58 ఏళ్లకు... కల నిజమాయె
ఎప్పుడు.. ఇంకెప్పుడు.. అంటూ దాదాపు ఆరు దశాబ్దాలుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన ఫ్రాన్స్ అభిమానుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. అంతర్జాతీయ టోర్నీలలో తలపడిన ప్రతిసారీ తమను దెబ్బతీస్తున్న జర్మనీపై ఎట్టకేలకు సొంత గడ్డపై పగ తీర్చుకుంది. 1958 ప్రపంచకప్‌లో ఆ జట్టుపై తొలిసారి గెలుపు రుచి చూసిన ఫ్రాన్స్ ఆ తర్వాత ఇన్నేళ్లకు పండగ చేసుకోగలిగింది. అటు మ్యాచ్‌లో నమోదైన రెండు గోల్స్‌నూ తనే సాధించిన ఆంటోనీ గ్రిజ్‌మన్ జట్టును ఒంటిచేత్తో యూరో కప్ ఫైనల్‌కు చేర్చాడు. ఆదివారం జరిగే ఫైనల్లో పోర్చుగల్‌తో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
జర్మనీకి షాక్ ఇచ్చిన ఫ్రాన్స్
* 1958 అనంతరం ఆ జట్టుపై తొలి విజయం
* యూరో ఫైనల్లో పోర్చుగల్‌తో అమీతుమీ
మార్సిలీ: ఫ్రాన్స్ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. సుదీర్ఘ కాలం అనంతరం తమ చిరకాల ప్రత్యర్థి జర్మనీపై ఫ్రాన్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఫార్వర్డ్ ఆంటోనీ గ్రిజ్‌మన్ సూపర్ షోతో పాటు గోల్ కీపర్ హ్యూగో లారిస్ వీరోచిత పోరాటం తమ జట్టు కోరికను నెరవేర్చాయి.
గురువారం ప్రపంచ చాంపియన్స్ జర్మనీతో జరిగిన యూరో కప్ రెండో సెమీఫైనల్లో ఫ్రాన్స్ 2-0తో నెగ్గింది. ఫ్రాన్స్ తరఫున గ్రిజ్‌మన్ (45+2 పెనాల్టీ, 72వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించాడు. ఓవరాల్‌గా తను ఈ టోర్నీలో ఆరు గోల్స్‌తో టాప్‌లో ఉన్నాడు. 1958 ప్రపంచకప్‌లో వెస్ట్ జర్మనీపై తొలిసారి నెగ్గిన ఫ్రాన్స్ ఆ తర్వాత 1982, 1986 సెమీస్‌లో, 2014 క్వార్టర్స్‌లోనూ పరాజయం పాలైంది. అటు ప్రపంచ రెండో ర్యాంకర్ జర్మనీ తమ నాలుగో యూరో టైటిల్‌ను సాధించాలనుకున్నా మరియో గోమెజ్, మాట్స్ హమ్మెల్స్, సమి ఖెదిరా గైర్హాజరుతో డిఫెన్స్‌లో బలహీనపడి రాణించలేకపోయింది.
మ్యాచ్ ప్రథమార్ధంలో జర్మనీ ఎక్కువ శాతం బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకుంది. కానీ ఫ్రాన్స్ మాత్రం దూకుడు మంత్రాన్ని జపించి ప్రారంభంలోనే అవకాశాలను దక్కించుకుంది. ఏడో నిమిషంలోనే గ్రిజ్‌మన్ బాటమ్ కార్నర్ వైపు గోల్ కోసం ప్రయత్నించినా జర్మనీ కీపర్ న్యూయర్ వేగంగా డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. అయితే పదో నిమిషం అనంతరం జర్మనీ ఒక్కసారిగా మ్యాచ్‌ను తమవైపునకు తిప్పుకుంది. అయితే ఈ దశలో ముల్లర్, ఓజిల్ గోల్స్ అవకాశాలకు ఫ్రాన్స్ కీపర్ లారిస్ అడ్డుగోడలా నిలబడ్డాడు.
తొలి అర్ధభాగం కొద్ది సెకన్లలో ముగిసేవరకు కూడా జర్మనీ తమదైన శైలిలోనే ఆడింది. అయితే ఇంజ్యూరీ సమయం (45+2) సమయంలో గ్రిజ్‌మన్ కార్నర్‌ను పెనాల్టీ ఏరియాలో పాట్రిక్ ఎవ్‌రా హెడర్ ద్వారా గోల్‌గా మలచాలని భావించాడు. అయితే పక్కనే ఉన్న జర్మన్ కెప్టెన్ స్క్వీన్‌స్టీగర్ దాన్ని చేతితో అడ్డుకున్నాడు. దీంతో రిఫరీ ఫ్రాన్స్‌కు స్పాట్ కిక్ అవకాశాన్నిచ్చారు. దీన్ని కీపర్ న్యూయర్‌ను బోల్తా కొట్టిస్తూ గ్రిజ్‌మన్ ఎడమవైపు కార్నర్‌కు బంతిని పంపి బోణీ చేశాడు. ఇక ద్వితీయార్ధం 59వ నిమిషంలో జర్మనీ కీలక సెంటర్ బ్యాక్ ఆటగాడు జెరోమ్ బోటెంగ్ గాయం కారణంగా మైదానం వీడడం జట్టును ఇబ్బంది పెట్టింది.
అటు ఫ్రాన్స్ డిఫెన్స్ పటిష్టంగా కనబడడంతో జర్మనీ చెమటోడ్చాల్సి వచ్చింది. 70వ నిమిషంలో తమకు లభించిన ఫ్రీకిక్‌ను జర్మనీ సద్వినియోగం చేసుకోలేదు. కానీ 72వ నిమిషంలో ఫ్రాన్స్ రెండో గోల్ చేసి జర్మనీకి తిరుగులేని షాక్ ఇచ్చింది. లెఫ్ట్ వింగ్‌లో పోగ్బా జర్మనీ డిఫెండర్ హెక్టర్‌ను ఏమార్చుతూ బంతిని గోల్ పోస్టు పైకి పంపగా... కీపర్ న్యూయర్ తన అరచేతితో ఆపాలని చూసినా బంతి బయటికి వచ్చింది. అయితే అక్కడే ఉన్న గ్రిజ్‌మన్ తన ఎడమకాలితో బంతిని నెట్‌లోనికి పంపడంతో జర్మనీ దిగ్భ్రాంతికి లోనయ్యింది.
చివరి 15 నిమిషాలు ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. 82వ నిమిషంలో టోనీ క్రూస్ (జర్మనీ) షాట్, 86వ నిమిషంలో గ్రిజ్‌మన్ హ్యాట్రిక్ షాట్ విఫలమయ్యాయి. 90+3వ నిమిషంలోనూ జర్మనీ తరఫున ముల్లర్ అతి సమీపం నుంచి హెడర్ గోల్ చేయాలని చూసినా ఫ్రాన్స్ కీపర్ నమ్మలేని రీతిలో స్పందించి అడ్డుకున్నాడు. దీంతో ప్రపంచ చాంపియన్స్ విజయంపై తమ ఆశలను వదులుకుంది.
1 2006 ప్రపంచకప్ అనంతరం తొలిసారి ఓ మేజర్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్
3 యూరో కప్‌లో ఆతిథ్య జట్టు ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి.
10 తమ చివరి 10 మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ ఓడిపోలేదు.
18 సొంత గడ్డపై వరుసగా ఫ్రాన్స్ సాధించిన విజయాలు