ముంబై, సాక్షి: భారీ ఆటుపోట్లను చవిచూసిన 2020 ఏడాదికి దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగింపు పలికాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 వణికించినప్పటికీ చెప్పుకోదగ్గ లాభాలతో నిలిచాయి. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే మార్కెట్లు 16 శాతం స్థాయిలో బలపడ్డాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 47,000 పాయింట్లను అధిగమించడంతోపాటు.. 48,000 మార్క్‌కు చేరువైంది. ఈ బాటలో నిఫ్టీ 14,000 పాయింట్ల మైలురాయిని దాటేసింది. ఈ ఏడాది కరోనా వైరస్ కల్లోలంతో ఫార్మా రంగం అత్యధికంగా 61 శాతం దూసుకెళ్లగా.. లాక్‌డవున్ నేపథ్యంలో కొత్త అవకాశాలతో ఐటీ 55 శాతం జంప్‌చేసింది. వెరసి ఇన్వెస్టర్లకు అత్యధిక రిటర్నులు అందించిన దిగ్గజాలలో దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ ముందునిలవగా.. ప్రయివేట్ రంగ బ్యాంక్ ఇండస్‌ఇండ్ బ్యాంక్ వెనకడుగు వేసింది. ఇదేవిధంగా పీఎస్‌యూ బ్లూచిప్స్ ఐవోసీ, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా సైతం డీలా పడ్డాయి. (తొలిసారి.. 14,000 మైలురాయికి నిఫ్టీ)
నేటి ట్రేడింగ్ ఇలా
డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ చివరి రోజు స్వల్ప ఒడిదొడుకుల మధ్య మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ నామమాత్రంగా 5 పాయింట్లు బలపడి 47,751 వద్ద నిలిచింది. నిఫ్టీ యథాతథంగా 13,982 వద్ద స్థిరపడింది. అయితే ఇంట్రాడేలో 47,897 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకోగా.. నిఫ్టీ 14,000 పాయింట్ల మైలురాయిని దాటేసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,602 వరకూ డీలా పడగా.. నిఫ్టీ 14,025-13,936 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2-0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,766 లాభపడగా.. 1,244 నష్టపోయాయి.
2020లో జోష్
ప్రధానంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీ ఊపందుకుంది. ఫలితంగా చౌకగా లభిస్తున్న ప్రపంచ పెట్టుబడులు స్టాక్ మార్కెట్లు, బంగారం, వెండి వంటి సాధనాలలోకి ప్రవహించాయి. ఫలితంగా యూఎస్‌తోపాటు భారత్ మార్కెట్లు కూడా చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. కోవిడ్-19 భయాలతో ఆగస్ట్‌లో న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 2,067 డాలర్ల వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో దేశీయంగానూ ఆగస్ట్‌లో పసిడి 10 గ్రాములు (ఎంసీఎక్స్) రూ. 57,100కు ఎగసింది. ఇది దేశీ బులియన్ మార్కెట్లోనే రికార్డ్‌కావడం విశేషం! (పసిడి తగ్గనుందా?.. ఇకపై కొనొచ్చా? )
రికవరీ ఆశలు
కోవిడ్-19 సంక్షోభం నుంచి నెమ్మదిగా యూఎస్, చైనా, భారత్ వంటి దేశాలు బయటపడుతుండటంతో ఆర్థిక రికవరీపై అంచనాలు పెరిగాయి. ఇది సెంటిమెంటుకు బలాన్నిచ్చింది. దీనికితోడు కొన్ని ఎంపిక చేసిన రంగాలలో కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు సాధిస్తూ వచ్చాయి. ఇది ఇన్వెస్టర్లకు హుషారునిచ్చింది. వీటికి జతగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడులు, వివిధ వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షల పలితాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ప్రధానంగా గ్లోబల్ ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్లు జోష్‌నిచ్చాయి. దేశీయంగానూ భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్, జైడస్ క్యాడిలా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తదితర సంస్థలు వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీకి ఒప్పందాలు కుదుర్చుకోవడంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తూ వచ్చినట్లు విశ్లేషకులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment