2020.... మ్యాజికల్ నంబర్... కానీ మ్యాజిక్ జరగలేదు సినిమా రిలీజ్ నంబర్ తగ్గించేసింది. వసూళ్ల నంబర్ పడిపోయింది సినీ కార్మికులకు ఉపాధి లేకుండా చేసింది షూటింగులు లేక స్టూడియోలు వెలవెలబోయేలా చేసింది గాన గంధర్వుడిని, విలక్షణ నటులను తీసుకెళ్లిపోయింది మొత్తం మీద ‘మ్యాజికల్ ఇయర్’ కాదు.. ‘ట్రాజికల్ ఇయర్’గా మిగిలిపోయింది. పెద్ద పెద్ద విషాదాల్లో చిన్న చిన్న సంతోషాలూ ఉంటాయి. అలా కొన్ని ఆనందకరమైన సంఘటనలూ ఉన్నాయి. 2020.. 12 నెలలు... రౌండప్ వేద్దాం.
జనవరి: ఈ నెలలో సుమారు 12 సినిమాల వరకూ రిలీజయ్యాయి. సంక్రాంతికి విడుదలైన మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ పెద్ద విజయాలు నమోదు చేసుకున్నాయి. ఇంకా విడుదలైన చిత్రాల్లో రవితేజ ‘డిస్కో రాజా’, కల్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’, నాగశౌర్య ‘అశ్వథ్థామ’ వంటివి ఉన్నాయి.
♦ నిర్మాత మండల్‌రెడ్డి కొండల్‌రెడ్డి 29న మృతి చెందారు.
ఫిబ్రవరి: ఈ నెల 16 సినిమాలు రిలీజయ్యాయి. నితిన్ ‘భీష్మ’ సూపర్ హిట్ టాక్‌తో వసూళ్లను కొల్లగొట్టింది. శర్వానంద్ ‘జాను’, విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో పాటు విశ్వక్‌సేన్ ‘హిట్’ తదితర చిత్రాలు తెరకొచ్చాయి.
♦19న ‘ఇండియన్ 2’ సెట్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు.
మార్చి: ఈ నెల 15 నుంచి థియేటర్స్‌ను మూసేశారు. 15వ తేదీ వరకూ 7 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘పలాస 1978’ మంచి ప్రశంసలు అందుకుంది. ‘ఓ పిట్ట కథ’, ‘మద’ వంటి చిత్రాలు రిలీజయ్యాయి. ∙12న ‘పరుగు’ ఫేమ్ షీలా వివాహం వ్యాపారవేత్త సంతోష్ రెడ్డితో జరిగింది.
♦సినిమా చిత్రీకరణలన్నీ నిలిచిపోయిన నెల ఇది.
♦8న నిర్మాత సి. వెంకటరాజు కన్నుమూశారు.
ఏప్రిల్: ∙జీ5లో ‘అమృతరామమ్’ విడుదలైంది. ఓటీటీలో విడుదలైన తొలి తెలుగు చిత్రమిది.
♦14న రచయిత సీయస్ రావ్ మృతి చెందారు.
మే:
♦ ఈ నెల 10న ‘దిల్’ రాజు వివాహం వైఘాతో జరిగింది.
♦14న హీరో నిఖిల్ పెళ్లి పల్లవి వర్మతో జరిగింది.
జూన్: కీర్తీ సురేశ్ నటించిన ‘పెంగ్విన్’ ప్రైమ్‌లో విడుదలైంది. సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఆహాలో, సత్యదేవ్ ‘47 డేస్’ జీ5లో విడుదలయ్యాయి.
♦కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో సినిమా చిత్రీకరణలు జరుపుకోవచ్చని ప్రభుత్వం అనుమతిచ్చింది.
జూలై:
♦ ఈ నెల 26న నితిన్–షాలినీ వివాహం జరిగింది
♦ సత్యదేవ్ ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య’, నవీన్ చంద్ర ‘భానుమతి రామకష్ణ’ చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి.
♦ 5న ఈతరం ఫిలింస్ బ్యానర్ సమర్పకుడు, నిర్మాత పోకూరి బాబురావు సోదరుడు పోకూరి రామారావు, 26న నిర్మాత కందేపి సత్యనారాయణ, 28న నటుడు, రచయిత రావికొండలరావు కన్నుమూశారు.
ఆగస్ట్:
♦ 8వ తేదీ రానా, మిహికా వివాహం జరిగింది
♦ దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి మరియు వారి కుటుంబ సభ్యులు, నటి జెనీలియా కోవిడ్ బారినపడ్డారు.
♦ ప్రముఖ గాయకుడు వంగపండు ప్రసాదరావు 4న తుది శ్వాస విడిచారు.
సెప్టెంబర్: ∙నాని, సుధీర్‌బాబు ‘వి’ అమెజాన్ ద్వారా విడుదలైంది. ఓటీటీలో విడుదలైన తొలి పెద్ద తెలుగు సినిమా ఇదే.
♦ ఈ నెల తెలుగు సినిమాల చిత్రీకరణలు ప్రారంభం అయ్యాయి.
♦ ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, నటుడు నాగబాబు కరోనా బారిన పడ్డారు
♦ 8న ప్రముఖ నటులు జయప్రకాశ్ రెడ్డి మరణించారు.
♦ సీనియర్ నటి పొట్నూరి సీతాదేవి 21న కన్నుమూశారు.
♦ 23న నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి చెందారు.
♦ 25న గాన గాంధర్వుడు యస్పీ బాలసుబ్రహ్మణ్యం తిరిగి రాని లోకాలకు వెళ్లారు.
అక్టోబర్: లాక్‌డౌన్‌కి ముందు విడుదల కావాల్సిన అనుష్క ‘నిశ్శబ్దం’ వాయిదా పడుతూ అక్టోబర్‌లో ఓటీటీలో విడుదలైంది. రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’, క్యారెక్టర్ నటుడు సుహాస్ లీడ్ రోల్ చేసిన ‘కలర్ ఫొటో’ చిత్రాలూ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.
♦ 7న నిర్మాత బూరుగుపల్లి బప్పిరాజు కన్నుమూశారు.
♦ లాక్‌డౌన్ తర్వాత తెలుగు నుంచి విదేశాలు వెళ్లిన తొలి సినిమా ప్రభాస్ ‘రాధేశ్యామ్’. ఇటలీలో ఓ భారీ షెడ్యూల్ కోసం ఈ టీమ్ అక్కడికి వెళ్లింది
♦ కాజల్ అగర్వాల్ ఏడడుగులు నడిచిన తేదీ అక్టోబర్ 30. స్నేహితుడు గౌతమ్ కిచ్లుతో వెడ్‌లాక్‌లోకి ఎంటరయ్యారు ఈ బ్యూటీ
♦ ‘నేను పాజిటివ్’ అంటూ ఈ నెల మొదటి వారంలో తమన్నా చెప్పారు. కొన్ని రోజులకే కరోనా పాజిటివ్ నుంచి బయటపడి, నెగటివ్ అయ్యారు
♦ 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లు తెరవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.
నవంబర్: ఈ నెల ఆరు ఓటీటీ రిలీజులను చూసింది. పెద్ద సినిమా సూర్య ‘ఆకాశం నీ హద్దు రా’ విడుదలై, మంచి సినిమాగా నిలిచింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ఆకట్టుకుంది. ‘మిస్ ఇండియా’గా కీర్తీ సురేశ్ వచ్చారు. ‘మా వింత గాథ వినుమా’, ‘అనగనగా ఓ అతిథి’ చిత్రాలు రిలీజయ్యాయి. విడుదలైన చిన్న సినిమాల్లో ‘గతం’ వచ్చే ఏడాది జనవరిలో గోవాలో జరగనున్న చిత్రోత్సవాల్లో ఇండియన్ పనోరమ విభాగంలో ప్రదర్శితం కానుంది. ఈ విభాగంలో ప్రదర్శితం కానున్న ఏకైక తెలుగు చిత్రం ‘గతం’.
♦ ఈ నెల 5న ఎడిటర్ కోలా భాస్కర్ చనిపోయారు.
♦ అక్టోబర్‌లో రాజశేఖర్, జీవిత, వారి పిల్లలు శివాని, శివాత్మిక కరోనా బారిన పడ్డారు. జీవిత, పిల్లలు కోలుకోగా రాజశేఖర్ కొన్నాళ్ల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. నవంబర్‌లో కోలుకుని రాజశేఖర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు
♦ చిరంజీవికి ‘పాజిటివ్’ అనే వార్త ఈ నెలలో మెగాభిమానులను కలవరపెట్టింది. అయితే రిజల్ట్ తేడాగా వచ్చిందని, తనకు కరోనా లేదని ఆ తర్వాత చిరంజీవి ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
డిసెంబర్:
♦ ఈ నెల 4న తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌ను ఓపెన్ చేశారు. హాలీవుడ్ మూవీ ‘టెనెట్’తో థియేటర్స్ తెర్చుకున్నాయి. ఆ తర్వాత ‘కరోనా వైరస్, మర్డర్’ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. థియేటర్స్‌లో విడుదలైన పెద్ద సినిమా సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’
♦ డిసెంబర్ 9న నిహారిక వివాహం జరిగింది
♦ హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ చిత్రీకరణలో పాల్గొంటున్న రజనీకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి, కోలుకున్నాక చెన్నై వెళ్లారు
♦ రకుల్ ప్రీత్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్ కోవిడ్ బారినపడ్డారు
♦ 21న పంపిణీదారుడు అడుసుమిల్లి సాంబశివరావు, 25న దర్శకుడు ఓఎస్సార్ ఆంజనేయులు, 28న ఏఆర్ రెహమాన్ తల్లి కరీమా బేగమ్ మృతి చెందారు.
2020తో కలుపుకుని గడచిన పదేళ్లలో తక్కువ సినిమాలు చూపించిన సంవత్సరం ఇదే. ఈ ఏడాది విడుదలైన సినిమాలు మొత్తం 65. వాటిలో 50 స్ట్రయిట్ కాగా, 15 డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. స్ట్రయిట్ చిత్రాలు, అనువాద చిత్రాలు కలుపుకుని 2011లో 243, 2012లో 224, 2013లో 270, 2014లో 276, 2015లో 245, 2016లో 266, 2017లో 245, 2018లో 228, 2019లో 269, 2020లో 65 చిత్రాలు రిలీజయ్యాయి.
మ్యాజికల్ కాదు... ట్రాజికల్
Published Thu, Dec 31 2020 12:43 AM | Last Updated on Thu, Dec 31 2020 11:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment