Rewind 2020: 2020 World News Highlights | ప్రపంచానికి తాళం - Sakshi
Sakshi News home page

రివైండ్‌ 2020: ప్రపంచానికి తాళం

Published Wed, Dec 30 2020 4:43 AM | Last Updated on Wed, Dec 30 2020 11:07 AM

Sakshi Special Story on World Roundup In 2020

ప్రతీకాత్మక చిత్ర

ప్రపంచానికే తాళం పడింది. మార్కెట్లన్నీ మూతపడ్డాయి. రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. మొత్తంగా ప్రపంచమే స్తంభించిపోయింది. 2020ని కరోనా వైరస్‌ కాలనాగై కాటేసింది. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా పెనుసవాళ్లు విసిరింది. ఏడాది చివర్లో కరోనా కొత్తస్ట్రెయిన్‌ మరింత భయాందోళనల్ని పెంచుతున్నాయి. అయినా.. ఇకపై కరోనా, క్వారంటైన్, మాస్కులు, భౌతికదూరం అన్న మాటలు వినిపించకూడదన్న ఆశతో కొత్త సంవత్సరానికి ప్రపంచం స్వాగతం చెప్పనుంది.
 
అగ్రరాజ్యాల వణుకు  

కరోనా మహమ్మారి ప్రపంచంలో అగ్రదేశాల వెన్నులో వణుకుపుట్టించింది. అమెరికా, యూకే, రష్యా వంటి దేశాలు కోవిడ్‌ ధాటికి తట్టుకోలేక విలవిలలాడిపోతున్నాయి. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్‌ చాలా త్వరగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తొలిసారిగా జనవరి 9న ప్రకటించింది. ఆ తర్వాత చాప కింద నీరులా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది. అగ్రరాజ్యం అమెరికాలో జనవరి 15న తొలి కేసు నమోదైంది. మార్చి 11న డబ్ల్యూహెచ్‌ఓ కోవిడ్‌ని మహమ్మారిగా గుర్తించింది. భౌతిక దూరమే ఈ వైరస్‌పై బ్రహ్మాస్త్రం కావడంతో అన్ని దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. సరిహద్దులు మూసేశాయి. ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావద్దంటూ ఆంక్షలు విధించాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం మన జీవితంలో ఒక భాగమైపోయింది.

కరోనా కట్టడిపై ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 8 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. 18 లక్షల మంది వరకు మృత్యువాత పడ్డారు. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధికంగా 2 కోట్ల వరకు కేసులు నమోదయ్యాయి. మూడున్నర లక్షల మంది మరణించారు. భారత్‌ ప్రపంచ పట్టికలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ జనాభా ఆధారంగా చూస్తే కరోనాని సమర్థంగా ఎదుర్కొన్నట్టే చెప్పాలి. బ్రెజిల్, బ్రిటన్, ఇటలీ, రష్యా వంటి దేశాలు కూడా కరోనాతో తీవ్రంగా సతమతమయ్యాయి.  కరోనా సెకండ్‌ వేవ్, యూకేలో బయటపడిన కొత్త స్ట్రెయిన్‌తో ఇంకా భయాందోళనలు తొలగిపోలేదు. ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ అవి ఎంత మేరకు కరోనా వైరస్‌పై ప్రభావవంతంగా పని చేస్తాయోనన్న ఆందోళనల మధ్యే కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం.  
 
అంతర్జాతీయ వేదికపై భారతీయ ప్రభ

ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై భారతీయం వెల్లివిరిసింది. అమెరికా ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. తమిళనాడులో తులసెంథిరపురం కమల స్వగ్రామం. ఆమె తల్లి శ్యామల గోపాలన్‌ భారతీయురాలు కాగా తండ్రి జమైకాకు చెందిన డొనాల్డ్‌ హ్యారిస్‌. భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై అమితమైన ఇష్టం కలిగిన కమలా హ్యారిస్‌ విజయంతో భారతీయులు పండుగ చేసుకున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడిపైకి మనుషుల్ని పంపే మిషన్‌కు ఎంపిక చేసిన 18 మందిలో హైదరాబాద్‌ మూలాలున్న రాజాచారికి స్థానం లభించడంతో జాబిల్లిపైనా భారతీయ వెలుగులు ప్రసరించనున్నాయి.  
 
ట్రంప్‌కి గుడ్‌బై  

కొత్త ఏడాదికి స్వాగతం చెప్పే ఏర్పాట్లు చేసుకుంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రజలు బై బై చెప్పేశారు. కరోనా వైరస్‌ని ఎదుర్కోవడంలో, అమెరికాని ఆర్థికంగా నిలబెట్టడంలో ట్రంప్‌ వైఫల్యాలు ఆయన పదవికే ఎసరు తెచ్చిపెట్టాయి. జాతీయవాదాన్ని రెచ్చగొడుతూ వలసదారుల్ని పలు ఇబ్బందులకు గురిచేయడం, కరోనా ఆంక్షల్ని పాటించకపోవడం, మాస్కు ధరించడాన్ని హేళన చేయడం వంటి చర్యలతో ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోయారు. నవంబర్‌ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ 306 ఎలక్టోరల్‌ స్థానాలతో విజయం సాధించినప్పటికీ ట్రంప్‌ తన ఓటమిని అంగీకరించకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ తన ఇమేజ్‌ను మరింత డ్యామేజ్‌ చేసుకుంటున్నారు.  
 
ఐ కాంట్‌ బ్రీత్‌

అమెరికాలోని మొనిసెటా రాష్ట్రంలో ఆఫ్రికన్‌ అమెరికన్‌ అయిన జార్జ్‌ ఫ్లాయిడ్‌ (46) హత్యపై రేగిన ఆందోళనలు అంతకంతకూ ఉధృతమై జాతి వివక్షపై పోరాటానికి దారితీశాయి. తెల్ల తోలు అహంకారంతో డెరెక్‌ చావిన్‌ అనే పోలీసు ఫ్లాయిడ్‌ గొంతుపై తన బూటు కాళ్లతో తొమ్మిది నిమిషాల సేపు తొక్కి పెట్టి ఉంచడంతో ఊపిరాడక ఫ్లాయిడ్‌ చనిపోయాడు. ‘నాకు ఊపిరి ఆడట్లేదు(ఐ కాంట్‌ బ్రీత్‌)’ అంటూ ఫ్లాయిడ్‌ మొరపెట్టుకున్నా ఆ పోలీసు అధికారి పెడచెవిన పెట్టడంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. మొత్తం 60 దేశాల్లో జాతి వివక్షపై ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. కరోనాని లెక్క చేయకుండా జనం స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొనడం గమనార్హం.
 
మధ్యప్రాచ్యంలో శాంతి వీచికలు

ఉద్రిక్తతలకు నిలయమైన మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన దిశగా అడుగులు ముందుకు పడ్డాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మధ్యవర్తిత్వంతో ఆగస్టు 13న ఇజ్రాయెల్, యూఏఈ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 25 ఏళ్ల తర్వాత ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం అంతర్జాతీయ పరిణామాల్లో మైలురాయి. ఇజ్రాయెల్‌ ప్రధాని  నెతన్యాహూ, యూఏఈ డిప్యూటీ సుప్రీం కమాండర్‌ జాయేద్‌ సాధారణ సంబ«ంధాలను పునరుద్ధరించడానికి అంగీకరించడం ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది.  
 
మెగ్జిట్‌  

బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ హ్యారీ, ఆయన భార్య మేఘన్‌ మార్కె ల్‌ రాజ ప్రాసాదాన్ని వీడుతున్నట్టుగా జనవరి 8న ప్రకటించారు. ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడడం కోసం ఈ జంట బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ వీడి వెళ్లింది. సోషల్‌ మీడియాలో నెటిజన్లు యువజంట స్వతంత్ర భావాలకు సలాం చేశారు. ప్యాలెస్‌ నుంచి మేఘన్‌ బయటకు రావడాన్ని మెగ్జిట్‌గా పిలుస్తున్నారు.

అవీ ఇవీ

► అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్‌ కడ్స్‌ దళాల జనరల్‌ ఖాసీం సులేమానీ మరణించారు. బాగ్దాద్‌ విమానాశ్రయంలో కారులో వెళుతుండగా ఈ దాడులు జరిగాయి. అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాల మేరకే సులేమానీని అమెరికా సైనికులు చంపేశారు.  

► ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ నుంచి బయల్దేరిన ఉక్రెయిన్‌ అంతర్జాతీయ విమానం టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాల్లోనే కూలింది. జనవరి 8న జరిగిన ఈ విషాద ఘటనలో విమానంలో ఉన్న 176 మంది మరణించారు. మూడు రోజుల తర్వాత ఆ విమానాన్ని పొరపాటున తామే కూల్చివేశామని ఇరాన్‌ ప్రభుత్వం అంగీకరించింది.  

► అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను గద్దె దింపడం కోసం ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం.. ఫిబ్రవరిలో సెనేట్‌లో వీగింది.  

► పాకిస్తాన్‌లోని లాహోర్‌ నుంచి ప్రయాణిస్తున్న పైలట్‌ తప్పిదం కారణంగా కరాచీలోని నివాస ప్రాంతాలపై మే 22న కుప్పకూలింది. ఈ ఘటనలో 97 మంది మరణించారు.  

► హాంకాంగ్‌ స్వతంత్ర ప్రతిపత్తిని నీరు కార్చేలా జాతీయ భద్రతా బిల్లుని జూన్‌లో చైనా ఆమోదించింది. దీనిని వ్యతిరేకిస్తూ హాంకాంగ్‌లో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి.  

► లెబనాన్‌ రాజధాని బీరూట్‌ పోర్టులో ఆగస్టు 4న జరిగిన భారీ పేలుళ్లలో 200 మంది మరణిస్తే, వేలాది మంది గాయపడ్డారు. అమ్మోనియం నైట్రేట్‌ నిల్వల కారణంగానే ఈ పేలుళ్లు సంభవించాయి.  

► అమెరికా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రూత్‌ బాడెర్‌ గిన్స్‌బర్గ్‌(87) సెప్టెంబర్‌ 18న పాంక్రియాటిక్‌ కేన్సర్‌తో మరణించారు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement