2020 Year Ender
-
ద్వితీయార్ధంలో ఖరీదైన గృహ విక్రయాల హవా
ముంబై, సాక్షి: రెసిడెన్షియల్ విభాగంలో ఈ కేలండర్ ఏడాది(2020) ద్వితీయార్ధంలో ఖరీదైన గృహ విక్రయాల హవా నమోదైంది. జులై-డిసెంబర్ మధ్య కాలంలో దేశీయంగా రూ. 50 లక్షల విలువకు పైబడిన ఇళ్ల అమ్మకాల వాటా 57 శాతాన్ని తాకింది. ఇదే సమయంలో అందుబాటు ధరల గృహ విక్రయాలు 43 శాతానికి పరిమితమయ్యాయి. ఇందుకు ప్రధానంగా కోవిడ్-19 కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ప్రభావం చూపినట్లు రియల్టీ రంగ విశ్లేషణ సంస్థ నైట్ ఫ్రాంక్ తెలియజేసింది. (రియల్టీ రంగానికి స్టీల్ షాక్) హైఎండ్‌లో ఈ ఏడాది విలాసవంత విభాగంలో గృహాల కొనుగోలుకి వినియోగదారులు అధిక ఆసక్తిని చూపినట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. మార్కెట్లో ప్రవేశించేందుకు 2020 అనుకూలమని అత్యధికులు భావించినట్లు తెలియజేసింది. దీనికితోడు ఆర్థికంగా పటిష్టస్థితిలో ఉన్న వర్గాలకు హౌసింగ్ రుణాల అందుబాటు తదితర అంశాలు జత కలసినట్లు వివరించింది. దీర్ఘకాలిక రుణ చెల్లింపుల సామర్థ్యం కలిగిన వ్యక్తులు గృహ కొనుగోళ్లకు ముందుకు వచ్చినట్లు అభిప్రాయపడింది. (కొత్త కారు కొనాలా? 10 నెలలు ఆగాల్సిందే!) హైదరాబాద్ టాప్ రెసిడెన్షియల్ విభాగంలో అధిక పరిమాణంలో అమ్మకాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలలో రియల్టీ కంపెనీలు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. ఈ విషయంలో త్రైమాసిక ప్రాతిపదికన ముంబై, పుణే 121 శాతం పురోగతిని చూపినట్లు పేర్కొంది. అయితే కొత్త ప్రాజెక్టులను ప్రవేశపెట్టడంలో హైదరాబాద్ 480 శాతం వృద్ధితో తొలి ర్యాంకులో నిలిచినట్లు పేర్కొంది. 2020 ద్వితీయార్థంలో మొత్తం 1,46,228 యూనిట్ల ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు తెలియజేసింది. అయితే ఇవి అంతక్రితం ఏడాదితో పోలిస్తే 34 శాతం తక్కువేనని తెలియజేసింది. -
2020: అయితే కరోనా మంచిదే..
లండన్: 2020 విచిత్రమైన సంవత్సరం. కరోనా సంవత్సరంగా పేరొందిన 2020లో ఎన్నో ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఊహించని విధంగా కరోనా విజృంభిస్తూ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అమలవడంతో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఎంతో మంది ఉపాధిని కూడా కోల్పోయారు. అయితే ఇంట్లో ఖాళీగా ఉండలేక కొంతమంది మహిళలు తమకు నచ్చిన కుట్లు, అల్లికలతో లాక్డౌన్లో వారిని వారు బిజీ చేసుకున్నారు. ఇక 2020 ముగియడంతో కొత్త ఆశలు, నూతన ఉత్తేజంతో 2021లోకి అడుగుతున్న పెడుతున్న సందర్భంగా బ్రిటన్‌కు చెందిన రచయిత, ఆర్టిస్టు జోసి జార్జ్ 2020లో లాక్డౌన్లో తను అల్లిన ఉలెన్ కండువాను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలా సరదాగా కోసం మొదలు పెట్టిన కండువా 2020 ముగిసేసరికి దాదాపు మూడు మీటర్ల పోడవు అయ్యిందంటూ ట్విటర్ వేదికగా ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: 650 అడుగులకొండపై నుంచి పడిపోయిన మహిళ..) Well here it is: 2020's weather. 3m, 732 rows (2 rows=1 day), 70,368 stitches, 1kg of wool. My small world and I have sat together every day; I witnessed its dramas and joys and it witnessed mine. Now I get to see this cycle play out all over again, all new. What a gift that is. pic.twitter.com/rxKEYxvKVU — Josie George (@porridgebrain) January 1, 2021 ‘2020 ముగిసింది. 3మీ, 732 వరుసలు (రోజుకు రెండు వరుసలు) 70,368 కుట్లు, ఒక కేజీ ఉలెన్. నా చిన్న ప్రపంచంలో ప్రతి రోజు రెండు వరుసలుగా అల్లుతూ 2020 చివరకు 3మీ చేశాను. రంగురంగులతో ఈ కండువాను అందంగా దిద్దితూ కండువాలో వస్తున్న మార్పులను చూసి మురిసిపోయాను. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే. ఇది నా సొంతం’ అంటూ జార్జ్ ట్వీట్ చేశారు. ఇక ఆమె ట్వీట్ చూసిన మహిళ నెటిజన్లు తాము కూడా లాక్డౌన్ ఇదే చేశామంటూ వారు అల్లిన ఉలెన్ స్వెటర్, తలగడ కవర్, కండువాలను పోస్టు చేస్తున్నారు. దీంతో కేవలం జార్జ్ ఒక్కరే కాకుండా ప్రపంచంలోని చాలా మంది మహిళలు లాక్డౌన్లో ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘బిజీ బిజీ లైఫ్ కారణంగా హస్తకళ నైపుణ్యాలను పక్కన పెట్టిన మహిళలకు కరోనా మళ్లీ కుట్లు, అల్లికలను గుర్తు చేసింది. కరోనా మంచిదే’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: 2020లో అతి జుగుప్సాకరమైన క్రైం ఇదే!) -
హైదరాబాదీలపై కరోనా దెబ్బ
రైల్వేస్టేషన్ అంటే రైళ్లు, ప్రయాణికులే కాదు. ఒక జీవన సముదాయం. లగేజీ మోసుకెళ్లే కూలీలు, ప్రయాణికులతో పరుగులు పెట్టే ఆటోవాలాలు, క్యాబ్ డ్రైవర్లు, పండ్లు అమ్ముకొనేవాళ్లు, చాయ్వాలాలు, స్నాక్స్ సెంటర్లు. ఇలా స్టేషన్ చుట్టూ ఎన్నో జీవితాలతో విస్తరించుకొని ఉంటుంది. కానీ కోవిడ్ సృష్టించిన విలయంలో ఎంతోమంది చిరువ్యాపారుల బతుకు బండి గతి తప్పింది. ఉపాధి కోల్పోయి దిక్కుతోచని దుస్థితిలో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: 2020లో కరోనా మహమ్మారితో నగరం ఆదాయం భారీగా కుప్పకూలింది. హైదరాబాద్‌లో 60 శాతానికి పైగా ప్రజలు తమ ఆదాయం కోల్పోయినట్టు ఇటీవల పైసాబజార్ సర్వే రిపోర్ట్ వెల్లడించింది. కరోనా వైరస్‌తో 2020 ఆదాయాలు ఎక్కువగా కోల్పోయి, లోన్ల రీపేమెంట్ కెపాసిటీ తగ్గిపోయిన నగరాల్లో ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు ముందంజలో ఉన్నట్లు చెప్పింది. ఆ తర్వాత ఎక్కువగా నష్టపోయింది హైదరాబాద్‌వాసులే అని తెలిపింది. టాప్ 6 మెట్రోల్లో చెన్నై అత్యంత తక్కువగా ప్రభావితమైందని వెల్లడించింది. 35 నగరాల నుంచి 24 ఏళ్ల నుంచి 57 ఏళ్ల మధ్య వయసున్న 8,500 మందికి పైగా కన్జూమర్లపై పైసాబజార్ డాట్ కామ్ ఈ సర్వే చేసింది. లక్ష రూపాయలు లేదా ఆపై అప్పు ఉన్న వారిని ఈ సర్వేలో లెక్కల్లోకి తీసుకున్నారు. సర్వే ప్రకారం, కరోనా లాక్డౌన్ ఆంక్షలతో 86 శాతానికి పైగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కస్టమర్లు ఆదాయాలను నష్టపోయారు. ఈ కరోనా మహమ్మారి కారణంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కస్టమర్లు తమ ఇన్కమ్లు జీరోగా ఉన్నట్టు చెప్పారు. శాలరీడ్ కస్టమర్లపైనా లాక్డౌన్ ప్రభావం బాగా చూపిందని సర్వే తెలిపింది. 56 శాతం మంది వేతన జీవుల జీతాలు కరోనా మహమ్మారితో ప్రభావితమైనట్లు సర్వే వెల్లడించింది. 12 శాతం మందికి ఉద్యోగాలు పోయాయి. వారికి ఎలాంటి ఆదాయ వనరు లేకుండా పోయిందని సర్వే తేల్చింది. -
నిఫ్టీ భళా- 2020కు రికార్డ్స్‌తో వీడ్కోలు
ముంబై, సాక్షి: భారీ ఆటుపోట్లను చవిచూసిన 2020 ఏడాదికి దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగింపు పలికాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 వణికించినప్పటికీ చెప్పుకోదగ్గ లాభాలతో నిలిచాయి. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే మార్కెట్లు 16 శాతం స్థాయిలో బలపడ్డాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 47,000 పాయింట్లను అధిగమించడంతోపాటు.. 48,000 మార్క్‌కు చేరువైంది. ఈ బాటలో నిఫ్టీ 14,000 పాయింట్ల మైలురాయిని దాటేసింది. ఈ ఏడాది కరోనా వైరస్ కల్లోలంతో ఫార్మా రంగం అత్యధికంగా 61 శాతం దూసుకెళ్లగా.. లాక్‌డవున్ నేపథ్యంలో కొత్త అవకాశాలతో ఐటీ 55 శాతం జంప్‌చేసింది. వెరసి ఇన్వెస్టర్లకు అత్యధిక రిటర్నులు అందించిన దిగ్గజాలలో దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ ముందునిలవగా.. ప్రయివేట్ రంగ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ వెనకడుగు వేసింది. ఇదేవిధంగా పీఎస్‌యూ బ్లూచిప్స్ ఐవోసీ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా సైతం డీలా పడ్డాయి. (తొలిసారి.. 14,000 మైలురాయికి నిఫ్టీ) నేటి ట్రేడింగ్ ఇలా డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ చివరి రోజు స్వల్ప ఒడిదొడుకుల మధ్య మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ నామమాత్రంగా 5 పాయింట్లు బలపడి 47,751 వద్ద నిలిచింది. నిఫ్టీ యథాతథంగా 13,982 వద్ద స్థిరపడింది. అయితే ఇంట్రాడేలో 47,897 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకోగా.. నిఫ్టీ 14,000 పాయింట్ల మైలురాయిని దాటేసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,602 వరకూ డీలా పడగా.. నిఫ్టీ 14,025-13,936 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2-0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,766 లాభపడగా.. 1,244 నష్టపోయాయి. 2020లో జోష్ ప్రధానంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీ ఊపందుకుంది. ఫలితంగా చౌకగా లభిస్తున్న ప్రపంచ పెట్టుబడులు స్టాక్ మార్కెట్లు, బంగారం, వెండి వంటి సాధనాలలోకి ప్రవహించాయి. ఫలితంగా యూఎస్‌తోపాటు భారత్ మార్కెట్లు కూడా చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. కోవిడ్-19 భయాలతో ఆగస్ట్‌లో న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 2,067 డాలర్ల వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో దేశీయంగానూ ఆగస్ట్‌లో పసిడి 10 గ్రాములు (ఎంసీఎక్స్) రూ. 57,100కు ఎగసింది. ఇది దేశీ బులియన్ మార్కెట్లోనే రికార్డ్‌కావడం విశేషం! (పసిడి తగ్గనుందా?.. ఇకపై కొనొచ్చా? ) రికవరీ ఆశలు కోవిడ్-19 సంక్షోభం నుంచి నెమ్మదిగా యూఎస్, చైనా, భారత్ వంటి దేశాలు బయటపడుతుండటంతో ఆర్థిక రికవరీపై అంచనాలు పెరిగాయి. ఇది సెంటిమెంటుకు బలాన్నిచ్చింది. దీనికితోడు కొన్ని ఎంపిక చేసిన రంగాలలో కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు సాధిస్తూ వచ్చాయి. ఇది ఇన్వెస్టర్లకు హుషారునిచ్చింది. వీటికి జతగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడులు, వివిధ వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షల పలితాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ప్రధానంగా గ్లోబల్ ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్లు జోష్‌నిచ్చాయి. దేశీయంగానూ భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్, జైడస్ క్యాడిలా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తదితర సంస్థలు వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీకి ఒప్పందాలు కుదుర్చుకోవడంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తూ వచ్చినట్లు విశ్లేషకులు వివరించారు. -
ఈ కొత్త కుబేరుడు- ఆసియాలోనే టాప్
న్యూఢిల్లీ, సాక్షి: ప్రస్తుత కేలండర్ ఏడాది(2020) చివర్లో కొత్త కుబేరుడు ఆవిర్భవించాడు. వ్యక్తిగత సంపద 77.8 బిలియన్ డాలర్లకు చేరడంతో చైనాకు చెందిన జాంగ్ షంషాన్ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచినట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా పేర్కొంది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టినట్లు తెలియజేసింది. ప్రస్తుతం ముకేశ్ వ్యక్తిగత సంపద 76.9 బిలియన్ డాలర్లుగా వెల్లడించింది. వెరసి జాంగ్ ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ ర్యాంకును పొందగా.. ముకేశ్ అంబానీ ఆ వెనుకే నిలిచినట్లు పేర్కొంది. ఇతర వివరాలు చూద్దాం.. చదవండి: (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) జాక్ మా.. 5వ ప్లేస్ ప్రయివేట్ బిలియనీర్ కావడంతో మీడియాలో తక్కువగా కనిపించే 66 ఏళ్ల జాంగ్ కెరీర్ జర్నలిజం, పుట్టగొడుగుల పెంపకం, ఆరోగ్య పరిరక్షణ రంగాలతో పెనవేసుకుంది. ఈ ఏడాదిలోనే జాంగ్ సంపద అత్యంత వేగంగా వృద్ధి చెందింది. 2020లో 70.9 బిలియన్ డాలర్ల సంపద జమయ్యింది. దీంతో జాంగ్ వ్యక్తిగత సంపద 77.8 బిలియన్ డాలర్లను తాకింది. ఇందుకు ప్రధానంగా వ్యాక్సిన్ తయారీ కంపెనీ బీజింగ్ వాంటాయ్ బయోలాజికల్ ఫార్మసీ ఎంటర్‌ప్రైజస్‌ను ఏప్రిల్‌లో లిస్టింగ్ చేయడం సహకరించింది. అంతేకాకుండా బాటిల్డ్ వాటర్ కంపెనీ నాంగ్ఫు స్ర్పింగ్ కంపెనీ హాంకాంగ్‌లో పబ్లిక్ ఇష్యూకి రావడం కూడా దీనికి జత కలసింది. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన వాంటాయ్ షేర్లు 2,000 శాతం దూసుకెళ్లగా.. నాంగ్ఫు షేర్లు సైతం 155 శాతంపైగా ర్యాలీ చేశాయి. దీంతో ఒక్క వాంటాయ్ కారణంగానే ఆగస్ట్‌కల్లా జాంగ్ సంపదకు 20 బిలియన్ డాలర్లు జమయ్యింది. వెరసి తొలిసారి చైనాయేతర దేశాలలోనూ జాంగ్ పేరు వినిపిస్తున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు సరదాగా వ్యాఖ్యానించారు. (2021: ముకేశ్ ఏం చేయనున్నారు?) ముకేశ్ స్పీడ్ నిజానికి 2020లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద సైతం వేగంగా బలపడింది. పెట్రోకెమికల్స్ తదితర డైవర్సిఫైడ్ బిజినెస్‌లు కలిగిన ఆర్ఐఎల్ను డిజిటల్, టెక్నాలజీ, ఈకామర్స్ దిగ్గజంగా రూపొందించడంతో ముకేశ్ సంపద 18.3 బిలియన్ డాలర్లమేర ఎగసింది. తాజాగా 76.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక దశలో అంటే ఈ ఏడాది జూన్‌కల్లా ఆర్ఐఎల్ గ్రూప్ షేర్ల పరుగు కారణంగా ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో నాలుగో ర్యాంకుకు సైతం చేరారు. కాగా.. ఇతర ఆసియా కుబేరుల్లో పిన్‌డ్యువోడ్యువో అధినేత కొలిన్ హువాంగ్ 63.1 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో మూడో ర్యాంకులో నిలిచారు. టెక్ దిగ్గజం టెన్సెంట్ చీఫ్ పోనీ మా 56 బిలియన్ డాలర్లతో తదుపరి స్థానాన్ని కైవసం చేసుకోగా.. ఈకామర్స్ దిగ్గజం అలీబాబా సహవ్యవస్థాపకుడు జాక్ మా 51.2 బలియన్ డాలర్లతో ఐదో ర్యాంకును పొందారు. జాక్ మాకు షాక్ చైనా నియంత్రణ సంస్థలు ఇటీవల యాంట్ గ్రూప్ సంస్థలపై యాంటీట్రస్ట్ నిబంధనల్లో భాగంగా దర్యాప్తును చేపట్టడంతో జాక్ మా సంపదకు సుమారు 10 బిలియన్ డాలర్లమేర చిల్లు పడింది. దీంతో సంపద రీత్యా జాక్ మా వెనకడుగు వేశారు. కాగా.. బాటిల్డ్ వాటర్ బిజినెస్‌లో మార్కెట్ లీడర్‌గా నిలుస్తున్న నాంగ్ఫు స్ప్రింగ్ పటిష్ట క్యాష్‌ఫ్లోలను సాధించగదని సిటీగ్రూప్ వేసిన అంచనాలు ఈ కంపెనీకి జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న వార్తలతో వాంటాయ్ షేరు సైతం జోరందుకున్నట్లు తెలియజేశారు. వెరసి జాంగ్ ఆసియా కుబేరుడిగా అవతరించినట్లు వివరించారు. -
2020: కన్నీటీ జ్ఞాపకాలు..
సాక్షి, హైదరాబాద్: ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకుని.. వేల ఆశలతో కొత్త సంవత్సరం 2020లోకి అడుగుపెట్టినా.. కంటికి కనిపించని ఓ శత్రువు చేసిన విలయానికి అన్ని వ్యవస్థలూ అస్తవ్యస్తమయ్యాయి. ఈ ఏడాది ఆరంభంలో మొదలైన ఈ నిశ్శబ్దయుద్ధంలో వేలాది చిరునవ్వులు చెదిరిపోయాయి. లక్షల బతుకులు తలకిందులయ్యాయి. మహమ్మారి కారణంగా మృతిచెందిన కుటుంబాల్లో విషాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. కడసారి చూపులకు నోచుకోకుండా కరోనా రక్కసి సంకెళ్లు వేసింది. ఇంటి నుంచి ‘నిలకడ’గానే ఆస్పత్రికి వెళ్లి.. అటు నుంచి అటే శ్మశానానికి తరలివెళ్లిన దయనీయ దృశ్యాలు ఇంకా కళ్లముందు నుంచి చెదిరిపోలేదు. బంధాలన్నీ చిగురుటాకుల్లా వణికిపోయాయి. వైరస్ బారిన పడి కోలుకున్న వారిలోనూ గాయాల తడి మాత్రం ఆరలేదు. ⇔ కోవిడ్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ ప్రకంపనలను సృష్టించింది. బాగా బతికిన మనుషులు రోడ్డున పడ్డారు. ఐటీ నిపుణులు ఇంటిబాట పట్టారు. పర్యాటక రంగం పడకేసింది. నెలల తరబడి మహానగరం స్తంభించింది. స్కూల్ టీచర్లు, ఆటోవాలాలు, క్యాబ్‌డ్రైవర్ల బతుకులు చితికిపోయాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు, సినిమా హాళ్లు మూతపడ్డాయి. వాటిని ఆశ్రయించుకొని బతికిన లక్షలాది మంది ఆకస్మాత్తుగా ఉపాధి కోల్పోయారు. ⇔ భవన నిర్మాణరంగం కుదేలైంది. వలస కార్మికులు రాష్ట్రాలను దాటుకొని నెత్తురోడిన కాళ్లతో సొంత ఊరికి తరలివెళ్లిన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేశాయి. 400 ఏళ్ల మహోన్నత చరిత్ర కలిగిన భాగ్యనగరంలో బహుశా ఈ శతాబ్దకాలంలో రెండో విషాదం ఇది. ⇔ నిజాం కాలంలో చుట్టుముట్టిన స్పానిష్ ఇన్‌ఫ్లుయెంజాతో జనం పిట్టల్లా రాలారు. అప్పటి నిజాం ప్రభుత్వం క్వారెంటైన్లు ఏర్పాటు చేసింది. ప్రాణాలను నిలుపుకొనేందుకు మాస్కులు, భౌతిక దూరం పాటించారు. వందేళ్ల తర్వాత తిరిగి కోవిడ్–19 కారణంగా తిరిగి అవే పరిస్థితులు పునరావృతమయ్యాయి. ఏం మిగిల్చింది ఈ ఏడాది ఒక భారమైన నిట్టూర్పు తప్ప. ⇔ ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే మరోవైపు.. పోగొట్టుకున్న చోటే తిరిగి వెదుక్కోవడం కూడా ఈ ఏడాది కనిపించింది. లాక్డౌన్ వల్ల స్కూళ్లు మూతపడ్డాయి. పాఠాలు చెప్పిన టీచర్లు టీస్టాళ్లు, కూరగాయల దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. మధ్యతరగతి వర్గాలు నిరుపేదలయ్యారు. చిరుద్యోగులు కూలీలయ్యారు. ఇవిగో ఆ కూలిన జీవన శిఖరాల గాథలు.. టీస్టాల్ నడుపుతున్నాను భరత్‌నగర్‌లోని ప్రైవేట్ స్కూల్లో 25 సంవత్సరాలుగా పీఈటీగా పనిచేస్తున్నాను. కరోనా వల్ల పాఠశాలలు మూతపడటంతో జీవితం ప్రశ్నార్థకమైంది. కుటుంబ పోషణ కోసం భరత్‌నగర్ కాలనీలోనే టీస్టాల్‌ను ప్రారంభించాను. ‘మిత్రుల సాయంతో టీస్టాల్ పెట్టుకున్నాను. బతకాలంటే ఏదో ఒకటి చేయాల్సిందే కదా. ఇప్పటి వరకు మా స్కూల్ మేనేజ్మెంట్ పలకరించలేదు. అప్పుడప్పుడు పిల్లలు కనిపిస్తారు. కబడ్డీ నేర్పించాలని అడుగుతారు. కానీ కోవిడ్ నిబంధనలు కదా..’ – పాపారావు, పీఈటీ మానసిక ఒత్తిడిలో పనిచేశాం వైరస్ వ్యాప్తి చెందిన తొలినాళ్లలో భయాందోళనకు గురయ్యాం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొన్నాం. వైద్య వృత్తిలో ఉంటూ భయపడితే ఎలా అనిపించింది. వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ బాధితులకు వైద్య సేవలు అందించాం. కోవిడ్ పాజిటివ్ ఉన్న గర్భిణులకు ప్రసవం చేయడంతోపాటు, కడుపులో ఉన్న శిశువుకు వైరస్ సోకకుండా తల్లీబిడ్డలను ప్రాణాలతో కాపాడాం. – నీలాబాయి, గాంధీ ఆస్పత్రి హెడ్‌నర్సు అప్పుల పాలయ్యాం కరోనాతో వైద్య రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఆరు నెలలుగా ఆసుపత్రిని మూసివేశాం. సిబ్బంది వేతనాలు, నిర్వహణ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆసుపత్రిని తెరుస్తున్నా.. రోగులు భయంతో రావడంలేదు. ఇంకా అప్పులు మిగిలి ఉన్నాయి. – డాక్టర్ చంద్రమోహన్, రాజేశ్వరీ నర్సింగ్ హోం, హయత్‌నగర్ కుటుంబ పోషణ కష్టంగా ఉంది మాదాపూర్‌లోని గూగుల్ కంపెనీలో క్యాబ్ కాంట్రాక్ట్‌కు ఇచ్చాను. కోవిడ్‌తో జీవితం తలకిందులైంది. సాఫ్ట్వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చాయి. క్యాబ్ ఒప్పందం రద్దయింది. కానీ ప్రతి నెలా రూ.15 వేలు ఈఎంఐ కట్టాల్సిందే కదా. ఇప్పుడు ఆ ఫైనాన్స్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. కుటుంబాన్ని పోషించడం ఇబ్బందిగా ఉంది. ఒక దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నాను. కారు రుణం ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు. – రామ్మోహన్ గౌడ్, క్యాబ్ డ్రైవర్, పాపిరెడ్డి కాలనీ కరోనాతో తీవ్రంగా నష్టపోయాం రవాణా వ్యవస్థ, పాఠశాలలు మూతపడటంతో అప్పులు తీవ్రమయ్యాయి. ఫైనాన్స్‌లో తీసుకొచ్చిన ఆటో, కార్లు నడవకపోవడంతో డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నాం. కరోనా లాక్‌డౌన్‌తో మా వాహనాలు గ్యారేజ్‌కే పరిమితమయ్యాయి. పలు పాఠశాలలు, ప్రైవేటు ట్రావెల్స్‌కు మా వాహనాలు నడపకపోవడంతో తీవ్రంగా నష్టపోయాం. ఫైనాన్స్, చిట్టీల డబ్బులు కట్టకపోవడంతో నిర్వాహకులు డబ్బులు చెల్లించమంటూ ఒత్తిడి తెస్తున్నారు. – రమేశ్, ట్రావెల్స్ నిర్వాహకుడు, ఉప్పుగూడ అనాథ ఆశ్రమాలు దయనీయం కరోనాతో అనాథాశ్రమంలో ఉండే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాతలు ముందుకు రావడం లేదు. ఆరు నెలల నుంచి ఆశ్రమం కిరాయి కూడా చెల్లించలేదు. చాలా కష్టంగా ఉంది. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం. కానీ ఎలాంటి స్పందన లభించడం లేదు. ఇప్పటికే చాలా ఆశ్రమాలు మూతపడ్డాయి. – డి.రాఘవేంద్ర, వాత్సల్యం వాలంటరీ ఆర్గనైజేషన్ ఫౌండర్ -
కారును ఆపి.. కాక రేపి..!
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు 2020 సంవత్సరం నేర్పిన పాఠమిది. తిరుగులేదనుకున్న టీఆర్ఎస్కు ఏడాది చివర్లో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. దుబ్బాక మింగుడుపడని చేదు అనుభవాన్ని మిగల్చగా... ‘గ్రేటర్’షాకిచ్చింది. మరోవైపు బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగగలుగుతామనే ఆత్మవిశ్వాసాన్ని మెండుగా ఇచ్చింది. దుబ్బాకలో అనూహ్య విజయం, గ్రేటర్లో మంచి ప్రదర్శన బీజేపీ శ్రేణుల్లో నయా జోష్ నింపాయి. మాటల తూటాలు, మహామహుల ప్రచారంతో ఏడాది చివర్లో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఈ ఏడాదిలో వరుస ఓటములు, వలసలతో మరింత డీలా పడిపోయింది. మరోవైపు కాంగ్రెస్ ‘మార్కు’అంతర్గత కుమ్ములాటలు... వెరసి ఎటుపోతోందో తెలియని స్థితిలో ఉంది. - సాక్షి, హైదరాబాద్ టీఆర్ఎస్ దూకుడుకు దుబ్బాక బ్రేక్ టీఆర్ఎస్కు 2020 సంవత్సరం మిశ్రమ అనుభూతులను మిగిల్చింది. మున్సిపల్ ఎన్నికలు టీఆర్ఎస్ బలాన్ని చాటగా... ఏడాది చివరిలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు అందని రీతిలో టీఆర్ఎస్ ఏకపక్ష విజయాలు సాధించింది. 122 మున్సిపాలిటీలతో పాటు పది మున్సిపల్ కార్పొరేషన్లలో టీఆర్ఎస్ పాగా వేసింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో జరిగిన సహకార ఎన్నికల్లో రాష్ట్రంలోని 9 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు అన్నీ టీఆర్ఎస్ ఖాతాలోనే చేరాయి. ఇక టీఆర్ఎస్ శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఈ ఏడాది నవంబర్‌లో దుబ్బాక ఉపఎన్నిక జరిగింది. రామలింగారెడ్డి భార్య సుజాత టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు వేయికి పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇది నాలుగో అసెంబ్లీ ఉప ఎన్నిక కాగా, టీఆర్ఎస్ తొలిసారిగా ఓటమి పాలైంది. ఈ ఏడాది చివరలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ మిశ్రమ ఫలితాన్ని సాధించింది. 150 డివిజన్లకు గాను 56 చోట్ల మాత్రమే గెలుపొందింది. గట్టి ఎదురుదెబ్బ తగిలినా.. అతిపెద్ద పార్టీగా అవతరించడం కాస్తలోకాస్త ఊరట. (చదవండి: రివైండ్ 2020: పరిశోధన ఆగలేదు!) నిజామాబాద్ నుంచి మండలికి కవిత లాక్డౌన్ కారణంగా వాయిదాపడ్డ నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరిగాయి. మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మొత్తం 824 ఓట్లకు గాను... 728 ఓట్లు సాధించి భారీ మెజారిటీతో మండలిలో అడుగుపెట్టారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న గరికపాటి మోహన్‌రావు, కేవీపీ రామచంద్రరావుల పదవీ కాలం ముగియడంతో ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర కోటాలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టీఆర్ఎస్ తరపున పార్టీ సెక్రటరీ జనరల్ డాక్టర్ కె.కేశవరావు వరుసగా రెండో పర్యాయం, ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన కేఆర్ సురేశ్‌రెడ్డి ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. శాసనమండలికి గవర్నర్ కోటాలో ముగ్గురిని నామినేట్ చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఈ ఏడాది నవంబర్‌లో తీర్మానం చేసింది. ప్రజా కవి గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, బోగారపు దయానంద్ గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా నియమితులయ్యారు. నవంబర్ 28న ఎల్బీ స్టేడియంలో జరిగిన గ్రేటర్ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్... డిసెంబర్ 10న సిద్దిపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించి ఆందోళనల్లో పాల్గొంది. ఇవి మినహా 2020లో కరోనా కారణంగా పార్టీపరంగా పెద్దగా కార్యక్రమాలేవీ లేవు. కమలంలో కొత్త ‘జోష్’ ఈ ఏడాది రాజకీయంగా రాష్ట్ర బీజేపీకి బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా ఏడాది చివర్లో జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయాలు ఆ పార్టీకి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. ఈ ఏడాదిలోనే రాష్ట్ర పార్టీలో సంస్థాగత మార్పులు కూడా జరగడం, వెంటనే మంచి విజయాలు రావడంతో కమలనాథుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన బండి సంజయ్ పార్టీలో ఊపు తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన మాజీ మంత్రి డి.కె.అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి హోదా దక్కగా, గత అధ్యక్షుడు డాక్టర్. కె.లక్ష్మణ్‌కు ఓబీసీ సెల్ జాతీయ చైర్మన్ పదవి దక్కింది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న కమలం పార్టీ నేతలు 2020 ఇచ్చిన ఉత్సాహంతో 2021కి సిద్ధమవుతూ... 2023లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామనే ధీమాతో ఉన్నారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత తెలంగాణపైనే బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టిందనే చర్చ కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లపై కమలదళం గురిపెట్టి పనిచేస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ అనుకూల ఫలితాలే రావడం.... తెలంగాణలో కూడా సానుకూల ఫలితాలు వస్తుండటంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో పెద్ద రాజకీయ శక్తిగా అవతరిస్తామనే ధీమా రాష్ట్ర బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్: వరుస ఓటములు, వలసలు కాంగ్రెస్ పార్టీకి 2020 సంవత్సరం కూడా చేదు అనుభవాలనే మిగిల్చింది. గత ఆరేళ్లుగా చెప్పుకోదగ్గ విజయాలు లేక అల్లాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాదిలో మరింత నష్టాన్ని చవిచూసింది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా పోగొట్టుకోగా, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమనే పేరును కూడా కోల్పోయే స్థాయిలో 2020లో కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. పార్టీ నుంచి వలసలు కూడా ఆగకుండా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలతో పాటు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న విజయశాంతి కూడా బీజేపీలో చేరారు. గంపెడాశలు పెట్టుకుని రాష్ట్ర బలగమంతా పనిచేసిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో వచ్చిన ఫలితం ఓ రకంగా కాంగ్రెస్‌ను కుదేలు చేసింది. అక్కడ ద్వితీయ స్థానం పోయింది... డిపాజిట్ కూడా రాలేదు. అధికార టీఆర్ఎస్ను ఓడించి మరీ బీజేపీ గెలవడం రాజకీయ సమీకరణాలను బాగా ప్రభావితం చేసేదే. ఈ ఎన్నిక అయిపోగానే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కనీసం 20 స్థానాల్లో అయినా గెలుపొందుతామని ఆశించినా కేవలం రెండు స్థానాలకే పరిమితం కావడం, మరోవైపు బీజేపీ ఏకంగా 48 చోట్ల విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. ఇక, టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామక వ్యవహారం ఈ ఏడాది కూడా తేలకపోగా, ఈ పదవి పేరుతో జరుగుతున్న అంతర్గత కలహాలు, పరిణామాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతల్లో అసంతృప్తి లేకుండా ఉండేందుకు గాను కమిటీల పేరుతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ పరిస్థితుల్లో కొత్త ఏడాదిలో జరిగే వరుస ఎన్నికలపైనా కాంగ్రెస్ శ్రేణులకు బెంగ పట్టుకుంది. జూమ్ వేదికగా ‘లెఫ్ట్’.. కమ్యూనిస్టుపార్టీలు అనగానే ప్రజా సమస్యలపై ఆందోళనలు, నిరసనలు నిర్వహించే రాజకీయపక్షాలుగా ఎన్నో ఏళ్లుగా గుర్తింపు పొందాయి. అయితే ఈ ఏడాది కరోనా మూలంగా లెఫ్ట్ పార్టీలు సీపీఎం, సీపీఐ సైతం ఆన్లైన్ బాటపట్టాయి. క్షేత్రస్థాయిలో పోరాడుతూనే... జూమ్‌లో గళం వినిపించాయి. సీపీఎం ఆధ్వర్యంలోనూ వివిధ సమస్యలపై ఆందోళనలు, నిరసనలతో పాటు జూమ్ యాప్ ద్వారా కార్యక్రమాలు, పార్టీపరంగా సమావేశాలు నిర్వహించింది. ఆన్లైన్ సమావేశాలు, జూమ్ కాన్ఫరెన్స్‌లు, మీడియా సమావేశాలు మొదలు అగ్రనేతల స్మారకోపన్యాసాలు, నిరసన సభలు, రౌండ్‌టేబుల్ సమావేశాలు వంటివి ఈ రెండుపార్టీలు నిర్వహించాయి. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయచట్టాలు, విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో రైతుసంఘాలు చేపట్టిన ఉద్యమానికి సంఘీభావంగా ఇక్కడా రాష్ట్రంలోనూ ఈ రెండుపార్టీలు నెలరోజులకు పైగా వివిధ రూపాల్లో నిరసన, ఆందోళనా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి ముందే సీపీఐ రాష్ట్రపార్టీ నిర్మాణ మహాసభలను పూర్తిచేసుకుంది. పార్టీ కేంద్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో వివిధ నిరసనలతో పాటు రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా 29 డివిజన్లలో పోటీచేసినా అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయి నిరాశాజనకమైన ఫలితాలను సాధించాయి. -
ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌లు!
2020 సంవత్సరానికి నేటితో తెరపడనుంది.. కరోనా.. క్వారంటైన్.. భౌతిక దూరం.. మాస్క్.. వ్యాక్సిన్.. ఈ మాటలతోనే ఏడాది మొత్తం గడచిపోయింది.. మహమ్మారి కారణంగా ప్రపంచం స్తంభించిపోయిన మాట నిజమే అయినప్పటికీ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ప్రగతి మాత్రం ఆగలేదు.. 2020లో మన శాస్త్రవేత్తలు సాధించిందేమిటో ఒక్కసారి చూద్దామా.. – సాక్షి, హైదరాబాద్ 1 రికార్డు సమయంలోవ్యాక్సిన్! మానవ చరిత్రలో అత్యంత వేగంగా ఓ వ్యాధికి టీకాను అభివృద్ధి చేయడం ఈ సంవత్సరమే నమోదైంది. కరోనా వ్యాధి నివారణకు ప్రపంచం నలుమూలల్లోని శాస్త్రవేత్తల బృందాలు టీకా తయారీని ప్రారంభించాయి. టీకా అభివృద్ధిలో కీలకమైన మూడు దశల మానవ ప్రయోగాలను పూర్తి చేసుకుని అత్యవసర వినియోగానికైనా వ్యాక్సిన్ సిద్ధమవడం ఈ ఏటి మేటి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విజయంగా చెప్పుకోవచ్చు. 2 ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌లు! దశాబ్దాలుగా మనం ప్రకృతిలో పోగేసిన ప్లాస్టిక్ కాలుష్యాన్ని వెదజల్లుతూనే ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఈ ఏడాది యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్మౌత్, ఇతర వర్సిటీల శాస్త్రవేత్తలు కలసికట్టుగా ఓ సూపర్ ఎంజైమ్‌ను అభివృద్ధి చేశారు. జపాన్‌లో కొన్నేళ్ల క్రితం ప్లాస్టిక్‌ను తినేసే బ్యాక్టీరియా ఒకదాన్ని గుర్తించగా దాని ఎంజైమ్‌కు మరోదాన్ని కలపడం ద్వారా సూపర్ ఎంజైమ్ తయారైంది. ప్లాస్టిక్ బాటిళ్లను ఈ ఎంజైమ్ కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రాథమిక రసాయనాలుగా విడదీయగలదు. వీటితో మళ్లీ మనకు అవసరమైన ప్లాస్టిక్ బాటిళ్లను తయారు చేసుకునే వీలుంది. (చదవండి: 2020.. కలలు కల్లలు) 3 అందరి చూపు.. మళ్లీ జాబిల్లి వైపు.. చంద్రుడిపై నీరున్న విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ మరోసారి నిరూపించింది. చంద్రయాన్ ద్వారా నీటి ఉనికి గతంలోనే స్పష్టమైనప్పటికీ ఉపరితలంపై కూడా నీరుందని ప్రకటించడం తాజా విశేషం.. అయితే ఇక్కడున్న నీరు అతి తక్కువ. నాసా ప్రయోగించిన సోఫియా అనే అంతరిక్ష శోధక వ్యవస్థ చంద్రుడి దక్షిణార్థ గోళంలోని అతిపెద్ద లోయ ‘క్లావియస్ క్రేటర్’ఉపరితలంలోని మట్టిలో నీటి అణువులు నిక్షిప్తమై ఉన్నట్లు గుర్తించింది. ఈ క్లావియస్ క్రేటర్‌ను భూమ్మీద నుంచి కూడా చూడవచ్చు.. 4 అంతరిక్షంలో ముల్లంగి పంట.. నాసా తొలిసారి విజయవంతంగా అంతరిక్షంలో వ్యవసాయాన్ని చేపట్టి పూర్తి చేసింది. కేట్ రూబిల్స్ అనే వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని అడ్వాన్స్డ్ ప్లాంట్ హాబిటాట్‌లో 20 ముల్లంగి మొక్కలను పెంచగలిగారు. వచ్చే ఏడాది భూమ్మీదకు రానున్న కేట్ రూబిన్స్ ద్వారా ఈ అపురూపమైన అంతరిక్ష ముల్లంగిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 5 వైఫై, సిగ్నళ్లు లేని చోటా ఇంటర్నెట్! ఎంతటి కఠిన పరిస్థితులున్నా ప్రపంచంలోని ప్రతి మూలకూ ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చేందుకు టెస్లా కార్ల కంపెనీ యజమాని ఈలాన్ మస్క్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది మొదలుపెట్టి రానున్న కొన్ని దశాబ్దాల్లో అంతరిక్షంలోకి సుమారు 42 వేల ఉపగ్రహాలను పంపేందుకు ఉద్దేశించిన స్టార్ లింక్ ప్రాజెక్టు కొన్ని నెలల క్రితమే మొదలైంది. వైఫై లేని చోట, సిగ్నళ్లు అందని చోట కూడా ఈ ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ అందుతుంది. (చదవండి: ఒక వైరస్... ఒక 36...) 6 కృత్రిమ మేధ పదునెక్కుతోంది! కృత్రిమ మేధతో సాధ్యమయ్యే అద్భుతాల్లో కొన్ని ఈ ఏడాది ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ‘కృత్రిమ మేధతో మానవాళికి ప్రమాదం’అన్న వ్యాఖ్యను తిప్పికొడుతూ 500 పదాల వ్యాసం రాయమని జీపీటీ–3 అనే పేరున్న న్యూరల్ నెట్వర్క్కి పురమాయిస్తే.. అది ఏకంగా 12 వ్యాసాలు రాసేసింది. కృత్రిమ మేధ మానవ వికాసానికి ఎలా ఉపయోగపడుతుందో వేర్వేరు ఉపమానాలు, ఉదాహరణలతో అది వర్ణించడం విశేషం.. అలాగే ఈ ఏడాది వ్యాధుల చికిత్స అవసరమైన కొత్త రసాయన మూలకాలను గుర్తించడంలోనూ కృత్రిమ మేధ అక్కరకొస్తోంది. 7 క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ముందుకు.. ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ 2020లో ఇంకో అడుగు దగ్గరైంది. సైకమోర్ క్వాంటమ్ ప్రాసెసర్ ద్వారా తాము సాధారణ కంప్యూటర్ కంటే ఎంతో మెరుగ్గా పనిచేసే క్వాంటమ్ కంప్యూటర్ ఇప్పటికే సిద్ధం చేశామని గూగుల్ ప్రకటించింది. సాధారణ కంప్యూటర్లు పది వేల సంవత్సరాల్లో పూర్తి చేయగల పనిని ఈ కంప్యూటర్ కేవలం మూడు నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేయడం విశేషం. 8 వయసు తగ్గించే వైద్యం! నిత్య యవ్వనమన్న మనిషి ఆశ ఇప్పట్లో నెరవేరే అవకాశం దాదాపుగా లేకపోయినప్పటికీ 2020లో వృద్ధాప్య సమస్యలను తగ్గించగలిగే కొత్త మందులు మాత్రం ఆవిష్కృతమయ్యాయి. రక్తపోటుకు ఉపయోగించే ఓ మందు కణాల శక్తి కేంద్రాలైన మైటోకాండ్రియా పనితీరును నియంత్రించి వయసు పెరగకుండా చేస్తూంటే.. వయసుతో పాటు వచ్చే మెదడు సంబంధిత సమస్యలను చక్కదిద్దేందుకు ఇంకో మందును కంపెనీలు సిద్ధం చేశాయి. -
2020 క్రీడలు: ఒక వైరస్... ఒక 36...
ప్రతీ ఏటా క్రీడల క్యాలెండర్... ఫలితాలు, రికార్డులు, అవార్డులు, పురస్కారాలతో కనిపించేది. చాంపియన్ల విజయగర్జనతో, దిగ్గజాల మైలురాళ్లతో, ఆటకే వన్నెతెచ్చిన ఆణిముత్యాల నిష్క్రమణలతో ముగిసేది. కానీ ఈ ఏడాది మాత్రం కంటికి కనిపించని వైరస్ క్రీడల క్యాలెండర్‌ను కలవరపెట్టింది. కరోనా కాలం క్రీడలకు కష్టకాలాన్నే మిగిల్చింది. టోక్యో ఒలింపిక్స్, యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలాంటి మెగా ఈవెంట్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ను ఆపేసింది. మరెన్నో క్రీడలను రద్దు చేసింది. ప్రేక్షకుల్ని మైదానానికి రాకుండా చేసింది. కొత్తగా ‘బయో బబుల్’ను పరిచయం చేసింది. ఒకవైపు కరోనా కల్లోలం కొనసాగుతుండగా... మరోవైపు ఫార్ములావన్‌లో హామిల్టన్ రయ్‌మంటూ దూసుకెళ్లాడు. 15 ఏళ్ల తర్వాత బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టాడు. ఎవ్వరూ ఊహించని విధంగా భారత క్రికెట్ జట్టు 36కే ఆలౌటై షాక్ ఇచ్చింది. మొత్తానికి 2020 కొందరికి తీపి గుర్తులు, మరికొందరికి చేదు గుళికల్ని పంచివెళ్లింది. అవేంటో చూద్దాం...! –సాక్షి క్రీడా విభాగం మహాబలుడు మళ్లీ వచ్చాడు! అమెరికా బాక్సింగ్ యోధుడు, ప్రపంచ హెవీవెయిట్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ మళ్లీ రింగ్‌లో దిగేందుకు ‘సై’ అన్నాడు. 15 ఏళ్ల తర్వాత పంచ్ విసిరేందుకు కసరత్తులు కూడా చేశాడు. 54 ఏళ్ల వయసులో ప్రత్యర్థి రాయ్ జోన్స్ జూనియర్‌తో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో తలపడ్డాడు. త్వరలో హోలీఫీల్డ్‌తో టైసన్ ఢీకొట్టేందుకు అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. దిగ్గజాలను తీసుకెళ్లింది... ఈ ఏడాది... క్రీడాభిమానులను దుఃఖసాగరంలో ముంచింది. ఆయా క్రీడలకు తమ ఆటతీరుతో, అలుపెరగని పోరాటంతో వన్నె తెచ్చిన దిగ్గజాలను తీసుకెళ్లింది. అమెరికాను ఊపేసే నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లో సూపర్ స్టార్ హోదా పొందిన కోబీ బ్రయాంట్ తన అభిమానులతో శాశ్వత సెలవు తీసుకున్నాడు. హెలికాప్టర్ ప్రమాదంలో బ్రయాంట్‌తోపాటు అతని 13 ఏళ్ల కుమార్తె దుర్మరణం పాలైంది. ఇది ఈ సంవత్సరం క్రీడాలోకంలో పెను విషాదంగా నిలిచింది. అలాగే ఫుట్‌బాల్ మాంత్రికుడు, అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా మరణం క్రీడాలోకాన్ని శోకంలో ముంచింది. గుండెపోటుతో అతను మృతి చెందాడు. భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్, అలనాటి ఫుట్‌బాల్ మేటి పీకే బెనర్జీ, చున్నీ గోస్వామి ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. క్రికెట్లో చేతన్ చౌహాన్, రాజిందర్ గోయెల్, ఆస్ట్రేలియన్ డీన్ జోన్స్‌లు అనారోగ్యంతో 2020లో తనువు చాలించారు. ‘రికార్డు’ల హామిల్టన్ మార్చి 15న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో మొదలవ్వాల్సిన ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌కు కరోనా అంతరాయం కలిగించింది. 22 రేసులున్న ఎఫ్1 సీజన్‌ను చివరకు 17 రేసులకు కుదించారు. ప్రేక్షకులకు ప్రవేశం లేకుండా రేసులను నిర్వహించారు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకొని ఏడోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మైకేల్ షుమాకర్ (జర్మనీ) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. అంతేకాకుండా ఎఫ్1లో అత్యధిక రేసుల్లో గెలిచిన డ్రైవర్‌గా షుమాకర్ (91) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ (95) తిరగరాశాడు. ఆన్లైన్లో ఎత్తులు... కరోనా మహమ్మారి పలు క్రీడా టోర్నమెంట్లపై ప్రభావం చూపినా మేధో క్రీడ చెస్ మాత్రం కొత్త ఎత్తులకు ఎదిగింది. ముఖాముఖి టోర్నీలకు బ్రేక్ పడినా ఆన్లైన్లో నిరాటంకంగా టోర్నీలు జరిగాయి. తొలిసారి ఆన్లైన్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు రష్యాతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. భారత్, రష్యా మధ్య ఫైనల్ కీలకదశలో ఉన్నపుడు సాంకేతిక సమస్య తలెత్తడంతో నిర్వాహకులు రెండు జట్లను విజేతగా ప్రకటించారు. చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో తెలుగు తేజాలు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక సభ్యులుగా ఉన్నారు. ఆన్లైన్లోనే జరిగిన ప్రపంచ యూత్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు నిహాల్ సరీన్, గుకేశ్, రక్షిత స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ అలరించింది ఈ ఏడాదిలో తొలి మూడు నెలలు క్రికెట్ సాగినా... ఆ తర్వాత కరోనా వైరస్‌తో బ్రేక్ వచ్చింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఐదోసారి విశ్వవిజేతగా నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలిసారి ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరోవైపు కరోనా వైరస్‌తో భారత్‌లో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ మధ్యలోనే ఆగిపోయింది. కరోనా తీవ్రరూపం దాల్చడంతో దాదాపు నాలుగు నెలలు క్రికెట్ ఆట సాగలేదు. జూలై చివరి వారంలో ఇంగ్లండ్–వెస్టిండీస్ జట్ల మధ్య ‘బయో బబుల్’ వాతావరణంలో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ మొదలైంది. ప్రతీ ఏటా వేసవిలో వినోదాన్ని పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీ కరోనా కారణంగా ఆలస్యమైంది. ఒకదశలో ఈ టోర్నీ జరుగుతుందా లేదా అనే అనుమానం కలిగినా... చివరకు ఐపీఎల్ భారత్ దాటింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ‘బయో బబుల్’ వాతావరణంలో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 13వ సీజన్ నిరాటంకంగా సాగింది. ముంబై ఇండియన్స్ జట్టు ఐదోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆగస్టు 15న ఎమ్మెస్ ధోని హఠాత్తుగా క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అదే రోజున సురేశ్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్ ముగిశాక భారత జట్టు దుబాయ్ నుంచి నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అడిలైడ్ వేదికగా జరిగిన డే–నైట్ తొలి టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే ఆలౌటై తమ టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరును నమోదు చేసి ఓటమి పాలైంది. అయితే మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకొని 2020 ఏడాదిని ఘనంగా ముగించింది. ఫెడరర్...నాదల్ 20–20 ఈ 2020 ఏడాది ఇద్దరు టెన్నిస్ సూపర్స్టార్ల టైటిళ్ల సంఖ్యను ట్వంటీ–ట్వంటీగా సమం చేసింది. స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియన్ ఓపెన్ (2018)తో 20వ టైటిల్ సాధించాడు. ఇతనికి సరైనోడు... సమఉజ్జీ అని టెన్నిస్ ప్రపంచం ప్రశంసలందుకున్న రాఫెల్ నాదల్ దీనికి న్యాయం చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్‌తో ఈ స్పానిష్ లెజెండ్ కూడా 20వ టైటిల్‌తో ఫెడరర్ సరసన నిలిచాడు. ఇలా ఈ ఆల్‌టైమ్ గ్రేట్ స్టార్స్ ఇపుడు 20–20 స్టార్స్ అయ్యారు. కరోనా కారణంగా ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు మాత్రమే జరిగాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ విజేతగా నిలువగా... కరోనా దెబ్బకు 1945 తర్వాత వింబుల్డన్ టోర్నమెంట్‌ను నిర్వాహకులు తొలిసారి రద్దు చేశారు. ప్రేక్షకులు లేకుండా యూఎస్ ఓపెన్‌ను నిర్వహించగా... ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ విజేతగా నిలిచి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. సెప్టెంబర్‌కు వాయిదా పడిన ఫ్రెంచ్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ తన ఆధిపత్యం చాటుకొని 13వసారి చాంపియన్‌గా నిలిచాడు. యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా తాను కొట్టిన బంతి లైన్ అంపైర్‌కు తగలడంతో సస్పెన్షన్‌కు గురైన సెర్బియా స్టార్ జొకోవిచ్ ఆరోసారి సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించాడు. పీట్ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. -
మ్యాజికల్ కాదు... ట్రాజికల్
2020.... మ్యాజికల్ నంబర్... కానీ మ్యాజిక్ జరగలేదు సినిమా రిలీజ్ నంబర్ తగ్గించేసింది. వసూళ్ల నంబర్ పడిపోయింది సినీ కార్మికులకు ఉపాధి లేకుండా చేసింది షూటింగులు లేక స్టూడియోలు వెలవెలబోయేలా చేసింది గాన గంధర్వుడిని, విలక్షణ నటులను తీసుకెళ్లిపోయింది మొత్తం మీద ‘మ్యాజికల్ ఇయర్’ కాదు.. ‘ట్రాజికల్ ఇయర్’గా మిగిలిపోయింది. పెద్ద పెద్ద విషాదాల్లో చిన్న చిన్న సంతోషాలూ ఉంటాయి. అలా కొన్ని ఆనందకరమైన సంఘటనలూ ఉన్నాయి. 2020.. 12 నెలలు... రౌండప్ వేద్దాం. జనవరి: ఈ నెలలో సుమారు 12 సినిమాల వరకూ రిలీజయ్యాయి. సంక్రాంతికి విడుదలైన మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ పెద్ద విజయాలు నమోదు చేసుకున్నాయి. ఇంకా విడుదలైన చిత్రాల్లో రవితేజ ‘డిస్కో రాజా’, కల్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’, నాగశౌర్య ‘అశ్వథ్థామ’ వంటివి ఉన్నాయి. ♦ నిర్మాత మండల్‌రెడ్డి కొండల్‌రెడ్డి 29న మృతి చెందారు. ఫిబ్రవరి: ఈ నెల 16 సినిమాలు రిలీజయ్యాయి. నితిన్ ‘భీష్మ’ సూపర్ హిట్ టాక్‌తో వసూళ్లను కొల్లగొట్టింది. శర్వానంద్ ‘జాను’, విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో పాటు విశ్వక్సేన్ ‘హిట్’ తదితర చిత్రాలు తెరకొచ్చాయి. ♦19న ‘ఇండియన్ 2’ సెట్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. మార్చి: ఈ నెల 15 నుంచి థియేటర్స్‌ను మూసేశారు. 15వ తేదీ వరకూ 7 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘పలాస 1978’ మంచి ప్రశంసలు అందుకుంది. ‘ఓ పిట్ట కథ’, ‘మద’ వంటి చిత్రాలు రిలీజయ్యాయి. ∙12న ‘పరుగు’ ఫేమ్ షీలా వివాహం వ్యాపారవేత్త సంతోష్ రెడ్డితో జరిగింది. ♦సినిమా చిత్రీకరణలన్నీ నిలిచిపోయిన నెల ఇది. ♦8న నిర్మాత సి. వెంకటరాజు కన్నుమూశారు. ఏప్రిల్: ∙జీ5లో ‘అమృతరామమ్’ విడుదలైంది. ఓటీటీలో విడుదలైన తొలి తెలుగు చిత్రమిది. ♦14న రచయిత సీయస్ రావ్ మృతి చెందారు. మే: ♦ ఈ నెల 10న ‘దిల్’ రాజు వివాహం వైఘాతో జరిగింది. ♦14న హీరో నిఖిల్ పెళ్లి పల్లవి వర్మతో జరిగింది. జూన్: కీర్తీ సురేశ్ నటించిన ‘పెంగ్విన్’ ప్రైమ్‌లో విడుదలైంది. సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఆహాలో, సత్యదేవ్ ‘47 డేస్’ జీ5లో విడుదలయ్యాయి. ♦కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో సినిమా చిత్రీకరణలు జరుపుకోవచ్చని ప్రభుత్వం అనుమతిచ్చింది. జూలై: ♦ ఈ నెల 26న నితిన్–షాలినీ వివాహం జరిగింది ♦ సత్యదేవ్ ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య’, నవీన్ చంద్ర ‘భానుమతి రామకష్ణ’ చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ♦ 5న ఈతరం ఫిలింస్ బ్యానర్ సమర్పకుడు, నిర్మాత పోకూరి బాబురావు సోదరుడు పోకూరి రామారావు, 26న నిర్మాత కందేపి సత్యనారాయణ, 28న నటుడు, రచయిత రావికొండలరావు కన్నుమూశారు. ఆగస్ట్: ♦ 8వ తేదీ రానా, మిహికా వివాహం జరిగింది ♦ దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి మరియు వారి కుటుంబ సభ్యులు, నటి జెనీలియా కోవిడ్ బారినపడ్డారు. ♦ ప్రముఖ గాయకుడు వంగపండు ప్రసాదరావు 4న తుది శ్వాస విడిచారు. సెప్టెంబర్: ∙నాని, సుధీర్‌బాబు ‘వి’ అమెజాన్ ద్వారా విడుదలైంది. ఓటీటీలో విడుదలైన తొలి పెద్ద తెలుగు సినిమా ఇదే. ♦ ఈ నెల తెలుగు సినిమాల చిత్రీకరణలు ప్రారంభం అయ్యాయి. ♦ ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, నటుడు నాగబాబు కరోనా బారిన పడ్డారు ♦ 8న ప్రముఖ నటులు జయప్రకాశ్ రెడ్డి మరణించారు. ♦ సీనియర్ నటి పొట్నూరి సీతాదేవి 21న కన్నుమూశారు. ♦ 23న నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి చెందారు. ♦ 25న గాన గాంధర్వుడు యస్పీ బాలసుబ్రహ్మణ్యం తిరిగి రాని లోకాలకు వెళ్లారు. అక్టోబర్: లాక్‌డౌన్‌కి ముందు విడుదల కావాల్సిన అనుష్క ‘నిశ్శబ్దం’ వాయిదా పడుతూ అక్టోబర్‌లో ఓటీటీలో విడుదలైంది. రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’, క్యారెక్టర్ నటుడు సుహాస్ లీడ్ రోల్ చేసిన ‘కలర్ ఫొటో’ చిత్రాలూ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ♦ 7న నిర్మాత బూరుగుపల్లి బప్పిరాజు కన్నుమూశారు. ♦ లాక్డౌన్ తర్వాత తెలుగు నుంచి విదేశాలు వెళ్లిన తొలి సినిమా ప్రభాస్ ‘రాధేశ్యామ్’. ఇటలీలో ఓ భారీ షెడ్యూల్ కోసం ఈ టీమ్ అక్కడికి వెళ్లింది ♦ కాజల్ అగర్వాల్ ఏడడుగులు నడిచిన తేదీ అక్టోబర్ 30. స్నేహితుడు గౌతమ్ కిచ్లుతో వెడ్లాక్లోకి ఎంటరయ్యారు ఈ బ్యూటీ ♦ ‘నేను పాజిటివ్’ అంటూ ఈ నెల మొదటి వారంలో తమన్నా చెప్పారు. కొన్ని రోజులకే కరోనా పాజిటివ్ నుంచి బయటపడి, నెగటివ్ అయ్యారు ♦ 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లు తెరవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. నవంబర్: ఈ నెల ఆరు ఓటీటీ రిలీజులను చూసింది. పెద్ద సినిమా సూర్య ‘ఆకాశం నీ హద్దు రా’ విడుదలై, మంచి సినిమాగా నిలిచింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ఆకట్టుకుంది. ‘మిస్ ఇండియా’గా కీర్తీ సురేశ్ వచ్చారు. ‘మా వింత గాథ వినుమా’, ‘అనగనగా ఓ అతిథి’ చిత్రాలు రిలీజయ్యాయి. విడుదలైన చిన్న సినిమాల్లో ‘గతం’ వచ్చే ఏడాది జనవరిలో గోవాలో జరగనున్న చిత్రోత్సవాల్లో ఇండియన్ పనోరమ విభాగంలో ప్రదర్శితం కానుంది. ఈ విభాగంలో ప్రదర్శితం కానున్న ఏకైక తెలుగు చిత్రం ‘గతం’. ♦ ఈ నెల 5న ఎడిటర్ కోలా భాస్కర్ చనిపోయారు. ♦ అక్టోబర్‌లో రాజశేఖర్, జీవిత, వారి పిల్లలు శివాని, శివాత్మిక కరోనా బారిన పడ్డారు. జీవిత, పిల్లలు కోలుకోగా రాజశేఖర్ కొన్నాళ్ల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. నవంబర్‌లో కోలుకుని రాజశేఖర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ♦ చిరంజీవికి ‘పాజిటివ్’ అనే వార్త ఈ నెలలో మెగాభిమానులను కలవరపెట్టింది. అయితే రిజల్ట్ తేడాగా వచ్చిందని, తనకు కరోనా లేదని ఆ తర్వాత చిరంజీవి ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డిసెంబర్: ♦ ఈ నెల 4న తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌ను ఓపెన్ చేశారు. హాలీవుడ్ మూవీ ‘టెనెట్’తో థియేటర్స్ తెర్చుకున్నాయి. ఆ తర్వాత ‘కరోనా వైరస్, మర్డర్’ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. థియేటర్స్‌లో విడుదలైన పెద్ద సినిమా సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ♦ డిసెంబర్ 9న నిహారిక వివాహం జరిగింది ♦ హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ చిత్రీకరణలో పాల్గొంటున్న రజనీకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి, కోలుకున్నాక చెన్నై వెళ్లారు ♦ రకుల్ ప్రీత్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్ కోవిడ్ బారినపడ్డారు ♦ 21న పంపిణీదారుడు అడుసుమిల్లి సాంబశివరావు, 25న దర్శకుడు ఓఎస్సార్ ఆంజనేయులు, 28న ఏఆర్ రెహమాన్ తల్లి కరీమా బేగమ్ మృతి చెందారు. 2020తో కలుపుకుని గడచిన పదేళ్లలో తక్కువ సినిమాలు చూపించిన సంవత్సరం ఇదే. ఈ ఏడాది విడుదలైన సినిమాలు మొత్తం 65. వాటిలో 50 స్ట్రయిట్ కాగా, 15 డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. స్ట్రయిట్ చిత్రాలు, అనువాద చిత్రాలు కలుపుకుని 2011లో 243, 2012లో 224, 2013లో 270, 2014లో 276, 2015లో 245, 2016లో 266, 2017లో 245, 2018లో 228, 2019లో 269, 2020లో 65 చిత్రాలు రిలీజయ్యాయి. -
చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2020
రివాజుగా వచ్చి సజావుగా ముగిసిపోయే అన్ని సంవత్సరాల్లా కాకుండా రాబోయే అనేక తరాలు గుర్తు పెట్టుకునేవిధంగా చేదు జ్ఞాపకాలను మిగిల్చి వెళ్తోంది 2020. మానవాళి చరిత్రలో ఎన్నో విషాద అధ్యాయాలున్నాయి. 536లో ఉన్నట్టుండి బద్దలై ఒకేసారి ఆకాశంలో కోట్లాది టన్నుల బూడిదను వెదజల్లి యూరప్, పశ్చిమాసియా, ఆసియాల్లో 18 నెలలపాటు దట్టమైన చీకట్లు మిగిల్చి సుదూరతీరాల్లో సైతం కరువుకాటకాలకు కారణమైన ఐస్లాండ్ అగ్నిపర్వత విస్ఫోటనం... 541లో ఈజిప్ట్‌లో పుట్టుకొచ్చి తూర్పు రోమన్ సామ్రాజ్యంలో మూడోవంతుమందిని పొట్టనబెట్టుకున్న బ్యూబోనిక్ ప్లేగు...1348లో యూరప్‌లో విరుచుకుపడి ఆ ఖండంలోని 40 శాతం జనాభాను మింగిన బ్లాక్ డెత్... దాదాపు 5 కోట్లమంది ప్రాణాలు హరించిన 1918నాటి స్పానిష్ ఫ్లూ... ఇలా చరిత్ర నిండా విషాద ఘట్టాలు ఎన్నో వున్నాయి. వాటితో పోలిస్తే కరోనా మహమ్మారి సృష్టించిన మారణకాండ చిన్నగానే కనబడొచ్చు. కానీ భూగోళం నలుమూలలా విస్తరించి 8 కోట్ల 25 లక్షల మందికిపైగా ప్రజానీకానికి సోకి, దాదాపు 18 లక్షలమందిని పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి వీరంగం చిన్నదేం కాదు. దాని దెబ్బకు అగ్రరాజ్యాలనుకున్నవే విలవిల్లాడాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తలకిందులయ్యాయి. సమాచార సాధనాలు అందుబాటులోకొచ్చినందువల్ల ముందు జాగ్రత్త చర్యలపై మెజారిటీ జనాభాకు తక్కువ సమయంలో అవగాహన ఏర్పడింది. శాస్త్ర విజ్ఞానం విస్తరించటం, పరిశోధనలు వేగం పుంజుకోవటం కారణంగా అనుకున్నకన్నా చాలాముందే... ఏడాది చివరిలో వ్యాక్సిన్లు రూపొందాయి. వీటి ప్రభావం ఏమేరకుంటుందనేది నిగ్గు తేలటానికి మరి కొంత కాలం పడుతుంది. కానీ జనాభాలో 70 శాతంమందికి టీకాలు వేస్తే తప్ప దీని వ్యాప్తిని నియంత్రించలేమని శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు బెంబేలెత్తిస్తు్తన్నాయి. ఇదంతా పూర్తికావటానికి మూడేళ్లయినా పడుతుంది. ఒకపక్క టీకాల ప్రక్రియ మొదలైన తరుణంలోనే వైరస్ కొత్త వేషంతో, మరింత శక్తిమంతంగా మారి దాడికి సిద్ధమవుతోంది. కరోనా వైరస్ కాలచక్రాన్ని వెనక్కి తిప్పింది. మాస్క్ ధరించటంతో మొదలుపెట్టి ఎన్నిటినో అల వాటుచేసింది. ఒకప్పుడు ఊహకైనా అందని ఉత్పాతాలకు కారణమైంది. అల్లర్లు జరిగే ప్రాంతాల్లో మాత్రమే విధించే కర్ఫ్యూ లాక్డౌన్ పేరిట దేశవ్యాప్తంగా రాత్రింబగళ్లు అమలైంది. జనవరి 30న కేరళలో తొలి కరోనా కేసు నమోదు కాగా... ఇంతవరకూ దేశంలో కోటి మూడు లక్షలమందికి అది సోకింది. 1,48,503మంది మరణించారు. మార్చి 24న 21 రోజులపాటు అమలు చేస్తామంటూ విధించిన లాక్డౌన్ అంచెలంచెలుగా 68 రోజులపాటు కొనసాగింది. రెక్కల కష్టం నమ్ముకున్నవారికి, చేతిలో విద్య వున్నవారికి సాపాటుకు లోటేమిటన్న పాత నమ్మకం పల్టీలు కొట్టింది. గ్రామసీమల నుంచి పొట్టచేతబట్టుకుని నగరాలు, పట్టణాలకు వలస వెళ్లటం మాత్రమే తెలిసిన అట్టడుగు జీవులు... అక్కడ ఉపాధి కోల్పోయి, రోజులతరబడి తిండీ నీళ్లు దొరక్క... చివరకు తలదాచుకోవటా నికి గూడు కూడా కరువై సొంత ఊళ్లకు లక్షలాదిగా నడకదారిపట్టారు. మండుటెండల్లో, నడి రాత్రుళ్లలో గర్భిణులతో, చిన్న చిన్న పిల్లలతో, వృద్ధులతో వారంతా వేలాది కిలోమీటర్లు నడిచి పోతున్న దృశ్యాలు కొన్ని నెలలపాటు చానెళ్లలో నిరంతరాయంగా కనబడి అందరినీ కలచివేశాయి. ఈ క్రమంలో ఆకలికి తాళలేక, నడిచే సత్తువ లేక మరణించిన అభాగ్యులెందరో, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినవారెందరో కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కల్లేవు. మే 8న నడకతో అలసి మహారాష్ట్రలోని జల్నా వద్ద పట్టాలపై విశ్రమించిన 17మంది వలసజీవులు రైలు చక్రాలకిందపడి కన్నుమూశారు. లాక్డౌన్ ప్రభావంతో దెబ్బతిన్న అనేక రంగాలు ఇప్పటికీ కోలుకోలేదు. ఉపాధి కోల్పోయిన దాదాపు కోటిమంది బతుకు ఇంకా అగమ్యగోచరమే. ఏదో రకమైన కొలువు చేస్తున్నవారిని కూడా అభద్రత వెన్నాడుతోంది. కిందికి దిగుతున్నట్టే కనబడిన దారిద్య్ర రేఖ కరోనా అనంతర పరిస్థితుల్లో పైపైకి ఎగబాకుతోంది. అర్ధాకలితో కాలం వెళ్లదీయక తప్పనివారి సంఖ్య హెచ్చింది. మన దేశంలో సామాజిక భద్రత ఎంత నాసిరకంగా వుందో, కోట్లాదిమంది ప్రభుత్వ సాయం పొందటానికి కూడా వీల్లేని నిస్సహాయ స్థితిలో ఎలా బతుకీడుస్తున్నారో కరోనా బయటపెట్టింది. ముఖ్యంగా ప్రజా వైద్య రంగం ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. సరిపడా సిబ్బంది లేక, వచ్చిపడుతున్న రోగులకు వైద్య సేవలు అందించలేక సర్కారీ ఆసుపత్రులు సతమతమయ్యాయి. ఎప్పుడూ ఊహకు కూడా అందని ఆన్లైన్ చదువులు రివాజుగా మారాయి. సంక్షోభ సమయాలు మనుషుల్లో నిద్రాణమైవున్న శక్తిసామర్థ్యాలను వెలికి తీస్తాయంటారు. వ్యక్తులుగా ఈ కష్టకాలంలో తోటి మనిషికి అండగా నిలిచి ఆదుకున్నవారు అసంఖ్యాకంగా వున్నారు. నిరంతరాయంగా సేవలందించిన అనేకానేక స్వచ్ఛంద సంస్థలు కూడా వున్నాయి. లక్షలాదిమంది వైద్యులు, ఇతర సిబ్బంది, వివిధ ప్రభుత్వ విభాగాల్లోని సిబ్బంది విధి నిర్వహణను ఉద్యోగంగా కాక, కర్తవ్యంగా భావించారు. రోజుల తరబడి కుటుంబాలకు కూడా దూరమై విధుల్లో నిమగ్న మయ్యారు. ఇంతమంది సమష్టి కృషి కారణంగానే మన దేశం ఇప్పటికైతే తక్కువ నష్టాలతో గట్టెక్కగలిగింది. కానీ కరోనా మహమ్మారి విషయంలో అప్రమత్తంగా వుండకతప్పదని, ఈ పోరు మున్ముందు కూడా కొనసాగటం ఎంతో అవసరమని తాజా పరిణామాలు తెలియజెబుతున్నాయి. మాంద్యం చుట్టుముట్టి, ఉపాధి కరువై, పైపైకి ఎగబాకుతున్న ధరలతో సాధారణ పౌరులు సతమత మవుతున్న వేళ నిరాశానిస్పృహలు ఆవరించిన మాట వాస్తవమే. కానీ కాలం పుటల్లో ఒదిగిపోతున్న ఈ ఏడాది నేర్పించిన గుణపాఠాలతో కొత్త సంవత్సరంలో అప్రమత్తంగా మెలగటం, అక్కడెదు రయ్యే సవాళ్లకు సన్నద్ధమై, వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం తప్పనిసరి. అప్పుడే మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుంది. -
2020 ఇండియన్ బెస్ట్ గాడ్జెట్ అవార్డు నామినిస్
ఈ కేలండర్ 2020 ఏడాదిలో ప్రపంచ దేశాలను కోవిడ్-19 వణికించినప్పటికీ మొబైల్ పారిశ్రామిక రంగలో మొదట్లో కొంచెం ఒడి దుడుకులు ఏర్పడినప్పటికీ తర్వాత తిరిగి పుంజుకుంది. దేశం నాలుగు నెలలు పాటు లాక్డౌన్ లో ఉన్నప్పటికీ కంపెనీలు త్వరగా తిరిగి పుంజుకున్నాయి. 2020 ఏర్పడిన అన్ని అడ్డంకులను టెక్నాలజీ సహాయంతో చాలా వరకు ఎదుర్కొన్నాము. గాడ్జెట్ల సహాయంతో జాతీయ, అంతర్జాతీయ సమాచారంతో పాటు గేమ్స్, వినోదాన్ని ప్రజలు ఆస్వాదించారు. లాక్డౌన్ సమయంలో టెక్నాలజీ గాడ్జెట్లు చాలా ముఖ్య పాత్ర పోషించాయి. దేశంలో చాలా వరకు కంపెనీలు మూసివేయబడ్డాయి. కొన్ని కర్మాగారాలు సగం సామర్థ్యంతో పనిచేసాయి. ఐటీ ఇండస్ట్రీ చెందిన చాలా ఉద్యోగులు టెక్నాలజీ పుణ్యమా అని ఇంటి నుండే పని చేస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత టెక్నాలజీ రంగంలో మళ్లీ కొత్త ఆవిష్కరణలు మొదలయ్యాయి. కరోనా ప్రభావం తర్వాత టెక్నాలజీ రంగం చాలా వేగంగా పుంజుకుంది. ప్రతి రోజు స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ కన్సోల్లు, హెడ్ఫోన్లు వంటివి ఎన్నో మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ ఏడాది చాలా గాడ్జెట్లు మార్కెట్ లోకి ఇప్పుడు కొన్ని 2020 ఇండియన్ గాడ్జెట్ అవార్డు కింద ఎంపిక అయ్యాయి. వాటిలో కొన్ని మీకోసం. 2020 బెస్ట్ గాడ్జెట్ నామినిస్ శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్ M1 ఆపిల్ ఐఫోన్ 12 మినీ ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్ Xbox సిరీస్ X సోనీ WH-1000XM4 -
2020: ఎఫ్‌పీఐల పెట్టుబడుల స్పీడ్
ముంబై, సాక్షి: ఈ కేలండర్ ఏడాది(2020)లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) నుంచి దేశీ క్యాపిటల్ మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయి. ప్రధానంగా ఈక్విటీలలో ఇప్పటివరకూ 22.6 బిలియన్ డాలర్లు ప్రవహించాయి. ఇవి 2019లో నమోదైన 14.23 బిలియన్ డాలర్లతో పోలిస్తే 58 శాతం అధికంకావడం విశేషం! తద్వారా వర్ధమాన మార్కెట్లలో అత్యధిక ఎఫ్‌పీఐల పెట్టుబడులను ఆకట్టుకున్న దేశంగా చైనా తదుపరి భారత్ నిలిచింది. ఇప్పటివరకూ చైనాకు 104 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలి వెళ్లాయి. అయితే 2019లో చైనా ఆకట్టుకున్న 132.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి 21 శాతానికిపైగా తక్కువకావడం గమనార్హం! కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రూపొందించిన గణాంకాలివి. కాగా.. 2019లో 4.4 కోట్ల బిలియన్ డాలర్లను ఆకట్టుకున్న రష్యా 2020లో మరింత అధికంగా 12.25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టింది. తద్వారా మూడో ర్యాంకులో నిలిచింది. చదవండి: (2021: ముకేశ్ ఏం చేయనున్నారు?) ఏప్రిల్ నుంచీ జోరు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ రెండో వారంవరకూ చూస్తే దేశీ ఈక్విటీలలోకి రూ. 2 లక్షల కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు ప్రవహించాయి. వీటిలో ఫైనాన్షియల్ సర్వీసుల రంగం రూ. 63,000 కోట్లను ఆకట్టుకోగా.. రూ. 47,000 కోట్ల పెట్టుబడులతో బ్యాంకింగ్ అగ్రభాగాన నిలిచింది. కోవిడ్-19 కారణంగా నిజానికి ఏప్రిల్, మే నెలల్లో ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా నిలిచారు. అయితే నవంబర్‌లో గత 12 ఏళ్లలోలేని విధంగా 8.1 బిలియన్ డాలర్లను ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేశారు. ఇదే నెలలో భారత్ తదుపరి బ్రెజిల్(6.2 బిలియన్ డాలర్లు), దక్షిణ కొరియా(5.2 బిలియన్ డాలర్లు), తైవాన్(4.5 బిలియన్ డాలర్లు) జాబితాలో చేరాయి. ఇక డిసెంబర్‌లోనూ ఇప్పటివరకూ దేశీ ఈక్విటీలలోకి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించడం ప్రస్తావించదగ్గ అంశం! 80 శాతం జూమ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ కల్లోలంతో మార్చిలో స్టాక్ మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే. తదుపరి పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడంతో విదేశీ పెట్టుబడులు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ 75 శాతానికిపైగా ర్యాలీ చేసి సరికొత్త గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 47,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 14,000 పాయింట్లవైపు చూస్తోంది. ఈ బాటలో ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 81 శాతం దూసుకెళ్లి 31,000 సమీపానికి చేరింది. ఫలితంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ 80 శాతం స్థాయిలో ఎగశాయి. చదవండి: (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) చైనా వెనకడుగు ఈ ఏడాది(2020)లో చైనా, హాంకాంగ్‌ల నుంచి ప్రయివేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ నిధులు భారీగా క్షీణించాయి. ఈ రెండు ప్రాంతాల నుంచి దేశానికి తరలివచ్చిన పెట్టుబడులు 2019తో పోలిస్తే 72 శాతం పడిపోయాయి. 95.2 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాదిలో 340 కోట్ల డాలర్ల పెట్టుబడులు లభించాయి. వెంచర్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం మెయిన్‌ల్యాండ్ చైనా నుంచి 64 శాతం తక్కువగా 37.7 కోట్ల డాలర్లు, హాంకాంగ్ నుంచి 75 శాతం తక్కువగా 57.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. కాగా.. చైనీస్ సంస్థలు దేశీయంగా ఇన్వెస్ట్ చేసేందుకు దాఖలు చేసిన 150 అప్లకేషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు ఖైటాన్ అండ్ కో తెలియజేసింది. పెట్టుబడులు తగ్గడానికి ప్రధానంగా ప్రెస్ నోట్3 నిబంధనలు కారణమైనట్లు లా సంస్థ ఖైటాన్ అభిప్రాయపడింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్‌లో ప్రభుత్వం పీఎన్3ను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారం భారత్‌తో సరిహద్దు కలిగిన విదేశీ సంస్థలు ప్రభుత్వ అనుమతితోనే ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుందని తెలియజేసింది. -
2020: సంచలనం సృష్టించిన టాప్ 10 నేరాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహామ్మారి నేరాలపై కూడా ప్రభావం చూపింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే భారత్‌లో నేరాల సంఖ్య ఈ సంవత్సరం బాగా తగ్గింది. కరోనా కారణంగా ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడింది. కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్లో భాగంగా ఆయా రాష్ట్రాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు, రాత్రి కర్ఫ్యూలతో నేరాలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని నెలల పాటు వాహనాలు రోడ్లు ఎక్కకపోవటంతో రోడ్డు ప్రమాదాలు సైతం భారీగా తగ్గాయి. అయితే ప్రజలందరూ ఇళ్లకు పరిమితమవ్వటంతో గృహహింస బాగా పెరిగింది. ఆ తర్వాత లాక్డౌన్ అన్‌లాక్ ప్రక్రియతో నేరాలు ఊపందుకున్నాయి. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి మొదలుకుని ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి అరెస్ట్ వరకు కొన్ని నేరాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. 2020లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాప్ 10 నేరాలు.. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన ముంబై, బాంద్రాలోని తన గదిలో ఉరి వేసుకుని మరణించారు. మొదట అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సుశాంత్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ అనుమానాలకు సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టు తెరదించింది. అయితే సుశాంత్‌ను అతడి ప్రియురాలు రియాచక్రవర్తి ఆత్మహత్యకు ప్రేరేపించిందంటూ అతడి తండ్రి కేకే సింగ్ రియా, ఆమె కుటుంబంపై పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు అనేక మలుపులు తీసుకున్న సంగతి విధితమే. బాలీవుడ్ డ్రగ్స్ కేసు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులకు ఇందులో డ్రగ్స్ కోణం ఉన్నట్లు తెలిసింది. టీవీ నటి వాట్సాప్ చాట్లు ఇందుకు బలాన్ని చేకూర్చాయి. దీంతో డ్రగ్స్ కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ప్రముఖ బాలీవుడ్ తారలు దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌లను విచారించారు. రియా చక్రవర్తితోపాటు పలువుర్ని అరెస్ట్ చేశారు. హథ్రస్ దళిత యువతిపై అత్యాచారం, హత్య సెప్టెంబర్ 14వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని హథ్రస్కు చెందిన ఓ దళిత యువతిపై ఆధిపత్య కులానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారాని తెగబడ్డారు. పొలంలో పనిచేసుకుంటున్న ఆమెపై సామూహిక అత్యాచారం జరిపి, నాలుక కోసి, వెన్నెముక విరిచేసి అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న ఆమె మృతి చెందింది. గొర్రెకుంట బావిలో 9 శవాలు మే 21న తెలంగాణలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని పాడుపడిన బావిలో తొమ్మిది మందిని వేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో భాగంగా మృతులందరి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు సంజయ్ వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేసి బావిలో పడేశాడు. ఓ మహిళ హత్యను కప్పి పుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ మరో తొమ్మిది మందిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వరంగల్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది. నంద్యాల ఫ్యామిలీ సెల్ఫీ సూసైడ్ ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం (45), అతని భార్య నూర్జహాన్ (38), కుమారుడు దాదా ఖలందర్ (10), కూతురు సల్మా (14) నవంబర్ 3వ తేదీన గూడ్స్ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఆత్మహత్యకు ముందు వారు తీసుకున్న సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఎం జగన్ తక్షణ విచారణ జరిపించాల్సిందిగా డీజీపీ సవాంగ్‌ను ఆదేశించారు. దీంతో బెటాలియన్స్ ఐజీ శంకబ్రతబాగ్జి, గుంటూరు అడిషనల్ ఎస్పీ హఫీజ్‌ను విచారణాధికారులుగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు. నంద్యాల వన్‌టౌన్ సీఐ సోమశేఖర్‌ను సస్పెండ్ చేశారు. ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను అరెస్ట్ చేశారు. బాయ్స్ లాకర్ రూం ఢిల్లీలో కొందరు సంపన్న విద్యార్థులు ‘బాయ్స్ లాకర్ రూమ్’ పేరుతో ఇన్స్టాగ్రాం గ్రూప్ క్రియేట్ చేసి వికృత చర్యలకు పాల్పడ్డ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. గ్యాంగ్ రేప్ ఎలా చేయాలన్న దానిపై విద్యార్థులు చర్చించుకోవడమే కాకుండా, విచ్చలవిడిగా అశ్లీల చిత్రాలను షేర్ చేశారు. ఈ గ్రూప్‌లో కొందరు మైనర్లు కూడా ఉన్నారు. అయితే విషయం బయటకు పొక్కడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి ఇద్దరు గ్రూప్ అడ్మిన్లను అరెస్ట్ చేశారు. స్కూల్ మేనేజ్మెంట్పై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు కేరళ, తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు చెందిన పార్మిల్లో జూలై 4న 15 వేల కోట్ల రూపాయల విలువైన 30 కిలోల బంగారాన్ని విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ఆరోపణలు ఎదుర్కోవడంతో వీరిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ అల్లర్లు ఫిబ్రవరి నెలలో దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో 53 మంది మరణించగా వందల సంఖ్యలో జనం గాయాలపాలయ్యారు. ముందస్తు కుట్ర ప్రకారమే ఈ అల్లర్లు చెలరేగాయని, ఈ కేసులో మొత్తం 21 మంది అనుమానితులను అరెస్ట్ చేయగా, వారిలో 15 మందిని నిందితులుగా పేర్కొంటూ వారి చేసిన నేరాలు ఏమిటో విఫులంగా వివరిస్తూ ఢిల్లీ పోలీసులు 17వేల పేజీల చార్జీ షీటును దాఖలు చేశారు. బెంగళూరు అల్లర్లు ఆగస్టు నెలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు నవీన్ సోషల్ మీడియాలో ఓ కమ్యూనల్ పోస్టు షేర్ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన కొంతమంది వ్యక్తులు కావల్ బైరసంద్రలోని ఎమ్మెల్యే నివాసంపై దాడి చేశారు. అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టగా.. ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. అంతేగాక ఎమ్మెల్యే ఇంటి వద్ద పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది పట్ల కూడా నిరసనకారులు అనుచితంగా ప్రవర్తించారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను సైతం లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన అల్లరి మూక పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో అనేక హెచ్చరికల అనంతరం కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. గాయపడిన మరొకరిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనలో 110 మందిని అరెస్ట్ చేశారు. అర్నబ్ గోస్వామి అరెస్ట్ ఓ డిజైనర్ ఆత్మహత్యకు పురికొల్పాలరనే ఆరోపణలతో గత నవంబర్ నెలలో ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై, రాయ్‌గడ్ పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 18 వరకు రాయిగఢ్ జిల్లా కోర్టు జ్యుడిషియల్ కస్టడి విధించింది. అంతకు క్రితం మధ్యంతర బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆర్నబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయనతో సహా మరో ఇద్దరికి కూడా సుప్రీం కోర్టు రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ ఇచ్చింది. -
2020.. కలలు కల్లలు
కొత్త సంవత్సరం.. కొత్త దశాబ్దిలోకి అడుగిడుతున్న సంబరం.. ఎన్నో కలలు, ఆశలు, ఆశయాలతో ఈ ఏడాదికి ప్రపంచం మొత్తం స్వాగతం పలికింది. కానీ అనూహ్యంగా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇచ్చింది. ‘నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు’ అంటూ ప్రపంచాన్ని ఓ ఆటాడుకుంది. ముఖ్యంగా కోవిడ్‌తో ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. ప్రపంచదేశాలన్నీ చిగురుటాకులా వణికిపోయాయి. వ్యక్తులు, రంగాలు, వ్యవస్థలు ఇలా ఒక్కటేమిటి.. ఒక్కరేమిటి ప్రతి ఒక్కరూ 2020 సంవత్సరానికి, కరోనా దెబ్బకు బాధితులే.. చాలా మందికి ఈ సంవత్సరం చాలా పాఠాలు నేర్పింది. ఈ ఏడది తెలంగాణ రాష్ట్రంలో 2020లో జరిగిన అనూహ్య పరిణామాలు ఏంటి? ఇక్కడి వ్యవస్థలు ఎలా మారాయి.. ఏయే రంగాలు ఎలా ఇబ్బంది పడ్డాయి.. ఎవరు హీరోలు అయ్యారు.. అనే విషయాలపై ఓ రౌండప్. -సాక్షి, హైదరాబాద్ అవిశ్రాంత పోరాట యోధులు.. వైద్యులు, వైద్య సిబ్బంది ఈ ఏడాది హీరోలుగా నిలి చారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఆ వైరస్ సోకిన వారందరికీ చికిత్స అందిస్తూ వచ్చారు. ప్రపంచం మొత్తం ఈ మహమ్మారికి గజగజ వణికిపోతుంటే.. వైద్యులు మాత్రం ధైర్యంగా అన్నీ తామై వైరస్ సోకిన వారికి సపర్యలు చేశారు. చాలా మంది డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అదే వైరస్‌కు బలయ్యారు కూడా. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలందిస్తూ మన రాష్ట్రంలో దాదాపు 3,500 మందికి కరోనా సోకగా, అందులో దాదాపు 40 మంది చనిపోయినట్లు సమాచారం. ఈ ఏడాది మొత్తం అన్ని ఆస్పత్రుల్లో కూడా కరోనా తప్ప వేరే వైద్య సేవలు చాలా తక్కు వగా అందాయి. కరోనా కారణంగా ప్రభుత్వాస్ప త్రుల్లో సదుపాయాలు పెరిగాయి. ఇదిలావుంటే కరోనా కారణంగా మెడికల్ కాలేజీలు తెరవకపోవ డంతో వైద్య విద్యార్థులు ఆన్లైన్ తరగతులకే పరిమితమయ్యారు. అసలైన వారియర్స్.. ఈ ఏడాది పోలీసులు యుద్ధవీరులయ్యారు. ప్రజలందరినీ తమ ప్రాణాలు పణంగా పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కరీంనగర్లో కరోనా ఆనవాళ్లు కన్పించిన రోజు నుంచి నేడు బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త వైరస్ సోకిన వారిని గుర్తించడంలో ఎనలేకి కృషి చేశారు. లాక్డౌన్ విధించాక ఎవరూ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. వైరస్ నియంత్రణలో, లాక్డౌన్ అమలులో పోలీసు శాఖ పోషించిన పాత్ర ప్రశంసనీయం. అలాంటిది నిర్విఘ్నంగా సాగుతున్న ఈ యజ్ఞంలో పోలీసులూ సవాళ్లు ఎదుర్కొన్నారు. పోలీస్ శాఖలో దాదాపు 5,700 మంది కరోనా బారినపడ్డారు. 50కి పైగా పోలీసులు అమరులయ్యారు. స్కూళ్లు తెరుచుకునేదెలా? రాష్ట్రంలో విద్యా రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపింది. 2020 మార్చి 16 నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఇంటర్ ఫలి తాల్లో ఆలస్యం, పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు తెరుచుకోలేదు. దీంతో సెప్టెంబర్ 1 నుంచి పాఠశా లలు, ఇంటర్లో ఆన్లైన్ బోధన ప్రారంభిం చాల్సి వచ్చింది. మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థల్లో టీచర్లు, అధ్యాపకులు ఇతర సిబ్బంది రోడ్డున పడ్డారు. ప్రవేశ పరీక్షల నిర్వహణ కూడా చాలా ఆలస్య మైంది. కాగా, ఈ పరిస్థితుల్లోనూ విద్యా ర్థులకు ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2020– 21 విద్యాసంవత్సరంలో కొత్త కోర్సులు తీసు కొచ్చింది. ఇంజనీరింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటాసైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తదితర కోర్సులకు అనుమతి ఇవ్వగా, డిగ్రీలో బీఎస్సీ డేటా సైన్స్, బీకాం బిజినెస్ అనలిటిక్స్, బీకాం టాక్సేషన్, బీకాం ఫారిన్ ట్రేడ్, బీఏ మ్యాథమెటిక్స్ వంటి కొత్త కోర్సులకు ఓకే చెప్పింది. అన్ని గ్రూపుల విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమ య్యేలా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్)లో మార్పులు తీసుకొచ్చింది. మార్కెట్ అవసరాలకు ఉపయోగపడేలా ఎం.ఫార్మసీ లోనూ 4 కొత్త కోర్సులకు అనుమతి ఇచ్చింది. వెనుకబడిన గురుకులాలు.. గురుకుల విద్యపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. మార్చిలో ఇంటిబాట పట్టిన పిల్లలు తిరిగి ఇప్పటివరకు గురుకులాన్ని చూడలేదు. ఆన్లైన్ తరగతులు, వీడియో పాఠాల ద్వారా బోధన ప్రారంభించాలని గురుకుల సొసైటీలు భావించినా.. పెద్దగా ఫలితం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల సొసైటీల పరిధిలో 960 గురుకుల విద్యా సంస్థలున్నాయి. వీటి పరిధిలో 3.85 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఎంసెట్, నీట్, క్లాట్ తదితర శిక్షణలిచ్చి తీర్చిదిద్దడంతో ఉత్తమ ర్యాంకులు సాధిస్తుంటారు. కానీ ప్రస్తుతం ఆన్లైన్ బోధనతో పిల్లలు కాస్త వెనుకబడినట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు. పడకేసిన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. మార్చి నుంచి పనులు పుంజుకునే సమయంలోనే వైరస్ విస్తృతి పెరగడంతో విదేశాల నుంచి రావాల్సిన యంత్ర సామగ్రి రాకపోవడం, వలస కూలీలు స్వస్థ లాలకు వెళ్లిపోవడం తదితర కారణాలతో పనులన్నీ నిలిచి పోయాయి. సీతారామ ఎత్తిపోతల, కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల ఎత్తిపోతల పథకాల యంత్రాలు పలు దేశాల నుంచి రావాల్సి ఉంది. ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలపైనా ప్రభావం బాగానే పడింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తొలి విడతగా గోదావరి బేసిన్లో 400, కృష్ణాబేసిన్‌లో 200 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు పూర్తి చేయాలని భావించినా కుదరలేదు. ఇసుక లభ్యత లేకపోవడం, సిమెంట్ ధర పెరగడంతో కాంట్రాక్టర్లకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఇడిసిపెడితే నడిసిపోతా.. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో అందరికన్నా ఎక్కువగా బాధ అనుభవించింది వలస కార్మికులే.. లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా పనులు నిలిచిపోవడంతో ఉపాధి లేక పూటగడవడం కష్టంగా మారింది. బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలు స్తంభించిపోవడంతో దిక్కు తోచని స్థితిలో లక్షలాది వలస కూలీలు మైళ్లకు మైళ్లు నడిచి పోయారు.. కాలినడకన వెళ్తున్న ఈ ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కంటతడి పెట్టించాయి. రాష్ట్రం నుంచి దాదాపు 9.57 లక్షల మంది వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వారిలో ఇప్పటివరకు 32 శాతమే తిరిగి వచ్చినట్లు కార్మిక శాఖ అంచనా. ఆర్టీసీకి దెబ్బ మీద దెబ్బ నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కరోనా, లాక్డౌన్ రూపంలో రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లింది. మార్చి చివర నుంచి అన్ని బస్సులు డిపోలకే పరిమితం కాగా, మే మూడో వారంలో జిల్లా సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ చివరలో సిటీ బస్సులు పరిమిత సంఖ్యలో ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పటికీ జిల్లా సర్వీసుల ఆక్యుపెన్సీ రేషియో 66 శాతంగానే ఉంటోంది. హైదరాబాద్‌లో కనీసం 50 శాతానికి కూడా చేరుకోలేదు. లాక్ డౌన్‌కు పూర్వం నిత్యం రూ.13 కోట్ల మేర టికెట్ల రూపంలో వచ్చే ఆదాయం ఇప్పుడు తొమ్మిదిన్నర కోట్లను మించట్లేదు. టికెట్ రూపంలోనే రూ.2వేల కోట్లు నష్టపోయింది. మరో వైపు కరోనాతో దాదాపు 50 మంది ఆర్టీసీ ఉద్యోగులు చనిపోగా, 2 వేల మంది వరకు కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఆర్థిక పరిస్థితి అతలాకుతలం కరోనా మహమ్మారితో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక తలకిందులైంది. లాక్‌డౌన్‌తో 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్నివిధాలా కలిసి రూ.52,750 కోట్లు తగ్గనుందని ఆర్థిక శాఖ తేల్చింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత తీవ్రమైంది. రాష్ట్రానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా 2019–20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల కాలంలో రాష్ట్రానికి రూ.39,608 కోట్ల ఆదాయం వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు రూ.33,704 కోట్లు మాత్రమే వచ్చాయి. 15 శాతం ఆదాయ వృద్ధి రేటుతో 2020–21లో రూ.1,15,900 కోట్ల అంచనాతో బడ్జెట్ రూపొందించగా, రూ.68,781 కోట్ల ఆదాయమే సమకూర నుంది. ఈ ఏడాది వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద రూ.32 వేలకు పైగా రాబడి వస్తుందని అంచనా వేస్తే, అక్టోబర్ నాటికి రూ.12,800 కోట్లు మాత్రమే వచ్చింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో కలిపి మరో రూ.5 వేల కోట్లు వచ్చినా రూ.18 వేల కోట్ల వరకు మాత్రమే జీఎస్టీ వచ్చాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందనుకున్నా.. ఇప్పటివరకు రూ.2 వేల కోట్లు కూడా దాటలేదు. రూ.30 వేల కోట్లు పన్నేతర ఆదాయం రూపంలో రావాల్సి ఉండగా, రూ.2వేల కోట్లు రాలేదు. అప్పుల విషయానికొస్తే ఏప్రిల్‌లో రూ.5,700 కోట్లు, మేలో రూ.7,642 కోట్లు, జూన్‌లో రూ.4,318 కోట్లు.. ఇలా 7 నెలల కాలంలోనే రూ.27 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. పరిశ్రమలు, ఐటీ శాఖ కాస్త మెరుగు.. పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలు కరోనా పరిస్థితుల్లో ఈ ఏడాది ఒడిదొడుకులకు లోనైనా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనలో మెరుగైన ఫలితాలు సాధించాయి. అమెజాన్ సంస్థ ప్రపం చంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను ప్రారంభించింది. రూ.20,670 కోట్ల పెట్టుబడులకు నిర్ణయం తీసుకుంది. బయో ఫార్మా రం గానికి ఊతమిచ్చేలా రూ.60 కోట్లతో బీ–హబ్ కూడా ప్రారంభమైంది. సిర్పూర్ పేపర్ ఫ్యాక్టరీ పునరుద్ధర ణ, ముచ్చర్ల ఫార్మాసిటీ భూసేకరణ వంటి అంశాల్లో పు రోగతి కన్పించింది. సులభతర వాణిజ్య విధానంలో రా ష్ట్రం మూడో ర్యాంకు సాధించింది. కాగా, ఐటీ సంస్థల న్నీ మార్చి మొదటి వారం నుంచే లాక్డౌన్ ప్రకటించా యి. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మరింత విస్తృతం చేయ డంతో 5.5 లక్షల మంది ఉద్యోగుల్లో 90% మంది ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త నియా మకాలు నిలిచిపోవడం, స్టార్టప్ కంపెనీలకు నిధుల కొరత, అద్దెల తగ్గింపు, ఐటీ కంపెనీలపై ఆధారపడి పనిచేసే హౌస్ కీపింగ్, కేటరింగ్ విభాగాల్లో పనిచేసే వారి ఉపాధికి గండిపడింది వెలవెలబోయిన పర్యాటకం గత 9 నెలలుగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు పూర్తిగా బోసిబోయాయి. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు కరోనా పెద్ద నష్టాలే తెచ్చిపెట్టింది. మార్చి చివరి నుంచి అన్ని పర్యాటక ప్రాంతాలను మూసేశారు. జూన్‌లో హోటళ్లను, ఆగస్టులో మిగతావి తెరిచారు. పర్యాటకుల నుంచి స్పందన మాత్రం రాలేదు. ఇప్పుడిప్పుడే కాస్త జనాలు పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నారు. మోతమోగిన విద్యుత్ బిల్లులు కరోనా కష్టకాలంలో జూన్ నెల విద్యుత్ బిల్లులు అనూహ్యంగా పెరిగిపోయాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం 2020 మార్చి 22 నుంచి దాదాపు 2 నెలల పాటు లాక్డౌన్ కారణంగా స్పాట్ మీటర్ రీడింగ్ తీయలేకపోయారు. లాక్డౌన్ సడలించడంతో జూన్ నెలలో 3 నెలల వినియోగానికి సంబంధించిన రీడింగ్ ఒకేసారి తీసి, సగటు వినియోగం ఆధారంగా వేశారు. దీంతో టారీఫ్ శ్లాబులు మారిపోయి ఈ మార్చి, ఏప్రిల్, మే నెలల బిల్లులు భారీగా పెరిగిపోయాయి. కాస్త ఆశావహ పరిస్థితులు.. ఈ ఏడాది విపత్కర పరిస్థితుల్లోనూ మాస్క్‌లు మొదలుకుని వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఫార్మాస్యూటికల్ రంగంలో ఆశించిన మేర ఎగుమతులు గణనీయంగా వృద్ధి చెందడం మంచి పరిణామం. ఎన్–95/ఎఫ్ఎఫ్పీ–2 మాస్క్‌ల ఎగుమతులు మెరుగు పడ్డాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 23% పెరిగాయి. 110 దేశాలకు రూ.554 కోట్ల విలువైన డైరీ ప్రొడక్టులను ఎగుమతి చేశారు. కార్పెట్లు, ఆహార ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, హెల్త్, వెల్నెస్, దుస్తులు తదితరాల ఎగుమతులు భారీగా జరిగాయి. జెమ్ అండ్ జ్యువెలరీ రంగానికి సంబంధించి రూ.1.6 లక్షల కోట్ల ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని అంచనా. -
రివైండ్ 2020: ప్రపంచానికి తాళం
ప్రపంచానికే తాళం పడింది. మార్కెట్లన్నీ మూతపడ్డాయి. రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. మొత్తంగా ప్రపంచమే స్తంభించిపోయింది. 2020ని కరోనా వైరస్ కాలనాగై కాటేసింది. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా పెనుసవాళ్లు విసిరింది. ఏడాది చివర్లో కరోనా కొత్తస్ట్రెయిన్ మరింత భయాందోళనల్ని పెంచుతున్నాయి. అయినా.. ఇకపై కరోనా, క్వారంటైన్, మాస్కులు, భౌతికదూరం అన్న మాటలు వినిపించకూడదన్న ఆశతో కొత్త సంవత్సరానికి ప్రపంచం స్వాగతం చెప్పనుంది. అగ్రరాజ్యాల వణుకు కరోనా మహమ్మారి ప్రపంచంలో అగ్రదేశాల వెన్నులో వణుకుపుట్టించింది. అమెరికా, యూకే, రష్యా వంటి దేశాలు కోవిడ్ ధాటికి తట్టుకోలేక విలవిలలాడిపోతున్నాయి. చైనాలోని వూహాన్లో పుట్టిన ఈ వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తొలిసారిగా జనవరి 9న ప్రకటించింది. ఆ తర్వాత చాప కింద నీరులా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది. అగ్రరాజ్యం అమెరికాలో జనవరి 15న తొలి కేసు నమోదైంది. మార్చి 11న డబ్ల్యూహెచ్ఓ కోవిడ్‌ని మహమ్మారిగా గుర్తించింది. భౌతిక దూరమే ఈ వైరస్‌పై బ్రహ్మాస్త్రం కావడంతో అన్ని దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. సరిహద్దులు మూసేశాయి. ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావద్దంటూ ఆంక్షలు విధించాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం మన జీవితంలో ఒక భాగమైపోయింది. కరోనా కట్టడిపై ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 8 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. 18 లక్షల మంది వరకు మృత్యువాత పడ్డారు. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధికంగా 2 కోట్ల వరకు కేసులు నమోదయ్యాయి. మూడున్నర లక్షల మంది మరణించారు. భారత్ ప్రపంచ పట్టికలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ జనాభా ఆధారంగా చూస్తే కరోనాని సమర్థంగా ఎదుర్కొన్నట్టే చెప్పాలి. బ్రెజిల్, బ్రిటన్, ఇటలీ, రష్యా వంటి దేశాలు కూడా కరోనాతో తీవ్రంగా సతమతమయ్యాయి. కరోనా సెకండ్ వేవ్, యూకేలో బయటపడిన కొత్త స్ట్రెయిన్‌తో ఇంకా భయాందోళనలు తొలగిపోలేదు. ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ అవి ఎంత మేరకు కరోనా వైరస్‌పై ప్రభావవంతంగా పని చేస్తాయోనన్న ఆందోళనల మధ్యే కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. అంతర్జాతీయ వేదికపై భారతీయ ప్రభ ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై భారతీయం వెల్లివిరిసింది. అమెరికా ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. తమిళనాడులో తులసెంథిరపురం కమల స్వగ్రామం. ఆమె తల్లి శ్యామల గోపాలన్ భారతీయురాలు కాగా తండ్రి జమైకాకు చెందిన డొనాల్డ్ హ్యారిస్. భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై అమితమైన ఇష్టం కలిగిన కమలా హ్యారిస్ విజయంతో భారతీయులు పండుగ చేసుకున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడిపైకి మనుషుల్ని పంపే మిషన్‌కు ఎంపిక చేసిన 18 మందిలో హైదరాబాద్ మూలాలున్న రాజాచారికి స్థానం లభించడంతో జాబిల్లిపైనా భారతీయ వెలుగులు ప్రసరించనున్నాయి. ట్రంప్‌కి గుడ్‌బై కొత్త ఏడాదికి స్వాగతం చెప్పే ఏర్పాట్లు చేసుకుంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రజలు బై బై చెప్పేశారు. కరోనా వైరస్‌ని ఎదుర్కోవడంలో, అమెరికాని ఆర్థికంగా నిలబెట్టడంలో ట్రంప్ వైఫల్యాలు ఆయన పదవికే ఎసరు తెచ్చిపెట్టాయి. జాతీయవాదాన్ని రెచ్చగొడుతూ వలసదారుల్ని పలు ఇబ్బందులకు గురిచేయడం, కరోనా ఆంక్షల్ని పాటించకపోవడం, మాస్కు ధరించడాన్ని హేళన చేయడం వంటి చర్యలతో ట్రంప్ ప్రజాదరణ కోల్పోయారు. నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ 306 ఎలక్టోరల్ స్థానాలతో విజయం సాధించినప్పటికీ ట్రంప్ తన ఓటమిని అంగీకరించకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ తన ఇమేజ్ను మరింత డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఐ కాంట్ బ్రీత్ అమెరికాలోని మొనిసెటా రాష్ట్రంలో ఆఫ్రికన్ అమెరికన్ అయిన జార్జ్ ఫ్లాయిడ్ (46) హత్యపై రేగిన ఆందోళనలు అంతకంతకూ ఉధృతమై జాతి వివక్షపై పోరాటానికి దారితీశాయి. తెల్ల తోలు అహంకారంతో డెరెక్ చావిన్ అనే పోలీసు ఫ్లాయిడ్ గొంతుపై తన బూటు కాళ్లతో తొమ్మిది నిమిషాల సేపు తొక్కి పెట్టి ఉంచడంతో ఊపిరాడక ఫ్లాయిడ్ చనిపోయాడు. ‘నాకు ఊపిరి ఆడట్లేదు(ఐ కాంట్ బ్రీత్)’ అంటూ ఫ్లాయిడ్ మొరపెట్టుకున్నా ఆ పోలీసు అధికారి పెడచెవిన పెట్టడంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. మొత్తం 60 దేశాల్లో జాతి వివక్షపై ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. కరోనాని లెక్క చేయకుండా జనం స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొనడం గమనార్హం. మధ్యప్రాచ్యంలో శాంతి వీచికలు ఉద్రిక్తతలకు నిలయమైన మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన దిశగా అడుగులు ముందుకు పడ్డాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఆగస్టు 13న ఇజ్రాయెల్, యూఏఈ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 25 ఏళ్ల తర్వాత ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం అంతర్జాతీయ పరిణామాల్లో మైలురాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, యూఏఈ డిప్యూటీ సుప్రీం కమాండర్ జాయేద్ సాధారణ సంబ«ంధాలను పునరుద్ధరించడానికి అంగీకరించడం ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది. మెగ్జిట్ బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కె ల్ రాజ ప్రాసాదాన్ని వీడుతున్నట్టుగా జనవరి 8న ప్రకటించారు. ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడడం కోసం ఈ జంట బకింగ్హమ్ ప్యాలెస్ వీడి వెళ్లింది. సోషల్ మీడియాలో నెటిజన్లు యువజంట స్వతంత్ర భావాలకు సలాం చేశారు. ప్యాలెస్ నుంచి మేఘన్ బయటకు రావడాన్ని మెగ్జిట్గా పిలుస్తున్నారు. అవీ ఇవీ ► అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ కడ్స్ దళాల జనరల్ ఖాసీం సులేమానీ మరణించారు. బాగ్దాద్ విమానాశ్రయంలో కారులో వెళుతుండగా ఈ దాడులు జరిగాయి. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకే సులేమానీని అమెరికా సైనికులు చంపేశారు. ► ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి బయల్దేరిన ఉక్రెయిన్ అంతర్జాతీయ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలింది. జనవరి 8న జరిగిన ఈ విషాద ఘటనలో విమానంలో ఉన్న 176 మంది మరణించారు. మూడు రోజుల తర్వాత ఆ విమానాన్ని పొరపాటున తామే కూల్చివేశామని ఇరాన్ ప్రభుత్వం అంగీకరించింది. ► అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గద్దె దింపడం కోసం ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం.. ఫిబ్రవరిలో సెనేట్‌లో వీగింది. ► పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి ప్రయాణిస్తున్న పైలట్ తప్పిదం కారణంగా కరాచీలోని నివాస ప్రాంతాలపై మే 22న కుప్పకూలింది. ఈ ఘటనలో 97 మంది మరణించారు. ► హాంకాంగ్ స్వతంత్ర ప్రతిపత్తిని నీరు కార్చేలా జాతీయ భద్రతా బిల్లుని జూన్‌లో చైనా ఆమోదించింది. దీనిని వ్యతిరేకిస్తూ హాంకాంగ్‌లో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ► లెబనాన్ రాజధాని బీరూట్ పోర్టులో ఆగస్టు 4న జరిగిన భారీ పేలుళ్లలో 200 మంది మరణిస్తే, వేలాది మంది గాయపడ్డారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వల కారణంగానే ఈ పేలుళ్లు సంభవించాయి. ► అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రూత్ బాడెర్ గిన్స్బర్గ్(87) సెప్టెంబర్ 18న పాంక్రియాటిక్ కేన్సర్‌తో మరణించారు -
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు చైసామ్.. ఫోటోలు వైరల్
2020 ఏడాది ముగుస్తుండటంతో న్యూ ఇయర్ వేడుకలకు అందరూ రెడీ అవుతున్నారు. కొత్త సంవత్సరానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉండటంతో వెకేషన్ ట్రిప్‌లకు వరుస కడుతున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల దాకా హాలీడే ప్రదేశాలకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ క్యూట్ కపూల్ సమంత, చైతన్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు మంగళవారం గోవా బయల్దేరారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి గోవా బయల్దేరారు. ఈ నేపథ్యంలో చైతన్యతో కలిసి సమంత ఎయిర్‌పోర్టులోకి వెళుతుండగా కెమెరా కంటికి చిక్కారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: ఒక్క చోట చేరిన అక్కినేని కుటుంబం! ఎయిర్‌పోర్టులో గ్రే, బ్లాక్ దుస్తుల్లో సమంత.. వైట్ టీ షర్టు, గ్రే కార్గో ప్యాంట్లో నాగచైతన్య కనిపించారు. ఇద్దరూ ముఖానికి మాస్కు ధరించి ఉన్నారు. ఇదిలా ఉండగా నవంబర్ చివరి వారంలో నాగ చైతన్య 34వ పుట్టినరోజును సమంత మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసిన విషయం తెలిసిందే. మాల్దీవుల వెకేషన్ అనంతరం వీరిద్దరూ ప్రస్తుతం గోవా వెళుతున్నారు. గోవాలోని ప్లష్ రిసార్ట్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్నారు. కాగా చైసామ్‌కు ఇష్టమైన ప్రదేశాల్లో గోవా ఒకటి. 2017లో గోవాలోని ఓ రిసార్ట్‌లోనే వీరి వివాహం జరిగింది. 2017 అక్టోబర్ 6న హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ జంట ఏడడుగులు వేయగా.. అక్టోబర్ 7న గోవాలో క్రిస్టియన్ పద్దతిలో సామంతకు చైతన్య రింగ్ తొడిగాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
2020లో 10 పెన్నీ స్టాక్స్ బొనాంజా
ముంబై, సాక్షి: ఈ కేలండర్ ఏడాది(2020)లో దేశీ స్టాక్ మార్కెట్లు పలు ఆటుపోట్లను చవిచూశాయి. తొలుత జనవరిలో సరికొత్త గరిష్టాలవైపు నడక సాగించాయి. అయితే చైనాలోని వుహాన్‌లో ఊపిరిపోసుకుని ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ ధాటికి మార్చికల్లా కనిష్టాలకు పడిపోయాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు తీసుకున్న సహాయక చర్యలతో తిరిగి నెల రోజుల్లోనే రికవరీ బాట పట్టాయి. అంతేకాకుండా విదేశీ ఇన్వెస్టర్ల పెట్లుబడుల వెల్లువతో సరికొత్త గరిష్టా రికార్డులను సాధిస్తూ సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు, మూడేళ్లుగా పెద్దగా వృద్ధి చూపని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు మధ్య, చిన్నతరహా కౌంటర్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతూ వచ్చారు. దీంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం మార్కెట్లను మించి లాభపడుతూ సరికొత్త గరిష్టాలను చేరాయి. పెన్సీ స్టాక్స్ 2019లో పెన్నీ స్టాక్స్‌గా నిలిచిన 10 కంపెనీల షేర్లు ఈ ఏడాది(2020) లాభాల పరుగందుకున్నాయి. వెరసి ఇన్వెస్టర్లకు అత్యధిక శాతం రిటర్నులు అందించాయి. ఇందుకు రూ. 25 ధరకంటే తక్కువగా ఉన్న షేర్లను మాత్రమే పరిగణించినట్లు ఏస్ ఈక్విటీ పేర్కొంది. రూ. 100 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) మించని కంపెనీలను మాత్రమే మదింపులోకి తీసుకున్న్లట్లు తెలియజేసింది. ఈ వివరాల ప్రకారం.. (బోరోసిల్ -ఫైనోటెక్స్ కెమ్.. యమస్పీడ్) అలోక్ గెలాప్ సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు 38 శాతం వాటాను కొనుగోలు చేయనున్న వార్తలతో అలోక్ ఇండస్ట్రీస్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగింది. ఫలితంగా అలోక్ ఇండస్ట్రీస్ షేరు 2020లో ఏకంగా 602 శాతం దూసుకెళ్లింది. 2019 డిసెంబర్ 31న రూ. 3.04గా నమోదైన ఈ షేరు వారాంతానికల్లా రూ. 21.4కు చేరింది. లాభాల బాట అలోక్ ఇండస్ట్రీస్ బాటలో టెక్నాలజీ సేవల కంపెనీ స్యుబెక్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. దీంతో ఈ షేరు గతేడాది చివర్లో నమోదైన రూ. 5.90 నుంచి వారాంతానికల్లా రూ. 29.70కు ఎగసింది. వెరసి 403 శాతం ర్యాలీ చేసింది. ఈ జాబితాలో కర్దా కన్స్ట్రక్షన్స్ షేరు రూ. 23.74 నుంచి 376 శాతం జంప్‌చేసింది. వారాంతానికల్లా రూ. 113ను దాటేసింది. ఇక టెక్ సొల్యూషన్స్ అందించే కెల్టన్ టెక్ సొల్యూషన్స్ షేరు రూ. 18 నుంచి రూ. 72.40కు పురోగమించింది. ఇది 301 శాతం వృద్ధికాగా.. క్యాపిటల్ గూడ్స్ కంపెనీ సీజీ పవర్ ఇండస్ట్రియల్ షేరు రూ. 10.82 నుంచి రూ. 43.20వరకూ పెరిగింది. ఇది 299 శాతం లాభంకావడం గమనార్హం! ఇదేవిధంగా రతన్ ఇండియా ఇన్ఫ్రా స్టాక్ రూ. 1.87 నుంచి రూ. 6.60కు బలపడింది. వెరసి 253 శాతం వృద్ధి చూపింది. హెల్త్‌కేర్ కంపెనీ మార్క్‌శాన్స్ ఫార్మా రూ. 16.71 స్థాయి నుంచి రూ. 58కు ఎగసింది. 247 శాతం లాభపడింది. టెలికం సేవల కంపెనీ టాటా టెలీసర్వీసెస్ షేరు రూ. 2.25 నుంచి 237 శాతం ర్యాలీ చేసింది. రూ. 7.59ను తాకింది. దుస్తుల తయారీ కంపెనీ బాంబే రేయాన్ ఫ్యాషన్స్ రూ. 4.20 నుంచి 220 శాతం జంప్‌చేసింది. రూ. 13.44కు చేరింది. ఇక మౌలిక రంగ కంపెనీ జేపీ అసోసియేట్స్ షేరు రూ. 1.96 నుంచి రూ. 6.16కు పెరిగింది. ఇది 214 శాతం లాభం! -
చెక్కు చెదరని మోదీ ఇమేజ్..
ఇది కోవిడ్ నామ సంవత్సరం. 2020 పేరు చెబితేనే వెన్నులో వణుకు పుడుతుంది. అయినా రాజకీయాలు రంజుగా సాగాయి. ఢిల్లీ ఎన్నికలతో మొదలైన ఏడాది బిహార్ ఎన్నికలతో ముగిసి ప్రధాన పార్టీలకు కరోనాని మించిన రాజకీయ పాఠాలను నేర్పింది. ఈ ఏడాది కూడా బీజేపీ తన హవా కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీని కాపాడే నాథుడు లేక కొట్టుమిట్టాడుతోంది. తమిళ సూపర్ స్టార్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తానన్న ప్రకటన ఈ ఏడాది హైలైట్‌గా నిలిచింది. చెక్కు చెదరని మోదీ ఇమేజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకున్న బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవడంలో ఈ ఏడాది విజయం సాధించారు. కరోనా మహమ్మారితో పోరాడుతూనే దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యధిక జనాభా కలిగిన భారత్ కరోనాను ఎదుర్కోలేక కుదేలైపోతుందన్న అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ తనదైన శైలిలో పకడ్బందీ ప్రణాళిక రచించారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ కష్టకాలంలో నరేంద్ర మోదీ ప్రధాని కావడం వల్ల భారత్‌కున్న పేరు ప్రతిష్టలు పెరిగాయని దేశ ప్రజల్లో 93% అభిప్రాయపడినట్టుగా ఐఏఎన్ఎస్–సీ ఓటరు సర్వే తేల్చి చెప్పింది. సరైన ప్రతిపక్షం లేకపోవడం కూడా ప్రధానికి బాగా కలిసొచ్చింది. ఏడాది చివర్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు మాత్రం ఆయనని చిక్కుల్లో పడేశాయి. ఎన్నికల్లో.. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ సారి బీజేపీ హవాయే కనిపించింది. ఏడాది మొదట్లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ విజయ ఢంకా మోగించింది. సీఎం కేజ్రివాల్‌కి క్రేజ్ తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. 70 స్థానాలకు గాను ఆప్ 62 స్థానాల్లో విజయం సాధిస్తే, బీజేపీ ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. ఇక బిహార్‌లో హోరాహోరిగా సాగిన పోరాటంలో ఎన్డీయే 125 స్థానాలు దక్కించుకుంది. అయితే ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ గట్టి పోటీయే ఇచ్చింది. 75 స్థానాలను గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో రాజకీయాల్లో యువకెరటం తేజస్వి యాదవ్ పేరు మారుమోగిపోయింది. ఇక వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. జ్యోతిరాదిత్య సింధియా వర్గాన్ని చీల్చి తమ వైపు లాక్కున్న బీజేపీకి మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఆ ఎన్నికల్లో 19 స్థానాల్లో నెగ్గి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక ఈ ఏడాది రాజ్యసభలో కూడా 12 సీట్ల బలాన్ని పెంచుకొని రాజకీయంగా శక్తిమంతంగా ఎదిగింది. కాంగ్రెస్ ఒక భస్మాసుర హస్తం కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది ఏమాత్రం కలిసిరాలేదు. నానాటికీ ఆ పార్టీ అధఃపాతాళానికి పడిపోతోంది. దశ దిశ లేని నాయకత్వం. కొత్త జనరేషన్ ఆలోచనలకి తగ్గట్టుగా వ్యూహరచన చేయలేకపోవడం ఆ పార్టీని దెబ్బతీసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించు కోలేకపోయిన కాంగ్రెస్ బిహార్ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 స్థానాల్లో మాత్రమే నెగ్గింది. కాంగ్రెస్ తురుపు ముక్కగా భావించే ప్రియాంక గాంధీపై పెట్టుకున్న ఆశలు కూడా అడియాశలయ్యాయి. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు స్థానాలకు గాను నాలుగు సీట్లలో కాంగ్రెస్ డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. వృద్ధతరానికి, యువతరానికి మధ్య పోరు ఉధృతం కావడంతో జ్యోతిరాదిత్య సింధియా వంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై కొట్టేసి కాషాయ శిబిరంలో చేరారు. ఫలితంగా మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ లక్ష్యమైన కాంగ్రెస్ ముక్త భారత్ ఎంతో దూరంలో లేదని కాంగ్రెస్ పార్టీ తనకి తానే ఒక భస్మాసుర హస్తంగా మారిందన్న విశ్లేషణలైతే వినిపిస్తున్నాయి. పొలిటికల్ బాషా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఈ ఏడాది పండగే పండుగ. ఎట్టకేలకు తాను రాజకీయాల్లోకి వస్తానని రజనీ ప్రకటించారు. ఆధ్యాత్మిక రాజకీయాల పేరుతో తమిళనాట మార్పు తీసుకువస్తానని నినదించారు. రజనీ పార్టీ పేరు మక్కల్ సేవై మర్చీ (ప్రజాసేవ పార్టీ)గా రిజిస్టర్ చేయించుకున్నారని, ఆయన ఎన్నికల గుర్తు ఆటో అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతలోనే రక్తపోటులో తేడాలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో రజనీ చికిత్స పొందారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా రజనీకాంత్ తాను చెప్పినట్టుగానే డిసెంబర్ 31న కొత్త పార్టీ ప్రకటన చేస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒరిగిన రాజకీయ శిఖరాలు ఇద్దరూ ఇద్దరే.. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్స్. ఒకరు దేశ అత్యున్నత శిఖరాన్ని అధిరోహిస్తే, మరొకరు తెరవెనుక మంత్రాంగాన్ని నడిపారు. కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నాయకులు ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్‌లు ఈ ఏడాది కరోనాతో కన్ను మూశారు. ప్రణబ్‌కు ఆగస్టులో కరోనా పాజి టివ్‌గా నిర్ధారణ అయింది. తర్వాత ఆయన మెదడుకి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఆస్పత్రిలో సెప్టెంబర్ 1న ప్రణబ్ మరణించారు. కాంగ్రెస్‌లో సోనియా ఆంతరంగికుడు అహ్మద్ పటేల్ నవంబర్ 23న కన్ను మూశారు. నమస్తే ట్రంప్ భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో మైలురాయిలాంటి కార్యక్రమం ఈ ఏడాది ఆరంభం లోనే జరిగింది. హౌడీమోడీకి దీటుగా కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహించింది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకాతో కలిసి భారత పర్యటనకు వచ్చారు. ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ని సందర్శించారు. ఇరుదేశాల మధ్య 300 కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందం కుదిరింది. -
2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!
హైదరాబాద్, సాక్షి: ఈ కేలండర్ ఏడాది(2020) ఏడాదిలో ప్రపంచ దేశాలను కోవిడ్-19 వణికించినప్పటికీ పారిశ్రామిక రంగలో దేశీయంగా పలు సానుకూల పవనాలు వీచాయి. ఓవైపు ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీతోపాటు.. దేశీ బిలియనీర్ల సంపద సైతం పెరుగుతూ వచ్చింది. కరోనా వైరస్ కేసులు విస్తరిస్తుండటంతో మార్చిలో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు సైతం 70 శాతం ర్యాలీ చేశాయి. సరికొత్త గరిష్టాలకు చేరాయి. ఇక మరోపక్క మార్కెట్లతో పోటీ పడుతూ పసిడి సైతం మెరుస్తూ వచ్చింది. దేశీ రిటైల్ పరిశ్రమలో పేరున్న కిశోర్ బియానీ గ్రూప్ ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కోవడంతో ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రిటైల్ బిజినెస్‌లను విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేయమంటూ సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టు నుంచి అమెజాన్ మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంది. కాగా.. జనవరి నుంచి చూస్తే మార్కెట్లు 14 శాతం బలపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 47,354కు చేరగా.. నిఫ్టీ 13,873 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలు కావడం విశేషం! ఇతర వివరాలు చూద్దాం.. (2021లో బంగారం ధర ఎంత పెరగనుంది..?!) దేశీ కుబేరులు కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ ఈ ఏడాది దేశీ కుబేరుల సంపద 50 శాతం బలపడింది. తొలితరం పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద 21.1 బిలియన్ డాలర్లు పెరిగింది. వెరసి 32.4 బిలియన్ డాలర్లను తాకింది. ఇక 2020లో ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ సంపద సైతం 18.1 బిలియన్ డాలర్ల వృద్ధితో 76.7 బిలియన్ డాలర్లయ్యింది. వ్యాక్సిన్ల కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ సైరస్ పూనావాలా సంపదకు 6.91 బిలియన్ డాలర్లు జమకావడంతో 15.6 బిలియన్ డాలర్లకు వ్యక్తిగత సంపద ఎగసింది. ఐటీ దిగ్గజాలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివనాడార్, విప్రో అధినేత ప్రేమ్‌జీ సంపద సంయుక్తంగా 12 బిలియన్ డాలర్లమేర పెరిగింది. దీంతో శివనాడార్ సంపద 22 బిలియన్ డాలర్లను తాకగా.. ప్రేమ్‌జీ వెల్త్ 23.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ బాటలో డీమార్ట్ స్టోర్ల అధినేత రాధాకిషన్ దమానీ సంపద సైతం 4.71 బిలియన్ డాలర్లు బలపడి 14.4 బిలియన్ డాలర్లయ్యింది. ఇదేవిధంగా హెల్త్‌కేర్ దిగ్గజం సన్ ఫార్మా చీఫ్ దిలీప్ సంఘ్వీ సంపద 2.23 బిలియన్ డాలర్లు పుంజుకుని 9.69 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ముకేశ్ అంబానీ దేశీ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ సరికొత్త రికార్డు సాధించారు. జులైకల్లా వ్యక్తిగత సంపద 77.4 బిలియన్ డాలర్లను తాకింది. దీంతో ప్రపంచంలోనే అపర కుబేరుల్లో 5వ ర్యాంకుకు చేరుకున్నారు. తద్వారా సంపదలో ఫేస్బుక్ అధినేత జుకర్‌బర్గ్(86 బిలియన్ డాలర్లు) సమీపంలో ముకేశ్ నిలిచారు. ముకేశ్ గ్రూప్‌లోని డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు లాభపడటం ఇందుకు సహకరించింది. సాధారణంగా టాప్-5 ప్రపంచ కుబేరుల్లో అమెరికన్లు, తదుపరి యూరోపియన్లు, ఒక మెక్సికన్ చోటు సాధిస్తూ వచ్చే సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్‌కు ముకేశ్ చెక్ పెట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం ముకేశ్ సంపదను 76.5 బిలియన్ డాలర్లుగా బ్లూమ్‌బెర్గ్ తెలియజేసింది. జియో, రిలయన్స్ రిటైల్ ఈ ఏడాది ముకేశ్ అంబానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు భారీ ర్యాలీ చేసింది. ఇందుకు డిజిటల్ అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో 33 శాతం వాటా విక్రయం ద్వారా 1.5 లక్షల కోట్లను సమకూర్చుకోవడం సహకరించింది. దీంతోపాటు.. రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 53,000 కోట్లు సమీకరించడంతో రుణరహిత కంపెనీగా ఆర్ఐఎల్ నిలిచింది. అంతేకాకుండా మరో అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్లోనూ 10 శాతం వాటా విక్రయం ద్వారా రూ. 47,000 కోట్లకుపైగా సమకూర్చుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్, గూగుల్, సిల్వర్‌లేక్ తదితరాలు ఇన్వెస్ట్చేయడం విశేషం! పసిడి కోవిడ్-19 భయాలతో ఈ ఏడాది మధ్యలో న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 2,067 డాలర్ల వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో దేశీయంగానూ ఆగస్ట్‌లో పసిడి 10 గ్రాములు ఎంసీఎక్స్‌లో రూ. 57,100కు ఎగసింది. ఇది దేశీ బులియన్ చరిత్రలోనే అత్యధికంకాగా.. తదుపరి ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పట్టడం, వ్యాక్సిన్లపై ఆశలు కారణంగా పసిడి వెనకడుగు వేస్తూ వచ్చింది. ప్రస్తుతం కామెక్స్‌లో పసిడి 1,890 డాలర్లకు చేరింది. ఇక ఎంసీఎక్స్‌లోనూ రూ. 50,300కు దిగింది. అయినప్పటికీ 2020లో పసిడి 35 శాతంపైగా ర్యాలీ చేయడం గమనార్హం! వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వివరాల ప్రకారం 2019లో పసిడి 1,393 డాలర్ల సమీపంలో నిలిచింది. దేశీయంగా రూ. 38,200 స్థాయిలో ముగిసింది. రూ. 24,713 కోట్ల డీల్ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు రిటైల్ బిజినెస్‌లను విక్రయించేందుకు ఫ్యూచర్ రిటైల్ డీల్ కుదుర్చుకుంది. తద్వారా రిటైల్, హోల్‌సేల్ బిజినెస్‌లతోపాటు.. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ విభాగాలను ఆర్ఐఎల్ 3.4 బిలియన్ డాలర్ల(రూ. 24,713 కోట్ల)కు సొంతం చేసుకోనుంది. సూపర్ మార్కెట్ చైన్ బిగ్బజార్సహా.. ఫుడ్‌హాల్, క్లాతింగ్ చైన్ బ్రాండ్ ఫ్యాక్టరీలను ఫ్యూచర్ గ్రూప్ నిర్వహిస్తోంది. అయితే ఈ డీల్ కుదర్చుకోవడంలో ఫ్యూచర్ గ్రూప్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ అమెజాన్ గ్రూప్ సింగపూర్ ఆర్బిట్రేటర్ కోర్టును ఆశ్రయించింది. దీంతో తాత్కాలికంగా డీల్‌ను నిలిపివేయమంటూ సింగపూర్ ఆర్బిట్రేటర్ అక్టోబర్‌లో ఫ్యూచర్ గ్రూప్‌ను ఆదేశించింది. గతేడాది ఫ్యూచర్ గ్రూప్‌లోని అన్‌లిస్టెడ్ కంపెనీలలో 49 శాతం వాటాను యూఎస్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేసింది. తద్వారా గ్రూప్‌లోని ప్రధాన లిస్టెడ్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి తమకు హక్కు ఉన్నదంటూ వాదిస్తోంది. -
చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపిన 2020
2020 ఏడాది ప్రపంచానంతటికి భారంగానే గడిచింది. కరోనా వైరస్ ఉద్భవించినప్పటి నుంచి సమస్త ప్రజానీకాన్నిఅస్తవ్యస్తం చేసింది. భారత్‌లోనూ కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఈ మహమ్మారి మనుషుల జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. కొన్ని లక్షల మంది జీవితాలను ఆర్థికంగా దెబ్బతిసింది. ఎంతో మంది ప్రాణాలను కరోనా వైరస్ పొట్టన పెట్టుకుంది. కొందరు కరోనా కారణంగా మృత్యువాతపడితే, మరికొందరు అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. వీరిలో బాలీవుడ్ ప్రముఖులే అధికంగా ఉన్నారు. నటుడు ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, గాయకుడు బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా ఈ ఏడాదే కోల్పోయాం. అయితే 2020లో మరణించిన సినీ ప్రముఖులెవరో ఇప్పడు చుద్దాం. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుల్లితెర నటుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించిన సుశాంత్ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టాడు. ధోని జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఎమ్ఎస్ ధోని చిత్రంతో మంచి పేరును సంపాదించాడు. ఆయన నటించిన చివరి చిత్రం దిల్ బచారా సుశాంత్ మరణించిన అనంతరం జూలై 24న ఓటీటీలో విడుదలైంది. అయితే సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, హత్య అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి హత్యేనని అతని తండ్రి బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనేక వివాదాలు, ఆరోపణల నడుమ సుశాంత్ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. క్రమేణా ఈ హీరో మరణం అనుక మలుపులు తిరిగి చివరికి సినీ ఇండస్ట్రీలో దాగి ఉన్న డ్రగ్స్ వ్యవహారాన్ని బయటపెట్టింది. డ్రగ్స్ లింక్స్ ఉన్న ఎంతో మంది సెలబబ్రిటీల బండారం బట్టబయలు చేసింది. చదవండి: ఏఆర్ రెహమాన్ తల్లి కన్నుమూత ఇర్ఫాన్ ఖాన్ బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏప్రిల్ 29 ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్న ఈ నటుడు కొన్నాళ్లు లండన్‌లో చికిత్స కూడా తీసుకున్నాడు. ఈ మధ్యే భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన ఆంగ్రేజీ మీడియం సినిమాలో నటించారు. మంగళవారం ఇర్ఫాన్ మరోసారి అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా, జనవరి 7, 1967న జన్మించిన ఇర్ఫాన్ ఖాన్, హిందీతో పాటు హాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, ఎ మైటీ హార్ట్, జురాసిక్ వరల్డ్, లైఫ్ ఆఫ్ పై వంటి హాలీవుడ్ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. ఇర్ఫాన్, చివరిగా 'అంగ్రేజీ మీడియం' అనే సినిమాలో నటించాడు. ఈయన మొదటి సినిమా ‘సలామ్ బాంబే’. తెలుగులో కూడా ఈయన మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో నటించారు. ఇర్ఫాన్‌కు భార్య సుతాపా సిక్దార్, ఇద్దరు కుమారులు ఉన్నారు. రిషి కపూర్ ప్రముఖ నటుడు రిషికపూర్ ఏప్రిల్ 30న కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషి కపూర్‌ను కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ చేర్పించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 2018 నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్నారు. అనంతరం 2019లో ఇండియాకు తిరిగి వచ్చారు. 1952, సెప్టెంబర్ 4న ముంబైలో జన్మించిన రిషీకపూర్ మేరా నామ్ జోకర్ చిత్రంలో బాల నటుడుగా ‘బాబీ’ చిత్రంతో హీరోగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. మేరానామ్ జోకర్, బాబీ, జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గమ్, పతీపత్నీఔర్ ఓ..,కర్జ్, కూలీ, దునియా, నగీనా, దూస్రా ఆద్మీ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. రిషీ కపూర్‌కు భార్య నీతూ కపూర్, పిల్లలు రిద్దిమా కపూర్, రణ్‌బీర్ కపూర్ ఉన్నారు. 1980లో హీరోయిన్ రీతూకపూర్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. నటుడుగానే కాకుండా దర్శక, నిర్మాతగా రాణించిన ఆయన పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. సరోజ్ ఖాన్ ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ జూలై 3న మృతి చెందారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. జూన్ 20న శ్వాసకోశ సమస్య కారణంగా ఖాన్ ముంబై బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోవిడ్19 పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది. పరిస్థితి మెరుగుకావడంతో ఆమెను డిశ్చార్జ్ చేశారు. సరోజ్ ఖాన్ హఠాన్మరణం బాలీవుడ్లో విషాదాన్ని నింపింది. నాలుగు దశాబ్దాల కెరీర్లో, దాదాపు 200కు పైగా సినిమాలకు 2 వేలకు పైగా పాటలకు కొరియోగ్రాఫ్ చేసిన ఘనత ఖాన్ సొంతం. దివంగత నటి శ్రీదేవి సూపర్ హిట్ మూవీ నాగిని, మిస్టర్ ఇండియాతో పాటు, సంజయ్ లీలా భన్సాలీ దేవదాస్ లోని డోలా రే డోలా, మాధురి దీక్షిత్-నటించిన తేజాబ్ నుండి ఏక్ దో టీన్, 2007లో జబ్ వి మెట్ నుండి యే ఇష్క్ హాయేతో సహా ఎన్నో మరపురాని పాటలకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. మూడుసార్లు జాతీయ అవార్డులను ఖాన్ గెల్చుకున్నారు. జగ్దీప్ ప్రముఖ హాస్యనటుడు జగ్దీప్ (సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ) అనారోగ్య సమస్యల కారణంగా జూలై 9న కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. రమేష్ సిప్పీ తెరకెక్కించిన అమితాబ్ సూపర్ హిట్ మూవీ ‘షోలే’లో సూర్మా భూపాలీ పాత్ర జగ్దీప్ నట జీవితంలోనే ఓ మైలురాయి లాంటిది. ఆ పాత్రకు ఆయనకు వచ్చిన ప్రశంసలు అన్నీఇన్నీ కావు. అంతేకాదు, అందాజ్ అప్నా అప్నా సినిమాలో జగ్దీప్ పోషించిన సల్మాన్ తండ్రి పాత్ర కూడా ఆయన నట జీవితంలో చెప్పుకోదగ్గది. ఆయన చేసిన పాత్రలు దాదాపుగా హాస్య ప్రధానమైనవే కావడం గమనార్హం. బాల్య నటుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన జగ్దీప్ దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. బాలసుబ్రహ్మణ్యం గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25న కన్నుమూశారు. శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఆయన 25న మధ్యాహ్నం వెంటిలేటర్‌పైనే తుది శ్వాస విడిచారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వస్తాడనుకున్న అభిమానులను శోకసంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు బాలు వెళ్లిపోయారు. కాగా ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. 50 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న ఆయన మృతి చెందడం పట్ల దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎస్పీ బాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.. 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మ పేట గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతుల రెండో సంతానం. ఇంజనీర్ కావాలని కలలు కని గాయకుడయ్యారు. సావిత్రిని వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు పిల్లలు చరణ్, పల్లవి ఉన్నారు. శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న(1966) చిత్రంలోతొలిసారి పాట పాడారు. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా 'ఏక్ దుజే కేలియే' లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. నాలుగు దశాబ్దాలకు పైగా సాగినసినీ ప్రస్థానంలో నలభై వేల పైచిలుకు పాటలు పాడి గిన్నిస్ రికార్డును సాధించారు. చిరంజీవి సర్జా కన్నడ హీరో చిరంజీవి సర్జా జూన్ 7న గుండెపోటుతో కన్నుమూశారు. ‘యాక్షన్ కింగ్’ అర్జున్‌కు మేనల్లుడు, మరో కన్నడ నటుడు ధ్రువ్ సర్జాకు సోదరుడు చిరంజీవి సర్జా. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆయన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ చిరంజీవి సర్జా మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 1980 అక్టోబరు 17న బెంగళూరులో జన్మించిన చిరంజీవి సర్జా కెరీర్ తొలినాళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు. ఆ తర్వాత నటుడిగా మారి 2009లో ‘వాయుపుత్ర’ అనే చిత్రంతో హీరోగా కెరీర్‌ను ప్రారంభించారు. ‘ఆకే’, ‘సింగా’, ‘సంహారా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన చిరంజీవి సర్జా యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు ఆయన 19 సినిమాల్లో హీరోగా నటించారు. గత ఏడాది చిరంజీవి సర్జా నటించిన నాలుగు సినిమాలు (సింగా, ఖాకీ, ఆద్యా, శివార్జున) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాగే ఆయన హీరోగా కమిటైన నాలుగు సినిమాల్లో ఒక చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా, మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. 2018 మే 2న నటి మేఘనా రాజ్‌ను వివాహమాడారు చిరంజీవి సర్జా. జయప్రకాశ్ రెడ్డి రంగస్థల నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించిన జయప్రకాశ్ రెడ్డి 2020 సెప్టెంబర్ 8న గుండెపోటుతో మరణించారు. రాయలసీమ మాండలీకంతో విలనిజం పండిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న ఆయన.. ‘ప్రేమించుకుందాం రా', ‘సమరసింహారెడ్డి', ‘జయం మనదేరా', ‘చెన్నకేశవరెడ్డి', ‘టెంపర్' తదితర సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. వెంకటేష్, దాసరి కాంబినేషన్లో వచ్చిన బ్రహ్మ పుత్రుడుతో పరిచయమైన.. ప్రేమించుకుందా రా సినిమాతో ఎంతో పాపులర్ అయ్యారు జయప్రకాష్ నిషికాంత్ కామత్ ‘దృశ్యం’ దర్శకుడు నిషికాంత్ కామత్ ఆగష్టు 18 న మరణించారు. చాలాకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో (ఏఐజీ) జులై 31 నుంచి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కొంతకాలంగా బాగానే ఉన్నప్పటికీ కాలేయ వ్యాధి తిరగబెట్టడంతో శరీరంలోని పలు అవయవాలు పని చేయకపోవడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దక్షిణాదిలో ఘనవిజయం సాధించిన ‘దృశ్యం’ సినిమాని అజయ్ దేవ్గన్, టబులతో బాలీవుడ్లో ‘దృశ్యం’ పేరుతోనే రీమేక్ చేసి హిట్ అందుకున్నారు నిషికాంత్ కామత్. 2005లో వచ్చిన ‘డోంబివాలీ ఫాస్ట్’ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ని మొదలుపెట్టిన ఆయన హిందీలో ‘ముంబై మేరీ జాన్, ఫోర్స్, రాకీ హ్యాండ్సమ్’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు ‘సాచ్య ఆట ఘరాట్’ అనే మరాఠీ సినిమాలోనూ, ‘డాడీ, జూలీ 2’ వంటి హిందీ చిత్రాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. కాగా దర్శకుడిగా నిషికాంత్ చివరి చిత్రం ‘మదారీ’ (2016). సౌమిత్ర ఛటర్జీ ఆస్పత్రిలో చేరిన ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ నవంబర్ 16న మృతి చెందారు. అక్టోబర్ 6న ఛటర్జీ కరోనా బారిన పడి, కోల్‌కత్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. ‘గత రెండు రోజులుగా ఛటర్జీ ఆరోగ్యం మరింత విషమించింది.. ఆయన్ను కాపాడటానికి మేం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు’ అని వైద్యులు పేర్కొన్నారు. 1935 జనవరి 19న పశ్చిమబెంగాల్లోని కృష్ణానగర్‌లో జన్మించిన సౌమిత్ర ఛటర్జీ థియేటర్ ఆర్టిస్ట్‌గా అహింత్ర చౌదరి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. స్వయంకృషితో బెంగాలీ చిత్ర సీమలో నంబర్‌వన్ స్థాయికి చేరుకున్నారు. బెంగాలీ తొలి తరం నటుల్లో అగ్రగణ్యుడైన సౌమిత్ర ఛటర్జీ.. సుప్రసిద్ధ దర్శకుడు సత్యజిత్ రే ‘అపుర్ సంసార్’తో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి, పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సత్యజిత్ రే దర్శకత్వం వహించిన 14 సినిమాల్లో ఆయన నటించడం విశేషం. వాజిద్ ఖాన్ ప్రాణాంతక కరోనా మహమ్మారి బారినపడి ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్(42) జూన్ 1న మృత్యువాతపడ్డారు. కిడ్నీ సంబంధిత సమస్యతో సతమతమవుతున్న ఆయనకు కొన్ని రోజుల కిందట కరోనా లక్షణాలు కనిపించాయి. గుండె సంబంధిత సమస్యలతోనూ చికిత్స పొందుతున్న వాజిద్ ఖాన్ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ పిన్న వయసులోనే చనినపోవడంపై బాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా పలు హిట్ సినిమాలకు పనిచేశారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ సినిమాలు వాంటెడ్, దబాంగ్, ఏక్తా టైగర్ సినిమాలకు, రౌడీ రాథోడ్, హీరోపంటి, పార్ట్నర్ లాంటి హిట్ సినిమాలకు సాజిద్ - వాజిద్ జోడీనే స్వరాలు సమకూర్చింది. వీరితోపాటు టాలీవుడ్ సీనియర్ నటుడు రావి కొండలరావు, కోసూరి వేణు గోపాల్, నటుడు జాన్ కొట్టోలీ, బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి, మలయాళ దర్శకుడు జిబిత్ జార్జ్, తమిళ నటుడు సేతురామన్, తమిళ యువ దర్శకుడు బాలమిత్రన్ కన్నుమూశారు. -
కరోనా: శూన్య సంవత్సరంగా 2020
ఈ శతాబ్దపు మహావిపత్తు అంటూ భయపెట్టడం కాదుకాని నిజంగానే ప్రపంచానికి చుక్కలు చూపించింది కరోనా. సాంఘిక జంతువును కాస్త ఒంటరి జీవిని చేసింది. ముక్కుకు, మూతికి అడ్డు పెట్టించి.. ప్రకృతి వనరుల మీద అదుపు నేర్పింది.. పొదుపు విలువ చెప్పింది.. ఊహించనివాటిని అనుభవంలోకి తెచ్చింది.. అనుభవంలో ఉన్నవాటిని ఊహలుగా మార్చింది.. గిర్రున తిరుగుతున్న కాలాన్ని నిలిపేసింది.. ఉత్పత్తులను ఆపేసింది. కరోనా కేర్ తప్ప తతిమా సేవలన్నిటికీ సెలవు ప్రకటించింది.. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఏడాదిని శూన్య సంవత్సరంగా చరిత్రలో చేర్చింది. 2019, నవంబర్ 17న చైనాలో తొలి కరోనా కేసు బయటపడింది. అయితే ఈ ఏడాది జనవరి 1న డబ్ల్యూహెచ్ఓ వుహాన్కి తన ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సపోర్ట్ టీమ్‌ను పంపించడంతో మొదటిసారిగా కరోనా విషయం ప్రపంచానికి తెలిసింది. కరోనా పేషంట్ల కోసం ఫిబ్రవరిలో వుహాన్‌లోని అథ్లెట్స్ విలేజ్ పార్కింగ్ లాట్లో ఆగమేఘాల మీద ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది చైనా. ► మనదేశంలో మార్చి 25వ తేదీన తొలి విడత లాక్‌డౌన్‌ను ప్రకటించింది ప్రభుత్వం. 31 వరకు సాగిందది. ఈ ప్రభావంలోంచి ఆర్థిక వ్యవస్థను తప్పించడానికి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్రోత్సాహక పథకాలను ప్రకటించింది. ► కరోనా దెబ్బతో మొత్తం జగత్తే స్తంభించి పోయిన నెల అది. దాదాపు అన్ని దేశాలూ లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. వీధులు, వీధి చివర దుకాణాల నుంచి బడులు (కళాశాలలు సహా), గుడులు, కూడళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, బస్టాండులు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల దాకా అన్నీ బంద్. రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. గత నలభై ఏళ్లలో మొదటిసారిగా ‘తాజ్‌మహల్’ సందర్శననూ నిలిపేశారు. ► కర్ఫ్యూ వాతావరణాన్ని కొంచెం కొంచెంగా సడలిస్తూ లాక్డౌన్ ఉనికిలోనే ఉన్న నెల ‘మే’. ఆ నెల 9న దేశాన్ని దిగ్భ్రాంతిలోకి నెట్టిన దుర్ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దగ్గర జరిగింది. తెల్లవారు జామున రైలు పట్టాల మీద సేద తీరుతున్న పదహారు మంది వలస కార్మికుల మీద నుంచి గూడ్స్‌రైలు దూసుకెళ్లింది. ► దైనందిన జీవితం హోల్డ్‌లో ఉన్నా వైజ్ఞానిక ప్రయోగాలు ఆగలేదు... కరోనా టీకా నుంచి అంతరిక్ష ప్రయోగాల దాకా. నాసా ‘ది స్పేస్ ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్’ను ప్రయోగించింది. ► కరోనా వరల్డ్ స్టాక్ మార్కెట్‌ను కుప్పకూల్చింది. 40 వేల పాయింట్లతో దూసుకెళ్లిన మన సెన్సెక్స్ కరోనా ఎఫెక్ట్‌తో 10వేల పాయింట్లకు పడిపోయింది. బిలియన్ డాలర్ల పెట్టుబడి తుడిచిపెట్టుకుపోయింది. ► మన దేశంలో కరోనా తొలి కేసు జనవరి 30న నమోదైంది. చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుకుంటున్న కేరళ విద్యార్థి స్వస్థలానికి ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో చేసిన వైద్యపరీక్షల్లోనే ఆ విద్యార్థికి కరోనా పాజిటివ్ అని తేలింది. (చదవండి: కుటుంబ రక్షణకే కరోనా వ్యాక్సిన్) కరోనా మిగిల్చిన శోకం సినీ గాయక ప్రముఖుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కూచిపూడి నర్తకి శోభానాయుడు కరోనాతో మరణించారు. ♦ మన దేశంలో వలస కార్మికులు వందల కిలోమీటర్లు కాలినడక మొదలుపెట్టారు స్వస్థలాలు చేరుకోవడానికి. వాళ్లకు మంచినీళ్ల నుంచి ఆహారం, చెప్పులు, రవాణా సదుపాయాల ఏర్పాటు వరకు సహాయం అందించడానికి వ్యక్తుల నుంచి సంస్థల వరకు ముందుకొచ్చారు.. వచ్చాయి. వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా వలస కార్మికుల కోసం తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ వరకు జాతీయ రహదారి పొడుగునా సహాయక శిబిరాలను నెలకొల్పారు. ♦ ప్రముఖ నటుడు సోనూ సూద్ వలస కార్మికులకు అందించిన సేవలను యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తన ‘స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డ్ (సెప్టెంబర్‌లో)’తో గుర్తించి అతణ్ణి గౌరవించింది. ♦ ప్రపంచ లాక్‌డౌన్‌కు కొనసాగింపు నెల. చరిత్రలో చాలా మొదటిసార్ల (ఫస్ట్‌టైమ్)కు సాక్ష్యమైంది. వాటికన్లో పోప్ ఫ్రాన్సిస్ ప్రత్యక్ష ప్రసారానికి జనసందోహం లేకపోవడం ఇదే మొదలు. ♦ ఇస్లాం పుణ్యక్షేత్రం మక్కా కూడా ఖాళీగానే దర్శనమిచ్చింది. ♦ జూలై నెలలో ప్రారంభం కావాల్సిన టోక్యో ఒలిపింక్స్‌ను కరోనా ఆపేసింది. ♦ వందే భారత్ మిషన్ కింద దుబాయ్‌లో ఉన్న భారతీయులను ఆగస్టు 7న స్వదేశానికి తీసుకొస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 1344 విమానం కాలికట్ అంతర్జాతీయ విమానశ్రయంలో ల్యాండ్ అవుతూ భారీ వర్షం కారణంగా రన్ వే మీద జారింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా పందొమ్మిది మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 169 మంది సురక్షితంగా బయటపడ్డారు. (చదవండి: చైనా గుట్టు రట్టు చేసిన ‘వుహాన్ ఫైల్స్’) కరోనాపై పది కత్తులు డాక్టర్ పూజా భాటియా మూత్రపిండాల చికిత్సా నిపుణురాలు. యు.ఎస్.లో స్థిరపడిన కుటుంబం ఆమెది. పేషెంట్లను చూస్తున్న క్రమంలో డాక్టర్ పూజాకు కరోనా సంక్రమించింది. కోలుకున్న వెంటనే మళ్లీ విధుల్లోకి వచ్చారు. కరోనా యోధులపై తయారవుతున్న డాక్యుమెంటరీ చిత్రం ‘ఎ ప్యాండమిక్: అవే ఫ్రమ్ ద మదర్ల్యాండ్’లో డాక్టర్‌గా, మానవత్వం గల మనిషిగా పూజా ఏమిటో మనం చూడొచ్చు. శ్వేతారాయ్ హాలీవుడ్లో ఉంటున్న భారతీయ చలన చిత్ర దర్శకురాలు. డాక్టర్ పూజా భాటియా, మరో ఐదుగురు భారతీయ వైద్యులపై ‘ఎ ప్యాండమిక్: అవే ఫ్రమ్ ది మదర్ల్యాండ్’ అనే డాక్యుమెంటరీని తీస్తున్నది శ్వేతనే! జన్మభూమికి దూరంగా పరదేశంలో కరోనా కొమ్ములు వంచుతున్న డాక్టర్ అంకిత్ భారత్, డాక్టర్ ఉమా మధుసూదన్, డాక్టర్ శ్రీధర్ కులకర్ణి, డాక్టర్ శంతను సింగ్‌లపై 70 నిముషాల నిడివిలో ఈ డాక్యుమెంటరీ ఉండబోతోంది. డాక్టర్ అమృతా గాడ్గే యు.కె.లో పనిచేస్తున్న భారతీయ భౌతిక శాస్త్రవేత్త. బోస్–ఐన్‌స్టీన్ కండెన్సేట్ (బి.ఇ.సి.) ను విజయవంతంగా ఆవిష్కరించారు అమృత. బి.ఇ.సి. అనేది పదార్థం నాల్గవ స్థితి. మొదటి నాలుగు స్థితులు ఘనం, ద్రవం, వాయువు, ప్లాస్మా. కరోనా స్థితిగతులపై అమృతా పరిశోధన చేస్తున్నప్పుడు అంతరిక్షంలో వ్యోమగాములకు ఉపయోగకరమైన ఈ ఫలితం వెలువడింది. మహితా నాగరాజ్ డిజిటల్ మార్కెటింగ్ వృత్తి నిపుణురాలు. సింగిల్ మదర్. ‘కేర్ మాంగర్స్’ ఇండియా ఆలోచన మహితదే. కరోనా నుంచి తమకై తాము జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నవారిని ఈ సంస్థ తన సంరక్షణలోకి తీసుకుంటుంది. 46 వేల మంది సభ్యులతో 14 దేశాలకు విస్తరించింది. ఒక్క భారతదేశంలోనే ‘కేర్‌మాంగర్స్’కి 22 వేల మంది వాలంటీర్లు ఉన్నారు. ప్రధానంగా వృద్ధులకు ఆహార, వైద్య, ఆరోగ్య సేవల్ని ఈ గ్రూపు అందిస్తుంటుంది. చంద్రబాలీ దత్తా భారత సంతతికి చెందిన బ్రిటిష్ శాస్త్రవేత్త. కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టే పనిలో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందంలో సభ్యురాలు. వ్యాక్సిన్ తయారయ్యే ప్రతి దశలోనూ అన్నీ సరిచూసుకోవలసిన కీలకమైన బాధ్యత ఆమెదే. షిఫా మొహమ్మద్ హౌస్ సర్జన్. కరోనా పేషెంట్లకు తను అందించవలసిన చికిత్సలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆమె తన పెళ్లినే వాయిదా వేసుకున్నారు. షిఫా కన్నూర్ (కేరళ)లోని పరియారమ్ మెడికల్ కాజేజ్ హాస్పిటల్లో పని చేస్తున్నారు. కెప్టెన్ స్వాతి రావల్ భర్త కెప్టెన్ రాజా చౌహన్తో కలిసి బోయింగ్ 777లో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను త్వరత్వరగా సొంతగడ్డకు చేర్చే విధులలో నిర్దేశిత పని గంటలకు మించి స్వచ్ఛందంగా పనిచేశారు. ఆమె స్వదేశానికి తీసుకొచ్చిన 263 మంది భారతీయులలో ఎక్కువమంది విద్యార్థులే. ప్రధాని నరేంద్ర మోదీ ఆమె చొరవను అభినందించారు. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ జెనీవాలోని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’లో చీఫ్ సైంటిస్ట్. కరోనాకు వ్యాక్సిన్‌ను, డ్రగ్ థెరపీలను కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న శాస్త్ర పరిశోధనల కార్యాచరణలకు ఆమె నేతృత్వం వహిస్తున్నారు. మినాల్ దఖావే భోసాల్ పుణెలోని ‘మైల్యాబ్ డిస్కవరీ’ ప్రయోగశాలలో పరిశోధన, అభివృద్ధి విభాగాల అధిపతి. ఆమె నేతృత్వంలోనే మైల్యాబ్ ‘ప్యాథో డిటెక్ట్’ అని కి ట్‌కు రూపకల్పన చేసింది. కాన్పుకు ముందు రోజు వరకు ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’లో ఆమె తన పరిశోధనల్లో నిమగ్నమై ఉండటం వార్తల్లోని విశేషం అయింది. డాక్టర్ ఉమా మధుసూదన్ యు.ఎస్.లోని కనెక్టికట్‌లో ఉన్న హార్ట్ఫోర్డ్ హెల్త్ కేర్‌లో ఫిజీషియన్. సౌత్ విండ్సర్ హాస్పిట్లో కరోనా బాధితులకు ఆమె అందించిన సేవల్ని ప్రపంచమంతా గుర్తించింది. అక్కడి స్థానికులు ఆమెకు గౌరవ సూచకంగా ఆమె నివాసం ముందు నుంచి కార్ల పరేడ్‌తో ధన్యవాదాలు సమర్పించారు. అమెరికా, కెనడా, బ్రిటన్, రష్యా, మెక్సికో, బహెరైన్ .. ఈ ఆరు దేశాలు కరోనా టీకాను అధికారికంగా ఆమోదించాయి. -
2020 మూవీ రివ్యూ: ఓటీటీలో హిట్టు, ఫట్టు ఇవే
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీని దెబ్బకు యావత్ ప్రపంచం చిగురుటాకులా వణికిపోయింది. అన్ని రంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు అయితే గట్టి దెబ్బ కొట్టింది. 2020లోకి ఎంటరైన మూడు నెలలకే సినిమా థీయేటర్లు మూతపడ్డాయి. దీంతో వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలు బేల చూపులు చూశాయి. దసరా, దీపావళి పండగలు బోసిగా వెళ్లిపోయాయి. ఇక లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జనాలు.. టీవీలో సీరియల్స్, సినిమాలు చూసి బోర్‌గా ఫీలయ్యారు. ఇలాంటి తరుణంలో కొత్త సినిమాలతో దూసుకువచ్చాయి ఓటీటీ వేదికలు. (చదవండి : కలిసిరాని 2020.. కళ తప్పిన ‘సినీ’ పండగ) అప్పటికే వెబ్ సిరీస్‌లతో వినోదాన్ని అందిస్తున్న ఓటీటీలు.. లాక్డౌన్ పుణ్యమా అని కొత్త సినిమాలను విడుదల చేసే చాన్స్ కొట్టేశాయి. ఇక థియేటర్లు మూతపడటంతో దర్శక- నిర్మాతలకు కూడా ఓటీటీ వేదికలు ఆపద్భావుడిలా కనిపించాయి. వడ్డీల భారం నుంచి బయట పడేందుకు నిర్మాతలకు సరైన మార్గం దొరికింది. తమ చిత్రాలను ప్రేక్షుల దగ్గరకు తీసుకెళ్లేందుకు ఓటీటీ వేదికలు ఉపయోగపడ్డాయి. అలా అన్ని భాషల చిత్రాలు ఓటీటీలో సందడి చేశాయి. తెలుగులో కూడా పలు చిత్రాలు ఓటీటీ వేదిక ద్వారా విడుదలై, ప్రేక్షకులను పలకరించాయి. అలా తెలుగులో ఓటీటీ వేదిక ద్వారా విడుదలైన చిత్రాలేవో, అవి ఎంతమేరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో.. సమగ్ర సమాచారం మీకోసం. ధైర్యం చేసిన ‘అమృతరామమ్’ లాక్డౌన్ సమయంలో ఓటీటీ వేదికగా విడుదలైన తొలి తెలుగు చిత్రం ‘అమృతరామమ్’.కొత్త దర్శకుడు సురేందర్ కొంటడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ మిట్టకంటి, అమితా రంగనాథ్ నటించారు. ఈ చిత్రం ఎప్రిల్ 29న జీ5 వేదికగా విడుదలైంది. యూత్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని రాబట్టలేకపోయింది. బెడిసికొట్టిన ‘మహానటి’ ప్రయోగం ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ నటించిన `పెంగ్విన్` జూన్ 19న అమేజాన్ ప్రైమ్‌లో వచ్చింది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈసినిమా ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తి ఓ బిడ్డకు తల్లిగా, గర్భంతో ఉన్న మహిళగా విలక్షణ పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఆమె ప్రయోగం ఫలించలేదు. వినోదాన్ని పంచడంలో విఫలమయింది. లీల చేసిన ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’ హీరో రానా సమర్పణలో సంజయ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’. ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమాలో సిద్దు జొన్నగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని నటించారు. రానా సమర్పించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగాయి. అయితే ఇది మరీ పెద్దగా హిట్ కాకపోయినా.. యూత్‌ని మాత్రం బాగా ఆకట్టుకుంది. మెప్పించిన ‘బానుమతి రామకృష్ణ’ల ప్రేమ నవీన్ చంద్ర, సలోని లుత్రా నటించిన ‘భానుమతి రామకృష్ణ’ సినిమా ‘ఆహా’ వేదికగా విడుదలైన యూత్‌ని మెప్పించింది. మెచ్యూరిటీ కలిగిన ప్రేమ కథతో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సత్యదేవ్ ఖాతాలో మరో హిట్ సత్యదేవ్ హీరోగా కంచరపాలేం ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రతీకారం, చిన్నచిన్న ఎమోషన్స్‌తో రూపొందిన ఈ సినిమాలో సత్యదేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ‘ఆహా’ను ఆదుకున్న ‘జోహార్’ ‘ఆహా’ లో రిలీజ్ అయినా మరో చిత్రం జోహార్. ప్రస్తుత రాజకీయాల ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకర్షించింది. స్వార్థ రాజకీయాల కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టి విగ్రహాలు ఏర్పాటు చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించాడు. మంచి లాభాలు తీసుకొచ్చింది విజయానికి దూరంగా ‘వి’ నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం సెప్టెంబర్ 5న భారీ అంచనాలతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. నాని 25వ సినిమా కావడం, తొలిసారి ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నటించడంతో అభిమానులో ఎన్నో అంచనాలు పెట్టుకొని సినిమా చూశారు. కానీ వారి అంచనాలు ‘వి’ అందుకోలేకపోయింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. ‘నిశ్శబ్ధం’గా వెళ్లిన అనుష్క అనుష్క శెట్టి, మాధవన్ జంటగా ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ తెరకెక్కించిన నిశ్శబ్ధం దారుణంగా నిరాశ పరిచింది. అమెరికాలో భారీగా రూపొందించిన ఈ చిత్రం అత్యంత దారుణంగా ఫ్లాప్ అయింది. నవ్వులు పూయించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా...’. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు కొండా విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కాసులు కురిపించిన ‘కలర్ ఫోటో’ ఆహాలో విడుదలైన ‘కలర్ ఫోటో’ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. సుహాస్, చాందిని చౌదరి జంటగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను నవ్వించి, కవ్వించి... చివర్లో అందరి చేత కంటతడి పెట్టించింది. ఈ చిత్రాన్ని సందీప్ రాజ్ తెరకెక్కించాడు. సునీల్ విలన్‌గా నటించాడు. ఆహాకు మంచి లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. మిస్‌ఫైర్ అయిన ‘మిస్ ఇండియా’ కీర్తి సురేష్ నుంచి వచ్చిన మరో ఓటిటి సినిమా మిస్ ఇండియా. నరేంద్ర నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ట్రోలింగ్ కూడా జరిగింది. అమెరికాలో ఛాయ్ అమ్మడం కాన్సెప్టు బాగున్నా స్క్రీన్ ప్లే లేకపోవడంతో తేలిపోయింది మిస్ ఇండియా. ‘గతం’మెరిసింది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా ‘గతం’. కొత్త దర్శకుడు కిరణ్ కొండమాడుగుల తెరకెక్కించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 6న విడుదలైంది. రిలీజ్ అయిన తర్వాత మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ పేరు తెచ్చుకుంది. ఇండియన్ పనోరమాకు ఈ చిత్రం ఎంపికైంది. హృదయానికి హత్తుకున్న‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కించిన సినిమా మిడిల్ క్లాస్ మెలొడీస్. నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ చిత్రానికి తొలిరోజే మంచి టాక్ వచ్చింది. పల్లెటూరు నుంచి గుంటూరు సిటీలో హోటల్ పెట్టుకోవాలనుకునే మధ్యతరగతి కుర్రాడి కథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. సూర్యకి హిట్ ఇచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ సూర్య హీరోగా సుధ కొంగర తెరకెక్కించిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సూర్యకు చాలా రోజుల తర్వాత వచ్చిన అద్భుతమైన విజయం ఇది. ‘డర్టీ హరి’కి యావరేజ్ టాక్ సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా మారిన చేసిన సినిమా డర్టీ హరి. ఎరోటిక్ సస్పెన్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ నటించారు. డిసెంబర్ 18న ఫ్రైడే మూవీస్ యాప్‌లో విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది.