ఈ శతాబ్దపు మహావిపత్తు అంటూ భయపెట్టడం కాదుకాని నిజంగానే ప్రపంచానికి చుక్కలు చూపించింది కరోనా. సాంఘిక జంతువును కాస్త ఒంటరి జీవిని చేసింది. ముక్కుకు, మూతికి అడ్డు పెట్టించి.. ప్రకృతి వనరుల మీద అదుపు నేర్పింది.. పొదుపు విలువ చెప్పింది.. ఊహించనివాటిని అనుభవంలోకి తెచ్చింది.. అనుభవంలో ఉన్నవాటిని ఊహలుగా మార్చింది.. గిర్రున తిరుగుతున్న కాలాన్ని నిలిపేసింది.. ఉత్పత్తులను ఆపేసింది. కరోనా కేర్ తప్ప తతిమా సేవలన్నిటికీ సెలవు ప్రకటించింది.. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఏడాదిని శూన్య సంవత్సరంగా చరిత్రలో చేర్చింది.
2019, నవంబర్ 17న చైనాలో తొలి కరోనా కేసు బయటపడింది. అయితే ఈ ఏడాది జనవరి 1న డబ్ల్యూహెచ్‌ఓ వుహాన్‌కి తన ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ సపోర్ట్ టీమ్‌ను పంపించడంతో మొదటిసారిగా కరోనా విషయం ప్రపంచానికి తెలిసింది. కరోనా పేషంట్ల కోసం ఫిబ్రవరిలో వుహాన్‌లోని అథ్లెట్స్ విలేజ్ పార్కింగ్ లాట్‌లో ఆగమేఘాల మీద ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది చైనా.
► మనదేశంలో మార్చి 25వ తేదీన తొలి విడత లాక్‌డౌన్‌ను ప్రకటించింది ప్రభుత్వం. 31 వరకు సాగిందది. ఈ ప్రభావంలోంచి ఆర్థిక వ్యవస్థను తప్పించడానికి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్రోత్సాహక పథకాలను ప్రకటించింది.
► కరోనా దెబ్బతో మొత్తం జగత్తే స్తంభించి పోయిన నెల అది. దాదాపు అన్ని దేశాలూ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. వీధులు, వీధి చివర దుకాణాల నుంచి బడులు (కళాశాలలు సహా), గుడులు, కూడళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, బస్టాండులు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల దాకా అన్నీ బంద్. రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. గత నలభై ఏళ్లలో మొదటిసారిగా ‘తాజ్‌మహల్’ సందర్శననూ నిలిపేశారు.
► కర్ఫ్యూ వాతావరణాన్ని కొంచెం కొంచెంగా సడలిస్తూ లాక్‌డౌన్ ఉనికిలోనే ఉన్న నెల ‘మే’. ఆ నెల 9న దేశాన్ని దిగ్భ్రాంతిలోకి నెట్టిన దుర్ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దగ్గర జరిగింది. తెల్లవారు జామున రైలు పట్టాల మీద సేద తీరుతున్న పదహారు మంది వలస కార్మికుల మీద నుంచి గూడ్స్‌రైలు దూసుకెళ్లింది.
► దైనందిన జీవితం హోల్డ్‌లో ఉన్నా వైజ్ఞానిక ప్రయోగాలు ఆగలేదు... కరోనా టీకా నుంచి అంతరిక్ష ప్రయోగాల దాకా. నాసా ‘ది స్పేస్ ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్’ను ప్రయోగించింది.
► కరోనా వరల్డ్ స్టాక్ మార్కెట్‌ను కుప్పకూల్చింది. 40 వేల పాయింట్లతో దూసుకెళ్లిన మన సెన్సెక్స్ కరోనా ఎఫెక్ట్‌తో 10వేల పాయింట్లకు పడిపోయింది. బిలియన్ డాలర్ల పెట్టుబడి తుడిచిపెట్టుకుపోయింది.
► మన దేశంలో కరోనా తొలి కేసు జనవరి 30న నమోదైంది. చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుకుంటున్న కేరళ విద్యార్థి స్వస్థలానికి ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో చేసిన వైద్యపరీక్షల్లోనే ఆ విద్యార్థికి కరోనా పాజిటివ్ అని తేలింది. (చదవండి: కుటుంబ రక్షణకే కరోనా వ్యాక్సిన్)
కరోనా మిగిల్చిన శోకం
సినీ గాయక ప్రముఖుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కూచిపూడి నర్తకి శోభానాయుడు కరోనాతో మరణించారు.
♦ మన దేశంలో వలస కార్మికులు వందల కిలోమీటర్లు కాలినడక మొదలుపెట్టారు స్వస్థలాలు చేరుకోవడానికి. వాళ్లకు మంచినీళ్ల నుంచి ఆహారం, చెప్పులు, రవాణా సదుపాయాల ఏర్పాటు వరకు సహాయం అందించడానికి వ్యక్తుల నుంచి సంస్థల వరకు ముందుకొచ్చారు.. వచ్చాయి. వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా వలస కార్మికుల కోసం తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ వరకు జాతీయ రహదారి పొడుగునా సహాయక శిబిరాలను నెలకొల్పారు.
♦ ప్రముఖ నటుడు సోనూ సూద్ వలస కార్మికులకు అందించిన సేవలను యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ తన ‘స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డ్ (సెప్టెంబర్‌లో)’తో గుర్తించి అతణ్ణి గౌరవించింది.
♦ ప్రపంచ లాక్‌డౌన్‌కు కొనసాగింపు నెల. చరిత్రలో చాలా మొదటిసార్ల (ఫస్ట్‌టైమ్)కు సాక్ష్యమైంది. వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్ ప్రత్యక్ష ప్రసారానికి జనసందోహం లేకపోవడం ఇదే మొదలు.
♦ ఇస్లాం పుణ్యక్షేత్రం మక్కా కూడా ఖాళీగానే దర్శనమిచ్చింది.
♦ జూలై నెలలో ప్రారంభం కావాల్సిన టోక్యో ఒలిపింక్స్‌ను కరోనా ఆపేసింది.
♦ వందే భారత్ మిషన్ కింద దుబాయ్‌లో ఉన్న భారతీయులను ఆగస్టు 7న స్వదేశానికి తీసుకొస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 1344 విమానం కాలికట్ అంతర్జాతీయ విమానశ్రయంలో ల్యాండ్ అవుతూ భారీ వర్షం కారణంగా రన్ వే మీద జారింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా పందొమ్మిది మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 169 మంది సురక్షితంగా బయటపడ్డారు. (చదవండి: చైనా గుట్టు రట్టు చేసిన ‘వుహాన్ ఫైల్స్’)
కరోనాపై పది కత్తులు
డాక్టర్ పూజా భాటియా
మూత్రపిండాల చికిత్సా నిపుణురాలు. యు.ఎస్.లో స్థిరపడిన కుటుంబం ఆమెది. పేషెంట్‌లను చూస్తున్న క్రమంలో డాక్టర్ పూజాకు కరోనా సంక్రమించింది. కోలుకున్న వెంటనే మళ్లీ విధుల్లోకి వచ్చారు. కరోనా యోధులపై తయారవుతున్న డాక్యుమెంటరీ చిత్రం ‘ఎ ప్యాండమిక్: అవే ఫ్రమ్ ద మదర్‌ల్యాండ్’లో డాక్టర్‌గా, మానవత్వం గల మనిషిగా పూజా ఏమిటో మనం చూడొచ్చు.
శ్వేతారాయ్
హాలీవుడ్‌లో ఉంటున్న భారతీయ చలన చిత్ర దర్శకురాలు. డాక్టర్ పూజా భాటియా, మరో ఐదుగురు భారతీయ వైద్యులపై ‘ఎ ప్యాండమిక్: అవే ఫ్రమ్ ది మదర్‌ల్యాండ్’ అనే డాక్యుమెంటరీని తీస్తున్నది శ్వేతనే! జన్మభూమికి దూరంగా పరదేశంలో కరోనా కొమ్ములు వంచుతున్న డాక్టర్ అంకిత్ భారత్, డాక్టర్ ఉమా మధుసూదన్, డాక్టర్ శ్రీధర్ కులకర్ణి, డాక్టర్ శంతను సింగ్‌లపై 70 నిముషాల నిడివిలో ఈ డాక్యుమెంటరీ ఉండబోతోంది.
డాక్టర్ అమృతా గాడ్గే
యు.కె.లో పనిచేస్తున్న భారతీయ భౌతిక శాస్త్రవేత్త. బోస్–ఐన్‌స్టీన్ కండెన్సేట్ (బి.ఇ.సి.) ను విజయవంతంగా ఆవిష్కరించారు అమృత. బి.ఇ.సి. అనేది పదార్థం నాల్గవ స్థితి. మొదటి నాలుగు స్థితులు ఘనం, ద్రవం, వాయువు, ప్లాస్మా. కరోనా స్థితిగతులపై అమృతా పరిశోధన చేస్తున్నప్పుడు అంతరిక్షంలో వ్యోమగాములకు ఉపయోగకరమైన ఈ ఫలితం వెలువడింది.
మహితా నాగరాజ్
డిజిటల్ మార్కెటింగ్ వృత్తి నిపుణురాలు. సింగిల్ మదర్. ‘కేర్ మాంగర్స్’ ఇండియా ఆలోచన మహితదే. కరోనా నుంచి తమకై తాము జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నవారిని ఈ సంస్థ తన సంరక్షణలోకి తీసుకుంటుంది. 46 వేల మంది సభ్యులతో 14 దేశాలకు విస్తరించింది. ఒక్క భారతదేశంలోనే ‘కేర్‌మాంగర్స్’కి 22 వేల మంది వాలంటీర్లు ఉన్నారు. ప్రధానంగా వృద్ధులకు ఆహార, వైద్య, ఆరోగ్య సేవల్ని ఈ గ్రూపు అందిస్తుంటుంది.
చంద్రబాలీ దత్తా
భారత సంతతికి చెందిన బ్రిటిష్ శాస్త్రవేత్త. కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టే పనిలో ఉన్న ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందంలో సభ్యురాలు. వ్యాక్సిన్ తయారయ్యే ప్రతి దశలోనూ అన్నీ సరిచూసుకోవలసిన కీలకమైన బాధ్యత ఆమెదే.
షిఫా మొహమ్మద్
హౌస్ సర్జన్. కరోనా పేషెంట్‌లకు తను అందించవలసిన చికిత్సలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆమె తన పెళ్లినే వాయిదా వేసుకున్నారు. షిఫా కన్నూర్ (కేరళ)లోని పరియారమ్ మెడికల్ కాజేజ్ హాస్పిటల్‌లో పని చేస్తున్నారు.
కెప్టెన్ స్వాతి రావల్
భర్త కెప్టెన్ రాజా చౌహన్‌తో కలిసి బోయింగ్ 777లో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను త్వరత్వరగా సొంతగడ్డకు చేర్చే విధులలో నిర్దేశిత పని గంటలకు మించి స్వచ్ఛందంగా పనిచేశారు. ఆమె స్వదేశానికి తీసుకొచ్చిన 263 మంది భారతీయులలో ఎక్కువమంది విద్యార్థులే. ప్రధాని నరేంద్ర మోదీ ఆమె చొరవను అభినందించారు.
డాక్టర్ సౌమ్య స్వామినాథన్
జెనీవాలోని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’లో చీఫ్ సైంటిస్ట్. కరోనాకు వ్యాక్సిన్‌ను, డ్రగ్ థెరపీలను కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న శాస్త్ర పరిశోధనల కార్యాచరణలకు ఆమె నేతృత్వం వహిస్తున్నారు.
మినాల్ దఖావే భోసాల్
పుణెలోని ‘మైల్యాబ్ డిస్కవరీ’ ప్రయోగశాలలో పరిశోధన, అభివృద్ధి విభాగాల అధిపతి. ఆమె నేతృత్వంలోనే మైల్యాబ్ ‘ప్యాథో డిటెక్ట్’ అని కి ట్‌కు రూపకల్పన చేసింది. కాన్పుకు ముందు రోజు వరకు ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’లో ఆమె తన పరిశోధనల్లో నిమగ్నమై ఉండటం వార్తల్లోని విశేషం అయింది.
డాక్టర్ ఉమా మధుసూదన్
యు.ఎస్.లోని కనెక్టికట్‌లో ఉన్న హార్ట్‌ఫోర్డ్ హెల్త్ కేర్‌లో ఫిజీషియన్. సౌత్ విండ్సర్ హాస్పిట్‌లో కరోనా బాధితులకు ఆమె అందించిన సేవల్ని ప్రపంచమంతా గుర్తించింది. అక్కడి స్థానికులు ఆమెకు గౌరవ సూచకంగా ఆమె నివాసం ముందు నుంచి కార్ల పరేడ్‌తో ధన్యవాదాలు సమర్పించారు.
అమెరికా, కెనడా, బ్రిటన్, రష్యా, మెక్సికో, బహెరైన్ .. ఈ ఆరు దేశాలు కరోనా టీకాను అధికారికంగా ఆమోదించాయి.
Comments
Please login to add a commentAdd a comment