బుకారెస్ట్ (రొమేనియా): జట్టులో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు... అంతర్జాతీయ టోర్నీలలో ఎన్నో గొప్ప విజయాలు... అయితేనేం తప్పిదాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్, యూరో కప్ రన్నరప్ ఫ్రాన్స్ జట్టు విషయంలో ఇలాగే జరిగింది. యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ జట్టు కథ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ ‘పెనాల్టీ షూటౌట్’లో 5–4తో ఫ్రాన్స్ జట్టును ఓడించి యూరో టోర్నీలో తొలిసారిగా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. స్విట్జర్లాండ్ తరఫున సెఫరోవిచ్ (15వ, 81వ ని.లో) రెండు గోల్స్... గావ్రనోవిచ్ (90వ ని.లో) ఒక గోల్ చేశారు. ఫ్రాన్స్ జట్టుకు కరీమ్ బెంజెమా (57వ, 59వ ని.లో) రెండు గోల్స్... పోగ్బా (75వ ని.లో) ఒక గోల్ అందించారు. అదనపు సమయంలో రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘పెనాల్టీ షూటౌట్’ను నిర్వహించారు. ఇందులో స్విట్జర్లాండ్ ఆటగాళ్లు ఐదు షాట్‌లను లక్ష్యానికి చేర్చారు. ఫ్రాన్స్ తరఫున తొలి నలుగురు ఆటగాళ్లు సఫలమవ్వగా...చివరి షాట్ తీసుకున్న కిలియన్ ఎంబాపె మాత్రం విఫలమయ్యాడు. ఎంబాపె సంధించిన షాట్‌ను స్విట్జర్లాండ్ గోల్‌కీపర్ యాన్ సమర్ కుడివైపునకు డైవ్ చేస్తూ ఎడమ చేత్తో అద్భుతంగా నిలువరించి ఫ్రాన్స్ విజయాన్ని అడ్డుకున్నాడు.
1992 తర్వాత ఫ్రాన్స్ జట్టుపై స్విట్జర్లాండ్ నెగ్గడం ఇదే తొలిసారి. యూరో టోర్నీలో ఏనాడూ స్విట్జర్లాండ్ చేతిలో ఓడిపోని ఫ్రాన్స్‌కు ఈసారీ విజయం దక్కేది. కానీ చివరి 10 నిమిషాల్లో అలసత్వం ఫ్రాన్స్ కొంపముంచింది. ఫ్రాన్స్ రక్షణశ్రేణిలోని లోపాలను సది్వనియోగం చేసుకొని స్విట్జర్లాండ్ చివరి పది నిమిషాల్లో రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. ఆ తర్వాత అదనపు సమయంలో ఫ్రాన్స్‌ను నిలువరించి... షూటౌట్‌లో ఆ జట్టును నాకౌట్ చేసింది.
జర్మనీకి ఇంగ్లండ్ షాక్...
లండన్‌లో మంగళవారం జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 2–0 గోల్స్ తేడాతో మూడుసార్లు చాంపియన్ జర్మనీ జట్టును ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇంగ్లండ్ తరఫున స్టెర్లింగ్ (75వ ని.లో), హ్యారీ కేన్ (86వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment