దిగ్గజ ఫుట్‌బాలర్, పోర్చుగల్ స్టార్, అల్ నసర్ క్లబ్ తురుపు ముక్క క్రిస్టియానో రొనాల్డో కన్నీటి పర్యంతమయ్యాడు. కింగ్ కప్ ఫైనల్లో తన జట్టు ఓటమిని జీర్ణించుకోలేని రొనాల్డో భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక వెక్కివెక్కి ఏడ్చాడు. సహచరులు ఎంత ఓదార్చే ప్రయత్నం చేసినా రొనాల్డో కన్నీళ్లు ఆగలేదు. మైదానంలో చాలా సేపు కూర్చుని బాధతో కృంగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. రొనాల్డో బాధను చూసి నెటిజన్లు సైతం భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఆట పట్ల స్టార్ ఫుట్‌బాలర్‌కు ఉన్న కమిట్‌మెంట్‌కు జేజేలు పలుకుతున్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహించినా.. క్లబ్ తరఫున ఆడినా రొనాల్డో ప్యాషన్ ఒకే తీరులో ఉంటుందని కితాబునిస్తున్నారు.
Nothing hurts a football fan more than seeing Ronaldo cry pic.twitter.com/YSMsZKBE9z
— Trey (@UTDTrey) May 31, 2024
కాగా, సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నిన్న (మే 31) జరిగిన కింగ్ ఆఫ్ ఛాంపియన్ కప్ ఫైనల్లో రొనాల్డో ప్రాతినిథ్యం వహించిన అల్ నసర్ జట్టు.. చిరకాల ప్రత్యర్ది అల్ హిలాల్ చేతిలో ఓటమిపాలైంది. తొలుత ఈ మ్యాచ్ (ఎక్స్‌ట్రా సమయం తర్వాత) 1-1తో టై కాగా.. పెనాల్టీ షూటౌట్‌లో అల్ హిలాల్.. 5-4 తేడాతో అల్ నసర్‌పై పైచేయి సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. నిర్ణీత సమయంలో అల్ హిలాల్ తరఫున అలెగ్జాండర్ మిత్రోవిచ్ (7వ నిమిషం).. ఆల్ నసర్ తరఫున అయ్మాన్ యాహ్యా (88వ నిమిషం) గోల్స్ చేశారు.
ఇదిలా ఉంటే, అల్ హిలాల్ జట్టు ఇటీవల ముగిసిన సౌదీ ప్రో లీగ్‌లో కనీవినీ ఎరుగని ప్రదర్శనలు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఎడిషన్‌లో అల్ హిలాల్ రికార్డు స్థాయిలో 34 మ్యాచ్‌ల్లో 31 విజయాలు సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. క్లబ్ ఫుట్‌బాల్ చరిత్రలో ఏ జట్టు ఈ స్థాయి విజయాలు సాధించలేదు. ఈ లీగ్‌లో కూడా రొనాల్డో జట్టు అల్ నసర్ రన్నరప్‌తో సరిపెట్టకుంది. రొనాల్డో తదుపరి UEFA యూరో ఛాంపియన్‌షిప్ 2024లో పాల్గొననున్నాడు. ఈ టోర్నీలో క్రిస్ తన జాతీయ జట్టైన పోర్చుగల్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment