ముంబై, సాక్షి: కోవిడ్-19 భయాల నుంచి బయటపడి రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి దూకుడు చూపాయి. సెన్సెక్స్ 380 పాయింట్లు జంప్‌చేసి 47,354కు చేరగా.. నిఫ్టీ 124 పాయింట్లు ఎగసి 13,873 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా నాలుగో రోజూ మార్కెట్లు లాభాల బాటలో కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,407 సమీపంలోనూ, నిఫ్టీ 13,885 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ 19 ట్రేడింగ్ సెషన్లలో 13సార్లు మార్కెట్లు రికార్డులను నెలకొల్పడం విశేషం! కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు యూఎస్ కాంగ్రెస్ ఆమోదించిన భారీ ప్యాకేజీపై ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం చేయడంతో ఇన్వెస్టర్లు హుషారొచ్చినట్లు తెలియజేశారు. దీంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తున్నట్లు వివరించారు.
ఫార్మా వీక్
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా(0.3 శాతం) మినహా అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్ 2.6 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, టైటన్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్, ఎల్‌అండ్‌టీ, గెయిల్, ఇండస్‌ఇండ్, అల్ట్రాటెక్, టాటా స్టీల్, ఐవోసీ, కొటక్ బ్యాంక్, గ్రాసిమ్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ 6-1.2 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో కేవలం హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, సిప్లా, శ్రీసిమెంట్, బ్రిటానియా అదికూడా 0.5-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. (14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!)
గోద్రెజ్ జూమ్
డెరివేటివ్ స్టాక్స్‌లో సెయిల్, ఐబీ హౌసింగ్, టాటా పవర్, ఆర్‌బీఎల్ బ్యాంక్, గోద్రెజ్ ప్రాపర్టీస్, మదర్‌సన్, నాల్కో, బెల్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, యూబీఎల్, జిందాల్ స్టీల్, పీఎన్‌బీ, ఫెడరల్ బ్యాంక్ 7.5-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు బయోకాన్ 3.5 శాతం పతనంకాగా.. ఎస్కార్ట్స్, ఇండస్ టవర్, అపోలో హాస్పిటల్, కమిన్స్, అమరరాజా, ఎంఆర్‌ఎఫ్, క్యాడిలా హెల్త్ 1.2-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-1.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,021 లాభపడగా.. 997 మాత్రమే నష్టాలతో నిలిచాయి.
ఎఫ్‌పీఐల జోరు
శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్(డీఐఐలు) మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment