Rewind 2020 Sports News | 2020 Sports Highlights | ఒక వైరస్‌... ఒక 36...- Sakshi
Sakshi News home page

ఒక వైరస్‌... ఒక 36...

Published Thu, Dec 31 2020 5:12 AM | Last Updated on Thu, Dec 31 2020 10:34 AM

Special Story on Rewind-2020 Sports - Sakshi

ప్రతీ ఏటా క్రీడల క్యాలెండర్‌... ఫలితాలు, రికార్డులు, అవార్డులు, పురస్కారాలతో కనిపించేది. చాంపియన్ల విజయగర్జనతో, దిగ్గజాల మైలురాళ్లతో, ఆటకే వన్నెతెచ్చిన ఆణిముత్యాల నిష్క్రమణలతో ముగిసేది. కానీ ఈ ఏడాది మాత్రం కంటికి కనిపించని వైరస్‌ క్రీడల క్యాలెండర్‌ను కలవరపెట్టింది. కరోనా కాలం క్రీడలకు కష్టకాలాన్నే మిగిల్చింది. టోక్యో ఒలింపిక్స్, యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలాంటి మెగా ఈవెంట్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది.

ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ను ఆపేసింది. మరెన్నో క్రీడలను రద్దు చేసింది. ప్రేక్షకుల్ని మైదానానికి రాకుండా చేసింది. కొత్తగా ‘బయో బబుల్‌’ను పరిచయం చేసింది. ఒకవైపు కరోనా కల్లోలం కొనసాగుతుండగా... మరోవైపు ఫార్ములావన్‌లో హామిల్టన్‌ రయ్‌మంటూ దూసుకెళ్లాడు.  15 ఏళ్ల తర్వాత బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టాడు. ఎవ్వరూ ఊహించని విధంగా భారత క్రికెట్‌ జట్టు 36కే ఆలౌటై షాక్‌ ఇచ్చింది. మొత్తానికి 2020 కొందరికి తీపి గుర్తులు, మరికొందరికి చేదు గుళికల్ని పంచివెళ్లింది. అవేంటో చూద్దాం...!        
–సాక్షి క్రీడా విభాగం

మహాబలుడు మళ్లీ వచ్చాడు!
అమెరికా బాక్సింగ్‌ యోధుడు, ప్రపంచ హెవీవెయిట్‌ మాజీ చాంపియన్‌ మైక్‌ టైసన్‌ మళ్లీ రింగ్‌లో దిగేందుకు ‘సై’ అన్నాడు. 15 ఏళ్ల తర్వాత పంచ్‌ విసిరేందుకు కసరత్తులు కూడా చేశాడు. 54 ఏళ్ల వయసులో ప్రత్యర్థి రాయ్‌ జోన్స్‌ జూనియర్‌తో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో తలపడ్డాడు. త్వరలో హోలీఫీల్డ్‌తో టైసన్‌ ఢీకొట్టేందుకు అమెరికన్‌ ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.


దిగ్గజాలను తీసుకెళ్లింది...
ఈ ఏడాది... క్రీడాభిమానులను దుఃఖసాగరంలో ముంచింది. ఆయా క్రీడలకు తమ ఆటతీరుతో, అలుపెరగని పోరాటంతో వన్నె తెచ్చిన దిగ్గజాలను తీసుకెళ్లింది. అమెరికాను ఊపేసే నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ)లో సూపర్‌ స్టార్‌ హోదా పొందిన కోబీ బ్రయాంట్‌ తన అభిమానులతో శాశ్వత సెలవు తీసుకున్నాడు. హెలికాప్టర్‌ ప్రమాదంలో బ్రయాంట్‌తోపాటు అతని 13 ఏళ్ల కుమార్తె దుర్మరణం పాలైంది. ఇది ఈ సంవత్సరం క్రీడాలోకంలో పెను విషాదంగా నిలిచింది. అలాగే ఫుట్‌బాల్‌ మాంత్రికుడు, అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా మరణం క్రీడాలోకాన్ని శోకంలో ముంచింది. గుండెపోటుతో అతను మృతి చెందాడు. భారత హాకీ దిగ్గజం బల్బీర్‌ సింగ్‌ సీనియర్, అలనాటి ఫుట్‌బాల్‌ మేటి పీకే బెనర్జీ, చున్నీ గోస్వామి ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. క్రికెట్‌లో చేతన్‌ చౌహాన్, రాజిందర్‌ గోయెల్, ఆస్ట్రేలియన్‌ డీన్‌ జోన్స్‌లు అనారోగ్యంతో 2020లో తనువు చాలించారు.


‘రికార్డు’ల హామిల్టన్‌

మార్చి 15న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో మొదలవ్వాల్సిన ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌కు కరోనా అంతరాయం కలిగించింది. 22 రేసులున్న ఎఫ్‌1 సీజన్‌ను చివరకు 17 రేసులకు కుదించారు. ప్రేక్షకులకు ప్రవేశం లేకుండా రేసులను నిర్వహించారు. మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకొని ఏడోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మైకేల్‌ షుమాకర్‌ (జర్మనీ) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. అంతేకాకుండా ఎఫ్‌1లో అత్యధిక రేసుల్లో గెలిచిన డ్రైవర్‌గా షుమాకర్‌ (91) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్‌ (95) తిరగరాశాడు.


ఆన్‌లైన్‌లో ఎత్తులు...

కరోనా మహమ్మారి పలు క్రీడా టోర్నమెంట్‌లపై ప్రభావం చూపినా మేధో క్రీడ చెస్‌ మాత్రం కొత్త ఎత్తులకు ఎదిగింది. ముఖాముఖి టోర్నీలకు బ్రేక్‌ పడినా ఆన్‌లైన్‌లో నిరాటంకంగా టోర్నీలు జరిగాయి. తొలిసారి ఆన్‌లైన్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్టు రష్యాతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. భారత్, రష్యా మధ్య ఫైనల్‌ కీలకదశలో ఉన్నపుడు సాంకేతిక సమస్య తలెత్తడంతో నిర్వాహకులు రెండు జట్లను విజేతగా ప్రకటించారు. చెస్‌ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో తెలుగు తేజాలు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక సభ్యులుగా ఉన్నారు. ఆన్‌లైన్‌లోనే జరిగిన ప్రపంచ యూత్‌ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు నిహాల్‌ సరీన్, గుకేశ్, రక్షిత స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు.


ఐపీఎల్‌ అలరించింది

ఈ ఏడాదిలో తొలి మూడు నెలలు క్రికెట్‌ సాగినా... ఆ తర్వాత కరోనా వైరస్‌తో బ్రేక్‌ వచ్చింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఐదోసారి విశ్వవిజేతగా నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలిసారి ఫైనల్‌ చేరిన భారత మహిళల జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరోవైపు కరోనా వైరస్‌తో భారత్‌లో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ మధ్యలోనే ఆగిపోయింది. కరోనా తీవ్రరూపం దాల్చడంతో దాదాపు నాలుగు నెలలు క్రికెట్‌ ఆట సాగలేదు. జూలై చివరి వారంలో ఇంగ్లండ్‌–వెస్టిండీస్‌ జట్ల మధ్య ‘బయో బబుల్‌’ వాతావరణంలో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ మొదలైంది. ప్రతీ ఏటా వేసవిలో వినోదాన్ని పంచే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నీ కరోనా కారణంగా ఆలస్యమైంది.

ఒకదశలో ఈ టోర్నీ జరుగుతుందా లేదా అనే అనుమానం కలిగినా... చివరకు ఐపీఎల్‌ భారత్‌ దాటింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో ‘బయో బబుల్‌’ వాతావరణంలో సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్‌ 13వ సీజన్‌ నిరాటంకంగా సాగింది. ముంబై ఇండియన్స్‌ జట్టు ఐదోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆగస్టు 15న ఎమ్మెస్‌ ధోని హఠాత్తుగా క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అదే రోజున సురేశ్‌ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్‌ ముగిశాక భారత జట్టు దుబాయ్‌ నుంచి నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అడిలైడ్‌ వేదికగా జరిగిన డే–నైట్‌ తొలి టెస్టులో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే ఆలౌటై తమ టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరును నమోదు చేసి ఓటమి పాలైంది. అయితే మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకొని 2020 ఏడాదిని ఘనంగా ముగించింది.

ఫెడరర్‌...నాదల్‌ 20–20
ఈ 2020 ఏడాది ఇద్దరు టెన్నిస్‌ సూపర్‌స్టార్ల టైటిళ్ల సంఖ్యను ట్వంటీ–ట్వంటీగా సమం చేసింది. స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (2018)తో 20వ టైటిల్‌ సాధించాడు. ఇతనికి సరైనోడు... సమఉజ్జీ అని టెన్నిస్‌ ప్రపంచం ప్రశంసలందుకున్న రాఫెల్‌ నాదల్‌ దీనికి న్యాయం చేశాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌తో ఈ స్పానిష్‌ లెజెండ్‌ కూడా 20వ టైటిల్‌తో ఫెడరర్‌ సరసన నిలిచాడు. ఇలా ఈ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ స్టార్స్‌ ఇపుడు 20–20 స్టార్స్‌ అయ్యారు. కరోనా కారణంగా ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు మాత్రమే జరిగాయి.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జొకోవిచ్‌ విజేతగా నిలువగా... కరోనా దెబ్బకు 1945 తర్వాత వింబుల్డన్‌ టోర్నమెంట్‌ను నిర్వాహకులు తొలిసారి రద్దు చేశారు. ప్రేక్షకులు లేకుండా యూఎస్‌ ఓపెన్‌ను నిర్వహించగా... ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్‌ థీమ్‌ విజేతగా నిలిచి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను అందుకున్నాడు.

సెప్టెంబర్‌కు వాయిదా పడిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రాఫెల్‌ నాదల్‌ తన ఆధిపత్యం చాటుకొని 13వసారి చాంపియన్‌గా నిలిచాడు. యూఎస్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ సందర్భంగా తాను కొట్టిన బంతి లైన్‌ అంపైర్‌కు తగలడంతో సస్పెన్షన్‌కు గురైన సెర్బియా స్టార్‌ జొకోవిచ్‌ ఆరోసారి సీజన్‌ను నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించాడు. పీట్‌ సంప్రాస్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement