలోలాగా ఆహారం, ఆరోగ్య భద్రత కష్టమవుతుందని వలస కార్మికులు ఆందోళన చెందు తున్నారు. దీంతోపాటు, చాలా కంపెనీలు గతంలో లాగా ఎక్కువ మంది కార్మికులను నియమించుకోవడానికి సిద్ధంగా లేవు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఏర్పడింది. అంతే కాకుండా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని, మనుషులమీద ఆధారపడకుండా, సాంకేతిక సహకారంతో కంపెనీలను ఆధునీకరించి కార్మికులను తగ్గించుకోవాలని కంపెనీలు ఆలోచిస్తున్నాయి. భారతదేశంలో దాదాపు 14 కోట్ల మంది వలస కార్మికులున్నారు. వీళ్ళు రాష్ట్రాలను దాటి వెళ్లేవారు. అంటే అంతర్రాష్ట్ర కార్మికులు. వీళ్ళంతా తమ పల్లెల్లో పనులు లేక పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి వలసలు వెళ్ళి దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. ఇటువంటి పరిస్థితులు గతంలో ఉన్నప్పటికీ కరోనా వల్ల వలస కార్మికుల దీన గాథలు ప్రపంచానికి తెలియవచ్చింది. ఒకరకంగా ఈ దేశం దౌర్భా గ్యస్థితిని బయటపెట్టింది. మరొక సమస్య నేరుగా కరోనాతో ముడి పడి ఉన్న ఆరోగ్యరంగం. మన ఆరోగ్య రంగం ఎదుర్కొంటోన్న అనేక అవరోధాలను కరోనా బహిర్గతం చేసింది. కరోనా వల్ల భయానకమైన స్థితిని ప్రజలే స్వయంగా అనుభవించారు. కానీ ప్రభుత్వాలు చేసింది నామమాత్రమే. ఉపన్యాసాలకు మాత్రమే పరిమితమైన వీరివల్ల ఒరిగిందేమీ లేదు. ప్రభుత్వాలు వైద్యం మీద పెడుతున్న ఖర్చుకన్నా ప్రజలు చేస్తున్న ఖర్చు అనేక రెట్లు అధికం. ఒక అంచనా ప్రకారం, ప్రపంచంలో ప్రజలు వైద్యం కోసం చేస్తున్న ఖర్చు దాదాపు 38 లక్షల కోట్లు. భారతదేశం వాటా ఇందులో చాలా ఎక్కువే. ప్రతి సంవత్సరం ఆరోగ్య సమస్యల వల్ల 90 కోట్ల మంది తీవ్రమైన ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని, 9 కోట్ల మంది పేదరికంలోకి దిగజారిపోతున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కరోనా సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న కుటుం బాలు సామాజిక వెలివేతకు గురవడం మాత్రమే కాకుండా, లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయారు. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజ లను నిలువుదోపిడీ చేస్తుంటే, ప్రభుత్వాలన్నీ ప్రేక్షక పాత్ర వహించాయి. ప్రభుత్వాలకు దూరదృష్టి లేకపోవడం వల్ల ఇటువంటి దుష్పరిణామాలు సంభవించాయి. మన దేశంలో పదివేల మంది జనాభాకు కేవలం 8 బెడ్లు, పదివేల మంది జనాభాకు 8 మంది డాక్టర్లు ఉన్నారు. దీనితోపాటు, 80 మందికి ఎటువంటి ఆరోగ్యభీమా లేదు. గతంతో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రులలో ఇచ్చే మందులు చాలా తగ్గిపోయాయి. ఈ పరిస్థితులు కరోనా సమయంలో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. అదే సమయంలో లాక్డౌన్ తొలగించిన తర్వాత ప్రారంభించిన చదువులు మనదేశంలో ఉన్న అసమానతలను బయటపెట్టాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య, పేదలు, ధనికుల మధ్య, మైదాన ప్రాంతాలు, అటవీప్రాంతాల మధ్య ఉన్న తేడాలు మరోసారి తేట తెల్లమయ్యాయి. అంతేకాకుండా సమాజంలో వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థినీ విద్యార్థులు కూడా ఆన్లైన్ క్లాసులకు దూరమవుతున్నారు. ఈ విషయాలపై ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోన్న ఒక సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం, 56.01 శాతం విద్యార్థినీ, విద్యా ర్థులకు స్మార్ట్ ఫోన్లు లేవని తేల్చారు. అంటే దాదాపు సగానికిపైగా విద్యార్థులు ఈ సంవత్సరం చదువులకు దూరమైనట్టే. స్మార్ట్ ఫోన్ ఉన్న విద్యార్థులకు చాలా ప్రాంతాల్లో సరిౖయెన నెట్వర్క్ లేనందువల్ల చదువుల్లో అంతరాయం కలిగిందని ఆ సర్వే తెలిపింది. మరికొన్ని సందర్భాల్లో ఆన్లైన్ క్లాసులు విన్నప్పటికీ సరిగ్గా అర్థం కావడం లేదని ఆ సర్వే తేల్చి చెప్పింది. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ విజన్–2020 పేరుతో మార్గదర్శకాలను తయారుచేశారు. అబ్దుల్ కలాం మన పిల్లలందరినీ కలలు కనమన్నారు. మనం కూడా మన పిల్లలకు అదే నేర్పించాం. కానీ మనం కలలు కంటూనే ఉన్నాం. కానీ మన ప్రభు త్వాలు మన దేశాన్ని కలకాలం కలల్లోనే ఉండేలా చేశాయి. మన పిల్లల స్వప్నాలు సత్యాలు కాలేదు. కానీ మనకు ఈ కరోనా ఒక మేల్కొ లుపునిచ్చింది. ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది. అయితే కరోనా ఇచ్చిన అనుభవమే రేపటి సమాజ మార్పుకు ఒక హెచ్చరిక కావాలి. మనం వీడ్కోలు పలుకుతున్న 2020 సంవత్సరం తెచ్చిన ఉపద్రవం మనకు జీవితంలో అత్యంత కఠినమైన అనుభవాలను మిగిల్చింది. 2020ని సంతోషంగా సాగనంపడమంటే, మన పాలకుల పట్ల మనకున్న భ్రమలను తొలగించి, వాస్తవాలను కళ్ళకు కట్టిన చేదు అనుభవాలు పునరావృతం కాకుండా మేల్కోగలగడమే. ప్రజలను మభ్యపెట్టి, మాయజేసే విధానాల పట్ల అప్రమత్తంగా ఉండడమే. ఉపాధి, ఉద్యోగ, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వాలు తమ బాధ్యతను మరిచిన సత్యాన్ని చెంపఛెళ్ళుమనింపిచేలా కొట్టిన ఘనత 2020కే దక్కింది. ఇదే మనకొక కనువిప్పు. ప్రభుత్వాల విషయంలో ప్రజ లకూ, ప్రజల పట్ల వ్యవహరించే తీరులో పాలకులకూ ఇదొక హెచ్చరిక కావాలి. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2020
రివాజుగా వచ్చి సజావుగా ముగిసిపోయే అన్ని సంవత్సరాల్లా కాకుండా రాబోయే అనేక తరాలు గుర్తు పెట్టుకునేవిధంగా చేదు జ్ఞాపకాలను మిగిల్చి వెళ్తోంది 2020. మానవాళి చరిత్రలో ఎన్నో విషాద అధ్యాయాలున్నాయి. 536లో ఉన్నట్టుండి బద్దలై ఒకేసారి ఆకాశంలో కోట్లాది టన్నుల బూడిదను వెదజల్లి యూరప్, పశ్చిమాసియా, ఆసియాల్లో 18 నెలలపాటు దట్టమైన చీకట్లు మిగిల్చి సుదూరతీరాల్లో సైతం కరువుకాటకాలకు కారణమైన ఐస్లాండ్ అగ్నిపర్వత విస్ఫోటనం... 541లో ఈజిప్ట్‌లో పుట్టుకొచ్చి తూర్పు రోమన్ సామ్రాజ్యంలో మూడోవంతుమందిని పొట్టనబెట్టుకున్న బ్యూబోనిక్ ప్లేగు...1348లో యూరప్‌లో విరుచుకుపడి ఆ ఖండంలోని 40 శాతం జనాభాను మింగిన బ్లాక్ డెత్... దాదాపు 5 కోట్లమంది ప్రాణాలు హరించిన 1918నాటి స్పానిష్ ఫ్లూ... ఇలా చరిత్ర నిండా విషాద ఘట్టాలు ఎన్నో వున్నాయి. వాటితో పోలిస్తే కరోనా మహమ్మారి సృష్టించిన మారణకాండ చిన్నగానే కనబడొచ్చు. కానీ భూగోళం నలుమూలలా విస్తరించి 8 కోట్ల 25 లక్షల మందికిపైగా ప్రజానీకానికి సోకి, దాదాపు 18 లక్షలమందిని పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి వీరంగం చిన్నదేం కాదు. దాని దెబ్బకు అగ్రరాజ్యాలనుకున్నవే విలవిల్లాడాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తలకిందులయ్యాయి. సమాచార సాధనాలు అందుబాటులోకొచ్చినందువల్ల ముందు జాగ్రత్త చర్యలపై మెజారిటీ జనాభాకు తక్కువ సమయంలో అవగాహన ఏర్పడింది. శాస్త్ర విజ్ఞానం విస్తరించటం, పరిశోధనలు వేగం పుంజుకోవటం కారణంగా అనుకున్నకన్నా చాలాముందే... ఏడాది చివరిలో వ్యాక్సిన్లు రూపొందాయి. వీటి ప్రభావం ఏమేరకుంటుందనేది నిగ్గు తేలటానికి మరి కొంత కాలం పడుతుంది. కానీ జనాభాలో 70 శాతంమందికి టీకాలు వేస్తే తప్ప దీని వ్యాప్తిని నియంత్రించలేమని శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు బెంబేలెత్తిస్తు్తన్నాయి. ఇదంతా పూర్తికావటానికి మూడేళ్లయినా పడుతుంది. ఒకపక్క టీకాల ప్రక్రియ మొదలైన తరుణంలోనే వైరస్ కొత్త వేషంతో, మరింత శక్తిమంతంగా మారి దాడికి సిద్ధమవుతోంది. కరోనా వైరస్ కాలచక్రాన్ని వెనక్కి తిప్పింది. మాస్క్ ధరించటంతో మొదలుపెట్టి ఎన్నిటినో అల వాటుచేసింది. ఒకప్పుడు ఊహకైనా అందని ఉత్పాతాలకు కారణమైంది. అల్లర్లు జరిగే ప్రాంతాల్లో మాత్రమే విధించే కర్ఫ్యూ లాక్డౌన్ పేరిట దేశవ్యాప్తంగా రాత్రింబగళ్లు అమలైంది. జనవరి 30న కేరళలో తొలి కరోనా కేసు నమోదు కాగా... ఇంతవరకూ దేశంలో కోటి మూడు లక్షలమందికి అది సోకింది. 1,48,503మంది మరణించారు. మార్చి 24న 21 రోజులపాటు అమలు చేస్తామంటూ విధించిన లాక్డౌన్ అంచెలంచెలుగా 68 రోజులపాటు కొనసాగింది. రెక్కల కష్టం నమ్ముకున్నవారికి, చేతిలో విద్య వున్నవారికి సాపాటుకు లోటేమిటన్న పాత నమ్మకం పల్టీలు కొట్టింది. గ్రామసీమల నుంచి పొట్టచేతబట్టుకుని నగరాలు, పట్టణాలకు వలస వెళ్లటం మాత్రమే తెలిసిన అట్టడుగు జీవులు... అక్కడ ఉపాధి కోల్పోయి, రోజులతరబడి తిండీ నీళ్లు దొరక్క... చివరకు తలదాచుకోవటా నికి గూడు కూడా కరువై సొంత ఊళ్లకు లక్షలాదిగా నడకదారిపట్టారు. మండుటెండల్లో, నడి రాత్రుళ్లలో గర్భిణులతో, చిన్న చిన్న పిల్లలతో, వృద్ధులతో వారంతా వేలాది కిలోమీటర్లు నడిచి పోతున్న దృశ్యాలు కొన్ని నెలలపాటు చానెళ్లలో నిరంతరాయంగా కనబడి అందరినీ కలచివేశాయి. ఈ క్రమంలో ఆకలికి తాళలేక, నడిచే సత్తువ లేక మరణించిన అభాగ్యులెందరో, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినవారెందరో కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కల్లేవు. మే 8న నడకతో అలసి మహారాష్ట్రలోని జల్నా వద్ద పట్టాలపై విశ్రమించిన 17మంది వలసజీవులు రైలు చక్రాలకిందపడి కన్నుమూశారు. లాక్డౌన్ ప్రభావంతో దెబ్బతిన్న అనేక రంగాలు ఇప్పటికీ కోలుకోలేదు. ఉపాధి కోల్పోయిన దాదాపు కోటిమంది బతుకు ఇంకా అగమ్యగోచరమే. ఏదో రకమైన కొలువు చేస్తున్నవారిని కూడా అభద్రత వెన్నాడుతోంది. కిందికి దిగుతున్నట్టే కనబడిన దారిద్య్ర రేఖ కరోనా అనంతర పరిస్థితుల్లో పైపైకి ఎగబాకుతోంది. అర్ధాకలితో కాలం వెళ్లదీయక తప్పనివారి సంఖ్య హెచ్చింది. మన దేశంలో సామాజిక భద్రత ఎంత నాసిరకంగా వుందో, కోట్లాదిమంది ప్రభుత్వ సాయం పొందటానికి కూడా వీల్లేని నిస్సహాయ స్థితిలో ఎలా బతుకీడుస్తున్నారో కరోనా బయటపెట్టింది. ముఖ్యంగా ప్రజా వైద్య రంగం ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. సరిపడా సిబ్బంది లేక, వచ్చిపడుతున్న రోగులకు వైద్య సేవలు అందించలేక సర్కారీ ఆసుపత్రులు సతమతమయ్యాయి. ఎప్పుడూ ఊహకు కూడా అందని ఆన్లైన్ చదువులు రివాజుగా మారాయి. సంక్షోభ సమయాలు మనుషుల్లో నిద్రాణమైవున్న శక్తిసామర్థ్యాలను వెలికి తీస్తాయంటారు. వ్యక్తులుగా ఈ కష్టకాలంలో తోటి మనిషికి అండగా నిలిచి ఆదుకున్నవారు అసంఖ్యాకంగా వున్నారు. నిరంతరాయంగా సేవలందించిన అనేకానేక స్వచ్ఛంద సంస్థలు కూడా వున్నాయి. లక్షలాదిమంది వైద్యులు, ఇతర సిబ్బంది, వివిధ ప్రభుత్వ విభాగాల్లోని సిబ్బంది విధి నిర్వహణను ఉద్యోగంగా కాక, కర్తవ్యంగా భావించారు. రోజుల తరబడి కుటుంబాలకు కూడా దూరమై విధుల్లో నిమగ్న మయ్యారు. ఇంతమంది సమష్టి కృషి కారణంగానే మన దేశం ఇప్పటికైతే తక్కువ నష్టాలతో గట్టెక్కగలిగింది. కానీ కరోనా మహమ్మారి విషయంలో అప్రమత్తంగా వుండకతప్పదని, ఈ పోరు మున్ముందు కూడా కొనసాగటం ఎంతో అవసరమని తాజా పరిణామాలు తెలియజెబుతున్నాయి. మాంద్యం చుట్టుముట్టి, ఉపాధి కరువై, పైపైకి ఎగబాకుతున్న ధరలతో సాధారణ పౌరులు సతమత మవుతున్న వేళ నిరాశానిస్పృహలు ఆవరించిన మాట వాస్తవమే. కానీ కాలం పుటల్లో ఒదిగిపోతున్న ఈ ఏడాది నేర్పించిన గుణపాఠాలతో కొత్త సంవత్సరంలో అప్రమత్తంగా మెలగటం, అక్కడెదు రయ్యే సవాళ్లకు సన్నద్ధమై, వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం తప్పనిసరి. అప్పుడే మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుంది. -
రౌండప్ 2020: కమ్మేసిన కాషాయం
నేతల మధ్య విమర్శలు, వివాదాలు. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు. ప్రత్యర్థిని మట్టికరిపించేందుకు ఎత్తుకు పై ఎత్తులు. రాజకీయ చదరంగంలో చాణిక్యుడిని మించేలా ఒకరికిమించి మరొకరి వ్యూహరచనలు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి అహ్మదాబాద్ వరకు అధికార విపక్షాల మధ్య పేలిన మాటాల తూటాలు. ఓవైపు దేశంలో కరోనా వైరస్ విజృంభణకు దేశ ప్రజలకు చిగురుటాకులా వణికినా.. నేతల పుట్టించిన రాజకీయ వేడి మాత్రం అంతాఇంతా కాదు. సవాళ్లుకు ప్రతి సవాలు విసురుతూ.. ఏడాది ఆసాంతం రాజకీయాన్ని రక్తికట్టించారు. 2020 ఏడాది దేశ రాజకీయ రంగంలో సంచలన మార్పులకు కేంద్రబిందువైంది. ఉత్తరాన వికసించిన కమళం.. దక్షిణాదికి పాకేందుకు బాటలు వేసింది. ఆరేళ్లుగా ఓటమి ఎరుగని కారు పార్టీకి కాషాయదళం ముచ్చెమటలు పట్టించింది. దుబ్బాక దంగల్.. కారు జోరుకు బ్రేకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికార టీఆర్ఎస్ తొలి ఎదురుదెబ్బ తగిలింది. స్వరాష్ట్రంలో రెండుసార్లు అధికారం చేజిక్కించుకన్న టీఆర్ఎస్కు.. దుబ్బాక దంగల్‌లో ఊహించని పరాజయం ఎదురైంది. గులాబీ కోటలో కమలం వికసించింది. ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డి తలపడ్డ దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. క్షణక్షణానికి ఆధిక్యం మారుతూ.. విజయం బీజేపీ, టీఆర్ఎస్లతో ఆఖరి వరకు దోబూచులాడింది. తీవ్ర ఉత్కంఠను రేపిన పోరులో చివరకు కాషాయదళ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు 1,079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి గులాబీ దళానికి కంచుకోటగా ఉన్న దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 63,352 ఓట్లు , టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 62,273 ఓట్లు , కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 22,196 ఓట్లు వచ్చాయి. గ్రేటర్లో వికసించిన కమళం.. ఈ ఏడాది డిసెంబర్ తొలివారంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు సంచలనం సృష్టించాయి. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ భారీ ఎదురుదెబ్బ తగలగా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. టీఆర్ఎస్-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించాయి. ఏ పార్టీ మేజిక్ ఫిగర్ సాధించకపోవడంతో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక 47 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ముఖ్యంగా ఎవరి ఊహలకు అందని విధంగా బీజేపీ 47 స్థానాల్లో జెండా పాతింది. టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి తామే ప్రత్నామ్నాయమని సవాలు విసిరింది. ఈ ఎన్నికల ఫలితాలు రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాతబస్తీపై మరోసారి పతంగి ఎగిరింది. 2016లో గెలిచిన 44 సీట్లను తిరిగి దక్కించుకొని మేయర్ పీఠం సాధనలో కీలకంగా మారింది. అసద్ వ్యూహరచన.. అక్బర్ వాడి వేడి ప్రసంగాలతో మైనార్టీ ఓటు బ్యాంకును తమవైపే నిలుపుకొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ మట్టికరిచింది. ఆ పార్టీ కేవలం రెండింటితో సరిపెట్టుకుంది. టీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ పోరులో పోటీపడలేక చతికిలపడింది. టీడీపీని వెంటాడుతున్న కష్టాలు... గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలైన టీడీపీకి ఈ ఏడాది (2020) కూడా చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఆ పార్టీకి చెందిన చాలామంది సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడుకు దూరం అయ్యారు. బాబు నాయకత్వంపై బహిరంగ విమర్శలు చేస్తూ పలువురు సీనియర్ నేతలు అధికార వైఎస్సార్సీపీలో చేరారు. మరికొంత మంది మాత్రం ఏ పార్టీలోనూ చేరకుండా టీడీపీకి దూరంగా ఉన్నారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కి మూలిగి తెచ్చుకున్న 23 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చంద్రబాబుకు తలకు మించిన భారంగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు పలువురు ప్రతిపక్ష ఎమ్మెల్యే సైతం ఆకర్శితులై ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎమ్మెల్సీలు సైతం చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపించి... అధికారపక్షం వైపు నిలుచున్నారు. అంతేకాకుండా కరోనా సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కనీసం పట్టించుకోకుండా పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమైన టీడీపీ నేతకు ఆ పార్టీ కార్యకర్తలు సైతం మిగలకుండా పోయారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలో చేరారు. మొత్తానికి 2020లో టీడీపీ పెద్ద నష్టాన్నే చేకూర్చింది. రంగుమారిన పవన్ రాజకీయం.. రాజకీయాల్లో మార్పు అనే నినాదంతో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ టాప్ హీరో పవన్ కళ్యాణ్.. బొక్క బోర్లా పడ్డారు. ఇప్పటికే అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్న పవన్ ఈ ఏడాది కొత్త భాగస్వామ్య పక్షాన్ని ఎంచుకున్నారు. జనసేన ఆవిర్భావం సమయంలో ప్రకటించిన సిద్దాంతాలకు విరుద్ధంగా బీజేపీతో జట్టుకడుతున్నట్లు ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. రానున్న అన్ని ఎన్నిల్లోనూ ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని బీజేపీ-జనసేన నేతలు ఉమ్మడి సమావేశం ద్వారా వెల్లడించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించిన పవన్ ఆ తరువాత కొంత కాలానికే చంద్రబాబు నాయుడుతో విభేదించారు. అనంతరం 2019 ఎన్నికల్లో వామపక్షాలతో జట్టుకట్టారు. ఈ ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల ఘోర ఓటమి చవిచూడటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒకే ఒక్కస్థానంలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే రూటుమార్చక తప్పదని భావించిన పవన్ కాషాయ పార్టీతో జట్టుకట్టారు. ఈ పరిణామం సొంత పార్టీ కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొత్తానికి 2020లో బీజేపీతో కలిసి తన రాజకీయ భవిష్యత్‌కు మార్పుకు పవన్ శ్రీకారం చుట్టారు. భాగ్యనగర్‌లో బీజేపీ విస్తరణ.. కీలక నేతలు చేరిక ఉత్తరాన వికసించిన కమళం.. దక్షిణాదిపై కన్నేసింది. హస్తిన నుంచి బయలుదేరి కర్ణాటకలో పాగా వేసిన కమళనాథులు హైదరాబాద్‌పై గురిపెట్టారు. గత పార్లమెంట్ ఎన్నికలు నింపిన జోష్‌ను కొనసాగిస్తూ దుబ్బాక మీదుగా హైదరాబాద్ గడ్డపై కాలుమోపారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిచిన బీజేపీ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది.అంతేకాకుండా కేవలం 15 రోజుల వ్యవధిలోనే జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీకి.. ఈ ఏడాది అన్నీ అనుకుల పరిణామాలే ఎదురైయ్యాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు చేప్టటిన అనంతరం దూకుడుగా వ్యహరిస్తూ అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్నారు. నితీష్ విజయం.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా తేజస్వీ సూపర్ ఓవర్ వరకు సాగిన ఉత్కంఠభరిత టీ 20 మ్యాచ్ లాంటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరులో చివరకు అధికార ఎన్డీయే విన్నింగ్ షాట్ కొట్టింది. చివరి ఓవర్ వరకు గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, 124 సీట్లతో బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రానుంది. అయితే, అత్యధిక స్థానాలు గెలుచుకుని ‘పార్టీ ఆఫ్ ది మ్యాచ్’ గా ఆర్జేడీ నిలిచింది. ఆ పార్టీ అత్యధికంగా 76 స్థానాలు గెలుచుకుంది. రెండో స్థానంలో 73 సీట్లతో బీజేపీ నిలిచింది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ ఈ సారి 43 స్థానాలకే పరిమితమైంది. విపక్ష మహా కూటమిలో ఆర్జేడీ 76, కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలు 16 సీట్లలో విజయం సాధించాయి. మొత్తంగా మహా కూటమికి 111 స్థానాలు వచ్చాయి. ఎంఐఎం 5, ఇండిపెండెంట్ 1, ఎల్జేపీ 1, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి. విజయం మహా కూటమిదేనని, కాబోయే ముఖ్యమంత్రి తేజస్వీ యాదవేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ వాటి అంచనాను తలక్రిందులు చేస్తూ ఎన్డీయే విజయం సాధించింది. ఎన్డీయే తరుఫున నితీష్ కుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సింధియా కలకలం.. కుప్పకూలిన కమల్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జోతిరాధిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరడం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆయనతో పాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడటంతో కమల్‌నాథ్ సర్కార్ పడిపోయింది. అనంతరం శాసనసభలో సంఖ్యాబలం పూర్తిగా తగ్గిపోవడంతో బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన సీఎం బాధ్యతలు స్వీకరించడం ఇది నాలుగో సారి. మొత్తం 230 మంది సభ్యులు ఉన్న మధ్యప్రదేశ్‌లో బీజేపీకి తొలుత 107 మంది సభ్యుల బలం ఉండగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా అనంతరం ఆ పార్టీకి కేవలం 92 మంది సభ్యుల బలం మాత్రమే మిగిలింది. దీంతో సభ బలం 206కు తగ్గగా, మెజారిటీ 104కు పడిపోయింది. దీంతో బీజేపీకి ఎవరి అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల బలం వచ్చింది. సింధియా రాజీనామా అనంతరం జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో కమల్‌నాథ్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ సీఎం పీఠాన్ని చేరడానికి మార్గం సుగమమైంది. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిక్యాన్ని సాధించి ప్రభుత్వాన్ని సురక్షితంగా నిలబెట్టుకుంది. రాజస్తాన్ సంక్షోభం.. సచిన్ పైలట్ తిరుగుబాటు ఎడారి రాష్ట్రం రాజస్తాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం దేశ వ్యాప్తంగా ఈ ఏడాది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ కీలక నేత సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో విభేదించి.. ఏకంగా 18 ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఈ వ్యవహారం.. కోర్టుల వరకు చేరింది. చివరికి సుదీర్ఘ చర్చల అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు బుజ్జగించడంతో సచిన్ వెనక్కి వచ్చారు. ఓ సమయంలో మధ్యప్రదేశ్‌లో మాదిరీగానే రాజస్తాన్‌లో కాంగ్రస్ ప్రభుత్వం పడిపోతుందని పెద్ద ఎత్తున వార్తలు వాచ్చాయి. కానీ సీనియర్ నేతలు రంగంలోకి దిగి.. తిరుగుబాటు నేతల్ని వెనక్కి తీసుకురావడంతో గహ్లోత్ ఊపిరిపీల్చుకున్నారు. దేవుడు శాసించాడు అరుణాచల్ పాటించాడు.. తమిళనాట మార్పుకు సమయం ఆసన్నమైందని ప్రకటించిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది అభిమాలను తీవ్ర నిరాశకు గురిచేశారు. దేవుడు శాసిస్తాడు ఈ అరుణాచల్ పాటిస్తాడు అంటూ ఇకపై తాను రాజకీయ రంగ ప్రవేశం చేయలేనంటూ సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన చేస్తానని తొలుత ప్రకటించిన రజనీకాంత్ ఆ తరువాత అనారోగ్య సమస్యలకు గురికావడంతో వెనకడుగు వేశారు. మరోవైపు రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో స్టార్ నటుడు కమల్ హాసన్ సిద్ధమయ్యారు. రజనీతో కలిసి పనిచేయాలని భావించిన అతనికి తలైవా ప్రకటనతో ఏడాది చివరన నిరాశే మిగిలింది. కేరళ ‘స్థానికం’లో ఎల్డీఎఫ్ జయకేతనం కేరళలో సీపీఎం నేతృత్వంలోని అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేసింది. గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మంచి విజయం సొంతం చేసుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఫ్) మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో సానుకూల ఫలితాలు సాధించింది. రాష్ట్రంలో 941 గ్రామ పంచాయతీలు, 152 బ్లాక్ పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు, 86 మున్సిపాల్టీలు, 6 కార్పొరేషన్లకు డిసెంబర్ 8, 10, 14వ తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి కశ్మీర్లో వికసించిన కమళం జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత మొదటిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి. జమ్మూ కశ్మీర్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల ఫలితాలు ఎన్నికల కమిషన్ డిసెంబర్ 23న వెల్లడించింది. మొత్తం 20 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 14 చొప్పున 280 సీట్లకు 8 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పీఏజీడీ(గుప్కార్ కూటమి) 110 స్థానాల్లో గెలుపొంది అగ్రస్థానంలో నిలిచింది. 75 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచిన సింగిల్ పార్టీగా అవతరించింది. ఫలితాలపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 370 రద్దుకు కశ్మీర్ ప్రజలు మద్దతు తెలిపారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ట్రంప్ ఓటమి.. కొత్త అధ్యక్షుడిగా బైడెన్ ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ప్రభావం చూపిన అంశం అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఉత్కంఠ బరితంగా సాగిన అధ్యక్ష పోరులో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు.538 మంది సభ్యుల ఎలక్టోరల్ కాలేజీలో 306 ఓట్లతో బైడెన్ ముందంజలో నిలబడగా, ట్రంప్‌కి 232 ఓట్లు వచ్చాయి. అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారతీయ మూలాలున్న కమలా హ్యారీస్ విజయం సాధించారు. ఫలితాలపై కోర్టును ఆశ్రయించిన ట్రంప్ అక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడంతో ఓటమిని అంగీకరించక తప్పలేదు. జనవరి 20న అమెరికాలో కొత్త ప్రభుత్వం కోలువుదీరనుంది. అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో జరిగిన ఈ ఎన్నికలు చరిత్రలో ఎన్నడూలేనంతగా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్శించాయి. రెండోసారి ప్రధానిగా జెసిండా అర్డెర్న్ న్యూజిలాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. లెక్కించిన ఓట్లలో లేబర్ పార్టీకి దాదాపు 49 శాతం ఓట్లు లభించగా, ప్రధాన ప్రతిపక్షం నేషనల్ పార్టీకి 27 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ప్రస్తుత ప్రధాని జెసిండా అర్డెర్న్ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. న్యూజిలాండ్ ఎన్నికల్లో ఒక పార్టీకి ఇంతలా ఘనవిజయం దక్కడం దాదాపు ఐదు దశాబ్దాల్లో ఇదే తొలిసారని జెసిండా వ్యాఖ్యానించారు. ఆ దేశంలో ప్రపోర్షనల్ ఓటింగ్ విధానం ఉంది. ఈ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఒక పార్టీకే పూర్తి మెజార్టీ రావడం ఇదే తొలిసారి.న్యూజిలాండ్‌లో ఎన్నికల ప్రచారం ఆరంభమైన్పటినుంచే జెసిండా హవా పూర్తిగా కొనసాగుతూ వచ్చింది. ఆమె ఎక్కడ ప్రచారానికి వెళ్లినా జననీరాజనాలు కనిపించాయి. ముఖ్యంగా దేశాన్ని కరోనా రహితంగా మార్చడంలో ఆమె కృషికి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. 2017లో సంకీర్ణ ప్రభుత్వానికి సారధిగా జెసిండా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో గతేడాది జరిగిన మసీదులపై దాడుల వేళ ఆమె సమర్ధవంతంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. -
2020: ఎఫ్‌పీఐల పెట్టుబడుల స్పీడ్
ముంబై, సాక్షి: ఈ కేలండర్ ఏడాది(2020)లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) నుంచి దేశీ క్యాపిటల్ మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయి. ప్రధానంగా ఈక్విటీలలో ఇప్పటివరకూ 22.6 బిలియన్ డాలర్లు ప్రవహించాయి. ఇవి 2019లో నమోదైన 14.23 బిలియన్ డాలర్లతో పోలిస్తే 58 శాతం అధికంకావడం విశేషం! తద్వారా వర్ధమాన మార్కెట్లలో అత్యధిక ఎఫ్‌పీఐల పెట్టుబడులను ఆకట్టుకున్న దేశంగా చైనా తదుపరి భారత్ నిలిచింది. ఇప్పటివరకూ చైనాకు 104 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలి వెళ్లాయి. అయితే 2019లో చైనా ఆకట్టుకున్న 132.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి 21 శాతానికిపైగా తక్కువకావడం గమనార్హం! కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రూపొందించిన గణాంకాలివి. కాగా.. 2019లో 4.4 కోట్ల బిలియన్ డాలర్లను ఆకట్టుకున్న రష్యా 2020లో మరింత అధికంగా 12.25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టింది. తద్వారా మూడో ర్యాంకులో నిలిచింది. చదవండి: (2021: ముకేశ్ ఏం చేయనున్నారు?) ఏప్రిల్ నుంచీ జోరు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ రెండో వారంవరకూ చూస్తే దేశీ ఈక్విటీలలోకి రూ. 2 లక్షల కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు ప్రవహించాయి. వీటిలో ఫైనాన్షియల్ సర్వీసుల రంగం రూ. 63,000 కోట్లను ఆకట్టుకోగా.. రూ. 47,000 కోట్ల పెట్టుబడులతో బ్యాంకింగ్ అగ్రభాగాన నిలిచింది. కోవిడ్-19 కారణంగా నిజానికి ఏప్రిల్, మే నెలల్లో ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా నిలిచారు. అయితే నవంబర్‌లో గత 12 ఏళ్లలోలేని విధంగా 8.1 బిలియన్ డాలర్లను ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేశారు. ఇదే నెలలో భారత్ తదుపరి బ్రెజిల్(6.2 బిలియన్ డాలర్లు), దక్షిణ కొరియా(5.2 బిలియన్ డాలర్లు), తైవాన్(4.5 బిలియన్ డాలర్లు) జాబితాలో చేరాయి. ఇక డిసెంబర్‌లోనూ ఇప్పటివరకూ దేశీ ఈక్విటీలలోకి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించడం ప్రస్తావించదగ్గ అంశం! 80 శాతం జూమ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ కల్లోలంతో మార్చిలో స్టాక్ మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే. తదుపరి పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడంతో విదేశీ పెట్టుబడులు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ 75 శాతానికిపైగా ర్యాలీ చేసి సరికొత్త గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 47,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 14,000 పాయింట్లవైపు చూస్తోంది. ఈ బాటలో ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 81 శాతం దూసుకెళ్లి 31,000 సమీపానికి చేరింది. ఫలితంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ 80 శాతం స్థాయిలో ఎగశాయి. చదవండి: (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) చైనా వెనకడుగు ఈ ఏడాది(2020)లో చైనా, హాంకాంగ్‌ల నుంచి ప్రయివేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ నిధులు భారీగా క్షీణించాయి. ఈ రెండు ప్రాంతాల నుంచి దేశానికి తరలివచ్చిన పెట్టుబడులు 2019తో పోలిస్తే 72 శాతం పడిపోయాయి. 95.2 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాదిలో 340 కోట్ల డాలర్ల పెట్టుబడులు లభించాయి. వెంచర్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం మెయిన్‌ల్యాండ్ చైనా నుంచి 64 శాతం తక్కువగా 37.7 కోట్ల డాలర్లు, హాంకాంగ్ నుంచి 75 శాతం తక్కువగా 57.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. కాగా.. చైనీస్ సంస్థలు దేశీయంగా ఇన్వెస్ట్ చేసేందుకు దాఖలు చేసిన 150 అప్లకేషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు ఖైటాన్ అండ్ కో తెలియజేసింది. పెట్టుబడులు తగ్గడానికి ప్రధానంగా ప్రెస్ నోట్3 నిబంధనలు కారణమైనట్లు లా సంస్థ ఖైటాన్ అభిప్రాయపడింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్‌లో ప్రభుత్వం పీఎన్3ను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారం భారత్‌తో సరిహద్దు కలిగిన విదేశీ సంస్థలు ప్రభుత్వ అనుమతితోనే ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుందని తెలియజేసింది. -
2020: కళలపై కరోనా కాటు
సాక్షి, కడప కల్చరల్ : ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ప్రభావం ఈ ఏడాది జిల్లా కళా రంగంపై స్పష్టంగా కనిపించింది. జిల్లాలో అన్ని రకాల పర్యాటకానికి అనుకూలమైన ప్రదేశాలు ఉండడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. సభలు, సమావేశాలపై నిషేధం ఉండడంతో కళా ప్రదర్శనలు, సాహిత్య సభలు కనిపించలేదు. ప్రజలకు ఆనందం, ఆహ్లాదం పంచాల్సిన శిల్పారామాలు, పర్యాటక ప్రదేశాలు వెలవెలబోయాయి. లాక్డౌన్ తర్వాత రెండు నెలల్లో ఓ మోస్తరుగా పూర్వ వైభవం వైపు సాగుతున్నాయి. కరోనా భయంతో దేవుడే దిక్కని భావించిన భక్తులు దేవాలయాలు సైతం చాలా రోజులు మూసివేయడం, కొన్ని చోట్ల కఠినమైన నిబంధనలు ఉండడంతో దైవ దర్శనం కూడా చేసుకోలేక పోయారు. పర్యాటక ప్రాభవం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలో పలు హరిత హోటళ్లు నిర్మించారు. 37 దేవాలయాలను అభివృద్ధి చేసి పర్యాటకాభివృద్ధికి కృషి చేశారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ కరోనా కష్ట సమయంలో కూడా జిల్లాలో పర్యాటక అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇడుపులపాయ కేంద్రంగా ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ వైఎస్సార్ స్మారక పార్కు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వేంపల్లెలో అత్యాధునిక వసతులతో కొత్తగా శిల్పారామం ఏర్పాటు చేయనున్నారు. పులివెందులలోని శిల్పారామాన్ని మరింత హంగులతో ప్రజలను ఆహ్లాదపరిచేలా తీర్చిదిద్దనున్నారు. మోపూరు శ్రీ భైరవేశ్వరస్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ బడ్జెట్ హోటల్, పార్కు, పర్యాటకులకు వసతి కల్పన తదితర పనులు కూడా చేపట్టనున్నారు. (చదవండి: శ్రీవారి భక్తురాలికి తనే వాహనమయ్యాడు) ఎకో టూరిజంలో భాగంగా సోమశిల వెనుక జలాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో ‘వన విహారి’ పేరిట పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. భారత జాతీయ కళా వారసత్వ పరిరక్షణ సంస్థ ఈ సంవత్సరం పర్యాటకాభివృద్ధి పుస్తకాలను ప్రచురించింది. రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ కరోనా ఆటంకాలను దాటుకుని ఈ సంవత్సరంలో తొమ్మిది పర్యాటక సమావేశాలు నిర్వహించింది. ఐదు పర్యాటక అభివృద్ధి పుస్తకాలను ప్రచురించారు. బద్వేలుకు చెందిన ప్రముఖ చిత్ర, శిల్పకారుడు గొల్లపల్లి జయన్న రూపొందించిన శిల్పాలతో కడప నగరంలో రెండు రోజుల ప్రదర్శన నిర్వహించడం ఈ సంవత్సరంలో ప్రముఖ కళా ప్రదర్శనగా నిలిచింది. శాసనాలు: జిల్లాను శాసనాల ఖిల్లాగా అభివర్ణించడం న్యాయమేనని కడప నగరానికి చెందిన యువ శాసన శోధకుడు మునికుమార్ నిరూపించారు. ఆయన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ సంవత్సరం మూడు శాసనాలను కనుగొన్నారు. తొండూరు, సుగమంచిపల్లెలతోపాటు మరో రెండుచోట్ల సాఫ్ట్వేర్ రంగానికి చెందిన యువకులు రెండు పురాతన శాసనాలను కనుగొన్నారు. బ్రౌన్ వైభవం: బ్రౌన్ గ్రంథాలయం రజితోత్సవ కార్యక్రమాలను వైవీయూ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. ఈ గ్రంథాలయ చరిత్రలో ప్రముఖమైనదిగా భావించిన ఈ రజితోత్సవాన్ని పలు సాహిత్య కార్యక్రమాలు, వెబ్‌నార్, నేరుగానూ పలు కళా ప్రదర్శనలను నిర్వహించారు. బ్రౌన్ జయంతి నుంచి వర్ధంతి వరకు పలు కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో రజితోత్సవ సంచిక, ఐదు సాహిత్య పుస్తకాలను ప్రచురించారు. బాలల దినోత్సవాన్ని నిర్వహించలేకపోయిన జిల్లా గ్రంథాలయాలు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘చదవడం మాకిష్టం’పథకంలో భాగంగా విద్యార్థులు నీతి కథల పుస్తకాలను చదివే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కడప నగరంలోని జిల్లా రెడ్డి సేవా సమితి ఈ సంవత్సరం పలు సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి నగరంలో మరో ప్రముఖ కళా వేదికగా మారింది. ఫిబ్రవరిలో నెలనెల సాహిత్యం వంద కార్యక్రమాలు పూర్తి చేసుకున్నది. మెరుపులు ♦ గండికోట ఉత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించారు. అక్కడ అడ్వెంచర్స్ స్పోర్ట్స్ అకాడమీని అందుబాటులోకి తెచ్చారు. ♦మార్చి మాసంలో గండికోటలో జరిగిన తవ్వకాల్లో ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. పురావస్తు శాఖ తవ్వకాలు కొనసాగిస్తే మరిన్ని చారిత్రక అవశేషాలు బయల్పడే అవకాశముందని పరిశోధకులు భావిస్తున్నారు. ♦ పాతకడప చెరువు పరిసరాలను ఆధునికీకరించి ట్యాంక్‌బండ్ తరహాలో జిల్లా మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు నగర పాలక సంస్థ సిద్ధమయ్యింది. ♦ కడప నగరంలోని రాజీవ్‌మార్గ్‌ను ఆహ్లాదకరమైన ట్యాంక్‌బండ్‌గా మార్చి నగర వాసులు సేద తీరేందుకు అనువుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. మరకలు ♦ కళారంగం పూర్తిగా కళ తప్పింది. కళాక్షేత్రాలు, రంగస్థలాలు కార్యక్రమాలు లేక వెలవెలబోయాయి. కళాకారులు ఆర్థికంగా చితికిపోయారు. ♦ 2021 జనవరిలో జరగాల్సిన గండికోట వారసత్వ ఉత్సవాలపై కరోనా కాటు పడనుంది. ♦ సీనియర్ రచయిత ఎన్సీ రామసుబ్బారెడ్డి, ధార్మికవేత్త, టీటీడీ అన్నమయ్య ప్రాజెక్టు డైరెక్టర్ జిల్లాకు చెందిన కామిశెట్టి శ్రీనివాసులు, స్థానిక ఉర్దూ కవి మున్వర్ ఖాద్రి కన్నుమూశారు. ♦ ప్రముఖ రంగ స్థల కళాకారులు కేవీ శివారెడ్డి, చెక్కభజన కళాకారుడు లక్ష్మయ్య, అంధుడైన గాయకుడు, సంగీత దర్శకుడు సాంబశివుడు కన్నుమూశారు. ♦ సాహితీ కార్యక్రమాల నిర్వాహకులు, ముస్లిం మైనార్టీల్లో సాహిత్యాభిలాషకు కృషి చేసిన మస్తాన్‌వలీ, ఆకాశవాణి కడప కేంద్రం సీనియర్ వ్యాఖ్యాత మంజులాదేవి భౌతికంగా దూరమయ్యారు. -
సంస్కరణ అడుగులు.. రక్షణ కవచాలు
సాక్షి, కర్నూలు: క్షేత్రస్థాయిలో పటిష్టమైన నిఘా... సమర్థవంతంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం.. సీసీ కెమెరాల ఏర్పాటు.. నేరస్తుల కదలికలపై డేగ కన్ను.. కరడుగట్టిన నేరస్తులపై పీడీ చట్టం ప్రయోగం.. తరచూ సమస్యాత్మక గ్రామాల్లో కార్డెన్ అండ్ సర్చ్ (నాకా బందీ).. వీటికి తోడు పోలీసు శాఖలో వినూత్న మార్పులు.. దీంతో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో నేరాల శాతం తగ్గుముఖం పట్టింది. అయితే సైబర్ మోసాలు, చిన్నారులపై అత్యాచారం (పొక్సో) తదితర నేరాలు పెరిగాయి. ఆస్తి తగాదాలు, చిన్న చిన్న ఘర్షణలు, మహిళా వేధింపులు మాత్రం తగ్గలేదు. చోరీల సంఖ్య తగ్గినప్పటికీ సొత్తుల రికవరీలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. పోలీసు శాఖలో కొత్తగా వస్తున్న సంస్కరణలతో కొంత కాలంగా అవగాహన పెరిగింది. పీడీ చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తుండటంతో హింసాత్మక ఘటనలు తగ్గాయి. దొంగతనాలు, దోపిడీలతో పోల్చితే సైబర్ నేరాలు పెరగడం ఆందోళన కలిగించే అంశం. 2020 సంవత్సరం జిల్లాలో చోటు చేసుకున్న నేరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాంకేతికత తోడుగా.. మారుతున్న పరిస్థితులను బట్టి పోలీసుశాఖలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కేసుల విచారణలో సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. కేసు నమోదు దగ్గరి నుంచి న్యాయస్థానంలో తీర్పు వెలువడే వరకు ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. అన్ని పట్టణాలు, గ్రామాల్లో నిఘా, నియంత్రణతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ దాతలు, ప్రజల సహకారంతో నిఘా నేత్రాలను ఏర్పాటు చేయడం ఇటీవల పలు కేసులను చేధించారు. (చదవండి: తగ్గిన నేరాలు.. పెరిగిన కేసులు) మతసామరస్యాన్ని దెబ్బ తీసేందుకు జరుగుతున్న కుట్రను ఛేదించేందుకు జిల్లాలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద పోలీసు నిఘా నిరంతరం ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,856 ఆలయాలు, 921 మసీదులు, 745 చర్చీలు మొత్తం 3,522 ప్రార్థనాలయాలకు జియో ట్యాగింగ్ చేయించారు. బహిరంగ ప్రదేశాలు, ముఖ్య కూడళ్లు, జాతీయ రహదారులపై కూడా ప్రజలు, ప్రైవేట్ వారి సహకారంతో గృహాలు, వ్యాపార దుకాణాలు, మద్యం షాపులు, డాబాల్లో సీసీటీవీ కమ్యూనిటీ ప్రాజెక్టులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 15,662 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మ్యాట్రిక్స్, బృహస్పతి టెక్నాలజీకి సంబంధించిన కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. నేరాల నియంత్రణ, కేసులు ఛేదించడంలో నిఘానేత్రాలు కీలకంగా మారాయి. నిఘా నీడలో.. ఎవరూ ఊహించని విధంగా ఈ ఏడాది కరోనా వైరస్ జనజీవనాన్ని కట్టి పడేసింది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 3వ వారం నుంచి లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో జిల్లాలో 4 నెలల పాటు పోలీసులు రాత్రింబవళ్లు గస్తీ కాశారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దులను రెండు నెలల పాటు పూర్తిగా మూసేశారు. పట్టణాల్లో చెక్‌పోస్టులు, ప్రతివీధిలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గస్తీ పెంచడంతో దొంగతనాల సంఖ్య భారీగా తగ్గింది. లాక్డౌన్ సమయంలో పగటి పూట అందరూ ఇళ్లలోనే ఉండటంతో చోరీలకు అవకాశం లేకుండా పోయింది. లాక్డౌన్ సమయంలో వాహనాల రాకపోకలు తక్కువ కావడంతో 80 శాతం ప్రమాదాలు తగ్గాయి. అలాగే శాంతి భద్రతలు, మతసామరస్య పరిరక్షణకు, ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు జిల్లాలో వినూత్నంగా ఏర్పాటు చేసిన గ్రామ రక్షక దళాల వ్యవస్థ సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ప్రజలు, యువత స్వచ్ఛంద భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ దళాలు తమ పనితీరుతో పోలీసు ఉన్నతాధికారుల అభినందనలు అందుకుంటున్నాయి. జిల్లాలో 83 పోలీసుస్టేషన్లు, 19 సర్కిళ్లు ఉండగా వీటి పరిధిలో 1,450 గ్రామరక్షక దళాలు ఏర్పాటు చేశారు. కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ రిమాండు ఖైదీలను కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తీసుకెళ్లే సమయంలో పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన సంఘటనల నేపథ్యంలో వీడియో లింకేజీ ద్వారా జైళ్ల నుంచే ఖైదీలను హాజరు పరిచే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా 1,426 కేసుల్లో 2,318 మంది సబ్ జైలు రిమాండులో ఉన్న ముద్దాయిలను సంబంధిత జడ్జీల ద్వారా వీడియో లింకేజీల ద్వారా రిమాండ్ గడువు పొడిగించేటట్టు చర్యలు చేపట్టారు. నేర ప్రవృత్తి మార్చుకోని నూకల మనోహర్‌రావు, గంగదాసరి రవిచంద్రరెడ్డి, నకిలీ విత్తనాల వ్యాపారి మణిగొండ రత్నాకరరావు, నకిలీ మద్యం తయారీ ముఠా నాయకుడు వినోద్ ఖలాల్ తదితరులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసి కటకటాలకు పంపారు. సెబ్‌తో కిక్కుకు కళ్లెం అక్రమ మద్యం రవాణాకు సంబంధించి జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు కాక ముందు 574 కేసులు నమోదు చేసి 622 మందిని అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో ప్రత్యేకంగా సెబ్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు జిల్లాలో 9,060 మద్యం కేసులు నమోదుచేసి 11,606 మందిని అరెస్ట్ చేసి 3,373 వాహనాలను సీజ్ చేశారు. 59,873 లీటర్ల నాటుసారా, 69,002 లీటర్ల ఇతర రాష్ట్రాల మద్యం సీజ్ చేసి 11,363 మందిని అరెస్ట్ చేశారు. సెబ్ తీసుకుంటున్న చర్యలతో సరిహద్దు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాకు దాదాపు అడ్డుకట్ట పడింది. పోలీసు శాఖకు మచ్చ తెచ్చిన ఘటనలు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ అందులో పనిచేస్తున్న కొంతమంది వ్యవహారం వల్ల మచ్చ తెచ్చిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అక్రమ మద్యం రవాణాను అడ్డుకునేందుకు సెబ్ విస్తృత దాడులు చేస్తున్నా కాసులకు కక్కుర్తి పడి పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తరలిస్తూ సుమారు 10 మంది పోలీసు సిబ్బంది తనిఖీల్లో పట్టుబడ్డారు. అలాగే నంద్యాలలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో ఒక సీఐ, ఒక హెడ్‌కానిస్టేబుల్ అరెస్ట్ కావడం, ప్రేమ వ్యవహారంలో తుగ్గలి ఎస్ఐని విధుల నుంచి తొలగిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసిన సంఘటనలు చర్చనీయాంశమయ్యాయి. ఇసుక దోపిడీకి అడ్డుకట్ట సెబ్ ఏర్పాటుతో ఇసుక అక్రమ రవాణాదారులకు కూడా కళ్లెం పడింది. అనుమతులులేని ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తున్న వారిపై నిఘా ఉంచి 435 కేసులు నమోదు చేసి 833 మందిని అరెస్ట్ చేసి 505 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దీని ద్వారా దాదాపు రూ.25 లక్షలు విలువ చేసే 6,661 మెట్రిక్ టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలతో ముచ్చెమటలు ఈ ఏడాది తీవ్ర నేరాలు తగ్గినప్పటికీ సైబర్ నేరాలు 19 శాతం పెరిగాయి. కరోనా సమయంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో సైబర్‌నేరాలు పెరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది 136 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 163 కేసులు నమోద య్యాయి. ఈ కేసులు దర్యాప్తు చేపట్టి రూ.3.36 కోట్లు రికవరీ చేశారు. అధునాతున సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మరో 230 కేసులను చేధించారు. ఛేదించిన సంచలన కేసులు ► ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో 9 రోజుల బాలిక కిడ్నాప్‌నకు గురైనట్లు సమాచారం అందిన వెంటనే ఐదు స్పెషల్‌పార్టీ బృందాలు రంగంలోకి దిగి రెండు గంటల్లోనే కేసును చేధించి బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. ► కర్నూలులో ప్రగతి మహిళా పరస్పర పొదుపు సంఘంలో అక్రమాలు చోటు చేసుకున్న కేసులోని నిందితుల ఆస్తులను ప్రభుత్వానికి అటా^Œ చేసేలా దర్యాప్తు చేపట్టి బాధితులకు ఊరట కలిగించారు. ► ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి వసూళ్లకు పాల్పడిన నకిలీ ఏసీబీ అధికారుల సంచలన కేసును సెప్టెంబర్ 2వ తేదీ అరెస్ట్ చేసి రూ.14.34 లక్షలు రికవరీ చేశారు. ► ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో కాలభైరవ విగ్రహంలోని ఓ భాగాన్ని తొలగించిన దుండగున్ని సెప్టెంబర్ 28న అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. ► జాతీయ రహదారుల సమీపంలోని ఆలయాల్లో చోరీలకు పాల్పడిన ఎరుకల నల్లబోతుల నాగప్పతో పాటు మరో ఇద్దరు మహిళలను అక్టోబర్ 17న అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. వీరు 20 దేవాలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. ► ప్రభుత్వ పథకాల ద్వారా దొడ్డిదారిలో లబ్ధికి వీలుగా ఆధార్ కార్డులో డేటా మార్పి మోసాలకు పాల్పడిన 30 మందిని అక్టోబర్ 28న అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ► ఇంటలిజెన్స్ డీఎస్పీనని మోసాలకు పాల్పడిన కుమార్ అనే వ్యక్తిని నవంబర్ 2న అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ► ఎటువంటి ఆధారాలు, పత్రాలు లేకుండా రూ.4.35 కోట్లు విలువ చేసే 686.5 కిలోల వెండితో పాటు కారును డిసెంబర్ 11వ తేదీ అమకతాడు చెక్‌పోస్టు వద్ద స్వాధీనం చేసుకుని తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. ► ఆర్టీసీ బస్సులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.9 కోట్లు నగదును డిసెంబర్ 13వ తేదీన కర్నూలు శివారులో పోలీసులు స్వాధీనం చేసుకుని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగించారు. ► పి.రుద్రవరంలో ప్రత్యర్థులను అంతమొందించేందుకు పన్నిన కుట్రను భగ్నం చేసి ఆరుగురు నిందితులను ముందుగానే అరెస్ట్ చేసి కటకటాలకు పంపడమేగాక గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పారు. ► నాదస్వరం కాయ మహిమల పేరిట మోసాలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. శభాష్ పోలీసు.. శాంతి భద్రత పరిరక్షణలో పోలీసు శాఖ తీసుకున్న పటిష్టమైన చర్యలకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి పలు ప్రసంశలతో పాటు పలు అవార్డులు దక్కాయి. ఎన్నికల్లో ఈ–సీజర్, ఈ–నాకాబంది, ఎలక్షన్ ఏపీ పోలీసు డాట్‌కామ్ వెబ్ అప్లికేషన్లకు సంబంధించిన టెక్నాలజీలను వినియోగిస్తూ చెక్‌పోస్టులల్లో ఈ–టెక్నాలజీ ద్వారా రియల్ టైం బేసిస్‌లో వాహన తనిఖీల ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ అడ్డుకట్ట వేశారు. ఇందు కోసం బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డు 2019, గవర్నెన్స్ నౌ–ఇండియా పోలీసు అవార్డు 2020, జిల్లా పోలీసు కార్యాలయాన్ని పరిశుభ్రంగా నిర్వహించినందుకు స్వచ్ఛ్ సుర్వేక్షణ్ 2021 అవార్డు మున్సిపల్ కార్యాలయాల నుంచి అందుకున్నారు. అలాగే ఫిబ్రవరి 14న టెక్నాలజీ సభ అవార్డు, కోర్టు మానిటరింగ్ సిస్టమ్, డీపీఓ సమాచార్ నిర్వహణకు సంబంధించి రెండు స్కోచ్ అవార్డులు దక్కాయి. జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు కూడా వ్యక్తిగతంగా స్కోచ్ అవార్డు, ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డును గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ చేతుల మీదుగా అందుకున్నారు. -
యూట్యూబ్ ‘ఫన్’- 2020
కరోనాతో యావత్ ప్రపంచం మూగబోయిన వేళ...తమ వీడియోలతో సందడి చేశారు. లాక్డౌన్ బోర్డమ్ను బ్రేక్ చేసి ప్రేక్షకుల్లో హుషారు నింపారు.యూత్‌ఫుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ శక్తి ఏమిటో చెప్పకనే చెప్పారు. ‘హైయెస్ట్ పెయిడ్ యూట్యూబ్ స్టార్స్–2020’గా ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన శ్రీమంతుల చిరు పరిచయం... ► తొమ్మిది సంవత్సరాల కోటీశ్వరుడు! చానల్: రెయాన్ వరల్డ్ ఎర్నింగ్స్: 29.5 మిలియన్ సబ్స్క్రైబర్స్: 41.7 మిలియన్ బొమ్మలపై రివ్యూలు ఇచ్చే చానల్స్ తెగచూసే రెయాన్ కాజీ(టెక్సాస్) ఒకరోజు తల్లితో కలిసి సొంతంగా యూట్యూబ్ చానల్ మొదలుపెట్టాడు. అబ్బాయి కోరిక నెరవేర్చడానికి, అతడిలోని టాలెంట్‌ను బయటికి తీసుకురావడానికి ఏకంగా హైస్కూల్లో తాను చేస్తున్న కెమిస్ట్రీ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది లోన్ కాజీ. 2015లో మొదలైన ‘రెయాన్ వరల్డ్’ యూట్యూబ్ చానల్‌కు అనూహ్యస్పందన లభించింది. విద్యను వినోదంతో కలిపి మిక్స్ చేసిన వీడియోలకు మంచి ఆదరణ లభించింది. ► హాస్యం, సాహసం సేయరా డింభకా! చానల్: మిస్టర్ బీస్ట్ ఎర్నింగ్స్: 24 మిలియన్ సబ్స్క్రైబర్స్: 47.8 మిలియన్ నార్త్ కరోలిన(యూఎస్)లోని ఒక రెస్టారెంట్. సర్వర్ ఆర్డర్ అడిగింది. ‘రెండు గ్లాసుల మంచినీళ్లు చాలు’ అన్నాడు ఆ యువకుడు. తాగి వెళ్లిపోయాడు. అతడు కూర్చున్న టేబులపై ఒక చీటి ఉంది. ‘కమ్మని మంచినీళ్లు ఇచ్చినందుకు–థ్యాంక్స్’ చీటి పక్కనే టిప్. అంత పెద్ద మొత్తంలో టిప్ చూడడంతో ఆమెకు కళ్లు తిరిగినంత పనైంది. ‘ఎవరీ టిప్పర్?’ అని ఆరాతీస్తే ‘యూట్యూబ్స్టార్ మిస్టర్ బీస్ట్’ అని చెప్పారు. 22 సంవత్సరాల జిమ్మి డొనాల్డ్సన్ ‘మిస్టర్ బీస్ట్’ యూట్యూబ్ చానల్‌తో ఫేమస్ అయ్యాడు. 13 సంవత్సరాల వయసు నుంచే యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఒళ్లు గగుర్పొడిచే సాహసకృత్యాలకు హాస్యం జోడిస్తే...ఆ ఫలితమే మిస్టర్ బీస్ట్. ► ఆడుతా తీయగా హాయిగా! చానల్: ప్రెస్టెన్ ఎర్నింగ్స్: 19 మిలియన్ సబ్స్క్రైబర్స్: 33.4 మిలియన్ తన సమీపబంధువు ఒకరు లండన్‌లో ‘లండన్’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలుపెట్టాడు. ఆ స్ఫూర్తితో డల్లాస్(యూఎస్)లో సొంతంగా యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేశాడు ప్రెస్టెన్ అర్స్మెన్. ప్రధాన చానల్‌తో పాటు మరోఅయిదు చానల్స్ ఉన్నాయి. గేమింగ్ వీడియోలు అతడి చానల్స్‌కు ముడిసరుకు. పిల్లలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన వీడియోలు రూపొందిస్తుంటాడు. ఛాలెంజ్ వీడియోలు, ప్రాంక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు 26 సంవత్సరాల ప్రెస్టెన్. ► చిన్నారి కాదు చిచ్చర పిడుగు చానల్: నస్ట్యా ఎర్నింగ్స్: 18.5 మిలియన్ సబ్స్క్రైబర్స్: 190.6 మిలియన్ టిక్ టాక్ పాప్లర్ కిడ్‌గా ఫేమస్ అయిన రష్యన్ చిన్నారి అనస్టాసియ ‘నస్ట్యా’ చానల్‌కు పిల్లల్లో అనూహ్యమైన ఆదరణ ఉంది. ఊహాత్మకమైన వీడియోలు, విజ్ఞానం, వినోదం మిళితమైన వీడియోలతో ‘నస్ట్యా’తో బ్రహ్మాండమైన పేరు సాధించింది. యూట్యూబ్ సెన్సేషనల్‌గా నిలిచిన ఆరేళ్ల అనస్టాసియ పేరు బ్రాండ్‌గా మారింది. ప్రసిద్ధ కంపెనీలు తమ ఉత్పత్తులు అనస్టాసియ పేరు వాడుకుంటున్నాయి. ‘జాజ్వేర్’ అనే బొమ్మల కంపెనీ ఈ చిన్నారి పేరుతో ఒక బొమ్మను కూడా తయారుచేసింది. ఇన్స్టంట్ ఫీడ్‌బ్యాక్‌లో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. మనల్ని మెచ్చుకునేవాటితో పాటు నొచ్చుకునేలా చేసేవి కూడా ఉంటాయి. ‘ఫీడ్‌బ్యాక్’ను గైడ్లైన్గానే తీసుకోవాలి తప్ప ప్రశంసలకు అతిగా పొంగిపోవడం, విమర్శలకు మరింత అతిగా కృంగిపోకూడదు. పనికి ఎంత న్యాయం చేస్తున్నామనేదే ముఖ్యం. –విద్య అయ్యర్ (విద్య వోక్స్ యూట్యూబ్ చానల్) మనవాళ్ల విషయానికి వస్తే భువన్ బామ్ (19.8 మిలియన్ సబ్స్క్రైబర్స్), ఆశిష్ చంచలని వైన్ (18.7 మిలియన్ సబ్స్క్రైబర్స్) గౌరవ్ –టెక్నికల్ గురూజీ (18.8 మిలియన్ సబ్స్క్రైబర్స్), విద్య–అయ్యర్ విద్య వోక్స్ (7 మిలియన్ ), సనమ్ పాప్–రాక్ బ్యాండ్(7 మిలియన్ సబ్స్క్రైబర్స్), శృతి అర్జున్ ఆనంద్ (8 మిలియన్ సబ్స్క్రైబర్స్)....మొదలైవారు ప్రేక్షక ఆదరణతో పాటు ఆర్థికవిజయం అందుకుంటున్నారు. కంటెంట్ గురించి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటాను. యూత్ మా ప్రధాన టార్గెట్. వీడియోలపై కుబుంబసభ్యుల నుంచి స్నేహితుల వరకు అందరి అభిప్రాయాలు తీసుకుంటాను. మార్పులుచేర్పులు చేస్తుంటాను. ‘నాకు నచ్చితే అందరికీ నచ్చినట్లే’ అనే భావనలో నుంచి బయటికి రావాలి. – శృతి అర్జున్ ఆనంద్, ఫేమస్ యూట్యూబర్ -
2020: సంచలనం సృష్టించిన టాప్ 10 నేరాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహామ్మారి నేరాలపై కూడా ప్రభావం చూపింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే భారత్‌లో నేరాల సంఖ్య ఈ సంవత్సరం బాగా తగ్గింది. కరోనా కారణంగా ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడింది. కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్లో భాగంగా ఆయా రాష్ట్రాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు, రాత్రి కర్ఫ్యూలతో నేరాలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని నెలల పాటు వాహనాలు రోడ్లు ఎక్కకపోవటంతో రోడ్డు ప్రమాదాలు సైతం భారీగా తగ్గాయి. అయితే ప్రజలందరూ ఇళ్లకు పరిమితమవ్వటంతో గృహహింస బాగా పెరిగింది. ఆ తర్వాత లాక్డౌన్ అన్‌లాక్ ప్రక్రియతో నేరాలు ఊపందుకున్నాయి. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి మొదలుకుని ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి అరెస్ట్ వరకు కొన్ని నేరాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. 2020లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాప్ 10 నేరాలు.. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన ముంబై, బాంద్రాలోని తన గదిలో ఉరి వేసుకుని మరణించారు. మొదట అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సుశాంత్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ అనుమానాలకు సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టు తెరదించింది. అయితే సుశాంత్‌ను అతడి ప్రియురాలు రియాచక్రవర్తి ఆత్మహత్యకు ప్రేరేపించిందంటూ అతడి తండ్రి కేకే సింగ్ రియా, ఆమె కుటుంబంపై పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు అనేక మలుపులు తీసుకున్న సంగతి విధితమే. బాలీవుడ్ డ్రగ్స్ కేసు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులకు ఇందులో డ్రగ్స్ కోణం ఉన్నట్లు తెలిసింది. టీవీ నటి వాట్సాప్ చాట్లు ఇందుకు బలాన్ని చేకూర్చాయి. దీంతో డ్రగ్స్ కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ప్రముఖ బాలీవుడ్ తారలు దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌లను విచారించారు. రియా చక్రవర్తితోపాటు పలువుర్ని అరెస్ట్ చేశారు. హథ్రస్ దళిత యువతిపై అత్యాచారం, హత్య సెప్టెంబర్ 14వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని హథ్రస్కు చెందిన ఓ దళిత యువతిపై ఆధిపత్య కులానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారాని తెగబడ్డారు. పొలంలో పనిచేసుకుంటున్న ఆమెపై సామూహిక అత్యాచారం జరిపి, నాలుక కోసి, వెన్నెముక విరిచేసి అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న ఆమె మృతి చెందింది. గొర్రెకుంట బావిలో 9 శవాలు మే 21న తెలంగాణలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని పాడుపడిన బావిలో తొమ్మిది మందిని వేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో భాగంగా మృతులందరి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు సంజయ్ వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేసి బావిలో పడేశాడు. ఓ మహిళ హత్యను కప్పి పుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ మరో తొమ్మిది మందిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వరంగల్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది. నంద్యాల ఫ్యామిలీ సెల్ఫీ సూసైడ్ ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం (45), అతని భార్య నూర్జహాన్ (38), కుమారుడు దాదా ఖలందర్ (10), కూతురు సల్మా (14) నవంబర్ 3వ తేదీన గూడ్స్ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఆత్మహత్యకు ముందు వారు తీసుకున్న సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఎం జగన్ తక్షణ విచారణ జరిపించాల్సిందిగా డీజీపీ సవాంగ్‌ను ఆదేశించారు. దీంతో బెటాలియన్స్ ఐజీ శంకబ్రతబాగ్జి, గుంటూరు అడిషనల్ ఎస్పీ హఫీజ్‌ను విచారణాధికారులుగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు. నంద్యాల వన్‌టౌన్ సీఐ సోమశేఖర్‌ను సస్పెండ్ చేశారు. ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను అరెస్ట్ చేశారు. బాయ్స్ లాకర్ రూం ఢిల్లీలో కొందరు సంపన్న విద్యార్థులు ‘బాయ్స్ లాకర్ రూమ్’ పేరుతో ఇన్స్టాగ్రాం గ్రూప్ క్రియేట్ చేసి వికృత చర్యలకు పాల్పడ్డ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. గ్యాంగ్ రేప్ ఎలా చేయాలన్న దానిపై విద్యార్థులు చర్చించుకోవడమే కాకుండా, విచ్చలవిడిగా అశ్లీల చిత్రాలను షేర్ చేశారు. ఈ గ్రూప్‌లో కొందరు మైనర్లు కూడా ఉన్నారు. అయితే విషయం బయటకు పొక్కడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి ఇద్దరు గ్రూప్ అడ్మిన్లను అరెస్ట్ చేశారు. స్కూల్ మేనేజ్మెంట్పై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు కేరళ, తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు చెందిన పార్మిల్లో జూలై 4న 15 వేల కోట్ల రూపాయల విలువైన 30 కిలోల బంగారాన్ని విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ఆరోపణలు ఎదుర్కోవడంతో వీరిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ అల్లర్లు ఫిబ్రవరి నెలలో దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో 53 మంది మరణించగా వందల సంఖ్యలో జనం గాయాలపాలయ్యారు. ముందస్తు కుట్ర ప్రకారమే ఈ అల్లర్లు చెలరేగాయని, ఈ కేసులో మొత్తం 21 మంది అనుమానితులను అరెస్ట్ చేయగా, వారిలో 15 మందిని నిందితులుగా పేర్కొంటూ వారి చేసిన నేరాలు ఏమిటో విఫులంగా వివరిస్తూ ఢిల్లీ పోలీసులు 17వేల పేజీల చార్జీ షీటును దాఖలు చేశారు. బెంగళూరు అల్లర్లు ఆగస్టు నెలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు నవీన్ సోషల్ మీడియాలో ఓ కమ్యూనల్ పోస్టు షేర్ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన కొంతమంది వ్యక్తులు కావల్ బైరసంద్రలోని ఎమ్మెల్యే నివాసంపై దాడి చేశారు. అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టగా.. ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. అంతేగాక ఎమ్మెల్యే ఇంటి వద్ద పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది పట్ల కూడా నిరసనకారులు అనుచితంగా ప్రవర్తించారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను సైతం లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన అల్లరి మూక పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో అనేక హెచ్చరికల అనంతరం కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. గాయపడిన మరొకరిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనలో 110 మందిని అరెస్ట్ చేశారు. అర్నబ్ గోస్వామి అరెస్ట్ ఓ డిజైనర్ ఆత్మహత్యకు పురికొల్పాలరనే ఆరోపణలతో గత నవంబర్ నెలలో ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై, రాయ్‌గడ్ పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 18 వరకు రాయిగఢ్ జిల్లా కోర్టు జ్యుడిషియల్ కస్టడి విధించింది. అంతకు క్రితం మధ్యంతర బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆర్నబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయనతో సహా మరో ఇద్దరికి కూడా సుప్రీం కోర్టు రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ ఇచ్చింది. -
2020.. కలలు కల్లలు
కొత్త సంవత్సరం.. కొత్త దశాబ్దిలోకి అడుగిడుతున్న సంబరం.. ఎన్నో కలలు, ఆశలు, ఆశయాలతో ఈ ఏడాదికి ప్రపంచం మొత్తం స్వాగతం పలికింది. కానీ అనూహ్యంగా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇచ్చింది. ‘నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు’ అంటూ ప్రపంచాన్ని ఓ ఆటాడుకుంది. ముఖ్యంగా కోవిడ్‌తో ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. ప్రపంచదేశాలన్నీ చిగురుటాకులా వణికిపోయాయి. వ్యక్తులు, రంగాలు, వ్యవస్థలు ఇలా ఒక్కటేమిటి.. ఒక్కరేమిటి ప్రతి ఒక్కరూ 2020 సంవత్సరానికి, కరోనా దెబ్బకు బాధితులే.. చాలా మందికి ఈ సంవత్సరం చాలా పాఠాలు నేర్పింది. ఈ ఏడది తెలంగాణ రాష్ట్రంలో 2020లో జరిగిన అనూహ్య పరిణామాలు ఏంటి? ఇక్కడి వ్యవస్థలు ఎలా మారాయి.. ఏయే రంగాలు ఎలా ఇబ్బంది పడ్డాయి.. ఎవరు హీరోలు అయ్యారు.. అనే విషయాలపై ఓ రౌండప్. -సాక్షి, హైదరాబాద్ అవిశ్రాంత పోరాట యోధులు.. వైద్యులు, వైద్య సిబ్బంది ఈ ఏడాది హీరోలుగా నిలి చారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఆ వైరస్ సోకిన వారందరికీ చికిత్స అందిస్తూ వచ్చారు. ప్రపంచం మొత్తం ఈ మహమ్మారికి గజగజ వణికిపోతుంటే.. వైద్యులు మాత్రం ధైర్యంగా అన్నీ తామై వైరస్ సోకిన వారికి సపర్యలు చేశారు. చాలా మంది డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అదే వైరస్‌కు బలయ్యారు కూడా. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలందిస్తూ మన రాష్ట్రంలో దాదాపు 3,500 మందికి కరోనా సోకగా, అందులో దాదాపు 40 మంది చనిపోయినట్లు సమాచారం. ఈ ఏడాది మొత్తం అన్ని ఆస్పత్రుల్లో కూడా కరోనా తప్ప వేరే వైద్య సేవలు చాలా తక్కు వగా అందాయి. కరోనా కారణంగా ప్రభుత్వాస్ప త్రుల్లో సదుపాయాలు పెరిగాయి. ఇదిలావుంటే కరోనా కారణంగా మెడికల్ కాలేజీలు తెరవకపోవ డంతో వైద్య విద్యార్థులు ఆన్లైన్ తరగతులకే పరిమితమయ్యారు. అసలైన వారియర్స్.. ఈ ఏడాది పోలీసులు యుద్ధవీరులయ్యారు. ప్రజలందరినీ తమ ప్రాణాలు పణంగా పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కరీంనగర్లో కరోనా ఆనవాళ్లు కన్పించిన రోజు నుంచి నేడు బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త వైరస్ సోకిన వారిని గుర్తించడంలో ఎనలేకి కృషి చేశారు. లాక్డౌన్ విధించాక ఎవరూ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. వైరస్ నియంత్రణలో, లాక్డౌన్ అమలులో పోలీసు శాఖ పోషించిన పాత్ర ప్రశంసనీయం. అలాంటిది నిర్విఘ్నంగా సాగుతున్న ఈ యజ్ఞంలో పోలీసులూ సవాళ్లు ఎదుర్కొన్నారు. పోలీస్ శాఖలో దాదాపు 5,700 మంది కరోనా బారినపడ్డారు. 50కి పైగా పోలీసులు అమరులయ్యారు. స్కూళ్లు తెరుచుకునేదెలా? రాష్ట్రంలో విద్యా రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపింది. 2020 మార్చి 16 నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఇంటర్ ఫలి తాల్లో ఆలస్యం, పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు తెరుచుకోలేదు. దీంతో సెప్టెంబర్ 1 నుంచి పాఠశా లలు, ఇంటర్లో ఆన్లైన్ బోధన ప్రారంభిం చాల్సి వచ్చింది. మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థల్లో టీచర్లు, అధ్యాపకులు ఇతర సిబ్బంది రోడ్డున పడ్డారు. ప్రవేశ పరీక్షల నిర్వహణ కూడా చాలా ఆలస్య మైంది. కాగా, ఈ పరిస్థితుల్లోనూ విద్యా ర్థులకు ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2020– 21 విద్యాసంవత్సరంలో కొత్త కోర్సులు తీసు కొచ్చింది. ఇంజనీరింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటాసైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తదితర కోర్సులకు అనుమతి ఇవ్వగా, డిగ్రీలో బీఎస్సీ డేటా సైన్స్, బీకాం బిజినెస్ అనలిటిక్స్, బీకాం టాక్సేషన్, బీకాం ఫారిన్ ట్రేడ్, బీఏ మ్యాథమెటిక్స్ వంటి కొత్త కోర్సులకు ఓకే చెప్పింది. అన్ని గ్రూపుల విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమ య్యేలా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్)లో మార్పులు తీసుకొచ్చింది. మార్కెట్ అవసరాలకు ఉపయోగపడేలా ఎం.ఫార్మసీ లోనూ 4 కొత్త కోర్సులకు అనుమతి ఇచ్చింది. వెనుకబడిన గురుకులాలు.. గురుకుల విద్యపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. మార్చిలో ఇంటిబాట పట్టిన పిల్లలు తిరిగి ఇప్పటివరకు గురుకులాన్ని చూడలేదు. ఆన్లైన్ తరగతులు, వీడియో పాఠాల ద్వారా బోధన ప్రారంభించాలని గురుకుల సొసైటీలు భావించినా.. పెద్దగా ఫలితం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల సొసైటీల పరిధిలో 960 గురుకుల విద్యా సంస్థలున్నాయి. వీటి పరిధిలో 3.85 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఎంసెట్, నీట్, క్లాట్ తదితర శిక్షణలిచ్చి తీర్చిదిద్దడంతో ఉత్తమ ర్యాంకులు సాధిస్తుంటారు. కానీ ప్రస్తుతం ఆన్లైన్ బోధనతో పిల్లలు కాస్త వెనుకబడినట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు. పడకేసిన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. మార్చి నుంచి పనులు పుంజుకునే సమయంలోనే వైరస్ విస్తృతి పెరగడంతో విదేశాల నుంచి రావాల్సిన యంత్ర సామగ్రి రాకపోవడం, వలస కూలీలు స్వస్థ లాలకు వెళ్లిపోవడం తదితర కారణాలతో పనులన్నీ నిలిచి పోయాయి. సీతారామ ఎత్తిపోతల, కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల ఎత్తిపోతల పథకాల యంత్రాలు పలు దేశాల నుంచి రావాల్సి ఉంది. ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలపైనా ప్రభావం బాగానే పడింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తొలి విడతగా గోదావరి బేసిన్లో 400, కృష్ణాబేసిన్‌లో 200 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు పూర్తి చేయాలని భావించినా కుదరలేదు. ఇసుక లభ్యత లేకపోవడం, సిమెంట్ ధర పెరగడంతో కాంట్రాక్టర్లకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఇడిసిపెడితే నడిసిపోతా.. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో అందరికన్నా ఎక్కువగా బాధ అనుభవించింది వలస కార్మికులే.. లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా పనులు నిలిచిపోవడంతో ఉపాధి లేక పూటగడవడం కష్టంగా మారింది. బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలు స్తంభించిపోవడంతో దిక్కు తోచని స్థితిలో లక్షలాది వలస కూలీలు మైళ్లకు మైళ్లు నడిచి పోయారు.. కాలినడకన వెళ్తున్న ఈ ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కంటతడి పెట్టించాయి. రాష్ట్రం నుంచి దాదాపు 9.57 లక్షల మంది వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వారిలో ఇప్పటివరకు 32 శాతమే తిరిగి వచ్చినట్లు కార్మిక శాఖ అంచనా. ఆర్టీసీకి దెబ్బ మీద దెబ్బ నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కరోనా, లాక్డౌన్ రూపంలో రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లింది. మార్చి చివర నుంచి అన్ని బస్సులు డిపోలకే పరిమితం కాగా, మే మూడో వారంలో జిల్లా సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ చివరలో సిటీ బస్సులు పరిమిత సంఖ్యలో ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పటికీ జిల్లా సర్వీసుల ఆక్యుపెన్సీ రేషియో 66 శాతంగానే ఉంటోంది. హైదరాబాద్‌లో కనీసం 50 శాతానికి కూడా చేరుకోలేదు. లాక్ డౌన్‌కు పూర్వం నిత్యం రూ.13 కోట్ల మేర టికెట్ల రూపంలో వచ్చే ఆదాయం ఇప్పుడు తొమ్మిదిన్నర కోట్లను మించట్లేదు. టికెట్ రూపంలోనే రూ.2వేల కోట్లు నష్టపోయింది. మరో వైపు కరోనాతో దాదాపు 50 మంది ఆర్టీసీ ఉద్యోగులు చనిపోగా, 2 వేల మంది వరకు కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఆర్థిక పరిస్థితి అతలాకుతలం కరోనా మహమ్మారితో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక తలకిందులైంది. లాక్‌డౌన్‌తో 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్నివిధాలా కలిసి రూ.52,750 కోట్లు తగ్గనుందని ఆర్థిక శాఖ తేల్చింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత తీవ్రమైంది. రాష్ట్రానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా 2019–20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల కాలంలో రాష్ట్రానికి రూ.39,608 కోట్ల ఆదాయం వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు రూ.33,704 కోట్లు మాత్రమే వచ్చాయి. 15 శాతం ఆదాయ వృద్ధి రేటుతో 2020–21లో రూ.1,15,900 కోట్ల అంచనాతో బడ్జెట్ రూపొందించగా, రూ.68,781 కోట్ల ఆదాయమే సమకూర నుంది. ఈ ఏడాది వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద రూ.32 వేలకు పైగా రాబడి వస్తుందని అంచనా వేస్తే, అక్టోబర్ నాటికి రూ.12,800 కోట్లు మాత్రమే వచ్చింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో కలిపి మరో రూ.5 వేల కోట్లు వచ్చినా రూ.18 వేల కోట్ల వరకు మాత్రమే జీఎస్టీ వచ్చాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందనుకున్నా.. ఇప్పటివరకు రూ.2 వేల కోట్లు కూడా దాటలేదు. రూ.30 వేల కోట్లు పన్నేతర ఆదాయం రూపంలో రావాల్సి ఉండగా, రూ.2వేల కోట్లు రాలేదు. అప్పుల విషయానికొస్తే ఏప్రిల్‌లో రూ.5,700 కోట్లు, మేలో రూ.7,642 కోట్లు, జూన్‌లో రూ.4,318 కోట్లు.. ఇలా 7 నెలల కాలంలోనే రూ.27 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. పరిశ్రమలు, ఐటీ శాఖ కాస్త మెరుగు.. పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలు కరోనా పరిస్థితుల్లో ఈ ఏడాది ఒడిదొడుకులకు లోనైనా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనలో మెరుగైన ఫలితాలు సాధించాయి. అమెజాన్ సంస్థ ప్రపం చంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను ప్రారంభించింది. రూ.20,670 కోట్ల పెట్టుబడులకు నిర్ణయం తీసుకుంది. బయో ఫార్మా రం గానికి ఊతమిచ్చేలా రూ.60 కోట్లతో బీ–హబ్ కూడా ప్రారంభమైంది. సిర్పూర్ పేపర్ ఫ్యాక్టరీ పునరుద్ధర ణ, ముచ్చర్ల ఫార్మాసిటీ భూసేకరణ వంటి అంశాల్లో పు రోగతి కన్పించింది. సులభతర వాణిజ్య విధానంలో రా ష్ట్రం మూడో ర్యాంకు సాధించింది. కాగా, ఐటీ సంస్థల న్నీ మార్చి మొదటి వారం నుంచే లాక్డౌన్ ప్రకటించా యి. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మరింత విస్తృతం చేయ డంతో 5.5 లక్షల మంది ఉద్యోగుల్లో 90% మంది ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త నియా మకాలు నిలిచిపోవడం, స్టార్టప్ కంపెనీలకు నిధుల కొరత, అద్దెల తగ్గింపు, ఐటీ కంపెనీలపై ఆధారపడి పనిచేసే హౌస్ కీపింగ్, కేటరింగ్ విభాగాల్లో పనిచేసే వారి ఉపాధికి గండిపడింది వెలవెలబోయిన పర్యాటకం గత 9 నెలలుగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు పూర్తిగా బోసిబోయాయి. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు కరోనా పెద్ద నష్టాలే తెచ్చిపెట్టింది. మార్చి చివరి నుంచి అన్ని పర్యాటక ప్రాంతాలను మూసేశారు. జూన్‌లో హోటళ్లను, ఆగస్టులో మిగతావి తెరిచారు. పర్యాటకుల నుంచి స్పందన మాత్రం రాలేదు. ఇప్పుడిప్పుడే కాస్త జనాలు పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నారు. మోతమోగిన విద్యుత్ బిల్లులు కరోనా కష్టకాలంలో జూన్ నెల విద్యుత్ బిల్లులు అనూహ్యంగా పెరిగిపోయాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం 2020 మార్చి 22 నుంచి దాదాపు 2 నెలల పాటు లాక్డౌన్ కారణంగా స్పాట్ మీటర్ రీడింగ్ తీయలేకపోయారు. లాక్డౌన్ సడలించడంతో జూన్ నెలలో 3 నెలల వినియోగానికి సంబంధించిన రీడింగ్ ఒకేసారి తీసి, సగటు వినియోగం ఆధారంగా వేశారు. దీంతో టారీఫ్ శ్లాబులు మారిపోయి ఈ మార్చి, ఏప్రిల్, మే నెలల బిల్లులు భారీగా పెరిగిపోయాయి. కాస్త ఆశావహ పరిస్థితులు.. ఈ ఏడాది విపత్కర పరిస్థితుల్లోనూ మాస్క్‌లు మొదలుకుని వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఫార్మాస్యూటికల్ రంగంలో ఆశించిన మేర ఎగుమతులు గణనీయంగా వృద్ధి చెందడం మంచి పరిణామం. ఎన్–95/ఎఫ్ఎఫ్పీ–2 మాస్క్‌ల ఎగుమతులు మెరుగు పడ్డాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 23% పెరిగాయి. 110 దేశాలకు రూ.554 కోట్ల విలువైన డైరీ ప్రొడక్టులను ఎగుమతి చేశారు. కార్పెట్లు, ఆహార ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, హెల్త్, వెల్నెస్, దుస్తులు తదితరాల ఎగుమతులు భారీగా జరిగాయి. జెమ్ అండ్ జ్యువెలరీ రంగానికి సంబంధించి రూ.1.6 లక్షల కోట్ల ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని అంచనా. -
రివైండ్ 2020: ప్రపంచానికి తాళం
ప్రపంచానికే తాళం పడింది. మార్కెట్లన్నీ మూతపడ్డాయి. రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. మొత్తంగా ప్రపంచమే స్తంభించిపోయింది. 2020ని కరోనా వైరస్ కాలనాగై కాటేసింది. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా పెనుసవాళ్లు విసిరింది. ఏడాది చివర్లో కరోనా కొత్తస్ట్రెయిన్ మరింత భయాందోళనల్ని పెంచుతున్నాయి. అయినా.. ఇకపై కరోనా, క్వారంటైన్, మాస్కులు, భౌతికదూరం అన్న మాటలు వినిపించకూడదన్న ఆశతో కొత్త సంవత్సరానికి ప్రపంచం స్వాగతం చెప్పనుంది. అగ్రరాజ్యాల వణుకు కరోనా మహమ్మారి ప్రపంచంలో అగ్రదేశాల వెన్నులో వణుకుపుట్టించింది. అమెరికా, యూకే, రష్యా వంటి దేశాలు కోవిడ్ ధాటికి తట్టుకోలేక విలవిలలాడిపోతున్నాయి. చైనాలోని వూహాన్లో పుట్టిన ఈ వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తొలిసారిగా జనవరి 9న ప్రకటించింది. ఆ తర్వాత చాప కింద నీరులా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది. అగ్రరాజ్యం అమెరికాలో జనవరి 15న తొలి కేసు నమోదైంది. మార్చి 11న డబ్ల్యూహెచ్ఓ కోవిడ్‌ని మహమ్మారిగా గుర్తించింది. భౌతిక దూరమే ఈ వైరస్‌పై బ్రహ్మాస్త్రం కావడంతో అన్ని దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. సరిహద్దులు మూసేశాయి. ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావద్దంటూ ఆంక్షలు విధించాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం మన జీవితంలో ఒక భాగమైపోయింది. కరోనా కట్టడిపై ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 8 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. 18 లక్షల మంది వరకు మృత్యువాత పడ్డారు. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధికంగా 2 కోట్ల వరకు కేసులు నమోదయ్యాయి. మూడున్నర లక్షల మంది మరణించారు. భారత్ ప్రపంచ పట్టికలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ జనాభా ఆధారంగా చూస్తే కరోనాని సమర్థంగా ఎదుర్కొన్నట్టే చెప్పాలి. బ్రెజిల్, బ్రిటన్, ఇటలీ, రష్యా వంటి దేశాలు కూడా కరోనాతో తీవ్రంగా సతమతమయ్యాయి. కరోనా సెకండ్ వేవ్, యూకేలో బయటపడిన కొత్త స్ట్రెయిన్‌తో ఇంకా భయాందోళనలు తొలగిపోలేదు. ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ అవి ఎంత మేరకు కరోనా వైరస్‌పై ప్రభావవంతంగా పని చేస్తాయోనన్న ఆందోళనల మధ్యే కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. అంతర్జాతీయ వేదికపై భారతీయ ప్రభ ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై భారతీయం వెల్లివిరిసింది. అమెరికా ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. తమిళనాడులో తులసెంథిరపురం కమల స్వగ్రామం. ఆమె తల్లి శ్యామల గోపాలన్ భారతీయురాలు కాగా తండ్రి జమైకాకు చెందిన డొనాల్డ్ హ్యారిస్. భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై అమితమైన ఇష్టం కలిగిన కమలా హ్యారిస్ విజయంతో భారతీయులు పండుగ చేసుకున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడిపైకి మనుషుల్ని పంపే మిషన్‌కు ఎంపిక చేసిన 18 మందిలో హైదరాబాద్ మూలాలున్న రాజాచారికి స్థానం లభించడంతో జాబిల్లిపైనా భారతీయ వెలుగులు ప్రసరించనున్నాయి. ట్రంప్‌కి గుడ్‌బై కొత్త ఏడాదికి స్వాగతం చెప్పే ఏర్పాట్లు చేసుకుంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రజలు బై బై చెప్పేశారు. కరోనా వైరస్‌ని ఎదుర్కోవడంలో, అమెరికాని ఆర్థికంగా నిలబెట్టడంలో ట్రంప్ వైఫల్యాలు ఆయన పదవికే ఎసరు తెచ్చిపెట్టాయి. జాతీయవాదాన్ని రెచ్చగొడుతూ వలసదారుల్ని పలు ఇబ్బందులకు గురిచేయడం, కరోనా ఆంక్షల్ని పాటించకపోవడం, మాస్కు ధరించడాన్ని హేళన చేయడం వంటి చర్యలతో ట్రంప్ ప్రజాదరణ కోల్పోయారు. నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ 306 ఎలక్టోరల్ స్థానాలతో విజయం సాధించినప్పటికీ ట్రంప్ తన ఓటమిని అంగీకరించకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ తన ఇమేజ్ను మరింత డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఐ కాంట్ బ్రీత్ అమెరికాలోని మొనిసెటా రాష్ట్రంలో ఆఫ్రికన్ అమెరికన్ అయిన జార్జ్ ఫ్లాయిడ్ (46) హత్యపై రేగిన ఆందోళనలు అంతకంతకూ ఉధృతమై జాతి వివక్షపై పోరాటానికి దారితీశాయి. తెల్ల తోలు అహంకారంతో డెరెక్ చావిన్ అనే పోలీసు ఫ్లాయిడ్ గొంతుపై తన బూటు కాళ్లతో తొమ్మిది నిమిషాల సేపు తొక్కి పెట్టి ఉంచడంతో ఊపిరాడక ఫ్లాయిడ్ చనిపోయాడు. ‘నాకు ఊపిరి ఆడట్లేదు(ఐ కాంట్ బ్రీత్)’ అంటూ ఫ్లాయిడ్ మొరపెట్టుకున్నా ఆ పోలీసు అధికారి పెడచెవిన పెట్టడంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. మొత్తం 60 దేశాల్లో జాతి వివక్షపై ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. కరోనాని లెక్క చేయకుండా జనం స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొనడం గమనార్హం. మధ్యప్రాచ్యంలో శాంతి వీచికలు ఉద్రిక్తతలకు నిలయమైన మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన దిశగా అడుగులు ముందుకు పడ్డాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఆగస్టు 13న ఇజ్రాయెల్, యూఏఈ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 25 ఏళ్ల తర్వాత ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం అంతర్జాతీయ పరిణామాల్లో మైలురాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, యూఏఈ డిప్యూటీ సుప్రీం కమాండర్ జాయేద్ సాధారణ సంబ«ంధాలను పునరుద్ధరించడానికి అంగీకరించడం ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది. మెగ్జిట్ బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కె ల్ రాజ ప్రాసాదాన్ని వీడుతున్నట్టుగా జనవరి 8న ప్రకటించారు. ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడడం కోసం ఈ జంట బకింగ్హమ్ ప్యాలెస్ వీడి వెళ్లింది. సోషల్ మీడియాలో నెటిజన్లు యువజంట స్వతంత్ర భావాలకు సలాం చేశారు. ప్యాలెస్ నుంచి మేఘన్ బయటకు రావడాన్ని మెగ్జిట్గా పిలుస్తున్నారు. అవీ ఇవీ ► అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ కడ్స్ దళాల జనరల్ ఖాసీం సులేమానీ మరణించారు. బాగ్దాద్ విమానాశ్రయంలో కారులో వెళుతుండగా ఈ దాడులు జరిగాయి. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకే సులేమానీని అమెరికా సైనికులు చంపేశారు. ► ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి బయల్దేరిన ఉక్రెయిన్ అంతర్జాతీయ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలింది. జనవరి 8న జరిగిన ఈ విషాద ఘటనలో విమానంలో ఉన్న 176 మంది మరణించారు. మూడు రోజుల తర్వాత ఆ విమానాన్ని పొరపాటున తామే కూల్చివేశామని ఇరాన్ ప్రభుత్వం అంగీకరించింది. ► అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గద్దె దింపడం కోసం ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం.. ఫిబ్రవరిలో సెనేట్‌లో వీగింది. ► పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి ప్రయాణిస్తున్న పైలట్ తప్పిదం కారణంగా కరాచీలోని నివాస ప్రాంతాలపై మే 22న కుప్పకూలింది. ఈ ఘటనలో 97 మంది మరణించారు. ► హాంకాంగ్ స్వతంత్ర ప్రతిపత్తిని నీరు కార్చేలా జాతీయ భద్రతా బిల్లుని జూన్‌లో చైనా ఆమోదించింది. దీనిని వ్యతిరేకిస్తూ హాంకాంగ్‌లో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ► లెబనాన్ రాజధాని బీరూట్ పోర్టులో ఆగస్టు 4న జరిగిన భారీ పేలుళ్లలో 200 మంది మరణిస్తే, వేలాది మంది గాయపడ్డారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వల కారణంగానే ఈ పేలుళ్లు సంభవించాయి. ► అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రూత్ బాడెర్ గిన్స్బర్గ్(87) సెప్టెంబర్ 18న పాంక్రియాటిక్ కేన్సర్‌తో మరణించారు -
2020లో ప్రపంచాన్ని నడిపించిన స్త్రీ మూర్తులు
ఊరి మీదకు రాక్షసుడొచ్చి పడ్డాడు. కొత్త ముఖం రాక్షసుడు. బండెడన్నం కాదు వాడి డిష్. రోజుకు బండెడు మనుషులు. ఊరు ఇంట్లోకి పరుగులు తీసి తలుపేసుకుంది. దబా.. దబా.. దబా.. దబా.. రాక్షసుడు తలుపు తడుతున్నాడు. తడుతూనే ఉన్నాడు. ధడేల్మని తలుపులు తెరుచుకున్నాయి. ఆ ఇంటి మహిళ బయటికి వచ్చింది. చేతుల్లో పది కత్తులు ఉన్నాయి! పది కత్తులకు పది రూపాలు. గృహిణి, ఉద్యోగి, డాక్టర్, నర్స్, యాక్టివిస్ట్..పరిశోధకురాలు, పారిశుధ్య కార్మికురాలు..ఆశా వర్కర్.. ఆన్లైన్ టీచర్, అంబులెన్స్ డ్రైవర్! రాక్షసుడి అడుగు తడబడింది. ఊరు ధైర్యంగా తొంగి చూసింది. కరోనాపై యుద్ధంలోనే కాదు.. సకల రంగాలలోనూ స్త్రీ శక్తి విజేతగా నిలిచింది. జాతీయంగా, అంతర్జాతీయంగా అన్ని రంగాలలోనూ మహిళలు ఈ ఏడాది అసమాన ప్రతిభను చాటారు. అద్భుత విజయాలు సాధించారు. అవార్డులు పొందారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేశారు. సంపన్నులుగా చరిత్రను సృష్టించారు. మన దేశంలో పది మంది ప్రముఖ మహిళల పేరిట వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యాపీఠాలను నెలకొల్పనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు తమ ఇష్టంతో గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు పురుషులతో సమానంగా ఉన్నత బాధ్యతలు నెరవేర్చే అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ భావనను వ్యతిరేకించడమేనని సుప్రీంకోర్టు ప్రతిష్టాత్మక తీర్పునిచ్చింది. ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిలో కొడుకులతో పాటు, కూతుళ్లకు సమాన హక్కులుంటాయని తేల్చి చెప్పింది. చర్మాన్ని తెల్లగా మార్చే సౌందర్య ఉత్పత్తులు వర్ణవివక్షలో భాగమేనన్న చర్చ నేపథ్యంలో ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరును ‘గ్లో అండ్ లవ్లీ’గా మారుస్తూ హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) హెచ్‌యూఎల్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన ఏపీ దిశ చట్టం–2019 అమలు కోసం ఐఎఎస్ కృతికా శుక్లా, ఐపీఎస్ దీపిక దిశ స్పెషల్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు. అంతర్జాతీయంగా కమలా హ్యారిస్, జాతీయంగా కేరళ ఆరోగ్య శాఖ మంత్రి పాలనలో, ప్రణాళికలో తమ ముద్రను వేశారు. ఈ వివరాలు సంక్షిప్తంగా మీ కోసం. అక్కడ కమలపాలన ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవి బరిలో నిలిచి గెలిచిన భారత సంతతి మహిళ కమలా దేవి హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా జనవరిలో పగ్గాలు చేపట్టబోతున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళగా, తొలి నల్లజాతి అమెరికన్‌గా, తొలి ఇండో–అమెరికన్‌గా, తొలి ఆసియా–అమెరికన్ మహిళగా కమల రికార్డు నెలకొల్పారు. కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఒక్లాండ్‌లో జన్మించారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడులోని సంప్రదాయ కుటుంబానికి చెందినవారు. తండ్రి జమైకా దేశస్తుడు డొనాల్డ్ హ్యారిస్. వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీలో కమల చదువుకున్నారు. యూసీ హేస్టింగ్స కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు. అలమెండా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో ఎనిమిది సంవత్సరాలు పనిచేశారు. ప్రధానం గా చిన్నారులపై జరిగే హింసకు సంబంధించిన కేసులను విచారించారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేస్తున్నప్పుడు బరాక్ ఒబామా దృష్టిలో పడ్డారు. అనంతరం డెమొక్రటిక్ పార్టీలో చేరారు. కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు. శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఆమె కీర్తిగడించారు. అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ రికార్డుకెక్కారు. ఇక్కడ శైలప్రణాళిక కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ ‘టాప్ థింకర్ 2020’ గా ఎంపికయ్యారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా యు.కె.లోని ప్రతిష్టాత్మక పత్రిక ‘ప్రాస్పెక్ట్’ ఆమెను ఈ టైటిల్‌తో గౌరవించింది. తత్వవేత్తలు, మేధావులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, రచయితలను యేటా ‘ప్రాస్పెక్ట్’ఓటింగ్ ఆధారంగా ఎంపిక చేస్తుంది. పాఠకులు, నిపుణులు, సంపాదక బృందం ఇచ్చే రేటింగ్‌ని అనుసరించి జాబితాను ప్రకటిస్తుంది. సకాలంలో చర్యలు తీసుకుని తన రాష్ట్రంలో కరోనా విస్తృతిని కట్టడిని చేసిన శైలజకు గుర్తింపు లభించింది. ఈ సమర్థతను కారణంగానే ఆమెకు ఐక్యరాజ్య సమితి ప్రజాసేవ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడే ఘనతను సాధించారు. గతంలో నిఫా వైరస్ కేరళను ఆవరించినప్పుడు కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా శైలజే సమర్థంగా ఎదుర్కొన్నారు. ‘నిఫా యువరాణి’, ‘కోవిడ్ రారాణి’ అంటూ విపక్షాలు వ్యంగ్యంగా మాట్లాడినా, తన పనితీరుతో గట్టి సమాధానం చెప్పారు. శైలజ విధి నిర్వహణ చురుగ్గా, ముందుచూపుతో ఉంటుంది. కేరళలో కరోనా కేసులు బయటపడగానే ఆమె ప్రణాళికలు సిద్ధంగా చేశారు. ఆరోగ్యశాఖ యంత్రాంగాన్ని పూర్తిగా మేల్కొలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి టెస్టింగ్ కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారెంటైన్ విధానాన్ని కఠినంగా అమలు పరిచారు. ►బయోకాన్ వ్యవస్థాపకురాలు, ఎండీ కిరణ్ మజుందార్ షాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ లభించింది. దశాబ్దాలుగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య వాణిజ్య, విద్యాపర సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకుగాను కిరణ్‌కు ఈ అవార్డు దక్కింది. ►అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్ బర్గ్(87) కన్నుమూశారు. మహిళా హక్కుల కోసం, సామాజిక న్యాయం, లింగ సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన రూత్ అమెరికా సుప్రీంకోర్టులో జడ్జి అయిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. ►దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు చైర్‌పర్సన్‌గా రోష్ని నాడార్ మల్హోత్ర నియమితులయ్యారు. హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ ఏకైక సంతానం అయిన రోష్ని దేశంలోనే అత్యధిక సంపద ఉన్న మహిళగా హురున్ సంస్థ తాజా కుబేరుల జాబితాలో ఉన్నారు. ►అమెరికాకు చెందిన దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి, కెరీర్ ఆరంభం నుంచి సమానత్వ హక్కుల కోసం పోరాడిన బిల్లీ జీన్ కింగ్ (76)ను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) అరుదైన రీతిలో గౌరవించింది. ప్రతిష్టాత్మక ఐటీఎఫ్ టీమ్ ఈవెంట్ ఫెడ్ కప్ పేరు మారుస్తూ ఇకపై దీనిని ‘బిల్లీ జీన్ కింగ్ కప్’గా వ్యహరిస్తామని ప్రకటించింది. ఒక టీమ్ ఈవెంట్ టోర్నీని మహిళ పేరుతో వ్యవహరించడం చరిత్రలో ఇదే మొదటిసారి. ►తమిళనాడులోని మదురైకి చెందిన 9వ తరగతి విద్యార్థిని నేత్ర ఐక్యరాజ్యసమితి ‘గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ది పూర్’గా నేత్ర నియమితురాలైంది. క్షౌరశాల నడుపుతున్న తండ్రి తన పెళ్లి కోసం దాచిన 5లక్షల రూపాయలను నేత్ర పేదల సంక్షేమం కోసం ఖర్చుచేసింది. ►ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా నిలిచిన ‘బీబీసీ 100 మహిళలు–2020’ జాబితాలో భారత్ నుంచి బిల్కిస్ దాదీ (82), గానా ఇసైవాణి (23), మానసీ జోషీ (31), రిధిమా పాండే(12) చోటు దక్కించుకున్నారు. ►ఏడాది కాలంలో అత్యధికంగా ఆర్జించిన క్రీడాకారిణిగా జపాన్ టెన్నిస్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్ వన్ నయోమి ఒసాకా గుర్తింపు పొందింది. ‘ఫోర్బ్స్ పత్రిక మే వెల్లడించిన వివరాల ప్రకారం 2019 జూన్ నుంచి 2020 జూన్ కాలానికి 22 ఏళ్ల ఒసాకా ప్రైజ్‌మనీ, ఎండార్స్మెంట్ల ద్వారా మొత్తం 3కోట్ల 74 లక్షల డాలర్లు (రూ. 284 కోట్లు) సంపాదించింది. ►నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీని పూర్తి చేసినందుకు చాలా సంతోషం గా ఉన్నానని ఆడపిల్లల విద్యకోసం పాటు పడుతున్న ఈ ఉద్యమ కారిణి అన్నారు. ►ఇండియన్ ఆర్మీ చరిత్రలోనే లెఫ్టినెంట్ జనరల్ ర్యాంకుకు చేరుకున్న మూడోమహిళగా మాధురీ కనిట్కర్ చరిత్ర సృష్టించారు. ఆర్మీలో రెండవ అత్యున్నతస్థాయిలోని ఈ ర్యాంకును పొందిన తొలి పీడియాట్రీషియన్‌గా కూడా కనిట్కర్ గుర్తింపు పొందారు. ►బాలీవుడ్ మెగాస్టార్ ప్రియాంక చోప్రా ‘ఫార్చూన్’ వారి భారతదేశపు అతి శక్తిమంతమైన బిజినెస్ ఉమన్ జాబితాలో స్థానం పొందారు. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ ఆమె నటించారు. ►అత్యంత వేగవంతమైన మానవ కంప్యూటర్‌గా ఖ్యాతి గడించిన భారత గణిత మేధావి శకుంతలాదేవికి దాదాపు 4 దశాబ్దాల తర్వాత గిన్నిస్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. 1980లో లండన్ ఇంపీరియల్ కాలేజీలో జరిగిన ప్రదర్శనలో 13 అంకెల రెండు సంఖ్యలను అత్యంతవేగంగా కేవలం 28 సెకన్లలోనే గుణించిన శకుంతలాదేవి ప్రపంచ రికార్డు నెలకొల్పినప్పటికీ అప్పటి నిబంధనల ప్రకారం ఆమెకు గిన్నిస్ సంస్థ ధ్రువీకరణ పత్రం అందజేయలేదు. ►దివ్యా గోకుల్ నాథ్ ‘ఫోర్బ్స్’ ఏషియా పవర్ఫుల్ బిజినెస్‌ఉమన్ లిస్ట్–2020లో స్థానం సంపాదించారు. ఆమె, ఆమె భర్త వ్యవస్థాపకులుగా ఉన్న ‘బైజూస్’ కంపెనీ విలువ 300 కోట్ల డాలర్లు! ఈ స్టార్టప్ ఆలోచన దివ్యదే. ►ముంబైలోని నావికాదళ స్కూల్ విద్యార్థిని 12 ఏళ్ల కామ్య కార్తికేయన్ దక్షిణ అమెరికాలోని ఎత్తయిన పర్వతం మౌంట్ అకాంకాగ్వా (6,962మీ) విజయవంతంగా అధిరోహించింది. అకాంకాగ్వా పర్వతాన్ని అధిరోహించిన అత్యంత చిన్న వయస్కురాలిగా కామ్య ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ►హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త ప్రత్యూష పారెడ్డికి ‘నీతీ ఆయోగ్ మహిళా అవార్డు’ లభించింది. 2017లో నెమో కేర్ అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించిన ప్రత్యూష శిశు మరణాలను తగ్గించడానికి విశేషంగా కృషి చేయడంతోపాటు నవజాత శిశువుల ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకునే కార్యక్రమాలు చేపట్టారు. -
చెక్కు చెదరని మోదీ ఇమేజ్..
ఇది కోవిడ్ నామ సంవత్సరం. 2020 పేరు చెబితేనే వెన్నులో వణుకు పుడుతుంది. అయినా రాజకీయాలు రంజుగా సాగాయి. ఢిల్లీ ఎన్నికలతో మొదలైన ఏడాది బిహార్ ఎన్నికలతో ముగిసి ప్రధాన పార్టీలకు కరోనాని మించిన రాజకీయ పాఠాలను నేర్పింది. ఈ ఏడాది కూడా బీజేపీ తన హవా కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీని కాపాడే నాథుడు లేక కొట్టుమిట్టాడుతోంది. తమిళ సూపర్ స్టార్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తానన్న ప్రకటన ఈ ఏడాది హైలైట్‌గా నిలిచింది. చెక్కు చెదరని మోదీ ఇమేజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకున్న బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవడంలో ఈ ఏడాది విజయం సాధించారు. కరోనా మహమ్మారితో పోరాడుతూనే దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యధిక జనాభా కలిగిన భారత్ కరోనాను ఎదుర్కోలేక కుదేలైపోతుందన్న అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ తనదైన శైలిలో పకడ్బందీ ప్రణాళిక రచించారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ కష్టకాలంలో నరేంద్ర మోదీ ప్రధాని కావడం వల్ల భారత్‌కున్న పేరు ప్రతిష్టలు పెరిగాయని దేశ ప్రజల్లో 93% అభిప్రాయపడినట్టుగా ఐఏఎన్ఎస్–సీ ఓటరు సర్వే తేల్చి చెప్పింది. సరైన ప్రతిపక్షం లేకపోవడం కూడా ప్రధానికి బాగా కలిసొచ్చింది. ఏడాది చివర్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు మాత్రం ఆయనని చిక్కుల్లో పడేశాయి. ఎన్నికల్లో.. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ సారి బీజేపీ హవాయే కనిపించింది. ఏడాది మొదట్లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ విజయ ఢంకా మోగించింది. సీఎం కేజ్రివాల్‌కి క్రేజ్ తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. 70 స్థానాలకు గాను ఆప్ 62 స్థానాల్లో విజయం సాధిస్తే, బీజేపీ ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. ఇక బిహార్‌లో హోరాహోరిగా సాగిన పోరాటంలో ఎన్డీయే 125 స్థానాలు దక్కించుకుంది. అయితే ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ గట్టి పోటీయే ఇచ్చింది. 75 స్థానాలను గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో రాజకీయాల్లో యువకెరటం తేజస్వి యాదవ్ పేరు మారుమోగిపోయింది. ఇక వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. జ్యోతిరాదిత్య సింధియా వర్గాన్ని చీల్చి తమ వైపు లాక్కున్న బీజేపీకి మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఆ ఎన్నికల్లో 19 స్థానాల్లో నెగ్గి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక ఈ ఏడాది రాజ్యసభలో కూడా 12 సీట్ల బలాన్ని పెంచుకొని రాజకీయంగా శక్తిమంతంగా ఎదిగింది. కాంగ్రెస్ ఒక భస్మాసుర హస్తం కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది ఏమాత్రం కలిసిరాలేదు. నానాటికీ ఆ పార్టీ అధఃపాతాళానికి పడిపోతోంది. దశ దిశ లేని నాయకత్వం. కొత్త జనరేషన్ ఆలోచనలకి తగ్గట్టుగా వ్యూహరచన చేయలేకపోవడం ఆ పార్టీని దెబ్బతీసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించు కోలేకపోయిన కాంగ్రెస్ బిహార్ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 స్థానాల్లో మాత్రమే నెగ్గింది. కాంగ్రెస్ తురుపు ముక్కగా భావించే ప్రియాంక గాంధీపై పెట్టుకున్న ఆశలు కూడా అడియాశలయ్యాయి. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు స్థానాలకు గాను నాలుగు సీట్లలో కాంగ్రెస్ డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. వృద్ధతరానికి, యువతరానికి మధ్య పోరు ఉధృతం కావడంతో జ్యోతిరాదిత్య సింధియా వంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై కొట్టేసి కాషాయ శిబిరంలో చేరారు. ఫలితంగా మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ లక్ష్యమైన కాంగ్రెస్ ముక్త భారత్ ఎంతో దూరంలో లేదని కాంగ్రెస్ పార్టీ తనకి తానే ఒక భస్మాసుర హస్తంగా మారిందన్న విశ్లేషణలైతే వినిపిస్తున్నాయి. పొలిటికల్ బాషా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఈ ఏడాది పండగే పండుగ. ఎట్టకేలకు తాను రాజకీయాల్లోకి వస్తానని రజనీ ప్రకటించారు. ఆధ్యాత్మిక రాజకీయాల పేరుతో తమిళనాట మార్పు తీసుకువస్తానని నినదించారు. రజనీ పార్టీ పేరు మక్కల్ సేవై మర్చీ (ప్రజాసేవ పార్టీ)గా రిజిస్టర్ చేయించుకున్నారని, ఆయన ఎన్నికల గుర్తు ఆటో అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతలోనే రక్తపోటులో తేడాలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో రజనీ చికిత్స పొందారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా రజనీకాంత్ తాను చెప్పినట్టుగానే డిసెంబర్ 31న కొత్త పార్టీ ప్రకటన చేస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒరిగిన రాజకీయ శిఖరాలు ఇద్దరూ ఇద్దరే.. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్స్. ఒకరు దేశ అత్యున్నత శిఖరాన్ని అధిరోహిస్తే, మరొకరు తెరవెనుక మంత్రాంగాన్ని నడిపారు. కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నాయకులు ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్‌లు ఈ ఏడాది కరోనాతో కన్ను మూశారు. ప్రణబ్‌కు ఆగస్టులో కరోనా పాజి టివ్‌గా నిర్ధారణ అయింది. తర్వాత ఆయన మెదడుకి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఆస్పత్రిలో సెప్టెంబర్ 1న ప్రణబ్ మరణించారు. కాంగ్రెస్‌లో సోనియా ఆంతరంగికుడు అహ్మద్ పటేల్ నవంబర్ 23న కన్ను మూశారు. నమస్తే ట్రంప్ భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో మైలురాయిలాంటి కార్యక్రమం ఈ ఏడాది ఆరంభం లోనే జరిగింది. హౌడీమోడీకి దీటుగా కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహించింది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకాతో కలిసి భారత పర్యటనకు వచ్చారు. ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ని సందర్శించారు. ఇరుదేశాల మధ్య 300 కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందం కుదిరింది. -
2020 మూవీ రివ్యూ: ఓటీటీలో హిట్టు, ఫట్టు ఇవే
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీని దెబ్బకు యావత్ ప్రపంచం చిగురుటాకులా వణికిపోయింది. అన్ని రంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు అయితే గట్టి దెబ్బ కొట్టింది. 2020లోకి ఎంటరైన మూడు నెలలకే సినిమా థీయేటర్లు మూతపడ్డాయి. దీంతో వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలు బేల చూపులు చూశాయి. దసరా, దీపావళి పండగలు బోసిగా వెళ్లిపోయాయి. ఇక లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జనాలు.. టీవీలో సీరియల్స్, సినిమాలు చూసి బోర్‌గా ఫీలయ్యారు. ఇలాంటి తరుణంలో కొత్త సినిమాలతో దూసుకువచ్చాయి ఓటీటీ వేదికలు. (చదవండి : కలిసిరాని 2020.. కళ తప్పిన ‘సినీ’ పండగ) అప్పటికే వెబ్ సిరీస్‌లతో వినోదాన్ని అందిస్తున్న ఓటీటీలు.. లాక్డౌన్ పుణ్యమా అని కొత్త సినిమాలను విడుదల చేసే చాన్స్ కొట్టేశాయి. ఇక థియేటర్లు మూతపడటంతో దర్శక- నిర్మాతలకు కూడా ఓటీటీ వేదికలు ఆపద్భావుడిలా కనిపించాయి. వడ్డీల భారం నుంచి బయట పడేందుకు నిర్మాతలకు సరైన మార్గం దొరికింది. తమ చిత్రాలను ప్రేక్షుల దగ్గరకు తీసుకెళ్లేందుకు ఓటీటీ వేదికలు ఉపయోగపడ్డాయి. అలా అన్ని భాషల చిత్రాలు ఓటీటీలో సందడి చేశాయి. తెలుగులో కూడా పలు చిత్రాలు ఓటీటీ వేదిక ద్వారా విడుదలై, ప్రేక్షకులను పలకరించాయి. అలా తెలుగులో ఓటీటీ వేదిక ద్వారా విడుదలైన చిత్రాలేవో, అవి ఎంతమేరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో.. సమగ్ర సమాచారం మీకోసం. ధైర్యం చేసిన ‘అమృతరామమ్’ లాక్డౌన్ సమయంలో ఓటీటీ వేదికగా విడుదలైన తొలి తెలుగు చిత్రం ‘అమృతరామమ్’.కొత్త దర్శకుడు సురేందర్ కొంటడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ మిట్టకంటి, అమితా రంగనాథ్ నటించారు. ఈ చిత్రం ఎప్రిల్ 29న జీ5 వేదికగా విడుదలైంది. యూత్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని రాబట్టలేకపోయింది. బెడిసికొట్టిన ‘మహానటి’ ప్రయోగం ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ నటించిన `పెంగ్విన్` జూన్ 19న అమేజాన్ ప్రైమ్‌లో వచ్చింది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈసినిమా ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తి ఓ బిడ్డకు తల్లిగా, గర్భంతో ఉన్న మహిళగా విలక్షణ పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఆమె ప్రయోగం ఫలించలేదు. వినోదాన్ని పంచడంలో విఫలమయింది. లీల చేసిన ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’ హీరో రానా సమర్పణలో సంజయ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’. ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమాలో సిద్దు జొన్నగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని నటించారు. రానా సమర్పించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగాయి. అయితే ఇది మరీ పెద్దగా హిట్ కాకపోయినా.. యూత్‌ని మాత్రం బాగా ఆకట్టుకుంది. మెప్పించిన ‘బానుమతి రామకృష్ణ’ల ప్రేమ నవీన్ చంద్ర, సలోని లుత్రా నటించిన ‘భానుమతి రామకృష్ణ’ సినిమా ‘ఆహా’ వేదికగా విడుదలైన యూత్‌ని మెప్పించింది. మెచ్యూరిటీ కలిగిన ప్రేమ కథతో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సత్యదేవ్ ఖాతాలో మరో హిట్ సత్యదేవ్ హీరోగా కంచరపాలేం ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రతీకారం, చిన్నచిన్న ఎమోషన్స్‌తో రూపొందిన ఈ సినిమాలో సత్యదేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ‘ఆహా’ను ఆదుకున్న ‘జోహార్’ ‘ఆహా’ లో రిలీజ్ అయినా మరో చిత్రం జోహార్. ప్రస్తుత రాజకీయాల ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకర్షించింది. స్వార్థ రాజకీయాల కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టి విగ్రహాలు ఏర్పాటు చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించాడు. మంచి లాభాలు తీసుకొచ్చింది విజయానికి దూరంగా ‘వి’ నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం సెప్టెంబర్ 5న భారీ అంచనాలతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. నాని 25వ సినిమా కావడం, తొలిసారి ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నటించడంతో అభిమానులో ఎన్నో అంచనాలు పెట్టుకొని సినిమా చూశారు. కానీ వారి అంచనాలు ‘వి’ అందుకోలేకపోయింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. ‘నిశ్శబ్ధం’గా వెళ్లిన అనుష్క అనుష్క శెట్టి, మాధవన్ జంటగా ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ తెరకెక్కించిన నిశ్శబ్ధం దారుణంగా నిరాశ పరిచింది. అమెరికాలో భారీగా రూపొందించిన ఈ చిత్రం అత్యంత దారుణంగా ఫ్లాప్ అయింది. నవ్వులు పూయించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా...’. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు కొండా విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కాసులు కురిపించిన ‘కలర్ ఫోటో’ ఆహాలో విడుదలైన ‘కలర్ ఫోటో’ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. సుహాస్, చాందిని చౌదరి జంటగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను నవ్వించి, కవ్వించి... చివర్లో అందరి చేత కంటతడి పెట్టించింది. ఈ చిత్రాన్ని సందీప్ రాజ్ తెరకెక్కించాడు. సునీల్ విలన్‌గా నటించాడు. ఆహాకు మంచి లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. మిస్‌ఫైర్ అయిన ‘మిస్ ఇండియా’ కీర్తి సురేష్ నుంచి వచ్చిన మరో ఓటిటి సినిమా మిస్ ఇండియా. నరేంద్ర నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ట్రోలింగ్ కూడా జరిగింది. అమెరికాలో ఛాయ్ అమ్మడం కాన్సెప్టు బాగున్నా స్క్రీన్ ప్లే లేకపోవడంతో తేలిపోయింది మిస్ ఇండియా. ‘గతం’మెరిసింది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా ‘గతం’. కొత్త దర్శకుడు కిరణ్ కొండమాడుగుల తెరకెక్కించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 6న విడుదలైంది. రిలీజ్ అయిన తర్వాత మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ పేరు తెచ్చుకుంది. ఇండియన్ పనోరమాకు ఈ చిత్రం ఎంపికైంది. హృదయానికి హత్తుకున్న‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కించిన సినిమా మిడిల్ క్లాస్ మెలొడీస్. నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ చిత్రానికి తొలిరోజే మంచి టాక్ వచ్చింది. పల్లెటూరు నుంచి గుంటూరు సిటీలో హోటల్ పెట్టుకోవాలనుకునే మధ్యతరగతి కుర్రాడి కథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. సూర్యకి హిట్ ఇచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ సూర్య హీరోగా సుధ కొంగర తెరకెక్కించిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సూర్యకు చాలా రోజుల తర్వాత వచ్చిన అద్భుతమైన విజయం ఇది. ‘డర్టీ హరి’కి యావరేజ్ టాక్ సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా మారిన చేసిన సినిమా డర్టీ హరి. ఎరోటిక్ సస్పెన్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ నటించారు. డిసెంబర్ 18న ఫ్రైడే మూవీస్ యాప్‌లో విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది.