యూరో కప్-2024 ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ పోర్చుగల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా రిక్తహస్తాలతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.
ఈ క్రమంలో ప్రతిష్టాత్మక యూరో కప్ టోర్నీలో పోర్చుగల్ లెజెండరీ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో శకం ముగిసినట్లయింది. కాగా జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ 2024 ఎడిషన్‌లో స్లొవేనియాను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన పోర్చుగల్.. తాజాగా ఫ్రాన్స్‌తో తలపడింది.
ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేక
నూట ఇరవై నిమిషాల పాటు సాగిన ఈ కీలక మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో పెనాల్టి షూటౌట్‌లో భాగంగా ఫ్రాన్స్ 5-3తో పోర్చుగల్‌పై పైచేయి సాధించింది. ఈ క్రమంలో కెలియన్ ఎంబాపే బృందం సెమీస్‌కు దూసుకెళ్లింది.
మరోవైపు భారీ అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన పోర్చుగల్ ఇంటిబాట పట్టింది. కాగా 39 ఏళ్ల రొనాల్డోకు జాతీయ జట్టు తరఫున ఇదే చివరి మ్యాచ్ కానుంది. ఇందుకు సంబంధించి ఈ పోర్చుగల్ ఆటగాడు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు.
ఇక ఆరోసారి యూరో కప్‌లో భాగమైన రొనాల్డో ఈ టోర్నీలో రికార్డు స్థాయిలో 14 గోల్స్ సాధించాడు. అయితే, ఈసారి మాత్రం షూటౌట్‌లో మినహా గోల్స్ స్కోర్ చేయలేకపోయాడు.
పోర్చుగల్ వీరుడిగానే కాదు..
అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో క్రిస్టియానో రొనాల్డో అత్యధిక గోల్స్ వీరుడిగా కొనసాగుతున్నాడు. పోర్చుగల్ తరఫున అతడు 130 గోల్స్ కొట్టాడు.
మరోవైపు.. అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ 108 గోల్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, మెస్సీ ఖాతాలో వరల్డ్‌కప్ ఉండగా.. రొనాల్డోకు మాత్రం ఆ లోటు అలాగే ఉండిపోయింది. కాగా యూరో కప్-2024లో ఫ్రాన్స్ సెమీ ఫైనల్లో స్పెయిన్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment