euro cup foot ball
-
యూరో కప్ విజేతగా స్పెయిన్.. ప్రైజ్ మనీ ఎన్ని వందల కోట్లంటే?
దాదాపు నెల రోజుల పాటు ఫుట్‌బాల్ అభిమానులను ఉర్రూతలూగించిన యూరో కప్-2024కు ఎండ్ కార్డ్ పడింది. ఆదివారం రాత్రి స్పెయిన్- ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీ ముగిసింది. యూరోకప్ విజేతగా స్పెయిన్ నిలిచింది.ఫైనల్లో 2-1 తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించిన స్పెయిన్.. నాలుగో సారి టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో విజేత స్పెయిన్ ప్రైజ్ మనీ ఎంత? రన్నరప్ ఇంగ్లండ్‌కు ఎంత దక్కుతుంది? ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ ఎవరన్న ఆంశాలపై ఓ లుక్కేద్దాం.విజేత స్పెయిన్‌కు ఎన్ని కోట్లంటే?యూరో కప్ విజేత స్పెయిన్‌కు ప్రైజ్ మనీ రూపంలో మొత్తం 30.4 మిలియన్ డాలర్లు అందనుంది. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ. 253 కోట్ల ప్రైజ్ మనీ స్పెయిన్‌కు దక్కింది. అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి ఛాంపియన్స్‌గా నిలిచినందుకు బోనస్+ గ్రూప్ స్టేజ్ విజయాలు+ క్వార్టర్-ఫైనల్ + సెమీ-ఫైనల్+ ఫైనల్+ టోర్నీలో పాల్గోనే రుసుము మొత్తం కలిపే రూ. 253 కోట్ల నగదు బహుమతిగా స్పెయిన్‌కు లభించనుంది.రన్నరప్ ఇంగ్లండ్‌కు ఎంతంటే?రన్నరప్ ఇంగ్లండ్‌కు ప్రైజ్ మనీ రూపంలో మొత్తం 27.25మిలియన్ డాలర్లు అందనుంది. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ.227 కోట్ల ప్రైజ్ మనీ ఇంగ్లండ్‌కు దక్కింది. గ్రూప్ స్టేజ్ విజయాలు+ క్వార్టర్-ఫైనల్ + సెమీ-ఫైనల్+ టోర్నీలో పాల్గోనే రుసుము+ రౌండ్ 16 మొత్తం ప్రైజ్‌మనీ కలిపి ఇంగ్లండ్‌కు రూ.227 కోట్ల నగదు బహుమతిగా అందనుంది. ఇక సెమీఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌కు చెరో రూ. 101 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది.యంగ్ ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ: లామిన్ యమల్ (స్పెయిన్)ఈ టోర్నీలో లామిన్ యమల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.17 ఏళ్ల యమల్ ఒక గోల్‌తో పాటు 4 అసిస్ట్‌లు చేశాడు. ఈ యువ ప్లేయర్ కచ్చితంగా ఫ్యూచర్ స్టార్ అవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: రోడ్రి (స్పెయిన్)స్పెయిన్ తరఫున మిడ్‌ఫీల్డ్‌లో రోడ్రి అదరగొట్టాడు. స్పెయిన్ విజేతగా నిలవడంలో రోడ్రిది కీలకపాత్ర. గోల్డెన్ బూట్ విజేతలు వీరే..యూరో కప్-2024 గోల్డన్ బూట్ విజేతలగా ఆరుగురు నిలిచారు. మొత్తం ఆరు మంది ఆటగాళ్లు సమంగా 3 గోల్స్ చేసి సంయుక్తంగా గోల్డన్ బూట్ అవార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్, స్పెయిన్ అటాకింగ్ మిడ్‌ఫీల్డర్ డాని ఓల్మో, జార్జియా మిడ్ ఫిల్డర్ జార్జెస్ మికౌతాడ్జే, కోడి గక్పో, ఇవాన్ ష్రాంజ్,జమాల్ ముసియాలా ఉన్నారు. -
జయహో జార్జియా
గెల్సెన్కిర్చెన్ (జర్మనీ): యూరో కప్ ఫుట్‌బాల్ టోరీ్నలో పాల్గొంటున్న తొలిసారే జార్జియా జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఎఫ్’లో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో జార్జియా 2–0 గోల్స్ తేడాతో 2016 చాంపియన్ పోర్చుగల్ జట్టుపై సంచలన విజయం నమోదు చేసింది. రెండో నిమిషంలోనే క్వరాత్స్కెలియా గోల్‌తో జార్జియా 1–0తో ఆధిక్యాన్ని సంపాదించింది. ఆ తర్వాత 57వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను మికాట్జె లక్ష్యాన్ని చేర్చడంతో జార్జియా ఆధిక్యం 2–0కు పెరిగింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న జార్జియా విజయాన్ని ఖాయం చేసుకుంది. పోర్చుగల్ దిగ్గజ ప్లేయర్, కెపె్టన్ క్రిస్టియానో రొనాల్డో 66 నిమిషాలపాటు ఆడి ఆ తర్వాత మైదానం వీడాడు. రొనాల్డోను పక్కా ప్రణాళికతో కట్టడి చేయడంలో జార్జియా డిఫెండర్లు సఫలమయ్యారు. జార్జియా చేతిలో ఓడినప్పటికీ ఇదే గ్రూప్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన పోర్చుగల్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘ఎఫ్’లోని మరో మ్యాచ్‌లో టర్కీ 2–1తో చెక్ రిపబ్లిక్‌ను ఓడించి నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గురువారంతో యూరో టోర్నీ లీగ్ దశ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి. ఈనెల 29 నుంచి ప్రిక్వార్టర్ ఫైనల్స్ జరుగుతాయి. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్‌తో ఇటలీ; ఇంగ్లండ్‌తో స్లొవేకియా; డెన్మార్క్‌తో జర్మనీ; స్పెయిన్‌తో జార్జియా; బెల్జియంతో ఫ్రాన్స్; స్లొవేనియాతో పోర్చుగల్; రొమేనియాతో నెదర్లాండ్స్; ఆ్రస్టియాతో టర్కీ తలపడతాయి. -
ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మ్యాచ్ ‘డ్రా’
లీప్జిగ్ (జర్మనీ): ప్రతిష్టాత్మక యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో గోల్ నమోదు కాని తొలి ‘డ్రా’ నమోదైంది. అదీ యూరోప్‌లోని రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య మ్యాచ్‌లో కావడం విశేషం. శనివారం గ్రూప్ ‘డి’లో భాగంగా ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. హోరాహోరీ సమరంలో ఇరు జట్లు కూడా గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. అయితే మ్యాచ్ కీలక దశలో నెదర్లాండ్స్‌ను దురదృష్టం వెంటాడింది. డచ్ ప్లేయర్ గ్జెవీ సైమన్స్ చేసిన గోల్‌ను రిఫరీ తిరస్కరించాడు. సుదీర్ఘ సమయం పాటు వీడియో రీప్లేలు చూసిన తర్వాత ఆ గోల్‌ను ‘ఆఫ్‌సైడ్’గా ప్రకటించారు. మరో వైపు తమ స్టార్ ప్లేయర్ ఎంబాపె లేకుండా ఫ్రాన్స్ ఈ మ్యాచ్ బరిలోకి దిగింది. మరో మ్యాచ్‌లో పోర్చు గల్ 3–0 గోల్స్ తేడాతో టర్కీని చిత్తు చేసింది. -
‘యూరో’లో ఇటలీ శుభారంభం
డార్ట్మండ్ (జర్మనీ): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఇటలీ జట్టు శుభారంభం చేసింది. అల్బేనియాతో జరిగిన గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్‌లో ఇటలీ 2–1తో గెలిచింది. ఆట మొదలైన 23 సెకన్లకే అల్బేనియా ప్లేయర్ బజ్రామి గోల్ చేయడంతో చేశాడు. 64 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా నమోదైన గోల్ ఇదే కావడం విశేషం. తొలి నిమిషంలో గోల్ సమరి్పంచుకున్న ఇటలీ వెంటనే తేరుకుంది. 11వ నిమిషంలో బస్తోని... 16వ నిమిషంలో బరెల్లా ఒక్కో గోల్ చేయడంతో ఇటలీ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. హాంబర్గ్‌లో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు 2–1తో పోలాండ్‌ను ఓడించగా... స్టుట్‌గార్ట్‌లో డెన్మార్క్, స్లొవేనియా జట్ల మధ్య గ్రూప్ ‘సి’ మ్యాచ్ 1–1తో ‘డ్రా’ అయింది. -
చరిత్ర సృష్టించిన స్టార్ ఫుట్‌బాలర్.. 41 ఏళ్ల వయసులో..!
ప్రముఖ ఫుట్‌బాలర్, స్వీడిష్ స్టార్ స్ట్రయికర్ జ్లాటన్ ఇబ్రహీమోవిచ్ చరిత్ర సృష్టించాడు. అత్యంత పెద్ద వయసులో యూరోపియన్ ఛాంపియన్ క్వాలిఫయర్ ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. యూరో 2024 గ్రూప్ గేమ్‌లో భాగంగా బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో 73వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన ఇబ్రహీమోవిచ్.. 41 సంవత్సరాల 5 నెలల 21 రోజుల వయసులో యూరో క్వాలిఫయర్ మ్యాచ్ బరిలోకి దిగిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు ఇటాలియన్ గోల్‌కీపర్ డినో జోఫ్ పేరిట ఉండేది. 1983, మే 29న స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌లో డినో 41 ఏళ్ల 3 నెలల ఒక్క రోజు వయసులో యూరో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడాడు. క్లబ్ ఫుట్‌బాల్‌లో ఏసీ మిలాన్‌కు ప్రాతినిధ్యం వహించే ఇబ్రహీమోవిచ్ గత వారాంతంలో సీరీ ఏలో గోల్ సాధించి, అత్యంత పెద్ద వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కూడా రికార్డుల్లోకెక్కాడు. వచ్చే ఏడాది జర్మనీలో జరిగే యూరో కప్ ఫైనల్లో ఆడాలని భావిస్తున్న ఇబ్రహీమోవిచ్.. ఇదే జరిగితే అత్యంత పెద్ద వయసులో (42) యూరో కప్ ఫైనల్స్ ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇదిలా ఉంటే, గ్రూప్-ఎఫ్ యూరో క్వాలిఫయర్ 2024లో భాగంగా బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో ఇబ్రహీమోవిచ్ ప్రాతినిధ్యం వహించిన స్వీడన్ ఓటమిపాలైంది. స్టార్ స్ట్రయికర్ రొమేలు లుకాకు హ్యాట్రిక్ గోల్స్ సాధించడంతో బెల్జియం 3-0 తేడాతో స్వీడన్‌ను చిత్తు చేసింది. లుకాకు మెరుపులతో ఇబ్రహీమోవిచ్ రికార్డు కనుమరుగైంది. ప్రస్తుతం ఫుట్‌బాల్‌లో కొనసాగుతున్న స్టార్లలో గేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్లో, మరో దిగ్గజం మెస్సీ కంటే ఇబ్రహీమోవిచ్ వయసులో చాలా పెద్దవాడు. ఫిట్నెస్ విషయంలో రొనాల్డోకు ఇబ్రహీమోవిచ్కు పోటీ ఎక్కువగా ఉంటుంది. రొనాల్డో 38 ఏళ్ల వయసులో ఫిట్నెస్ కారణంగా అవకాశాలు పొందగలుగుతుంటే, ఇబ్రహీమోవిచ్ రొనాల్డోకు మించి అవకాశాలు సాధిస్తూ, రాణిస్తున్నాడు. -
ఇంగ్లండ్ కల నెరవేరేనా?
నెల రోజులుగా ఫుట్‌బాల్ ప్రియులను అలరిస్తున్న యూరో కప్ టోర్నమెంట్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. లండన్‌లోని విఖ్యాత వెంబ్లీ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక గం. 12:30 నుంచి జరిగే టైటిల్ పోరులో ఇంగ్లండ్, ఇటలీ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. తొలిసారి యూరోలో ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్ కప్ కొట్టేయాలనే కసి మీద ఉండగా... ఇప్పటికే ఒకసారి (1968లో) చాంపియన్‌గా నిలిచిన ఇటలీ రెండోసారి ఆ ఘనత వహించేందుకు ఉత్సాహంగా ఉంది. రెండు జట్లు కూడా గ్రూప్ స్టేజ్ నుంచే ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ తుదిపోరుకు అర్హత సాధించాయి. ఇంగ్లండ్ కెప్టెన్, ఫార్వర్డ్ హ్యారీ కేన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా... గత 33 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇటలీ ఓటమి లేకుండా దూసుకెళుతోంది. ఫైనల్ సోనీ సిక్స్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం ఉంది. -
తొలిసారి ‘యూరో’ ఫైనల్లో ఇంగ్లండ్
లండన్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ అభిమానుల 55 ఏళ్ల నిరీక్షణకు తెర పడింది. ఒక మెగా టోర్నీలో కొన్ని దశాబ్దాల ఎదురుచూపుల తర్వాత ఆ జట్టు ఫైనల్ చేరింది. ప్రతిష్టాత్మక ‘యూరో’ కప్‌లో ఇంగ్లండ్ తుది పోరుకు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ 2–1 గోల్స్ తేడాతో డెన్మార్క్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు సమంగా నిలవగా... అదనపు సమయంలో సాధించిన గోల్‌తో ఇంగ్లండ్ ముందంజ వేసింది. డెన్మార్క్ తరఫున మైకేల్ డామ్స్‌గార్డ్ 30వ నిమిషంలో గోల్ చేసి ఆధిక్యం అందించగా... డెన్మార్క్‌కే చెందిన సైమన్ జార్ ‘సెల్ఫ్ గోల్’ (39వ నిమిషం)తో ఇంగ్లండ్ ఖాతాలో గోల్ చేరి స్కోరు సమమైంది. నిర్ణీత సమయం 1–1తో ముగిసింది. అనంతరం మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్‌లో 104వ నిమిషంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ గోల్ సాధించి తన జట్టును గెలిపించాడు. 1966లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఇంగ్లండ్ ప్రపంచ కప్‌లో గానీ, యూరో కప్‌లో గానీ (26 ప్రయత్నాల్లో) ఫైనల్ చేరలేకపోయింది. ఆద్యంతం హోరాహోరీ... ఇంగ్లండ్, డెన్మార్క్ పోరు ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. సుమారు 66 వేల మంది సొంత ప్రేక్షకుల సమక్షంలో వెంబ్లీ స్టేడియంలో ఇంగ్లండ్ దూకుడు ప్రదర్శించగా...టోర్నీలో సత్తా చాటుతూ వచ్చిన డెన్మార్క్ కూడా అదే జోరు కనబరిచింది. ముఖ్యంగా డెన్మార్క్ గోల్ కీపర్ కాస్పర్ స్కెమికల్ అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థిని పదే పదే అడ్డుకున్నాడు. ఇరు జట్లు తొలి గోల్ కోసం శ్రమిస్తున్న దశలో ఇంగ్లండ్ ఫౌల్ కారణంగా డెన్మార్క్‌కు ఫ్రీ కిక్ అవకాశం దక్కింది. డామ్స్‌గార్డ్ దీనిని సమర్థంగా ఉపయోగించుకోవడంతో ఆ జట్టు ముందంజ వేసింది. ఆ తర్వాత హ్యారీ గోల్ చేసేందుకు చేరువగా వచ్చినా....డెన్మార్క్ కీపర్ ఆ అవకాశం ఇవ్వలేదు. అయితే కొద్ది సేపటికే హ్యారీ సహచరుడు స్టెర్లింగ్‌కు బంతి అందకుండా తప్పించే ప్రయత్నంలో డెన్మార్క్ ఆటగాడు జార్ తన గోల్‌పోస్ట్‌లోకే బంతిని పంపించడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. వివాదాస్పద పెనాల్టీ... స్కోర్లు సమమైన తర్వాత మరో 51 నిమిషాల పాటు ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా ఎవరికీ ఆధిక్యం దక్కలేదు. ఎక్స్ట్రా టైమ్‌లో పెనాల్టీ ఏరియాలోకి దూసుకొచ్చిన ఇంగ్లండ్ ఆటగాడు స్టెర్లింగ్, డెన్మార్క్ ఆటగాడు మథియాస్ జెన్సన్కు తగిలి కింద పడ్డాడు. రిఫరీ పెనాల్టీ ప్రకటించగా... వీడియో రివ్యూ (వార్) తర్వాత అదే ఖాయమైంది. హ్యారీ కొట్టిన కిక్‌ను ఈసారి కూడా స్కెమికల్ సమర్థంగా అడ్డుకున్నా... ‘రీబౌండ్’లో హ్యరీ మళ్లీ గోల్ పోస్ట్‌లోకి పంపించడంతో వెంబ్లీ మైదానం హోరెత్తిపోయింది. ఈ పెనాల్టీపై డెన్మార్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా లాభం లేకపోయింది. -
29 ఏళ్ల తర్వాత...
బాకు (అజర్బైజాన్): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో డెన్మార్క్ జట్టు 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంది. చెక్ రిపబ్లిక్‌తో శనివారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ 2–1తో గెలిచింది. చివరిసారి డెన్మార్క్ 1992లో సెమీఫైనల్ చేరుకోవడమే కాకుండా ఏకైకసారి టైటిల్ కూడా సాధించింది. డెన్మార్క్ తరఫున డెలానీ (5వ ని.లో), డాల్బెర్గ్ (42వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. చెక్ రిపబ్లిక్ తరఫున షిక్ (49వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. మరో క్వార్టర ఫైనల్లో ఇటలీ 2–1తో బెల్జియంను ఓడించి సెమీఫైనల్ చేరింది. -
UEFA EURO 2020: ఫ్రాన్స్ చేజేతులా...
బుకారెస్ట్ (రొమేనియా): జట్టులో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు... అంతర్జాతీయ టోర్నీలలో ఎన్నో గొప్ప విజయాలు... అయితేనేం తప్పిదాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్, యూరో కప్ రన్నరప్ ఫ్రాన్స్ జట్టు విషయంలో ఇలాగే జరిగింది. యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ జట్టు కథ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ ‘పెనాల్టీ షూటౌట్’లో 5–4తో ఫ్రాన్స్ జట్టును ఓడించి యూరో టోర్నీలో తొలిసారిగా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. స్విట్జర్లాండ్ తరఫున సెఫరోవిచ్ (15వ, 81వ ని.లో) రెండు గోల్స్... గావ్రనోవిచ్ (90వ ని.లో) ఒక గోల్ చేశారు. ఫ్రాన్స్ జట్టుకు కరీమ్ బెంజెమా (57వ, 59వ ని.లో) రెండు గోల్స్... పోగ్బా (75వ ని.లో) ఒక గోల్ అందించారు. అదనపు సమయంలో రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘పెనాల్టీ షూటౌట్’ను నిర్వహించారు. ఇందులో స్విట్జర్లాండ్ ఆటగాళ్లు ఐదు షాట్లను లక్ష్యానికి చేర్చారు. ఫ్రాన్స్ తరఫున తొలి నలుగురు ఆటగాళ్లు సఫలమవ్వగా...చివరి షాట్ తీసుకున్న కిలియన్ ఎంబాపె మాత్రం విఫలమయ్యాడు. ఎంబాపె సంధించిన షాట్‌ను స్విట్జర్లాండ్ గోల్‌కీపర్ యాన్ సమర్ కుడివైపునకు డైవ్ చేస్తూ ఎడమ చేత్తో అద్భుతంగా నిలువరించి ఫ్రాన్స్ విజయాన్ని అడ్డుకున్నాడు. 1992 తర్వాత ఫ్రాన్స్ జట్టుపై స్విట్జర్లాండ్ నెగ్గడం ఇదే తొలిసారి. యూరో టోర్నీలో ఏనాడూ స్విట్జర్లాండ్ చేతిలో ఓడిపోని ఫ్రాన్స్‌కు ఈసారీ విజయం దక్కేది. కానీ చివరి 10 నిమిషాల్లో అలసత్వం ఫ్రాన్స్ కొంపముంచింది. ఫ్రాన్స్ రక్షణశ్రేణిలోని లోపాలను సది్వనియోగం చేసుకొని స్విట్జర్లాండ్ చివరి పది నిమిషాల్లో రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. ఆ తర్వాత అదనపు సమయంలో ఫ్రాన్స్‌ను నిలువరించి... షూటౌట్లో ఆ జట్టును నాకౌట్ చేసింది. జర్మనీకి ఇంగ్లండ్ షాక్... లండన్‌లో మంగళవారం జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 2–0 గోల్స్ తేడాతో మూడుసార్లు చాంపియన్ జర్మనీ జట్టును ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇంగ్లండ్ తరఫున స్టెర్లింగ్ (75వ ని.లో), హ్యారీ కేన్ (86వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. -
UEFA EURO 2020: పోర్చు‘గల్లంతు’
సెవిల్లె (స్పెయిన్): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ పోర్చుగల్ జట్టు కథ ముగిసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బెల్జియం 1–0 గోల్ తేడాతో క్రిస్టి యానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టును ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. ఆట 42వ నిమిషంలో ఎడెన్ హజార్డ్ గోల్‌తో బెల్జియం ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఇటలీతో బెల్జియం ఆడుతుంది. సోమవారం జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 5–3తో క్రొయేషియాను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
Euro Cup: పోర్చుగల్ ఔట్.. రొనాల్డో భావోద్వేగం
సెవిలా: యూరో కప్ 2020 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ పోర్చుగల్ అనూహ్యంగా వైదొలిగింది. ఆదివారం రాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో 0-1 తేడాతో ఓటమిపాలై తమ అభిమానులను షాక్‌కు గురి చేసింది. 42వ నిమిషంలో థోర్గాన్ హజార్డ్ చేసిన గోల్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన బెల్జియం.. తర్వాత ప్రత్యర్థికి సమం చేసే అవకాశం ఇవ్వకుండా ఆటను ముగించింది. తమ జట్టు అనూహ్య రీతిలో టోర్నీ నుంచి వైదొలగడంతో స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం అసహనంతో తన ఆర్మ్ బ్యాండ్‌ను నేలకేసి కొట్టాడు. కెరీర్లో తన చివరి యూరో కప్‌లో ఆడిన రొనాల్డోకు ప్రిక్వార్టర్స్‌లోనే తన జట్టు ఇంటి దారి పట్టడం అస్సలు మింగుడు పడలేదు. Nahhh mannn, Possibly the last every time we see Ronaldo at the EUROS😢😢😢 pic.twitter.com/1aPQVOLr0F — Dhruvzzz (@dhruvzz8) June 27, 2021 కాగా, ఈ టోర్నీలో సూపర్ ఫామ్‌లో ఉన్న రొనాల్డో.. నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతే కాదు, టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. యూరో కప్‌లో అతను మొత్తం 14 గోల్స్ చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇదే టోర్నీలో ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించడం ద్వారా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్(109 గోల్స్) సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇరాన్‌కు చెందిన అలీ డేయీ(109 గోల్స్)తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ప్రిక్వార్టర్స్‌లో అతను ఒక్క గోల్ చేసుంటే తన జట్టును గట్టెక్కించడంతో పాటు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేవాడు. చదవండి: టీ20 ప్రపంచకప్ వేదిక మార్పు.. -
ప్రి క్వార్టర్స్‌లో పోర్చుగల్, జర్మనీ
బుడాపెస్ట్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ పోర్చుగల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. జర్మనీ, ఫ్రాన్స్ జట్లు కూడా నాకౌట్ దశకు చేరాయి. గ్రూప్ ‘ఎఫ్’లో భాగంగా బుధవారం అర్ధరాత్రి పోర్చుగల్, ఫ్రాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. 31వ, 60వ నిమిషాల్లో అతను రెండు గోల్స్ సాధించాడు. ఫ్రాన్స్ జట్టులో కరిమ్ బెన్జిమా ఇంజూరి టైమ్ (45+2వ ని.)లో, 47వ నిమిషంలో రెండు గోల్స్ చేశాడు. ఇదే గ్రూప్‌లో ఉన్న జర్మనీ... హంగేరితో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌ను కూడా 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ఐదు పాయింట్లతో ఫ్రాన్స్ ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలవగా... నాలుగు పాయింట్లు సాధించిన జర్మనీ రెండో స్థానంలో నిలిచింది. పోర్చుగల్ కూడా 4 పాయింట్లు సాధించినప్పటికీ... జర్మనీ చేతిలో ఓడటంతో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. టోర్నీ నిబంధనల ప్రకారం గ్రూప్‌లో టాప్–2లో నిలిచిన జట్లు నేరుగా... మూడో స్థానంలో నిలిచిన 6 జట్ల నుంచి మెరుగైన నాలుగు టీమ్‌లు ప్రిక్వార్టర్స్‌కు చేరుకునే అవకాశం ఉంది. దాంతో పోర్చుగల్ కూడా నాకౌట్ దశకు అర్హత సాధించింది. శనివారం నుంచి ప్రిక్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లు ఆరంభమవుతాయి. చరిత్రకు గోల్ దూరంలో రొనాల్డో ఫుట్‌బాల్ చరిత్రలో మరో రికార్డును తన పేరిట లిఖించుకోవడానికి పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గోల్ దూరంలో నిలిచాడు. యూరో కప్‌లో భాగంగా ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన రొనాల్డో... అంతర్జాతీయ ఫుట్‌బాల్ (దేశం తరఫున)లో ఇరాన్ ప్లేయర్ అలీ డయీ పేరిట ఉన్న అత్యధిక గోల్స్ (109) రికార్డును సమం చేశాడు. రొనాల్డో మరొక్క గోల్ సాధిస్తే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కుతాడు. -
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ఆ జాబితాలో నంబర్ వన్ స్థానం
బుడాపెస్ట్: యూరో కప్ 2020 ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ రికార్డు ఇరాన్‌కు చెందిన అలీ డేయీ(109 గోల్స్) పేరిట ఉండగా, బుధవారం జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో(109) రెండు గోల్స్ సాధించడంతో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. కాగా, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో చరిత్ర సృష్టించేందుకు రొనాల్డో కేవలం ఒక్క గోల్ దూరంలో ఉన్నాడు. ఈ జాబితాలో భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ 74 గోల్స్‌తో 11వ స్థానంలో ఉండగా, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీ 73 గోల్స్‌తో 12వ స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే, ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్ డ్రా కావడంతో పోర్చుగల్ నాకౌట్ దశకు ప్రవేశించింది. టోర్నీలో పోర్చుగల్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో రొనాల్డో చరిత్ర సృష్టించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాగా, ప్రస్తుత టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచిన రొనాల్డో.. టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడు కూడా కావడం విశేషం. యూరో కప్‌లో అతను మొత్తం 14 గోల్స్ చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. చదవండి: ICC Rankings: టాప్ ర్యాంక్‌కు దూసుకెళ్లిన జడేజా -
UEFA Euro 2020: ఆస్ట్రియా తొలిసారి...
బుకారెస్ట్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఆస్ట్రియా జట్టు తొలిసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఉక్రెయిన్‌తో సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రియా 1–0తో గెలిచింది. 21వ నిమిషంలో బౌమ్గార్ట్నర్ ఆస్ట్రియాకు ఏకైక గోల్ అందించాడు. రెండో విజయంతో గ్రూప్ ‘సి’లో ఆస్ట్రియా ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 2008, 2016 యూరో టోర్నీలలో ఆస్ట్రియా లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. మరోవైపు అమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3–0తో నార్త్ మెసడోనియాను ఓడించి తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘సి’ టాపర్‌గా నిలిచింది. నెదర్లాండ్స్ తరఫున డెపే (24వ ని.లో) ఒక గోల్ చేయగా... వినాల్డమ్ (51వ, 58వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. -
అంతా షాక్: ఆట జరుగుతుండగానే మైదానంలో పారాచూట్‌తో ల్యాండింగ్
మ్యూనిచ్: యూరోకప్ 2020 ఫుట్‌బాల్ పోటీల్లో భాగంగా జర్మనీ, ఫ్రాన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ముందు ఓ వ్యక్తి వినూత్నంగా నిరసనను ప్రదర్శించాడు. "కిక్ అవుట్ అయిల్!", "గ్రీన్ పీస్" అని రాసివున్న పారాచూట్‌తో మైదానంలో ల్యాండయ్యాడు. ఆయిల్ వాడకాన్ని ఆపేయాలంటూ నినాదాలు చేశాడు. కాగా, ఈ యూరో కప్‌కు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న రష్యా ఇంధన ఉత్పత్తి సంస్థ గాజ్‌ప్రోమ్‌కు వ్యతిరేకంగా గతంలోనూ గ్రీన్‌పీస్ స్వచ్ఛంద సంస్థ నిరసనలు తెలిపింది. ఇదిలా ఉంటే, నిరసనకారుడు మైదానంలో పారాచూట్‌తో ల్యాండ్ అయ్యే సమయంలో పలువురు అభిమానులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఫ్రాన్స్ కోచ్ డిడియర్ డెస్చాంప్స్ తృటిలో అపాయం నుంచి తప్పించుకున్నాడు. క్షతగాత్రులంతా వార ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పారాచూట్ కిందకు దిగే సమయంలో దాని వైర్లు స్టేడియం పైకప్పుకు అనుసంధానంగా ఉన్న ఓవర్ హెడ్ కెమెరాకు తట్టుకోవడంతో ప్రత్యక్ష ప్రసారానికి కాసేపు అంతరాయం కలిగింది. హఠాత్తుగా లైవ్ కట్ కావడంతో మైదానంలో ఏం జరుగుతుందోనని అభిమానులు ఆందోళన చెందారు. నిరసనకారుడు చేపట్టిన ఈ చర్యను యురోపియన్ సాకర్ పాలకమండలి ఖండించింది. నిరసన తెలియజేసిన విధానాన్ని నిర్లక్ష్యం మరియు ప్రమాదకర చర్యగా పేర్కొంది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించి, నిరసనకారుడిపై చర్యలకు ఆదేశిస్తామని యూఈఎఫ్ఏ వెల్లడించింది. చదవండి: గ్రౌండ్లో కుప్పకూలిన మరో స్టార్ ప్లేయర్.. -
గ్రౌండ్లో కుప్పకూలిన మరో స్టార్ ప్లేయర్..
మ్యూనిచ్: డెన్మార్క్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్ ఘటన మరువకముందే యూరోకప్ 2020లో మరో స్టార్ ప్లేయర్ గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. ఆ ఆటగాడు10 నుంచి 15 సెకన్ల పాటు స్పృహ కోల్పోవడంతో సహచర ఆటగాళ్లు ఆందోళన చెందారు. జర్మనీతో మ్యాచ్ సందర్భంగా ఫ్రాన్స్ డిఫెండర్ బెంజమిన్ పవార్డ్ ప్రత్యర్థి ప్లేయర్ రాబిన్ గోసెన్స్ను ఢీకొట్టడంతో వెంటనే కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు. అయితే ఘటన తర్వాత కొన్ని నిమిషాల పాటు పవార్డ్కు చికిత్సనందించడంతో అతను కోలుకున్నాడు. అనంతరం మ్యాచ్‌లో కూడా కొనసాగాడు. అయితే, స్పృహ కోల్పోయిన ఆటగాడిని మ్యాచ్‌లో ఎలా కొనసాగిస్తారని, అతడు కంకషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో ఫ్రాన్స్ జట్టు యాజమాన్యం అతన్ని మైదానం నుంచి బయటకు పంపింది. అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని బరిలోకి దించింది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 1-0తో జర్మనీపై గెలుపొందింది. మ్యాచ్ అనంతరం గాయపడిన పవార్డ్ మాట్లాడుతూ.. ప్రత్యర్ధి ఆటగాడు బలంగా ఢీకొట్టడం వల్ల షాక్‌కు లోనయ్యాని, దాంతో కాసేపు స్పృహ కోల్పోయానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, ఇదే టోర్నీలో డెన్మార్క్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మైదానంలోనే కుప్పకూలిన విషయం తెలిసిందే. అతన్ని వెంటనే గ్రౌండ్ నుంచి హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఊహించని ఈ పరిణామానికి షాక్ తిన్న ఫుట్‌బాల్ ప్రపంచం, వెంటనే అలాంటి ఘటనే పునరావృతం కావడంతో ఉలిక్కిపడింది. అయితే, పవార్డ్కు ఏమీ కాకపోవడంతో సాకర్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: కోక్ బాటిల్ వ్యవహారంతో 30 వేల కోట్లు హాంఫట్, మరి ఈయన బీర్ బాటిల్ తీసేశాడు -
UEFA EURO 2020: నెదర్లాండ్స్ బోణీ
అమ్‌స్టర్‌డామ్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్న మెంట్లో మాజీ చాంపియన్ నెదర్లాండ్స్ గెలుపు బోణీ కొట్టింది. గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3–2తో ఉక్రెయిన్ను ఓడించింది. నెదర్లాండ్స్ తరఫున జార్జినో వినాల్డమ్ (52వ ని.లో), వెగోర్ట్స్ (59వ ని.లో), డమ్ఫ్రీస్ (85 వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఉక్రెయిన్ తరఫున కెప్టెన్ ఆండ్రీ యామలెంకో (75వ ని.లో)... మలినోవ్స్కీ (79వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. గ్రూప్ ‘డి’లో జరిగిన మరో మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్ 2–0తో స్కాట్లాండ్పై గెలిచింది. చెక్ ప్లేయర్ పాట్రిక్ షీక్ ఈ రెండు గోల్స్ (42వ, 52వ ని.లో) సాధించాడు. గ్రూప్ ‘ఇ’లో జరిగిన పోరులో స్లోవేకియా 2–1 గోల్స్ తేడాతో పోలాండ్‌పై గెలిచింది. పోలాండ్ గోల్ కీపర్ స్జెజెన్సీ (18వ ని.లో) సెల్ఫ్ గోల్‌తో స్లోవేకియాకు తొలి గోల్‌ను అందించగా... రెండో గోల్‌ను స్క్రినియార్ (69వ ని.లో) చేశాడు. పోలాండ్ తరుఫున నమోదైన ఏకైక గోల్‌ను లినెట్టీ (46వ ని.లో) సాధించాడు. -
డెన్మార్క్‌కు షాక్
కొపెన్‌హగన్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో తొలిసారి ఆడుతున్న ఫిన్లాండ్ జట్టు... తమ మొదటి మ్యాచ్‌లోనే మాజీ చాంపియన్ డెన్మార్క్‌కు షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన పోరులో ఫిన్లాండ్ 1–0తో డెన్మార్క్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఫిన్లాండ్ ఆటగాడు పొహాన్పొలావో ఆట 60 నిమిషంలో గోల్ చేశాడు. గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో బెల్జియం 3–0తో రష్యాపై నెగ్గింది. గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 1–0తో క్రొయేషియాపై... గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆస్ట్రియా 3–1తో నార్త్ మెసడోనియాపై నెగ్గాయి. -
మైదానంలో ఆటగాడికి గాయం.. ప్రత్యర్ధి అభిమానులు ఏం చేశారో తెలుసా..?
కోపెన్‌హెగెన్: ఆట శత్రువులను సైతం దగ్గరికి చేస్తుందనటానికి ఇప్పుడు మనం చూడబోయే వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ. యూరోకప్ 2020 ఫుట్‌బాల్ పోటీల్లో భాగంగా ఫిన్లాండ్, డెన్మార్క్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అపురూప ఘట్టం చోటు చేసుకుంది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటన క్రీడా ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో డెన్మార్క్ స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్ గాయపడ్డాడు. గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో ఎరిక్సన్ కెమెరా కంట పడకుండా డెన్మార్క్ ఆటగాళ్లంతా చుట్టూ రక్షణగా నిలిచారు. ఇది గమనించిన ఫిన్లాండ్ అభిమానులు తమ చేతుల్లోని జాతీయ జెండాలను డెన్మార్క్ ఆటగాళ్లకు ఇచ్చారు. Prayers for Christian Eriksen 🙏 Finland fans gave their flags after Christian Eriksen collapsed during the match 🇫🇮 Wishing him speedy recovery. pic.twitter.com/LZ3hSn4Gka — Nigel D'Souza (@Nigel__DSouza) June 12, 2021 వాటి సాయంలో డెన్మార్క్ క్రీడాకారులు ఎరిక్సన్ను మైదానం బయటకు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఇరు దేశాల అభిమానులు క్రిస్టియన్ ఎరిక్సన్ పేరును స్మరిస్తూ.. హర్షధ్వానాలు చేశారు. కాగా, ఫిన్లాండ్ అభిమానులు చూపిన ఔదార్యం క్రీడాభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియా వేదికగా ఆ దేశ అభిమానులపై ప్రశంసల వర్షం కురుస్తుంది. నిజమైన క్రీడా ప్రేమికులు తమ అభిమానాన్ని ఇలానే చాటుతారంటూ కామెంట్ల వర్షం కురుస్తుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఫిన్లాండ్ 1-0 తేడాతో డెన్మార్క్‌పై విజయం సాధించింది. సెకండాఫ్‌లో ఫిన్లాండ్ ప్లేయర్ జోయెల్ పోజాన్పాలో గోల్ చేసి, తమ జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. చదవండి: పాపం మనీశ్ పాండే.. అవకాశాలివ్వకుండా తొక్కేశారు! -
ఇటలీ శుభారంభం
రోమ్: ప్రతిష్టాత్మక యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో మాజీ చాంపియన్ ఇటలీ శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా టర్కీతో జరిగిన మ్యాచ్‌లో ఇటలీ 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. 53వ నిమిషంలో టర్కీ ప్లేయర్ దెమిరల్ సెల్ఫ్ గోల్‌తో ఇటలీ ఖాతా తెరిచింది. ఆ తర్వాత కిరో ఇమోబిల్ (66వ నిమిషంలో), లొరెంజో (79వ నిమిషంలో) ఇటలీ జట్టుకు ఒక్కో గోల్ అందించారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా వేల్స్, స్విట్జర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. -
పాజిటివ్ వస్తే మ్యాచ్ రెండు రోజులు వాయిదా
జెనీవా (స్విట్జర్లాండ్): ఈ ఏడాదికి వాయిదా పడ్డ యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను సాఫీగా జరిపేందుకు నడుం బిగించిన యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లలోని ఏ ఆటగాడైనా కరోనా బారిన పడితే... ఆ జట్టు ఆడే తదుపరి మ్యాచ్‌ను గరిష్టంగా రెండు రోజుల పాటు వాయిదా వేసే కొత్త రూల్‌ను రూపొందించనట్లు పేర్కొంది. అంతేకాకుండా జట్టు సభ్యుల సంఖ్యను 23 నుంచి 26కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల ఏ జట్టయినా తన మ్యాచ్‌ను ఆడకపోతే... 0–3తో ఆ జట్టు ఓడిందని, దానికి సంబంధిచిన పూర్తి పాయింట్ల్ల (3)ను ప్రత్యర్థి జట్టుకు అందజేసేలా నిబంధనను తీసుకొచ్చారు. జూన్ 11 నుంచి జూలై 11 వరకు 31 రోజుల పాటు యూరప్‌లోని 11 నగరాల్లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. 24 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. మ్యాచ్‌ల సందర్భంగా 25 శాతం మంది అభిమానులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. -
2020 క్రీడలు: ఒక వైరస్... ఒక 36...
ప్రతీ ఏటా క్రీడల క్యాలెండర్... ఫలితాలు, రికార్డులు, అవార్డులు, పురస్కారాలతో కనిపించేది. చాంపియన్ల విజయగర్జనతో, దిగ్గజాల మైలురాళ్లతో, ఆటకే వన్నెతెచ్చిన ఆణిముత్యాల నిష్క్రమణలతో ముగిసేది. కానీ ఈ ఏడాది మాత్రం కంటికి కనిపించని వైరస్ క్రీడల క్యాలెండర్‌ను కలవరపెట్టింది. కరోనా కాలం క్రీడలకు కష్టకాలాన్నే మిగిల్చింది. టోక్యో ఒలింపిక్స్, యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలాంటి మెగా ఈవెంట్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ను ఆపేసింది. మరెన్నో క్రీడలను రద్దు చేసింది. ప్రేక్షకుల్ని మైదానానికి రాకుండా చేసింది. కొత్తగా ‘బయో బబుల్’ను పరిచయం చేసింది. ఒకవైపు కరోనా కల్లోలం కొనసాగుతుండగా... మరోవైపు ఫార్ములావన్‌లో హామిల్టన్ రయ్‌మంటూ దూసుకెళ్లాడు. 15 ఏళ్ల తర్వాత బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టాడు. ఎవ్వరూ ఊహించని విధంగా భారత క్రికెట్ జట్టు 36కే ఆలౌటై షాక్ ఇచ్చింది. మొత్తానికి 2020 కొందరికి తీపి గుర్తులు, మరికొందరికి చేదు గుళికల్ని పంచివెళ్లింది. అవేంటో చూద్దాం...! –సాక్షి క్రీడా విభాగం మహాబలుడు మళ్లీ వచ్చాడు! అమెరికా బాక్సింగ్ యోధుడు, ప్రపంచ హెవీవెయిట్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ మళ్లీ రింగ్‌లో దిగేందుకు ‘సై’ అన్నాడు. 15 ఏళ్ల తర్వాత పంచ్ విసిరేందుకు కసరత్తులు కూడా చేశాడు. 54 ఏళ్ల వయసులో ప్రత్యర్థి రాయ్ జోన్స్ జూనియర్‌తో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో తలపడ్డాడు. త్వరలో హోలీఫీల్డ్‌తో టైసన్ ఢీకొట్టేందుకు అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. దిగ్గజాలను తీసుకెళ్లింది... ఈ ఏడాది... క్రీడాభిమానులను దుఃఖసాగరంలో ముంచింది. ఆయా క్రీడలకు తమ ఆటతీరుతో, అలుపెరగని పోరాటంతో వన్నె తెచ్చిన దిగ్గజాలను తీసుకెళ్లింది. అమెరికాను ఊపేసే నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లో సూపర్ స్టార్ హోదా పొందిన కోబీ బ్రయాంట్ తన అభిమానులతో శాశ్వత సెలవు తీసుకున్నాడు. హెలికాప్టర్ ప్రమాదంలో బ్రయాంట్‌తోపాటు అతని 13 ఏళ్ల కుమార్తె దుర్మరణం పాలైంది. ఇది ఈ సంవత్సరం క్రీడాలోకంలో పెను విషాదంగా నిలిచింది. అలాగే ఫుట్‌బాల్ మాంత్రికుడు, అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా మరణం క్రీడాలోకాన్ని శోకంలో ముంచింది. గుండెపోటుతో అతను మృతి చెందాడు. భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్, అలనాటి ఫుట్‌బాల్ మేటి పీకే బెనర్జీ, చున్నీ గోస్వామి ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. క్రికెట్లో చేతన్ చౌహాన్, రాజిందర్ గోయెల్, ఆస్ట్రేలియన్ డీన్ జోన్స్‌లు అనారోగ్యంతో 2020లో తనువు చాలించారు. ‘రికార్డు’ల హామిల్టన్ మార్చి 15న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో మొదలవ్వాల్సిన ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌కు కరోనా అంతరాయం కలిగించింది. 22 రేసులున్న ఎఫ్1 సీజన్‌ను చివరకు 17 రేసులకు కుదించారు. ప్రేక్షకులకు ప్రవేశం లేకుండా రేసులను నిర్వహించారు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకొని ఏడోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మైకేల్ షుమాకర్ (జర్మనీ) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. అంతేకాకుండా ఎఫ్1లో అత్యధిక రేసుల్లో గెలిచిన డ్రైవర్‌గా షుమాకర్ (91) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ (95) తిరగరాశాడు. ఆన్లైన్లో ఎత్తులు... కరోనా మహమ్మారి పలు క్రీడా టోర్నమెంట్లపై ప్రభావం చూపినా మేధో క్రీడ చెస్ మాత్రం కొత్త ఎత్తులకు ఎదిగింది. ముఖాముఖి టోర్నీలకు బ్రేక్ పడినా ఆన్లైన్లో నిరాటంకంగా టోర్నీలు జరిగాయి. తొలిసారి ఆన్లైన్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు రష్యాతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. భారత్, రష్యా మధ్య ఫైనల్ కీలకదశలో ఉన్నపుడు సాంకేతిక సమస్య తలెత్తడంతో నిర్వాహకులు రెండు జట్లను విజేతగా ప్రకటించారు. చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో తెలుగు తేజాలు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక సభ్యులుగా ఉన్నారు. ఆన్లైన్లోనే జరిగిన ప్రపంచ యూత్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు నిహాల్ సరీన్, గుకేశ్, రక్షిత స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ అలరించింది ఈ ఏడాదిలో తొలి మూడు నెలలు క్రికెట్ సాగినా... ఆ తర్వాత కరోనా వైరస్‌తో బ్రేక్ వచ్చింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఐదోసారి విశ్వవిజేతగా నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలిసారి ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరోవైపు కరోనా వైరస్‌తో భారత్‌లో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ మధ్యలోనే ఆగిపోయింది. కరోనా తీవ్రరూపం దాల్చడంతో దాదాపు నాలుగు నెలలు క్రికెట్ ఆట సాగలేదు. జూలై చివరి వారంలో ఇంగ్లండ్–వెస్టిండీస్ జట్ల మధ్య ‘బయో బబుల్’ వాతావరణంలో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ మొదలైంది. ప్రతీ ఏటా వేసవిలో వినోదాన్ని పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీ కరోనా కారణంగా ఆలస్యమైంది. ఒకదశలో ఈ టోర్నీ జరుగుతుందా లేదా అనే అనుమానం కలిగినా... చివరకు ఐపీఎల్ భారత్ దాటింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ‘బయో బబుల్’ వాతావరణంలో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 13వ సీజన్ నిరాటంకంగా సాగింది. ముంబై ఇండియన్స్ జట్టు ఐదోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆగస్టు 15న ఎమ్మెస్ ధోని హఠాత్తుగా క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అదే రోజున సురేశ్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్ ముగిశాక భారత జట్టు దుబాయ్ నుంచి నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అడిలైడ్ వేదికగా జరిగిన డే–నైట్ తొలి టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే ఆలౌటై తమ టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరును నమోదు చేసి ఓటమి పాలైంది. అయితే మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకొని 2020 ఏడాదిని ఘనంగా ముగించింది. ఫెడరర్...నాదల్ 20–20 ఈ 2020 ఏడాది ఇద్దరు టెన్నిస్ సూపర్స్టార్ల టైటిళ్ల సంఖ్యను ట్వంటీ–ట్వంటీగా సమం చేసింది. స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియన్ ఓపెన్ (2018)తో 20వ టైటిల్ సాధించాడు. ఇతనికి సరైనోడు... సమఉజ్జీ అని టెన్నిస్ ప్రపంచం ప్రశంసలందుకున్న రాఫెల్ నాదల్ దీనికి న్యాయం చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్‌తో ఈ స్పానిష్ లెజెండ్ కూడా 20వ టైటిల్‌తో ఫెడరర్ సరసన నిలిచాడు. ఇలా ఈ ఆల్‌టైమ్ గ్రేట్ స్టార్స్ ఇపుడు 20–20 స్టార్స్ అయ్యారు. కరోనా కారణంగా ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు మాత్రమే జరిగాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ విజేతగా నిలువగా... కరోనా దెబ్బకు 1945 తర్వాత వింబుల్డన్ టోర్నమెంట్‌ను నిర్వాహకులు తొలిసారి రద్దు చేశారు. ప్రేక్షకులు లేకుండా యూఎస్ ఓపెన్‌ను నిర్వహించగా... ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ విజేతగా నిలిచి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. సెప్టెంబర్‌కు వాయిదా పడిన ఫ్రెంచ్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ తన ఆధిపత్యం చాటుకొని 13వసారి చాంపియన్‌గా నిలిచాడు. యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా తాను కొట్టిన బంతి లైన్ అంపైర్‌కు తగలడంతో సస్పెన్షన్‌కు గురైన సెర్బియా స్టార్ జొకోవిచ్ ఆరోసారి సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించాడు. పీట్ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. -
58 ఏళ్లకు... కల నిజమాయె
ఎప్పుడు.. ఇంకెప్పుడు.. అంటూ దాదాపు ఆరు దశాబ్దాలుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన ఫ్రాన్స్ అభిమానుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. అంతర్జాతీయ టోర్నీలలో తలపడిన ప్రతిసారీ తమను దెబ్బతీస్తున్న జర్మనీపై ఎట్టకేలకు సొంత గడ్డపై పగ తీర్చుకుంది. 1958 ప్రపంచకప్‌లో ఆ జట్టుపై తొలిసారి గెలుపు రుచి చూసిన ఫ్రాన్స్ ఆ తర్వాత ఇన్నేళ్లకు పండగ చేసుకోగలిగింది. అటు మ్యాచ్‌లో నమోదైన రెండు గోల్స్‌నూ తనే సాధించిన ఆంటోనీ గ్రిజ్మన్ జట్టును ఒంటిచేత్తో యూరో కప్ ఫైనల్‌కు చేర్చాడు. ఆదివారం జరిగే ఫైనల్లో పోర్చుగల్‌తో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. జర్మనీకి షాక్ ఇచ్చిన ఫ్రాన్స్ * 1958 అనంతరం ఆ జట్టుపై తొలి విజయం * యూరో ఫైనల్లో పోర్చుగల్‌తో అమీతుమీ మార్సిలీ: ఫ్రాన్స్ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. సుదీర్ఘ కాలం అనంతరం తమ చిరకాల ప్రత్యర్థి జర్మనీపై ఫ్రాన్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఫార్వర్డ్ ఆంటోనీ గ్రిజ్మన్ సూపర్ షోతో పాటు గోల్ కీపర్ హ్యూగో లారిస్ వీరోచిత పోరాటం తమ జట్టు కోరికను నెరవేర్చాయి. గురువారం ప్రపంచ చాంపియన్స్ జర్మనీతో జరిగిన యూరో కప్ రెండో సెమీఫైనల్లో ఫ్రాన్స్ 2-0తో నెగ్గింది. ఫ్రాన్స్ తరఫున గ్రిజ్మన్ (45+2 పెనాల్టీ, 72వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించాడు. ఓవరాల్‌గా తను ఈ టోర్నీలో ఆరు గోల్స్‌తో టాప్‌లో ఉన్నాడు. 1958 ప్రపంచకప్‌లో వెస్ట్ జర్మనీపై తొలిసారి నెగ్గిన ఫ్రాన్స్ ఆ తర్వాత 1982, 1986 సెమీస్‌లో, 2014 క్వార్టర్స్‌లోనూ పరాజయం పాలైంది. అటు ప్రపంచ రెండో ర్యాంకర్ జర్మనీ తమ నాలుగో యూరో టైటిల్‌ను సాధించాలనుకున్నా మరియో గోమెజ్, మాట్స్ హమ్మెల్స్, సమి ఖెదిరా గైర్హాజరుతో డిఫెన్స్‌లో బలహీనపడి రాణించలేకపోయింది. మ్యాచ్ ప్రథమార్ధంలో జర్మనీ ఎక్కువ శాతం బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకుంది. కానీ ఫ్రాన్స్ మాత్రం దూకుడు మంత్రాన్ని జపించి ప్రారంభంలోనే అవకాశాలను దక్కించుకుంది. ఏడో నిమిషంలోనే గ్రిజ్మన్ బాటమ్ కార్నర్ వైపు గోల్ కోసం ప్రయత్నించినా జర్మనీ కీపర్ న్యూయర్ వేగంగా డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. అయితే పదో నిమిషం అనంతరం జర్మనీ ఒక్కసారిగా మ్యాచ్‌ను తమవైపునకు తిప్పుకుంది. అయితే ఈ దశలో ముల్లర్, ఓజిల్ గోల్స్ అవకాశాలకు ఫ్రాన్స్ కీపర్ లారిస్ అడ్డుగోడలా నిలబడ్డాడు. తొలి అర్ధభాగం కొద్ది సెకన్లలో ముగిసేవరకు కూడా జర్మనీ తమదైన శైలిలోనే ఆడింది. అయితే ఇంజ్యూరీ సమయం (45+2) సమయంలో గ్రిజ్మన్ కార్నర్‌ను పెనాల్టీ ఏరియాలో పాట్రిక్ ఎవ్రా హెడర్ ద్వారా గోల్‌గా మలచాలని భావించాడు. అయితే పక్కనే ఉన్న జర్మన్ కెప్టెన్ స్క్వీన్స్టీగర్ దాన్ని చేతితో అడ్డుకున్నాడు. దీంతో రిఫరీ ఫ్రాన్స్‌కు స్పాట్ కిక్ అవకాశాన్నిచ్చారు. దీన్ని కీపర్ న్యూయర్‌ను బోల్తా కొట్టిస్తూ గ్రిజ్మన్ ఎడమవైపు కార్నర్‌కు బంతిని పంపి బోణీ చేశాడు. ఇక ద్వితీయార్ధం 59వ నిమిషంలో జర్మనీ కీలక సెంటర్ బ్యాక్ ఆటగాడు జెరోమ్ బోటెంగ్ గాయం కారణంగా మైదానం వీడడం జట్టును ఇబ్బంది పెట్టింది. అటు ఫ్రాన్స్ డిఫెన్స్ పటిష్టంగా కనబడడంతో జర్మనీ చెమటోడ్చాల్సి వచ్చింది. 70వ నిమిషంలో తమకు లభించిన ఫ్రీకిక్‌ను జర్మనీ సద్వినియోగం చేసుకోలేదు. కానీ 72వ నిమిషంలో ఫ్రాన్స్ రెండో గోల్ చేసి జర్మనీకి తిరుగులేని షాక్ ఇచ్చింది. లెఫ్ట్ వింగ్‌లో పోగ్బా జర్మనీ డిఫెండర్ హెక్టర్‌ను ఏమార్చుతూ బంతిని గోల్ పోస్టు పైకి పంపగా... కీపర్ న్యూయర్ తన అరచేతితో ఆపాలని చూసినా బంతి బయటికి వచ్చింది. అయితే అక్కడే ఉన్న గ్రిజ్మన్ తన ఎడమకాలితో బంతిని నెట్‌లోనికి పంపడంతో జర్మనీ దిగ్భ్రాంతికి లోనయ్యింది. చివరి 15 నిమిషాలు ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. 82వ నిమిషంలో టోనీ క్రూస్ (జర్మనీ) షాట్, 86వ నిమిషంలో గ్రిజ్మన్ హ్యాట్రిక్ షాట్ విఫలమయ్యాయి. 90+3వ నిమిషంలోనూ జర్మనీ తరఫున ముల్లర్ అతి సమీపం నుంచి హెడర్ గోల్ చేయాలని చూసినా ఫ్రాన్స్ కీపర్ నమ్మలేని రీతిలో స్పందించి అడ్డుకున్నాడు. దీంతో ప్రపంచ చాంపియన్స్ విజయంపై తమ ఆశలను వదులుకుంది. 1 2006 ప్రపంచకప్ అనంతరం తొలిసారి ఓ మేజర్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్ 3 యూరో కప్‌లో ఆతిథ్య జట్టు ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. 10 తమ చివరి 10 మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ ఓడిపోలేదు. 18 సొంత గడ్డపై వరుసగా ఫ్రాన్స్ సాధించిన విజయాలు -
ఫ్రాన్స్ గర్జన: జర్మనీకి షాక్
-
ఫ్రాన్స్ గర్జన: జర్మనీకి షాక్
మార్సెల్లే: దాదాపు రెండు దశాబ్దాల తరువాత యూరోకప్ ఫుట్ బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ గర్జించింది. పటిష్టమైన ప్రత్యర్థి జర్మనీని మట్టికరిపించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం రాత్రి జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఫ్రాన్స్ 2-0 తేడాతో జర్మనీని ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. సొంత అభిమానుల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆద్యంతం దుమ్మురేపింది. ఫ్రాన్స్ ఫార్వర్డ్ ఆటగాడు ఆంటోని గ్రిజ్మన్ రెండు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆట 45, 72 నిమిషాల్లో గ్రిజ్ మన్ గోల్స్ సాధించి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. ఆ తరువాత జర్మనీ పోరాడినా ఫ్రాన్స్ చక్కటి డిఫెన్స్ తో ముందు తలవంచకతప్పలేదు. తద్వారా 1958 తర్వాత ఓ ప్రధాన టోర్నీలో జర్మనీపై గెలిచి సరికొత్త చరిత్రను సృష్టించింది. 1984లో సొంత గడ్డపై జరిగిన యూరోకప్ టోర్నీలో విజేతగా నిలిచిన ఫ్రాన్స్.. ఆ తర్వాత ఈ టోర్నీలో కనీసం ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. మళ్లీ ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఇదే టోర్నీలో పోర్చుగల్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 1998లో వరల్డ్ కప్ గెలిచిన తరువాత ఏ ప్రధాన ట్రోఫీని సాధించని ఫ్రాన్స్.. ఈసారి యూరో చాంపియన్ గా నిలవాలని భావిస్తోంది. ఒకవేళ యూరో ట్రోఫీని ఫ్రాన్స్ గెలిస్తే అంతకుముందు ఎక్కువసార్లు ఆ ఘనతను సాధించిన జర్మనీ, స్పెయిన్ ల సరసన నిలుస్తుంది. సోమవారం ఫ్రాన్స్-పోర్చుగల్ మధ్య యూరో టైటిల్ పోరు జరుగనుంది.