ప్రముఖ ఫుట్‌బాలర్, స్వీడిష్ స్టార్ స్ట్రయికర్ జ్లాటన్ ఇబ్రహీమోవిచ్ చరిత్ర సృష్టించాడు. అత్యంత పెద్ద వయసులో యూరోపియన్ ఛాంపియన్ క్వాలిఫయర్ ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. యూరో 2024 గ్రూప్ గేమ్‌లో భాగంగా బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో 73వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన ఇబ్రహీమోవిచ్.. 41 సంవత్సరాల 5 నెలల 21 రోజుల వయసులో యూరో క్వాలిఫయర్ మ్యాచ్ బరిలోకి దిగిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
గతంలో ఈ రికార్డు ఇటాలియన్ గోల్‌కీపర్ డినో జోఫ్ పేరిట ఉండేది. 1983, మే 29న స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌లో డినో 41 ఏళ్ల 3 నెలల ఒక్క రోజు వయసులో యూరో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడాడు. క్లబ్ ఫుట్‌బాల్‌లో ఏసీ మిలాన్‌కు ప్రాతినిధ్యం వహించే ఇబ్రహీమోవిచ్ గత వారాంతంలో సీరీ ఏలో గోల్ సాధించి, అత్యంత పెద్ద వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కూడా రికార్డుల్లోకెక్కాడు.
వచ్చే ఏడాది జర్మనీలో జరిగే యూరో కప్ ఫైనల్లో ఆడాలని భావిస్తున్న ఇబ్రహీమోవిచ్.. ఇదే జరిగితే అత్యంత పెద్ద వయసులో (42) యూరో కప్ ఫైనల్స్ ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
ఇదిలా ఉంటే, గ్రూప్-ఎఫ్ యూరో క్వాలిఫయర్ 2024లో భాగంగా బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో ఇబ్రహీమోవిచ్ ప్రాతినిధ్యం వహించిన స్వీడన్ ఓటమిపాలైంది. స్టార్ స్ట్రయికర్ రొమేలు లుకాకు హ్యాట్రిక్ గోల్స్ సాధించడంతో బెల్జియం 3-0 తేడాతో స్వీడన్‌ను చిత్తు చేసింది. లుకాకు మెరుపులతో ఇబ్రహీమోవిచ్ రికార్డు కనుమరుగైంది.
ప్రస్తుతం ఫుట్‌బాల్‌లో కొనసాగుతున్న స్టార్లలో గేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్లో, మరో దిగ్గజం మెస్సీ కంటే ఇబ్రహీమోవిచ్ వయసులో చాలా పెద్దవాడు. ఫిట్‌నెస్ విషయంలో రొనాల్డోకు ఇబ్రహీమోవిచ్‌కు పోటీ ఎక్కువగా ఉంటుంది. రొనాల్డో 38 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్ కారణంగా అవకాశాలు పొందగలుగుతుంటే, ఇబ్రహీమోవిచ్ రొనాల్డోకు మించి అవకాశాలు సాధిస్తూ, రాణిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment