Rewind 2020: Top 10 Crimes, Cyber, Cases, in India, In Telugu | AP, Telangana, Hyderabad - Sakshi
Sakshi News home page

2020: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేరాలు..

Published Wed, Dec 30 2020 8:48 AM | Last Updated on Wed, Dec 30 2020 7:52 PM

2020 Year Ender Top 10 Crime Incidents All Over India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ మహామ్మారి నేరాలపై కూడా ప్రభావం చూపింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే భారత్‌లో నేరాల సంఖ్య ఈ సంవత్సరం బాగా తగ్గింది. కరోనా కారణంగా ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడింది. కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా ఆయా రాష్ట్రాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు, రాత్రి కర్ఫ్యూలతో నేరాలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని నెలల పాటు వాహనాలు రోడ్లు ఎక్కకపోవటంతో రోడ్డు ప్రమాదాలు సైతం భారీగా తగ్గాయి. అయితే ప్రజలందరూ ఇళ్లకు పరిమితమవ్వటంతో గృహహింస బాగా పెరిగింది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ అన్‌లాక్‌ ప్రక్రియతో నేరాలు ఊపందుకున్నాయి. బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి మొదలుకుని ప్రముఖ జర్నలిస్ట్‌ ఆర్నబ్‌ గోస్వామి అరెస్ట్‌ వరకు కొన్ని నేరాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. 

2020లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాప్‌ 10 నేరాలు..

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం
ప్రముఖ బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14వ తేదీన ముంబై, బాంద్రాలోని తన గదిలో ఉరి వేసుకుని మరణించారు. మొదట అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సుశాంత్‌ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ అనుమానాలకు సుశాంత్‌ పోస్టుమార్టం రిపోర్టు తెరదించింది. అయితే సుశాంత్‌ను అతడి ప్రియురాలు రియాచక్రవర్తి ఆత్మహత్యకు ప్రేరేపించిందంటూ అతడి తండ్రి కేకే సింగ్‌ రియా, ఆమె కుటుంబంపై పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు అనేక మలుపులు తీసుకున్న సంగతి విధితమే. 


బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు 

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులకు ఇందులో డ్రగ్స్‌ కోణం ఉన్నట్లు తెలిసింది. టీవీ నటి వాట్సాప్‌ చాట్‌లు ఇందుకు బలాన్ని చేకూర్చాయి. దీంతో డ్రగ్స్‌ కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ప్రముఖ బాలీవుడ్‌ తారలు దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లను విచారించారు. రియా చక్రవర్తితోపాటు పలువుర్ని అరెస్ట్‌ చేశారు. 

హథ్రస్‌ దళిత యువతిపై అత్యాచారం, హత్య

సెప్టెంబర్‌ 14వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని హథ్రస్‌కు చెందిన ఓ దళిత యువతిపై ఆధిపత్య కులానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారాని తెగబడ్డారు. పొలంలో పనిచేసుకుంటున్న ఆమెపై సామూహిక అత్యాచారం జరిపి, నాలుక కోసి, వెన్నెముక విరిచేసి అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 29న ఆమె మృతి చెందింది.

గొర్రెకుంట బావిలో 9 శవాలు 

మే 21న తెలంగాణలోని వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని పాడుపడిన బావిలో తొమ్మిది మందిని వేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో భాగంగా మృతులందరి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు సంజయ్‌ వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేసి బావిలో పడేశాడు. ఓ మహిళ హత్యను కప్పి పుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌ మరో తొమ్మిది మందిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వరంగల్‌ ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్, సెషన్స్‌ కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది.

నంద్యాల ఫ్యామిలీ సెల్ఫీ సూసైడ్‌ 

ఆంధ్రప్రదేశ్‌, కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం (45), అతని భార్య నూర్జహాన్‌ (38), కుమారుడు దాదా ఖలందర్‌ (10), కూతురు సల్మా (14) నవంబర్‌ 3వ తేదీన గూడ్స్‌ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఆత్మహత్యకు ముందు వారు తీసుకున్న సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఎం జగన్‌ తక్షణ విచారణ జరిపించాల్సిందిగా డీజీపీ సవాంగ్‌ను ఆదేశించారు. దీంతో బెటాలియన్స్‌ ఐజీ శంకబ్రతబాగ్జి, గుంటూరు అడిషనల్‌ ఎస్పీ హఫీజ్‌ను విచారణాధికారులుగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు. నంద్యాల వన్‌టౌన్‌ సీఐ సోమశేఖర్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ కేసులో సీఐ సోమశేఖర్‌ రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ను అరెస్ట్‌ చేశారు.


బాయ్స్‌ లాకర్‌ రూం

ఢిల్లీలో కొందరు సంపన్న విద్యార్థులు ‘బాయ్స్‌ లాకర్‌ రూమ్’‌ పేరుతో ఇన్‌స్టాగ్రాం గ్రూప్‌ క్రియేట్‌ చేసి వికృత చర్యలకు పాల్పడ్డ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. గ్యాంగ్‌ రేప్‌ ఎలా చేయాలన్న దానిపై విద్యార్థులు చర్చించుకోవడమే కాకుండా, విచ్చలవిడిగా అశ్లీల చిత్రాలను షేర్‌ చేశారు. ఈ గ్రూప్‌లో కొందరు మైనర్లు కూడా ఉన్నారు. అయితే విషయం బయటకు పొక‍్కడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.  ఇందుకు సంబంధించి ఇద్దరు గ్రూప్‌ అడ్మిన్‌లను అరెస్ట్‌ చేశారు. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌పై ఢిల్లీ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.


కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు

కేరళ, తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు చెందిన పార్మిల్‌లో జూలై 4న 15 వేల కోట్ల రూపాయల విలువైన 30 కిలోల బంగారాన్ని విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ఆరోపణలు ఎదుర్కోవడంతో వీరిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.

ఢిల్లీ అల్లర్లు

ఫిబ్రవరి నెలలో దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో 53 మంది మరణించగా వందల సంఖ్యలో జనం గాయాలపాలయ్యారు. ముందస్తు కుట్ర ప్రకారమే ఈ అల్లర్లు చెలరేగాయని, ఈ కేసులో మొత్తం 21 మంది అనుమానితులను అరెస్ట్‌ చేయగా, వారిలో 15 మందిని నిందితులుగా పేర్కొంటూ వారి చేసిన నేరాలు ఏమిటో విఫులంగా వివరిస్తూ ఢిల్లీ పోలీసులు 17వేల పేజీల చార్జీ షీటును దాఖలు చేశారు.

బెంగళూరు అల్లర్లు 

ఆగస్టు నెలలో  కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు నవీన్‌ సోషల్‌ మీడియాలో ఓ కమ్యూనల్‌ పోస్టు షేర్‌ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన కొంతమంది వ్యక్తులు కావల్‌ బైరసంద్రలోని ఎమ్మెల్యే నివాసంపై దాడి చేశారు. అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టగా.. ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. అంతేగాక ఎమ్మెల్యే ఇంటి వద్ద పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది పట్ల కూడా నిరసనకారులు అనుచితంగా ప్రవర్తించారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను సైతం లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులో​కి తెచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన అల్లరి మూక పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో అనేక హెచ్చరికల అనంతరం కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. గాయపడిన మరొకరిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనలో 110 మందిని అరెస్ట్‌ చేశారు. 

అర్నబ్‌ గోస్వామి అరెస్ట్‌ 

ఓ డిజైనర్‌ ఆత్మహత్యకు పురికొల్పాలరనే ఆరోపణలతో గత నవంబర్‌ నెలలో ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్‌ గోస్వామిని ముంబై, రాయ్‌గడ్ పోలీసులు అరెస్టు చేశారు.  నవంబర్‌ 18 వరకు రాయిగఢ్‌ జిల్లా కోర్టు జ్యుడిషియల్‌ కస్టడి విధించింది. అంతకు క్రితం మధ్యంతర బెయిల్‌ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు  తిరస్కరించింది. దీంతో ఆర్నబ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయనతో సహా మరో ఇద్దరికి కూడా సుప్రీం కోర్టు  రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement